ఏకవీర - ఉషా కుమారి

Ekaveera

'శ్రీ మహేశ్వర ఇంజనీరింగ్ కళాశాల', పెద్ద కళాశాల కావడంతో సందడి కుడా ఎక్కువే. అది ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కావడంతో హడావుడి మరింత ఎక్కువగా ఉంది. అందరూ కొత్త వారే కావడంతో కొంత మంది కంగారుగా, మరి కొంత మంది సరదాగా, మరి కొందరు క్రమశిక్షణగాను కనిపిస్తున్నారు. లెక్చరర్ రావడంతో సైలెంట్ అయ్యారు అందరూ. "మనము ముందుగా పరిచయాలు చేసుకుందాము. అందరూ వచ్చి మీ పేర్లు చెప్పండి", అన్నాడు లెక్చరర్. అందరూ పరిచయం చేసుకుంటున్నారు. "నా పేరు నిరంజన్. ప్రముఖ పారిశ్రామికవేత్త ధనుంజయ్ గారి అబ్బాయిని ", గర్వంగా చెప్పాడు. "అబ్బో! సౌండ్ పార్టీనే", వెనుక నుంచి ఎవరో అన్నారు. "నా పేరు రవి. మా తల్లిదండ్రుల టీచర్స్". "పండిత పుత్ర పరమ శుంఠ…", కీచుగా అన్నారు వెనుక నుంచి. "వ్యాపారవేత్త ధనుష్కోటిగారి అబ్బాయిని. నా పేరు జితేంద్ర." " వీడు మరింత సౌండ్ పార్టీ", వెనుక నుంచి కామెంట్స్. "థాంక్స్", వెనక్కి తిరిగి అన్నాడు జితేంద్ర గర్వంగా. "నా పేరు పాపారావు." "పాపా ...రావు పాపా ...రావు", అని కోరస్ గా అరిచారు. "ఆపండి!", గట్టిగా వినపడ్డంతో అటుకేసి చూసారు అంతా. కొద్దిగా వెలిసిన చొక్కా-ఫాంట్ తో చాలా సింపుల్ గా వున్నాడు. "ఇతని తాతగారు గొప్ప సంఘసంస్కర్త. ఎంతో మంది అనాథలను, అభ్యాగ్యులను ఆదుకున్నారు. ఆయన పేరు తలచుకొని ఎంతో మంది ఇంటిలో దీపం వెలిగించుకుంటారు. అంతటి గొప్ప వ్యక్తి పేరు పాపారావు. ఆ పేరు పెట్టారు. పెద్దల పేర్లు గౌరవించడము తెలుసుకొండి. మరో విషయం ఇతని తాతగారికి 'పద్మవిభూషణ్' అవార్డు వచ్చింది. అది ఈ రోజు పేపర్లో వచ్చింది", అన్నాడు. "అవునా! నాకు తెలియనే లేదు", సంతోషంగా అన్నాడు పాపారావు. "ఇంతకీ నీ పేరేంటి?" లెక్చరర్ అడిగాడు. "నా పేరు ఏకవీర. మాది ఈ సమీపంలో అడవివరం గ్రామం." "మీ నాన్నగారు ఏం చేస్తారు?" అడిగాడు జితేంద్ర. "బిజినెస్ మేన్", క్యాజువల్ గా అన్నాడు ఏకవీర. "ఏకవీర అదేం పేరు?" వెనకనుంచి ఎవరో కామెంట్ చేశారు. "మా నాన్న కి ఏకవీర సినిమా చాలా ఇష్టం. అందుకే నాకు ఆ పేరు పెట్టాడు", నవ్వుతూ అన్నాడు ఏకవీర. "అంత చిన్న గ్రామంలో చేసే బిజినెస్ ఏముంటుంది?", వెటకారంగా అన్నాడు జితేంద్ర. "మా నాన్న చెప్పులు కుట్టి అమ్ముతాడు, ఎవరికైనా చెప్పులు తెగిపోయే కుట్టి పెడతాడు." "ఓ ఐతే మీ నాన్న చెప్పులు కుట్టెవాడా!... మరి బిజినెస్ మేన్ అన్నావ్", ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు జితేంద్ర. "మరి మీ నాన్న ఏం చేస్తాడు - మా నాన్న లాంటి వాళ్ళు కుట్టిన చెప్పులు ఓ పెద్ద షోరూంలో పెట్టి అమ్ముతాడు. ఎవరు చేసినా చేసే పనిలో పెద్ద తేడా ఏమీ కనిపించడంలేదు నాకు. పెద్ద షోరూంలో చెప్పులు అమ్మితే బిజినెస్ మేన్, చెట్టునీడలో చెప్పులు తయ్యారు చేసి అమ్మితే చెప్పులు కుట్టేవాడూ ఐపోతారా?" వ్యంగ్యంగా అన్నాడు ఏకవీర. "అడవి కూనా నీకు వందనం", వెనకనించి వినపడింది. ఏకవీర అందంగా నవ్వాడు. ఆ రోజంతా అల అల గడిచిపోయింది. పదిహేను రోజులు గడిచాయి, నెమ్మదిగా అందరూ అలవాటు పడుతున్నారు. ఏకవీర పెద్దగా ఎవరితోనూ పరిచయం పెంచుకోలేదు. అలా కూర్చుని లెక్చరర్ చెప్పింది వినడం, రాసుకోవడం అంతే! ఒక రోజు లెక్చరర్ రాక ముందే అక్కడ మేకులు వేశారు, ఈ విషయం తెలియక లెక్చర్ ఇస్తూ ఇటు అటు తిరుగుతున్నప్పుడు ఆయన చెప్పు తెగిపోయింది. ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అక్కడ చెప్పులు అల వదిలివేయలేడు, అలాగని చెప్పులు లేకుండా నడవలేడు. కొత్త చెప్పులు వదిలేస్తే ఈ కోతి మూక వాటి పని పడతారు. అలా ఆలోచిస్తున్న ఆయన్ని చూసి, "ఒక్క ఐదు నిమిషాలు మీరు ఆగండి సార్, నేను సెట్ చేస్తాను", అంటూ బ్యాగులో నుండి సూది దారం తీసి నిమిషాలలో చక్కగా కుట్టు కనపడకుండా కుట్టేసాడు. "థాంక్యూ వీర! ఎక్కడ నేర్చుకున్నావ్ ఇంత చక్కగా కుట్టడం?" మెచ్చుకోలుగా అన్నాడు. "మా నాన్న చెప్పులు కుడతాడు సార్. నేను మా నాన్న కూడా ఉంటాను కనుక నాకా విద్య బాగానే పట్టుపడింది", నవ్వుతూ అన్నాడు. "ఓహ్! వెరీ గుడ్", అంటూ భుజం తట్టాడు. బెల్ మోగడంతో లెక్చరర్ బయటకి నడిచాడు. ఏకవీర కూడా బయటకు వెళ్ళిపోయాడు. ఐదు నిమిషాల పాటు నిశబ్ధంగా ఉన్న క్లాస్ రూమ్ ఒక్కసారిగా నిద్ర లేచినట్లు అయ్యింది. "అరే… వీడికి గర్వమే లేదు." "వీడికి ఈగో లేదు." "వీడు సామాన్యుడా? అసామాన్యుడు?" రకరకాల కామెంట్స్ పాస్ చేస్తున్నారు. ఒక రకంగా ఎవరూ జీర్ణించుకోలేకపోతన్నారు. స్టూడెంట్స్ అంటే బైకులు, కార్లు, ఇంకా అవసరమైతే పార్టీలు, పబ్బులు ఇంతే. మరి ఏకవీర ఇలా ఎలా? *** కోట్లకథిపతి రఘురామ్ కూతురు రాగిణి. ఆమె కాలు కింద పెట్టకుండా పెరిగింది. అందుకే కొద్దిగా గర్వం కూడా ఎక్కువే. ఆమె కోరే వింత కోరికలు తీర్చడం రఘురామ్ కి తలకు మించిన పని. అయిన ఎప్పుడూ కాదనకుండా తీర్చేవాడు. ఆమె చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఆమె ఏమంటే అదే అనేవారు. ఆమెని ఎవరూ ఎదిరించే వారు కాదు. రాగిణి కూడా అదే కాలేజీ లో చదువుతోంది. ఆమెకి ఏకవీర ని చూస్తే తమాషాగా అనిపించింది. కాలికి ఉన్న చెప్పులు తీసి దాని తాళ్ళు కట్ చేసింది. వెళ్తున్న ఏకవీర ముందు నిలబడి, "ఈ చెప్పులు కుట్టి పెట్టు. అలా కుట్టినందుకు నీకు పదివేలు ఇస్తాను." చెప్పులు విలాసంగా ఒక చేత్తో ఊపుతూ రెండో చేత్తో పదివేలు పట్టుకుని ఊపుతూ నిలబడింది. "మీరు అటుకేసి నేరుగా వెళ్లి ఎడమ వైపు తిరగండి. అక్కడ ఒక పెద్ద వేపచెట్టు ఉంటుంది, దాని నీడలో ఒక పెద్దాయన చెప్పులు కుడుతూ ఉంటాడు. పేరు తిరుపతి. మీరు పదివేలు ఇవ్వనవసరం లేదు, ఇరవై రూపాయలు ఇస్తే చాలు. చక్కగా కుట్టి పెడతాడు", అంటూ ముందుకి కదలబోయాడు. "ఆగు! సార్ కు చెప్పు తెగిపోతే వెంటనే కుట్టి పెట్టావు. నేను అడిగితే కాదు అంటావెం?" కోపంతో ఆమె మొహం ఎర్రబడింది. "ఆయనది అవసరం, నీది అహంకారం. రెండిటికీ ఎంతో తేడా ఉంది. నేను నిన్ను మీరు అని మన్నిస్తే, నువ్వు నన్ను నువ్వు అంటున్నావు. నీ మాటలలోనీ అహంకారం నీ సంస్కారహీనతను తెలియచేస్తోంది", చెప్తూనే ముందుకు కదిలాడు ఏకవీర. చెంప చెళ్లుమనిపించినట్లు అనిపించింది. ఆమె ఎవరి చేతా ఇంత మాట అనిపించుకుని ఎరగదు. ఆమె ఏమన్నా అందరూ అవుననే అనేవారు. ఆమె కోపంగా ముందుకు కదిలింది. *** ఉదయం ఏ నాలుగు గంటలకో లేచి పుస్తకాలు ముందు వేసుకొని కూర్చొని ఐదున్నర అయ్యేసరికి జాగింగ్ కి వెళ్లి, ఆరు అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తాడు ఏకవీర. స్నానం చేసి రెండు పూటలకి సరిపడా అన్నం వండుకుంటాడు. ఏదోక కూర లేకపోతే సాంబారు చేసుకుంటాడు. ఒక గిన్నె నిండా రాగిజావ కలిపి కొంత తాగి మిగతాది ఫ్లాస్కు లో పోసి ఉంచుతాడు. మరి మళ్ళీ స్టౌ వెలిగించడు. మూడు అంతస్తుల భవనం అది. దాని పైన చిన్న రేకుల షెడ్డు. అదే ఏకవీర నివాసం. రెంటు రెండు వందలు. ఖాళీగా ఉన్న షెడ్డు వల్ల రెండు వందలు వస్తుందని ఏకవీర కి ఇచ్చాడు ఇంటి ఓనరు అప్పారావు. అదే మహాభాగ్యం అనిపించింది ఏకవీర కి. "వంట అయ్యిందా! వీరా!", అంటూ వచ్చాడు అప్పారావు. "ఇప్పుడే అయ్యింది సార్. వేడిగా రాగిజావ తాగుతారా", అంటూ గ్లాసులో పోసి అందించాడు. "ఓహ్! అప్పుడే రెడీ చేశావా!", అంటూ గ్లాసు అందుకున్నాడు. మజ్జిగ, ఉప్పు కలిపి వీర ఇచ్చే రాగిజావ అంటే ఎంతో ఇష్టం అప్పారావు కి. ఇద్దరూ జావ తాగుతూ ఏదో పిచ్చాపాటీగా మాట్లాడుకున్నారు. అరగంట తరువాత, "ఇక వస్తానోయి!", అంటూ బయటకి నడిచాడు. టైం ఎనిమిది అయ్యింది. తొమ్మిది వరకు చదువుకుని, అప్పుడు అన్నం తిని, ఒక బాటిల్ లో నీళ్ళు, ఒక బాటిల్ లో పల్చటి మజ్జిగ పోసుకొని బ్యాగులో పెట్టుకొని బయటకు నడిచాడు. మధ్యానమ్ అందరూ క్యాంటీన్ కు వెళ్తే వీర మాత్రం మజ్జిగ తాగి ఏ చెట్టు కిందో కూర్చుని చదువుకుంటూ ఉంటాడు. నాలుగున్నర కు ఇంటికి వచ్చి ఉదయం వండుకున్న అన్నం కూర తింటాడు. అక్కడతో ఆ రోజు భోజనం అయినట్లే. సాయంత్రం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో ఇన్స్ట్రక్టర్ గా పని చేస్తాడు. పార్ట్ టైం జాబు కావడంతో వాళ్ళు మూడు వేలు ఇస్తారు. చాలా జాగ్రత్తగా వాడుకుని పదిహేను వందలు బ్యాంకులో వేస్తున్నాడు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు తెప్పించిన టీ తాగుతాడు. ఇంటికి వచ్చేసరికి పదిన్నర అవుతుంది. ఉదయం మిగిలిన రాగిజావ తాగి, చాలా సేపు చదువుకుంటూ ఎప్పటికో నిద్ర పోతాడు.అతడి జీవితం ఎంతో క్రిటికల్ గా ఉంటుంది. దానికి అతడు ఎప్పుడూ చింతించలేదు. *** రాగిణి కి వీరా ఆత్మాభిమానం ఎంతో నచ్చింది. అందుకే ఏకవీర ఇంటికి వెళ్ళింది. బట్టలు ఉత్తుకుంటున్న ఏకవీర అలికిడికి తలెత్తి చూశాడు. "మీరా!", ఆశ్చర్యంగా అన్నాడు. "అవును, కాలేజీలో నా ప్రవర్తన సరిగ్గా లేదని గ్రహించాను. సారీ చెప్దామని వచ్చాను. దయచేసి క్షమించండి", అంది రాగిణి. "పర్వాలేదు లెండి. అలా గట్టు మీద కూర్చోండి. నా రూంలో కుర్చీలు ఏమీ లేవు", అంటూ చేతులు కడుక్కుని తను కూడా ఒక గట్టు మీద కూర్చున్నాడు. "నాకు ఈ లెసన్ అర్థం కాలేదు. మీరు వివరించగలరా?", అంటూ బుక్ లో ఉన్న లెసన్ చూపించింది. అతడు అరగంట పాటు అనర్గళంగా చెప్పాడు. "నాకు లెక్చరర్ చెప్పిన దాని కన్నా మీరు చెప్పాకనే ఈ లెసన్ అర్థం అయ్యింది", నవ్వుతూ అంది. "కాని నేను ఆయన చెప్పింది అర్థం చేసుకుని మాత్రమే ఈ మాత్రం అయిన చెప్పగలిగాను", అన్నాడు. "సరే, నేను వస్తాను", అంటూ కిందకి వెళ్ళింది రాగిణి. కొన్ని రోజులు సాఫీగా గడిచాయి. హౌస్ ఓనరు కొడుకు, సత్యమూర్తి కూడా ఏకవీర కి బాగా దగ్గరయ్యాడు. అతడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. అతడిని అడిగి తన డౌట్స్ క్లియర్ చేసుకుని కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. *** ఆ రోజు ఆదివారం కావడంతో కొంచెం నెమ్మదిగా పనులు పూర్తి చేసుకుని, చదువుకుంటూ కూర్చున్నాడు. "హలో వీరా! అ యామ్ రఘురామ్", అనడంతో తలపైకెత్తి చూశాడు. "హలో సార్, మీరూ… , రాగిణి వాళ్ళ నాన్నగారు కదా", ఆశ్చర్యంగా అన్నాడు ఏకవీర. "అవును, అందుకే ఇక్కడికి రావాల్సివచ్చింది", గంభీరంగా అన్నాడు. "అలా కూర్చోండి సార్", అన్నాడు ఒక గట్టు చూపించి. అతడికి కూర్చోవడం ఇష్టం లేదు, కానీ కూర్చున్నాడు. అతడు ఎందుకో కోపంగా ఉన్నాడని వీరా కి అనిపించింది. "నేను సూటిగా విషయానికి వస్తాను. మా రాగిణిని నేను ఎంతో అపురూపంగా పెంచాను. ఆమె నన్ను చాలా వింత కోరికలు కోరుతుంది. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆమె నీ పేదరికాన్ని ఇష్టపడుతోంది. నన్ను నీ లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుందో తెలుసుకుని రమ్మని పంపింది. అది నాకు పెద్ద సమస్య కాదు. నా అనుచరులు సమాచారం అంతా సేకరించారు", అంటూ ఆగడు. "మరింక సమస్య ఏముంది, అదే ఆమెకు చెప్పవలసింది", అన్నాడు వీర. "ఇప్పుడు నన్ను వేధిస్తున్న సమస్య మరొకటి…" అంటూ మాటల కోసం తడుముకుంటున్నాడు . "నాకు మీ సమస్య అర్థం అయ్యింది", అతడి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. "మరి పరిష్కారం?" "ఉంటుంది." "నా సమస్య ఏమిటి?" "ఆమె నా పేదరికంతో పాటు నన్ను కూడా ఇష్టపడుతుందేమో అని మీరు భయపడుతున్నారు." "అవును. ఆమె ఎప్పుడూ ఆ మాట అంటుందో అని నేను భయపడుతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే నాలా మాట్లాడేవారు ఎవరూ ఉండరు అనుకుంటా", దీనంగా అన్నాడు. "ఒక్క నిమిషం", అంటూ లోపలికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని వచ్చి చూపించాడు వీర. "ఈమె మా ఊరిలో మా ఇంటి పక్కన ఉంటుంది. నా చిన్నప్పుడే మా ఇద్దరికి వివాహం చెద్దామని నిశ్చయించుకున్నారు. నేను ఆమెను మాత్రమే చేసుకుంటాను", అన్నాడు. చక్కగా, ముచ్చటగా ఉన్న ఆమె ఫోటో చూసి, తిరిగిస్తూ, "ఇప్పుడు నా భయం నీ గురించి కాదు, నా కూతురు గురించి", అన్నాడు రఘురామ్. "మీ భయాన్ని నేను పోగొడతాను. మీరు మీ అమ్మాయికి ఫోను చేయండి." "కాని దానివల్ల ఏమైనా సమస్య వస్తుందేమో." "ఏమీ రాదు, నేను చూసుకుంటాను." "సరే", అంటూ డయిల్ చేశాడు. "నేనమ్మా రాగిణి, ఇక్కడ ఏకవీర ఇంటి దగ్గర ఉన్నాను. తను నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. " "ఇవ్వండి నాన్న." ఏకవీర స్పీకర్ ఆన్ చేశాడు. "హలో రాగిణి! ఎలా ఉన్నారు." "బాగానే ఉన్నాను. మా నాన్న అక్కడికి రావడం మీకు ఇబ్బందిగా ఉందా?" "లేదు, పైగా నేను ఎంతో సంతోషిస్తున్నాను కూడా. నా పేదరికాన్ని మీరు ఎంతగానో ఇష్పడుతున్నారు అని తెలిసి మరింత సంతోషిస్తున్నాను. అలా అయితే మన దేశం లో ఎక్కడ పడితే అక్కడ పేదరికం తాండవిస్తునే ఉంటుంది. మీరు ఇష్టపడతారా?" "లేదనుకుంటా, పరిస్థితులు అనుకూలించకపోయినా మీ పట్టుదల, చదువు పై ఉన్న ఆసక్తిని ఇష్టపడుతున్నా. మీరు నాకు ఇచ్చే లెక్చర్ల వల్ల నాకు కూడా చదువంటే ఆసక్తి ఏర్పడింది." "మీకు చదువులో ఎటువంటి డౌట్స్ వచ్చినా క్లియర్ చేయడానికి ఈ అన్నయ్య ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు." "అన్నయ్య ఎవరు?" "నేనే… నేను మిమ్మలని నా చెల్లెలుగా భావిస్తున్నాను. మీరు నన్ను మీ సొంత అన్నలా భావించండి." "అలాగే… బై." "బై." ఫోను కట్ చేశాడు ఏకవీర. "అన్నయ్య అనే మూడు అక్షరాల పదం నా గుండెభారాన్ని తగ్గించింది. నీకు ఏదొకరకంగా సాయం చేయాలని అనుకుంటున్నాను. నేను నీకు పది లక్షలు ఇస్తాను. అది నిన్ను, నీ వాళ్ళని కష్టాల నుంచి బయట పడేస్తుంది", అన్నాడు రఘురామ్. "క్షమించండి సార్, నేను నా పేదరికాన్ని అమ్మకానికి పెట్టలేను." "నా మాటలు నిన్ను కష్టపెట్టాయా? నా కంపెనీలో నీకు ఉద్యోగం ఇస్తాను, సరేనా. నీ తెలివితేటలు నా కంపెనీకి ఎంతో ఉపయోగపడతాయి." "లేదు సార్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్న నా వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాని మా హౌస్ ఓనరు కొడుకు సత్యమూర్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నాడు. చాలా ఇంటెలిజెంట్. అతడి వల్ల మీ కంపెనీ మరింత అభివృద్ధిలోకి వస్తుంది. ఒక్క నిమిషం సార్, అతన్ని పిలుస్తాను", అంటూ అతనికి ఫోను చేశాడు. "హలో! సత్యా! ఒకసారి మేడమీదకు రా", అన్నాడు వీర. "ఓకే", అన్నడు సత్యమూర్తి. ఒక నిమిషంలోనే అక్కడికి వచ్చాడు. "నువ్వు చెప్పావ్ అంటేనే తెలుస్తోంది అతని తెలివితేటలు ఎంతటివో." "నువ్వు రేపే మా కంపెనీలో జాయిన్ అవ్వు", సత్యమూర్తితో అన్నాడు. సత్యమూర్తి ముఖం ఆనందంతో వెలిగింది. అతడు ఆనందాన్ని దాచుకోలేకపోతున్నాడు. "థాంక్యూ సార్… థాంక్యూ వెరీ మచ్." "పర్వాలేదు బాబు! ఏకవీర నమ్మకాన్ని నువ్వు నిలబెడతావని ఆశిస్తున్నాను. "తప్పకుండా సార్", ఆనందంగా అన్నాడు సత్యమూర్తి. "నీ కోసం నేను ఏ సాయం చేద్దామన్నా వద్దనే అంటున్నావు. ఒక పని చేయి. చూడు నా వెలికి ఉన్న ఉంగరం. దీని విలువ లక్షలలో ఉంటుంది. ఇది నువ్వు తీసుకో. నీకు అవసరం అయినప్పుడు నువ్వు అమ్ముకో, నాకు ఏ అభ్యంతరం లేదు", అంటూ చేతిలో పెట్టబోయాడు. "దీనిలో మీకు ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉండవచ్చు. దయచేసి మీరే ఉంచుకోండి." "నిజమే. నేను మా కంపెనీనీ అభివృద్ధిలోకి తెచ్చినప్పుడు, మా నాన్న నాకు ఇచ్చిన బహుమతి. ఇది నిజంగా నాకు విలువైన జ్ఞాపకమే. నువ్వు గుర్తు చేసేదాకా ఆ సంగతి గుర్తులేదు సుమా. ఉండు ఒక నిమిషం… ", అంటూ జేబులోంచి ఒక విజిటింగ్ కార్డు తీసి ఏకవీర కి అందించాడు. "ఇది చాలా ప్రత్యేకమైన కార్డు. దీన్ని నేను అతి ముఖ్యమైన వారికి మాత్రమే ఇస్తాను. దీన్ని తీసుకో. నీకు ఎప్పుడు అవసరం అయిన నన్ను కలవవచ్చు. అప్పోయింట్మెంట్ అవసరం లేదు", అంటూ అందించాడు. "థాంక్యూ సార్", అంటూ తీసుకున్నాడు. "ఇక నేను వస్తాను వీరా", అంటూ బయలదేరాడు రఘురామ్. ఏకవీర, సత్యమూర్తి గేటు వరకూ వచ్చి సాగనంపారు. రఘురామ్ కారు స్టార్ట్ చేయగానే, "అరే, ఇదెలా సాధ్యం? నువ్వు నాకు ఇలా ఉద్యోగం ఎలా వెయించావు", అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈలోగా సత్యమూర్తి తండ్రి అప్పారావు కూడా వచ్చి, "ఏం జరిగింది? ఏమిటీ హడావుడి?" , అని అడిగాడు. రఘురామ్ వచ్చిన దగ్గరనుండి జరిగినది అంతా ఏకవీర వివరించాడు. అప్పారావుకి ఆనందభాష్పాలు ఆగలేదు. "నువ్వు చేసినదానికి నిన్ను ఎంత పొగిడినా అది తక్కువే అవుతుంది", అన్నాడు. "అయ్యో! అదేం లేదు సార్", అంటూ ముందుకు నడిచాడు. ఈ విషయం ఈ నోటా ఆ నోటా ప్రిన్సిపాల్ చేవి వరకూ కూడా వెళ్ళింది. అతడు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపగలడని చాలామంది అనుకునేవారు, కొందరు అతని పేదరికం ఎలా ఉందో చూడాలని అనుకునేవారు. మరికొంత మంది అతని చేత లెసన్స్ చెప్పించుకునేవారు. మరికొందరు అతని ఇంట్లో రాగిజావ తాగాలనుకునేవారు. *** ఆ రోజు ఆదివారం… పనులు అన్నీ తర్వాత మొదలుపెడదాం అనుకొని, పుస్తకాలు ముందేసుకుని ఆ లోకంలో మునిగిపోయాడు. "గుడ్ మార్నింగ్ వీరా!", అని వినిపించడంతో తల పైకెత్తి చూశాడు. 'ఎదురుగా ప్రిన్సిపాల్, ఇది కలా నిజమా, ప్రిన్సిపాల్ నా ఇంటికి రావడం ఏమిటి?', వెంటనే తేరుకుని, "గుడ్ మార్నింగ్ సార్, అలా కూర్చోండి", సార్ అన్నాడు. "ఓకే", అంటూ గట్టు పై కూర్చున్నాడు ప్రిన్సిపాల్ ఆనందరావు. "ఎలా చదువుతున్నావు వీరా? నీకేమైనా డౌట్స్ ఉంటే లెక్చరర్స్ ని అడుగు. నేను రికమెండ్ చేస్తా, నీ డౌట్స్ క్లియర్ చేయమని." "తప్పకుండా సార్!" కాసేపట్లోనే… దేశంలోని అనేక విషయాల గురించి అనర్గళంగా మాట్లాడుకున్నారు. అతడి విషయపరిజ్ఞానాన్ని చూసి ఆనందరావు ఆశ్చర్యపడ్డాడు. ప్రిన్సిపాల్ మేధోసంపత్తి చూసి అబ్బురపడ్డాడు ఏకవీర. "వీరా! నా భార్య మరణించి మూడు సంవత్సరాలు అయింది. నాకు ఇద్దరు కొడుకులు, కోడళ్ళు ఇంకా నలుగురు మనవళ్లు ఉన్నారు. సమస్య ఏమిటంటే నా చిన్నప్పటి నుండి క్రమశిక్షణగా ఉండడం అలవాటు. అదే అలవాటు నా మనవలకి కూడా ఉండాలని ఆశిస్తున్నాను. కాని నా ఆలోచనలు వాళ్ళకి చాదస్తంగా తోస్తున్నాయి. వాళ్ళు క్రమశిక్షణ అలవాటు చేసుకోలేరు, నేను వదులుకోలేను. వాళ్ళు నానుంచి విడిపోదాం అని నిర్ణయించుకున్నారు. నా ఆస్తిని పంచమని కూడా అడుగుతున్నారు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. నువ్వేమైనా పరిష్కారం చెప్పగలవా?", అడిగాడు ఆనందరావు. "మీ ఆస్తి మీ స్వార్జితమా!, లేకపోతే మీ తల్లితండ్రులదా?" "నేను సంపాదించుకున్నదే." "మీ ఆస్తిని మీ పిల్లలకి పంచి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" "లేదు, వాళ్ళు నిమిషాల మీద ఆస్తిని హారతికర్పూర్మం చేసేయగలరు." "పోనీ మీ క్రమశిక్షణను మీరు వదులుకోగలరా? అలా ఉంది వాళ్ళకి దగ్గర కావాలని భావిస్తున్నారా?" "లేదు, నా క్రమశిక్షణ నా పెద్దల ఆస్తి, నేను దాన్ని వదులుకోను." "పోనీ మీరు ఒక వంటమనిషిని పెట్టుకోండి. టైంకి మీకు సదుపాయం చేసేలా చూసుకోండి. మీరు మీ జీవనవిధానంలో జీవించండి." "ఆ ముచ్చట కూడా అయ్యింది. అయినా వాళ్ళందరూ నన్ను ఒక కర్కోటకుడులా చూస్తున్నారు." "మీకు ఇప్పుడు ఉన్న ఇల్లు కాక మరి రెండు ఇళ్లు ఉన్నాయిగా, ఇద్దరినీ అక్కడ ఉండమనండి. అవి వాళ్ళకి అమ్మడానికి అవకాశం ఇవ్వకండి. వాళ్ళకి ఇష్టమైతే అక్కడే ఉంటారు, మీరంటే ఇష్టం ఉంటే మీ దగ్గరకు వస్తారు. ఇంతకన్నా మరో మార్గం లేదు." "అదే మంచిదనిపిస్తోంది. కాని నన్ను ఎవరూ చూసుకుంటారు?" "మీకు వంటమనిషి ఎలాగా ఉన్నాడు కనక అతనే మిమ్మలని చూసుకుంటాడు." "కాని కన్నకొడుకులా ఆదుకునేవారు ఎవరుంటారు?" "నాలాంటి వాడిని ఉంచుకోండి సార్, మీకే ఇబ్బంది ఉండదు", నవ్వుతూ అన్నాడు ఏకవీర. "నిజమే సుమా! నువ్వు ఇకనుంచి మా ఇంట్లోనే ఉండాలి, ఏమంటావ్?" "మీరెలా అంటే అలానే సార్", నవ్వుతూ అన్నాడు. "నువ్వు ఆ ఇన్స్టిట్యూట్లో జాబ్ మానేయాలి సుమా, నేనునీకు నెలకు పదివేలు ఇస్తాను, కాదనకూడదు మరి." "అలాగే సార్ మీ ఇష్టం", అన్నాడు ఏకవీర. "కాని నా సమస్య వాళ్ళు నాతో కలసిఉండాలని… కాని ఎలా?" "పరిష్కారం ఉంది సార్." "ఎలా?" "పరిష్కారం, నేనే సార్!" "అదెలా?" "మీదగ్గర ఏకవీర అనేవాడు ఒకడు ప్రవేశించాడు అని, ఎదొకలా ఆస్తి అంతా తనకే రాసేస్తారని వాళ్ళు భావిస్తారు." "కాని నేను ఆస్తి అంతా నీకేమి రాయడం లేదుగా… " "మీరు ఇచ్చినా నేను తీసుకోనుగా." "మరి వాళ్ళు అల అనుకోకపోతే?" "అనుకునేలా మనమే చేస్తాం సార్. దెబ్బకి కోట్లాస్తి పరాయివాళ్లకి పోతుందని భయపడి వాళ్లే మీదారికి వస్తారు. కానీ ఇదంతా జరగడానికి కొన్ని నెలలు పడుతుంది", అన్నాడు ఏకవీర. "నా సమస్యకి నేను ఊహించని పరిష్కారం దొరికింది", అంటూ బయటకి నడిచాడు ఆనందరావు. *** ఏకవీర వెళ్ళిపోతున్నాడు అని విని అప్పారావు, సత్యమూర్తి ఎంతో బాధపడ్డారు. "నువ్వుంటే మాకు దైర్యంగా ఉండేదయ్యా", కళ్ళలోకి నీళ్ళు తిరుగుతుంటే దీనంగా అన్నాడు అప్పారావు. "నేను తరచుగా కలుస్తూనే ఉంటాను సార్", అన్నాడు ఏకవీర. "నీ లైఫ్ మరింత కష్టంగా మారుతుందా?", అన్నాడు సత్యమూర్తి. "లేదు, నాకు మరింత సమయం ఎక్కువ మిగులుతుంది. నేను చదువు మీద మరింత ఎక్కువ కాన్సంట్రేట్ చేయగలుగుతాను." "ఆయన ప్రిన్సిపాల్ కనక చాలా మాగజైన్సు, ఇంకా చాలా బుక్సు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉందని విన్నాను. నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను." "కానీ ఇక్కడ నీ కోసం వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారుగా, వాళ్ళో?" "వాళ్ళు అక్కడికి రావడానికి నిజంగానే భయపడతారు. వాళ్ళందరూ కేవలం నా పేదరికాన్ని గమనించడానికి మాత్రమే వస్తున్నారు. రాను రాను నా పేదరికానికి ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇది నాకు ఇబ్బందిగా ఉంది." "అయితే నీ కొత్త జీవితానికి స్వాగతం పలుకు", అన్నాడు సత్యమూర్తి. ఇద్దరూ ఆకాశంలోని చుక్కలను చూస్తున్నారు. మిలమిలలాడే చుక్కలలో కొత్త కాంతి కనబడుతోంది. ***

మరిన్ని కథలు

Pakkinti Anitha
పక్కింటి అనిత
- తాత మోహన కృష్ణ
Vruthi dharmam
వృత్తిధర్మం
- - బోగా పురుషోత్తం
నది తోసుకుపోయిన  నావ!
నది తోసుకుపోయిన నావ!
- కొత్తపల్లి ఉదయబాబు
Kadivedu neellu.2
కడివడు నీళ్ళు . ముగింపు
- రాము కోలా.దెందుకూరు.
Kadivedu neellu.1
కడివెడు నీళ్ళు. మొదటి భాగం.
- రాము కోలా.దెందుకూరు.
Lat Lat aar
లట లట ఆర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Ettuku pai ettu
ఎత్తుకు పైఎత్తు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Devudu soottaantadu
దేవుడు సూత్తాంటడు..! (క్రీమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్