సేవా దృక్పధం - జీడిగుంట నరసింహ మూర్తి

Seva drukpatham

"నానీ ! బావగారికి అల్మరాలోని కొత్త దుప్పటి కప్పుకోవడానికి ఇవ్వు " కొడుక్కి పురమాయించింది తల్లి రాధమ్మ.

నానీ కొద్దిసేపు అక్కడ తచ్చాడుతూంటే రాధమ్మ కు విసుగొచ్చి ఈ పిల్లలు మాట వినిపించుకునే పరిస్తితిలో లేరు అనుకుంటూ అల్మరా తెరిచి ఆశ్చర్య పోయింది.

దొంతరలు దొంతరలుగా పెట్టి ఉంచిన కొత్త దుప్పటీల స్తానం బోసిగా ఉంది. కంగారు పడుతూ పక్కనే ఉన్న ర్యాక్ కూడా తెరిచి చూసింది. అందులో కూడా నానీ పుస్తకాలు ఉన్నాయి తప్ప ఎటువంటి బట్టలు లేవు.

ఆ గది నిజానికి నానీ చదువుకోసం ఏర్పాటు చేసినది. . వాడి బట్టలు, పుస్తకాలు ఈ గదిలోనే వుంటాయి. నానీ లేనప్పుడు ఆ గది ఇంటికి వచ్చిన ముఖ్యమైన గెస్టులకు కూడా ఉపయోగిస్తారు. అందుకోసమే నానీ తండ్రి రాజారావు ఆ గదిలో ఏసీ కూడా పెట్టించాడు. అప్పుడప్పుడు పండగలకు, పబ్బాలకు వచ్చే ఆ ఇంటి అల్లుడికి కూడా ఆ గది కేటాయించబడుతుంది. .

రెండు అల్మారాలు ఖాళీగా ఉండటం చూసిన రాధమ్మ అయోమయానికి గురయ్యి పక్క గదిలో కూర్చుని చదువుకుంటున్న నానీని గద్దించి అడిగింది .

" ఏమీ లేదులేమ్మా . అన్ని దుప్పట్లూ , బట్టలూ అల్మారాలలో ఏళ్ల తరబడి కూరేసి ఏం చేసుకుంటాం ? బయట ఫుట్ పాత్ ల మీద పడుకుని చలికి వణికి పోతున్న వాళ్ళను చూశాక అవి ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనిపించి వాళ్ళకు పంచి పెట్టాను. ఇక నావన్నీ యూనిఫారాలే . నాకు కుట్టించిన చొక్కాలు ప్యాంటులు నేనేం చేసుకుంటానని అవి కూడా చెట్ల కింద చాలీ చాలని బట్టలుతో కూలీ నాలీ చేసుకుని రోజులు వెళ్లబోస్తున్న కుటుంబాలకు ఇచ్చేశాను. . అయినా బావగారు చలికాలంలో కూడా ఏసీ వేసుకుని పడుకుంటారు. దుప్పటీ ఇచ్చిన కప్పుకోరు. ప్రస్తుతానికి నీ అల్మారాలోంచి ఏదో ఒక దుప్పటి తీసి ఇయ్యి"అంటూ సాధ్యమైనంతఃవరకు మంద్ర స్తాయిలో సమాధానమిచ్చాడు నానీ.

"నీకు ఇటువంటి పిదపకాలపు బుద్దులు పుడుతున్నాయేమిటిరా ? ఈ ప్రపంచంలోని వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలంటే మన వల్ల అవుతుందా ? బోళ్ళంత డబ్బు పెట్టి కొన్న బట్టలు అలా ఎవరైనా దారా దత్తం చేస్తారా ? అమెరికాలో ఉన్న నీ అన్నయ్య నీ మీద ప్రేమతో ఇండియా వచ్చినప్పుడల్లా మేట్లు మేట్లు బట్టలు కొని తెచ్చి పోస్తున్నాడు. నువ్వేమో దారిన పొయ్యే వాళ్ళందరికీ దోచి పెడుతున్నావు . అసలు ఈ వయసులో చేయవలసిన పనులేనా ఇవి ? ఈ లెక్కన ఇంట్లో సామానులన్నీ ఇంకెన్ని బయటకు పోయాయో ?అసలు ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఇంకెమేనా ఉందా ?" అంటూ మండిపడింది రాధమ్మ . .

తల్లి అనేక విధాలుగా నిందిస్తున్నా నానీ తను చేస్తున్నది ఏ విధంగానూ తప్పుకాదని అతని లేత మనసుకు అనిపిస్తోంది. తండ్రి ఇచ్చే పాకెట్ మనీతో తన తోటి విద్యార్ధులకు ఎన్నో సార్లు పుస్తకాలు, పెన్నులు కొనుక్కోవడానికి సహాయ పడటం అతనికి అలవాటు . .

"నాన్నా ఇక్కడ ఒకసారి కారాపు. నీకు ఆఫీసులో ఈ సంవత్సరం వచ్చిన బోనస్ లోంచి వెయ్యి రూపాయలు పెట్టి గుడిలో అర్చన చేయించడానికి వెళ్తున్నాం కదా. ఆ డబ్బు ఏదో ఇక్కడ నిరుపేద కుటుంబాలకు పంచి పెడితే పుణ్యం వస్తుంది కదా ?. " అన్నాడు నానీ. .

రాజారావుకు కొడుకు ప్రవర్తన చాలా దూకుడుగా, అసహజంగానూ అనిపించింది.చదువుకోవాల్సిన వయసులో ఈ వింత పనులకు ఆయనకు కొడుకును ఎలా దారిలోకి తీసుకురావాలో అర్ధం కావడం లేదు. ఒక పదినిమిషాల సేపు కారులోనే కొడుకును సుతిమెత్తగా చివాట్లు వేశాడు. . కూచెమ్మ కూడ బెడితే మాచమ్మ మాయం చేసింది అన్నట్టు నీకు ఈ వయసులో ఇలాంటి పిచ్చి పట్టిందేమిటి రా. నువ్వు పెద్దయ్యాక కష్టపడి సంపాదించినప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది . అయినా మీ స్కూల్లో ఎవరైనా ఇటువంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు ఉన్నారా ?" అంటూ క్లాస్ తీసుకున్నాడు.

నాని చదవడానికి పదవతరగతి చదువుతున్నా అంత చిన్న వయసులోనే తన చుట్టూ జరిగే అనేక సంఘటనలు గమనిస్తూనే మానసికంగా చాలా ఎదిగాడు. . ఈ మధ్య అతను చూసిన కొన్ని బాలల చిత్రాలు అతన్ని బాగా ఆకర్షించాయి. అందులో లాగా తను కూడా ఇతరులకు ఏదో రకంగా ఉపయోగపడాలని అతని మనసు అనుక్షణం తపన పడుతూ ఉండేది.

" అమ్మా గంపెడు అంట్లు తోమి , ఇంటిల్లిపాది బట్టలుతికి నానా చాకిరీ చేస్తున్నా నాకు ఒక్క రూపాయి జీతం పెంచడానికి మీకు చేతులు రావడం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు మావి. అక్కడికీ పది ఇళ్ళల్లో పని చేస్తున్నా ఇల్లు గడవడం లేదు. నాకూ రోజురోజుకూ శక్తి సన్నగిల్లిపోతోంది. ఈ నెల నుండి ఒక వంద రూపాయలైనా జీతం పెంచకపోతే నేను వేరే ఇల్లు చూసుకుంటాను " అంటోంది పనిమనిషి లచ్చమ్మ రాధమ్మతో. .

పనిమనిషి అలా రొక్కించి డబ్బు పెంచమని అడగడం రాధమ్మకు సుతారామూ నచ్చలేదు. అయితే ఈ పరిస్తితిలో ఆమె పని మానేస్తే ఇంకో మనిషి దొరకడం కష్టం అని కూడా తెలుసు. .

ఒకరోజు తన ట్రంక్ పెట్టిలోని పాత చీరలను బయటకు తీసి " లచ్చమ్మా . ఈ చీరలు నేను ఎక్కువగా వాడలేదు. చాలా ఖరీదు పెట్టి కొన్న చీరలు. ఇవన్నీ తీసుకుపో. " అంటూ మూట కట్టి లచ్చమ్మ ముందు పడేసింది రాధమ్మ.

" అమ్మా ! మీలాంటి పెద్దవాళ్ళు కట్టుకోవాల్సిన ఈ చీరలు నేనేమీ చేసుకోవాలమ్మా?. అయినా వీటితో నా పిల్లల చదువులు చదివించగలనా ? ఇవి మీరే ఉంచుకోండి. నాకు మాత్రం జీతం పెంచితేనే పని చేయగలను " అంది లచ్చమ్మ ఖరాఖండిగా. ,

పరీక్షల కోసం పుస్తకాలన్నీ ముందేసుకుని చదువుకుంటూ ఒక కంట లచ్చమ్మ, తల్లి మధ్య జరిగే సంభాషణ వింటూనే ఉన్నాడు నానీ.

పనిమనిషి వెళ్లిపోయాక " ఏమిటమ్మా ఏ ఇంట్లో చూసినా పని మనిషి మనిషి జీతం పెంచమంటే పాత బట్టలు వదిలించుకోవాలని చూస్తారు. వాళ్ళకు కావలసినది డబ్బు. ఆ బట్టలు వాళ్ళకు తిండి పెడతాయా ? మనకు మాత్రం ఆఫేసులో జీతం పెంచకపోతే నానా యాగీ చేసి సమ్మెలోకి దిగుతాం . పది ఇళ్ళల్లో పని చేసుకుంటేనే కానీ రోజు గడవని ఆ బీద జనాల దగ్గర మన ప్రతాపం చూపించడం ఏమైనా న్యాయంగా ఉందా ? ఒక రోజు పని మనిషి రాకపోతే రోడ్డుమీద పడిపోయే మనలాంటి కుటుంబాలు వాళ్ళ కనీస కోరికలు తీర్చడానికి మనసు రాదు. ఏం పర్వాలేదు. భవిష్యత్తులో మిమ్మల్ని చూసుకుంటానో లేదో గ్యారంటీ లేని నన్ను లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి హాస్టల్ చదువులు చదివిస్తున్నారు. ఒక్క వందరూపాయలు నోరు చాచి అడిగితే దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. బీదవారిమీద కాస్తంత కనికరం ఉంచాలమ్మా. " అంటూ నాని అంటూంటే రాధమ్మ నిశ్చేష్టురాలై చూస్తూంది పోయింది.

నానీకి ప్రతి సంవత్సరం హాస్టల్ వాళ్ళు ఇచ్చే రెండు నెలల సెలవులు అటు వాడికీ , ఇటు ఆ కుటుంబంలోని వారికీ ఆనందాన్ని ఇవ్వకపోగా ప్రతి రోజు ఏదో ఒక సమస్యతో తెల్లవారుతూ ఉంటుంది. ఇదే మాట ఏదో ఒక సందర్భంలో తల్లి నోటి వెంట రావడంతో ఆ రోజు నానీ నిర్ణయించుకున్నాడు తను హాస్టల్కు తిరిగి వెళ్ళి పోవాలని. .

ఒక రోజు లగేజ్ సర్ధుకుని ప్రయాణానికి సిద్దమైన కొడుకును చూసి రాజారావు "అదేమిటిరా . నీకు హాస్టల్కు సెలవులిచ్చినప్పుడల్లా మాతో కొన్నాళ్లు సరదాగా గడుపుతావని అనుకుంటూ ఉంటే ప్రతి చిన్న విషయాన్ని మనసులో పెట్టుకుని ఇలా వెళ్ళి పోతాననడం ఏమీ బాగోలేదు. నువ్వు చేస్తున్న పనులను మీ అమ్మా , నేను విభేదిస్తున్న మాట నిజమే. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నువ్వు ఇంత చిన్న వయసులో కూడా పేదవారి పట్ల చూపిస్తున్న సేవా దృక్పధం గురించి ఎంతోమంది నాతో ప్రత్యక్షంగా చెప్తూ ఉంటే ఒక తండ్రిగా నా ఆనందానికి అవధులు లేవు. తల్లి తండ్రులుగా మేము చేయలేని పనులను ఈ లేత వయసులో చేసి చూపించి మా కళ్ళు తెరిపిస్తున్నావు. మనకున్న దాంట్లోనే ఇతరులతో పంచుకోవడం సంస్కృతి అనిపించుకుంటుంది" అన్న సత్యాన్ని ఆలస్యంగానైనా తెలుసుకున్నాను . నువ్వు జీవితంలో ఎంతో బాగా ఉన్నతంగా , ఆదర్శ భావాలతో ఎదగాలని నా కోరిక. నువ్వు చేసే మంచి పనులకు మేము ఎప్పుడూ అడ్డు రాము " అంటూ రాజారావు నానీని గుండెలకు హత్తుకుంటూ ఉంటే నానీ పెదవుల మీద విజయ దరహాసం కదలాడింది**

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి