నిముషం కథలు - పున్నమరాజు ఉమామహేశ్వరరావు

నిముషం కథలు

1.బుట్ట భోజనం

“ఎనిమిదయ్యిపోయింది కదా..ఇప్పుడు ఇంకేం వండుకుంటాం గానీ బాబాయ్ హోటల్ నుంచి బుట్ట భోజనం తెప్పించేసుకుందాం..మన ముగ్గురికీ సరిగ్గా సరిపోతుంది” అన్నాన్నేను. అరగంటలో జోమేటో లో డెలివరీ వచ్చేసింది. రూమ్ మేట్స్ ముగ్గురం సరిగ్గా భోజనానికి కూర్చునేసరికి, మా ఫ్రెండ్ వచ్చాడు చెప్పా పెట్టకుండా. “మాతో భోజనం చేసేయ్యరా” అంటే వెంట సరే అన్నాడు, ఆకలిమీద ఉన్నాడేమో పాపం. నలుగురం ఆచి, తూచి తినేశాం, బ్రేవున తేన్చేసాం కూడా! అన్నం, కూర, పులుసు , పెరుగు అన్నీ మిగిలిపోయాయి.

2.పరనింద్

సడన్ బ్రేక్ వేసి , విసురుగా కార్ డోర్ తీసి దిగాడు పరనింద్. కార్ దాటి సైకిల్ మీద వెళ్తున్న వాణ్ని ఆపి “ఏం కనబడ్డంలేదా .. అడ్డంగా సైకిల్ వేసుకుని వచ్చేసావ్.. ఆగలేవా..ఏమైనా కొంచం తగిలితే ఆగం ఆగం చేసేస్తారు” అని గయ్యిమని లేచాడు పరనింద్.

***

ఎదురుగుండా వస్తున్న కారును చూసీ ఆగకుండా అడ్డంగా రోడ్డు దాటి, పక్కనే సైకిల్ ఆపి , గబా గబా కార్ దగ్గరికి వెళ్ళాడు పరనింద్. “ఏం కనబడ్డంలేదా...ఏంటి అంత స్పీడు .. ఆగలేవా..ఏమైనా తగిలితే ఆగం ఆగం చేసేస్తారు” అని కార్ డ్రైవర్ మీద గయ్యిమని లేచాడు.

౩.ప్రేమ ప్యాకేజి

‘మీ అమ్మాయి ప్రీతి అంటే నాకు ఇష్టం, హైస్కూల్ రోజులనుంచీ ప్రేమిస్తున్నాను, ప్రీతి నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ స్థిరంగా చెప్పాడు ప్రణయ్. ‘నీ ప్యాకేజీ ఎంత బాబూ’ అడిగింది ప్రీతి తల్లి. ‘వచ్చే నెల నుంచి సంవత్సరానికి 15 లక్షలు పైమాటే’ అన్నాడు ప్రణయ్. ‘మా అమ్మాయికి 12 లక్షలు ఇప్పుడే వస్తోంది’ అంది ప్రీతి తల్లి. ‘అది కలుపుకునే చెప్పాను అత్తయ్యా’ అన్నాడు నెమ్మదిగా ప్రణయ్.

4.అమ్మ తిట్టింది

కాలేజి నుంచి వస్తూ వర్షంలో తడిసి వచ్చాను ఇంట్లోకి. గొడుగు పట్టుకెళ్ళలేదని నాన్న, ఆగకుండా వచ్చేసానని అక్క విసురుతున్న తిట్ల తుంపర్లు ఇంకా నన్ను తడుపుతూనే ఉన్నాయి. వంటింట్లోంచి పరుగు పరుగున వచ్చిన అమ్మ కూడా తిడుతోంది, కొంగుతో నా తల గబ గబా తుడుస్తూ.. నన్ను కాదు, వానని. రోజూ వాన వస్తే ఎంత బావుణ్ణు!

5.కాఫీ

బ్రష్ చేసుకుని హాల్లో సోఫాలో కూర్చున్నాను. కమ్మటి కాఫీ వాసన వస్తోంది వంటింట్లోంచి. ‘ఏమోయ్ కాఫీ వాసన బావుంది’ అన్నాను గట్టిగా ఆమెకు వినపడేలా. ‘ఆ....ఇక్కడే.. కప్పులో పోసి ఉంచాను’ సమాధానం వచ్చింది వెంఠనే. లేచి అడుగులు వేసాను వంటింటి వైపు , నిన్ననే రిటైర్ అయిన విషయం గుర్తొచ్చి!

6.ప్రభుదాసు

“మీరు కంపెనీ ఎండీ.. మీరు ఎవరికీ ప్రమోషన్ ఇచ్చినా ఎవ్వరూ అడిగేవాళ్ళు లేరు.. ఆ ప్రభుదాసు మీకు ఆఫీసులోనూ నమ్మకస్తుడు, మీరు చెప్పిన అన్ని పనులూ చేస్తాడు. మన ఇంట్లో కూరలు తేవడం దగ్గర్నుంచీ, పిల్లల్ని స్కూల్లో దింపడం.. సినిమాలకి తీసుకు వెళ్ళడం.. కార్ డ్రైవింగ్.. అన్నీ చేస్తున్నాడు కదా పాపం .. అతన్ని వదిలేసి జగన్నాథానికి ప్రమోషన్ ఇచ్చారుట..ఇదేం అన్యాయం అండీ” నిలదీసింది ఎం డీ గారి భార్య.

“నీకు అంతే తెలుసు. ప్రభుదాసు కి ప్రమోషన్ వస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది. నీకు ఇంకో ప్రభుదాస్ ఎక్కడ దొరుకుతాడు?” చిద్విలాసంగా నవ్వుతూ చెప్పారు ఎం డీ గారు.

మరిన్ని కథలు

Kaliyuga yakshudlu
కలియుగ యక్షుడు
- దినవహి సత్యవతి
Maangalyam tantunaa
మాంగళ్యంతంతునా...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Aavakaya prahasanam
ఆవకాయ ప్రహసనం
- జీడిగుంట నరసింహ మూర్తి
Apaardham
అపార్థం
- బామాశ్రీ
Nijamaina ratnam
నిజమైన రత్నం
- బోగా పురుషోత్తం.
Snehamante Ide
స్నేహమంటే ఇదే
- కందర్ప మూర్తి
Andamaina muddu
అందమైన ముద్దు
- వారణాసి భానుమూర్తి రావు