రెంట్ హౌస్ - బోగా పురుషోత్తం,

Rent house

రెంట్ హౌస్
ఊరి చెరువు గట్టుకు అటు ఇటు పచ్చని పొలాలు, ఊరంతా పిల్లల ఆటలు, పాటలతో సందడిగా వుంది.
అప్పుడే నోట్లో నిప్పంటించుకున్న చుట్టని ‘ గుప్‌! గుప్‌!’ అని పీల్చి వదులుతూ వస్తున్నాడు గంగయ్య.
చెరువు గట్టుమీంచి ఎర్రటి దుమ్మురేపుతూ వచ్చి ఆగిన బస్సును చూసి ఉలిక్కిపడి పక్కకి తప్పుకున్నాడు గంగయ్య.
‘‘ ఏవండోయ్‌ ! మిమ్మల్నే...ఇక్కడ గంగయ్య అనే ఆయన ఉన్నాడట..అతని ఇల్లు కాస్త చూపిస్తారా? ట్రాన్స్‌ఫర్‌ అవుతూ అద్దె ఇంటి కోసం అతని అడ్రస్‌ ఇచ్చి వెళ్లాడు హెడ్‌ మాస్టరు రంగనాథం’’ అన్నాడు మాధవయ్య.
‘‘ అంటే ఈ ఊరికి కొత్తగా వచ్చిన హెడ్‌మాస్టరు మీరేనా అండీ?’’ అడుగు ముందుకు వేసి ప్రశ్నించాడు గంగయ్య.
గంగయ్య నోటి నుండి ‘గుప్‌’ మని వచ్చిన వాసనకి కాస్త ఇబ్బంది పడుతూ ‘‘ అవునండి’’ అన్నాడు మాధవయ్య.
హెడ్‌మాస్టరు గారి ఇబ్బందిని గ్రహించిన గంగయ్య సగం చుట్టని దూరంగా విసిరి ఇంటి వేపు దారితీశాడు.
అది పాతకాలం నాటి సున్నం రాళ్లతో కట్టిన ఇల్లు. అందుకే స్ట్రాంగ్‌గా వుంది. రెండు గదుల్తో నీటి కుళాయి, కరెంటు కూడా వుంది.
అంత పాతదైనా ఇప్పటికీ గోడలో ఒక్క పగులు కూడా లేదు. నేల మీద సైతం దుమ్ములేకుండా నున్నగా మెరిసిపోతోంది. దాన్ని బట్టి ఆయన ఎలాంటి వాడో అర్థమైపోయింది.
పెరట్లోని జామ, సపోటా చెట్లను కూడా చూపించి ‘‘ మీకు ఇల్లు నచ్చిందా సార్‌ ?’’ ప్రశ్నించాడు గంగయ్య.
‘‘ అన్నట్టు రెంటు ఎంతో చెప్పారు కాదు?’’
‘‘ దానిదేముంది సార్‌ ! మీరు ఇంటిని వాడుకునే దాన్ని బట్టి ఇవ్వండి...’’ అన్నాడు గంగయ్య.
‘‘ ఇందులో మొహమాటం వుండకూడదండీ..’’
‘‘ మీరు భలే వారు సార్‌ ! నెలకు ఓ వెయ్యి ఇచ్చుకోండి చాలు..!’’ అన్నాడు గంగయ్య.
మాధవయ్య ఆలోచించాడు. అంత తక్కువలో అంతపెద్ద ఇల్లు దొరకడం అదృష్టమని భావించి మూడు నెలల డబ్బును అడ్వాన్సుగా ఇచ్చి నడిచాడు.
మరుసటి రోజు భార్యా బిడ్డలతో పెట్టెబేడా సర్దుకుని కాపురం పెట్టాడు మాధవయ్య.
తెల్లారి పేడ కలిపి కళ్లాపు జల్లింది మాస్టారి భార్య.
పేడ నీళ్లు గోడమీద పడటం చూశాడు గంగయ్య.
‘‘ కాస్త నెమ్మదిగా చల్లండమ్మా..గోడ పాడవుద్ది!’’ అరిచి గోలపెట్టాడు గంగయ్య.
‘‘ కళ్లేపు అన్నాక ఆ మాత్రం గోడ మీద పడదా ఏంటీ?’’ ఎదురు ప్రశ్న వేసింది వసంత.
గంగయ్య ఇంకొంచెం గట్టిగా అరిచాడు.
నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న మాధవయ్య భార్య గోలకి బయటికొచ్చాడు ‘‘ ఇదిగో గోడమీద చిన్న మరక పడితే నేనొప్పుకోను..అంతే!’’ అన్నాడు గంగయ్య.
మాధవయ్య మండిపడ్డాడు.
‘‘ ఇదిగో ఇట్టాగయితే ఇల్లు వదిలేసి ఎల్లండి..!’’ కటువుగా చెప్పాడు గంగయ్య.
మాధవయ్య మనసు కలుక్కుమంది.
‘‘నువ్వేమీ మాట్లాడొద్దు’’ అంటూ భార్యని లోనికి తీసుకెళ్లాడు.
‘‘ ఏవండీ? ఇలా అద్దె ఇంట్లో వుంటూ ఎంతకాలం బాధలు భరించమంటారండీ?’’ అంది వసంత.
‘‘ అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు వసంతా?’’
‘‘ అది కాదండీ..మీకొస్తున్న జీతం చాలా తక్కువ..అందుకే నేను కూడా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి త్వరగా ఇల్లు కట్టుకుందాం..’’ అంది వసంత.
వసంత నిర్ణయానికి అడ్డు చెప్పలేదు భర్త.
‘‘ అయినా అంతపెద్ద కష్టం నీకిప్పుడెందుకు వసంతా?’’ చిన్న చొక్కా ఉతికినా ‘‘ వద్దు వద్దొద్దు.. చేతులు నొప్పి పుడతాయ్‌!’’ అని తనే ఉతికి అరేసుకొనే మాధవయ్య, భార్య ఉద్యోగం చేస్తే ఎదురయ్యే ఇబ్బంది గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు.
మరుసటి రోజే ఓ ప్రయివేటు స్కూళ్లో టీచరుగా చేరింది వసంత.
తెల్లవారి జామున నాల్గింటికే లేచి టిఫన్‌, వంట చేసేది వసంత.చీకటిగా వుండడం వల్ల లైటు వేసేది.
లైటు వెలుతురు చూసి ‘‘ కరెంటు బిల్‌ షాక్‌ కొడుతోంది.. వెంటనే ఆపండమ్మా!’’ అని పోట్లాటకు దిగేవాడు గంగయ్య.
ఓ రోజు మాధవయ్య గచ్చుమీద గుడ్డల ఉతుకుతున్నాడు. ‘‘ దబ్‌..దబ్‌..’’మంటు శబ్దం గట్టిగా వస్తోంది. ‘‘ గచ్చు పాడవుద్ది..’’ గట్టిగా అరిచాడు గంగయ్య.
మాధవయ్యకి వళ్లు మండిపోయింది.‘‘ ఏంటయ్యా! ఇంటికి అద్దెచెల్లిస్తున్నా కదా? ఆ మాత్రం స్వతంత్రం ఇంటి మీద లేదా ఏంటీ?’’
వుండొచ్చు సార్‌! కానీ గచ్చు పాడయితే మళ్లీ డబ్బుపెట్టి కట్టించలేమండి..!’’ అన్నాడు గంగయ్య.
‘‘ అలా అని ప్రతి దానికి ఇలా గొడవ పడ్డం బాగోదు!’’ అన్నాడు మాధవయ్య.
మళ్లీ ప్రతి రోజూ గంగయ్య ఏదో ఓ గొడవ సృష్టించేవాడు?
ఆ నెల చివరి దాకా ఓర్పు వహించి బ్యాంకులో హౌసింగ్‌ లోన్‌కి అప్లై చేశాడు. అదే ఊరిలో మంచి భవంతి నిర్మించి అందరికీ గృహప్రవేశ ఆహ్వాన పత్రికలు పంపించాడు.
గృహప్రవేశానికి గంగయ్య కూడా వచ్చాడు.
కరెక్టుగా అద్దె చెల్లించే మాధవయ్య క్షణాల్లో అంతపెద్ద అందమైన బిల్డింగు కట్టి వెళ్లిపోవడం గంగయ్యకి మింగుడు పడలేదు.
పాల రాతితో నిర్మించి ప్రతి గదిని ఆశ్చర్యంతో చూస్తున్న గంగయ్యతో ‘‘ ఏం ఇల్లు బాలేదా గంగయ్యా?’’ అడిగాడు మాధవయ్య.
‘‘ బాగానే వుంది. కానీ గొప్పొళ్లు... ఇప్పుడప్పుడే ఇల్లు ఖాళీగా వుందని అద్దెకు మాత్రం ఇవ్వకండి సార్‌!’’ అన్నాడు గంగయ్య.
‘‘అందమైన ఇల్లు..అద్దెకోసం పాడుచేసుమాకండి సార్‌..!’’ పదేపదే చెప్పాడు గంగయ్య.
‘‘ ఏం గంగయ్యా మేము ఇల్లు అద్దెకిచ్చి నీకు పోటీ రాబోములే..!’’
‘‘ అదేంటి సార్‌! నాకు మీరు పోటీ రావడమేంటీ సార్‌!’’ అన్నాడు గంగయ్య.
వసంత నవ్వుకొంది.
ఇప్పుడు అంతపెద్ద ఇంట్లో రోజులు హాయిగా సాగుతున్నాయి. వయస్సు మీరడంతో నిస్సత్తువ ఆవహించింది. ఇంటి వ్యవహారాలన్నీ వసంతే చూసుకుంటోంది. బ్యాంకు లోనుకు వడ్డీ చెల్లించడం కష్టతరమైంది. నెల తిరిగే సరికి ఇంటి సరుకులు, పిల్లల ఫీజులు, బ్యాంకు వడ్డీ చెల్లింపులు తడిసి మోపెడైంది. ఒక్క సారిగా బ్యాంకు నుండి నోటీసులు అందడంతో ప్రశాంతంగా ఉన్న మాధవయ్య మనసులో అలజడి మొదలైంది. ముంచుకొస్తున్న రిటైర్‌మెంట్‌ భయం కళ్ల ముందు కదలాడిరది. భయం గుండెల్ని పిండేయకముందే ఓ ఆలోచనకు వచ్చాడు. మరుసటి రోజే ఇంటి ముందు టులెట్‌ బోర్డును తగిలించాడు. మరుసటి రోజే ఊహించని స్పందన వచ్చింది. వందల సంఖ్యలో వచ్చిన వారిలో ఎవరికివ్వాలో తెలియక తికమక పడ్డాడు. చివరకు పాతిక వేలు అడ్వాన్సు ఇచ్చిన వారికి ఇంట్లో పై ఫోర్షన్‌ను అద్దెకిచ్చాడు. పిల్లాపాపలతో మొత్తం పది మంది ఉన్న వాళ్లు ఒక్క సారిగా ఇంట్లో ఊడిపడ్డారు.
నిశ్శబ్దంగా వున్న వాతావరణం ఒక్క సారిగా చేపల మార్కెట్‌లా మారింది. పిల్లల అరుపులకు చెవులు చిల్లులు పడ్డాయి. రాత్రి వేళల్లో కంటి మీద కునుకు కరువైంది. ‘‘ప్రశాంత వాతావరణానికి తూట్లు పొడిచావ్‌.. అసలు నిద్ర పట్టడం లేదు.. ఎలా వుండాలి? ’’ వసంత ముఖం చిర్రెత్తు కొచ్చింది. ఎలాగో కొంత కాలం సర్దుకో..మన సమస్యలు సమసిపోతాయి..’’ బుజ్జగించాడు మాధవయ్య. పై అంతస్థులో పిల్లల అరుపులు, భార్య దెప్పిపొడుపులు వినలేక చెవులకు మూతలు పెట్టుకున్నాడు మాధవయ్య. నెల రోజులు గడిచాయి. పువ్వుల్లో పెట్టి తెచ్చిచ్చాడు అద్దె డబ్బులు ఐదువేలు.. మాధవయ్యలో ఆలోచనల అలజడి కాస్త తగ్గింది. ఆ నెల జీతం కలిపి నలభై ఐదువేలు అయింది. నెలనెలా చెల్లించాల్సిన బ్యాంకు అద్దె పది వేలు, పిల్లల ఫీజు డబ్బు పది వేలు, ఇంట్లో సరుకులకు పదివేలు పోను ఓ ఐదువేలును వసంత ఖర్చులకు ఇచ్చాడు. మిగిలిన ఐదువేలును తన ఖాతాలో దాచాడు. కళ్ల ముందు డబ్బు కనబడేసరికి మనసు కాస్త నెమ్మదించింది. కానీ ఇంటి ప్రహరీలో ఉన్న జామ, సపోటా చెట్లపైకెక్కి పిల్లలు పండ్లు కోసి పిల్ల వానరాల్లా గోల చేసి కిష్కిందకాండలా మార్చారు. ఆ అరుపులకు బడిసె తెచ్చి నాలుగు బాదాలనిపించి కట్టె తీసుకుని కయ్‌ మని లేచాడు మాధవయ్య. భర్తకువంత పాడిరది భార్య వసంత..ఇద్దరి బెదిరింపులకు వెక్కివెక్కి ఏడుస్తూ దిగిన పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఏదో చెప్పారు. అంతే మూచిన కళ్లు తెరవను కూడాలేదు. రెప్ప పాటు కాలంలో అద్దెకొచ్చిన వారంత మాధవయ్య ముందు ప్రత్యక్షమై ఏదో జరిగిపోయిన వారిలా విరుచుకుపడ్డారు. ‘‘ చెట్లో ఉన్న పండ్లు కోచుకుంటే ఏం పోయిందయ్యా? పిల్లల్ని అలా గొడ్డును బాధినట్లు బాదుతారా? మీరు అసలు మనుషులేనా? ఇలాగైతే ఇక్కడ వుండలేము..’’ అంటూ శాపనార్థాలు పెట్టారు.
మాధవయ్య కళ్లు గిర్రున తిరిగాయి. దిక్కుతోచలేదు.అద్దె లేకపోతే పోయింది.. మనసు ప్రశాంతంగా ఉంటే చాలనుకున్నాడు. ఓ పది రోజులయ్యాక ఒకటో తారీఖు రానే వచ్చింది. అద్దెకున్న వారు ఒక్కొక్కరు అద్దె డబ్బు చేతిలోపెట్టి ఇంట్లో సామాన్లు సర్దుతుంటే మాధవయ్యకు కాస్త భయం వేసింది. ఒక చేతిలో డబ్బులు కదలాడుతాయో లేదోనని మనసు తొలిచేసింది. అయినా వారంతట వారే వెళ్లిపోతుంటే ఎవరాపగలరు? అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు.
ఓ నెల గడిచింది.. చేతిలో డబ్బు కనిపించకపోయినా మునుపటిలా రణగొన ధ్వనులు లేవు.. మనసు తుపాను వచ్చినప్పుడు సముద్రంలో అలలు గాలికి కొట్టుకుపోయి అల్లకల్లోలం చేసినట్లు లేదు. ప్రశాంతత కనిపిస్తోంది. వయసు మీద పడుతున్న కొద్దీ తనలో అసహనం పెరుగుతోంది. దానికి తగినట్లు ఉద్యోగ భారం తోడు కావడంతో మాధవయ్యకు కోపం వచ్చేది. ఆ ఏడాదిలోనే ఉద్యోగానికి విశ్రాంతి లభించింది. రిటైరయ్యాడు. ఇప్పుడు వచ్చే పెన్షన్‌ డబ్బుతో జీవితం హాయిగా సాగుతోంది.
ఓ రోజు ఎదురుగా వున్న రాముల వారి గుడిలో నవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. తన ఇంటిపై నుంచే కూర్చొన్నాడు. ఎదురుగా ‘ పడవెళ్లిపోతోందిరా.. మానవుడా దరిచేర దారేదిరా..?’ అని పాట వస్తుంటే ఎప్పుడో తనలో దాగిన ఆధ్యాత్మికత వికసించింది. మాధవుడి సేవ చేసుకుంటూ జీవన పడవ ఒడ్డుకు చేరే దారి పట్టాడు.. అదే సమయానికి ‘‘ఏమి సార్‌.. ఇల్లు అద్దెకు ఇచ్చి కష్టాలు పడుతున్నారా..?’’ ప్రశ్నించాడు గంగయ్య.
పూర్తిగా ఆధ్యాత్మిక దోవ పట్టిన పరంధామయ్యకు ఎప్పుడో ఎదుర్కొన్న రెంటు హౌస్‌ కష్టాల ఆలోచనలను గంగయ్య మాటలతో గుర్తుకు తెచ్చుకుని నవ్వాడు.
‘‘ అయ్యో రెంటు హౌస్‌ను ఇవ్వడమే కాదు.. ఇక ఈ దేహమనే అద్దె ఇంట్లో నివసిస్తున్న నేను కూడా తప్పించుకునే మార్గం వెతుక్కుంటానులే గంగయ్యా..!’’ అన్నాడు పరంధామయ్య.
ఆ మాటల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించలేక తమస్సుతో తలగోక్కుంటూ ముందుకు సాగాడు గంగయ్య..

- బోగా పురుషోత్తం,

మరిన్ని కథలు

Kaliyuga yakshudlu
కలియుగ యక్షుడు
- దినవహి సత్యవతి
Maangalyam tantunaa
మాంగళ్యంతంతునా...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Aavakaya prahasanam
ఆవకాయ ప్రహసనం
- జీడిగుంట నరసింహ మూర్తి
Apaardham
అపార్థం
- బామాశ్రీ
Nijamaina ratnam
నిజమైన రత్నం
- బోగా పురుషోత్తం.
Snehamante Ide
స్నేహమంటే ఇదే
- కందర్ప మూర్తి
Andamaina muddu
అందమైన ముద్దు
- వారణాసి భానుమూర్తి రావు