ఇంట గెలవకుండా-- - వెంకటరమణ శర్మ పోడూరి

Inta gelavakundaa

సాయంత్రం ఆఫీసునుంచి త్వరగా ఇంటికి వచ్చి, ఆవేళ జరగబోయే భజనకి చేయవలసిన అరెంజమెంట్స్ లో భార్య రుక్మిణి కి సహాయం చేస్తున్నాడు, నారాయణ. వాళ్ళ ఇంటి హాలులో ఒక ముఫై మంది సులువు గా పడతారు. భజనకి ఇరవయి, ఇరవయి అయిదుమంది వస్తూ ఉంటారు. హాలులో గుమ్మానికి దగ్గరగా అయిదారు చిన్న బల్లలు వేసి బాబా పెద్ద ఫోటో పెట్టి దానికి పెద్ద దండ వేశారు, ఇంకో పక్కగా ఒక పెద్ద కుర్చీ వేసి దాని మీద పెద్ద పట్టు చీర పైనుంచి కిందకి వేశారు. కుర్చీ అంచు మీద ముఖమల్ కర్చీఫ్ పెట్టారు. ఇంకో పక్కగా భజన అయిన తరువాత స్వామికి నైవేద్యం పెట్టడానికి పళ్ళు, అవీ ఉంచారు. వచ్చే భక్తులు తెచ్చినవి కూడా పక్కన పెట్టడానికి అరేంజ్ చేశారు. భక్తులు కూర్చోవడానికి, ఆడవాళ్ళకి ఒక పక్క, మగ వాళ్లకి ఒక పక్క తివాసీలు వేశారు. అన్నీ అయినతరువాత రుక్మిణి, సాయి ధూప్ అగరవత్తులు పెద్దవి వెలిగించి ఓ పక్కగా పెట్టింది. అరేంజ్ మెంట్స్ అయిన తరువాత, వెనకగా వెళ్లి గోడ వార కూర్చున్నాడు నారాయణ. అగరవత్తుల నుంచి వచ్చే సువాసన ఆస్వాదిస్తూ భక్తుల ఆగమనానికి వైట్ చెస్తున్నారు. అరేంజ్ మెంట్స్ అయి పోయిన తరువాత అతని పని ఏమీ ఉండదు. ఆఖరున వెళ్ళేటప్పుడు, రుక్మిణితో పాటు అందరికీ నమస్కారం చెప్పడం తప్ప. గోడకి ఆనుకుని కూర్చున్న నారాయణ ని ఆలోచనలు చుట్టు ముట్టాయి . నారాయణ, రుక్మిణిలది అరెంజ్డ్ మేరేజే. రుక్మిణి వాళ్ళ కుటుంబం అంతా చాలా కాలం నుంచి సత్య సాయి భక్తులు. నారాయణ వాళ్ళు బాబా భక్తులు కాక పోయినా, పెళ్లి చేసే మండపం దగ్గరనుంచీ, పెళ్లి సమయంలో బాబా ఫోటోలు పెట్టుకోవడం వంటి వాటన్నిటికీ ఏమీ అడ్డు చెప్పక ఆడ పెళ్లి వాళ్ళ కోరిక ప్రకారమే అన్నీ చేశారు. పెళ్లి అవగానే, పుట్టపర్తి వెళ్ళాలంటే, వెళ్ళారు. నారాయణ బాబా భక్తుడి గా మారిపోలేదు కాని, రుక్మిణి నమ్మకాలని అతను గౌరవించే వాడు. వీళ్ళు ఉంటున్న కాలనీ లో బాబా భక్తులు ఒక అసోసియేషన్ గా ఏర్పడి కార్యక్రమాలు నడుపుతూ ఉంటారు. దానిలో భాగం గానే, నెలకి ఒక మాటు ఇంట్లో భజన, అప్పుడప్పుడు ప్రొద్దుటే నగర సంకీర్తన, మిగతా సేవా కార్యక్రమాలలో రుక్మిణి తో పాటు నారాయణ కూడా పాల్గోవడం చేస్తూ ఉంటాడు. రుక్మిణి కూడా ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదిస్తోంది. అసోసియేషన్ నడిపే అనేక కార్య క్రమాలకి రుక్మిణి తరచు తన జీతం లోంచి విరాళాలు ఇస్తూ ఉంటుంది. నారాయణని కూడా ఇవ్వమని చెప్పినప్పుడు అతను కొద్దిగా ఇస్తూనే ఉంటాడు. అతను చిన్నప్పటి నుంచీ కృష్ణ భక్తుడు. చేత వెన్నముద్ద పద్యం వయసు నుంచే అతని మనసులో కృష్ణుడు ముద్ర వేసుకునిఉన్నాడు. ఎన్నో మాట్లు ఎన్ టి రామారావు గారు తీసిన పాండురంగ మహాత్మ్యం సినిమా పెట్టుకుని, కృష్ణ లీలల మీద పాటలు వింటూ ఉంటాడు. తండ్రికి సేవ చేస్తుండగా, కృష్ణుడు వస్తే, ఇటిక మీద వెయిట్ చేయ మనే సీన్ అతనికి చాలా ఇష్టం. ఇంట్లో భజన జరుగుతున్నప్పుడు కృష్ణుడు మీద భజనలు పాడుతున్నప్పుడు తన్మయత్వం లోకి వెళ్ళడం కద్దు. సభ్యులు రావడం మొదలవటంతో ఆలోచనల నుంచి బయట పడ్డాడు నారాయణ. భజన సభ్యులు ఒక్కొక్కరు వచ్చి కూర్చుని మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. " రాజయ్య గారి ఇంట్లో ఫోటో లోంచి విభూతి పడుతోందట" కృష్ణారావు అన్నాడు పక్కన కూర్చున్న నరసింహం గారి తో " అయితే భజన అవగానే తప్ప కుండా వెళ్లి చూడాలి " అన్నాడు నరసింహం గారు. " బొంబాయి లో ఒక భక్తుడికి క్రిటికల్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు సర్జన్ కంగారు పడుతోంటే, సడన్ గా బాబా వచ్చి అపెరేషన్ పూర్తి చేశారట" కృష్ణ మూర్తి గారు " అవును బాబా లీలలు చెప్పలేము.ఎప్పుడయినా ఎక్కడయినా జరగ వచ్చు. భజన అయిన తరువాత, బాబా కుర్చీ చూడండి. కూర్చున్న ఇంప్రెషన్ పట్టు చీర మీద కనపడుతుంది" అన్నాడు నరసింహం గారు ఇవన్నీ వింటున్న నారాయణ, బాబా మీద ఒక కచ్చిత మయిన అభిప్రాయానికి రాలేక పోయాడు. రుక్మిణి ప్రోద్బలం మీద గీతా నర్సింగ్ హోం డాక్టర్ రాసిన "షిర్డీ నుంచి పుట్టపర్తి కి" అనే పుస్తకం చదివాడు. ఆ డాక్టర్ గారు రాసిన అనుభవాలు చదివితే, ఎవరయినా బాబా భక్తులు అవుతారు. కానీ పురాణాలలోని రాముడు, కృష్ణుడు వంటి దైవాల వల్ల పొందని భక్తి భావోద్వేగం కొంతం మందికి ఈ మధ్య కాలంలోని మహాత్ములు షిర్డీ బాబా. సత్య సాయి వంటి వాళ్ళ వద్ద చాలా మంది పొందడం ఆశ్చర్యం గానే ఉంటుంది. చాలా మంది భక్తి పారవశ్యం తో కంటే, మిరకల్స్ గురించి విని, భక్తులు గా అయితే, తమకి కూడా అటువంటి మిరకల్స్ జరిగి ఒక రక్షణ లభిస్తుంది కదా అనే ఆశ ఎక్కడో, అంతరాంతరాలలో ఏర్పడి భక్తులు అవుతారు తప్ప, ఆద్యాత్మిక అవగాహన తో కాదేమో అనిపిస్తూ ఉంటుంది. భజన ప్రారంభం అవడంతో, నారాయణ దృష్టి భజన మీదకి దృష్టి మళ్ళించాడు. రామ లక్ష్మి గారు ఎప్పుడూ మొదటి భజన ప్రారంభిస్తారు. ఆవిడ మనసు పెట్టి చాలా భక్తి భావం తో పాడతారు. ఆవిడ ఎప్పుడూ మిగతా వాళ్ళతో కబుర్లు చెప్పకుండా, భజన అవగానే ఎప్పుడూ కళ్ళు మూసుకుని కొద్ది సేపు బాబా పటం దగ్గర కూర్చుని వెళ్ళిపోతుంది. కొద్ది మంది భజన అవగానే, తాను ఆవేళ పాడిన భజన ఎలా పాడారో మిగతా వాళ్ళ అభిప్రాయం కనుక్కోవడం, పొగడ్తలు ఆశించడం కూడా అతను చూశాడు. కొంత మంది అయితే, మొదటి వరసలో తమ ఎప్పుడూ కూర్చునే చోట ఇంకెవరయినా పొరపాటున కూర్చుంటే, చాలా గొడవ చేస్తారు. ఆవేళ భజన అయిన తరువాత కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. కమిటీ లో రుక్మిణి కూడా సభ్యురాలు. మర్యాదకి నారాయణ ని కూడా వాళ్ళు ఆహ్వానించినా కొద్దిగా దూరంగా కూర్చున్నాడు కమిటీ ప్రెసిడెంట్ భాస్కరం గారు, అసోసిఎషన్ వాళ్ళు చేపట్టిన కార్యక్రమాల గురించి ముందు వివరించారు. " మనం కొత్తగా ప్రారంభించిన నగర సంకీర్తనకి మంచి గుర్తింపు వచ్చింది. చాలా మంది ప్రొద్దుటే లేచి వరండాలలోకి వచ్చి చూస్తున్నారట " అన్నారు. " అవును మేమూ విన్నాము" అన్నారు కొందరు సభ్యులు. " ఇంకా ఎక్కువ విజిబిలిటీ ఉన్నది ఏదయినా చేపట్టాలి. మన కాలనీ లోంచి వెళ్ళే బస్సులకి, ఒక స్టాప్ దగ్గర షెల్టర్ లేదు. అక్కడ మనం ఒక షెల్టర్ కడితే మంచి గుర్తింపు వస్తుంది మన సేవ కి" అన్నారు భాస్కరం గారు. " బాగానే ఉంది. చాలా ఖర్చు అవుతుందేమో. ఎంత ఖర్చు లో అవుతుంది ? అన్నారు క్రిష్నయ్య గారు, ఒక మెంబెర్ " కనీసం అరవై వేలు అవవచ్చు అన్నారు భాస్కరం గారు. ఆవిడ పేరు పెడితే, మా అత్త గారు పాతిక వేలు ఇస్తారు అన్నారు క్రిష్నయ్య గారు. "అసోసిఎషన్ రూల్స్ చూసి చెబుతానన్నారు" భాస్కరం గారు. ఐటి లో మినహాయింపు ఉంటె తను పదివేలు ఇస్తానన్నారు కారుణ్య గారు. కళ్యాణి గారు పది వేలు ఇస్తానని ప్రకటించారు అందరికేశి ఒక మాటు చూసి. ఎ సేవా కార్యక్రమయినా ఆవిడ డొనేషన్ తప్పకుండా ఉంటుంది. రుక్మిణి కూడా అయిదు వేలు ఇస్తామని ప్రకటించింది. మిగతా సభ్యులు కళ్యాణి గారి వైపు, రుక్మిణి వైపు మెచ్చుకోలుగా చూసి చప్పట్లు కొట్టారు . వచ్చే భజన లో ప్రకటించి మిగతా వాళ్ళ ను కూడా అడుగుదా మనుకున్నారు . మిగతా విషయాలు మాట్లాడుకుని ముగించారు. వాళ్ళు వెళ్ళిన తరువాత, అన్నీ సద్డడం లో రుక్మిణికి సహాయం చేశాడు నారాయణ. తను ప్రకటించిన డొనేషన్ మీద, నారాయణ ఏమన్నా అంటాడేమో నని చూసింది రుక్మిణి. తను సంపాదించుక్కున్నది ఖర్చు చేయడంలో నారాయణ ఎప్పుడూ ఏమీ అనడు అని తెలిసి కూడా. ఆమెతో పాటు అతను కూడా అతనికి నచ్చిన కార్యక్రమాలకి డొనేషన్ ఇస్తూనే ఉంటాడు. సేవా కార్యక్రమాల పట్ల అతనికి కొన్ని నిర్దిష్టమయిన అభిప్రాయాలు ఉన్నట్టు ఆమె గ్రహించింది. బాబా గారు మెచ్చుకుని, రక్షణ కల్పిస్తారానీ, మిగతా సభ్యుల దృష్టిలో గుర్తింపు పెరుగుతుందనీ మొదలయియన వాటిని దృష్టిలో పెట్టుకుని సహాయం చేయడం అతనకి ఇష్టం ఉండదని, కొన్ని సందర్భాలలో చెప్పాడు రుక్మిణి తో ఆ తరువాత రెండురోజులకి, ఒక రాత్రి తన లాప్ టాప్ లో ఎదో పని మీద ఉన్నాడు నారాయణ. ల్యాండ్ లైన్ ఫోన్ మ్రోగింది. రుక్మిణిని తీయ మన్నాడు. ఫోన్ ఎత్తి, కార్డ్ లెస్ తీసుకుని బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. తన ఫ్రెండ్స్ ఎవరయినా చేస్తే, రుక్మిణి బెడ్ రూమ్ లో మాట్లాడుతుంది, నారాయణకి డిస్టర్బెన్స్ లేకుండా. నారాయణ పనిలో పడి ఆ విషయమే మరిచి పోయాడు. పని పూర్తి చేసి, లాప్ టాప్ మూసి, టివీ ఆన్ చేయబోతోంటే, రుక్మిణి వచ్చి ఎదురుగా కూర్చుంది. " ఎవరు ఫోన్ ? అన్నాడు. మా అక్క కుసుమ, బావ పరిస్థితి బాగో లేదట. రోజూ తాగి వస్తున్నాడట. పదేళ్ళ చిన్నదని చూడకుండా, ఆ మైకం లో రమ్య ని కొడుతున్నాడ ట. అడ్డం వెడితే అక్కని కూడా కొడుతున్నాడట. రెండు నెలల నుంచి ఇంటి ఖర్చులకి ఏమీ ఇవ్వటం లేదట. కష్టం గా ఉందట. కొంచం డబ్బు పంప మంది. రేపు పంపుతానని చెప్పాను. బాబా ఫోటో ఇంట్లో పెట్టుకోమన్నాను. ప్రతి గురువారం బాబా భజన కి వెళ్ళమన్నాను. రుక్మిణి వాళ్ళ నాన్నగారికి, రుక్మిణి, కుసుమ ఇద్దరే కూతుళ్ళు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు. చని పోయే ముందు ఆస్తి నంతటినీ ఇద్దరి కూతుళ్లకీ పంచి, భార్య పేర పెట్టినది కూడా ఆవిడ అనంతరం కూతుళ్ళు ఇద్దరికీ సమానం గా పంచారు. కొద్ది మాసాల తేడా లోనే ఇద్దరూ చనిపోతే, కూతుళ్ళు ఆస్తులు పంచేసు కున్నారు. కుసుమ భర్త రాజేష్ తను చేస్తున్న ఉద్యోగం మానేసి, ఎవరో స్నేహితుడి భాగస్వామ్యం తో భార్య వాటాకి వచ్చిన ఆస్తి అమ్మి వ్యాపారం లో పెట్టాడు. కొన్నాళ్ళు బాగానే నడిచింది, కాని భాగస్వామి మోసం చేయడంతో మొత్తం తుడిచి పెట్టుకు పోయింది. ఎదో చిన్న ఉద్యోగం లో చేరినా , వ్యాపారం చేసేటప్పుడు అలవాటయిన తాగుడు నుంచి బయట పడ లేక పోయాడు. రుక్మిణి తన వాటాకి కి వచ్చిన ఆస్తిని రియల్ ఎస్టేట్ లో పెట్టి బాగానే పెంచుకుంది మరుసటి నెల సాయి అసోసిఎషన్ మీటింగ్ నారాయణ ఇంట్లో జరిగినపుడు రుక్మిణిని సెక్రెటరీ గా ఎనుకున్నారు. ఆఫీసు బేరర్ గా ఎన్నిక అయిన వాళ్ళు ప్రత్యేకంగా సేవకి చందా ప్రకటించడం, పుస్తకంలో లేని రూలు. ఆ మీటింగులో రుక్మిణి, ప్రతి నేలా ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టే సేవా కార్యక్రమానికి అయ్యే ఖర్చు ఇకపై తాను పెట్టుకుంటానని ప్రకటించింది. అందరూ అభినంది స్తే చాలా ఆనంద పడింది రుక్మిణి. ఇది అందరికీ తెలిసిన తరువాత, మిగతా భజన సభ్యులు ఎలా పోగిండిందీ నారయణ కి వివరించింది. ప్రతి నెలా నాలగవ ఆదివారం అసోసిఎషన్ వాళ్ళు దగ్గరగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ వార్డులలో, బ్రెడ్, పళ్ళూ, సబ్బులూ అవీ పంచుతారు. నెలకి ఏడూ ఎనిమిది వేలు అవుతుంది. రుక్మిణి, నారయణ ని కూడా కొంత షేర్ చేసుకోమంది. " ఆలోచిస్తాను లే " అన్నాడు నారాయణ ఆ మరుసట నెల నాలగవ ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం అయి, అలిసి పోయి ఇంటికి వచ్చి పడుకుంది రుక్మిణి. హాలులో కూర్చుని లాప్టాప్ లో పని చేసుకుంటున్నాడు నారాయణ. ల్యాండ్ లైన్ రెండు మాట్లు మ్రోగి ఆగి పోయింది. మళ్ళీ ఇంకోమాటు మ్రోగింది. పనిలో నారాయణ గుర్తించలేదు. అయిదు నిమిషాల తరవాత మళ్ళీ మ్రోగితే, పని ఆపి, లేచి ఫోన్ ఎత్తాడు. అప్పటికే బెడ్ రూమ్ లో ఉన్నఎక్స్టేన్షన్ రుక్మిణి ఎత్తింది. మాటలు వినపడి తాను పెట్టేయ బోతోంటే, అవతలినుంచి ఏడుపు వినపడితే, ఆగి అంతా విని రుక్మిణి పెట్టేసే ముందు తను పెట్టేశాడు. బయటికి వచ్చి రుక్మిణి, అతను విన్నదే చెప్పింది. రాజేష్ పరిస్థితి మరీ దిగజారి పోయిందట. ఇంట్లో డబ్బు ఇవ్వటంలేదట. అద్దె కూడా బకాయి పడ్డారుట. మొన్న ఎక్కడో తాగి పడిపోతే ఎవరో తీసుకు వచ్చి దింపారట. అల్లాంటి వాడికి పైనుంచి ఎంత కాలం సహాయం చేయగలం?. చేస్తే కూడా తప్పే అనిపిస్తోంది. ఆ మరుసటి నెల నారాయణ ఇంట్లో భజన రోజు, ఆఫీసులో పని వత్తిడి వల్ల భజన ప్రారంభానికి ముందుగా రాలేక పోయాడు. వచ్చేటప్పటికి భజన జరుగుతోంది. మెల్లిగా వెనకాల నుంచి వెళ్లి బట్టలు మార్చుకుని ఎప్పటి లాగే వెనకాల కూర్చున్నాడు. తను లేనప్పుడు, రుక్మిణి భజన ఏర్పాట్లు చేయడానికి దగ్గరలో ఉన్న మీనాక్షి గారి సహాయం తీసుకుంటుంది. ఆవేళ ఏర్పాట్లు చాలా ప్రత్యేకం గా చేసినట్టు కనపడుతోంది. భజన అవగానే అందరూ నారాయణ చుట్టూ చేరారు. బాబా ఎవరి కలలోనో కనపడి మీ మరదలి కి సహాయం పంపారట కదా? అని అడగడం మొదలు పెట్టారు, రుక్మిణి కూడా వచ్చి అంది " ఎన్ని మాట్లో మీకు ఫోన్ చేశాను. మీరు ఎత్త లేదు" అంది చాలా ఉద్రేకంగా. " ఏమిటి అంత అర్జంట్ విషయం ? " అన్నాడు నారాయణ కుతూహలంగా అప్పటికే మిగతా వాళ్ళు ఒక మాటు విన్నా, మళ్ళీ రుక్మిణి చుట్టూ చేరారు మిగతా సభ్యులు. " మొన్న ఎవరో ఒకాయన వచ్చారుట. మా అక్క ఇంటికి. బాబా ఆయన కలలో కనపడి అక్క ఇల్లు వివరాలూ అవీ ఇచ్చి వెంఠనే ఏమి చేయాలో చెప్పారట. బావగారి వివరాలూ అవీ తీసుకుని వెళ్లిపోయారట. ఇంకొచం సేపటికి తాగుడు అలవాటు నుంచి బయట పడేసే సంస్థ వాళ్ళు వచ్చి బావ గారిని తీసుకు వెళ్లి పోయారట. ఎవరో ఒకాయన వచ్చి ఒక ఆరు నెలల పాటు బావ గారిని ట్రీట్ చేయడానికి ఆయె ఖర్చు చెల్లించి వెళ్లి పోయారని చెప్పారట ఆ సంస్థ వాళ్ళు . దగరలో ఉన్న సూపర్ మార్కెట్ వాళ్ళు వచ్చి ఎవరో ఒకాయన వచ్చి ఆరునెలల కి సరిపడ్డా డబ్బు కట్టి అక్క ఇంట్లో నెల నెలా కావలిసినవి ఇమ్మన్నారట" ఒక్క గుక్క లో అన్నీ చెప్పింది ఆయాస పడుతూ రుక్మిణి. ఆ తరువాత ఎవరి ఇంట్లో భజన జరిగినా, ముందూ, తరువాత ఈ విషయమే చర్చించు కున్నారు భక్తులు. ఆ తరువాత నారాయణ ఇంట్లో ఎప్పుడు భజన జరిగినా, హాలు సరిపోక, గుమ్మం బయట కూడా తివాసీలు ఏర్పాటు చేయవలిసి వచ్చింది. నారాయణ నవ్వుకుంటూ తివాసీలు పరిచేవాడు. కుసుమ కి సహాయం చేసింది తనే అన్న సంగతి రుక్మిణికి నారాయణ చెప్ప దలుచుకోలేదు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి