కలసివుంటే కలదు సుఖం.. - - బోగా పురుషోత్తం.

Kalisi vunte kaladu sukham

కాంచీపురంలో కనకయ్య, కామేష్‌ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు .
ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో ఒకే స్కూలులో చదువుకున్నారు. కనకయ్యది
చాలా పేద కుటుంబం. అర ఎకరా పొలం వుంది. దాని నుంచి వచ్చే
తిండి గింజలే జీవనాధారం. కామేష్‌ ది చాలా సంపన్న కుటుంబం. అతని
తల్లిదండ్రులు బాగా డబ్బున్న మనుషులు. రెండు రైస్‌మిల్లులు, పప్పుల పిండి మిల్లులు ఉండడంతో వాటి నిర్వహణపై ఆసక్తి పెంచుకున్నాడు కామేష్‌. అందువల్లే
తండ్రికి వ్యాపార వ్యవహారాలలో సాయం అందించేవాడు. దీంతో అతని చదువు పదవ తరగతితోనే ఆగిపోయింది.
కనకయ్య బాగా కష్టపడి ఉన్నత చదువు చదువుకున్నాడు.
ప్రభుత్వ డాక్టరుగా ఉద్యోగం వచ్చినా సుదూర ప్రాంతం
కావడంతో తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో అతని తల్లిదండ్రులు
ఉద్యోగం చేయడానికి పంపలేకపోయారు. కొన్నాళ్ళకు వివాహమై ఓ కుమార్తె, కుమారుడు పుట్టారు. అతని తల్లిదండ్రులు హఠాత్తుగా మృతి చెందడంతో కుటుంబ పోషణ భారం
పూర్తిగా అతనిపై పడిరది. కొన్నాళ్లు వ్యవసాయం చేశాడు. అది తగినంత
లాభం చేకూర్చకపోవడంతో అది వదిలి పెట్టాడు. కొన్నాళ్లు ఓ బండి
కొనుక్కుని టిఫన్‌ అమ్మి కుటుంబాన్ని పోషించాడు. ఓ రోజు అదే దారిలో
కారులో వెళుతున్న కనకయ్య మిత్రుడు కామేష్‌ను చూశాడు.
కారుదిగి తనవద్దకు వచ్చి మిత్రుడిని ‘‘ బాగున్నావా..? ఎంత
బాగా చదివినోడివి ఇలా వీధుల్లో పడడం నీకు తగదు. ఒక సారి నా వద్దకు
రా.. నీకు ఏదైనా సులభంగా బతికే వ్యాపార సలహా ఇస్తాను..’’ అని
కారెక్కి వెళ్లి పోయాడు కామేష్‌ .
ఆ సాయంత్రం మిత్రుడు కామేష్‌ వద్దకు వెళ్లాడు కనకయ్య. ధగధగ
వెలుగుతున్న లైట్లతో మెరిసిపోతున్న ఆ భవనంలో కి అడుగు పెట్టాడు
కనకయ్య. అక్కడే వున్న సెక్యూరీటీ కనకయ్యను బయటకు తోశాడు. గేటువద్దే
పడిగాపులు కాశాడు. మధ్యాహ్నం భోజనం సమయానికి బయటకు వచ్చిన
కామేష్‌ని అతికష్టం మీద కలిశాడు కనకయ్య.
కామేష్‌ ఎంతో ఆప్యాయంగా పలకరించి నువ్వు ఏదైనా బియ్యం, పప్పులు అమ్యే దుకాణం ప్రారంభించు..’’ అని సలహా ఇచ్చాడు.
‘‘ నాకు అంత స్థోమత లేదు..’’ తల అడ్డం తిప్పాడు కనకయ్య. ‘‘ నాకు అర
ఎకరా పొలం ఉంది.. అది ఓ నాల్గు లక్షలు ఖరీదు చేస్తుంది..’’ చెప్పాడు కనకయ్య.
‘‘ అయితే ఆ పొలం తాకట్టు పెట్టుకుని నాల్గు లక్షలు డబ్బు ఇస్తాను.. దాంతో బియ్యం, పప్పులు కొనుగోలుచేసి దుకాణం పెట్టు..అవసరమైతే మన మిల్లులో తయారయ్యే బియ్యం బస్తాలు, పప్పులు తక్కువ ధరకే ఇస్తాను..’’ అని చెప్పి పంపాడు కామేష్‌.
కనకయ్య మరుసటిరోజే పత్రాలపై సంతకాలు పెట్టి పొలాన్ని కామేష్‌కి అప్పగించాడు.
అతను ఇచ్చిన నాలుగు లక్షల రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్లాడు
కనకయ్య. ఓ చిన్న బియ్యం కొట్లు ప్రారంభించాడు. ఎక్కువ లాభం లేకుండా బియ్యం బస్తాలు
విక్రయించసాగాడు. ఆనతి కాలంలోనే మంచి ప్రజాదరణ పొంది లక్షలు
ఆర్జించసాగాడు. దీనికి తోడు బియ్యం బస్తాలు అమ్మకం అధికం కావడంతో
కామేష్‌ వద్దకు వెళ్లాడు. అతని రైస్‌మిల్లులో తయారయ్యే బియ్యం బస్తాలను తెచ్చుకుని విక్రయించసాగాడు. తాను తాకట్టు పెట్టిన పొలాన్ని కూడా వడ్డీతో సహా చెల్లించి పత్రాలను వెనక్కి తీసుకున్నాడు. తన కళ్ల ఎదుటే ఇంత స్థాయికి ఎదగడం
జీర్ణించుకోలేకపోయాడు కామేష్‌. అప్పటికే అతని వ్యాపారం కాస్త
మందగించింది. తన వ్యాపారాన్ని చక్క దిద్దుకోవడానికి అక్రమమార్గం
వెతికాడు. కనకయ్య వ్యాపారాన్ని ఎలాగైనా దెబ్బ తీయాలనుకున్నాడు. తన
వద్దకు బియ్యం బస్తాల కోసం వచ్చే కనకయ్యకు మంచి నాణ్యమైన బియ్యం.. మిత్రుడని నీకు తక్కువ ధరకే ఇస్తున్నా.. తీసుకెళ్లు.. అని ఓ లారీ నాసిరకం బియ్యం బస్తాలు ఇచ్చాడు కామేష్‌.
కనకయ్య అనుమానించలేదు. మిత్రుడిపై నమ్మకంతో బియ్యం బస్తాలను
తీసుకెళ్లి విక్రయించాడు. అవి తీసుకెళ్లిన వారందరూ మళ్లీ అతని వద్దకు రాలేదు. దీంతో క్రమంగా వ్యాపారం దివాలా తీసింది. కనకయ్యకు కారణం ఏమిటో తెలియక వంట్లో వణుకు పుట్టింది.
మిత్రుడు ఇచ్చిన బియ్యం బస్తాలు తీసి పరీక్షించాడు. బియ్యం తళతళ మెరుస్తూ సన్నగానే వున్నాయి. చేతితో పట్టి చూస్తుంటే నకిలీ బియ్యంలా అనిపించింది. ఇంటికి తీసుకెళ్లి భార్యను వండమన్నాడు. తను ఊహ నిజమే అయ్యింది. అవన్ని ప్లాస్టిక్‌ బియ్యం అని తేలింది. అవి తిన్న వారందరూ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారని తెలుసుకున్నాడు కనకయ్య. ఈ కారణంగానే జనంతో కిటకిటలాడే దుకాణం వెలవెలపోయింది. ఇప్పుడు ఈ అప్రతిష్టను ఎలా పోగొట్టు కోవాలా? అని ఆలోచించసాగాడు కనకయ్య. నమ్మకంగా వున్న మిత్రుడు ఇలా ద్రోహం చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. వెంటనే వాటన్నింటిని పక్కనపెట్టి నాణ్యమైనవి బియ్యం బస్తాలను విక్రయించసాగాడు. ఇల్లుఇల్లు తిరుగుతూ బియ్యం బస్తాలు విక్రయించాడు. నెమ్మదిగా మళ్లీ కనకయ్య వ్యాపారం పుంజుకుంది. కామేష్‌ ధన దాహానికి వ్యాపారం రోజురోజుకూ క్షిణించ సాగింది. అతని వద్ద బియ్యం, పప్పులు కొనుక్కున్న వారంతా బియ్యం వద్దని తమకు డబ్బు ఇచ్చేయాలని ఒత్తిడి చేశారు. అప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన కామేష్‌కు
ఏమిచేయాలో దిక్కు తోచలేదు. మిత్రుడు కనకయ్యను ఆశ్రయించాడు. ‘‘ నా
పరిస్థితి అగమ్య గోచరంగా వుంది. జీవనం గడవడం కష్టంగా మారింది..
నీ కొట్టులో నా కుమారుడికి ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకో..’’ అని చేతులు జోడిరచాడు కామేష్‌.
కామేష్‌ కుమారుడికి తన బియ్యం దుకాణంలో సేల్స్‌ మేనేజరుగా ఉద్యోగం
ఇచ్చాడు. అతడు బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ దుకాణాల రూపురేఖలన్నీ
మారిపోయాయి. చూస్తుండగానే తన ఆలోచనలతోనే కొత్తకొత్త పథకాలు అవలంబించి
పెద్ద దుకాణంగా విస్తరింప చేశాడు. దీంతో కనకయ్య పేరు
దశదిశలా పాకింది. అంత అనందం వున్నా తన అమ్మాయికి వివాహం కాలేదన్న
బాధ కనకయ్య మదిలో ఉండేది. కామేష్‌ కుమారుడి గుణం నచ్చడంతో
కనకయ్య తన కుమారైను ఇచ్చి వివాహం చేశాడు.
ఇప్పుడు కనకయ్య కుమారుడికి కామేష్‌ కుమార్తె నచ్చడంతో అతని కుమార్తెను తన కుమారుడికి వివాహం చేశాడు. కామేష్‌ కుమార్తె తన ఇంట్లోకి అడుగు పెట్టడంతో అతని అదృష్టం తలుపు తట్టింది. ఇప్పుడు కనకయ్య వ్యాపార లావాదేవీలు కామేష్‌ కుమారుడు చూసుకోసాగాడు.
సరైన నిర్వహణ లేక మూత బడిన కామేష్‌ రైసు మిల్లుల నిర్వహణ బాధ్యతను తీసుకున్నాడు కనకయ్య కొడుకు. కొన్నాళ్లకే చాకచక్యంగా మిల్లులు నడపడంతో పూర్వ వైభవం వచ్చింది. మిత్రులిద్దరూ తమ తమ ఆస్తులు పిల్లలకు అప్పగించి కలసి వుంటే కలదు సుఖం అంటూ పిల్లలతో హాయిగా జీవనం సాగించారు.

మరిన్ని కథలు

Saraina empika
సరైన ఎంపిక
- కందర్ప మూర్తి
Gharana mosam
ఘరానా మోసం
- డా:సి.హెచ్.ప్రతాప్
Tappu telisindi
తప్పు తెలిసింది
- కందర్ప మూర్తి
Aaru chintachetlu
ఆరు చింతచెట్లు
- డా. భీమ మోహన రావు
Manavatwam
మానవత్వం
- సి.హెచ్.ప్రతాప్
Naa asha aakanksha
నా ఆశ-ఆకాంక్ష
- రాపాక కామేశ్వర రావు
Inner child
ఇన్నర్ చైల్డ్
- రాజు యెదుగిరి
Pavitra prema
పవిత్ర ప్రేమ
- సి.హెచ్.ప్రతాప్