మూగ ప్రాణం..! - ఇందుచంద్రన్

Mooga pranam

బాగా పొద్దుబోయింది అందులోను చలికాలం పాదాలకి తారు రోడ్డు మీద కంకర్లు గుచ్చుకుంటుంటే

నొప్పి జివ్వుమని కాళ్ళని గుంజేస్తా ఉంది , అయినా కాని మెల్లగా మేకలన్నిటిని రోడ్ల మీద చెట్ల ని

మేయనిచ్చి దొడ్లోకి తోలి ఇంటికి వెళ్ళాడు పోయినాడు చంద్రడు (మేకల యజమాని).

మేకలన్నీ దొడ్లోకి దూరగానే ఎదురుగా ఉన్న కుడితి నీళ్ళ తొట్టి చూసి పోటిపడుతూ

కుమ్ముకోసాగాయి.అర్రే...అప్పిగా అలా మిగిలిన వాటిని పొడుస్తావెందుకురా? నీకు పెడతారు కదరా

వీటిని తాగనివ్వరా అంది దేవమ్మా (పెద్ద మేక అప్పిగాడి తల్లి).

గుర్రుమంటూ చూసి దూరంగా పోయినాడు అప్పిగాడు (మేకపోతు).ఇంతలో గబాల్న దొడ్లొ కి

ఐదుమంది దాక వొచ్చినారు, మేకలన్ని భయంతో గుంపుగా చేరిపోయాయి.మందలో బలిష్టంగా

కొమ్ములు వాడిగా రొమాలు నిక్కబొడుచుకున్న ఉన్న అప్పిగాడ్ని చెవులుపట్టుకుని లాకొచ్చి

"అమ్మే ఉద్దేశం లేదన్నా కాని ఇంట్లో పరిస్థితి బాలేక అమ్మాలి అను కున్నే, నువ్వు ఇంత దూరం

వొచ్చినావు నాకు కూడా డబ్బు అవసరం ఉండాది అని చూపించాడు చంద్రడు బాధగా అప్పిగాడ్ని

చూపిస్తూ

వచ్చిన అతను ఆ మేకపోతును( అప్పిగాడు) ని తడిమి చూసాడు

సరే చంద్ర ఎన్ని కేజీలు వస్తాదంటావు అన్నాడు

"ఉతారుగా అంటే 25 కేజీలు దాకా అన్నాడు అప్పిగాడ్ని తడుముతూ

ఆ మాటలు విని లోపలున్న దేవమ్మ( పెద్ద మేక) ఆ మాటలు విని బాధగా దొడ్లొ గుంజకి ఆనుకుని

పడుకుంది నెమరు వేస్తూ

"సరే..అడ్వాన్స్ ఇస్తా రేపు దీన్ని పట్టుకుపోయేటప్పుడు బాకీ డబ్బు ఇస్తా అన్నాడు ఆయన వెళ్ళిపోతూ

సరే అంటూ వెనక నడిచాడు చంద్రడు

లోపల పడుకుని ఉన్న దేవమ్మ దగ్గరికి వెళ్ళి అప్పిగాడు "ఎందమ్మా అయ్యగోరు నన్నేమ్మేస్తారాఅన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ

దిగులుగా చూస్తూ " మన రాతే అంతేరా అంది దేవమ్మా

""ఈ మనుసులంతా ఇంతే ఎంత స్వార్థంగా ఆలోచిస్తారమ్మా అన్నాడు అప్పిగాడు బాధ గా

"నోర్ముయ్యరా....ఆయన పరిస్థితి అట్టాంటిది పాపం మనల్ని ఎట్టా సూసుకుంటాడు మనతో వచ్చే మేకలు గొడ్లు

ఆరింటికే ఇల్లకి వస్తే అయ్యగోరు మనకోసం ఎండ వానా సూడడు , వానా సినకతా ఉంటే మేత లేక ఉండలేమని

మనకన్నా ఆయనే ఎక్కువ దిగులుపడిపోతాడు. వాళ్ళు తినే బియ్యాన్ని అమ్మగోరి దగ్గర వొండుకొచ్చి మరీ

పెడతాడు.ఎండల్లో ఆ కొండల్లో మధ్య ఎండ సెగ కి తట్టుకోలేమని చెనగతీగలని మేతకి ఆకుని దొడ్లోకి పెట్టి ఎండ

తగ్గినాక తోల్కపోతాడు మనకి ఇంట్లో ఒకింత బాలేకున్నా ఆ వెంకయ్య సారు ని సూడమని పానం తీసేయ్యడు.

ఆయన ఎంత దూరం పోయినా సరే ఒక మంచి సెడ్డ లకి పోయినా మద్దేనానికి మన దొడ్డికాడుంటాడు.పొద్దున్న పనికి

పోయి మద్దేనానికి వచ్చేటప్పుడు మన అరుపులు విని నాలుగు మెతుకులు తిని మళ్ళీ మనల్ని తోల్కపోతాడు. ఈ

దొడ్డిలో ఒక సినుకు రాలనిస్తాడారా ?వాన సినకగానే పరిగెడతా వొచ్చి మనల్ని ఓపారి సూసిపోతేగాని ఆయనకి

నిమ్మళ్ళంగా ఉండదు సినుకు రాలితే ఆ సిమెంటు గోతాల్ని, రోడ్లమీద బ్యానర్లన్ని సింపుకొచ్చిమరీ కట్టిపోతాడు.

ఆయనకి మనం సానా ఋణపడిపోయినాంరా అంది దేవమ్మా

"అయ్యగోరు మంచోరే కాని ఇట్టా నన్ను అమ్మేస్తాంటే భయంగా ఉంది అన్నాడు అప్పిగాడు

"ఆ మనిషి కట్టాలు అట్టాంటివి ,అయ్యగోరు సాదారణ రైతు కూలీ కి పొయ్యేటోడు , ఆయనకి మనమే నాలుగు పైసల్ని

ఇయ్యగలిగేది ఇన్ని దినాలుగా నిన్నెట్టా సూసుకున్నాడు సెప్పు? అప్పిగా అప్పిగా అంటూ సిన్నమ్మయిగారు నీకు

ముద్దులెట్టేది ,నీ కోసం ఫారంలో పెట్టే మేత కూడా తీసుకొచ్చేది కదరా? అట్టంటోల్ని నీకు ఎట్టా అనాలి అనిపించింది రా అంది దేవమ్మా బాధగా

"అది కాదమ్మా...గబాల్న పోవాలంటే ఎట్టనో ఉండాది అన్నాడు అప్పిగాడు

"రేపటికి ఈయాలకి నీ పానం గాల్లో కలిసిపోతాదిరా అంది దేవమ్మ బాధగా

"నన్ను చంపేస్తారా ? అమ్మా ఎందుకమ్మానేనేం చేసా ?అన్నాడు అప్పిగాడు బాధగా

"కొందరు మొక్కులు కోసం మనల్ని సంపితే కొందరు ఆహారం కోసం సంపుతారు ఎవరి అవసరం వొళ్ళది అంది దేవమ్మ బాధ గా

"నా రాత ఇట్నే రాసి ఉండాదేమో అన్నాడు అప్పిగాడు బాధగా

"వాళ్ళొచ్చి తోల్కపోయేటప్పుడు మోటారు బండి మీద సక్కగా కూసో , వాళ్ళని విసుగెత్తిచ్చి దెబ్బలు తినబాక అంది

దేవమ్మ బాధగా

" ఇప్పటిదాక నా మీద దెబ్బపడనీయలే సిన్నమ్మాయిగోరు ఎప్పుడో పక్క సేల మీద పోతే నాలుగు దెబ్బలు తిన్న

అయ్యగోరుసేత అదే లాస్టూ అన్నాడు అప్పిగాడు గర్వంగా

"కాని నువ్వు బద్రంగా ఉండరా అంది దేవమ్మా అప్పిగాడి వైపు చూస్తూ

"ఎందమ్మా నువ్వు ఈయాలికి నా పానం ఎడుంటాదో ఏ ఇంట్లో కంచాల్లో ఉంటానో అన్నాడు అప్పిగాడు

"భయంగా లేదా అంది దేవమ్మా

"భయం అంటే వాళ్ళు సంపేటప్పుడు నొప్పెడుతుందని అంతే అన్నాడు అప్పిగాడు

"నాలుగు ఈతల్లో రెండో వాడిగా పుట్టినావు ఆ దినమే నా మనస్సులో ఈ భయం ఉండేది.పోతు పిల్ల అని ముచ్చట

పడాలో ఇట్టా నిన్ను కళ్ళముందే సంపేత్తారని తెలిసి బాధపడాలో తెలీలేదు. ఎంత భయం ఉన్న పగ్గాన్ని

వొదిలించుకుని పారిపోవద్దు. ఎవరైనా నీ కొమ్ముల్ని చెవుల్ని పట్టుకుని లాగినా సరే ఏమి అనకూడదు వాళ్ళెట్టా సెప్తే

అట్ట్నే ఉండు అంది దేవమ్మా

"నాకు తెలుసులేమ్మా అన్నాడు అప్పిగాడు పడుకుంటూ

అప్పిగాడి మనస్సంతా అదే ఆలోచన చుట్టూ చూస్తూ ఉన్నాడు. మూలగా ఉన్నా మేక పిల్లలన్నిటి దగ్గరికి వెళ్ళి

"నేను రేపెళ్ళిపోతాండా దేవుడు కాడికి అన్నాడు

అప్పిగాడి వైపు జాలిగా చూస్తున్నాయి

"మీరు నాకన్నా సిన్న కాబట్టి సెప్తున్నా... అయ్యగోరు తోలే చేలలోనే మోయాలి , ఆ పక్కనోళ్ళ మేకలతో తగువు

పెట్టుకోవద్దు ముక్కెంగా ఆ అబ్బులు గాడితో నేను ఉండెదాని వల్ల వాడు మీ జోలికి రాలేదు ఒకేల వాడొచ్చినా సరే

అందరూ కలిసి ఉండాలి, పైన గుట్టలో పొదల్లో దూరకండి.పొద్దయ్యేకల్లా ఆ కాలవ దగ్గరుండాలి.

"ఏంది అట్టా సూస్తున్నారు , రేపట్నుండి ఆ బకెట్ కాడ మీతో కొట్టాడే దానికి ఎవరూ ఉండరు అన్నాడు అప్పిగాడు నవ్వుతూ

"నీతో కొట్టాడినా సరే ఏ దినమూ నిన్ను ఇలా వొదులుకోవాలి అనుకోలేదు అంది అందులో ఒక మేకపిల్ల

"అవును..నువ్వుంటే బాగుంటాది మాకు, నీ కొమ్ములు నీ నడక మా మధ్యలో రాజులా ఉంటావు అంది మరో మేక

"నువ్వు ఉండవు అంటాంటే ఏదోలా ఉండాది అంది మరో మేక

"అది మన రాత ఎవరు మాత్రం ఏం సేత్తారు , మనం పుట్టింది ఈడనే మనల్ని అయ్యగోరు బాగా కాదు సానా బాగా

సూసుకున్నారు ఆయనకి కోసం ఇది తప్ప ఇంకేం సేస్తా అన్నాడు బాధ గా అప్పిగాడు

ఇంతలో దొడ్లోకి ఎవరో వచ్కినట్టు అనిపిస్తే గుంపుగా చేరాయి

భయపడకండిరా " సిన్నమ్మాయిగోరు అన్నాడు అప్పిగాడు ముందుకు వెళ్తూ

ఆ అమ్మాయి బకెట్ లో కుడితి నీళ్ళు పోస్తూ ఉంటే ఆత్రుతగా తాగాలని చూసాడు

కాని రేపటి రోజు గుర్తొచ్చి గొంతులోకి దిగలేదు

ఆ అమ్మాయి ఏమైందో అన్నట్టు అప్పిగాడి మొహాన్ని అటు ఇటు తిప్పి చూసి మళ్ళీ బకెట్ అప్పిగాడి ముందు పెట్టింది

అప్పిగాడు బాధ గా ఆ అమ్మాయి వైపు చూస్తూ " మా బాస నీకు అర్థం అయితే బాగున్నేమో నీతో సానా సెప్పాలి అని ఉంది కాని సెప్పినా నీకు అర్థం కాదు అంటూ ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంది

ఆ అమ్మాయి అప్పిగాడికి ఏమై పోయిందో అని తడిమి చూడసాగింది.

“ఏమైంద్రా అప్పిగా నీకు, తాగడం లేదు అంటూ బకెట్ మళ్ళీ మొహం దగ్గరికి తెచ్చింది

"అప్పిగా అది సిన్నమ్మాయి నన్ను ముద్దుగా పిలిచే పేరు అనుకుంటూ వెనక్కి వెళ్లిపోయాడు అప్పిగాడు

ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే "మే మే అని అరవసాగాడు , మా బాస అమ్మాయిగోరికి అర్థమయితే బాగుండు నాకు

బతకాలని ఉందని చెప్పేవాడిని అనుకున్నాడు అప్పిగాడు ,

టైమ్ అయ్యే కొద్ది అప్పిగాడిలో దిగులు ఎక్కువ అయ్యింది దొడ్డి చుట్టూ తిరుగుతున్నాడు తనని కట్టేసే గుంజ

ముందు నిలబడి దిగులుగా చూసాడు

అప్పిగాడ్ని అలా చూస్తున్నా దేవమ్మ గుండెతరిగిపోతుంది

"అప్పిగా...కాసేపు పడుకోరా తిన్నది అరగదు అంది దేవమ్మా

"ఎట్టనో ఉందమ్మా రేపట్ని తల్చుకుంటే అన్నాడు బాధ గా

"ఒక పని సేయ్ రా..ఆ సందులో దూరి ఎట్టైనా పారిపోతావా అంది బాధ గా

"ఎక్కడికి ఎళ్ళినా ఎన్నిరోజులు ఉంటానమ్మా? నాలుగు ఉంటా పార్ఫిపోయినా ఎవరో ఒకరు సంపెయ్యరూ అదేదో

సచ్చిపోయేది అయ్యగారి కోసం పోతా నాలుగు పైసలు కళ్ళ జూస్తాడు అన్నాడు

"పైకి నువ్వు అట్టుంటావే కాని నీ మనస్సు సానా మంచిదిరా అంది దేవమ్మా

"నీ పక్కన పడుకోనా అన్నాడు అప్పిగాడు దేవమ్మ గుంజ దగ్గర పడుకుంటూ , ఇయ్యాల ఎట్నో ఉండాదమ్మా ,

ఎప్పుడు ఇట్టలేదు పానం పోతాదని తెలిసినాక బతకాలని ఉండాది , నా బాస ఆళ్ళకి అర్థం అయ్యేట్టు ఉంటే కాళ్ళ

మీద బడైనా బతిమాలుకునే వాడ్ని అన్నాడు అప్పిగాడు బాధగా

"మనం అయ్యగోరుకి జీవనాధారం , కొనేటోళ్ళకి ఆహారం ఎవరి అవసరం వోళ్ళది రా అంది దేవమ్మ ఏడుస్తూ

"సెప్పింది గుర్తుండాది కదా బండ్లో సక్కగా కూసోవాలి ఎవర్ని ఏమి అనకూడదు అంటూ ఉంది

అప్పిగాడు ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు

కాసేపటికే మెలకువ వచ్చేసింది ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉంటా అనుకుంటూ చుట్టూ చూడసాగాడు అప్పిగాడు.

దేవమ్మ కంటి మీద కునుకు లేదు చప్పుడైన ప్రతి సారి ఎవరైన వస్తున్నారేమో అని చూస్తుంది

కోడి మొదటి కూతకే లేచి నిలబడి చూస్తూ ఉంది దేవమ్మ

ఎవరో మోటార్ బండి ఆపగానే భయంతో చూస్తూ ఉంది అనుకున్నట్టే అప్పిగాడికోసమే వచ్చారు. పడుకుని ఉన్న

అప్పిగాడ్ని ఆయన ఒకసారిగా లాగాడు నొప్పి కి అప్పిగాడు గట్టిగా అరిచాడు

"అన్నా...ఉండు నేను తీసుకొస్తా అంటూ చంద్రడు అప్పిగాడ్ని లేపి పగ్గాన్ని కాస్త లూజు గా కట్టి బయటకి

తీసుకొచ్చాడు

ఆయనతో మాట్లాడుతా ఉన్నా సరే అప్పిగాడ్ని తడుముతూ ఉన్నాడు చంద్రడు

కాసేపటికి కాళ్ళని కట్టి బండిలోకి ఎక్కించాడు. అన్నీ మేకలు అప్పిగాడి వైపే చూస్తున్నాయి

దేవమ్మ ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టింది బాధ తో

అప్పిగాడు నెమ్మదిగా అరవసాగాడు

అప్పిగాడ్ని పట్టుకున్న అతను మొహం మీద కొట్టాడు

"కొట్టొద్దు అన్నా కొత్త కదా అరుస్తుందన్నా..అలవాటు లేని మనిషి అన్నాడు చంద్రడు

వాళ్ళు అప్పిగాడ్ని తీసుకుని వెళ్తున్నారు

చుట్టూ చీకటి అప్పుడే తెల్లవారుతుంది అప్పిగాడికి ఎక్కడ వెళ్తున్నారో అర్థం కాలేదు కళ్ళు మూసుకున్నాడు

ఒక ఇంటి ముందు ఆపారు , గుమ్మానికి మామిడి ఆకులు ముద్దబంతి పువ్వులు వేలాడుతున్నాయి.

అప్పిగాడ్ని ఇంటి బయట గుంజకి కట్టి వెళ్ళారు కాసేపటికి పసుపు కుంకుమ పెట్టి మెడలో పూల దండ

వేసారు.అప్పిగాడిలో భయం ఎక్కువ అయ్యింది ఇంకొన్ని గంటలే అనుకోసాగాడు.పారిపోదామా? అన్న ఆలోచన

వచ్చి గట్టిగా దారాన్ని లాగాసాగాడు. ఒక్కసారిగా తనని బిడ్దల్లా చూసుకున్న అయ్యగోరు గుర్తొచ్చి

ఆగిపోయాడు.ఇంతలో ఒకయాన కత్తి నూరుతూ ఉన్నాడు అది చూసిన అప్పిగాడు ఇంకా హడలిపోయాడు.

కాసేపటికి అప్పిగాడ్ని తీసుకుని ఊరి చివర పొలిమేరల్లో ఉన్న అమ్మవారి గుడి ముందు ఆపారు.

గుడి ముందు నిలబడిన అప్పిగాడు "అమ్మా ఏ తప్పు చేయని నన్ను ఎందుకు సంపాలి ? నేను పుట్టడమే నేరమా?

నా ప్రాణం పోతే నీకు అందులో ఏం వస్తుందమ్మా? నీ కోసం అంటారు ఆచారమంటారు ఆనవాయితీ అంటారు. నాకు

బతకాలని ఉంది ఆ ఇంట్లో ఉండాలని ఉంది కాని నా వల్ల మా అయ్యగోరు కి డబ్బు వస్తుంది వాళ్ళు సంతోషంగా

ఉండాలనే నేను నీ ముందు నిలబడినా...అంటూ కళ్ళు మూసుకున్నాడు. పుట్టినప్పుడు ఏడ్చినానో లేదో తెలీదు

తల్లీ కానీ సచ్చిపోతానని తెలిసినాక మనస్సు ఆగట్లేదు , నాకిట్టాంటి సావు వస్తాదని తెలిసి నన్నెందుకు పుట్టిచ్చినావు

అని బాధగా అమ్మ వారి వైపు చూస్తూ ఉన్నాడు

రాహుకాలం వచ్చేస్తుంది కానివ్వండి అంటూ ఉన్నాడు ఆయన

వాళ్ళు నా మెడ నరికే ముందు నేను గట్టి గా కళ్ళు మూసుకోవాలి.కదలకూడదు అనుకున్నాడు.

ఈ రోజు తో నా జీవితం ముగుసింది అనుకుంటూ పడుకున్నాడు అప్పిగాడు నిట్టూరుస్తూ

ఇంతలో మోటార్ బైక్ సౌండ్ కి పక్కకి చూసాడు అప్పిగాడు

చంద్రడు వడి వడిగా అడుగులు వేస్తూ వస్తున్నాడు...ఆయన్ని చూడగానే అప్పిగాడు అరవడం మొదలు పెట్టాడు

"అన్నా తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు ఇలా చెప్పడం కరెస్ట్ కాదు కాని మా చిన్న కూతురు ఒప్పుకోలేదు

నిద్రలేచినప్పటి నుండి ఒకటే ఏడుపు , ఇంట్లో గొడవ చేస్తా ఉండాది , ఆ పోతు ని ఇష్టపడి పెంచుకుంది అమ్మడం

ఇష్టంలేదు కాని నేనే ఒప్పుకుంటాది కదా ఇచ్చా కాని , మా సిన్న కూతురు మొండిదాయే , తెల్లారిన కాడ్నించి

ఏడస్తా ఉండాది కావాలంటే తెలిసినోళ్ళ పోతులుండాయి తోల్కొచ్చుకొందురు అన్నాడు బాధ గా

"సరే చంద్రా కాని ఇంకో మేక తెచ్చుకునే టైమ్ కూడా లేదు ఇప్పుడు చెప్తా ఉండావు అన్నాడు ఆయన నసుగుతూ

ఇంతలో అటుగా వచ్చిన అతను "ఏమైనాది నాయనా ? అన్నాడు

"నిన్న ఈపోతు తోల్కొచ్చినారా, ఇప్పుడు ఈయనొచ్చి అమ్మలేను తీస్కపోతా అంటాడాడు అన్నాడు ఆయన కాస్త

నసుగుతూ

" పర్లేదు ఈ సారి పోతు ని పెట్టకుండా మొక్కు చెల్లించుకుందాం నాయనా , నాకు ఇష్టం లేదు పాపం కదా , అయినా

ఒక జీవి ని చంపి తెచ్చుకునే పుణ్యం ఎందుకు నాన్న , పుట్టిన ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది.మన అవసరాలకోసం

ఎందుకు వాటిని చంపడం ఎందుకు నాన్న,నువ్వు ఖాళీ చేతులతో మొక్కినా సరే అమ్మవారు నిన్ను అడగదు పద

వెళ్దాం ,అంకుల్ మీరు తీసుకెళ్ళండి అంటూ వెళ్ళిపోయాడు

"సరే చంద్రా తెలిసిన మనిషివి ఇంట్లో గొడవలు అంటాన్నావు నిష్టురాలు ఎందుకో లే కాని తోల్కొని పో అన్నాడు ఆయన కాస్త అసహనంగా చూస్తూ

చంద్రడు గుంజకి కట్టిన పగ్గాన్ని విప్పి అప్పిగాడి ని తడిమాడు

అప్పిగాడు సంతోషంగా అమ్మావారి వైపు చూసి దర్జాగా చంద్రడి వెనక నడవసాగాడు. బండి లో కూర్చో పెట్టిన

తర్వాత చుటూ వచ్చిన దారిని చూస్తూ ఉన్నాడు.

కాసేపటికి ఇల్లు చేరుకున్నాక బండి ఆగగానే పరిగెడుతూ వచ్చిన అమ్మాయి ని చూసి అప్పిగాడు అరిచాడు ప్రేమగా

తీసుకెళ్ళి దొడ్లోకి తోలాడు ఆయన.

దొడ్లోకి వెళ్ళిన అప్పిగాడు తన వైపు చూస్తున్న మేకలన్నిటితో జరిగినది చెప్తున్నాడు

ఇంతలో వచ్చిన అమ్మాయిని చూసి " సిన్నమ్మాయిగోరు వల్ల తిరిగొచ్చా అంటూ ఆ అమ్మాయి

ముందు నిలబడ్డాడు అప్పిగాడు

అమ్మాయి తెచ్చిన కుడితి నీళ్ళని ఆత్రంగా తాగి సంతోశంతో అరవసాగాడు.

"అప్పిగా..మళ్ళీ నిన్ను చూస్తా అనుకోలేదురా అంది దేవమ్మా బాధగా

"మన మీద ప్రేమతోనో జాలిపడేటోళ్ళు కూడా ఉంటారమ్మ అన్నాడు భారంగా లోపలికి వెళ్తూ

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి