భార్యా నియంత్రణ - వెంకటరమణ శర్మ పోడూరి

Bharyaa niyantrana

బయట ఎండలోంచి ఇంట్లోకి వచ్చి ఫాన్ కింద కుర్చీలో కూలబడ్డాడు నరసయ్య గారు " బయటికి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళ వచ్చు కదా ? తేవాల్సిన సరుకులు ఉన్నాయి చెబుదును కదా? " అంటూ రామ లక్ష్మి గారు మంచి నీళ్ల గ్లాసు అందించింది " ఇప్పుడు చెప్పు సాయంత్రం మళ్ళీ అటు వెళ్ళాలి" అన్నారు నరసయ్యగారు " ఇప్పుడే చెబితే, నాలుగింటికి మూడు మరిచిపోడానీకా. వెళ్లేటప్పుడు చెప్పండి చెబుతాను" అంది ఆవిడ పక్క కూర్చీలో కూర్చుంటూ., ఎదురుగ టీ పాయ్ మీద ఉన్న పేపర్ అందుకుని.. " పేపర్ చదివిన తరువాత, అలా పేజీలు అన్నీ కల గలిపి పడేయొద్దని ఎన్ని మాట్లు చెప్పాలి?. చదవ గానే ఇంకొకళ్ళు చదవడానికి చిరాకు కల్పించకుండా అన్ని పేజీలు వరసగా పెట్టి నీట్ గా పెడితే ఎం పోంతుంది ?" అంది పేజీలు సద్దుకుంటూ అప్పటికే ఆయన కునుకు లోకి జారుకున్నాడు కాసేపటికి ఆయన్ని చూసి " అలా కుర్చీలో కునుకు తీయక పోతే, లేచి మంచం మీద పడుకోవచ్చు కదా? ఎమెడేనా నొప్పి పెడితే చస్తాం" అంది " ఆ విషయం మంచి నిద్రలో ఉండగా అరిచి చెప్పాలా? కాసేపు ఆగితే నీ సొమ్మేమి పోయింది ?. ఎలాగా నిద్ర పాడు చేశావు కాస్త కాఫీ చూడు " " కాస్త తీరుబడిగా పేపర్ కూడా చదవడానికి నోచు కోలేదు కదా ?" మళ్ళీ ఇంకో గంటకే టీ అంటారు, కాఫీ ఎందుకు? ఇపుడే టీ తాగండి" అంది ఆవిడ లేచి వంట ఇంట్లోకి వెడుతూ ఆవిడ పక్కన పెట్టిన పేపర్ ఆయన తీసి, అంతర్యామి కాలం చదవడం ప్రారంభించాగానే ఫోన్ రింగ్ అయితే పేపర్ పక్కన పెట్టి వెళ్లి మాట్లాడి వచ్చాడు టీ పట్టుకు వచ్చి ఇచ్చి. " ఎవరు ఫోను? " అంది పేపర్ చేతి లోకి తీసుకుంటూ ఆయన జవాబు చెప్పే లోపే " మళ్ళీ పేజీలు కదిపేశారు పేపర్ కూడా ప్రశాంతం గా చదివే వీలు లేదు కొంపలో" అంటూ తాను చదువుతున్న 'వసుంధర' , ఆపిన చోటునుంచి చదవడం మొదలు పెట్టింది " రామం ఫోన్ చేశాడు. ట్రిప్ పూర్తి చేసుకుని రేపు వస్తున్నారట. రమని వాళ్ళ ఇంట్లో దింపి తాను ఇటు వస్తానన్నాడు " " ఇక్కడికి వచ్చి స్థిమిత పడి పుట్టింటికి వెళ్ళ వచ్చు కదా? మన వాడికి ఆ మాట చెప్పే ధైర్యం ఎక్కడిది లెండి?. మైసూరు, కేరళ చూసి వద్దామని వాడు అంటూ ఉంటె, అది పడ నిచ్చిందా ? హనీమూన్ అంటే, మనాలి, సిమ్ల లాంటి ప్రదేశాలకి వెళ్ళాలి కానీ సౌత్ ఏమిటి అని అక్కడికి లాక్కు పోయింది కదా? " ఎదో వాళ్ళిష్టమయిన చోటికి వెళ్లారు కదా ? మనం ఎందుకు పట్టించుకోవడం? మేడ మీద గదులు అవీ శుభ్రం చేయించి ఉంచాలేమో!. పెళ్లికి చుట్టాలు వచ్చి వెళ్లిన హడావిడి లో అంతా అస్త వ్యస్తం గా ఉన్నాయేమో " అన్నాడు " మనం సర్దితే దానికి నచ్చు తుందో లేదో, వచ్చి ఆమాత్రం సర్దుకోలేదా? కోడలిని మరీ గారం అలవాటు చేస్తే తరవాత మనం చస్తాం." అంతే గాని నేను చెప్పింది విని అమలు చేసే ప్రసక్తే లేదన్న మాట . సరే నీ ఇష్టం. నువ్వు రమ గురించి ఆలోచిస్తోంటే నేను రామం గురించి ఆలోచిస్తున్నాను " అన్నాడు ఆవిడ దృష్టి కొడుకు మీదకి మరల్చాలని ఆయన అనుకున్నది జరిగింది, కానీ ఇంకో డైరక్షన్లో " అవును మీదగ్గర ఏమయినా ఎత్తాడా ? ఇక్కడ పాత కొంప లో ఎందుకని ఇద్దరి ఆఫీసులూ ఒకే చోట కనక గచ్చిబౌలీ లో ఆఫీసుకు దగ్గరగా వేరే తీసుకుంటానన్నాడా ?" అంది. కొడుకు పెళ్లయిన దగ్గరనుంచీ మనసులో మెదులుతు న్న మాట బయట పెడుతూ " మనకి కావలిసింది ఏమిటి ? ఎక్కడయినా వాడు హాపీ గా ఉండాలనే కదా? వాడికి ఎలా నచ్చితే అలా చేస్తాడు లే. మనం బుర్ర బద్దలు కొట్టుకోవడం దేనికి?" అన్నాడు నరసయ్య గారు " నాకూ అదే ఆందోళన. వాడు సుఖంగా ఉండాలనే కదా? కాస్త కొన్నాళ్ళు అమ్మాయి మన దగ్గర ఉంటె, పనీ పాటా నేర్పి తే వాడు అవస్థ పడక్కరలేదని కదా/?" " రమకి పనీ పాటా రావని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళ అమ్మ నేర్పకుండా ఉంటుందా?' " ఈ రోజుల్లో చదువు కుంటున్న పిల్లలికి ఏమాత్రం పనీ పాటా వచ్చో చూస్తున్నాం కదా ? పక్క వాటా లోకి వచ్చిన సుబ్బలక్ష్మి రోజూ వంట చేస్తూ వాళ్ళ అమ్మకి ఫోన్చేయడం నా చెవిన పడుతూనే ఉందిగా " అమ్మా పులుసు లో పిండి ఎలా పెట్టాలి?" , "అరటికాయ ఆవ పెట్టి ఎలా వండాలి? ఆయన ఫ్రెండ్ భోజనానికి వస్తున్నాడు ఎన్ని బియ్యం ఎక్కువ పోయాలి? " అని అడుగుతూనే ఉంటుంది. చాలా మాట్లు " నువ్వు తప్పుకో, నేను క్షణం లో చేస్తాను " అ ని ఆ కుర్రాడు అనడం కూడా వినపడుతూనే ఉంది " " అవును ఈ రోజుల్లో కుర్రాళ్ళు చదువుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ కలిసి ఉండి స్వంతం గా వంట చేసుకుంటున్నారు కదా ? మన రామం కూడా సాంబారు బాగా పెడతాడు కదా? " " అంతే కానీ, పెళ్లయిన తరువాత అయినా వాడు కాస్తసుఖ పడేలా చేద్దామన్న ఆలోచన లేదు మీకు " అంది నిష్టూరంగా. " అన్నట్టు మరిచాను, వాళ్ళ అత్తా రింటికి కూడా ఫోన్ చేసి చెప్పమన్నాడు. వాళ్లకి ట్రై చేస్తే ఫోన్ కలవ లేదట " కొడుకు చెప్పినది గుర్తుకు వచ్చి నరసయ్య గారు లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు *** నరసయ్య, రామ లక్ష్మి దంపతులకి రామం ఒక్కడే కొడుకు. నరసయ్య గారు రిటైర్ అయ్యే లోపలే రామం చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ లోనే ఉద్యోగం లో చేరాడు. వారాంతాలలో ' స్టార్ బక్స్ లో కూర్చుని అప్పుడప్పుడు పని చేసుకుంటున్నప్పుడు రమ తో పరిచయం అయి అది పెళ్లి దాకా దారి తీసింది. రమ తల్లి తండ్రులు కూడా అదే ఊళ్ళో ఉంటారు. సమస్యలేమీ లేకుండానే వాళ్ళ పెళ్లి ఈ మధ్యనే జరిగింది. ఇద్దరూ సెలవు పెట్టి 'హానీ మూన్' కూడా పూర్తి చేసుకు వచ్చారు. ట్రిప్ నుంచి తిరిగి వస్తూ రమని పుట్టింటి దగ్గర దింపినా, రెండు రోజులలోనే రమ వచ్చేసింది. ఇద్దరూ మ్యారేజ్ కి తీసుకున్న శలవు తరువాత ఇంకో రెండు రోజులలో ఉద్యోగాలలో చేరాలి. ఆవేళ ప్రొద్దుటే టిఫిన్ తయారీ లో అత్త గారికి సహాయ పడింది రమ. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటున్నారు " సాయంత్రం మీ ఫ్రెండ్ రాజా మ్యారేజ్ రెసెప్షన్ గుర్తు ఉందా ? ' రమ అడిగింది భర్తని " ఆ గుర్తుంది ఇప్పుడు వెళ్లి గిఫ్ట్ పేక్ చేయించుకు వస్తాను" అన్నాడు " పుట్టిన రోజుకి నాకు ఇచ్చినట్టు ఎదో పుస్తకమ్ పేక్ చేయించుకు రాకండి. ఏదయినా ఉపయోగ పడేది కొనండి" రమ " ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకి వచ్చే గిఫ్ట్స్ ఏమి చేయాలో, ఎక్కడ పెట్టాలో తెలియక చస్తున్నారు జనం. డెకొరేటివ్ వస్తువులు బదులు మంచి పుస్తకం ఇస్తే, వాళ్ళు చదివిన తరువాత ఎంతమందయినా చదువుతారు. నా గ్రాడ్యుయేషన్ అవగానే జరిగిన మా సుధాకర్ పెళ్ళికి షా ' పిగ్మాలియాన్' గిఫ్ట్ గా ఇచ్చాను. ఆ తరవాత నాకు కనపడినప్పుడల్లా చెబుతాడు, ఆ పుస్తకం వల్ల మొత్తం బెర్నార్డ్ షా పుస్తకాలనీ చదివానని. నీకే నా గిఫ్టు విలువ తెలియలేదు" అన్నాడు రామం డిఫెన్సివ్ గా " ఏమో బాబూ నాకు పుస్తకాలు గిఫ్ట్ గా ఇస్తే చిన్న చూపుగా ఉంటుంది" రమ " సరే నీ ఇష్టం నువ్వే వచ్చి సెలెక్ట్ చేయి' అన్నాడు లేస్తూ. రామ లక్ష్మి గారు భర్త వైపు చూసింది 'గమనిస్తున్నారా అన్నట్టు" . ఆ మరునాడు రామం సినిమాకి వెడదాం అన్నాడు. "మేము రాము మీరు వెళ్లి రండి" అన్నారు తల్లీ తండ్రి. " మంచి తెలుగు సినిమా ఉంది హైదరాబాద్ సెంట్రల్ లో మనం వెడదాము" అన్నాడు రామం, రమతో. . "తెలుగు సిని మానా?, బోరు బాబూ ఏదయినా హిందీ సినిమా చూద్దాము" అంది రమ సరే అక్కడికి వెళ్లి నిర్ణయిద్దాములే నడు అని వాళ్ళు సినిమాకి వెళ్లారు. మర్నాడు రామ లక్ష్మి గారు అడిగారు " ఏ సినిమాకి వెళ్లారు రా రాత్రి? " దేనికి వెళ్లుంటారో ముందే ఊహించినా ' బిల్లు అని హిందీ సినిమా అమ్మా. చాలా బాగుంది మీరు కూడా చూడండి అన్నాడు "చూడచ్చులే టీవీ లో వస్తుంది కదా " అని లోపలి కి వెళ్ళింది ఆవిడ ఆ మర్నాడే, రామం, రమ ఇద్దరూ ఉద్యోగాలకి వెళ్లి పోయిన తరువాత , నరసయ్య గారికి టీ ఇచ్చి , పక్కన చిక్కుడు కాయలు వలుస్తూ కూర్చుంది రామ లక్ష్మి గారు గత కొద్దీ రోజులనుంచీ ఆవిడ మనసులో కొట్టుకుంటున్న మాటలు మెల్లిగా పైకే అంది " నేను చెబితే బాగుండదు . మీరు రామం తో చెప్పండి, ఇప్పుడే కాస్త పెళ్ళాన్ని అదుపు లోపెట్టుకోమనండి. అది చెప్పిన ప్రతీ దానికీ డూ డూ బసవన్నా అని తల ఊపడం కాదు " అంది ఆయన కేసి చూసి " ఆయన టీ పూర్తి చేసి కప్పు పక్కన పెట్టి ఆవిడ కేసి నవ్వుతూ చూస్తూ అన్నాడు . " నేను చెబితే వింటాడా? రామకృష్ణ పరమ హంస చరిత్ర లోఒక సంఘటన చదివాను చెబుతాను విను " పరమ హంస దగ్గరికి ఒక తల్లి ఒక పిల్ల వాడిని తీసుకు వచ్చి, స్వామీ వీడు కలకండ ఎక్కువ తినేస్తున్నాడు. అస్తమానం అదే కావాలంటాడు , అది తిన వద్దని మీరు చెబితే వింటాడు కాస్త చెప్పండి స్వామీ" అని ప్రార్ధించింది " పరమ హంస ఆమె కేసి చూసి నవ్వి " రేపు తీసుకురా అమ్మా తప్పకుండా చెబుతాను" అన్నారు . ఆమె వెళ్లి పోయింది మళ్ళీ మరునాడు తీసుకు వచ్చింది. అప్పుడు కూడా పరమహంస , రేపు తీసుకురా అమ్మా తప్పకుండా చెబుతాను అన్నారు. అలా రెండు రోజులు జరిగింది. ఆమె స్వామి మీద ఉన్న భక్తి వల్ల విరమించకుండా మూడో రోజు కూడా తీసుకువెళ్ళింది. మూడో రోజు పరమహంస 'కుర్రవాడిని దగ్గరకు తీసుకుని కలకండ ఎక్కువ తిన కూడదమ్మా ఆరోగ్యం పాడవుతుంది అమ్మ పెట్టినంతే తినాలి' అని నచ్చ చెప్పారట. వాడు అలాగే అని తల ఊపాడు ఆమె సంతోషించి వెళ్లి పోతూ, మళ్లీ వెనక్కి వచ్చి " స్వామీ ఈ వాళ మీరు చెప్పినది, మొదటి రోజే చెప్పవచ్చు కదా? ఇన్ని రోజులు ఎందుకు రమ్మన్నారు ? అని వినయం గా అడిగిందట అప్పుడు పరమ హంస నవ్వి "లేదమ్మా, మీ అబ్బాయి లాగే నాకూ కలకండ చాలా ఇష్టం కనక ఎక్కువ తింటున్నాను. అది నియంత్రించు కోకుండా ఇంకొకళ్ళని తినవద్దని ఎలా చెబుతానమ్మా? అది రెండు రోజులలో నిగ్రహించుకుని మానేసి ఇవాళ మీ వాడికి చెప్పాను. నేను మానకుండా వాడికి చెబితే విలువ ఉండదు కదమ్మా ?" అని చెప్పి గట్టిగా నవ్వారు నరసయ్య గారు.

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల