మంత్రి మంచి మనసు - బోగా పురుషోత్తం

Mantri manchi manasu
పూర్వం చంద్రగిరి రాజ్యాన్ని చంద్రహాసుడు పాలించేవాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రాజు మొదటి భార్య తన బాగోగులు పట్టించుకోలేదు. తనపై ఎలాంటి ప్రేమానురాగాలు, అప్యాయతలు చూపలేదు. సరిగా తిండి కూడా పెట్టకపోవడంతో విసిగిపోయిన చంద్రహాసుడు మరో వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య హంసవేణి గొప్ప గుణవంతురాలు, విద్యావంతురాలు. రాజును అనునిత్యం కంటికి రెప్పలా కాపాడేది. ఆమెకు ముగ్గురు ఆడ పిల్లలు పుట్టారు. తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచింది. వారు రాజు పర్యవేక్షణలో విద్యలో చక్కగా రాణిస్తూ పెరుగుతున్నారు. రాజుకు ముగ్గురు ఆడ పిల్లలు అంటే ఎంతో మక్కువ. రాజదంపతులు తమ కూతుర్లను ఎంతో గారాబంగా పెంచారు. మొదటి అమ్మాయి వైష్ణవికి యుక్త వయస్సు వచ్చింది. ఆమెకు తగిన వరుడితో వివాహం చేయాలని ఆమె తల్లిదండ్రుల ఆలోచించారు. అయితే రాకుమారి వివాహ విషయంలో రాజదంపతులు ఆందోళన చెందారు.
వైష్ణవిని వివాహమాడడానికి ఎందరో రాజులు తహతహలాడారు. అయినా చంద్రహాసుడు అంగీకరించలేదు. అసలే కుమారుడు లేని లోటును తీరుస్తూ వారసురాలు కాబోతున్న అమ్మాయిని మంచి గుణవంతుడు, వివేక వంతుడికి ఇచ్చి వివాహం చేస్తే తనకు ఏ సమస్య ఎదురైనా పరిష్కరిస్తాడని అప్పుడు నిశ్చింతగా వుండవచ్చని భావించారు హంసవేణి, చంద్రహాసుడు.
వారి తీరు మొదటి భార్యకు నచ్చలేదు. తనకు పిల్లలు లేరని వైష్ణవి పట్టాభిషిక్తురాలు అయితే రాజ్యం పరులకు దక్కుతుందని ఊహించిన మొదటి భార్య తన తమ్ముడు విక్రమాదిత్యకు ఇచ్చి వివాహం చేస్తే పట్టాభిషిక్తుడ్ని చేయవచ్చని రాజ్యం తమకే దక్కుతుందని తర్వాత రాజును, హంసవేణిని తరిమి వేయవచ్చని పథకం వేసింది. నెమ్మదిగా మగ పిల్లలు లేని లోటును తన తమ్ముడు తీరుస్తాడని, వైష్ణవిని అతనికిచ్చి వివాహం చేస్తే బాగుంటుందని రాజుకు నచ్చజెప్పింది. రాజు కూడా ఈ సంగతిని హంసవేణికి వివరించాడు. ఆమె అయిష్టంగానే తల ఊపింది.
ఈ పరిణామాలను గమనించసాగాడు మంత్రి వివేక వర్థనుడు.ఎదురయ్యే పరిస్థితిని అంచనా వేసి రహస్యంగా నిఘా వేశాడు. ఇందుకు గూఢచారులను పర్యవేక్షణకు నియమించాడు.
రాజ భవనంలో వైష్ణవి వివాహానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రాజు మొదటి భార్య సోదరుడుని అల్లుడిగా చేసుకుంటున్నందుకు ఆనందంగా పొంగిపోతున్నారు. అయితే ఇది హంసవేణికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. మంత్రి వివేక వర్థనుడు తాను నిఘా పెట్టిన సంగతిని వివరించి రహస్యంగా వుంచాలని కోరాడు. పెళ్లి పందిరి ఏర్పాటు చేశారు. ఇరు పక్షాల బంధువులందరూ వచ్చారు. విందు భోజనాలు ముగిసాయి. వివాహ సమయం సమీపించింది. ఏమి జరుగుతుందోనని ఆందోళనగా ఎదురుచూస్తోంది హంసవేణి. రాజు ఒంటరిగా వున్న సమయంలో అదే సమయానికి " కుర్రో.. కుర్రు.. అంబ పలుకు.. జగదాంబ పలుకు.. " అంటూ ఇద్దరు కొండ దొరలు చంద్రహాసుడి వద్దకు వచ్చారు.
‘‘ ఎవరయ్యా మీరు.. అనుమతి లేకుండా లోనికి వచ్చారు..?’’ ప్రశ్నించాడు చంద్రహాసుడు.
‘‘ దొరా మీ మేలు కోరే ఇటు వచ్చాము.. మీ రెండవ భార్య కూతురు వైష్ణవికి మీ బావ మరిదినిచ్చి పెళ్లి చేయడం బాగానే వుంది. వారిద్దరి పేర్లు పరిశీలించాము..మీ అమ్మాయిని చేసుకునే వ్యక్తి చేతిలోనే మీకు ప్రాణ గండం వుంది.. మృత్యు గడియలు సమీపించాయి. అప్రమత్తంగా వుండాలి లేదంటే మీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.. నిజం కాస్త చేదుగానే వుంటుంది.. మా మాట నమ్మకపోతే మీ కర్మ దొరా..!’ అంటూ కోపంగా వెళ్లిపోయారు కోయ వేషం వేసుకొచ్చిన కొండ దొరలు.
ఆ మాట విన్న పెళ్లి పెళ్లి కొడుకు కాస్త నసుగుతూ తన అక్క వద్దకు వెళ్లాడు. అప్పటికే ఆమె రాజు గారికి వడ్డించేందుకు భోజనం విస్తరిని సిద్ధం చేస్తోంది. సమయం చూసి ఆహార పదార్థాల్లో విషం కలిపాడు. ఆ తర్వాత ఏమీ తెలియని వారిలా ఆ విస్తరిని తీసుకెళ్లి రాజుగారి ముందు పెట్టింది మొదటి భార్య. ’’ రండి.. పెళ్లి పనుల్లో పడి ఎంతో చిక్కిపోయారు..రండి షడ్రుచోపేతమైన విందు భోజనం తిందురు..’’ అంటూ ఆప్యాయతను ఒలికిస్తూ నటించింది. అది గ్రహించని రాజు చంద్రహాసుడు తినడానికి విస్తరి ముందు కూర్చున్నాడు. నోట్లో ముద్ద పెట్టుకుంటున్న సమయంలో ఓ పెద్ద శునకం వచ్చి ‘‘ భౌ..భౌ..’’ అంటూ అరవడం మొదలు పెట్టింది. ఆ అరుపులు విని చంద్రహాసుడు విసుకున్నాడు. ‘‘ ఎవరక్కడ.. ఇంత మంచి సమయంలో శునకాలు ఇక్కడికి రాకుండా నియంత్రించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు..?’’కోపంతో అరిచాడు.
పక్కనే ఉన్న ఇద్దరు భటులు రాజు దగ్గరకు వచ్చారు ‘‘ ఇంగిత జ్ఞానం వుంది కనుకనే వీటిని ఇక్కడ వుంచాము ప్రభూ..’’ అన్నారు.
ఆ మాటలతో చంద్రహాసుడికి మతిపోయింది.. ‘‘ అసలేం మాట్లాడుతున్నారో తెలుసా మీకు..?’’ దద్దరిల్లేలా అరిచాడు. ఆ అరుపునకు మంత్రి వివేక వర్థనుడు అక్కడికి పరిగెత్తు కొచ్చాడు. అప్పటికే రాజు చేతిలో వున్న భోజనం ముద్ద కింద పడిరది. శునకాలు తిని మూర్చపోయి పడిపోయాయి. చంద్రహాసుడు ఆందోళనతో మొదటి భార్యను, పక్కనే నిల్చున్న పెళ్లి కొడుకును చూశాడు. అప్పటికే ఆ శునకాలు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాయి.
జరుగుతున్న పరిణామాలను చూసి విస్తుపోయిన రాజు మొదటి భార్య, ఆమె తమ్ముడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఎదురుగా వస్తున్న మంత్రి చాకచక్యంగా వారిని పట్టుకుని రాజు ముందుంచాడు. వారి కుట్ర బహిర్గతమైంది.
‘‘ అమ్మో ఇంత ప్రమాదం వుందని తెలిసి కూడా నీ తమ్ముడితో నా కూతురి వివాహం చేయిస్తావా..? నీ వక్ర బుద్ధికి తగిన జీవిత శిక్ష అనుభవించు...’’ ఆజ్ఞాపించాడు చంద్రహాసుడు.
అక్కడే వున్న భటులు ఇద్దరిని తీసుకెళ్లి చెరసాలలో బందించారు.
తనను అనునిత్యం వెంటాడుతూ కంటికి రెప్పలా చూసుకునే మంత్రి వివేక వర్థనుడు మంచి తనాన్ని ప్రశంసించాడు రాజు. నెమ్మదిగా పాలనలో మంత్రి సలహాలు తీసుకుంటూ ప్రజాభీష్టం మేరకు పాలించాడు.
హంసవేణి కోరిక మేరకు తన కుమార్తెకు బాగా చదివి తెలివి తేటలు కలిగిన మంత్రి వివేక వర్థనుడు కుమారుడు విరూపాక్షుడితో వివాహం జరిపించారు. వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఏ చీకుచింతా లేకుండా హాయిగా సాగింది.
‘‘ అమ్మో నా భార్యకు ఇంత కుట్ర దాగి వుందని నేను ఊహించలేదు.. ఎలాగైతే ఏం? గండం గడిచింది..అమ్మాయికి ఉత్తమ వరుడు దొరికాడు. నాకు అన్ని అర్హతలు కలిగిన అల్లుడు వారసుడిగా దొరికాడు. ఇక ఆలస్యం దేనికి పాలనా బాధ్యతలు అతనికి అప్పగించండి’’ అని మంత్రిని ఆజ్ఞాపించాడు రాజు.
‘‘ నాకు పాలించే అర్హత లేదు మామయ్యా..’’ అంటూ చంద్రహాసుడి కోరికను సున్నితంగా తిరస్కరించాడు విరూపాక్షుడు.
అన్ని అర్హతలు వున్న వైష్ణవి పట్టాభిషిక్తురాలైంది. మంత్రి అయిన మామ వివేకవర్థనుడు, భర్త విరూపాక్షుడి సలహాలతో రాజ్యంలో వైద్య కళాశాలలు, ఉన్నత విద్యాలయాలు ప్రారంభించి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజలను వివేకవంతుల్ని చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పాలించసాగారు.
ప్రజల సంతోషమే తన ఆనందంగా భావించిన చంద్రహాసుడు, హంసవేణి నిశ్చింతగా ప్రశాంతంగా కాలం గడిపారు.

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి