ఋణ దారుణం - ఆపాసా (ఆలూరి పార్థసారథి)

Runa darunam

అప్పుడే రిజిస్టర్డ్ పోస్టులో అందుకున్న అరఠావు రంగు కాగితం చేతిలోనేవున్నా, కళ్ళు దానిమీదేవున్నా, అక్షరాలేం కనిపించటంలేదు విరించికి. కాగితం నాలుగువైపులా ఫేడ్ అవుట్ అయిపోయింది. అరచేతిలో అంజనం వేసినట్టు సరిగ్గా కాగితం మధ్యలో, గురువు గుర్నాధం గీతోపదేశం దృశ్యమే కనిపిస్తోంది. పదే పదే ఆ సంవాదమే వినిపిస్తోంది –

‘నీకసలు బుద్ధుందా విరించీ! ఎవడో మరోడి కోసం, మళ్ళీ వస్తావా? తనకు మాలిన ధర్మం నీకెందుకయ్యా! నీకింకా అర్థం కాలేదా? నిన్న నాదగ్గర నిజంగా డబ్బు లేక కాదు, నిన్నివ్వాళ్ళ రమ్మనది. నీకు తెలిసో తెలియకో, ఓ అనామకుణ్ణి వెంటబెట్టుకొచ్చావు. నీతో వచ్చినవాడికి నాగురించి నువ్వేం చెప్పావో గాని, వాడు మాత్రం నన్నో అపర కుబేరుడిలా ఊహించేసుకున్నట్టున్నాడు. నేనేదో కుంచాలతో కొల్చి కొల్చి రాశుల రాశుల కాసులు కుమ్మరించేస్తాననుకున్నాడు.’

‘అది కాదు గుర్నాధం, నిన్న నాతో వచ్చిన శంకరం, నా చిన్ననాటి స్నేహితుడు, నేనొక్కణ్ణే మిత్రుణ్ణి వాడికి. అమాయకుడు, కష్టాల్లో ఉన్నాడు. చాలా మొహమాటస్థుడు. ఎంతో ఇబ్బందయితే కాని మరొకళ్ళని సహాయం అడగడు. సమయానికి నా దగ్గర లేక నీ దగ్గరకి తీసుకొచ్చాను. నా దగ్గరే కాని ఉంటే తటపటాయించకుండా ఇచ్చేసివుండేవాణ్ణి. అంత మంచివాడు.’

‘అప్పు అడగడానికైనా హద్దుంటుంది విరించీ! ఎంత కావాలన్నాడో చూశావా! నీ శంకరానికి అప్పు ఇచ్చానంటే, నేను శంకరగిరి మాన్యాలు పట్టుకు పోవాలి. చూడగానే పోల్చేశాను, వాడో అప్పుల అప్పారావని. వాడీ జన్మలో అప్పు తీర్చడు. సరికదా, వడ్డీ మీద వడ్డీ పెరిగి గోవర్ధన గిరంతయి, పూచీకత్తుగా నిలబడినందుకు ఉత్తిపుణ్యానికి నీ నడ్డి విరుగుతుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. నాదగ్గరేం ఫండ్స్ లేవని, నేనేం ఇవ్వలేనన్నానని నీ ఫ్రెండ్­కి చెప్పేయ్. అక్కడితో నువ్వీ ఊబిలోకి కూరుకుపోకుండా క్షేమంగా ఒడ్డునే నిలబడగలుగుతావ్. లేదా, వాడితోపాటు నువ్వూ పూర్తిగా గంగలో మునిగిపోతావ్.’

‘శంకరం అలాటి వాడు కాడు గుర్నాధం. ఎందులోనూ ఎవర్నీ ముంచడు. నీకు నామీద నమ్మకం ఉంది కదా! నాకే ఇచ్చాననుకో. నెలనెలా ఇవ్వాల్సిన వడ్డీవే కాదు; అసలు కూడా కొద్ది కొద్దిగా తడవలు తడవలుగా తీర్చేస్తాడు. నిజంగానే, నాదీ పూచీ. నన్ను నమ్ము!’

నమ్మలేక పోయాడు గుర్నాధం. అలాగని, అడ్డూ చెప్పలేకపోయాడు. చివరి ప్రయత్నంగా, ‘అయినా విరించీ, నీ మంచికే చెపుతున్నాను, విను. శంకరం అడిగినంత కాక, ఏ సగమో, పదో పరకో ఇచ్చి మర్చిపో! అతడు తిరిగిస్తే నువ్వు అదృష్టవంతుడవని ఆనందించు. ఎగ్గొట్టేశాడా, ఏజన్మలో ఋణమో ఇలా తీరిపోయిందనుకొని నోరుమూసుకో! అంతకంటే అతడి దగ్గరనుంచి ఇంకేమీ ఆశించకు. ఇచ్చింది తిరిగి రాకపోయినా, చీమకుట్టినంత బాధయినా వెయ్యకూడదు ఋణదాతకి. తాహతుకు మించి ఇవ్వకూడదు. అలా అయితేనే అప్పు ఇవ్వాలి. మధ్యలో పడాలి. అంతేగాని నీలా కాదు.’

అప్పుడు తను కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఛ! అలాటివాడు కాడు శంకరం. వాడు ఎంతలా మనసు చంపుకొని నన్ను దేహీమని అడిగాడో పాపం! అప్పు ఇప్పిస్తూ ఇప్పిస్తూ, మళ్ళీ అందులో సగమే గోవర్ధన్ ఇస్తానన్నాడనీ, ఈమాత్రమే దొరికిందనీ అబద్ధాలు చెప్పడం, నాటకాలు ఆడడం ఎందుకు? ఇస్తే కోరినంతా ఇవ్వాలి. లేదా సారీరా నావల్ల కాదు! నేనివ్వలేను, ఇప్పించలేను అని ఫ్రాంక్­గా చెప్పాలి. అంతేగాని, ఈ డొంకతిరుగుడు ఎందుకు? అని చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. గుర్నాధంతో దృఢంగా చెప్పాడు –

‘శంకరంతో నేను మాయమాటలాడలేను గురూ! ఒక పని చెయ్యి. ఆ అప్పేదో నాకే ఇయ్యి. వాడు కోరినంతా ఇయ్యి. జన్మలో మొదటిసారి నన్ను అడిగాడు. వాడి స్వాభిమానం చంపుకొని అడిగాడు. వాడికేం అవసరం వచ్చిందో ఏమో! నేనే వాడికి తీసుకెళ్ళి ఇస్తాను. మధ్యలో, వాణ్ణి ఇక్కడకి పిలవడం, మరోసారి వాణ్ణి మానసికంగా హింసించడం నాకిష్టం లేదు. వాడి దగ్గర్నుంచి నేను వసూలు చేసుకుంటాలే. నేనే నీకు నెలనెలా వడ్డీ, అసలులోంచి కొంచెం కొంచెం ఇచ్చేస్తాను. నాదే పూచీ. వాడితో నీకు సంబంధం లేదు. సరా!’ అని గుర్నాధం దగ్గరనుంచి శంకరం కోరినంత డబ్బు తన ఖాతాలో అప్పుగా తీసుకుని శంకరం ఇంటికి వెళ్ళి స్వయంగా తనే ఇచ్చి వచ్చాడు.

ఠంచనుగా రెండు నెలలు పట్టుకొచ్చి నా చేతికి వడ్డీ మాత్రం ఇచ్చేశాడు శంకరం. ఆ తరవాత అతాపతా లేకుండా పోయాడు. ఫోన్­కి చిక్కడు ఇంట్లో దొరకడు. ఎలాగో, ఒకరాత్రి వాడింటి దగ్గర మాటు వేశాడు తను. అర్ధరాత్రికి కాని వాడా ఇంటి దరిదాపులకి రాలేదు. వాడు రాగానే ‘ఇదేంటిరా శంకరం ఇలా చేశావ్! ...’ అని నిలదీయబోయేసరికల్లా, వాడు ‘సారీరా విరించీ! ఏదో పనుల్లో పడి నిన్ను కలవలేకపోయాను. గుర్నాధం అప్పు మొత్తం అంతా ఒక్కసారే తీర్చేద్దామని, బ్యాంక్ లోన్­కి మరికొంచెం ఎక్కువ ఎమౌంట్­కే ఎప్లై చేశాను. వడ్డీతో సహా త్వరలోనే ఇచ్చేస్తాను. మరి కొన్నాళ్ళు ఓపికపట్టరా!’ అని ప్రాథేయపడ్డాడు.

మరోదారి లేక, తనే ఎలాగోలా గుర్నాధం అప్పు కొండలా పెరిగిపోకుండా, గుర్నాధానికి మాటిచ్చినట్టు తడవలు తడవలుగా తీర్చడం మొదలెట్టాడు. గుర్నాధం ఎదురుపడినప్పుడల్లా, ‘చెప్తే విన్నావు కాదు. ఇప్పుడైనా బుద్ధొచ్చిందా! ఇంకెప్పుడూ ఇలా మధ్య పడి నలిగిపోకు. సుడిగుండంలో చిక్కుకోకు.’ అని తనని దెప్పుతూనేవున్నాడు. చివాట్లు పెడుతూనేవున్నాడు.

ఒకరోజు ఎవరో తరుముతున్నట్టు నాదగ్గరకి వగరుస్తూ వచ్చాడు శంకరం. ‘పద, నా లోన్ శాంక్షన్ అయిపోయింది. బ్యాంక్­కి వెళ్ళి డ్రా చేసేసుకోవడమే! చిన్న సాక్షి సంతకం పెట్టాలి. అంతే! నీ బాకీ డబ్బులు పోగా మిగిలినవి నా అవసరాలకి.’ అని చెప్పి తీసుకెళ్ళాడు. గోడకి కొట్టిన సున్నం తిరిగొస్తోందనే ఆతురతతో పుంజాలు తెంపుకుని వాడి వెంట పరుగెత్తాను. తీరా బ్యాంక్­కి వెళ్ళాక, బ్యాంక్ మానేజర్, అది ఓన్లీ ఫార్మాలిటీవే అని పదహారు సంతకాలు తీసుకున్నాడు. సాక్షిగా కాదు, గ్యారంటర్­గా.”

అంజనం మాయమయింది. చేతిలో రంగు కాగితం రెపరెపలాడింది.

గురువు గుర్నాధం ఎంతలా చెప్పినా తను వినలేదు. ఇంత మోసం చేస్తాడనుకోలేదు శంకరం! వాడి కాలర్ పట్టుకు ఉతికెయ్యాలన్నంత కోపం వచ్చింది విరించికి. ఉన్న పళాన బయల్దేరాడు.

--:oo0oo:--

ఇంకా భళ్ళుమని తెల్లారలేదు. అప్పుడే బర్­ర్­ర్ బర్­ర్­ర్ మని చెవులదిరిపోయేలా మ్రోగిన కాలింగ్ బెల్ సౌండ్­కి విసుక్కుంటూ లేచాడు శంకరం. మంచం దిగి లుంగీ సర్దుకున్నాడు. బనీను సాగినంతవరకు క్రిందకు లాగాడు. ఈలోగానే దబదబ దబదబ ఒకటే తలుపుల బాదుడు.

‘వస్తున్నా వస్తున్నా ...’ అని కేకలు వేస్తూ రవంత పరుగుతో వెళ్ళి తలుపు తీశాడు శంకరం.

ఎదురుగా విరించి కనిపించేసరికి షాక్ అయ్యాడు! ఇది ఎప్పుడోవొకప్పుడు జరగాల్సిందే కాని మరీ ఇంత వేగం జరుగుతుందనుకోలేదు శంకరం. క్షణంలో తేరుకున్నాడు.

ఏమీ ఎరగనట్టే, ‘ఏమిటిరా విరించీ, తెల్లారకుండానే వచ్చి ఈ సర్­ప్రయిజ్!’ అంటూ లోపలకి ఆహ్వానించాడు.

విరించి, ఇంట్లోకి అడుగుపెడుతూ, ఈసడింపుగా ‘నీలాటి మహానుభావుల్ని కలవాలంటే ఇలా తెల్లవారజామునైనా రావాలి, లేదా దొంగల్లా అర్ధరాత్రయినా రావాలి. తప్పదు, అవసరం నాది. నీతో మాటాడదామంటే, రోజుకో సిమ్ మార్చి సెల్లుకి దొరక్కుండా పోయావ్. సెల్లుతో పాటు ఇల్లు కూడా మార్చెయ్యలేదు, ఇంకా నయం. అయినా నువ్వు చేసిన పనేం బాలేదురా శంకరం! చివరికి ఇదన్నమాట నీ నిర్వాకం! ఇదన్నమాట నే చేసిన సహాయానికి, నువ్విచ్చే బహుమానం!’ అన్నాడు కోపంగా మొహానికేసి కొట్టినట్టు శంకరానికి కవరందిస్తూ.

శంకరం చిద్విలాసంగా విరించికెదురుగా కూర్చుంటూ, కవర్లోంచి నింపాదిగా గులాబీ రంగు కాగితం తీసి మడతలు విప్పి చూశాడు. ఒక్కసారి తలెత్తి, ‘ఓస్ ఇదా!’ అన్నాడు అదేదో గడ్డిపోచన్నట్టు తీసిపారేస్తూ. అది బ్యాంకు వాళ్ళిచ్చిన నోటీసు.

ఒళ్ళు మండిపోయింది విరించికి. ‘ఏమిటిరా ఆ నిస్సాకారం. లీగల్ నోటీస్ అది! నువ్వు తీసుకున్న లోన్­కి గ్యారంటరుగా సంతకం పెట్టిన పాపానికి, ఆ తారీఖులోగా వడ్డీతో సహా ఆ బాకీ అంతా నేను తీర్చేయాలిట. లేకపోతే నన్ను కోర్టుకీడ్చి అణాపైసలతో సహా వసూలు చేస్తారుట. పైగా ఆ వసూలీకయ్యే అమాంబాపతు ఖర్చులన్నీ కూడా నాదగ్గరనుంచే రాబట్టుకుంటారుట. పుణ్యానికి పోతే ఏదో ఎదురయిందని, నీకు సాయం చేసినందుకు మా బాగా చేశావులే శాస్తి!’ అన్నాడు చురచుర చూస్తూ.

శంకరంలో చలనం ఏం కనిపించలేదు విరించికి. నిమ్మకి నీరెత్తినట్టు, దున్నపోతు మీద వాన కురిసినట్టు అనే నానుళ్ళకర్థం తెలిసింది విరించికి. సహనం చచ్చిపోయింది. కానీ ఏంచెయ్యగలడు? ఏమీ చెయ్యలేకపోయాడు. నీరు కారిపోయాడు. చతికిలబడిపోయాడు.

నిస్సహాయంగా వేడుకున్నాడు. ‘ఒరేయ్ శంకరం, పరువుగల కుటుంబంరా మాది. ఈ కోర్టులూ కచేరీల సంగతి మాయింట్లో కాని తెలిసిందంటే ఇంకేమయినా ఉందా! బాబ్బాబు! ఆ డబ్బేదో ఆ టైములోగా, ఎలాగోలా నీ తల తాకట్టు పెట్టయినా సరే, కట్టేసి నన్ను బయటపడేయ్­రా నీకు పుణ్యముంటుంది. ఇంతకంటే ఏం చెప్పాలో, నిన్నెలా అడగాలో నాకర్థం కావడం లేదు. కాలర్ పట్టుకుని వసూలు చెయ్యడానికి రౌడీని కాను. గలాటా చెయ్యడానికి, నోరు పారేసుకోడానికి, బూతులు తిట్టడానికి నాకో సంస్కారం ఉండి ఏడ్చింది. అందుచేత అవేం చెయ్యలేను. ఇలా ప్రాథేయపడ్డం తప్ప ఇంకేం చెయ్యలేను. నాకు కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. ఊపిరి అందటం లేదు. సామాన్యుణ్ణి, నిస్సహాయుణ్ణి. ప్లీజ్­రా!’ అని దిగజారిపోయాడు. బిక్కమొహం వేశాడు ఇంకేం చెయ్యలేక.

“నన్నేం చెయ్యమంటావురా విరించీ? అదో ‘ఆయనా మంగలీ’ సామెత చెప్పినట్టు, నాదగ్గరే కనక కనకం ఉండివుంటే లోనెందుకు తీసుకుంటాను; ఈ పాట్లన్నీ పడతాను! నిజ్జంగా చెప్తున్నాను నాదగ్గర ప్రస్తుతం దమ్మిడీ లేదు. నిన్నిరికించాలనీ నా ఉద్దేశం కాదు. అయినా నువ్వేంటనుకుంటున్నావు? నాకు మాత్రం రాలేదా ఇలాటి నోటీసులు? అరడజనొచ్చాయి. ఖాతరు చేస్తే కదా! అప్పుడు నీకు పంపించారు ఈ నోటీసు. నాలాగే, నువ్వు కూడా ఖాతరు చెయ్యకు. ఏమీ చెయ్యలేరూ, చెయ్యరు. పెద్దపెద్ద స్కాంలు చేసినవాళ్ళనే ఏమీ చెయ్యలేదు. నువ్వూ నేను అనగా ఎంత? కౌన్ కిస్ ­కా గాళ్ళం. మనమో లెక్కా! మనదో పద్దా! అయినా మనకు తెలిసిన ఆ బ్యాంక్ మేనేజర్ ఎలాగా ఇప్పుడక్కడ లేడు. నీ పరువుకొచ్చిన నష్టం ఏం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆమాత్రం కాగితాలు కదపకపోతే, కబుర్లు చెయ్యకపోతే ఎలా? అందుకని ఏవో అలా కాగితపు గుఱ్ఱాల దౌడు తీయిస్తారు. అంతకంటే వ్యక్తిగత ఇన్వాల్వ్­మెంట్ కాని మనలాటి వాళ్ళ మీద కసి కోపం గాని ఉండవు. వాళ్ళూ మనుషులే! అర్థం చేసుకోగలరు. నువ్వేం భయపడకు.’ అని సముదాయించాడు.

‘ఏమో! నువ్వెన్ని చెప్పు నాకు మాత్రం భయంగానే ఉంది. నీకిదేమన్నా న్యాయంగా ఉందా!’ జాలిగా అని, అక్కడ్నుంచి లేచాడు. ‘నీ సంగతంతా మీవాళ్ళకి చెప్దామని, క్రితం వారమే మనూరు వెళ్లాను. ...’ అనేసరికల్లా శంకరం మొహం మాడిపోయింది.

విరించి అది గమనించాడు. ‘తీరా మీ బాబాయిని కలిశాక, అతని మనసు కష్టపెట్ట బుద్ధి పుట్టలేదు. నిన్నే కలవరిస్తున్నాడు. ఇంకేం చెప్తాను!’ అని అక్కడ్నుంచి అడుగు బయటకు వేశాడు విరించి.

విరించి అలా అడుగు బయటకు వేశాడో లేదో, శంకరం అప్పులవాళ్ళెవారికీ అందకుండా గభాల్న మొబయిల్ అందుకుని ఆఫ్ చేశాడు.

శంకరం మనసు మనసులో లేదు. చేతిలో పైసా లేదు. ఏం చెయ్యటానికి తోచడం లేదు. ఎలాగైనా వెళ్ళి బాబాయిని చూడాలనివుంది. ఒక్కొక్కటే నెమరువేసుకుంటూ తాపీగా తయారవసాగాడు.

నన్ను పెంచి పెద్దచేసింది, బాబాయే. కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంది పిన్ని. ఎలావుందో పాపం! నేను తప్ప ఇంకెవ్వరున్నారు వారికి! ఏం చేసినా వారిద్దరి ఋణం తీర్చుకోలేను. చాలా రోజులయింది చూసి. విరించి చెప్పాకైనా వెళ్ళి చూడాలి బాబాయిని. లేకపోతే బాధపడతారు. కానీ కాసుల్లేవే ఎలా? అనుకోవడమే తడవు, పిన్ని చేయించిన తన చిన్ననాటి పులిగోరు పతకం గుర్తొచ్చింది. అవసరానికి ఆదుకుంటుందనేనేమో ఆభరణాలు చేయిస్తారు మనవాళ్ళు, అనుకున్నాడు. అంతే! పరుగున వెళ్ళి అన్నాళ్ళూ అపురూపంగా దాచుకున్న ఆ పతకాన్ని పెట్టెలోంచి తీశాడు. వడివడిగా బంగారం కొట్టుకి నడిచాడు.

--:oo0oo:--

ఊర్లో దిగి ఇంటివైపు అడుగులేశాడు విరించి. పిన్నికి ఫోన్ చేసి చెబ్దామనుకున్నాడు. మొబయిల్ ఆఫ్ చేసేశానన్న సంగతి అప్పుడు గుర్తొచ్చింది. గబుక్కున జేబులోంచి సెల్ తీసి ఆన్ చేశాడు. ఆన్ చేస్తూనే బోల్డన్ని వాట్సాప్ మెసేజులు, ఎస్.ఎమ్.ఎస్.లు క్లింగ్ క్లింగ్ మంటూ రావడం మొదలెట్టాయి. అవేమీ పట్టించుకోలేదు అతడు. కాంటాక్ట్స్­లోకి వెళ్ళి ‘పిన్ని’ అని ఉన్నదగ్గర టచ్ చెయ్యబోయాడు.

అంతలోనే విరించి దగ్గరనుంచి ఇన్­­కమింగ్ కాల్ రావడంతో, ఆ కాల్ తీసుకున్నాడు. చిరాగ్గా విరించి గొంతు ‘ఎక్కడ చచ్చావురా! ...’ అని ఇంకా ఏదో వినిపిస్తుంటే,

మళ్ళీ ఏమొచ్చిందో చిక్కు అని జంకుతూనే, ‘ఇప్పుడే మనూర్లో బస్సు దిగానురా. ఇంటికి వెళ్తున్నాను. చెప్పు.’ అని సమాధానమిచ్చాడు. మరుక్షణంలోనే ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుని, ఏదైనా ఎదుర్కోడానికి మొండిగా, సిద్ధమయాడు.

విరించి, ‘సరే! నేనూ మీయింటి దగ్గరే ఉన్నాను. పిన్ని ఎదురుచూస్తోంది నీకోసం. త్వరగా రా!’ అని మరోమాటకి ఆస్కారం ఇవ్వకుండా కాల్ కట్ చేసేశాడు.

గుండె జారిపోయింది శంకరానికి. పిన్ని దగ్గరకెళ్ళి, ఈ విరించిగాడు ఏం ముట్టించాడో ఏంటో! అని ఆందోళన పడ్డాడు.

--:oo0oo:--

అక్కడ పిన్ని విరించికి చెప్తోంది. “శంకరం గురించి ఏం చెప్పమంటావ్ విరించీ! ఇంకా నీకు సరిగా తెలీదేమో, మీ అమ్మానాన్నకీ బాగా తెలుసు. వాడి తల్లీ తండ్రీ సడన్­గా పోతే, మేమే వాణ్ణి తల్లీ తండ్రీ అయి పెంచాం. అప్పటికి శంకరం నెలల పిల్లాడు. మా గుండెల మీద పెంచాం. వాడు బుడిబుడి అడుగులు వేస్తూంటే చూసి ఎంత పొంగిపోయామో! చిన్న చిన్న మాటలు చిలకలా పలుకుతుంటే ఎంత పరవశించి పోయామో! అలా వాడు అడుగులో అడుగు వేసుకుంటూ ఎప్పుడు పరుగులు తియ్యడం మొదలెట్టాడో, ఎన్ని మాటలు నేర్చాడో, ఎలా పెద్దవాడయిపోయాడో, మాకందనంత ఎత్తుకు ఎదిగిపోయాడో తలచుకుంటుంటే ఆశ్చర్యంగా ఉంది! అలాటిది వాడు ...”

గుండె పీచుపీచుమంటుంటే, ఇంట్లోకి అడుగు పెట్టాడు శంకరం.

విరించి శ్రద్ధగా వింటూ కనిపించాడు. పిన్ని, విరించికి ఏదో సంజాయిషీలా చెప్పుకు పోతోంది అనిపించింది శంకరానికి. అక్కడకి చేరి వినసాగాడు.

“మేము పెంచుకున్న మమకారాన్ని తుంచుకుని మమ్మల్ని వదిలి ఒక్క మాటయినా మాటాడకుండా ఉలుకు పలుకు లేకుండా ఇన్నాళ్ళెలా ఉండగలిగాడా అని నేను బాధపడుతుంటే,

మీ బాబాయ్ నాతో, ‘మన రక్తమాంసాలు పంచుకుని పుట్టకపోయినా, మన బిడ్డే వాడు. మనకి పుట్టనంత మాత్రాన మనబ్బాయి కాకుండా పోడు. మన వాడే వాడు! పిల్లల మీద మమకారం పెంచుకునేది మనం. అలా, మన పిల్లలు కూడా మన మీద అనురాగం పెంచుకోవాలని ఏముంది? అలా మనం ఆశించడం పొరపాటు! ఆ బాంధవ్యం మన మనసుకి సంబంధించినది. మన మనసులకి పుత్రమోహాన్ని కలిగించాడు వాడు. విలువకట్టలేనంత అనుభూతిని అందించాడు. ఆనందాన్నిచ్చాడు. ‘ఋణానుబంధ రూపేణా పశు పత్నీ సుతాలయః, ఋణక్షయే క్షయం యాంతి కా తత్ర పరివేదన’ అని, ఆ ఋణం తీరగానే దూరం అయిపోతాం. అలా వాడికి మనతో ఋణం తీరిపోయింది కాబోలు, మనకి దూరం అయిపోయాడు.

కానీ మనం మాత్రం శంకరం ఋణం జన్మజన్మలకీ తీర్చుకోలేం. బాకీ ఉండిపోతాం. అందుకే ఈ ఇల్లు పొల్లు అన్నీ అమ్మేసి, ఆ వచ్చిందేదో వాడి చేతికిచ్చేయ్. కనీసం, వాడు నా ఆరోగ్యం కోసమని నాకు తెలియకుండా చేసిన ఋణాలనుంచైనా, వాణ్ణి విముక్తుణ్ణి చేసినవాళ్ళమవుతాం. అంతకంటే మనమేం చెయ్యలేం! శంకరానికేనాడో మనతో ఋణం తీరిపోయింది. అందుకే దూరమయ్యాడు. ఫోనుక్కూడా దొరకనంత దూరం. పాపం! వాడెన్ని కష్టాల్లో ఉన్నాడో! మనకోసం ఇంకా ఎన్ని అప్పులు చేస్తున్నాడో, ఏ తిప్పలు పడుతున్నాడో! ఇక్కడకి రాలేక ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో, రావటానికి ఎన్ని అవస్థలు పడుతున్నాడో పిచ్చి తండ్రి!’

అని మధనపడి మీ బాబాయి మనందర్నీ వదిలేసి మనకందనంత దూరం వెళిపోయి ఈరోజుకి నాలుగురోజులయింది. చివరి శ్వాస లోగా తనివితీరా మరొక్కసారి శంకరాన్ని చూడాలనుకున్నారు. కుదరలేదు. అంతే! ఎవరికెంత ప్రాప్తమో!” అనేసరికల్లా

శంకరం కుమిలిపోయాడు. ‘పిన్నీ’ అని కుప్ప కూలిపోయాడు.

మనసులో ఎన్నో మాటలు. ఏవీ చెప్పలేకపోయాడు. ఇంకెన్నెన్నో భావాలు. వ్యక్తపరచలేకపోయాడు. నీ ఋణం, బాబాయి ఋణం ఎన్ని జన్మలకీ తీర్చుకోలేను అని మరోసారి మనసులోనే అనుకున్నాడు. ఎలాగో కూడగట్టుకుని, గొంతు పెగుల్చుకుని, ‘నాతో పట్నం వచ్చేయి పిన్నీ.’ అని మాత్రం గద్గదస్వరంతో అనగలిగాడు శంకరం.

శంకరానికి మరోదారి లేక, బాబాయి ఆరోగ్యం కుదుటపడాలనే తాపత్రయం కొద్దే, అప్పులు చేశాడని, విరించికి అప్పటికి పూర్తిగా అర్థమయింది. శంకరాన్ని అంతవరకు అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడ్డాడు.

‘వీడి ఋణం గురించి ఎంత దారుణంగా ఆలోచించాను!’ అనుకున్నాడు.

--:oo(0)oo:--

మరిన్ని కథలు

Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి
Pelli
పెళ్లి
- Madhunapantula chitti venkata subba Rao