దైవం మానుష రూపేణా - జీడిగుంట నరసింహ మూర్తి

Daivam manusha roopenaa

"ఇదిగో రామూ నా వెంట రా. ఒక పది నిమిషాలు నీతో పని ఉంది. నీ సహాయం ఉంచుకోనులే" అన్నాడు మధు. .

రాము ఎన్నో సార్లు మధు ఇంట్లో దొడ్లో పూల మొక్కల చుట్టూ కలుపు మొక్కలు తీసేయడం, వాటి చుట్టూ పళ్ళాలు తవ్వి చక్కగా నీళ్ళు పోసే పనులు దగ్గరనుండి అప్పుడప్పుడు బజారు వెళ్ళి కూరగాయలు తేవడం వరకు చిన్నా చితకా పనులు చేసి ఆ పూటకు ఆ ఇంట్లోనే అన్నం తినేసే వాడు. అతని పెళ్ళాం కూడా మధు ఇంట్లో బియ్యంలో రాళ్ళు ఏరిపెట్టడం , పప్పులు శుబ్రంగా చెరిగి ఇవ్వడం లాంటి పనులు చేస్తూ చేదోడూ వాదోడుగ ఉంటుంది.

మధు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతని చూసి చాలా మంది ఆశ్చరపోతూ ఉంటారు . ఒక పక్క ఉద్యోగం చేస్తున్నా, ఖాళీ సమయంలో ఎవరికో ఒకరికి తనకు తోచిన సహాయం చేస్తూ కనపడుతూ ఉంటాడు. ఇంతకీ మధు రామూని తన వెంట ఎందుకు రమ్మన్నాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఇంటినిండా తన బట్టలు, కొడుకు బట్టలు, కూతురు బట్టలు, ఇవి కాకుండా విదేశాలలో ఉండే అతని అన్నగారి పిల్లలు ఇండియా వచ్చినప్పుడు తెచ్చే బట్టలు వాడకం లేకుండా అల్మారాలలో ఎక్కడ పడితే అక్కడ మూలగడం చూసి వాటిని ఏదో విధంగా బీదవారికి అందేటట్టుగా చేయాలని అతని ప్రయత్నం.

రాము మధు వెంట మౌనంగా బట్టల సంచీ పట్టుకుని నడిచాడు. బాగా రద్దీగా ఉన్న బజారులో ఒక పెద్ద గోడ చూసి రాము చేత అటువైపోక మేకు , ఇటువైపొక మేకు కొట్టించి దానికి రెండు వైపులా గట్టి ఇనుప తీగ కట్టించాడు. ఆ తాడు మీద తను తెచ్చిన బట్టలు ఒక్కటొక్కటిగా వరసగా వేలాడ దీశాడు.

దానిపక్కనే ఒక కాన్వాస్ గుడ్డ మీద " గమనిక . ఇక్కడ తగిలించిన బట్టలు శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేయించి తెచ్చినవి. ఇవి ఎవరికైనా ఉపయోగపడతాయని భావిస్తే తీసుకువెళ్ల వచ్చు " అని వ్రాయించాడు. . ఇదంతా అక్కడ కొద్ది దూరంలో నిలబడి గమనిస్తూ ఉన్న ట్రాఫిక్ పోలీసు " ఏమిటిదంతా ?" అంటూ సూటిగా ప్రశ్నించాడు.

" అదే మీ దృష్టికి తీసుకువద్దామని అనుకుంటున్నాను సార్ . ఇక్కడ తీగకు తగిలించిన బట్టలు మా ఇంట్లో నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటిని నేను ఏ స్టీల్ సామాను వాడికి వెయ్యడానికి ఇష్టపడటం లేదు. వీటిని ఇక్కడ ఉంచితే అత్యంత బీదరికంతో గడుపుతున్న వారు కానీ, అనాధ శరణాలయాల వారు కానీ వాడుకుంటారని ఈ ఏర్పాటు చేస్తున్నాను. దయచేసి ఇది ఏదో న్యూసెన్స్ అని అనుకోకుండా తమరు కూడా ఇందుకు సహకరించాలని కోరుకుంటున్నాను " అన్నాడు మధు ట్రాఫిక్ పోలీసుకు నమస్కారం చేస్తూ.

ట్రాఫిక్ పోలీసు రెండు నిమిషాల సేపు ఆ పేర్చిన బట్టల వైపు పరిశీలనగా చూశాడు. . దాదాపు అన్నీ కొత్త బట్టలు లాగానే ఉన్నాయి. ఎక్కడ చిరుగులు కనిపించడం లేదు .

" చాలా మంచిది సార్ . ఈ పద్ధతి ఇప్పటికే చాలా సిటీలలో చేస్తున్నారని విన్నాము. స్టీల్ సామానులు వాడికి ఒక స్పూన్ కోసమో, ఒక గరిట కోసం ఇంట్లో ఉపయోగంలో లేని బట్టలు పడేసే ఈ రోజుల్లో మీరు ఇటువంటి మంచి కార్యక్రమం తలబెట్టడం చాలా హర్షించదగ్గది. . మీరు చేస్తున్న ఈ పని పలువురికి స్పూర్తిదాయకంగా ఉంటుందని అనుకుంటున్నాను. మంచి పనులు ఎవరు చేసినా వాటికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది " అంటూ మధుతో చేయి కలిపి ట్రాఫిక్ పోలీస్ అక్కడ నుండి వెళ్ళి పోయాడు .

ఆ రోజు మధు పెళ్లి రోజు.

"ఏమోయ్ . ఈ రోజు మన పెళ్లి రోజు కదా. నేను ఎన్ని పనులు పెట్టుకున్నా నీ విషయం మర్చిపోలేదు. నువ్వు తయారైతే షాపుకు వెళ్ళి నీ సమక్షంలో నీకు నచ్చిన చీర కొంటాను. " అన్నాడు . అతని కళ్లలోని స్వచ్చత, అనురాగం ఆమెను కట్టి పడేసాయి . .

ఆ మాటలకు అతనివైపు విస్మయంగా చూస్తూ "ఏమండీ. నాకు ఇప్పటికే మీరు కొని పెట్టిన చీరలు, మా అక్కలు పెళ్ళిళ్ళల్లో పెట్టిన చీరలన్నీ అల్మారాలో గుట్టలు గుట్టలుగా పడిఉన్నాయి. ఎంత పెళ్లి రోజైనా మీ చేత మళ్ళీ కొత్త చీర కొనిపించుకోవడం నాకు ఇష్టం లేదండీ. నేనూ మీ దారిలోనే నడుస్తాను. ఈ పెళ్లి రోజుల పేరిటా, పుట్టిన రోజుల పేరిటా అనవసర అట్టహాసాలు, హంగామాలు వద్దండీ. దాని బదులు ఎప్పుడూ చేస్తున్నట్టుగానే ఇతరులకు ఉపయోగపడే ఏదో ఒక మంచి పని చేద్దామండీ. ఈ రోజు ఇంట్లో టమోటా పులిహార చేస్తాను. వాటిని చిన్న చిన్న పొట్లాలుగా చేసి ఏదైనా గుడి దగ్గర బయట బిక్షాటకులకు పంచిపెడదాం అండీ. దానితో పాటు ఒక మంచి నీళ్ళ ప్యాకెట్ ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఇలా ప్రతి పెళ్లి రోజు నాడు, పుట్టిన రోజు నాడు మనకు తోచిన సహాయం ఎవరికైనా చెయ్యడం, ఆ రోజు గుడిలో అర్చన చేయించి ప్రసాదం పంచిపెట్టమని చెపుదాం. అంది అతని భార్య విచిత్రమైన భావోద్రేకానికి గురవుతూ .

"అవును లక్ష్మీ. నువ్వు చెప్పింది చాలా బాగుంది.. భర్త చేసే మంచి పనులను అనుసరించే నీలాంటి భార్యలు ఎంతమంది ఉంటారు ? చీటికీ , మాటికీ బట్టల షాపులు చుట్టూ,నగల షాపుల చుట్టూ భర్తలను పిల్లలను తిప్పుతూ కష్టపడి సంపాదించిన డబ్బునంతా వృధా చేయిస్తారు కానీ అన్నార్తులను, దీనార్తులను ఆదుకోవడం విషయంలో పొరపాటున కూడా ముందుకు రారు. ఈ రోజుల్లో ఎవరికి వారు నన్ను ముట్టుకోకు నామాల కాకి అంటూ దూరంగా మసులుకుంటూ ఉండటం మామూలైపోయింది. . అవతలి వాడికి ప్రాణం మీదకు వచ్చినా తనూ తన కుటుంబం తప్ప వేరే ధ్యాస ఉండదు. నాకెందుకో చిన్న పిల్లలు అంటే సరే కానీ డబ్బై, ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా పుట్టిన రోజులు , పెళ్లి రోజులు అంటూ ఎంతో ఖర్చు పెట్టి విలాసంగా పండగలా చేసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా ఎంగిలి చేతితో కాకిని కూడా విసరరు. మనం ఆ పద్దతి నుండి దూరంగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. బ్రతికి నన్నాళ్లు మన కోసం బ్రతకడం కాకుండా నలుగురి కోసం జీవించాలి , సరే. సాయంత్రం ఇద్దరమూ వెళ్ళి గుడి దగ్గర ప్రసాదం పంచిపెడతాం . ఈ పెళ్లి రోజు మనకు తృప్తిగా గడిపిన అనుభూతిగా మిగిలిపోవాలి " అన్నాడు భార్య కోరికను గౌరవిస్తూ . . .

మధు తన మేన మామ గారింటికి వెళ్ళాడు ఆ రోజు.

"మామయ్యా అన్నదాన కార్యక్రమం గుళ్ళో చేయాలని అనుకుంటున్నాను. మీకు తెలిసిన గుడి మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ వంట శాలలో వంటలు వండుకోవడానికి పేదవారికి భోజనాలు పెట్టడానికి అనుమతి తీసుకుంటారా ?" అని అడిగాడు. అతని కంఠంలో అబ్యర్ధన కనిపిస్తోంది.

మేనల్లుడి గురించి ఆయనకు బాగా తెలుసు. అతను చేస్తున్న సేవలు దగ్గరుండీ కూడా చూసిన వాడు.

"తప్పకుండారా అబ్బాయి . అయితే ఈ రోజుల్లో దాదాపు అన్ని దేవాలయాల వారు ఈ అన్నదాన కార్యమాలను నిర్వహిస్తున్నారు. అందుకు వారికి తగిన నిధులు అన్నివైపులనుండి సమకూరుతున్నాయి. అందుకే వారు నిత్యాన్నదానాలు చెయ్యగలుగుతున్నారు. కానీ నీలాగా ఇలా ముందుకొచ్చి అన్నదానాలు చేసే వాళ్ళు తక్కువ. . . ప్రస్తుత సమాజంలో అన్నదానాలు పేరు మార్చుకుని అన్నశాంతి గా మారి బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర బంధువులను వ్రతాలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల పేరిట ఒకరినొకరు తమ స్టేటస్ కు తగ్గట్టుగా పిల్చుకుని అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా బ్రాంతిలో బ్రతికేస్తూ ఉంటారు. నా ఉద్దేశ్యంలో అది తమ గొప్పలను ప్రదర్శించుకోవడంలో ఒక భాగం అని నేనంటాను. అటువంటి పరిస్తితులలో వాటికి భిన్నంగా కేవలం సామాన్య జనాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం విశిష్టమైనది అని నేనంటాను . . సంకల్పం ఉంటే ఇటువంటి మంచి పనులు చెయ్యడానికి భగవంతుడు మనకి తగిన శక్తిని, ఆర్ధిక వనరులను పుష్కలంగా ఇస్తాడు. . ఈ పుట్టిన రోజు వేడుకలు , పెళ్లి రోజులు అంటూ విలాసవంత మైన జీవితాలను అనుభవించడంలో తృప్తి అనేది ఉండదు. అలాగే పెళ్ళిళ్ళల్లో ఖర్చుపెట్టే కోట్ల రూపాయలు కూడా బాగా డబ్బున్న వారి మధ్య సంబంధాలు బలపడటానికే తప్ప ఏ పేదవాడికీ మనం వృధా చేసిన పదార్ధాలు కూడా పంచడానికి ముందుకు రావడం లేదు. సరే ఈ సబ్జెక్టు గురించి మాట్లాడాలంటే చాలా పెద్దదవుతుంది. నువ్వు అన్నదాన కార్యక్రమం ఎప్పుడు తలబెట్టావో ముందుగా చెపితే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. నాకన్నా చిన్న వాడివైనా నీకు ఇటువంటి సద్భుద్ది కలగడం ఆ భగవంతుడు నీకిచ్చిన గొప్ప అవకాశం. మాలాంటి వాళ్ళు ఎందుకో కబుర్లుతో కాలక్షేపం చేసేస్తూ ఉంటాం కానీ నీ అంత ధైర్యం చెయ్యలేకపోతున్నాం . ఈ విషయం గురించి నీకు రెండు రోజుల్లో కన్ఫర్మ్ చేస్తాను. . " అని భరోసా ఇచ్చాడు మధు మామయ్య.

** ** ** **

"ఇదిగో లక్ష్మీ. మన కాలనీ చివర్లో వేంకటేశ్వర స్వామి గుడి వుంది. ఏ కారణం చేతనో దాన్ని ఎండోమెంట్ వాళ్ళు తీసుకోలేదు. ఆ గుళ్ళో పూజారులు , ఇతర నిర్వాహకులు కేవలం భక్తులు ఇస్తున్న విరాళాలు, వాటిమీదే జీవిస్తున్నారు . ఎంతోమంది స్వచ్ఛందంగా ఒక్క పైసా ఆశించకుండా గుడిలో పనిచేస్తున్నారు . గుళ్ళో చేసిన ప్రసాదం తిని అదే భాగ్యంగా భావిస్తున్నారు. నా పుట్టిన రోజు మరో మూడు రోజులలో వస్తోంది. ఆ రోజు నేను చేయబోయే కార్యక్రమం గుడి కెళ్ళి అందులో పూజా కార్యక్రమాలు నిర్వహించే అయ్యవార్లకు, అక్కడ విగ్రహాలు, ద్వజస్తంభం నిత్యం శుభ్రపరిచే వారికీ, గుడి ప్రాంగణాన్ని కడిగి ముగ్గులేసే వారికీ ఎంతో కొంత మన శక్తానుసారం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏ గుడిలోనైనా మనల్ని "పునర్దర్శన ప్రాప్తిరస్తు " అంటూ దీవిస్తున్నారంటే అదంతా మనం చేసుకున్న అదృష్టం . ఆ రోజు వీలైతే దేవుడికి ప్రసాదం చక్రపొంగలి, దద్దోజనము చేయించి ఇద్దాం. ఇటువంటి సత్కార్యాలకు నీ సహకారం సంపూర్ణంగా ఉంటుందని ఆశిస్తున్నాను " అన్నాడు మధు . నిష్కల్మషమైన అతని మాటల్లో ఎంతో నిజాయితీ కనిపిస్తోంది. .

"తప్పకుండా నండీ. అలాగే రాబోయే నా పుట్టిన రోజు కూడా ఏమి చెయ్యాలో అది కూడా ముందుగానే ఆలోచించి పెట్టండి. మన ఇద్దరికీ ఒకే లక్ష్యం ఉండటం మన అదృష్టం. అయితే నాదో కోరిక . మన ఇద్దరికీ సంబంధించిన విషయంలో ఒక మంచి లక్ష్యంతో చేసే ఇటువంటి మంచి పనులు నా అభ్యంతరం అంటూ ఉండదు. కానీ మన పిల్లల విషయంలో మటుకు కొంత సడలింపు ఇద్దామండీ. పాపం వాళ్ళ కోరికలు ఎప్పుడు తీరుతాయి ? వాళ్ళు వాళ్ళ మిత్రులను పిల్చుకుని పుట్టిన రోజుల పండగలను సెలబ్రేట్ చేసుకుంటామంటే మనం అడ్డు చెప్పొద్దు .వాళ్ళ మనసులు బాధపడతాయి. ఏమంటారు ?" అంది లక్ష్మి చెమర్చిన కళ్లను చీర కొంగుతో అద్దుకుంటూ.

"ఇదా నువ్వు నన్ను అర్ధం చేసుకున్నది ? మన వయసు వాళ్ళు అనవసర ఆర్భాటాలకు పోకూడదని నా ఉద్దేశ్యం. బయట ప్రపంచంలో ఒక పూట తినడానికి కూడా లేక ఆకలితో అలమటిస్తున్న ఎంతోమందిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా కొన్ని పండగలను, పెద్దల పుట్టిన రోజు, పెళ్లి రోజుల విషయంలో ఖర్చులు తగ్గించి ఆ డబ్బును ఇతర ప్రయోజనాలకు మళ్లించాలని తప్ప ఇంట్లో వాళ్ళను ఇబ్బందిపెట్టాలని నాకు లేదు " అన్నాడు మధు ఆత్మ విశ్వాసంతో.

** ** ** **

"రండి మధుసూధన్ గారు. చాలా రోజులయ్యింది మిమ్మల్ని చూసి " అన్నాడు రాజారావు.

"అవును సార్. ఏవో పనులు పెట్టుకుని తిరుగుతున్నాను. అన్నట్టు ఇప్పుడు మీ సుగర్, బీపీ కంట్రోల్లో ఉంటోంది కదా ? రెగ్యులర్ గా వాకింగ్ అదీ చేస్తున్నారా ?" అని అడిగాడు .ఆప్యాయతతో కూడిన మధు పలకరింపుకు రాజారావు పొంగిపోయాడు.

" ఏం కంట్రోలో ఏమిటో మధు గారు. కంట్రోల్ అనే దానికన్నా తొక్కిపెడుతున్నాం అంటే బాగుంటుంది. . మనని కుట్టడానికి సిద్దంగా విష పురుగులను పైకి రాకుండా కాలి చెప్పుతో తాత్కాలికంగా తొక్కి పెట్టడం లాంటిదే ఈ మందులన్నీ. వాటిని చంపగలిగినప్పుడే అవి కుట్టవని భరోసా ఉంటుంది. కానీ ఈ బీపీ, సుగర్ లాంటి రోగాలను తొక్కిపెట్టడం తప్ప వాటిని పూర్తిగా నిర్మూలించలేము. . టాబ్లెట్స్ అయితే గుప్పెళ్ళ కొద్దీ మింగుతున్నాం. కేరమ్స్ బోర్డు లో ఒక కాయను కొడితే ఇంకో కాయకు తగిలి పడినట్టు ఈ మందులు వెళ్ళి ఏ పార్ట్ ను పాడుచేస్తాయో ఎవరికీ తెలియదు. గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతకాల్సి వస్తోంది " అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు రాజారావు.

" దాని గురించే మాట్లాడాలని ఈ రోజు ప్రత్యేకంగా మీ దగ్గరకు వచ్చాను. ఈ మధ్యకాలంలో కొన్ని శాస్త్రీయ పరిశోధనలు చేసిన దరిమలా ప్రముఖంగా కొన్ని మొక్కలను ఈ రోజుల్లో ఎంతోమంది ఎదుర్కుంటున్న భయంకరమైన రోగాలకు దివ్య ఔషధంలా పనిచేస్తాయని గుర్తించారు. . అందులో తిప్పతీగ ,జామ వేళ్ళు, వాటి ఆకులు ,ఇంకా ఇన్సులిన్ చెట్టు ఆకులు. మొదలైనవి. ఈ చెట్లు మన దొడ్లో ఉంటే ఈ ప్రమాదకరమైన రోగాలనుండి సగం బయటపడినట్టే. మీరు ఆల్రెడీ వేసుకుంటున్న మందులకు తోడు ఉదయమూ, సాయంత్రమూ వీటిని ఏదో రూపంలో లోపలకు తీసుకుంటే బీపీలు, షుగర్లు చక్కగా కంట్రోల్లో ఉంటుంది. . ఇవి చాలా మంది నా మిత్రులు, బంధువులు వాడి ప్రయోజనం పొందారు. ఈ చెట్లు అన్నీ మా ఇంట్లో వేశాను. ఇప్పటికే ఈ చెట్లు మన మిత్రులకు చాలా మందికి ఇచ్చాను దొడ్లో వేసుకోమని. మీకు కూడా తెచ్చాను. . అన్నట్టు ఈ మొక్కలే కాకుండా తెల్లగలిజేరు అనే మొక్కను కూడా పెంచుతున్నాను. దీన్నే పునర్ణవ అని శాస్త్రీయనామంగా కూడా పిలుస్తారు. ఇది కొద్దిగా పెద్దదయ్యాక మీకు ఇస్తాను. ఈ ఆకుతో చేసిన కషాయం కిడ్నీకి సంబందించిన అన్ని రకాల వ్యాధులకు రామబాణం లాగా పనిచేస్తుందని మన ఆయుర్వేద శాస్త్రం , దానికి సంబంధించిన డాక్టర్లు పరిశోధనా వ్యాసాల ద్వారా ప్రతి ఇంట్లోనూ దీని వాడకం పెరిగేటట్టు చేస్తున్నారు. . ఈ సారి మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు ఈ మొక్కల గురించి మరింత వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కొన్నాళ్లు వీటిని వాడి చూడండి. ఇవి ఏ మాత్రం రియాక్షన్ ఇవ్వవు . ఇదేమిటి వీడు డాక్టర్లకు మించి మాట్లాడుతున్నాడు అని దయచేసి అనుకోకండి. మనకు తెలిసిన వైద్య రహస్యాలు నలుగురికి చెప్పడం ద్వారా సమాజానికి ఎంతోకొంత మేలు చేసినట్టవుతుందని నా ఉద్దేశ్యం. అయితే నేను ఉచిత సలహాలే కాకుండా ఎటువంటి స్వార్ధం లేకుండా ఆ మొక్కలు కూడా నా శక్తానుసారం పంచిపెడుతున్నాను. " అంటూ అక్కడనుండి కదిలాడు మధు .

మధు ఇంటికి తిరిగి వస్తూంటే ఇంటిముందు జనం మూగి ఉండటం గమనించాడు. రోడ్డుమీద ఎన్నో రోజులుగా పూడ్చకుండా వదిలేసిన గుంటలో ఎవరో ముసలి వ్యక్తి పడి కాలు విరగకొట్టుకున్నాడు అని గ్రహించాడు. ఆ గుంటను తప్పించుకుంటూ వెళ్ళే వాళ్ళే కానీ ఎవరూ కూడా మునిసిపాలిటీ వాళ్ళకు కంప్లయింట్ చేసిన వాళ్ళు లేరు. అప్పటికే ఆ గుంటలో పక్కనే ఉన్న స్కూలు నుండి వస్తున్న చిన్న పిల్లలు ఎన్నో సార్లు పడి మోచిప్పలు పగలకొట్టుకున్నారు.

