ఆపదభంధువు - కొడాలి సీతారామారావు

Aapada bandhuvu

ఆర్టీసి కథలు 5

‘నువ్వు నాతో మాట్లాడి వుపయోగం లేదయ్యా.నువ్వు తప్పు చేసావు.సస్పెండయ్యావు.అంతే.’చెప్పాడు డిపో మేనేజర్ రమణయ్య కాస్త తీవ్ర స్వరంతో. ‘నేను రూపాయే తక్కువ కట్టాను.అదీ నా సర్వీసు మొత్తంలో ఇదే మొదటి సారి.కండక్టరుగా ఇరవై ఎనిమిదేళ్ళు పనిచేసా.ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా తక్కువ కట్టలేదు.ఎక్కువ డబ్బులే కట్టేవాడిని.అవీ పాసెంజర్లు మర్చిపోయినవి .కండక్టరుగా కానీ,ఎ డి సి గా కానీ నా మీద ఒక్క కంప్లైంటు లేదు.నా సర్వీసులో నేను ఛార్జిషీటు తీసుకోవటం ఇదే మొదలు.పైగా నేను నాలుగు రోజులలో రిటైరవుతున్నాను.కాస్త కనికరించండి.’ బతిమాలు తున్నా డు కోటయ్య.డిపో మేనేజర్ అతని మాటలు వినిపించుకోనట్టు బయటికి వెళ్ళిపోయాడు.

కోటయ్యకి ఏం చెయ్యాలో తోచక గది లోంచి బయటికి వచ్చి నిలుచున్నాడు.కోటయ్య నరసరావుపేటలో ఏ డీ సీ (అసిస్టెంటు డిపో క్లర్కు)పని చేస్తున్నాడు రెండేళ్ళుగా.అతను కండక్టర్లు తమ డ్యూటీ పూర్తయ్యాక ఆ సర్వీసులో టిక్కెట్ల ద్వారా వచ్చిన డబ్బు డిపో ఆఫీసులో కట్టాలి.అలా డబ్బుని తీసుకునే వుద్యోగం కోటయ్యది. రెండు రోజుల క్రితం అలా తీసుకున్న డబ్బు లెక్క చూసి డిపో క్లర్కుకి కట్టాలి ( డిపో క్లర్కు అలా వసూలైన మూడు షిఫ్టుల సొమ్ము మరుసటి రోజు బేంకులో జమచేస్తాడు.) అనే సమయంలో డిపో ఎకౌంటెంటు కేష్ చెక్ చేసాడు.అదే సమయంలో డిపో మేనేజర్ రమణయ్య అక్కడికి వచ్చాడు.ఎ కౌంటెంటుని అడిగాడు సరిగ్గా వుందా కేష్ అని.’రూపాయి తక్కువ వుంది.అతనితో కట్టించేస్తా లెండి.’అన్నాడు కోటయ్య వేపు చూస్తూ. ‘ఐతే ఫ్రాడుని సమర్ధించినందుకు మీరు సస్పెండవుతారు.’అన్నాడాయన.రూపాయే కదా అన్న ఎకౌంటెంటు మాట వినకుండా వెళిపోతూ ‘రిపోర్టు తక్కువ కట్టినట్టే ఇవ్వండి.’అనటంతో అతనేం చేయలేక అలాగే ఇచ్చాడు తన రిపోర్టు.సాధారణంగా ఆడిట్ చేసినప్పుడు తక్కువ వుంటే ఆ డబ్బుని కట్టించేస్తారు అప్పుడే.తరచు అలా తక్కువ వుంటేనే అతని మీద రిపోర్టు రాస్తారు.డి ఎం అలా ఎందుకన్నాడో ఎకౌంటెంటుకి అర్థం కాలేదు. అదే రోజు సాయంత్రం అతనికి ఛార్జిషీటు ఇచ్చారు సస్పెండు చేస్తూ.అప్పటి నించీ డి ఎం ని కలవటానికి ప్రయత్నించినా ఆయన కలవనియ్యలేదు.తన గోడు యూనియన్ నాయకులతో వెళ్ళబోసుకున్నాడు.వాళ్ళు మాట్లాడతామన్నారు.ఈ లోగా తనే కలిసి విన్నవించుకున్నాడు.బతిమాలాడు.ఇంచుమించు కాళ్ళ మీద పడ్డాడు. ఐనా ఆయన కనికరించ లేదు. యూనియన్ వాళ్ళు కలిసొచ్చి చెప్పారు ‘ఆర్ ఎం ( రీజనల్ మేనేజర్) గారే నిన్ను సస్పెండు చెయ్యమన్నారుట.మన రీజనల్ సెక్రటరీకి చెప్దాం.ఐనా ఆయన పాత గొడవలు మనసులో పెట్టుకున్నట్టు ఉన్నాడు.’ అని రీజనల్ సెక్రటరీకి ఫోన్ చేసారు. కోటయ్య ఆ రోజు మథ్యాన్నం గుంటూరు వెళ్ళాడు ఆ రెం ని కలవటానికి.ఆయనని కలవటానికి వేచి వున్నాడు.అతని ఆలోచనలు ఇరవై ఏళ్ళ వెనక్కి వెళ్ళాయి.

### కొత్త డిపో మేనేజరుగారు,కృష్ణారావు గారు ఆఫీసులో రిపోర్టు చేయగానే యూనియన్ తరఫున ఆయన్ని అభినందించటానికి వెళ్ళాడు కోటయ్య డిపో సెక్రటరీగా తన కమిటీ సభ్యులతో.ఆ యన గదిలో ఒక్కరే వున్నా వెంటనే లోనికి రమ్మనలేదు.అరగంట తరువాత లోపలికి పిలిచాడు. పుష్పగుఛ్ఛం చేతికి ఇచ్చి అభినందనలు తెలిపి,తమ సహకారం ఎప్పుడూ వుంటుంది డిపో అభివృధ్ధికి తీసుకునే ని ర్ణయాలన్నిటికీ అని చెప్పి కమిటీ సభ్యులని,తననీ పరిచయం చేసుకున్నాడు.ఆ సమయంలో డి ఎం లేచి నుంచోలేదు.చిరునవ్వు కూడా లేదు సరి కదా ‘అనవసరంగా బస్సులాపేయటం,చిన్న సమస్యని పెద్దది చేసి ఆందోళన చేయటం నేను సహించను.’అన్నాడు.కోటయ్య నవ్వుతూనే సమాధానం చెప్పాడు ‘అటువంటి అలవాట్లు లేవు.సమస్య మీ దృష్టికి తెచ్చి నిర్ణీత సమయం లోపు పరిష్కారం కాకపోతే పై అధికారుల దృష్టికి తెస్తాం.ఆ పైనే మా నిరసన కార్యక్రమం వుంటుంది.’ కోటయ్య డిపో సెక్రటరీ కాక ముందు సమ్మెలు జరిగినా,ఆందోళన చేస్తున్నా డ్యూటీ చేస్తున్న ఇతర యూనియన్ ఉద్యోగులని హేళన చేయటం,అవమానించ టం,టైర్లలో గాలి తీయటం,బస్సుల మీద రాళ్ళు వేయటం చేసేవారు.అతను అలా చేయద్దని చెప్పాడు.’మన యూనియన్ పిలుపు మేరకు మనం సమ్మె చేస్తున్నాం.అలాగే వారు సమ్మె చేసేటప్పుడు మనం డ్యూటీలు చేస్తున్నాం.ఇక బస్సు మనకి తల్లి.అందువల్ల రాళ్ళు వేయటం,గాలి తీయటం వద్దు.’ అని చెప్పాడు.కాలక్రమంలో ఆ విధానం రాష్ట్రమంతా అనుసరించారు అందరూ. కొత్తగా వచ్చిన ఆ డి ఎం కి అది మొదటి పోస్టింగ్.అతని ప్రవర్తనలో అహంభావం కనపడేది.కార్మికులంటే లెక్క లేదు. చిన్న తప్పుకి కూడా పనిష్మెంటు తీవ్రంగా వుండేది.దుర్భాషలాడటం,చులకనగా మాట్లాడటం. ఆఫీ సులో ఉద్యోగులని కూడా నిర్లక్ష్యంగా మాట్లాడటం,అవమానించటం. ఎన్నోసార్లు చెప్పారు యూనియన్ పరంగా పధ్ధతి మార్చుకోవాలని.వినక పోవటంతో పై అధికారులకి ఫిర్యాదు చేసారు.వారు చెప్పినా వినకపోవటంతో ఆందోళన చేసారు.ఆయన ఆఫీసులో వారితో సహా కొందరిని సస్పెండు చేసాడు.ఆందోళన తీవ్రమవటమే కాక ముందు రీజియన్ వ్యాప్తంగా,నెమ్మదిగా రాష్ట్రమంతా వ్యాపించింది.ఆయన పేరుతో డౌన్ డౌన్ అనే నినాదాలు,ఆయన దురాగతాలగురించి నినాదాలు ప్రతి యూనిట్లో,డిపోలలో విరామ సమయాలలో చేసేవారు. అప్పుడే ఎండీ (మేనేజింగ్ డైరెక్టరు) కొత్తగా వచ్చారు.ఆయన పోలీసు ఉన్నతాధికారి.ఆయన తన టేబుల్ పై వున్న విజిలెన్స్ రిపోర్టు ఈ ఆందోళనకి సంబం ధించి చదివాడు.ఉన్నతాధికారులతో మాట్లాడాడు.కొన్ని సూచనలు చేసాడు ఆందోళన ఆగేలా. వెంటనే ఇ డి (ఎ) ( ఎక్జిక్యూటివ్ డైరెక్టర్, ఎడ్మినిస్ట్రేషన్) డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడాడు.ఎం డీ గారి ఆలోచన చెప్పాడు.డివిజనల్ మేనేజర్ కి కూడా విషయం చెప్పి వెంటనే నరసరావు పేట వెళ్ళి ఏం చేయాలో చెప్పాడు.య ఆ రోజే కేంద్ర యూనియన్ నాయకులు కూడా డిపో నాయకులకి చెప్పారు ఏం జరగబోతోందో.డివిజనల్ మేనేజర్ గారు వచ్చాక డి ఎం ఆఫీసుకి కార్మిక నాయకులని పిలిచి క్షమాపణ చెప్పించాలను కున్నారు.ఐతే ఆఫీసు వాళ్ళని,మరో యూనియన్ నాయకులని కూడా పిలవాలన్నారు.మొత్తానికి అలా అందరి ముందు చెప్పీ చెప్పనట్టు క్షమాపణ చెప్పించారు. ఆ తరువాత కోటయ్య డ్యూటీలో వున్నప్పుడు అనేకసార్లు తనిఖీలు చేయించాడు.అతను ఎప్పుడూ దొరకలేదు.ఆయన తనిఖీ అధికారులని తిట్టాడు చేతకాని వాళ్ళు దొరికారని.అసలు విషయం ఆ అధికారులంతా కోటయ్యకి సహచరులే.అతని సంగతి వారికి తెలుసు. అలా ఆయన చేసే కార్మిక వ్యతిరేక చర్యలన్నిటికీ కోటయ్య వ్యతిరేకించేవాడు.అది ఆయనకి ఆగ్రహం తెప్పించేది.ఆయనకి అతి తక్కువ సమయంలోనే వేరే రీజియన్ లోని డిపోకి బదిలీ అయింది.వెళ్ళిపోయేటప్పుడు ఎవరూ వీడ్కోలు సభ జరపటానికి ఇష్టపడలేదు.ఆయన చివరి రోజు కోటయ్యని పిలిచి చెప్పాడు ‘కార్పొరేషన్ చాలా పెద్దది. మళ్ళీ కలవకపోము.ఎప్పటికైనా నీ సంగతి చూస్తా.’ ఇదంతా రాష్ట్రం విడిపోక ముందు.

### రాష్ట్రం విడిపోయింది. ఆ తరువాత చాలా సంవత్సరాలకి కోటయ్యకి ప్రమోషను వచ్చి నరసరావు పేట వచ్చాడు.అతను అప్పటికే యూనియన్ నాయకత్వం నించీ తప్పుకున్నాడు కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వాలని. ఆ సమయంలో గుంటూరు రీజియన్ కి ఆ రెం గా కృష్ణారావు గారు వచ్చారు.ఆయన రావటమే కోటయ్య గురించి ఆరా తీసారు.ఆ డిపో మేనేజరుకి చెప్పారు కోటయ్య ఏ చిన్న తప్పు చేసినా,మాట్లాడినా సస్పెండ్ చేయమని. ### ఆ రెం గారు పిలుస్తున్నారంటే లోపలికి వెళ్ళాడు.కోటయ్యని చూస్తూనే ఆగ్రహంగా ‘చెప్పాగా మళ్ళీ క లుస్తామని.ఇలా కలిసాం. నీ దిక్కున్న చోట చెప్పుకో.నిన్ను రిమూవ్ చేస్తా.’అని పగలబడి నవ్వాడు.కోటయ్యని మాట్లాడనివ్వలేదు. ‘గెటౌట్’ అని అరిచాడు. ఇక లాభం లేదని అవమానంగా బయటికి వచ్చాడు.అప్పుడే యూనియన్ వాళ్ళు ఆరెం ని ఇతని గు రించే మాట్లాడటానికి వస్తున్నారు.అతని ద్వారా విషయం తెలుసుకుని లోపలికి వెళ్ళిన పది నిమిషాలలోనే తిరిగొచ్చారు. వాళ్ళ సలహాతో అతను విజయవాడలోని ఎండీ ని కలవాలనుకున్నాడు.అతను వెళ్ళిన కాసేపటికే ఎండీ గారు లోపలికి పిలిచారు.ఇతను చెప్పింది పూర్తిగా విన్నారు.కాసేపు బయట వుండమన్నారు. ఆయనకి అప్పటికే కృష్ణారావు మీద అనేక ఫిర్యాదులున్నాయి.ఐనా డిపో మేనేజరుకి ఫోన్ చేసి ‘ఇంత చిన్న తప్పుకే సస్పెండ్ చేస్తావా’ అని అతన్ని వెంటనే ఉద్యోగంలో తీసుకోమన్నారు.డిపో మేనేజర్ చెప్పాడు తను కావాలని చెయ్యలేదనీ,ఆరెంగారు చెయ్యమన్నారని. ఆయన వెంటనే కృష్ణారావుకి ఫోన్ చేసి ‘నువ్వు వెంటనే రాజీనామా చెయ్యి.లేదంటే నీ మీద చాలా అవినీతి ఫిర్యాదులు వున్నాయి. డిస్మిస్ చేస్తా.గంటలో నీ నిర్ణయం చెప్పు.’ అని ఫోన్ పెట్టేసాడు. కోటయ్యకి అర్థం కాలేదు.అనేక మంది ఉన్నతాధికారులు తన ముందు నించే తనని చూసుకుంటూ ఎం డీ గారి దగ్గరికి వెళుతున్నారు.వస్తున్నారు.చాలా సంచలనంగా మాట్లాడుకుంటున్నారు చిన్నగా. కాసేపటికి కోటయ్యని పిలిచారు లోపలికి. ఆయన చెప్పారు ‘మీరు వెంటనే డిపోకి వెళ్ళండి.మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటారు.మీ గురించి కూడా తెలుసుకున్నాను.మీ లాంటి వారి వల్లే సంస్థ బాగుంది.గుడ్ లక్.’ ### గుంటూరు రీజియన్ లో అన్ని డిపోలలో కార్మికులంతా జయజయధ్వానాలు చేసారు.టపాకాయలు కాల్చారు.కారణం కృష్ణారావు రాజీనామా చేసాడు.@#@

మరిన్ని కథలు

Antaa manchike
అంతా మంచికే
- కొడాలి సీతారామా రావు
Podupu baata
పొదుపు బాట.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nyayam jarigindi
న్యాయం జరిగింది
- సి.హెచ్.ప్రతాప్
Grahanam pattina chandrudu
గ్రహణం పట్టిన చంద్రుడు
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Ante..Nenu?
అంటే!... నేను!?.
- రాము కోలా. దెందుకూరు
Prajaswamyanike naa Otu
ప్రజాస్వామ్యానికే నా ఓటు
- రాపాక కామేశ్వర రావు
Srivarante maavare
శ్రీవారంటే మా వారే
- సి.హెచ్.ప్రతాప్
KOusikuniki Gnanodayam
కౌశికునికి జ్ఞానోదయం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు