పొగ త్రాగడం - ఆపాసా

Poga tragadam

నా బాల్యంలో, నాకు 3-4 ఏళ్ళున్నప్పుడు, మా నాన్నగారు సిగరెట్లు కాల్చడం నాకు తెలుసు. అప్పుడు అతను గొల్లభామ పాలడబ్బా సైజు టిన్నుల్లో సిగరెట్లు తెప్పించుకునేవారు. బహుశః అవి కాప్టెన్ సిగరెట్స్ అనుకుంటాను. ఆ డబ్బా మూత మీద ‘స్టార్’ మార్క్ ఉండేదని గుర్తు. ఆ తరవాత విల్స్ కంపెనీ వాళ్ళవి కూడా సరిగ్గా అలాటి టిన్నులే వచ్చేవి.

మా నాన్నగారు ఆ డబ్బాలోంచి సిగరెట్టుని భలే టెక్నిక్­గా బయటకి తీసేవారు. మూత తీసి, డబ్బాని పైకి చిన్న జర్క్­తో కుదిపేవారు. నేను అన్ని సిగరెట్లూ క్రింద పడిపోతాయని జడుసుకునేవాణ్ణి. ఉఁహుఁ! ఒకటో, రెండో పైకి పొడుచుకువచ్చేవి. అలా పైకి వచ్చిన ఒక సిగరెట్టుని మా నాన్నగారు చేత్తో తాకేవారుకాదు. నేరుగా పెదిమల మధ్యకే అందుకునేవారు. ఆ తరవాత లైటర్ వెలిగించినప్పుడు ‘జిప్ జిప్’ మని శబ్దంతో రవ్వలు వచ్చేవి. అదంతా చూస్తూవుంటే నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉండేది,

ఒక్కొక్కసారి సిగరెట్ టిన్నుల స్టాకు అయిపోతే, అవి మళ్ళీ వచ్చేంతవరకు, కొద్ది రోజులు అతనే సిగరెట్లు ఎప్పటికప్పుడు తయారుచేసుకుని త్రాగేవారు. మీరు అలాటి సిగరెట్ తయారుచేసే హ్యాండ్ మషీన్లు చూసేవుంటారు. చాలా సింపుల్­గా, ఉల్లిపొరలాటి సిగరెట్ కాగితంలో పొగాకు చుట్టి, ఆ సిగరెట్టుని పంచింగ్ మషిన్ అంత చిన్న సైజు సిగరెట్ మషిన్లో పెట్టి నొక్కడమే! భలేగా రోల్ అయి బయటకి సిగరెట్ వచ్చేస్తుంది.

ఆ తరవాత, అదేంటో నా బాల్యంలో ఒకటో తరగతి నుంచి వరసగా నైన్­టీన్ సిక్స్­టీస్­లో నేను చూసిన చాలా సినిమాల్లో హీరోలు, సిగరెట్లు కాల్చేవాళ్ళు. కొన్ని కొన్ని సినిమాల్లోనైతే చాలామంది ఏక్టర్లు సిగరెట్ పొగతో రింగులు వదిలేవాళ్ళు. దాంతో, అదేదో దర్జాగా, ఠీవిగా, హుందాగా, అనిపించేది నాకు.

ఆ తరవాత నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు, కథానాయకుడు సినిమాలో ఎన్.టి. రామారావు నాటకీయంగా పెద్ద డబ్బున్నవాడయిపోతాడు. అప్పుడు అతణ్ణి చూపించినప్పుడు, అతడి వేషం, భాష, బట్ట, జుట్టు, అన్నీ మారిపోతాయి.

ఆ సినిమాలో నన్ను బాగా ఆకర్షించింది, అతడి నోటిలో సిగరెట్ పైప్;­ దాంతో పొగ వదలడం.

రెండోది, స్టయిల్­­గా రివాల్వింగ్ చెయిర్లో తిరగడం.

అప్పటికి నాకు, పదమూడు-పద్నాలుగేళ్ళుంటాయేమో! టీన్స్­లోకొచ్చాను.

అప్పుడే మొట్టమొదటసారి గాఢంగా అనుకున్నాను. పెద్దవాణ్ణయాక, నేను కూడా అలా రివాల్వింగ్ చెయిర్­లో స్టయిల్­గా తిరుగుతూ, సిగరెట్ కాల్చాలని.

అంతేకాని, చాలామంది టీనేజర్స్­లా, సిగరెట్ తాగి పెద్దవాణ్ణయిపోయానని ఫీల్ అయిపోవడం కాదు! పెద్దవాణ్ణయాకే కాల్చాలని!

అంతలా చిన్నపిల్లలపైన, నిజ జీవితంలో చూసిన సంఘటనలే కాక, సినిమాల్లాటి దృశ్యకావ్యాలు కూడా ప్రగాఢమైన ప్రభావం చూపుతాయి అన్నదానికి, నా అనుభవాలే తార్కాణం.

ఆ తరవాత టీనేజ్­లోనే జీవనోపాధి చూసుకోవడం అవసరం పడ్డంతో, మా అమ్మమ్మగారికోసం నేను కన్న కలలతో సహా చాలా మంచి మంచి కలలు చెదిరిపోయాయి.

అదే జీవితం (జీవి, తం!) అని తెలిసేసరికి, పనికిమాలిన చెత్త చెత్త కలలు, సులువైన కలలు నా ప్రమేయం లేకుండానే సాఫల్యమయిపోయాయి. వాటిలో ఇదొకటి. పొగత్రాగడం!

ఇంకా, పెద్దవాణ్ణవడం. పెద్దవుద్యోగి కాకపోయినా, రివాల్వింగ్ చెయిర్లో కూర్చొని సిగరెట్ కాల్చడం! రింగులొదలడం. (అదో పనికిమాలిన పని! నిజానికి, రింగులొదలడం వలన ఎదుటివాడి నుంచి చప్పట్లు కొట్టించుకోవడమే గాని, స్మోకర్­కి దానివలన పొగాత్రాగిన తృప్తి ఉండదు. ఒక సిగరెట్టు వృథా అయిపోయినట్టే!)

దాంతో పాటు, ధూమపానంలో ఎన్ని రకాలున్నాయో అన్నీ చవిచూశాను. చుట్ట, సిగార్, పైప్, సిగార్ పైప్, సిగరెట్ పైప్, అన్నీ.

దానికి తోడు, ఆరోజుల్లో నా కొలీగ్స్, ఫ్రెండ్స్, సుపీరియర్స్, జూనియర్స్, అందరూ స్మోకర్లే! ఎక్కడో అక్కడక్కడా తులసివనంలో గంజాయిమొక్కలా, మా మధ్య ఒక్కడుండే వాడు, నాన్­స్మోకర్ పాపం! బితుకుబితుకుమంటూ. అందరి టేబుల్స్ పైనా రెండేసి యాష్-ట్రేలు, సొరుగుల్లో ఒకటో రెండో సిగరెట్ ప్యాకెట్స్ తప్పనిసరిగావుండేవి. చిన్నా పెద్దా, హోదా గీదా, తారతమ్యం లేకుండా, ఒకరి సొరుగుల్లోంచి ఒకరం స్వతంత్రంగా సిగరెట్లు తీసేసుకుని కాల్చేసుకునేవాళ్ళం.

అలా కంటిన్యువస్­గా ఒక అర్ధదశాబ్దంపాటు చెయిన్­స్మోకర్ని. ఒక దశాబ్దం పైగా స్మోకర్ని.

అప్పట్లో ఒకరోజు నేను లంచ్ అవర్­లో ఇంటికొచ్చేసరికి, మంచి వినోద కార్యక్రమం జరుగుతోంది. మా రెండేళ్ళ చిన్నబ్బాయి అది అందిస్తున్నాడు. వాడికి మాట్లాడ్డం రాదు కాని, మన మాటలన్నీ చక్కగా అర్థమవుతాయి. మా మాఁవగారు, అత్తగారు, మా ఆవిడ, పెద్దబ్బాయి, మా ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు అందరూ వాడి చుట్టూ చేరి, వాడి అనుకరణ ప్రతిభ­­కి పరవశించిపోతున్నారు.

ప్రేక్షకుల్లోంచి ఎవరోవొకరు కోతుల్ని ఆడించే ‘మదారీ’లా వాడికి చెప్పడం, వాడు కోతిలా ఆ మదారీ చెప్పింది చెయ్యడం. అదీ జరుగుతోంది.

నన్ను చూసి, మా ఆవిడ, “అదుగోరా మీ నాన్నగారొచ్చారు. అతనికి చెప్పు నాన్నా, తాతగారు (మా మాఁవగారు) ఎలా చుట్ట కాలుస్తారో?” అనడిగింది.

అంతే! స్టూలు మీద కూర్చుని, నేల మీదనుంచి చుట్ట, అగ్గిపెట్టె తీసినట్టు నటించాడు. చుట్టని నోట్లో పెట్టుకున్నట్టు వేలు మూతివరకు తీసుకువెళ్ళి వెనక్కి తెచ్చేశాడు. ఎడం చేత్తో అగ్గిపెట్టె పట్టుకుని, కుడిచేత్తో దానిపైన అగ్గిపుల్ల గీసినట్టు గీశాడు. ఆ అగ్గిపుల్లని చుట్ట అంచుకి చుట్టూరా గుండ్రంగా తిప్పుతూ, రెండు పెదిమల మధ్య చుట్ట ఉంటే, దానికి బాగా అగ్గిపుల్ల మంట అంటుకోడానికి ప్రయత్నిస్తున్నట్టు, మా మాఁవగారిలా, నోటితో ‘ప్ ప్ప, ప్ప’ అన్నాడు. చెయ్యి కాలిపోకుండా, అగ్గిపుల్ల మంటని ఆర్పేసినట్టు కుడి చెయ్యిని గాల్లో రెండుసార్లు ఆడించి, ఆరిపోయిన అగ్గిపుల్లని విసిరేసినట్టు విదిలించాడు. వెంటనే మూతికి కొంచెం దగ్గరగా గాల్లోనే, నాలుగు వేళ్ళతో చుట్టని పట్టుకుని, ఐదో వేలు చిటికెన వేలు గోవర్ధన పర్వతం ఎత్తినట్టు పైకి పెట్టాడు. పొగ లోపలకి పీల్చినట్టు పీల్చాడు, చుట్ట నోట్లోంచి తీసి గాల్లో పొగ ఊదినట్టు ఊదాడు. అంతా స్లో మోషన్! నిదానం!

అందరూ నవ్వులూ, చప్పట్లూ.

నేను దిగ్భ్రాంతి చెందాను!

నేను తేరుకునేలోగానే, ఎవరో, మరో మదారీ, “ఇప్పుడు నాన్నగారు సిగరెట్ ఎలా వెలిగిస్తారో చెప్పాలి.” అన్నారు.

నేను గతుక్కుమన్నాను.

వాడు ఠప్ మని సిగరెట్, మూతికి ఒకవైపు అంచుకి వేలాడినట్టు ఒక అగ్గిపుల్ల పెట్టి, కుడిచేత్తో అగ్గిపెట్టె పట్టుకుని, నాలాగే ఎడం చేత్తో అగ్గిపుల్ల సర్రుమని వెలిగించినట్టు, అగ్గిపుల్ల క్షణంలో ఒక్కే దులుపుతో ఆర్పేసి యాష్ ట్రేలో పడేసినట్టు అభినయించాడు. అంతా క్విక్ ఏక్షన్! క్షణంలో స్టయిల్­గా రెండు వేళ్ళతో సిగరెట్ పట్టుకుని గుండెల్నిండా సర్రుమని పొగ పీల్చినట్టు గాలి పీల్చాడు. తాపీగా పొగ వదిలినట్టు ఊపిరి వదిలాడు.

మళ్ళీ చప్పట్లు ...

డ్రాయింగ్ హాల్ దద్దరిల్లింది, వాడి ప్రతాపానికి.

నా తల తిరిగిపోయింది.

ఒక్కసారిగా, నాకు నా పసితనంలో మా నాన్నగారి సిగరెట్ టిన్ దగ్గర్నుంచి నన్నాకర్షించిన ధూమపాన దృశ్యాలన్నీ గిరగిర గిరగిర క్షణంలో తిరిగాయి.

అప్పుడర్థమయింది నాకు - “సినిమా, దృశ్యకావ్యమే అయినా, అది రీల్! రియల్ కాదు! కాని ఇది! ఇది రియల్ దృశ్యం! లైవ్! వాస్తవం! ఇంకెంత ప్రభావం చూపించాలి! ఇంకెంత ప్రతిభావంతంగావుండాలి!” అని.

“మనిషి మాటలతో కాదు చేష్టలతో నేర్చుకుంటాడు.” అని.

నేను అలాగే నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అన్న జ్ఞానం, అప్పుడు, పాతికేళ్ళ తరవాత కలిగింది, నాకు.