ఇక ఇలా చూస్తూ ఉంటే లాభం లేదని చుట్టుపక్కల నాలుగిళ్ళ వాళ్ళను పోగుచేశాడు మధు . మనం తలో కొంత డబ్బు వేసుకుని మన వాకిట ముందున్న మరో రెండు గుంటలను కూడా పూడ్చేస్తే మన ఇంట్లో ముసలి వాళ్ళు , చిన్న పిల్లలు ప్రమాదాలనుండి బయటపడే అవకాశం ఉంటుందని వారికి సలహా ఇచ్చాడు.

" అయ్యా మధు గారు ఈ ఐడియా మాకు రాలేదనుకున్నారా ? మునిసిపాలిటీ వారే ఆ పని చెయ్యాలి. వాళ్ళను కాదని మనం ఇటువంటి పనులు ముట్టుకుంటే మన మీద కేసులు కూడా పెడతారుట. ఇంతకు ముందు ఇక్కడ రోడ్డు పక్కన పెరిగిపోయిన ముళ్ళ చెట్లను, పిచ్చి చెట్లను మనుష్యులను పెట్టి తీయించే ప్రయత్నం చేస్తే మాకు శృంగభంగం అయ్యింది. వాళ్ళ చేత చివాట్లు తిన్నాము. మీకు అంత ధైర్యం ఉంటే ఆ గుంటలను దగ్గరుండి మీ డబ్బుతో మీరే పూడ్పించండి. దయచేసి మమ్మల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి " అంటూ ఊకుమ్మడిగా అక్కడి వాళ్ళు అంటూంటే మధుకు వాళ్ళ మీద కోపం రాలేదు. ఈ రోజుల్లో అవతలి వారికి చెప్పడం కన్నా ఏదైనా మంచి చేయాలని అనుకుంటే మనకు మనం అనుకున్నదే తడవుగా చేసెయ్యడం ఉత్తమైన పని అతని ఉద్దేశ్యం. తర్వాత చేయవలసిన కార్యక్రమం గురించి ఆలోచిస్తూ అక్కడనుండి వెళ్లిపోయాడు మధు. .

అనుకున్నట్టే మధు ఒక పెద్ద షాపు దగ్గరకెళ్లి సిమెంట్, కాంక్రీట్ రాళ్ళు వగైరా తీసుకొచ్చి బాగా గుంటలాగా ఏర్పడిన ఆ ప్రదేశంలో తన భార్య సహాయం తీసుకుని పూర్తిగా పూడ్చేశాడు. దానిమీద పక్కనే ఉన్న ములగచెట్టు కొమ్మలను విరిచి ఎవరూ తొక్కకుండా వేశాడు. మధు , అతని భార్య చేస్తున్న పనిని ఆ సందులోని ఇళ్ల వారు చోద్యం చూస్తున్నట్టుగా ఉండిపోయారు తప్ప కనీసం ఎవరూ సహాయపడటానికి కూడా ముందుకు రాలేదు.

ఇప్పుడు చిన్న పిల్లలు స్కూళ్లనుండి , బాటసారులు, వాహనదారులు ఎంతో ఆనందంగా ఆ రోడ్డుమీద నుండి వెళ్ళి పోతూ ఉంటే మధు , లక్ష్మి బాల్కనీనుండి చూస్తూ ఎంతో సంతోషపడి పోయారు.

"సార్ . మీరు పనిగట్టుకుని ఈ సమాజానికి ఎన్నో సేవలు చేస్తున్నానని అనుకుంటున్నారు కదా. దీనివల్ల మీకు ఏమైనా కలిసి వచ్చిందా ? " అడిగాడు మధు పక్కింటి వాసుదేవరావు . .

" అయ్యా ఈ సమాజానికి నేనేదో గొప్ప పనులు చేసేస్తున్నానని అనుకోవడం లేదు. ఈ రోజు నేనేదో కొత్తగా ఇవన్నీ చేస్తున్నది కాదు. మనకు తెలియకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులలో భయంకరమైన వ్యాధులతో తీసుకుంటున్న వారికి వైద్య సహాయం కోసం లక్షల రూపాయలు మానవతా దృక్పథంతో ఇచ్చే వాళ్ళు ఉన్నారు. చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా ఆర్ధికంగా ఏమీ లేని కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేస్తూ స్కాలర్షిప్పులు కూడా అందించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వరదలు, తుఫానులు వచ్చి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు మనసున్న మహారాజులు ఎన్నో విధాలుగా తోడ్పడుతున్నారు. వాళ్ళందరూ చేసే దానితో పోలిస్తే నేను చేసేది చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇంతమంది ఎన్నో రకాలుగా చేస్తున్నా చాలా మంది ఎటువంటి పబ్లిసిటీ ఇచ్చుకోరు. . ఇక ప్రభుత్వాలు చేస్తున్న సేవలు ఇంతా అంతా కాదు. అదంతా ప్రభుత్వం బాధ్యత అని కొట్టి పారేస్తాం. ఇన్ని విధాలుగా ఒకరికి ఒకరు తోడుండటం వల్లే ఈ మాత్రం క్షేమంగా జీవించగలుగుతున్నాం. అలా ఎంతో కొంత సమాజానికి సేవ చెయ్యడంలో ఉన్న తృప్తి జీవితంలో మనం ఎంత సాధించినా లభించదు అని నా ఉద్దేశ్యం. " అంటూ మధు ఆయనకు సమాధానం చెప్తూ ఉంటే అతనికి ఎవరినుండో ఫోన్ వచ్చి " ఒక్క నిమిషం సార్ " అని ఆ ఫోన్ అటెండ్ అయ్యాడు.

" అలాగా సార్. తప్పకుండా కొద్దిగా మీరున్న హాస్పిటల్ లొకేషన్ పంపండి. . అక్కడకు డైరెక్ట్ గా వచ్చేస్తాను " అంటున్నాడు మధు. .

"ఏదో హడావిడిగా ఉన్నట్టున్నారు. వెళ్ళి రండి. నేనే మిమ్మల్ని ఆపి డిస్ట్రబ్ చేసినట్టున్నాను " అన్నాడు వాసుదేవ రావు. .

" ఏం పర్వాలేదు. ఎవరికో అర్జెంట్ గా బ్లడ్ కావాలిట, నేను వెంటనే హాస్పిటలుకు వెళ్ళాలి. ఏమీ అనుకోకండి. మళ్ళీ మాట్లాడుకుందాం " అంటూ మధు బైక్ తీసుకుని బయలుదేరబోయాడు .

" ఒక్క నిమిషం మధుగారు మీరు నిజంగా దేవుడే నండీ . ఎటువంటి స్వార్ధం లేకుండా మీరు చేస్తున్న మంచి పనులు మాలాంటి వాళ్ళం జీవితంలో ఒక్కటి కూడా చెయ్యడానికి ముందుకు రాలేకపోతున్నాము. " దైవం మానుష రూపేణా" అన్నట్టు భగవంతుడు మిమ్మల్ని ఇలాంటి మంచి పనులు చెయ్యమనే ఈ లోకానికి పంపించినట్టున్నాడు. సేవాభావంతో మీరు చేసే పనులు ఎంతోమందికి స్పూర్తిదాయకం అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను " అంటూ తనకు తాను ఆత్మపరిశీలన చేసుకుంటూ అక్కడనుండి కదిలాడు వాసుదేవ రావు *****

సమాప్తం

మరిన్ని కథలు

Prayogam
ప్రయోగం
- మద్దూరి నరసింహమూర్తి
Guruvugari sahanam
గురువు గారి సహనం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Jodedla bandi
జోడెడ్ల బండి
- మద్దూరి నరసింహమూర్తి
Naa laaga endaro
నాలాగా ఎందరో ?
- జీడిగుంట నరసింహ మూర్తి
Jgnana Pariksha
జ్ఞాన పరీక్ష
- - బోగా పురుషోత్తం
420
420
- మద్దూరి నరసింహమూర్తి