కోట బాట - ఎ.కృష్ణ మోహన్

Kota baata

ఊరికీ 25 కిలో మీటర్ల అవతల ఉన్న కిల్లాను చూడాలని ఎన్నాళ్ళ బట్టో అనుకుంటున్నా, ఎందుకో ఆ శనివారం కుదిరింది. ప్రదీప్ ను కూడా రమ్మని యిద్దరం కారులో బయల్దేరాం. కెమేరా, నా నోట్సు రాసుకునే పుస్తకం తీసుకున్నాను. ముందురోజు రాత్రి వర్షం తాలూకు చల్లదనంతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది.

వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఆ సంవత్సరం ముసురు వదలలేదు. ఊరు దాటి, పల్లెటూరి బాట పట్టాము. దారంతా అరటి, బొప్పాయి తోటలు పచ్చగా కనబడుతున్నాయి. కాపుకు వచ్చిన గెలలు గట్టిగా గాలి వీచినపుడు మెల్లగా ఊగుతున్నాయి. దూరాన అడవి పూల వాసన మోసుకుని గాలి మమ్మల్ని తరుముతూ ఉంటే హుషారుగా కోట చేరాలని బండి నడుపుతున్నాను. పేరుకి అది ఖిల్లానే గాని అక్కడ అంతగా చూడదగ్గ ప్రదేశాలు ఏమి లేవని నాకు తెలుసు. రాజుల యుద్దాలు. సామ్రాజ్యాల అంతర్యుద్ధాలలో అక్కడున్న కొన్ని కట్టడాలు కూడా నేలమట్ట మయ్యాయి. యిప్పుడు దిబ్బల్లాంటి రాళ్ళ కుప్పలు, దట్టంగా అల్లుకున్న అరణ్యం తప్ప ఏమీ లేదని వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారు.

కారు స్టీరియోలో ‘ఎందుకే నీ కంత తొందర’ పాట వినబడుతూ ఉంది. పాత పాటల ప్రేమికుడు ప్రదీప్ పాటను లయబద్దంగా పలుకుతూ ఉన్నాడు. పాట అయిపొయింది. పాటల volume తగ్గించి “ఏమీ లేని ఆ ఖిల్లా దగ్గరకు ఎందుకో ఈ రోజు programme పెట్టావు? నేనిదివరకు ఎప్పుడో వెళ్ళాను. అక్కడ ఏమీ లేదు” అన్నాడు ప్రదీప్. “ప్రదీప్ నేను చరిత్ర విద్యార్ధినిరా, ఎప్పుడో యిక్కడికి రావాల్సింది. ఈ రోజుకు తీరింది. యిక్కడి విశేషాలు, చారిత్రక అవశేషాలను జాగ్రత్తగా రికార్డ్ చేస్తాను. నువ్వు ఇంతకు ముందు వచ్చావు కదా? నాకు దారి చూపిస్తువులే” అని నేను అన్నాను.

“జన సంచారం పెద్దగా ఉండదు. నాకు తెలిసిన కొన్ని ప్రదేశాలు చూపిస్తాను. త్వరగా రికార్డ్ చేసుకుని వచ్చేద్దాము. వాతావరణం కూడా మారే అవకాశం ఉంది. మధ్యాహ్నం పైన భారీ వర్షం సూచనలు ఉన్నాయని చెప్పారు” అన్నాడు ప్రదీప్. ప్రదీప్ చెప్పినట్లుగానే వెలుతురు తగ్గింది. మేఘాలు మెల్లగా కమ్ముకుంటునట్లు అనిపించింది.

“రేయ్ వాతావరణం బాగా లేదు. వెనక్కిపోదాం పద” అన్నాడు ప్రదీప్. ఇంకొక అరగంటలో అక్కడికి చేరుకుంటాము. ఇంతదాకా వచ్చి వెనక్కి పోవడమేమిటి? త్వరగా వెనక్కి వచ్చేద్దాంలే” అంటూ నేను ముందుకు నడిపాను.

ఖిల్లాను సమీపించే కొద్దీ రోడ్డు పలు మలుపులు తీసుకోవడం ప్రారంభించింది. చివరికి బాగా గుంతలు పడిపోయిన రోడ్డుకి ఓక వారగా కారు ఆపి, డొంక రోడ్డుపై నడుచుకుంటూ ఖిల్లా దారి పట్టాము. అక్కడక్కడ ఖిల్లాకు దారి అన్నట్టు వెలిసి పోయిన బోర్డులు ఒకటి రొండు కనబడ్డాయి. దొంకదారి చుట్టూ మానులు, వాటిని అల్లుకుని చిన్న చిన్న పొదలు, లతలతో చిట్టడవి వ్యాపించి ఉంది. ప్రదీప్ నన్ను తిట్టుకుంటూ, అడుగుతీసి అడుగువేస్తూ జాగ్రత్తగా నడుస్తున్నాడు. కాంక్రీటు అరణ్యం వెలుపల ప్రశాంతమైన ఆ అడవి బాటలో నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. అలిసిపోయి, సొమ్మసిల్లుతున్న మనస్సుకి ప్రకృతి స్వాంతన లభించినట్లుగా అనిపిస్తోంది.

ఖిల్లా దగ్గిర పడుతున్న కొద్దీ, దారి ఏటవాలుగా మారుతోంది. పెద్దగా జన సంచారం లేని దారి అన్నట్లు పిచ్చి పొదలు దట్టంగా అల్లుకు పోగా, చెట్టు కొమ్మ త్రుంచి దారి ఏర్పరుచుకోవలసి వస్తోంది. గొర్రెల కాపరులు ఒకరిద్దరు దూరంగా కనబడుతున్నారు. “తమ్ముడూ ఖిల్లాకి దారి ఇదేనా?” అని వారిలో ఒకరిని ప్రదీప్ అడిగాడు. “అన్నా ఇది సరైన దారి కాదు. వెనుక నుంచి రావాలి. కానీ కొద్దిగా మెట్లు ఎక్కితే అట్నుంచి చేరుకోవచ్చు” అంటూ దారి చూపించాడు.

“హేయ్ హేయ్” అంటూ గొర్రెలు తోలుకుంటూ అతడు చెట్ల వెనకాలకు వెళ్ళిపోయాడు. క్రింది నుంచి ఖిల్లా అందాలు చిత్రీకరించేందుకు నేను నా కెమేరాకు పని పెట్టాను. ఆ ఖిల్లాను మరుగున పడిపోయిన చారిత్రక ఆణిముత్యం అని చరిత్రకారులు ఎందుకు పేర్కొంటారో అప్పుడే అర్ధమవుతోంది నాకు. శిధిలమైపోయిన శిల్పాలు, కృంగిపోయిన మంటపాలలో యింకా జీవ కళ ఉట్టిపడుతున్నట్లే అనిపిస్తోంది. విశాలమైన ఆ అలనాటి మహల్ చుట్టూ అనంతమైన నిశ్శబ్దం మధ్య నేనూ, నా స్నేహితుడు ప్రదీప్ సాహస యాత్రికులలాగా అడుగులేస్తున్నట్లు అనిపించింది. యింకాసేపటికి ఖిల్లా మధ్య లోకి చేరుకున్నాము. కొత్తగా అనిపించిన కూతలతో కొన్ని పక్షులు అటూ ఇటూ ఎగురుతున్నాయి.

ప్రదీప్ నా కంటే కొంత వెనుకబడ్డాడు. నా కళ్ళు నన్ను ఏమార్చాయా లేక ఏదైనా విద్యుత్ రేఖ మెరిసి మాయమయ్యిందా అన్నట్లు దూరంగా అప్సరసను తలదన్నే అందమైన యువతి కనబడి మాయమయ్యింది. గాజులు, గజ్జెలు గలగల అన్నట్లుగా శబ్దాలు వినబడుతున్నాయి.

లిప్తకాలం కనపడి మాయమైన ఆ యువతి నన్ను ఆ వైపునకు లాక్కెళ్ళింది. ఆ కొండ మలుపులో లేదా ఆ చెట్టు వెనకాల నాలాగే చారిత్రక ఆనవాళ్ళు వెతుకుతూ కనపడక పోదా అన్న ఆలోచన నన్ను ఆవహించింది. ప్రదీప్ వెనకాలే వదలిపెట్టి, ఆ యువతి అన్వేషణలో నేను ముందుకు సాగాను. నేను ఊహించినట్లుగానే యక్షిణి శిధిల శిల్పం వద్ద నిలబడి ఏదో పరిశీలిస్తున్న ఆ దేవలోకపు అప్సరస నాకు కనిపించింది. ఎలాగైనా పరిచయం పెంచుకుందామని నేను ఆమె వైపుకు వెళ్ళాను. యిప్పుడు ఆమె శిల్పం నాకు యింకా స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఓక అందాల రాసి. పరమాద్బుతమైన సౌందర్యం ఎదో లోకం నుంచి, కాల ప్రవాహాన్ని జయించి కళ్ళ ముందు సాక్షాత్కారమైనట్లు ఉన్నది ఆమె రూపం. నేను దగ్గిరకు వెళితే ఆమె మళ్ళీ మాయమైపోతుందేమో అన్న భావన నన్ను దూరంగానే ఉండమన్నది. కవి తలపోసిన రూపమో లేక శిల్పాచార్యుడు చెక్కిన లావణ్యమో తిరిగి వచ్చినట్లు ఆమె దగ్గిర ఉండడం చేత యక్షిణి శిల్పంలో క్రొత్త అందాలు వచ్చాయి.

ఆమె ఆగమనం వాతావరణాన్ని యింకా మార్చినట్లు అనిపించింది. మెల్లగా వీస్తున్న గాలులు తీవ్రత పెరిగి హోరు శబ్దంతో వర్షం ప్రారంభమయ్యింది. నేను త్వరగా నడుచుకుంటూ ఆమె నిలుచున్న మంటపం లోనికి అడుగు పెట్టాను. చిరునవ్వుతో నన్ను గమనిస్తూ ఆ మంటపంలో ఆమె అటూ యిటూ నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఆమె దుస్తులు, అలంకరణ చూస్తుంటే నాకేదో విచిత్రంగా అనిపిస్తోంది.

ఆమెను చూస్తుంటే ఈ కాలం మనిషిలాగ అనిపించలేదు. ఆమె అలంకరణ అప్పటి శిల్పాలకు ప్రతి రూపంలాగా ఉంది.

“ఏమండీ మీరు యిక్కడి వారేనా?” నా ప్రశ్న ఆమెకు చేరినట్టు లేదు. అవుననో, కాదనో తెలుపకుండా ఆమె మందహాసం చేసింది. ఖిల్లా గురించిన కధలు చాలా మంది అంతకు మునుపు అనుకుంటుంటే విన్నాను. కొంతమందికి చిత్ర విచిత్ర మయిన దృశ్యాలు కనపడ్డాయని, యిదే మంటపంలో ఒక వ్యక్తికి యిలాంటి యివతి కనపడిందనీ, ఆ తర్వాత స్ఫ్రుహ తెలియకుండా పడిపోయాడనీ. మరుసటి రోజు సెక్యురిటి వాళ్ళు కనుక్కునేంత వరకూ అతనక్కడే ఉన్నాడు. అతని దగ్గిర ఉన్న నగదు, బంగారు ఆభరణాలు అవీ ఎవరో తీసేసుకున్నారని అతను చెప్పాడు. యిప్పుడు నాకు అలాంటి అనుభవమే ఎదురవ్వభోతున్నదా?

ఒకవేళ అలా జరిగినా భాధ లేదు. అలాంటి అప్సరసతో ఒకసారి సంభాషించడం, ఆమెతో పరిచయం ఏర్పడడం. ఓహో మదురమైన అనుభవం కాదా?

నాట్య మంటపంలో యిప్పుడు మధురమైన వాయిద్య ఘోష ప్రారంభమయ్యింది. లయబద్దంగా సాగుతున్న ఆ సంగీతానికి ఆ సుందరి నాట్యం చేయడం ఆరంభించింది. యక్షిణి శిల్పాలను తలదన్నే భంగిమలను అభినయిస్తూ అనేక నృత్య రీతులను ఆవిష్కరిస్తూ ఆ నర్తకి చేసిన నాట్యాన్ని నేను అలాగే చూస్తూ ఉన్నాను.

సంగీతం నన్ను ఏదో దివ్య లోకాలకు తీసుపోతున్నట్లుగా ఉంది. యింతలో ఆ సుందరి నా వద్దకు వచ్చి నా చేయి పట్టుకుని లోనికి తీసుకు వెళ్ళింది. అక్కడ మండుతున్న హోమ గుండం చుట్టూ నాట్యం చేస్తున్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు. నన్ను తీసుకొచ్చిన ఆ సుందరికి దారిచ్చి వారందరూ తిరిగి నాట్యం ప్రారంభించారు. అక్కడ రంగు రంగుల ఫలాలు, ఫలహారాలు, భక్ష్యాలు అమర్చి ఉన్నాయి. నేను అటు ఇటు చూసేలోగా మేమిద్దరం తప్ప మిగతా అందరూ అక్కడి నుంచి మాయమైనారు.

నన్ను తాకిన ఆ అప్సరస స్పర్శ ఎంత చల్లగా ఉన్నది. హిమపాతపు రేణువుల్లోంచి, పెల్లుబికిన శిలాజం లాంటి ఆమె స్పర్శ నన్ను ఏ మాత్రం నియంత్రించ లేక పోయింది. ఆ మదన్మోత్త, అద్భుత సౌందర్యం, మంద్ర సంగీతం, పుష్పాల సుమధుర పరిమళం నన్ను వివశుడిని చేస్తున్నాయి. జ్వర పీడితుడి లాగా నా శరీరం కంపిస్తోంది. ఈ క్షణం వదిలేస్తే, మరి ఈ జన్మకి యిక ఈ అవకాశం రాదేమో అనే ఆత్రుతతో ఏదో చేయాలని చూస్తున్నాను. నన్ను ఉద్రేక పరచడానికే అన్నట్లు ఆ అప్సరస ఓక రమ్యమైన నాట్యం ప్రారంభించింది. వృత్తాలలో తిరుగుతూ నన్ను సమీపిస్తూ దూరమవుతూ ఒక్కొక్క వలువనే వదలి వేస్తూ నన్ను లోబరుచుకుంటూ ఉంది.

ఆమె ప్రతి భంగిమ శృంగార రస ఆస్వాదనకు సిద్దమా అన్నట్లుగా ఉన్నాయి. ఆమె కవ్వింపు నన్ను రమ్మని ఆనంద మధుర కేళిలో పాలు పంచుకోమన్నట్లుగా ఉన్నది. అతి కష్టం మీద మైమరపులో ఆమెను సమీపించాను.

బాహువులలోకి ఆమెను తీసుకొని పెదవులపైన చుంభించగానే విద్యుత్ వలయాలు, ప్రవాహాలు బదులు హిమవత్ పర్వతాల మంచు కణికలు నన్ను ఆవహించినట్లు అనిపించింది. అదే సమయంలో తెరలు తెరలుగా ఆమె చేసిన వికటాట్టహాసం నన్ను ఏమీ చేయలేని వాడిగా మార్చేసింది. ఆమె నగ్న దేహం కనిపించినంత వేగంగా అద్రుశ్యమైపోయింది. నా visions లో సమయం ఎంత అయిందో నేను తెలుసుకోలేక పోయాను. ఎలాగో నేను ఉన్న ప్రదేశం నుంచి బయటకు వచ్చి చూస్తే చుట్టూ ఆద్భుతమైన నిశబ్దం ఆవరించి ఉంది. అప్పటి వరకూ బాగా వర్షం పడిందేమో!

శీతల గది కన్నా తక్కువగా అనిపిస్తున్న ఉష్ణోగ్రత శరీరంలో వణుకు పుట్టించింది. రాత్రి కాకపోయినా కాంతి అంతరించడం వలన క్రమ్ముకున్న నిశీధి మధ్య ఖిల్లా తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. దాని రూపం అంతా వ్యాప్తమై నాలో ఆవహిస్తున్నట్లు అనిపిస్తోంది. అప్పటి వరకు లేని భయం నన్ను నిలువెల్లా ఆవరించింది. నేను దాటుకుని వచ్చిన ఖిలా దారి చాలా దూరంలో కనిపిస్తోంది. ప్రదీప్ ప్రదీప్ అని అరుచుకుంటూ నేను అటువైపు పరిగెత్తాను. సుందరమైన దేవకన్య, ఊర్వశి లేదా హెరా లేదా మినర్వా లేదా వీనస్ లేదా Eve ఎవరో నన్ను అంతరిక్షంలోంచి చూస్తున్నట్లు అనిపించింది.

ఎలాగోలా కారు ఆపిన దగ్గిరకు చేరుకున్నాను. కారు ఎక్కడ పెట్టామో అలాగే ఉంది. నేను ఆపసోపాలు పడుతూ కారు డోరు తెరిచాను. నేను తీసుకువెళ్ళిన నోట్సు, కెమెరా అన్ని అక్కడే వదిలేశాను. ఖిలాను సందర్శించినందుకు నా దగ్గిర ఒక్క ఆధారం కూడా లేదు. ఖిలాలోని ఎత్తైన తోరణం నుంచి ఒక స్త్రీ నా వైపు కాగడా చూపిస్తున్నట్లు నాకు లీలగా కనిపిస్తోంది.

ప్రదీప్ జాడ లేదు, కారులో తినడానికి ఎలాంటి పదార్ధాలు లేవు. అగాధపు లోతుల్లో, రహస్య మందిరంలో అజ్నాత రాజు సమావేశం నిర్వహించినట్లు అది శ్రద్ధగా అందరూ ఆలకిస్తున్నట్లు ఖిలా అంతా నిశబ్దంగా ఉంది. ఆ ప్రశాంత నిశీధ ప్రదేశం నాకు నిషిద్ధం అని తోస్తోంది.

టార్చ్ లైటు పట్టుకొని అటు ఎటు తిరుగుతూ ఉండగానే కోటకి Night guard అటు వైపుగా వచ్చాడు. “బాబూ ఈ కారులో నా ఫ్రెండ్ ప్రదీప్ అనే అతను నాతో వచ్చాడు. మీరేమైనా చూశారా ?

“లేదు కానీ Day gurad నాకు ఎదురై చెప్పాడు. ఎవరో ఇద్దరు వచ్చారనీ, వారిలో ఒకరు ఖిలా పైన మంటపంలోకి వెళ్లి ఇంతవరకు వెనక్కి రాలేదనీ ఎదురుచూచి అతని స్నేహితుడు తిరిగి టౌనుకి వెళ్ళిపోయాడనీ చెప్పాడు.” “అ ఇద్దరం మేమే. నేను మంటపంలోకి వెళ్ళాను. నాకు సమయమే తెలియలేదు! అక్కడ కనిపించిన దృశ్యం నన్ను కట్టిపడేసింది. నేను అక్కడే ఆగిపోయాను.”

వాచ్-మాన్ నన్ను తేరిపార చూస్తున్నాడు. “ఏమైందో నాకు తెలియదు. ఎవరో ఒక అందాల సుందరి అక్కడ నాకు కనపడింది. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాను.”

“ఇక్కడికి ఎవరు రారు. ఈ రోజు మీరిద్దరు మాత్రమే వచ్చారని Day guard నాకు చెప్పాడు. మీకు కనిపించినదేదో మాకెవ్వరికి తెలియదు. మీరు బయట చెప్పినా ఎవరు నమ్మరు. పిచ్చివాడిగా చూస్తారు.” నా అమాయకత్వాన్ని చూచి అతడు నవ్వుతున్నట్లుగా అనిపించింది. “లేదు నాక్కనిపించింది” “ఫోండి సార్. మీ ఫ్రెండ్ వెళుతూ చెప్పి వెళ్ళాడు. మీరు కనపడితే వచ్చి ఇలాంటిది ఏదో కథ చెబుతారని. రాత్రికి మందు, బిర్యాని తెచ్చుకున్నాను. నాతో రండి పైన పార్టీ చేసుకుందాము. పడుకుని రేపు ఉదయాన్నే వెళుతురు గానీ అప్పటికి అన్నీ మర్చిపోయి మామూలు అవుతారు.” అంటూ అతను దారి తీశాడు.

మరిన్ని కథలు

SankalpaSiddhi
సంకల్ప సిద్ధి
- రాము కోలా.దెందుకూరు.
Voohala pallakilo
ఊహల పల్లకిలో
- కందర్ప మూర్తి
Vishanaagulu
విషనాగులు
- కొల్లా పుష్ప
Manishi nallana manasu tellana
మనిషి నల్లన..మనసు తెల్లన..
- బోగా పురుషోత్తం
Sandatlo Sademiya
సందట్లో సడేమియా
- అంబల్ల జనార్దన్
Viharayatralo vinodam
విహారయాత్రలో వినోదం
- కందర్ప మూర్తి