వీడు, అది చేష్టలతో చూపిస్తున్నాడు. ఇంకా మాటలు రాలేదు.

అందుకే మనవాళ్ళు “క్రియా ప్రధానం!” అన్నారు. మాటలు కాదు! మాటలకేం ఉంది. వచ్చాక కోటలు దాటేస్తాయి.

“ఆచరణ ముఖ్యం!” వగైరా వగైరా ...

నా ఆచరణతోనే నా పిల్లలు నేర్చుకుంటారన్న సత్యం నాకు నా రెండేళ్ళ పిల్లడే, వాడి ఆచరణతో, నాకు నేర్పాడు.

మనసులోనే, “గురు దేవో భవ!” అనుకున్నాను.

వెంటనే, ఒక నిర్ణయం తీసుకున్నాను. “పొగ త్రాగడం మానేయాలి.”

అది ఆలోచనతో సరిపెట్టక ఆచరణలో పెట్టాలని సంకల్పించాను. అయితే, అంచెలంచెలుగా.

ప్రథమ అడుగు వెంటనే వేశాను. “పిల్లల ముందు కాల్చను. నా పిల్లలనే కాదు, ఏ పిల్లల ముందు, ఎవరి పిల్లల సమక్షంలోనైనా సరే; పొగ త్రాగను!” అని దృఢంగా అనుకున్నాను.

“నో చెయిన్ స్మోకింగ్! లిమిటెడ్ స్మోకింగ్!” అని రెండవది.

అలా నెమ్మదిగా రోజుకి 2-3 సిగరెట్లకి అతి కొద్దిరోజుల్లోనే వచ్చేశాను.

నా నియమాలకి కొందరు పొగమిత్రులు నవ్వుకునేవారు. కొందరయితే, “మేము మా పిల్లల ముందు కాలుస్తున్నాం కదా, మాకు లేని అభ్యంతరం నీకెందుకు? మాయింట్లో నువ్వేం నీ నియమాలు పాటించక్కర్లేదు.” అని సున్నితంగానే చివాట్లు వేసేవాళ్ళు. అయినా నేను, నా నియమాల్ని సడలించలేదు.

కొన్నాళ్ళకి, నా స్మోకింగ్ అకేషనల్ అయిపోయింది.

అప్పుడు, అడపాదడపా మాత్రం ఎందుకు? అవసరమా! మానీలేనా అనిపించింది.

అంతే! మానేశాను.

చాలామంది ఒక దురలవాటు నుంచి తప్పించుకునే మార్గాన్వేషణలో, వేరే వ్యసనానికి దగ్గరవుతారు. నేనలా అవదలచుకోలేదు. అవలేదు!

ఇప్పుడు ఎవరైనా స్మోకర్స్­ని చూస్తే, అసహ్యం, జుగుప్స, రోత వంటి వికారాలు కలగవు. జాలి వేస్తుంది! మీరు కూడా వదిలేయగలరర్రా, తలచుకుంటే చాలా సులువు అని చెప్పాలని అనిపిస్తుంది.

చెప్పడం కాదు, చేసి చూపించాలి.

నేను చేసి చూపించాను.

నా తప్పుని దిద్దుకున్నానని నా పిల్లలకి తెలుసు!

పొగత్రాగడం తప్పు అని వాళ్ళంతట వాళ్ళు తెలుసుకున్నారు! తప్పని తెలిసే, నేనది దిద్దుకున్నానని గ్రహించారు.

అందుకే, వాళ్లకి 40 ఏళ్ళొస్తున్నా, ఇంతవరకు ఒక్కసారీ, ఒక్క సిగరెట్టూ కాల్చలేదు! ధూమపానమనే కాదు, ఏ వ్యసనమైనా, అది మనం చేసుకునేదే కాని పుట్టుకతో స్వతస్సిద్ధంగా వచ్చేది కాదని, వారి నమ్మకం!

దే ఆర్ వైజ్!

‘ఫూల్స్ ఓన్లీ లెర్న్ బై దెయిర్ ఓన్ మిస్టేక్స్ ఎండ్ వైజ్ లెర్న్ ఫ్రం అదర్స్ మిస్టేక్స్!’

‘బట్ బ్లడీఫూల్స్ నెవర్ లెర్న్ ఫ్రం ఎనీబడీ ఆర్ ఎనీథింగ్!’ అని నా ప్రగాఢ నమ్మకం!

--: oo(O)oo :--

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు