ఊరు భద్రం బిడ్డా - శింగరాజు శ్రీనివాసరావు

Vooru bhadram bidda

లింగారెడ్డి మంచి నిద్రలో ఉన్నాడు. గత రెండు రోజులుగా కురిసిన భారీవర్షానికి ఊరిచివర చెరువు నిండిపోయింది. చెరువుగట్టు గట్టిగానే ఉన్నా, ఒకపక్కన కాస్త మట్టి మెతకబడిందనిపించి, ఇసుకబస్తాలను ఆపక్క దట్టంగా వేయించివచ్చాడు. ఊరికి దగ్గరలోనే ఉన్న ప్రాజెక్టు నీరు పొంగినప్పుడల్లా, ఆనీరు ఈ చెరువును చేరడం మామూలే. కానీ అది ఎప్పుడో అయిదేళ్ళకో, ఆరేళ్ళకో ఒకసారి జరిగినా, అంత ప్రమాదమేమీ జరగలేదు. ఎందుకంటే ఆ జిల్లాలో వానలు కురవడమే అరుదు. పుష్కరానికొకసారి కురిసినా చెరువు నిండిన దాఖలాలు లేవు. ఇదే అదనుగా పోయిన సర్పంచి చెరువును చదునుచేసి ప్లాట్లు వేయాలనుకున్నాడు. కానీ లింగారెడ్డి పడనివ్వలేదు. ఊరికి ఆ చెరువే ఆధారమని, పైన కురిసిన వానలతో ప్రాజెక్టు నిండినప్పుడు, వాళ్ళు వదిలిన నీటిని ఊర్లోకి రాకుండా ఆపేది ఈ చెరువేనని అడ్డుచెప్పాడు. మొన్న జరిగిన ఎలక్షన్లలో వయసు పైబడ్డ పాత సర్పంచిని కాదనుకుని, విద్యాధికుడు, యువకుడు అయిన లింగారెడ్డికి పట్టంకట్టారు ఊరిజనం. ఇంజనీరింగు చదివినా వ్యవసాయం మీద మక్కువతో, ఊరిమీద ప్రేమతో ఇక్కడే ఉండిపోయాడు లింగారెడ్డి. అలసటతో నిద్రపోతున్న లింగారెడ్డి ఫోను మ్రోగడంతో లేచాడు. ఉలిక్కిపడి లేచి టైమ్ చూశాడు. అయిదు గంటలు కావస్తున్నది. ఇప్పుడెవరా అని చూస్తే పల్లె పెద్ద రామయ్య. "హలో రామయ్యా. ఏమిటి ఈ వేళప్పుడు ఫోను చేశావు" "అయ్యా ప్రాజెక్టు మట్టికట్ట తెగి నీళ్ళు బయటకు వస్తున్నాయట. అవి ముందు మన చెరువు వైపే వస్తున్నాయట. త్వరగా ఊరిలోని వారందరినీ ఏదైనా ఎత్తైన చోటికి చేర్చమని ఆఫీసరు గారు ఫోను చేశారు. రంగడికి, ఏసోబుకు, సింహాద్రికి చెప్పాను. వారు ఊరందరినీ అప్రమత్తం చేస్తామన్నారు. చెరువు కింద పాకలోని జనాలను ముందుగా ఖాళీ చేయించాలి. వస్తారా అయ్యా" "వస్తున్నా రామయ్యా. అక్కడ మరిడయ్య ఉన్నాడు. వాడికి ఫోను చెయ్యి. వాడు అందరికీ చెప్తాడు" అని ఫోను పెట్టేసి పాలేరు భీముడిని లేపాడు. "రేయ్ లేరా. మనం అర్జంటుగా మాలపల్లెకు వెళ్ళాలి" అని చొక్కా తగిలించుకుని బయలుదేరాడు లింగారెడ్డి. ***** లింగారెడ్డి అక్కడ చేరేసరికే చెరువు పొంగి నీళ్ళు మాలపల్లెను చుట్టుకున్నాయి. ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా, అందరినీ పురమాయించి, పక్కనే ఎత్తుగా ఉన్న రామాలయంలోనికి చేర్చసాగాడు. చిన్న పిల్లలను, ముసలావారిని భుజాల మీద కెత్తుకుని లింగారెడ్డితో పాటు భీముడు, మరిడయ్య కూడ వారిని గుడిలోనికి చేర్చారు. మరి కొంతమంది యువకులు వారికి అండగా నిలిచారు. సమయం గడిస్తున్న కొలది ప్రవాహ ఉదృతి అధికం కాసాగింది. కన్ను మూసి తెరిచేలోపు పీకలలోతు వరకు ప్రవాహం పెరిగింది. దాదాపుగా పల్లె మునిగిపోయింది. పాకలు కొట్టుకుపోతున్నాయి. పల్లెజనం గుండెలు బాదుకుంటున్నారు. ఇంతలో ఒకావిడ పెద్ధగా కేకలు పెడుతోంది. "అయ్యో. నా పెద్దబిడ్డ కనబడ్డం లేదు. ఓ నా తల్లో... ఓ నా తల్లో.." "ఒరేయ్ భీముడూ. చూడరా ఆమేదో అరుస్తున్నది" అని చెబుతూ పారే నీటివంక చూశాడు. ఎవరో ఈదుకుంటూ వస్తున్నట్లు కనిపించింది. కానీ అది ఈదడం కాదు, కొట్టుకురావడం అనిపించి క్షణం కూడ ఆలస్యం చేయకుండా ప్రవాహంలోకి దూకేశాడు లింగారెడ్డి. ఎదురొస్తున్న ప్రవాహాన్ని అడ్డుకుంటూ తన నైపుణ్యాన్నంతా ఉపయోగించి ఈదుకుంటూ వెళ్ళి వస్తున్న మనిషి నడమును గట్టిగా పట్టుకుని ఒంటి చేత్తో ప్రవాహాన్ని తోసుకుంటూ గుడి మెట్ల మీదికి చేరాడు. అయ్యగారికేమవుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న భీముడు పరుగెత్తుకు వెళ్ళి లింగారెడ్డికి చేయందించి మెట్లపైకి చేర్చాడు. లింగారెడ్డి చేతిలో పిల్లను చూడగానే అప్పటిదాకా కేకలు పెట్టినామె వచ్చి "అయ్యో తల్లీ. నన్నిడిసి పోయినావంటే. నా బంగారవా. ఈ మాయదారి సెరువు నిన్ను పొట్టనెట్టుకుంది గదే" అని శోకాలు మొదలుపెట్టింది. "నోరుముయ్యవే రత్తీ. అసలేమయిందో సూడకుండా ఏంటే ఆ కేకలు" అని రత్తాలును తిట్టి ఆ పిల్ల పొట్టమీద నొక్కి నీళ్ళు కక్కించాడు మరిడయ్య. ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. శ్వాస ఆడుతోంది. గబగబా పొట్టలో చేరిన మిగిలిన నీటిని కూడ బయటకు కక్కించి, అరచేతులు అరికాళ్ళు రుద్దారు భీముడు, మరిడయ్య. ఆ పిల్ల మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఊపిరి పీల్చుకున్నారందరూ. "సామీ. నువ్వు దేవుడివయ్యా. ఎవురికీ పనికిరామని ఊరి సివరకు ఇసిరేసిన మమ్మలందరినీ వచ్చి గట్టుకు సేర్సడమే కాక, పేనాలకు తెగించి నా బిడ్డను కాపాడినవు. నీ రునం ఎట్టా తీర్సుకోము సామీ" అని ఏడుస్తూ లింగారెడ్డి కాళ్ళమీద పడింది రత్తాలు. "అయ్యా. అది అన్నమాట నిజమయ్యా. ఇసయం తెలవంగానే మాకెరికసేసి, ఇంతదనక వచ్చి మమ్మల్ని కాపాడినోరిని, నేను పుట్టి బుద్దెరిగాక సూడనేదయ్యా. బిడ్డ కొట్టకొత్తుందని సూసి, నీ పేనానికి తెగించి, ఏటికి ఎదురీది, ఆడతల్లి కన్నకడుపును కాసినావంటే నిన్ను దేవుడనడం సానా సిన్నమాటయ్యా. ఎవుడికివాడు ఆడు బాగుంటే సాలనుకునే రోజులయ్యా ఇయి. అట్టాంటిది పల్లె జనంకోసం, మీ ఇంటిని వదిలేసి వచ్చినవంటే, నీ దొడ్డమనసుకు వందనాలయ్యా " కంటతడి పెట్టుకున్నాడు మరిడయ్య. జనమంతా కృతజ్ఞతతో లింగారెడ్డికి నమస్కారం చేశారు. "అయ్యో. ఏంటన్నలారా ఇది. నేను కూడ మీలాంటి మనిషినే. నన్ను నమ్మి మీ నాయకుడిగా ఎన్నుకున్నారు. మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మం. ఊర్లో ఎవరికి బాధ కలిగినా, దానిని నా బాధే అనుకుంటాను. అంతే తప్ప. ఇందులో నా గొప్పతనం ఏమీలేదు. రామయ్య వెంటనే స్పందించబట్టి మనందరం క్షేమంగా బయటపడ్డాం" అని అందరినీ సమాధాన పరిచాడు లింగారెడ్డి. ప్రవాహ ఉదృతి క్రమంగా తగ్గసాగింది. వరుణుడు కూడ చల్లబడడంతో వాన కూడ తగ్గింది. "అయ్యా మన ఊరి సుట్టుపక్కలా ఇంతలా వాన రావడం నాకు తెలివి తెలిసిన కాడనుంచి లేదు. ఎప్పుడు సూసినా తుంపర్లే తప్ప దారగా కురవనేలేదాయె. డ్యాము లీకయితేనే తప్ప మన సెరువుకు నీరే రాదాయె. ఏ మాయరోగమొచ్చిందో గానీ, ఇయాల మన బతుకులిట్టాగయినయి. పాకలు బోయె, బొచ్చెలు బోయె" మరిడయ్య మాటలు విని లింగారెడ్డి అతని భుజం తట్టాడు. "దిగులుపడకండి. ఇది మీ ఒక్కరి కష్టమే కాదు. మన ఊరందరిదీ. కాస్త వాతావరణం మారే వరకు మీరంతా మన పంచాయితీ ఆఫీసులోను, పాఠశాల భవనంలోను ఉండండి. మీ తిండి ఏర్పాట్లు నేను చూస్తాను. ముందు ఊర్లో వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కుందాం" అని సింహాద్రికి ఫోను చేశాడు. ఎటువంటి స్పందనా లేకపోయేసరికి సెల్ఫోను పనిచేయడం లేదని అర్థమయింది లింగారెడ్డికి. వెంటనే తల్లి, తండ్రి గుర్తుకు వచ్చారు. 'వాళ్ళు ఎలా వున్నారో? మిద్దె మీదకు ఎక్కారో లేదో. వచ్చేముందు వాళ్ళను లేపి చెప్పివచ్చినా బాగుండేది' మనసులో అనుకుంటూ, అదే మాట భీముడితో అన్నాడు. "అయ్యా. అమ్మగారూ, అయ్యగారూ ఇంటికాడ లేరు. నిన్న ఏదో పండగంట గదా. శివాలయానికి పోయినారు. ఆడనే రేతిరి నిదరజేస్తమన్నారు. మీకు సెప్పను మరిసిపోయినానయ్యా" తలగీరుకుంటూ చెప్పాడు భీముడు. "శివాలయానికా...కొంప ముంచావుగదురా. అర్జెంటుగా వెళ్ళాలి పద" అంటూ పరుగెత్తినట్లుగా బయలుదేరాడు లింగారెడ్డి. ఊరికి ఆ చివరవున్న శివాలయం బాగా పల్లపు ప్రాంతంలో ఉంది. చిన్న వానకే నీళ్ళు నిలుస్తాయి గుడిచుట్టూ. ఈ ప్రవాహాన్ని ఆలయం ఆపగలదా. బాగా పురాతనమైన ఆలయం. ముందురోజే అమ్మచెప్పింది. 'కార్తీక సోమవారంరా రేపు. నాన్నా, నేను ఉపవాసం వుండి గుడిలో నిద్రచేస్తామని'. అప్పటికీ చెప్పాడు ' వద్దమ్మా తుఫాను అంటున్నారు' అని. వినకుండా వెళ్ళారు. ఎలా ఉన్నారో ఏమో?. ***** "పుణ్యాత్ములు. కార్తీకమాసంలో కాలంచేశారు. వీళ్ళ భక్తికి మెచ్చి ఆ పరమేశ్వరుడు వీరికి శివసాయుజ్యం ప్రసాదించారు" అంత బాధలోను అక్కడి శవాలను చూసి అన్నాడు ఆలయ పూజారి పాపారావు. ప్రవాహ ఉదృతికి పూర్తిగా కొట్టుకుపోయింది శివాలయం. ఆరోజు రాత్రి అక్కడ నిదురిస్తున్న పదిమంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురి శవాలు మాత్రమే అక్కడి బండరాళ్ళ మధ్య ఇరుక్కుని దొరికాయి. మిగిలిన వాటికోసం గాలిస్తున్నారు. దొరికిన నాలుగు శవాలలో లింగారెడ్డి తల్లి శవం ఒకటి. 'తల్లి కట్టుకున్న చీర శివలింగానికి చుట్టుకుని ఉంది. తల్లి చేతులు లింగానికి గట్టిగా పట్టుకుని ఉన్నాయి'. లింగారెడ్డి ఊరి జనాన్ని తీసుకుని శివాలయానికి చేరేసరికి కనిపించిన దృశ్యమది. తండ్రి ఆచూకీ తెలియలేదు. భోరున విలపించాడు. కానీ ఏంలాభం. పోయిన ప్రాణాలు తిరిగిరావు. మనసు దిటవు చేసుకున్నాడు. 'ఊరందరినీ కాపాడగలిగాను కానీ, కన్నవారిని కాపాడుకోలేక పోయాను'. గుండె చెరువయ్యింది లింగారెడ్డికి. "ఊరందరినీ కాపాడిన మహానుభావుడిని అనాథను చేశాడు ఆ భగవంతుడు. ఏమిటో ఆయన లీల. అయినా కన్నవాళ్ళు లేకపోతేనేం మనమంతా ఉన్నాం. సర్పంచి గారు ఇకనుంచి మనందరి బిడ్డ" అందరి మనసులలో అదే ఆలోచన. చితి కుండను చేతిలోకి తీసుకుని ముందుకు కదిలాడు లింగారెడ్డి. నలుగురు కాదు, నలభై మంది పాడెను పట్టారు. కులమతాలకతీతంగా సాగింది, గతించిన నాలుగు శవాల స్మశాన ప్రయాణం. "మనకోసం మనం బ్రతకడం కాదురా. నలుగురి కోసం బ్రతకాలి. అప్పుడే పుట్టినందుకు సార్థకత. నాలుగు రాళ్ళు సంపాదిస్తే, తదనంతరం నలుగురూ పంచుకుపోతారు. అదే నలుగురి మేలు కోరుకుంటే, ఆ నలుగురూ నీవు చేసిన మేలు నలభై మందికి చెబుతారు. తరతరాలుగా నీ పేరు మనుషుల నోళ్ళలో నానుతూ ఉంటుంది. అందుకే నీకోసం, నీవారి కోసం బ్రతకకు. పదిమందిలో ఒకరిగా పదిమంది కోసం బ్రతుకు. పుట్టినందుకు నీకు, కన్నందుకు మాకు, జన్మ చరితార్థమవుతుంది. పుట్టిన ఊరిని మరువనివాడు పరమశివునికి ప్రీతిపాత్రుడురా. నువ్వు అలాగే ఉండు. ఏనాటికీ ఈ ఊరిని వీడక ఉంటూ, ఆ శివునిలో ఐక్యం కావాలనేదే నా చివరికోరిక. లింగా, సర్పంచ్ అంటే ఊరికి తండ్రిలాంటి వాడురా. ఊరిని భద్రంగా చూసుకో. నేను ఉన్నా, పోయినా నామాట మరిచిపోకు". లింగారెడ్డి సర్పంచి అయిన కొత్తల్లో తండ్రి రాజారెడ్డి చెప్పిన మాట ఇది. తండ్రి మాటలు చెవులలో మారుమ్రోగుతుంటే, కారే కన్నీటిని రెప్పల మాటున బంధించి తల్లి పార్థివదేహం ముందు నడవసాగాడు లింగారెడ్డి. ****** అయిపోయింది*******

మరిన్ని కథలు

SankalpaSiddhi
సంకల్ప సిద్ధి
- రాము కోలా.దెందుకూరు.
Voohala pallakilo
ఊహల పల్లకిలో
- కందర్ప మూర్తి
Vishanaagulu
విషనాగులు
- కొల్లా పుష్ప
Manishi nallana manasu tellana
మనిషి నల్లన..మనసు తెల్లన..
- బోగా పురుషోత్తం
Sandatlo Sademiya
సందట్లో సడేమియా
- అంబల్ల జనార్దన్
Viharayatralo vinodam
విహారయాత్రలో వినోదం
- కందర్ప మూర్తి