"అందమైన "నువ్వు " - అయ్యగారి శ్రీనివాస్

Andamaina nuvvu

అందరూ భార్య గురించి బెటర్ హాఫ్ అటు ఉంటారు. కానీ నేను మాత్రం బెస్ట్ హాఫ్ అంటూ ఉంటా కొంచెం వెరైటీగా ఉంటుందని. ఆమెతో నా సంబంధం, ఒక భార్య భర్తల మధ్య ఉండే సంబంధం కన్నా, ఒక తల్లి కొడుకుల మధ్య ఉండే సంబంధమో, లేదా ఒక టీచర్ స్టూడెంట్ మధ్యలో ఉండే సంబంధం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఏమి తెలియని నాకు..మనం ఇలా ఉండాలి అలా ఉండాలి ముఖ్యంగా సమాజం లో తరచూ తటస్తపడే మనుషులు తో.. అంటూ ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి నాకు వివరించడం.. దగ్గరనుండి.. ముఖ్యమైన విషయాలు మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ విధంగా ఆలోచించాలి అనే విషయం దాకా,ఆ విధంగా ఆలోచించాలి అనే లాజిక్ నాకు నేర్పిద్దామని చాలా ప్రయత్నం చేసింది మరి. అయినా ఆనాటి నుంచి ఈనాటి దాకా ఈ మొద్దు బుర్ర కి ఎక్కితే కదా. అయితే నిరంతరాయంగా చేస్తూ వస్తున్న ఆమె ప్రయత్నం మాత్రం ఆగలేదు. ఓపిగ్గా, నాకు పెళ్లయిన రోజు దగ్గర నుండి, ఈ రోజు దాకా నాకు పాఠాలు చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంది అదే ఓర్పుతో. ఒకప్పుడు అయితే అస్తమాను ఏంటి ఈ సలహాలు అనుకున్న నేను ,60 ఏళ్ళు వస్తున్న తరుణంలో నేడు ఏ మాత్రం అసహనం రావడం లేదు పైపెచ్చు ఒకింత నవ్వు వస్తోంది ఇంకా నా గురించి తను పడే తాపత్రయాన్ని చూసి. ఇద్దరి మనస్తత్వాలు ఒకరిది తూర్పు అయితే మరొకరిది పక్కా వెస్ట్. ఒకరు ఎడ్డు అంటే, మరొకళ్లు తెడ్డు. మనిషికీ కొన్ని హాబీలు ఉండాలి.. సరదాగా పాటలు పాడుకుంటూ.. కబుర్లు చెప్పుకుంటూ.. అలా ప్రకృతిలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని.. నడుచుకుంటూ వెళ్లడం, సరదాగా జోక్స్ వేసుకుంటూ రోజులు గడపడం ఒకళ్ళకి ఇష్టం. అయితే.. కబుర్లు కడుపులు నింపుతాయా.. అంటూ జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఉన్న 24 గంటలూ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ గడిపేయడం ఇంకోళ్ళ ప్రవృత్తి. మల్లాది వెంకట కృష్ణమూర్తి తన నవలల్లో రాసేలా, జీవితాన్ని ఒక అద్భుతమైన, అందమైన ప్రయాణం గా భావిస్తూ ప్రతిక్షణం ఒక కొత్త అనుభవం అనుభూతి కోసం పరుగులు తీయడం మాత్రమే ఒక సక్సెస్ ఫుల్ మ్యారీడ్ లైఫ్ కి నిర్వచనం అయితే, మా మ్యారేజ్ లైఫ్ మాత్రం ఒక ఫెయిల్యూర్ అనే చెప్పి వుండే వాడ్ని.. కొద్దికాలం దాకా ,నన్ను ఎవరైనా నిజాయితీగా కన్ఫెస్ అవ్వండి అని అడిగితే. కానీ ఆరు పదుల వయసు తీసుకొచ్చిన ఒక మెచ్యూరిటీయో, లేదా జీవితం అవతలి ఒడ్డుకి అతి వేగంగా చేరుకుంటున్నానన్న నిజం తెలిసో, అదే ప్రశ్న ఇప్పుడు అడిగితే నేను చెప్పే సమాధానం వేరేలా ఉంటుంది. రోజులో ఉండే 24 గంటలు, సంవత్సరంలోని 365 రోజులు మొగుడు, పిల్లా అంటూ, ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించకుండా ఒకింత కటువుగా చెప్పాలి అంటే, ఒక సైకోలా తన కుటుంబాన్ని ప్రేమించి, తనకంటూ ఒక కోరిక, ఇక్కడికి వెళ్లాలి అక్కడికి వెళ్లాలి, అవి కొనుక్కోవాలి అనే అందరూ కోరుకునే మెటీరియలిస్టిక్ కోరికలు ఏ మాత్రం లేకుండా ఈ రోజు దాకా తన జీవితం గడిపేసి, ఇప్పుడు కూడా సంసారం సంసారం అంటూ వెర్రిగా తాపత్రయపడే ఆమెను చూస్తుంటే ఒకపక్క అంత తెలియని కృతజ్ఞత, మరోవైపు అయ్యో పాపం అనే జాలి.. అలాంటి వ్యక్తి దొరికిన నేను ఎంత లక్కీ ఫెల్లో నో అని అనిపిస్తుంది నెత్తి మీద 90% వెంట్రుకలు తెల్లబడ్డ ఈరోజు. మనిషి మాట కటువు... గుండె లోతుల్లో కి వెళ్లి చూస్తే స్వచ్ఛమైన వెన్న లాంటి మనసు. తన గురించి, తనకు కావాల్సిన విషయాల గురించి ఆలోచన ఏమాత్రం లేకుండా శాసించిన ఒక మధ్యతరగతి జీవితం బహుశా ఇలాగే ఉంటుందేమో ఒక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నిజమేనేమో అనిపిస్తోంది ఈరోజు నాకు. ఇక మిగిలిన జీవితం చాలా చిన్నది, కనీసం ఇప్పుడయినా నీ గురించి నువ్వు ఆలోచించుకో అది చాల సార్లు చెప్పి చూసా అయినా ఆ తాపత్రయం లోంచి ఇంకా బయట పడలేక పోతోంది. నేను గొప్ప..కాదు కాదు..నేనే గొప్ప..నా మాటే కరెక్టు..కాదు కాదు..నేను చెప్పేది మాత్రమే కరెక్టు.. అంటూ ఇన్నేళ్లు నిరంతరం పోట్లాడుకుంటూ వస్తున్న నాకు ఈ మధ్య అనిపిస్తోంది తన మాటే కరెక్టు అనుకుంటే పోలా... జీవితమే అంచుల్లోకి జారి పోతున్నప్పుడు ఇంకా గెలుపు ఓటమి అంటూ ఎందుకు గొడవలు ఆమే గెలిచింది అనుకుంటే తప్పేంటి.. ఇంట్లో పని చేసి చేసి అలిసిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్ర పోతున్నప్పుడు అమాయకం గా కనపడే ఆమె ముఖం చూస్తుంటే నాకు తెలియకుండానే చెమ్మగిళ్లుతున్నాయి నా కళ్ళు... చిన్ని పాపాయి లాగా ముద్దు చేయాలని... గుడ్ మార్నింగ్ మేడం అంటూ కాఫీ కప్ తో మేలుకొలపాలని నా కోరిక... ఉదయం ఆరు గంటలకి నేను లేచినా కూడా.. నాకంటే ముందే తను లేచి వెళ్ళిపోతుంది..అమెరికా లో వున్న అమ్మాయి బాగోగులు ఫోన్ లో కనుక్కుంటూ గార్డెన్ లో వాకింగ్ కి. జీవితం ఎంత అందమైనదో.. ఒక్కసారి వెళ్ళిపోతే.. అంతా శున్యమే అంధకారమే... అయినా ఏంటో దాని చివరి అంచుకి వచ్చాక గానీ ఆఫీస్ పనులు.. వగైరా అంటూ దశాబ్దాలు ఒక లిప్త పాటుగా గడిపేసిన సంగతి అర్థం కాదు. ఆలోచిస్తే నా ఆత్మ మిత్రుడు అదే నాలోని నేను చెప్తోంది.. మిత్రమా గడిచిపోయిన రోజులు ఎలాగూ తిరిగి రావు.. మిగిలిన చిన్ని జీవితాన్ని మాత్రం వొదులుకోకు..కనీసం ఇప్పుడైనా సంతృప్తి సంతోషం తో తనతో తనలో భాగమై జీవించు... చివరి శ్వాస వరకూ... ఒకరితో ఒకరు తోడుగా, నీడగా, జంటగా, ఆలంబనగా... ఈరోజు అనిపించింది... ఎప్పుడూ లేని విధంగా.. నువ్వే గెలిచావ్ అమ్మలూ జీవితం లో... నువ్వే కరెక్ట్.. నువ్వు గెలవడంతో పాటుగా నన్నూ గెలిపించావ్ అని చెబుదామని.. రోజూ కన్నా భిన్నం గా పొద్దున్నే లేచా నిద్ర లోంచి.. ఉమెన్స్ డే సందర్బంగా స్పెషల్ గ్రీటింగ్స్ ఇద్దామని.. అదృష్టం.. "ఆమె"ఇంకా పడుకునే ఉంది... "ఆమె"పట్ల నాలోని ఆ ఆర్తి.. అభిమానం, గౌరవం.. ప్రేమ అన్నీ కలగూడి....నాకు తెలియకుండానే నా పెదవులు ఆమె బుగ్గల పైకి వెళ్తున్నాయి... ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా.. నా జీవితం కి కర్త కర్మ క్రియ మరియు మార్గదర్శి అయిన అందమైన మనసున్న మారాణి.. కాదు నా రాణి.. గురించి రెండు ముక్కలు రాద్దామనిపించింది...ఎప్పుడూ అందరి గురించి చెప్తూ వుంటారు నా గురించి మాత్రం చెప్పరు అంటూ ఉంటుంది ఆమె... అందుకే ఇది... 🙏

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు