పీతాంబరం ప్రేమలో పడ్డ కాదంబరీ..! - ఇందుచంద్రన్

Pitambaram premalo padda kadambari

" నువ్వు కావాలి , నువ్వే కావాలి , నువ్వు నా పక్కనుంటే చాలు ఈ గొడవలొద్దు అంటూ ఎవడు

సినిమాలో కాజల్ అల్లు అర్జున్ దగ్గర ఏడుస్తున్నట్టు ఏదో గొంతు వినిపిస్తుంది , ఆ అమ్మాయి రూపం

కొద్ది కొద్దిగా కనపడే లోపే

"ఒరేయ్ పీతాంబరం , ఒరేయ్ పీతాంబరం ఎనిమిద్దన్నర అవుతుంది రా అంటూ కేకలేస్తూ వచ్చింది

పీతాంబరం వాళ్ళమ్మ

" పొద్దున్నే ఎందుకలా అరుస్తున్నావమ్మా ? నిజ జీవితంలో ఇలా జరగదు కనీసం కలలోనైనా

అద్భుతాలు జరిగేటప్పుడు ఇలా చెడగొట్టేసావు అన్నాడు దీనంగా

లేచి అద్దం ముందు నిలబడి " నువ్వు కావాలి నువ్వే కావాలి అని నీతో ఎవరైనా అంటారంటావారా

పీతాంబరం ? అది జరగదు కాబట్టే అలాంటి కలలొస్తున్నాయి , ఇలాంటి కలలు రావడం మాములే

కదా అని తనలో తానే చెప్పుకుని

ముందుకొచ్చిన పొట్టని చూసి అద్దంలో మరోసారి చూసుకుని వెళ్ళిపోయాడు.

ఫోన్ లో కాసేపు చూసి టివి ఆన్ చేసాడు.

" ఉదయాన్నే ఒకటిన్నర గ్లాస్ నీళ్ళలో కాసింత జీలకర్ర వేసి మరిగాక వడగట్టుకుని తాగితే అజీర్తి ,

గ్యాస్ సంబంధిత సమస్యలుండవు అని ఒక ఆయుర్వేద చికిత్స చానల్లో చెప్తున్నారు.

పీతాంబరం కిచెన్లో కి వెళ్ళాడు అక్కడ జీలకర్ర కోసం వెతికాడు

రెండు మూడ్దు డబ్బాలు ఉన్నాయి ఒకేలా ఉన్నాయి వాళ్ళమ్మని పిలవడంతో

"ఏం కావాల్రా అంది ఆవిడ

"ఇందులో జీలకర్ర ఏది ? అన్నాడు

"ఇది జీలకర్ర ఇది సోంపు , ఇది వాము అంది చూపిస్తూ

జీలకర్రని నీళ్ళలో వేసి మరిగిస్తుండగా

" ఆ అమ్మాయిని చూసి మాట్లాడు అంది

" వెళ్లాలంటావా అమ్మా? వెళ్ళడం వాళ్ళకి నేను నచ్చకపోవడం అన్నాడు

అలా అని అలానే ఉండిపోతావా? అంది కోపంగా

"అమ్మా పెళ్ళి చేసుకోవాలని , నాకు ఒక తోడు ఉండాలని నాకు మాత్రం ఉండడా? ఇప్పుడు నాకు

ముప్పై ఆరెళ్ళు ఇప్పుడు నన్నెవరు చేసుకుంటారమ్మా అన్నాడు నిస్సత్తువగా

" నువ్వు ఆనందం గారమ్మాయిని చూడు ఆ అమ్మాయి నచ్చుతుందేమో అంది ఆవిడ

"ఆ అమ్మాయికి నేను నచ్చాలి కదా అన్నాడు వెళ్ళిపోతూ

------

" ఇంకా ఎంత సేపు లోపల ఉంటావ్రా? అయినా ఈ మధ్య నువ్వు బాత్రూంలోనే ఎక్కువుంటున్నావు

ఏం చేస్తున్నవో ఏంటో అంటూ తల్లి శకుంతల మొత్తుకోసాగింది.

తల్లి మాటలు నెమ్మదిగా చెవిలో కి జారుతుండగా అసహనంగా తలపైకెత్తి " వస్తున్నానమ్మా అన్నాడు

పీతాంబరం చిరగ్గా సణుగుతూ

కాసేపటికి బాత్రూం నుండి బయటకి వచ్చి " ఏంటి ? బాత్రూం కూడా ప్రశాంతంగా వెళ్ళనివ్వవా?

అన్నాడు కోపాన్ని ప్రదర్శిస్తూ

"పొద్దస్తమానం ఆ బాత్రూంలో దూరుకుని ఏం చేస్తున్నావని కదా? అంది అనుమానంగా పీతాంబరం

చేతిలో ఉన్న ఫోన్ వైపు చూస్తూ

" అలా చూడకమ్మా , పొట్ట కాస్త ఉబ్బరంగా ఉంటేను అని సాగదీస్తూ ఆపేసాడు

"సరే సర్లే....ఆనందం గారి అమ్మాయి ని ఒకసారి కలిసి మాట్లాడు , ఆ అమ్మాయి కాఫీ షాపులో

కలుస్తానంది అంది శకుంతలమ్మ

ఇంతలో కడుపులో గుర గుర మని శబ్దం పైగా పొట్టలో ఉన్న గ్యాస్ బయటికి వచ్చేలా అనిపించి మళ్ళీ

బాత్రూంలోకి దూరాడు

పదినిమిషాల తర్వాత బయటికి వచ్చాడు.

మొహంలో అసంతృప్తి అసహనం గడియారం వైపు చూస్తే పదిన్నర అవుతుంది.

గబగబా ప్యాంటు మార్చుకుని ఆఫీస్ కి బయలుదేరాడు.

కాస్త దూరం వెళ్ళగానే మళ్ళీ కడుపులో గడబిడ కళ్ళు దగ్గర్లో ఏదైనా అవసరం తీర్చుకునే అవకాశం

కోసం వెతకడం మొదలు పెట్టాయి.

అంతా మైదానం ఎక్కడా ఒక చెట్టు పుట్ట అయినా లేదు. కడుపులో రకరకాల శబ్దాలు , పోతే రాదు

రాలేదు కదా అని బయటకి వస్తే మళ్ళీ వస్తున్నట్టు ఈ ఇన్ కంప్లీట్ ప్రాసెస్ దాదాపు గా చాలా రోజుల

నుండి ఎదుర్కొంటున్నాడు మన పీతాంబరం.

"ఏమిటి స్వామి నాకు ఈ బాధ ?అని బాధగా కాస్త దూరం వెళ్ళ గానే దూరంగా మైదానంలో ఏవో చెట్లు

కనిపించి బైక్ రోడ్ మీద ఆపి నెమ్మదిగా వెళ్ళాడు.

మళ్ళీ అదే అసంతృప్తి వెనక్కి తిరిగి వచ్చాడు.

టైమ్ చూస్తే పదకొండు ఆ అమ్మాయి వచ్చేసి ఉంటుందేమో అనుకుని బైక్ ని కాఫీ షాప్ వైపుకి

పోనిచ్చాడు.

కాఫీ షాప్ కి చేరుకోగానే ఆరో టేబుల్ దగ్గర ఒకమ్మాయి అటు తిరిగి కూర్చుని ఉంది.

వడి వడిగా వెళ్ళసాగాడు ఉన్నట్టుండి పొట్టలో నుండి ఏదో జారిపోతున్నట్టు అనిపించింది. ఎడమ

వైపు ఉన్న రెస్ట్ వైపు కి పరుగు తీసాడు.

కాస్త వెలితిగా అనిపించి ఊపిరిపీల్చుకుని బయటికి వచ్చాడు.

అప్పుడు గుర్తొచ్చింది ఆ అమ్మాయి ఆరో నంబర్ టేబుల్ వైపు చూసాడు , అటు తిరిగి కూర్చున్న

అమ్మాయి ఇప్పుడు ఇటు తిరిగి కూర్చుంది.

బ్లూ కాటన్ చీరలో , మొహం మీద కదులుతున్న కురులు , పసిడి వర్ణం మేనిచ్చాయ చూడ్డానికి

బావుంది అని అనుకుని తన వైపు చూసుకున్నాడు.

బెల్టు వల్ల కాస్త లోపలికి తోసినట్టు ఉన్న పొట్ట , మూడు పదులలో జీతం తో పాటు నెత్తి మీద ఫ్రీగా

వచ్చిన ఒక అర్ద ఏకరం స్థలం , పైగా ఈ మధ్య వేదిస్తున్న IBS సమస్య ఆలోచనలతోనే అడుగులు

వేసి అమ్మాయి ముందు నిలబడ్డాడు.

ఆ అమ్మాయి చూసి చిన్న చిరునవ్వు నవ్వి కూర్చోండి అంది పైకి లేస్తూ

"పర్లేదు కూర్చోండి అన్నాడు పీతాంబరం నవ్వుతూ

ఇంతలో ఆర్డర్ సార్ అన్నాడు అక్కడున్న సర్వీస్ బాయ్

" గ్లాస్ మజ్జిగ....కుదిరితే కాస్త జీలకర్ర పొడి కూడా కాస్త వేసి తీసుకొని రా అన్నాడు పీతాంబరం తాపీగా

అతను పీతాంబరం వైపు అదోలా చూసి " ఇది కాఫీ షాప్ సర్ అన్నాడు

ఎదురుగా కూర్చున్నమ్మాయి కిసుక్కుమని నవ్వింది

"అయితే పాలున్నప్పుడు మజ్జిగ ఉండదా? అన్నాడు కొరకొరమని చూస్తూ

" మీకు కావలంటే చెప్పండి సర్ , తెప్పిస్తాను అన్నాడు అతను నెమ్మదిగా

"అవసరం లేదు అన్నాడు పీతాంబరం విసుక్కుంటూ

" ఒక కాఫీ అంది ఆ అమ్మాయి చిరునవ్వుతో

అతను వెళ్ళిపొగానే ఆ అమ్మాయి వైపు చూసి నవ్వుతూ " ఈ టీలు కాఫీలు గట్రా పడవండి మనకు

అన్నాడు.

ఆ అమ్మాయి మొహమాటంగా నవ్వి ఊరుకుంది.

ఇద్దరి మధ్య నిశబ్దాన్ని చీరుస్తూ " ఏం చేస్తుంటారు అన్నాడు పీతాంబరం

ఆ అమ్మాయి అదోలా చూసి " కంటెంట్ వ్రైటర్ ని అంది చిరునవ్వుతో

"మీరు ఏం చేస్తుంటారు అంది ఆ అమ్మాయి తిరిగి ప్రశ్నిస్తూ

"నేను అంటూ చెప్పబోయాడు

పొట్టలోంచి గుర గుర మని శబ్దం రావడంతో ఆపేసి మొహమాటంగా నవ్వి

రెస్ట్ రూమ్ వైపు అడుగులు వేసాడు.

పని పూర్తి చేసుకుని నెమ్మదిగా బయటకి వచ్చాడు టక్ చేసిన షర్ట్ కాస్త తీసేసాడు.

చెమటని కర్చీఫ్ తో తుడుచుకుంటూ నెమ్మదిగా వచ్చి కూర్చుని ఆ అమ్మాయి వైపు చూసి " ఎక్కడ

ఆపాము ? అన్నాడు

ఆ అమ్మాయి తలపైకెత్తి " మీరు ఏం చేస్తుంటారు అంది

" నేను మార్కెటింగ్ ఫీల్డ్ అండి సేల్స్ చీఫ్ ఎక్జిక్యూటివ్ అన్నాడు నెమ్మదిగా

మళ్ళీ కడుపులో గడబిడ రకరకాల ఉండటంతో లేచి వడి వడిగా వెళ్ళిపోయాడు.

దాదాపు అర్ద గంట తర్వత బయటికి వచ్చాడు.

ఆ అమ్మాయి ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూ " సారీ అండి అన్నాడు

"అయ్యే పర్లేదు నాకేందుకండి సారీ అంది ఆ అమ్మాయి.

పీతాంబరం నీరసంగా కూర్చుని " స్టొమక్ అప్ సెట్ అన్నాడు.

" ఒహ్....అంది మొహమాటంగా నవ్వి

" దాదాపుగా రెండు వారాలుగా ఇదే పరిస్థితి అండి ఒక పని ప్రశాంతంగా చేసుకోలేకున్నా ,

ఉదయం లేవగానే అన్నీ తాపీగా జరిగిపోతే బావుంటుంది కాని ఏదైనా బ్రేక్ పడితే అన్నీ

అస్తవ్యస్తంగా జరిగిపోతుంటాయి , IBS తో సఫర్ అవుతున్నానండి , అయినా ఇవన్నీ చెప్పుకోడానికి

నేను మొహమాట పడనండి, ఏదైనా ఉంటే బయటకి చెప్పేయడం అలవాటేనండి అన్నాడు.

అయినా మొహమాటపడటానికి ఏముందండీ ? మీరు మంచిగా యోగా క్లాస్ లో జాయిన్ అవండి,

బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఎక్కువ పీచు పదార్దాలు తీసుకోండి అంది కాదంబరి.

" ఈ యూట్యూబ్ లో వచ్చే అన్నీ చిట్కాలు ట్రై చేసానండి అవన్నీ తాత్కాలికమే , శాశ్వత

పరిష్కారమైతే దొరకట్లేదు అన్నాడు దీనంగా

కాదంబరి చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి " ముందు మీరు డాక్టర్ ని కలవండి , తర్వాత మంచి డైట్

ఫాలో అవండి , హైడ్రేటెడ్ గా ఉండి మన శరీరం మన కంట్రోల్ లో ఉంటే చాలు అంది నవ్వుతూ

పీతాంబరం నెమ్మదిగా తలాడించాడు.

" ఈ మధ్య ఫోన్ అరచేతిలో అతుక్కుపోయాక అన్నీ పనులు పోస్ట్ పోన్ చేసుకోవడం

అలవాటయిపోయింది.

నిద్రపోయే ముందు , నిద్ర లేవడం మొదలు అరచేతిలో ఆరో వేలిలా ఉండిపోతుంది.

కుడి చేత్తో తింటూ ఎడమ చేత్తో ఫోన్ నొక్కడం చూడటం , బాత్రూం లోకి ఫోన్ తీసుకెళ్ళడం అసలు

మనకి తెలియకుండానే మనం సమస్యని మెలమెల్లగా కొని తెచ్చుకోవడం అంటే ఇలానే.

ఒకప్పుడు మన ఊళ్ళలో టాయిలెట్స్ అందుబాటులో ఉండేవి కావు ఉదయం నిద్రలేవగానే

కాలకృత్యం తీర్చుకోవాలి అందుకని అప్పట్లో పుల్లటి చింతపండు రసం తాగేవాళ్ళు మలబద్దకాన్ని

తగ్గిస్తుంది అందుకే మన భోజనంలో చింత పండు రసం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం ,

ఉదయాన్నే కడుపు శుభ్రం అయిపోతుంది , ఇప్పుడు అలా కాదు నిద్ర లేవగానే ఫోన్ ఆ ఫోన్ చూసు

కుంటూ ఒక గంటన్నర , మళ్ళీ బాత్రూంలోనూ ఫోన్ చూస్తూ ఉంటారు , దానివల్ల ఒత్తిడి పెరిగి

మలబద్దకం విరేచనాలు అవుతాయి.

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ప్రేగుల మీద ఒత్తిడి పెరుగుతుంది , పైల్స్ వచ్చే ఆస్కారం కూడా

ఉంది అంది కాదంబరి మెల్లగా

"మీరు డాక్టరా అన్నాడు పీతాంబరం ఆశ్చర్యపోతూ

"లేదు అంది కాదంబరి

"మరి ఇదంతా ఎలా తెలుసు ? అన్నాడు

"పేపర్లో టివిలో ఫోన్లో చదువుతూ ఉంటాం కదా అంది నవ్వుతూ

"అవును చూస్తాం కాని చూసే వన్నీ పాటిస్తామా? అన్నాడు

మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది కదండి అంది కాదంబరి.

నిజమేనండి , కాని ఇప్పుడు ఇంకో సమస్య వచ్చిందండి అన్నాడు దిగులుగా

"ఏవైందండి ? అంది కాదంబరి ఆశ్చర్యపోతూ

" రోజు అమ్మాయిని చూడ్డానికి ఇలా రావడం ఆ అమ్మాయిలకి నేను నచ్చకపోవడం అన్నాడు

నిట్టూర్పుతో

కాదంబరి మౌనంగా వింటూ ఉంది

" పాతికేళ్ళున్నప్పుడు పెళ్ళి చూపులకి వెళ్తే అందంగా ఉన్నాడు కాని ఆస్తులు పాస్తులు లేవన్నారు.

ఇప్పుడు ఆస్తిపాస్తులతో వెళ్తే అన్నీ ఉన్నాయి కాని అందంగా లేను అంటున్నారు.

వయస్సు పెరిగే కొద్ది ముందుకొచ్చే పొట్టని , రాలిపోయే జుట్టుని ఆపలేమండి బాబు అన్నాడు కాస్త

దిగులుగా

ఆ మాటలకి ఆ అమ్మాయి నవ్వేస్తూ "మీరు సరదాగా మాట్లాడుతున్నారు అంది.

" సరదానా? ఈ పదేళ్ళలో తిరిగి తిరిగి ఎనిమిది జతల చెప్పులు అరిగిపోయాయండి , అయినా

నాకు అర్థం కాదు

అమ్మాయిలకి ఎలా ఉంటే నచ్చుతారంటారు ? అన్నాడు సందేహాన్ని వ్యక్తపరుస్తూ

" ఆ ప్రశ్న కి సమాధానం తెలిస్తే ఈ తంటాలు ఎందుకుంటాయండి ? ఎవరి మనస్సు ఏం

కోరుకుంటుందో ఎవరికి తెలుసు ? అంది నవ్వుతూ

"మీ నవ్వు చాలా బావుంది అన్నాడు పీతాంబరం మెలికలు తిరిగిపోతూ

"థాంక్స్ అంది ఆ అమ్మాయి

"మీకెలాంటి అమ్మాయి కావాలి అంది కాదంబరి

" ఇలానే ఉండాలని లేదండి , నాకు నా అడుగు జాడల్లో నడిచే అమ్మాయి అవసరం లేదండి , నా

పక్కన నడుస్తూ నాతోడుగా నిలబడినా చాలండి అన్నాడు

ఇంతలో కాఫీ తీసుకుని రావడంతో ఆ అమ్మాయి కాఫీ అందుకుని తాగుతూ ఉంది.

పీతాంబరం ఫోన్ లో చూసుకుంటూ ఉన్నాడు.

ఆ అమ్మాయి కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి " మీ పేరు అంది

" పీతాంబరం అన్నాడు కాస్త చిరాగ్గా మొహం పెట్టి

ఆ అమ్మాయి ఫక్కున నవ్వేసింది

పీతాంబరం మొహం అదోలా మారిపోయింది.

"సారీ సారీ అండి పేరు చెప్పే విధానం వినగానే అంది నవ్వాపుకుంటూ

" పర్లేదు లేండి అన్నాడు

ఇంట్లో నేను మా అమ్మ ఉంటాం , నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మావయ్య ఇక్కడ

తీసుకురావడంతో

ఇక్కడే సెటిల్ అయిపోయాం.

పాతికేళ్ళున్నప్పుడు ప్రేమించి పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను. వయస్సు అలాంటిది కదా?

ప్రేమించి జేబు ఖాళీ చేసుకున్నా అమ్మాయి ఆస్ట్రేలియాకి ఎగిరిపోయింది, సరే ఇంట్లో చూసిన

అమ్మాయిని చేసుకుందాం అంటే బ్యాంక్ సేవింగ్స్ లేవు , కనీసం సొంత ఇల్లైనా లేదు అన్నారు.

సరే ఇదంతా ఎందుకులే అని కష్టపడి నాలుగు రాళ్ళు వెనక్కేసుకున్నా.

ఇప్పుడు పొట్ట బట్ట అంటున్నారు అయినా అన్నీ కావలంటే మనలాంటి సాదారణంగా జీవించే

వాళ్ళకి ఎలా కుదురుతుందండి ? అన్ని కుదిరితే మనం ఇంత సాదాసీదాగా ఎందుకు ఉంటాం ?

చెప్పండి అన్నాడు దిగులుగా

ఆ అమ్మాయి మౌనంగా వింటూ ఉంది.

" ఇప్పుడు ఆరంకెల జీతం , మూప్పై ఐదు దాటి మూడేళ్ళవుతుంది ఇపుడు ప్రేమ గీతాలు

పాడుకోకున్నా కనీసం ఇంట్లో దీపం పెట్టడానికైనా ఇల్లాలు ఉండాలి కదండి అందుకే ఇంత

దూరమొచ్చా కాని మిమ్మల్ని చూసాక అని ఆగిపోయాడు

ఆ మాట వినగానే ఆ అమ్మాయి మొహంలో ముఖ కవళికలు మారాయి.

కాసేపటికి కాదంబరి నెమ్మదిగా " మీరు ఇక్కడికి ఎవరికోసం వచ్చారు అంది

"మీ కోసమే , మీరు ఆనందరావ్ అంకుల్ ఈ రోజు మిమ్మల్ని కలిసి మాట్లాడమన్నారు అన్నాడు

నవ్వుతూ

కాదంబరి షాక్ అయిపోతూ తడబడుతూ " అది..అది అంటూ ఏదో చెప్పబోయింది.

"అర్థమయిందిలేండి , మీక్కుడా నేను నచ్చలేదు మీకే కాదు ఎవరికీ నచ్చను అది నాకు తెలుసు

కాకపోతే ఇంట్లో వాళ్ళ మాట కాదనలేక వచ్చాను అన్నాడు నవ్వుతూ

"అది కాదండి అంటూ ఏదో చెప్పబోయింది కాదంబరి

"మీరేం మాట్లాడకండి , నిశ్చింతగా ఇంటికెళ్ళి నిర్మొహమాటంగా పీతాంబరం నచ్చలేదు నాన్న అని

చెప్పండి అన్నాడు చిరునవ్వుతో

" అసలు ఆనందరావ్ ఎవరండి ? ఆయనని మీరు నచ్చలేదని నేనెందుకు చెప్పాలండి అంది

ఆశ్చర్యంగా చూస్తూ

" మీరు మధు ప్రియనే కదా? అన్నాడు కంగారుగా

" మధు ప్రియా? నా పేరు కాదంబరి అంది చూస్తూ

"మరి ఇక్కడెందుకు కూర్చున్నారు , నేను రాగానే కూర్చోమన్నారు అన్నారు అయోమయంగా

" నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయి వెళ్ళిపోయింది , ఇక్కడ ప్లేస్ బావుందని

కూర్చున్నాను , మీరు నాలాగే వచ్చారేమో అని కూర్చోమన్నా అంది.

"మరి కనీసం మీ పేరైనా చెప్పాలి కదా? అన్నాడు

"మీరు అడిగారా? మీ పేరు చెప్పారు కాని నన్ను అడగలేదు అంది నెమ్మదిగా

ఎక్కడో పొరపాటు జరిగింది , సారీ అండి అన్నాడు

ఇంతలో ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసాడు

" రేయ్ ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదట , నువ్వు మధ్యాహ్న భోజనానికి ఇంటికొచ్చేయ్ , మజ్జిగ

చారు , దోసకాయ పప్పు చేసా అంది వాళ్ళమ్మ తాపీగా

" నాకు తెలుసు లే నువ్వు ఫోన్ పెట్టేయమ్మా అన్నాడు విసుక్కుంటూ బ్యాగ్ తీసుకుంటూ

మొహమాటంగా కాదంబరి వైపు చూసి " ఎక్కడో పొరపాటు జరిగింది , రియల్లీ సారీ అన్నాడు పైకి

లేస్తూ

" ఇది పొరపాటు కాదేమో అనిపిస్తుంది పీతాంబరం గారు అంది కాదంబరి

"అమ్మతోడు , అసలు నేను మధు ప్రియ అనుకుని మాట్లాడానండి అంతే తప్పా మరో ఉద్దేశం లేదు

అన్నాడు నెత్తిమీద చేయి పెట్టుకుంటూ

" అయ్యో భలే వారే , పొరపాటు గా కలిసామని మీరు అనుకుంటున్నారేమో , జీవితాంతం

కలిసుండడానికి ఇదే మొదటి అడుగు అని నేను అనుకుంటున్నాను అంది సిగ్గుపడుతూ

పీతాంబరం షాకైపోయి చూస్తూ ఉన్నాడు

"హల్లో పీతాంబరం గారు అంది మొహం ముందు చేయి ఊపుతూ

" ఒకసారి గిచ్చండి అన్నాడు చేయి చాపుతూ

కాదంబరి అతని అరచేతిలో కాగితం పెట్టి , రేపు ఈ అడ్రెస్ కి మీ అమ్మగారితో వచ్చేయండి అంది

నవ్వుతూ వెళ్ళిపోతూ

షాక్ లోనే అలా చూస్తూ ఉన్న పీతాంబరం తేరుకుని బ్యాగ్ తీసుకుని కాదంబరి వెనక పరిగెత్తాడు.

"మీకు నాలో ఏం నచ్చాయండి అన్నాడు అయోమయంగా చూస్తూ

మీరు ఇచ్చే గౌరవం , మీ స్వచ్చమైన మనస్సు , మీ సరదా కబుర్లు ఇంతకన్నా ఏం కావాలి ? అంది.

"అంటే మీకు ఈ పొట్ట , నెత్తి మీద బట్ట ప్రాబ్లమ్ లేదా అన్నాడు.

" ఈ పొట్ట మీ ఆరోగ్యానికి ఏ సమస్యా లేనంత వరకు ఒకే , ఇక జుట్టు అంటారా జుట్టు అన్నాక

ఊడదా? ఏంటి ? అంది నవ్వేస్తూ అడుగు ముందుకేసింది.

పీతాంబరం గాల్లో తేలిపోతూ " కాదంబరి గారు మీ స్మైల్ బావుంది అన్నాడు టీనేజి కుర్రాడిలా

మెలికలు తిరిగిపోతూ

చుట్టూ ఉన్న వాళ్ళు పీతాంబరం వైపు అదొలా చూస్తూ ఉన్నారు.

కాని పీతాంబరం ఎవరికి పట్టించుకోలేదు కాదంబరి ఇచ్చిన చిటీని చూస్తూ మెలికలు తిరుగుతూ

వెళ్ళిపోయాడు.

------

మర్నాడు శకుంతలమ్మని తీసుకుని కాస్త కంగారు పడుతూ కాదంబరి ఇచ్చిన అడ్రెస్ కి వెళ్ళాడు.

గుమ్మం దగ్గరే ఆహ్వానించింది కాదంబరి

ఎరుపు రంగు చీరలో మెరుగులు దిద్దిన ముత్యంలా ఉంది , అసలు కళ్ళని నమ్మలేకపోయాడు పీతాంబరం

అమ్మాయిని చూడగానే శకుంతమ్మ ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో ఉప్పొంగిపోతూ దిష్టి తీసింది.

లోపలికెళ్ళి కూర్చుని మాట్లాడుతూ పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చాడు పీతాంబరం , కాదంబరి వాళ్ళ

నాన్న మొహం అదొలా పెట్టాడు.

"నాన్న పీతాంబరం గారు చాలా మంచి వారు అంది కాదంబరి.

ఆయన ఆలోచిస్తూ ఉండగా

" అందం గా ఉండడానికి సంతోషంగా ఉండడాని చాలా తేడా ఉందని మీరే అంటారు కద నాన్న ,

ఆయనతో ఉంటే సంతోషంగా ఉంటాను అనిపిస్తుంది అంది గోముగా

ఆయన కాస్త ఆలోచించి " కాదంబరీ నా ప్రపంచం , తను సంతోషంగా ఉంటే చాలు అన్నాడు

నెమ్మదిగా

" చూసుకుంటాను సర్ అన్నాడు ఆనంద బాష్పాలతో.....వెనక వైపు పెళ్ళి బాజాలు మోగుతున్నట్టు

శబ్దం పీతాంబరం చెవిని మాత్రం తాకసాగింది

మరిన్ని కథలు

Aparadhulu
అపరాధులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Prema lekha
ప్రేమ లేఖ
- వెంకటరమణ శర్మ పోడూరి
Adrusta chakram
అదృష్ట చక్రం
- కందర్ప మూర్తి
Sishya dakshina
శిష్య దక్షిణ
- వెంకటరమణ శర్మ పోడూరి
Pelliki mundu
పెళ్ళికి ముందు .....
- జీడిగుంట నరసింహ మూర్తి
Kodalu diddina kapuram
కోడలు దిద్దిన కాపురం
- - బోగా పురుషోత్తం.
Sarparaju
సర్పరాజు
- కందర్ప మూర్తి
Devaki Vasudevulu
భాగవత కథలు - 18 దేవకీ వసుదేవులు
- కందుల నాగేశ్వరరావు