‘అప్పన్న ఆశీర్వాదం ’ - మద్దూరి నరసింహమూర్తి

Appanna aaseerwadam

"అక్కా, అక్కా" అని అరుచుకుంటూ వచ్చాడు, కృష్ణ.

"అలా వీధిలోంచి అరవకపోతే, లోపలికి వచ్చి పిలవొచ్చుకదరా తమ్ముడూ," ఆప్యాయంగా మందలించేరు, కామేశ్వరిగారు.

" బావ ఫోన్ చేసి -- 'రేపు ఉదయం తొమ్మిదింటికి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయనని ఎటూ వెళ్లిపోకుండా ఇంట్లో ఉండమని చెప్పు,' -- అని ఫోన్ కట్ చేసీసేరు. ఎందుకో, నీకేమెనా తెలుసా. సిద్ధాంతిగారు అడిగితే చెప్పాలి కదా"

"నాకసలు ఏమీ తెలీదురా. నీకు ఫోన్ చేసేరు. నాకైతే, అదీ లేదు."

"ఈరోజు బావతో నువ్వెందుకు వెళ్ళలేదు"

"మీ బావ ఉత్తినే వెళ్ళేరా ఏమిటి, ఈ రోజు చందనోత్సవం కదా. వరాహస్వామి నిజరూప దర్శనం చేసుకోవచ్చని వెళ్ళేరు."

"అందుకే నేను అడిగేది - నువ్వెందుకు వెళ్ళలేదు, అని"

" నా మోకాళ్ళ నొప్పులతో నేను కూడా జతపడితే, మీ బావకి నన్ను చూసుకోవడంతో అయిపోతుంది. అందుకే, నేనుండిపోయా. ఐనా, మీ బావ స్వామి దర్శనం చేసుకుంటే, ఆయనకొచ్చే పుణ్యంలో సగం నాకు రాదూ."

"సరేలే…. నేను అటునుంచి అలా ఇంటికి వెళ్ళిపోతాను. "

కృష్ణ అలా వెళ్ళినదగ్గరనించీ, కామేశ్వరి గారు ఆలోచనలో పడ్డారు. ఇంత హఠాత్తుగా సిద్ధాంతిగారి దగ్గరికి భర్త ఎందుకు వెళ్లాలనుకుంటున్నారా అన్నది, ఆమె ఆలోచనకి అందడంలేదు. ఆవిడ అలా అన్యమనస్కంగానే పనులన్నీ కానిచ్చి, సింహాచలం నించి విజయనగరం రావడానికి ఇంత ఆలస్యం ఏమిటి చెప్మా అని, భర్త రాకకై ఆందోళనగా ఎదురు చూస్తూంది.

పరమేశ్వరశాస్త్రిగారు జ్యోతిష సాముద్రిక శాస్త్రాలలో ఉద్దండులు. శుద్ధ వైదిక సాంప్రదాయులు. త్రిసంధ్యతో పాటూ, రెండు పూటలూ శివ పూజ జరిపే నిష్టాగరిష్టులు. నుదిటిమీద విభూతి అడ్డనామాలుతో, వాటి మధ్యన సూర్యుడిలా మెరిసే ఎర్రటి కుంకుమ బొట్టుతో, మెడలో అంతేసి రుద్రాక్షల మాలతో, ఆరడుగుల పైన ఎత్తుతో, విశాలమైన వక్షస్థలంతో, వెలిగిపోతున్న తేజస్సుతో కనిపించే ఆయన, పేరుకి తగ్గట్టు అపర పరమేశ్వరులే. సాధారణంగా పై ఊళ్ళకి వెళ్ళరు శాస్త్రిగారు. తప్పనిసరిగా వెళ్ళవలసివస్తే, తన దగ్గర ఉన్న కాషాయరంగు సంచీలో –

పంచపాత్ర, ఉద్ధరిణె, చిన్న శివలింగం, కొంచెం విభూది, పసుపు, కుంకం, చిన్నగంధపు సాన, గంధపు చెక్క,

అక్షింతలు, రెండు బెల్లం ముక్కలు, దీపం సమ్మె, ఇన్ని ఒత్తులు, ఆవునేయి డబ్బా, అగ్గిపెట్టె, నాలుగు చిన్న

ఇత్తడి పళ్లేలు, చిన్న చెంబు, గ్లాసు, ఒక ధోవతి, తువ్వాలు, ఉత్తరీయం, చేతిగుడ్డ --

పెట్టుకొని వెళ్లి, ఆ ఊళ్ళో ఉండే సముద్రపు ఒడ్డునో, ఏటి గట్టునో, కాలువ గట్టునో, నూతి దగ్గరో సంధ్య వార్చడం, శివ పూజ చేయడం మానరు. విధి విధానానికి అవసరమైనవి ఉన్న సంచి కాబట్టి. స్వయంగా తానే పట్టుకుంటారు. తన భార్య కామేశ్వరి తప్పించి, మరెవరూ ఆ సంచీని తాకడానికి శాస్త్రిగారు అంగీకరించరు.

అలా ఎప్పుడేనా పై ఊరికి వెళ్ళినప్పుడు, బంధువులింటికి వెళ్ళేది లేకపొతే, ఏవో రెండు పళ్ళు తప్పితే, ఇంటికి వచ్చే వరకూ భోజనం చేయరు కూడా.

ఏడాదికి ఒకసారి వచ్చే చందనోత్సవం కదా అని, ఈ రోజు సింహాచలంకి ప్రయాణమయ్యేరు.

-2-

రాత్రి తొమ్మిది అవుతూండగా, సుమారు ఎనిమిదేళ్ల వయసున్న ఒక అబ్బాయితో కలిసి కారులో దిగేరు శాస్త్రిగారు. శాస్త్రిగారు కారులో రావడం, అదీ కాక ఎవరో తెలియని ఒక అబ్బాయితో రావడం కామేశ్వరిగారికి ఆశ్చర్యం వేసింది. అంతేకాక తామిద్దరం కాక, మూడో మనిషి తాకితేనే తాడెత్తున లేచే, ‘కాషాయరంగు సంచీ’ -- ఆ అబ్బాయి చేతిలో ఉండడం, ఆమెకు మరీ ఆశ్చర్యం కలిగించింది.

లోపలికి వచ్చిన భర్తని చూసి : "ఇదేమిటండీ, మీ బట్టలు మట్టి కొట్టుకుంటున్నాయేమిటి? మందిరంలో జనం తోపులాటలాంటిది ఏమేనా జరిగిందా? మీరేదో నీరసంగా కనిపిస్తున్నారు, ఏమిటయ్యింది? దైవ దర్శనం బాగా అయిందా? ఈ అబ్బాయి ఎవరు? కారులో వచ్చేరేమిటి ? " అంటూ ప్రశ్నల వర్షం కురిపించేరు.

శాస్త్రిగారు అపురూపంగా చూసుకొనే ఆ కాషాయరంగు సంచీకి అంటుకున్న మట్టి ఆనవాళ్లు, కామేశ్వరిగారి దృష్టిని దాటిపోలేదు.

" నేను బాగానే ఉన్నాను. భగవద్దర్శనం బాగానే అయింది. వివరాలూ తాపీగా తరవాత చెప్తాను. ముందు ఈ అబ్బాయిని చూడు"

శాస్త్రిగారు ఆ అబ్బాయితో "ఈమె అమ్మగారు" అంటే --- ఆవిడని అలా చూస్తూ నిలబడ్డ ఆ అబ్బాయితో --

"నీకు ఎవరేనా పెద్దవారిని పరిచయం చేసినా, ఎవరేనా వయసులో పెద్దవాళ్ళు నీకు ఎదురు పడినా, వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేసి, వారి పాదాలకి నమస్కారం చేసి ‘ఆశీర్వదించండి’ అని అడగాలి, తెలిసిందా. ఏదీ నేను చెప్పినట్లు చేయి." అన్నారు.

ఆ అబ్బాయి చేతులెత్తి కామేశ్వరిగారికి నమస్కారం చేసి, ఆమె పాదాలకి నమస్కారం చేసి, "ఆశీర్వదించండి" అన్నాడు.

దాంతో పులకించిపోయిన కామేశ్వరిగారు " ఎవరండీ ఈ అబ్బాయి. భలే ముద్దుగా మాట్లాడుతున్నాడు"

"ముందు వీడికి స్నానం చేయించి, తినడానికి ఏదేనా పెట్టు. నేను స్నానం చేసి వచ్చి, అన్ని వివరాలు చెప్తాను. ఇందులో అబ్బాయికి బట్టలున్నాయి. స్నానం అయినతరువాత ఒక జత ఇయ్యి. మిగతావి లోపల దాచిపెట్టు." అని అంతవరకూ తన చేతిలో ఉన్న సంచీ ఆవిడ చేతికిచ్చి, వాడి చేతిలోనున్న తన ‘కాషాయరంగు సంచీ’ తీసుకున్నారు .

శాస్త్రిగారు స్నానం చేసి వచ్చేసరికి, అబ్బాయి భోజనం ముగించి చేయి కడుక్కుంటున్నాడు.

"బాబూ, అలసిపోయి ఉంటావు. ఈ రోజుకి పడుకో. రేపు ఉదయం లేపుతాను.” అని -- భోజనానికి వచ్చిన శాస్త్రిగారితో -- కామేశ్వరిగారు: “రండి రండి. ఈ రోజు మీ భోజనం చాలా ఆలస్యమైంది." అని వడ్డన చేసేరు.

"ఎలాగా ఆలస్యమైందంటున్నావుగా, నువ్వు కూడా వడ్డించుకో"

"లేదు లెండి. మీరు భోజనం చేయండి ముందు.”

"కీళ్ల నొప్పులు ఎలా ఉన్నాయి. మందులు వేసుకున్నావా. నూనె మర్దనా చేసుకున్నావా, భోజనం చేసిన తరువాత, నేను చేసీదా."

“మందులు వేసుకున్నాను, నూనె మర్దనా కూడా చేసుకున్నాను.

“ఇంతకీ, కృష్ణ వచ్చాడా, నీకేమైనా చెప్పేడా."

"మీరు వెళ్ళమన్నారని సిద్ధాంతిగారింటికి వెళ్లే ముందర వచ్చేడు. నాకు కారణం అడిగాడు. నాకేమీ తెలీదురా. నీకైతే కనీసం ఫోన్ చేసేరు. నాకా భాగ్యం కూడా లేదు అని చెప్పేను." అన్నారు, కామేశ్వరిగారు చిరు అలకతో.

"ఇంటికొచ్చి అన్నీ వివరంగా చెబుదామని ఊరుకున్నాను. నీకు చెప్పకుండా ఎలా “

“నాకు మజ్జిగ పోసి, నువ్వు భోజనం చేసిరా. ముందర గదిలో కూర్చొని మాట్లాడుకోవొచ్చు.”

అక్కడనించి వెళ్లిన శాస్త్రిగారు, ఆ అబ్బాయి పడుకున్నాడని తెలుసుకొని వచ్చి, టీవీలో ‘రామాయణం-ధర్మం’ మీద ప్రసారమవుతున్న ప్రవచనం వింటూ కూర్చున్నారు. ఇరవై నిమిషాల్లో, కామేశ్వరిగారు వచ్చి కూర్చున్నారు.

"భోజనం చేసేవా"

"ఆ. ఈ రోజు మీరు ‘ అప్పన్న’ ప్రసాదం తేలేదేమిటి ? మరచిపోయారా లేక వీలు పడలేదా ?

-3-

"తేకపోవడేమిటి. రాగానే, నీ చేతిలోనే పెట్టేనుకదా."

"నాకేమీ ఇవ్వలేదే మీరు"

"పిచ్చిదానా. ఆ అబ్బాయి ఎవరనుకున్నావు ?"

"ఎవరు?"

" ‘సింహాద్రి అప్పన్న’ ఈ రోజు మనకిచ్చిన ప్రసాదం. అందుకే, ఇంటికి రాగానే, ముందుగా వాడ్ని నీకు అప్పచెప్పేను."

" ఏమిటో, మీరు చెప్పేది నాకేమీ బోధపడడం లేదు."

" నేను ఈరోజు ఇలా నీ పక్కన కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే ‘అప్పన్న’ ఆశీర్వాదం, ఈ అబ్బాయి చేసిన సహాయం"

" ఏం. మీకేమిటయ్యింది. నా దగ్గర దాచకుండా ఏం జరిగిందో వివరంగా చెప్పండి." అని, మెళ్ళో మంగళసూత్రాలు కళ్ళకి అద్దుకున్నారు. శాస్త్రిగారు ఆ రోజు జరిగిన సంఘటనలు వరుసగా వివరించసాగేరు.

ఆ రోజు సింహాచలం చందనోత్సవం కదా అని, భగవద్దర్శనానికై శాస్త్రిగారు ఉదయం విజయనగరం రైలుస్టేషన్ చేరుకొని, బయలుదేరిన రైలులో, అతికష్టం మీద ఒక కిటికీ దగ్గర ఉన్న సీట్లో, తన కాషాయరంగు సంచీ జాగ్రత్తగా ఒడిలో పెట్టుకొని కూర్చున్నారు. వైశాఖమాసం వేడికి, ఉక్కపోతకి కిటికీలోంచి వచ్చే గాలి కాసింత ఉపశమనం ఇస్తోంది. రైలు సింహాచలం చేరడానికి సుమారుగా ఇరవై నిమిషాలుందనగా, సుమారు ఎనిమిదేళ్ల వయసున్న ఒక అబ్బాయి పెట్టెలో ఉన్న దుమ్ము ధూళి పాత గుడ్డతో తుడుస్తూ రైలులో ఉన్న వాళ్ళ దగ్గర చేయి చాపుతూ అడుక్కుంటున్నాడు. అందరి దగ్గరకి వచ్చినట్లే, ఆ అబ్బాయి శాస్త్రిగారి దగ్గరకి వచ్చేసరికి, కిటికీలోంచి వచ్చే చల్లటి గాలికి కళ్ళు మూసుకున్న ఆయనని చూసి, ఆ కిటికీకి కాస్త దూరంగా చేత్తో గట్టిగా కొట్టి, శాస్త్రిగారిని లేపే ప్రయత్నం చేసి, చేయి చాపి నిలబడ్డాడు. ఉలిక్కిపడి లేచిన శాస్త్రిగారికి, ‘అంటరానివాడు’ గా కనిపిస్తున్న ఆ అబ్బాయి తనని తాకి మైల పరుస్తాడేమో అని చిరాకు వచ్చి, అసహనం అసహ్యం కలగలిపిన చూపుతో, 'అవతలకి ఫో' అన్నట్లుగా చేయి విదిలించేరు. ఇలాంటి తిరస్కారాలకి బాగా అలవాటుపడిన వాడు కాబట్టి, శాస్త్రిగారి పాదాలని చేతితో తాకుతాడేమో అన్నట్టుగా క్రింద చేత్తో తట్టుతూ, మరోసారి చేయి చాపేడు. శాస్త్రిగారికి కోపం వచ్చి, వాడిని 'ఫో' అని కసిరేరు. వాడు మరొకరి దగ్గరకి చేయి చాపడానికి వెళ్ళిపోయాడు.

రైలు సింహాచలం చేరగానే అందరిని రాసుకుంటూ తోసుకుంటూ దిగేసరికి, శాస్త్రిగారికి చెమటలు పట్టేసి చికాకుగా అనిపించింది. విజయనగరం వెళ్ళడానికి సాయంత్రం ఆరు గంటలకి రైలు దొరుకుతుంది అని తెలిసి, తిరుగు ప్రయాణం కోసం టికెట్ కొనేసుకున్నారు.

తాను ఉండడానికి కార్యనిర్వహణాధికారి కొండ మీద ఏర్పాటు చేసి ఉంచిన గది లోనికి పోయి -- స్నానం కానిచ్చి దైవ దర్శనానికి బయలుదేరేరు. వరాహస్వామి ‘నిజరూప’ దర్శనం చేసుకొని బయట పడేసరికి, సూర్యభగవానుడు నడినెత్తిన వెలుగుతున్నాడు.

ప్రసాదం అమ్మే చోటికి వెళ్లి - ఒక పొట్లం పులిహోర, రెండు లాడూలు కొనుక్కొని, గది లోనికి చేరుకున్నారు.

మధ్యాహ్నసంధ్య కావించుకొని, నాలుగు మెతుకులు పులిహోర, ఒక పూస లాడూ నోట్లో వేసుకొని, శివునికి నివేదించిన రెండు అరటిపళ్ళు తిని విశ్రమించేరు. సాయంత్రం అవుతూండగా సాయం సంధ్య, శివ పూజ కావించుకొని, తిరుగు ప్రయాణం కోసం రైలు స్టేషన్ చేరుకొనేసరికి, ‘రైలు అప్పుడే స్టేషన్లోకి వస్తోంది’ అని తెలియచేస్తున్నారు.

రైలు ఎక్కే జనంలో, ఎవరో శాస్త్రిగారిని ఒక్క తోపు వెనక్కి తోసేసేరు. దాంతో, ఆయన చేతిలో ఉన్న సంచీ దూరంగా ఎగిరి పడిపోయింది. ఆయనేమో ప్లాట్ఫారం మీద పడిపోయారు. అలసిన శరీరం, ఉదయం నించీ ఏమీ పెద్దగా తినకపోవడం, ఐదు పదులు దాటిన వయసు, వైశాఖ మాసం వేడి – అన్నీ కలిపి - ఆయన స్పృహ తప్పిపడిపోయారు. జనం ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు.

-4-

కొంతసేపటి తరువాత, మొఖం మీద ఎవరో నీళ్లు చల్లుతున్నట్టుగా అనిపించి, శాస్త్రిగారు కళ్ళు తెరిచేరు. ఎదురుగుండా ఉన్నవాడు – ‘అంటరానివాడు’ గా కనిపించడంతో అసహ్యించుకొని కోపంతో ‘ఫో’ అని, తను కసిరిన – - ఉదయం రైలులో కనిపించిన అబ్బాయి.

మెల్లిగా ఆయన లేస్తుంటే, వాడే చేయూతనిచ్చి ఆయన చేయి పట్టుకొని తీసుకొని వెళ్లి అక్కడ ఉన్న ఒక బెంచీ మీద కూర్చోపెట్టేడు. వాడు తనను లేపుతూంటే -- 'అంటరానితనం' అని ఆలోచించే ‘అజ్ఞానాంధకారం’ లో నించి తనని పైకి లేపుతున్న వామనుడా -- అన్న భావన కలిగింది.

వాడే పరిగెత్తుకుని వెళ్లి, అక్కడికి దగ్గరగా ఉన్న కుళాయిలో ఒక ప్లాస్టిక్ గ్లాస్ తో నీళ్లు పట్టుకొని వచ్చి "ఈ నీళ్లు కొంచెం త్రాగండి బాబుగారూ" అని ఇచ్చేడు. ఒక్కసారిగా ఆయనలో ఏదో తెలియని మార్పు వచ్చి – ఆ అబ్బాయి ఆత్మీయుడనిపించేడు. ఆ నీరు పవిత్ర గంగాజలమనిపించింది.

ఆ క్షణంలో – అలనాడు, ‘కాశీ’ పట్టణంలో, ‘శంకరులకు’ జ్ఞానబోధ చేయడానికి

‘ఛండాలుడు’ రూపంలో వచ్చిన ‘విశ్వేశ్వరుడు’ – శాస్త్రిగారి మనో నేత్రంలో మెదిలి ---

తనకి ‘జ్ఞానోదయం’ కలగడానికి, ‘సింహాద్రి అప్పన్న’ ఈ అబ్బాయిని ఆయన ‘ఆశీర్వాదం’ గా పంపించేడు, అన్న దివ్యమైన అనుభూతి కలిగింది.

“ఇంకొంచెం త్రాగుతారా" అని అడిగేడు ఆ అబ్బాయి.

అక్కరలేదు అని చేయి ఊపి, మెల్లిగా లేచి వెళ్లి, తాను పడిపోయిన చోట అటూ ఇటూ వెతుక్కుంటూంటే -- -

"ఏమిటి వెతుకుతున్నారు బాబుగారూ"

"నా సంచీ ఎక్కడ పడిపోయిందో, కనిపించడంలేదు"

"నేను దాచేను, తెస్తానుండండి" అని అక్కడ ఇడ్లీలు అమ్ముతున్న బండీ కిందనించి "అన్నా, సంచీ తీసుకోపోతున్నాను" అని ఆ బండీ వాడికి చెప్పి – "ఇగో మీ సంచీ. " అని, ఆశ్చర్యపోతున్న శాస్త్రిగారికి ఇచ్చేడు.

దైవ కార్యానికి వినియోగించే ఆ సంచీ, వాడు తీసుకొని వస్తూంటే -

--నదిలో నీళ్లలో తేలుతూ ‘ శ్రీరామ ‘ విగ్రహం తన దగ్గరకే వస్తూంటే, 'ననుపాలింప నడచి వచ్చితివా '

అని పాడుతున్న త్యాగరాజుగారు-- శాస్త్రిగారి మదిలో మెదిలేరు.

తేరుకున్న శాస్త్రిగారు, "ఈ సంచీ నాదని నీకెలా తెలుసు ?"

"మీరు పట్టుకొని ఉండగా పొద్దున్న రైలులో చూసేను. మీరు పడిపోయిన చోటు పడి ఉంటే, ‘ఇడ్లీ అన్న’ దగ్గర దాచేను."

పెన్నిధి దొరికిందన్న ఆనందంతో, ఆ ఆనందానికి వీడే కారణం అన్న కృతజ్ఞతా భావంతో, శాస్త్రిగారు వాడి చేయి పట్టుకొని ఆ బెంచీ మీద తన పక్కన కూర్చోబెట్టుకొని, సంచీలోంచి తీసి వాడికి తన చేత్తో స్వామి ప్రసాదమైన పులిహోర లాడూ తినిపించసాగేరు.

వాడు తన చేత్తో తినే ప్రయత్నం చేయబోతే -- " నేను తినిపిస్తాగా. తొందర లేదు, తాపీగా తిను", అని తినిపించేరు.

వాడికి స్వామి ప్రసాదం తినిపించి – ‘సింహాద్రి అప్పన్న’ తనకు ఇచ్చింది తిరిగి ఆ దేవదేవునికే కైంకర్యం చేసిన అనుభూతిని పొందేరు.

“బాబూ, నీకు అమ్మా నాన్నా ఉన్నారా ?"

"లేరండీ. నాకెవ్వరూ లేరు. అనాధ ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నాను. రోజూ కొడుతుండేవారు. ఒకోసారి తినడానికి ఏమీ ఇచ్చేవారు కాదు. అందుకే, అక్కడనించి తప్పించుకొని వచ్చేసి, మీరు పొద్దున్న చూసినట్టుగా, రైలులో తిరుగుతూ, ‘ఇడ్లీ అన్న’ ఇచ్చేది తిని, రాత్రుళ్ళు ఇక్కడే పడుకుంటాను."

"నాతో విజయనగరం వస్తావా, మా ఇంటికి తీసుకొని వెళ్తాను. నిన్ను చదివిస్తాను."

-5-

"అలాగే."

అంతలో – ‘ప్లాట్ఫారం మీద ఎవరో స్పృహ తప్పి పడిపోయేరు’ -- అని తెలిసిన సింహాచలం స్టేషన్ మాస్టరు చూడడానికి వచ్చి – -- ప్లాట్ఫారం మీద ఉన్నవాళ్లెవరో చెప్తే -- శాస్త్రిగారు కూర్చున్న బెంచీ దగ్గరకి వచ్చి –

"నమస్కారం శాస్త్రిగారు" అని నిలబడ్డారు.

"ఎవరు నాయనా మీరు. నేనెలా తెలుసు మీకు ?"

“విజయనగరంలో మీ ఇంటికి కుడి ప్రక్కన ఆఖరి ఇంట్లో ఉండే సోమేశంగారి పెద్దబ్బాయిని. నేనిక్కడ స్టేషన్ మాస్టరుగా ఉన్నాను.

ఎవరో పడిపోయారు అని తెలిసి వచ్చేను. ఎలా ఉన్నారు. దెబ్బలేమీ తగలలేదు కదా. ఈ పిల్లాడేమిటి మీ ప్రక్కన ? "

"సోమేశంగారి అబ్బాయివా. సంతోషం. నేను బాగానే ఉన్నాను. ఈ పిల్లాడే ఈరోజు నన్ను ఆదుకున్నాడు. ఉదయం వరాహస్వామి దర్శనం కోసం వచ్చేను. ఇప్పుడు వెనక్కి ఇంటికి వెళ్ళాలి "

"మీరు విజయనగరం వెళ్ళడానికి ట్రైన్ రాత్రి 10 గంటలవరకు లేదు. రండి, నాగదిలో కూర్చోండి. మీరు త్వరగా వెళ్ళడానికి ఒక టాక్సీ ఏర్పాటు చేస్తాను.”

"టాక్సీకి బాడుగ ఎంత అవుతుందో, నేను ఎక్కువ డబ్బు తెచ్చుకోలేదు. ఇంటికి చేరిన తరువాత ఇవ్వడం అవుతుందా. "

"నేను ఏర్పాటు చేస్తాను. మా నాన్నగారు ఎంతో, మీరూ అంతే నాకు." అని – శాస్త్రిగారిని, పిల్లాడిని తనగదిలో కూర్చోబెట్టి, కాఫీ ఇప్పించి, టాక్సీ ఏర్పాటుచేసి – "టాక్సీ వాడికి మీరేమీ ఇవ్వక్కరలేదు." అని -- మరీ మరీ చెప్పి, పంపేరు, స్టేషన్ మాస్టారు.

శాస్త్రిగారు అక్కడకి దగ్గరే ఉన్న బట్టల దుకాణంలో అబ్బాయికి రెండు జతల బట్టలు కొని టాక్సీలో ఇంటికి బయలుదేరేరు.

"ఆమ్మో, ఎంత గండం గడిచింది ఈ రోజు. మీరన్నట్టు ఈ అబ్బాయి 'అప్పన్న ఆశీర్వాదమే' “, అని, మెళ్ళో మంగళసూత్రాలు మరోసారి కళ్ళకి అద్దుకున్నారు. “ఇంతకీ, రేపు సిద్ధాంతి గారి దగ్గరికి ఎందుకు ? "

"ఎల్లుండి వైశాఖ శుద్ధ పంచమి, శంకర భగవత్పాదుల జయంతి కదా. ఆ రోజు, ఈ పిల్లాడిని దత్తత తీసుకొని, ఉపనయనం చేద్దామని.”

"ఈ పిల్లాడిని దత్తత తీసుకుంటే, మన పిల్లలు ఏమేనా అనుకుంటారేమో"

"నేను వాళ్లకి బోధపరుస్తాను. నీకేమేనా అభ్యంతరమా"

"భలేవారే. నేనెప్పుడేనా మీ మాట కాదన్నానా. ఎల్లుండే అంటున్నారు. మరి సిద్ధాంతి గారి దగ్గరకి వెళ్లడం ఎందుకు?"

"ఏ సమయంలో జరిపించాలో చెప్తారు ఆయన. శంఖంలో పోస్తేనే కదా తీర్ధం" అని నవ్విన శాస్త్రిగారి నవ్వులో, ఆవిడ జత కలిపేరు.

*****

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి