"స్వీట్" మెమరీస్ - జీడిగుంట నరసింహ మూర్తి

Sweet memories

" ఆ ..ఆ ..వచ్చేశాము. ఇక్కడనుండి మూడో సందు. ఏమిటో ఎన్నో లక్షలు పోసి ఇళ్ళు కొంటారు కానీ నాలుగేళ్లనుండి చూస్తున్నాను. ఇప్పటికీ కూడా ఏ రోడ్డు కూడా సరిగ్గాలేదు. ఇక్కడ ఆపేయండి సతీష్ నేను నడుచుకుని వెళతాను" అన్నాడు సుధీర్ .

"భలే వారు సార్ మీరు . ఇంతవరకు వచ్చాక మిమ్మల్ని మధ్యలోనే వదిలేస్తానా ? మీ ఇంటివరకు మిమ్మల్ని తీసుకువెళ్లి దించక పోతే మా సార్ కు తెలిసిందంటే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాడు. అయినా మీరు మాకు చేసే సాయంతో పోల్చుకుంటే మీకు మేము ఎంతో చెయ్యాలి . చక్కగా కూర్చోండి మీ ఇంటిదగ్గర ఆపుతాను " అంటూ ఇంటి గుమ్మం దాకా తీసుకొచ్చాడు సతీష్ .

ఆ ఇల్లు సుధీర్ వాళ్ళ కజిన్ ది . . సుధీర్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇక్కడే దిగుతూ ఉంటాడు. అతనికి ఇక్కడైతేనే తన సొంత వాళ్ళతో ఉన్నట్టుగా ఉంటుంది. . వస్తున్నట్టు ముందుగానే చెప్పడంతో అతని కజిన్ రమేష్ , భార్య అపురూప గుమ్మంలో ఎదురుచూస్తున్నారు.

"రండి సతీష్ కాఫీ తాగి వెల్దురు గానీ మళ్ళీ చాలా దూరం పోవాలి కదా " అన్నాడు సుధీర్.

" పర్వాలేదు సార్ మీ వాళ్ళను అనవసరంగా ఇప్పుడెందుకు ఇబ్బంది పెట్టడం నేను వెళ్లిపోతాను " అన్నాడు సతీష్ మొహమాటపడుతూ .

సతీష్ సుధీర్ పని చేస్తున్న కంపినీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉద్యోగి. . అతను కంపినీలో తయారయ్యే సరుకును వారానికో , పదిరోజులకో వచ్చి దగ్గరుండి లారీలు అరేంజ్ చేసి తను బస్సులో వెళ్లిపోతూ ఉంటాడు. . ఆ రోజు అతను ఫ్యాక్టరీలో పని ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతూండటంతో ఏవో వ్యక్తిగత పనులుండి సుధీర్ కూడా అతనితో పాటు బయలుదేరాడు. . సికిందరాబాద్ స్టేషన్లో స్కూటర్ స్టాండ్లో తన బైక్ పెట్టుకుని అక్కడనుండి రైలెక్కుతూ ఉంటాడు సతీష్.

సతీష్ కంపినీవాళ్లు ప్రతి దసరాకు ఫ్యాక్టరీకి వెళ్ళి ముఖ్యమైన వాళ్ళందరికీ స్వీట్ ప్యాకెట్లు పంచిపెట్టడం ఆనవాయితీ. సుధీర్ ఎలాగూ తనతో పాటు హైదరాబాద్ వస్తున్నాడు అని తెలిసి అతనికి మాత్రం ప్రత్యేకంగా హైదరాబాద్ లోనే ఇవ్వొచ్చని అందరితో పాటు ఫ్యాక్టరీ లో ఇవ్వలేదు. .

సతీష్ తన బ్యాగులోంచి రెండు స్వీట్ ప్యాకెట్లు తీసి "ఒకటి పిల్లకు పెట్టమని చెప్పండి. ఒకటి మీరు ఉంచుకోండి" అన్నాడు.

ఆ వచ్చిన వ్యక్తి స్వీట్ ప్యాకెట్లు ఇవ్వడం పక్కనే నిలబడి అపురూప గమనిస్తూనే ఉంది. ఓహో తన బావగారికి ఇలా ఏదో రకంగా వస్తువులు ముడుతూనే ఉంటాయి అనుకుంటా అని మనసులో అసూయ పడింది.

సుధీర్ రెండు రోజులు రమేష్ ఇంట్లో బాగానే గడిపాడు. కానీ పొరపాటున కూడా బయటకు స్వీట్ ప్యాకెట్ తియ్యలేదు. అపురూప పిల్లలకు సుధీర్ స్వీట్లు తీసి ఇస్తాడని చూసింది కానీ ఎక్కడా అటువంటి సూచనలు కనిపించలేదు. ఇతనికి ఇంత లేకితనం ఏమిటి ? శుభ్రంగా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చి మెక్కి వెళ్తూ ఉంటాడు కదా . ఇంట్లో చిన్న పిల్లలున్నారు కనీసం తనకు ఫ్రీ గా వచ్చిన స్వీట్లు కూడా ఇవ్వడానికి మనసు ఒప్పుకోవడం లేదు అంటే అతన్ని ఏమనుకోవాలి ? అవును అవన్నీ తీసుకెళ్లి తన పెళ్ళానికీ, పిల్లకు ఇవ్వాలి అని ఉద్దేశ్యం. అందుకే ఎవరికీ కనపడకుండా లోపల బ్యాగులో పెట్టుకున్నాడు. తను ప్యాకెట్ చూసినట్టు అతను గమనించి ఉండడు అని మనసులో అనుకుంటోంది.

సుధీర్ వెళ్ళే రోజు వచ్చింది. పొద్దున్నుండి ఎందుకో అసహనంగా ఉన్నాడు . మధ్యలో ఎవరికో కోపంగా ఫోన్ చేస్తున్నాడు. "మీరు ఇటువంటి వాళ్ళని అనుకోలేదు . ఈ సారి వస్తారుగా మా కంపినీకి. అప్పుడు చెపుతాను " అంటూ మండిపడుతున్నాడు.

రమేష్ కు , అపురూపకు అతను ఎవరి మీద అరుస్తున్నాడో అర్ధం అయ్యే అవకాశం లేదు. ఆ రోజు అనుకున్న ప్రకారం సుధీర్ వెళ్లిపోయాడు. వెళ్ళేటప్పుడుడైనా స్వీట్ల ప్రసక్తి వస్తుందేమో అని చూసింది . కానీ అటువంటిదేమీ కనపడలేదు.

" చూసారా ? మీ కజిన్ కు ఎంత కక్కుర్తో ? చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా. వాళ్ళ మనిషి అప్పనంగా ఇచ్చిన స్వీట్ ప్యాకెట్లు కూడా ఎవరికీ కనపడకుండా తన బ్యాగులో దాచుకున్నాడు. అప్పటికీ వచ్చినతను పాపం స్వీట్ ప్యాకెట్ సుధీర్ చేతికిస్తూ వీటిని పిల్లలకు పెట్టమనీ మరీ మరీ చెప్పడం నేను విన్నాను. అయినా కూడా ఇతనికి మనసొప్పింది కాదు . ఈ విషయంలోనే కాదు ఎప్పుడొచ్చినా ఉత్త చేతులతో రావడం, పిల్లల చేతిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా పెట్టిన పాపాన పోలేదు. తను మటుకు ఏదో ఆదారిటీ ఉన్నట్టు సిగ్గూ , మొహమాటం లేకుండా శుభ్రంగా రెండు పూటలా టిఫిన్ తో సహా ఆరగిస్తాడు. ఛీ ఛీ ఏమో మనుష్యులో ఏమిటో ? ఈ సారి అతను వస్తున్నట్టు ఫోన్ చేస్తే మేము ఊళ్ళో లేము అని చెప్పేస్తే సరి . అలా ఒకటి రెండు సార్లు చేస్తే ఇక సిగ్గుతో చచ్చి రావడం మానేస్తాడు. బొత్తిగా మానవత్వం లేని మనిషి. " అంటూ అక్కసు వెళ్లగక్కింది అపురూప .

" పోనీలేవోయ్. ఇక ఈ విషయం గురించి రాద్దాంతం చేయకు. కొంతమంది అలాగే వుంటారు. అంతే కాదు వీళ్ళ కంపినీ నుండి సరుకు తీసుకెళ్లే వాళ్ళు ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు ఖరీదు చేసే వెండి నాణాలు కూడా ఇచ్చి వెళ్తారుట. ఇంకా లంచాల రూపంలో డబ్బు ఎంత దొరుకుతుందో ? నువ్వన్నట్టు ఈ సారి వేరే ఊళ్ళో ఉన్నాం అని తప్పించుకుంటే సరి. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు ఇక సుధీర్ మనింటికి రావడం ఇదే ఆఖరి సారి అవుతుంది " అంటూ తను కూడా బాగా విసిగి పోయి ఉన్నాడేమో అలా చెప్పి అపూర్వ మనసును మళ్లించే ప్రయత్నం చేశాడు రమేష్.

నిజానికి ఆ రోజు ఏమి జరిగిందంటే సుధీర్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ తాలూకు మనిషి తెచ్చిన రెండు స్వీట్ ప్యాకెట్లు ఎక్స్పైరీ అయిపోయాయి . పిల్లలను పిల్చి అవి ఇద్దామని మూత తెరిచి చూస్తే తెల్లగా బూజు పట్టి ఉన్నట్టు గ్రహించాడు. రెండవ ప్యాకెట్ కూడా అదే పరిస్తితి. ఎన్నాళ్ళో వాళ్ళ దగ్గర మురగబెట్టి ఇచ్చి ఉంటారని గ్రహించాడు. ఇంకా నయం ఈ స్వీట్లు కానీ రమేష్ కి ఇచ్చి పిల్లలకు పెట్టమని చెప్పి ఉంటే వాళ్ళకు ఫుడ్ పోయిజన్ అయ్యి ఆసుపత్రుల పాలు అయ్యే వాళ్ళు. ఆ క్షణంలో అతనికి సతీష్ మీద, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ మీద విపరీతమైన కోపం వచ్చింది. . సతీష్ ఎదురుగానే అవి చూసి ఉండి ఉంటే నాలుగు చీవాట్లు వేసి ఆ ప్యాకెట్లు అతని మొహామీద విసిరికొట్టే వాడు. అతని వెళ్లిపోయాక తెలిసింది. ఎక్స్పైరీ అయిన స్వీట్లు ఇచ్చాడని అందుకే పిల్లకు పెట్టడం లేదని రమేష్ వాళ్ళకు చెపితే అతను గానే, అతని పెళ్ళాం అపూర్వ కానీ చస్తే నమ్మరు. తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి ప్లాన్ వేసి అలా చెపుతున్నాడు అని ఖచ్చితంగా అనుకుంటారు. అందుకే ఆ విషయం పొరపాటున కూడా ఎత్తకుండా ఆ ప్యాకెట్లు బ్యాగులోనే ఉంచేసి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గా తన డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్ళి వాళ్ళు చేసిన పనిని కళ్ళముందే బయటపెట్టి ఇటువంటి వెధవ పనులు ఎప్పుడూ చేయొద్దని వార్నింగ్ ఇవ్వాలని కోపంతో వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని రమేష్ వాళ్ళతో చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు.

సుధీర్ అనుకున్నట్టే రమేష్, అతని భార్య మనసులో మాత్రం కావాలనే సుధీర్ వాళ్ళ మనిషి ఇచ్చిన స్వీట్ ప్యాకెట్లు తనతో పాటు తీసుకుపోయాడన్న అనుమానం ఎప్పటికీ ఉండిపోయింది . ******

మరిన్ని కథలు

I love you
ఐ లవ్ యు
- సి హెచ్ . వి. యస్ యస్ పుల్లం రాజు
Ishtame kashtamaina vela
ఇష్టమే ... కష్టమైనవేళ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnapakala teneteegalu
జ్ఞాపకాల తేనెటీగలు
- వారణాసి లలిత, వారణాసి సుధాకర్
Maa baamma biography
మా బామ్మ బయోగ్రఫీ
- వారణాసి సుధాకర్
Apaardham
అపార్థం
- పద్మావతి దివాకర్ల