ఎదర బ్రతుకంతా చిందర వందర - talluri lakshmi

edara brathukanthaa chindara vandara

“ఈ కష్టాలనుంచి ఎప్పటికి విముక్తి లభిస్తుందో ఏమో. పాడు రోగ మాని రోజంతా పనులు చేసుకోలేక చస్తున్నాను. ఒక రోజా రెండు రోజులా, చూస్తుండగానే అప్పుడే ఏడాది దాటి పోయింది పని పిల్ల లేకుండా ” వంటింట్లోనుంచి శకుంతల ఏకధాటిగా స్వగతంలో అవధానం కానిచ్చేస్తోంది.

వాషింగ్ మెషిన్ లో ఉతికిన బట్టల్ని బాల్కనీ లో దండెం మీద ఆరేస్తున్న ప్రకాశరావు భార్య మాటలు వింటూ ఒక నిట్టూర్పు విడిచాడు. ఏమిటో ఈ కరోనా మహమ్మారి కాదు కాని సుఖంగా సాగిపోతున్న జీవితాల్ని అతలాకుతలం చేసేసింది. నలభై ఏళ్ళపాటు నిర్విరామంగా పని చేసి జీవితంలో అన్ని బాధ్యతలను తీర్చేసుకుని ఇక భార్యతో కలిసి శేష జీవితాన్ని ఏ జంజాటం లేకుండా తీర్థయాత్రలూ అవీ చేస్తూ ఆనందంగా, సుఖంగా గడపవచ్చని సంబర పడుతున్న వేళ ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది.

ఎంత ఆనందంగా ఉండేవి ఆ పాత రోజులు. కేవలం ఏడాది క్రితమే అయినా ఎన్నో ఏళ్ళు గడిచిపోయినట్టు అనిపిస్తోంది. ప్రొద్దుటే లేచి కాఫీ త్రాగి శకుంతల, తనూ దగ్గరలోని పార్కుకి వెళ్ళి ఒక గంట వాకింగ్ చేసి వచ్చేవారు. ఇంటికి రాగానే తను ఒక రెండు గంటల పాటు పేపర్ చదవడం. ఈలోగా శకుంతల వంట పనులు కానిచ్చేయడం. టిఫిన్ చేశాక స్నానం చేసేసి, ఎవరైనా తెలిసిన వాళ్లింటికొ, లేదా షాపింగ్ కొ తనూ, శకుంతల వెళ్లడం. భోజనం చేసి ఒక రెండు గంటలు కునుకు తీసి, తిరిగి సాయంత్రం ఏ గుడికో, పురాణ శ్రవణానికో, సాంస్కృతిక కార్యక్రమానికో వెళ్లడం, ఇంటికొచ్చాక కొద్దిసేపు టీవీ లో ఏదైనా మంచి ప్రోగ్రాం చూసి పడుకోవడం. రోజులు ఎంతో సాఫీగా గడిచిపోయేవి.

ప్రతి పండగకి కొడుకుని, కోడలినీ, పిల్లలనీ తమ ఇంటికి పిలవడమో, లేకపోతే తామే వాళ్ళ ఇంటికి వెళ్లడమో చేసేవారు. పిల్లలతో పండగలు ఎంత సరదాగా గడిచి పోయేవి. అలాగే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అందరూ కలిసి ఒక వారం, పది రోజుల పాటు ఏదో ఒక ప్రదేశానికి విహార యాత్రకి వెళ్ళేవారు. ఎంత నూతన ఉత్తేజాన్ని ఇచ్చేవి ఆ పది రోజులు పిల్లలతో గడిపిన అనుభూతులు, మధుర స్మృతులు.

ఎంతో హాయిగా సాగిపోతున్న అటువంటి జీవితంలో బ్రహ్మ రాక్షసిలా ప్రవేశించింది ఈ కరోనా మహమ్మారి. అందరినీ ఇంటి నాలుగు గోడలు దాటకుండా కట్టి పడేసింది. మనిషి మనిషిని చూస్తేనే భయ పడేలా చేసింది. పనిమనిషిని పెట్టుకుందా మంటే ఝడుపు. కూరలు కొనడానికి మార్కెట్ కి వెళ్ళాలంటే దడ. ఎవరితోనైనా కొద్దిసేపు

మాటలాడాలంటే జంకు. కరోనా భూతం పాలిట పడిన వ్యక్తుల హృదయ విదారకమయిన పాట్లు టీవీలో చూస్తుంటే అంతులేని ఆవేదన. మిత్రులు, సన్నిహితులు చెవినేస్తున్న కరోనా కబుర్లు వింటుంటే రాత్రుళ్లు నిద్రలే కరువవుతున్నాయి.

మనవళ్లను, మనవరాళ్లను చూసి ఎన్ని రోజులై పోయింది. బంధువులతో, మిత్రులతో సరదాగా కాలం గడిపి ఎంత కాలమైపోయింది. పెళ్ళిళ్ళు, పార్టీలు, ఇతర శుభకార్యాలకు వెళ్ళి ఎన్ని నెలలై పోయింది. చూస్తుండగానే ఎంతటి ఏకాకి జీవితమై పోయింది. ఇలా ఎంత కాలం గడపగలరు. దీనికి అంతమే లేదా. మరి కొద్ది రోజులిలాగే సాగితే పిచ్చి పట్టేస్తుందేమోనని భయంగా ఉంది. పరి, పరి విధాల సాగుతున్న ప్రకాశరావు ఆలోచనలకు బ్రేక్ వేసింది హాల్లో మ్రోగుతున్న ఫోన్ శబ్దం.

హాల్లో కొచ్చి ఫోన్ తీసి “హల్లో” అన్నాడు. అటునుంచి “హల్లో! నేను బాబాయ్ రాఘవను” అని వినబడింది. రాఘవ ప్రకాశరావు పెద్దన్నయ్య కొడుకు. ప్రకాశరావు కన్నా ఒక ఆరేడేళ్ళు చిన్నవాడు. చిన్నప్పటినుంచీ కలిసిమెలిసి పెరగటం వలన, వయసు తారతమ్యంకూడా తక్కువవటం చేత ప్రకాశరావు, రాఘవల మధ్య బంధుత్వం కన్నా సఖ్యత, అంతకన్నా చనువు బాగా ఎక్కువ. రాఘవ ఎమ్మే మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం చేసి ఒక ప్రసిద్ధ టీవీ ఛానెల్లో డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నాడు. రాఘవ గొంతు వినగానే ప్రకాశరావుకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. శకుంతల కూడా రావడంతో ఫోన్ స్పీకర్ ఆన్ చేసి “ఏరా రాఘవా బాగున్నావా? అమ్మా, నాన్న ఎలాగున్నారు?” అని పలకరించాడు. “మేమందరం కులాసానే. మీరెలాగున్నారు? చాలా రోజులైంది ఫోన్ చేసి” కుశల సమాచారమడిగాడు రాఘవ.

“ఏం చెప్పన్రా రాఘవా. ఎందుకు బతుకుతున్నామో కూడా తెలీకుండా బతుకుతున్నాము. ఒక సరదా లేదూ పాడూ లేదు. ఇంటిలో కదలకుండా కూర్చొని, కూర్చొని విసిగి వేసారి పోతున్నాము. రోజంతా పొద్దుపొడవక టీవీలో వచ్చే పనికిమాలిన సీరియళ్ళు, అడ్డమైన ప్రోగ్రాంలు చూసి, చూసి బుర్రలు కూడా చెత్త కుండీలయిపోతున్నాయి. ఎప్పుడూ పిల్లల అరుపులతో, కేకలతో సందడిగా ఉండే అపార్ట్ మెంట్ కూడా ఖాళీ కారిడార్లతో, భరించలేని నిశ్శబ్దంతో భయపెట్టేస్తోంది. ఒకరింటికి వెళ్ళలేము, ఒకరిని మన ఇంటికి పిలవలేము. పిచ్చెక్కి పోతోందిరా రాఘవా” నిర్వేదంగా అన్నాడు ప్రకాశరావు.

అతని నిస్తేజాన్ని గమనించిన రాఘవ అన్నాడు “జీవితం మరీ అంత బోరుగా ఉందా బాబాయి? ఐతే ఒక పని చెయ్యరాదూ. రేపు నేను ఒక డాక్యుమెంటరీ షూటింగ్ కి సంబంధించిన పనిమీద కొన్ని ప్రదేశాలకు వెళ్ళుతున్నాను. నువ్వు కూడా నాతో రారాదూ. పొద్దుటే వెళ్ళి రాత్రి కల్లా వచ్చేస్తాము.”

ప్రకాశరావు అతనికి సమాధానమిచ్చే లోగా శకుంతల అంది “అదెలాగ కుదురుతుంది రాఘవా. అసలే రోజులు బాగా లేవు. ఈ సమయంలో ఆయన బయటికి ఎలాగ వస్తారు చెప్పు?”

ఆవిడ మాటలు విని నవ్వుతూ అన్నాడు రాఘవ “నీకా భయం అక్కర లేదు పిన్నీ. మీ ఆయన్ను క్షేమంగా ఇంటికి తెచ్చే బాధ్యత నాది. డబుల్ మాస్క్ ధరించి, ఒక శానిటైజర్ బాటిల్, వాటర్ బాటిల్ తనతో తెచ్చుకోమను. మిగతా దంతా నేను చూసుకుంటాను. వాన్ లో బాబాయితో కలిపి నలుగురమే ఉంటాము. బాబాయి అందరికీ ఆమడ దూరంలో ఉండేటట్టు చూస్తాను. అందులోనూ మీరిద్దరూ వాక్సినేషన్ కూడా వేసుకున్నారుగా. అసలు భయపడాల్సిన పనేలేదు. రేపు పొద్దుటే ఎనిమిదికల్లా రెడీగా ఉండు బాబాయి. వచ్చి పికప్ చేసుకుంటా.” ప్రకాశరావుకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు రాఘవ.

అన్నట్టుగానే మర్నాడు సరిగ్గా ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చి ప్రకాశరావును తమ ఇన్నోవాలో ఎక్కించుకున్నాడు రాఘవ. కార్లో రాఘవ కాక మరో ఇద్దరు ఉన్నారు. రాఘవ వాళ్ళని పరిచయం చేశాడు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి రాఘవ అసిస్టెంట్. మరో అతను వీడియోగ్రాఫర్. కారు విశాలంగా ఉందేమో నలుగురూ దూరం, దూరంగా కూచున్నారు.

కార్లో కూర్చొన్నాక రాఘవని అడిగాడు ప్రకాశరావు “ఎక్కడికి మన ప్రయాణం” అని. దానికి రాఘవ “మా టీవీ ఛానల్ కి ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేస్తున్నాను మన సమాజాన్ని, జన జీవనాన్ని ఛిన్నాభిన్నం చేసేస్తున్న ఈ కరోనా దుష్ప్రభావాల మీద . ఆ విషయం మీద సమాచారం సేకరించడానికి ఈ రోజు మనం పలు ప్రదేశాలు సందర్శించి, కొంతమంది వ్యక్తులను ఇంటర్వ్యూ చేయబోతున్నాము” అన్నాడు. “మరి ఇందులో నా పాత్రేమిటి?” అడిగాడు ప్రకాశరావు. “తిరుగు ప్రయాణంలో చెబుతాగా” చిరునవ్వుతో సమాధానమిచ్చాడు రాఘవ.

మొదటగా వాళ్ళ కారు ఊరిలోని ఒక పెద్ద ప్రభుత్వాసుపత్రి దగ్గర ఆగింది. ఆసుపత్రి కాంపౌండ్ అంతా కోవిడ్ పెషెంట్లతో, వారి బంధువులతో కిక్కిరిసి పోయి గందరగోళంగా ఉంది. ఒక ప్రక్క ఏడుపులు, ఆర్తనాదాలతో, మరో ప్రక్క కేకలు, అరుపులతో ఆ ప్రదేశమంతా రణభూమిని తలపిస్తోంది.

రాఘవ బృందం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వారి విషయాలు రాబట్టడం మొదలెట్టారు. ఎవరిని పలకరించినా ఏదో ఒక హృదయ విదారకమైన గాధే. ఒకరి భర్త వెంటిలేటర్ మీద ఉంటే, మరొకరి భార్య అంత్య దిశలో. ఆక్సిజన్ బెడ్ దొరకని ఒక పేషెంట్ కాంపౌండ్ లొనే ఒక చెట్టు క్రింద కూర్చొని ఊపిరి అందక బాధ పడుతుంటే, మరో ప్రక్క రోగిని తీసుకు రావడానికి అంబులెన్స్లు దొరక్క అతని బంధువులు పడుతున్న అగచాట్లు.

బయటి వారి సమాచారం తీసుకోవడమయ్యాక రాఘవ ఆసుపత్రి లోపలికి దారి తీసాడు. ముందే పర్మిషన్ తీసుకున్నటున్నాడు లోపలికి వెళ్ళగానే సూపరింటెండెంట్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇంటర్వ్యూ అయ్యాక ఆసుపత్రి అంతా తిరగనిచ్చి డాక్టర్లు, నర్సులు, ఎటెండర్లు, రోగులతో మాటలాడడానికి అనుమతినిచ్చాడు. వీడియోలో అందరితో ఇంటర్వ్యూలు తీసుకున్నాక సూపరింటెండెంట్ రూంకి తిరిగి వచ్చారు. ఆయనతో కలిసి టీ తీసుకుంటుండగా రాఘవ ఆయన్ని అడిగాడు “సార్! ఇది ఆఫ్-ది-రికార్డు గా అడుగుతున్నాను. మీ అభిప్రాయంలో పరిస్థితి ఎంత సీరియస్ గా ఉంది?”

దానికాయన “రాఘవ గారూ! పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నా రెండు నెలల క్రితంతో పోలిస్తే కొద్దిగా మెరుగైందని చెప్పొచ్చు. ఈ రెండు నెలలలో మేము అనుభవించిన కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రతి డాక్టర్, నర్సు మూడు, నాలుగు షిఫ్టులు వరసగా పని చెయ్యాల్సి రావడం, ఇరవై నాలుగ్గంటలూ పిపియిలు ధరించి యమ యాతన పడడం, బెడ్లు దొరకక, ఆక్సిజన్ దొరక్క, మందులు దొరక్క రోగులు నానా యాతన అనుభవిస్తుంటే నిస్సహాయులుగా మిగిలిపోయి మానసికంగా దుర్బలులవడం... ఈ కొవిడ్ కాదుగానీ సగానికి సగంమంది డాక్టర్లు, నర్సులు దాని బారిన పడిపోయారు. కొంతమంది బలైపోయారు కూడా. ఇంక కోవిడ్ మూడో వేవ్ కూడా వస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొవాలో ఏమో. అంతా అగమ్య గోచరంగా ఉంది” అన్నారు గద్గద స్వరంతో.

ఆయనతో మరికొద్దిసేపు మాట్లాడి సెలవు తీసుకున్నాడు రాఘవ. అందరూ కార్లో బయల్దేరి మరుసటి మజిలీ చేరుకున్నారు. అది దిగువ తరగతి జనం నివసించే ఒక కాలనీ. రాఘవ అక్కడి జనాన్ని ఇంటర్వ్యూ చెయ్యడం మొదలెట్టాడు. ప్రకాశరావు అతని ప్రక్కనే నిలబడి వారు చెబుతున్న దుర్భర అనుభవాలూ, కష్టాలు వినసాగాడు. ఎవరిని కదిపినా ఆరోగ్య సమస్యలు లేదా ఆర్ధిక సమస్యలే. బిజినెస్ లేక ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, టిఫిన్ సెంటర్లు నడుపుకునేవాళ్ళు, కూరలమ్ముకునేవాళ్లు, ప్లంబర్లు, వడ్రంగులు, కూలీ పని చేసేవారు ఒకరేమిటి అందరూ ఈ కరోనా ధర్మమా అని దిన భత్యాలు కూడా సంపాదించుకోలేక ఒక పూట గడవడమే కనా కష్టంగా ఉన్న దుస్థితికి వచ్చారు. ఆకలితో అలమటిస్తున్న కుటుంబసభ్యుల బాధలు చూడలేక, జీవనయానం చేయలేక వారనుభవిస్తున్న నరకయాతన వర్ణనాతీతం.

ఆ కాలనీ వారితో మాటలాడడం అయిపోయాక మధ్య తరగతివారు నివసించే మరో కాలనీకి తీసుకు వెళ్ళాడు రాఘవ. ఈ కాలనీ ప్రెసిడెంటు నాకు తెలిసినవాడే అని అతనింటికి తీసుకు వెళ్ళాడు. కాలనీ ప్రెసిడెంట్ ముందుగా వాళ్ళని ఒకింటికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్దాయన విచారంగా కూర్చొని ఉన్నాడు. పరిచయాలై పోయాక రాఘవ ఆయన్ని ఇంటర్వ్యూ చెయ్యడం మొదలెట్టాడు. ఆ పెద్దాయన “ఏం చెప్పను బాబూ! చెట్టాపట్టాలేసుకుని తిరుగు తుండే నా కొడుకు, కోడళ్ళను ఈ మహమ్మారి ఒకే రోజున పొట్టనబెట్టుకుని అన్నెం,పున్నెం తెలియని నా మనవడు, మనవరాళ్లను అనాథలను చేసేసింది. కాటికి కాచుకుని ఉన్న నేను కూడా రేపు పోతే ఈ పసివాళ్లకు దిక్కెవరు బాబూ. నిన్నమొన్నటి దాకా స్వర్గధామంలాగా ఉన్న నా ఇల్లు చూడు ఇప్పుడు ఎలాగ అయిపోయిందో” అంటూ బావురుమన్నాడు. తల్లీ, తండ్రీ ఇక లేరన్న సంగతి తెలియని ఇద్దరు పసికందులు ఒక మూల ఆడుకుంటున్నారు అమాయకంగా. వాళ్ళని చూసి అందరి మనసులు కన్నీళ్లు కార్చాయి.

కాలనీ ప్రెసిడెంట్ మరో ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మరో విషాద గాధ. వయసు మీరిన తల్లీ, తండ్రీ ఇద్దరూ కరోనా బారిన పడి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నెల రోజులనుంచీ చికిత్స పొందుతూంటే వారి వైద్యానికి ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి అప్పటికే యాభై లక్షల దాకా ఖర్చు పెట్టిన ఒక చిరుద్యోగి వారి వైద్యానికి మరెంత ఖర్చవుతుందో, ఎక్కడనుంచి తేవాలో, అంతా చేసి వారు కోలుకుంటారో లేదో తెలియక సతమతమవుతూ ఉంటే అతను పడుతున్న బాధ చూసి అందరి కళ్ళూ చెమర్చాయి.

తరువాత కాలనీ ప్రెసిడెంట్ మరో అయిదారిళ్ళకి తీసుకు వెళ్ళాడు. ఏ ఇంటికి వెళ్ళినా కరోనా విలయ తాండవంతో చిందర వందర అయిన బ్రతుకులే. జీవనోపాధిని కోల్పోయిన వారు కొందరైతే , అయినవారినీ సమస్తాన్నీ కోల్పోయి ఎదురుగా నిలబడిన అంధకారమైన భవిష్యతు చూసి భయబ్రాంతు లవుతున్నవారు మరికొందరు.

ఆ కాలనీలో తిరగడం అయిపోయాక రాఘవ ఆ రాత్రివరకు ఎక్కడెక్కడో తిప్పాడు, ఎందరెందరినో ఇంటర్వ్యూ చేశాడు. చిత్ర పరిశ్రమలోని కార్మికులను, బట్టల షాపులు, సూపర్ బజార్లలో పనిచేసేవారిని, గృహ నిర్మాణ కార్మికులని, హోటళ్ళలో పనిచేసేవారిని, తోపుడు బండ్ల వారిని, ఫ్యాక్టరీలలో పనిచేసేవారిని, పరాయి రాష్ట్రాలలో ఉపాధి కోల్పోయి సొంత ఊర్లకు తిరిగొచ్చిన వలస ప్రజలను ..... ఎవరిని కదిపినా ఒకటే మాట పనికి వెళ్ళాలంటే దిన, దిన గండం, వెళ్ళకపోతే పూట గడవదు. వైరస్ వలన, లాక్ డౌన్ల వలన ఉపాధి కోల్పోయిన వారు, ఆత్మీయులను పెద్ద దిక్కులను కోల్పోయిన వారెందరో. వారి కన్నీటి గాధలు వింటూంటే అందరికీ గుండెలు తరుక్కుపోయాయి.

ఒక ప్రక్క ప్రభుత్వాలు ఆర్దికానికి, ఆరోగ్యానికి మధ్య సమతూల్యం సాధించడానికి ప్రయత్నిస్తూంటే, మరో ప్రక్క సమాజంలోని చీడ పురుగులు ఈ సంక్లిష్ట పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని, లేని కొరతలు స్ప్రుష్టించి డబ్బు చేసుకొందామని చూస్తున్నాయి. ఇన్ని అవాంతరాలలో కూడా మనిషిలోని మానవత్వం ఇంకా ఎంతో కొంత సజీవంగానే ఉన్నదని నిరూపిస్తున్నాయి ఎన్నో సామాజిక సంస్థల, ఎందరో దాతల వితరణ కార్యక్రమాలు. ఆర్తులకు తమ అన్నదానాల ద్వారా, విరాళాల ద్వారా, మరెన్నో సహాయక చర్యల ద్వారా అవిరామంగా వారు అందిస్తున్న సేవలు అత్యంత శ్లాఘనీయం.

రోజంతా విరామం లేకుండా తిరిగి రాత్రి పదింటికి తిరుగు ప్రయాణం అయ్యారు రాఘవ బృందం. రోజంతా తారస పడిన మనసు కలచివేసే యద్ధార్ధ కన్నీటి గాధలు అందరి హృదయాలను ఎంతో కుదిపి వేశాయి. కారులో అందరూ నిశ్శబ్దంగా కూచున్నారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగాడు రాఘవ “ప్రొద్దుటి నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా బాబాయి” అని.

“ఔన్రా రాఘవా. మీతో నన్నెందుకు రమ్మన్నావో బాగా అవగతమయింది. పొట్టలో చల్ల కదలకుండా కూర్చొనే అదృష్టం ఆ భగవంతుడు ప్రసాదిస్తే, లేని పోని కష్టాలు ఊహించుకుంటూ, ఏదో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాని తెగ బాధ పడిపోతున్న నాలాంటి అవివేకికి అసలు సిసలైన కష్టాలేమిటో తెలిసొచ్చేలా చేశావు. ఈ మహామ్మరితో అనుక్షణం అంతులేని పోరాటం చేస్తున్న ధీరులు, బ్రతుకు తెరువు కోసం అల్లల్లాడిపోతున్న దీనులు పడుతున్న అగచాట్లు చూసి ఇంటిలో కూర్చోవడమే కష్టంగా భావించే నాలాంటి అజ్ఞానులు తలదించుకోవాలి. టీవీల్లోనూ, న్యూస్ పేపర్లలోనూ ఈ విషాద వార్తలు రోజూ చూస్తున్నా అవేవి మనకు పట్టవన్నట్టు భావించే నాలాంటి వాడికి ప్రత్యక్షంగా చూపించి కనువిప్పు కలిగించావు. ఇక మీదట నా ఆలోచనా సరళిని మార్చుకోవడమే కాదు, నాలాంటి వారందరికీ స్పష్టంగా తెలిసేలా తెలియ పరుస్తాను వారు ఎంతటి అదృష్టవంతులో“ మనస్ఫూర్తిగా అన్నాడు ప్రకాశరావు.

ఒక చిన్న మందహాసం చేస్తూ తల పంకించాడు రాఘవ.

****

మరిన్ని కథలు

Kaliyuga yakshudlu
కలియుగ యక్షుడు
- దినవహి సత్యవతి
Maangalyam tantunaa
మాంగళ్యంతంతునా...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Aavakaya prahasanam
ఆవకాయ ప్రహసనం
- జీడిగుంట నరసింహ మూర్తి
Apaardham
అపార్థం
- బామాశ్రీ
Nijamaina ratnam
నిజమైన రత్నం
- బోగా పురుషోత్తం.
Snehamante Ide
స్నేహమంటే ఇదే
- కందర్ప మూర్తి
Andamaina muddu
అందమైన ముద్దు
- వారణాసి భానుమూర్తి రావు