తిక్క కుదిరింది! - పద్మావతి దివాకర్ల

Tikka kudurindi

"మామయ్యగారూ!...శరణు! శరణు!! నా మొర ఆలకించి, మీరే నన్ను రక్షించాలి!" అలనాడు గజేంద్రుడు విష్ణుమూర్తిని మొరపెట్టుకున్నట్లు మామ పర్వతాలుతో విన్నవించుకున్నాడు అల్లుడు రామావతారం తెల్లారే ఫోన్ చేసి.

"ఏమిటి అల్లుడూ తెల్లారే గొడవ? అమ్మాయి ఏమైనా కోరరాని కోరికలు గానీ కోరుతోందా? షాపింగ్ పేరుచెప్పి నీ క్రెడిట్‌కార్డూ, డెబిట్‌కార్డు తెగవాడేస్తోందా, లేక సీరియల్స్ బ్రేక్ లేకుండా చూస్తోందా? రోజూ సినిమాకేమైనా తీసుకెళ్ళమంటూందా? పట్టుచీర పట్టుకురమ్మంటోందా, డైమండ్ నెక్లస్ కొనమంటోందా? కొండమీద కోతిని తెమ్మంటోందా? లేకపోతే కోతి చేతుల్లొంచి కొబ్బరి చిప్ప లాక్కురమ్ముంటుదా? ఏమిటి అల్లుడూ నీ బాధేమిటి అసలు? "అడిగాడు రమణారెడ్డిలా సన్నగా రివటలా ఉండే పర్వతాలు లేని తన బొజ్జ నిమురుకుంటూ. పేరుకి మాత్రమే అతను పర్వతాలు. పేరుకి, ఆకారానికి ఏమాత్రం పొంతన లేని మనిషి అతను.

"అలాంటివాటిని నేను పెద్దగా పట్టించుకోను మావయ్యగారూ...…!" అంటూ ఇంకేదో చెప్పబోతుండగా అడ్డువచ్చి, "మరెందుకల్లడూ తెల్లారే ఫోన్ చేసావు బంగారంలాంటి నా నిద్ర పాడుచేసి! అసలు సిసలు బంగారంలాంటి మా అమ్మాయి గజలక్ష్మిని నీకిచ్చి పెళ్ళిచేసానుకదా, మరి నీకు దిగులెందుకూ?" ప్రశ్నించాడు పర్వతాలు ఆవులిస్తూ.

'ఎందుకేమిటి, మీ గజాన్ని నాకు అంటగట్టి చేతులు దులుపుకున్నారు! మీ గజానికి తినడానికి నోరు తెగ వాడుతుందితప్ప వంట చెయ్యడానికి వళ్ళువంగదే, చేతులు రావే?' మనసులో అనుకున్నా పైకి మాత్రం అనలేకపోయాడు పాపం మామగారు హర్టవుతారని. ఎవరినీ హర్టించడం ఇష్టంలేకపోవడంవల్లే వచ్చిన తిప్పలివి మరి! గజలక్ష్మికి వంటచేయడం రాదుగాని, ఎవరైనా వంటచేస్తే సుబ్బరంగా తినిపెట్టడం మాత్రం మాబాగా వచ్చు. పెళ్ళై ఏడాదిదాటినా వంటిల్లు ఎక్కడుందో మాత్రం ఇప్పటివరకూ తెలుసుకోలేకపోయింది, ఇంక వంటమాట దేవుడెరుగు! అసలు వంట మాటవింటేనే ఆమెకి వళ్ళుమంట!

"గజం...అదే… మీ అమ్మాయి ఇంతవరకూ వంట చేయడమే నేర్చుకోలేదు, అదేమంటే నాకు వంటగండం ఉందంటుంది. నాకు తెలియక అడుగుతాను, వంటగండం ఉన్నప్పుడు తినే గండం మాత్రం ఉండదా! నేను మాత్రం ఎన్ని రోజులని మేపగలను...సారీ...వండగలను? ఇంతకు ముందైతే వర్క్ ఫ్రం హోం ఉండటంవల్ల వంట చేయగలుగుతూ ఉండేవాణ్ణి, ఇప్పుడు మరి ఆ అవకాశమే లేదే! వంటవండి ఆఫీసుకెళ్ళేసరికి రోజూ ఆలస్యమై బాస్‌చేత దీవెనలు అందుకోవలసి వస్తోంది! మీరే ఏదోవిధంగా నా సమస్యని పరిష్కరించాలి. లేకపోతే నేను సన్యాసుల్లో కలిసిపోతా!" తన మనోవేదన అంతా వెళ్ళగక్కుతూ మామగారిని హెచ్చరించాడు అప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న రామావతారం.

అల్లుడి మనోవేదన పూర్తిగా ఆలకించిన పర్వతాలు అతనికి అభయమిచ్చాడు,"ఓస్ఁ...! ఇంతేగా అల్లుడూ! అయినా మా గజంకి వంటరాదన్న ఒక్కమాట తప్పించి మిగతా అన్ని విషయాల్లో సూపర్ అల్లుడూ! అంతమాత్రానికే సన్నాసులో కలిసిపోతావా? అయినా నేను లేనూ! నీ విషయం త్వరలో సర్దుబాటు, అదే సెటెల్‌మెంట్ చేస్తాను. నేను, మీ అత్తయ్య త్వరలో మీ ఇంటికి వస్తాం. దీనికో శాశ్వత పరిస్కారం చూపిస్తాను. నన్ను నమ్ము! సరేనా! సరేనా? ఇంతకీ ఏదీ మా గజం? ఓ సారి ఫోనివ్వు!" అన్నాడు పర్వతాలు.

“ఇంట్లో లేదు మావయ్యగారూ, సినిమాకి వెళ్ళింది. అట్నించి అటే షాపింగ్ చేసుకు వస్తానంది.

“మరి నువ్వు కూడా వెళ్ళలేకపోయావా అల్లుడూ?”

“ నేనూ వెళుదును కానీ మీ అమ్మాయే 'మీ క్రెడిట్‌కార్డ్ నా దగ్గర ఉండగా మరి మీరెందుకూ' అని పక్కింటి ఆవిడని తోడు తీసుకొని వెళ్ళింది.

“తెలివిగల పిల్ల మరి! అయితే నేను ఇక వస్తాను అల్లుడూ, నాకు కొంచెం ఆఫీసులో పని ఉంది. గుర్తుంచుకో! నెలాఖరు రోజు, వినాయక చవితి నాడు నేను సెటెల్‌మెంట్ చేస్తాను! (అని నిష్క్రమిస్తాడు)

'ఏం నమ్మడమో ఏమిటో!' అనుకుంటూ విరక్తిగా ఫోన్ పెట్టేసాడు రామావతారం. దండిగా కట్నం దొరుకుతుందని ఆశపడిన రామావతారానికి దమ్మిడీ విదల్చలేదు పిసినారి పర్వతాలు. పైగా, "బంగారంలాంటి అమ్మాయిని ఇచ్చిపెళ్ళిచేసాను, అది చాలదూ అంతకు మించి ఇంకేం కట్నం కావాలల్లుడూ?" అని ముందరికాళ్ళకి బంధం వేసాడు. మరేం మాట్లాడలేకపోయాడు పాపం రామావతారం. మాట్లాడితే మొదటికే మోసం! కట్నం ఆశించే రోజులే కావు ఇవి అని సరిపెట్టుకున్నాడు. అసలు పెళ్ళికావడమే గొప్ప అనుకున్నాడు. గజలక్ష్మే చేసిందని పెళ్ళిచూపుల్లో పెట్టిన స్వీట్స్, హాట్స్ తిని కట్నం లేకపోతే లేదుగానీ వంట బాగా వచ్చని బోలెడు సంబరపడిపోయాడు రామావతారం. తీరా, పెళ్ళయ్యాక ఆ స్వీట్స్, హాట్స్ తన అత్తగారు కూడా చేయలేదని, మామగారు చేసినవని తెలిసింది. పిండివంటలు మానే, మామూలువంట చెయ్యడం కూడా గజలక్ష్మికి చేతకాదని పెళ్ళైన తర్వాత తెలిసి తలపట్టుకున్నాడు రామావతారం.

చెప్పినట్లుగానే వారం రోజులు తిరక్కముందే ఓ రోజు ఉదయమే పర్వతాలు భార్య కాంతమ్మతో రామావతారం ఇంట్లో అడుగుపెట్టాడు. వచ్చీరాగానే, "అల్లుడూ నిన్నటితో నా ఉద్యోగ బాధ్యతలు తీరిపోయాయి. ఇకనుండి నేను ఫ్రీ!" అంటూ మోసుకొచ్చిన బ్యాగులు ఇంట్లో ఓ మూలకి విసిరేసి సోఫాలో కూలబడ్డాడు.

"ఏం అల్లుడూ కులాశానా!" అని పలకరించింది కాంతమ్మ నవ్వుతూ. ఆ నువ్వులో బోలెడన్ని అర్థాలు స్పురించాయి రామావతారానికి. అయితే ఆ నవ్వులో, 'నా కూతురు గజంని పెళ్ళాడిన తర్వాత కులశాగా ఎలా ఉంటావులే?' అన్న భావమొకటే అతన్ని వెక్కిరించింది. వాళ్ళ అలికిడి వినగానే లోపల్నుండి ఒక్క దూకుతో హాల్లోకి వచ్చింది గజలక్ష్మి చేతిలో చిరుతిళ్ళు ఉన్న గిన్నితో. "మమ్మీ...!హెలా ఉన్నావ్ మమ్మీ..." అని ముద్దులు ఒలుకుతూ కాంతమ్మని హత్తుకుంది గజలక్ష్మి. "అయ్యో గజం, నువ్వు చిక్కిపోయావేమిటి తల్లీ?" ఆప్యాయంగా కూతుర్ని తడిమి, రామావతారం వైపు చూసి, "ఏమిటల్లుడూ మా అమ్మాయికి సరిగ్గా వండిపెట్టడంలేదా ఏమిటి?" అని ఉరిమి చూసింది.

అత్తగారి చూపులకి బెదిరిపోయిన రామావతారం బిక్కమొహం వేసుకొని మామగారివైపు చూస్తూ నిలబడ్డాడు. అవును మరి! అరిటాకువెళ్ళి ముల్లుమీదపడ్డా, ముల్లువెళ్ళి అరిటాకు మీదపడ్డా డామేజి అరిటాకుకే కదా! అలాగే గృహంలో ఎవరుఎవరిపై హింసకి పాలుపడ్డా, గృహహింస కేసు నమోదు అయ్యేది భర్తపేరునేకదా మరి! బేలగా చూస్తున్న రామావతారం అవస్థను అర్థం చేసుకున్నది పర్వతాలు ఒక్కడే! ఏమైనా మగాడు కదా మరి! అందుకే వెంటనే అల్లుడిని వెనకేసుకొచ్చి, "ఊరుకో కాంతం! చూడు అల్లుడు ఎలా భయంతో బిగదీసుకుపోయాడో! నెమ్మదిమీద అన్నీ నేను నచ్చచెపుతానులే! ఇవాళగాని, రేపుగాని మనం వెళ్ళిపోతున్నామా ఏమిటి?" అంటున్న మామగారివైపు చూసాడు రామావతారం అర్థంకాక. కొంపతీసి ఇక్కడే సెటలైపోయి, ముగ్గురూ కలసి తన నెత్తిమీద తాండవం చెయ్యరుకదా అన్న అనుమానం అతన్ని పెనుభూతంలా పీడించసాగింది. అల్లుడి పరిస్థితి గమనించిన కాంతమ్మ కూడా కాస్త మెత్తబడింది.

"మరేం లేదు అల్లుడూ, అమ్మాయి కొద్దిగా చిక్కినట్లు అనిపిస్తేనూ అలా అడిగాను, మరేం అనుకోకల్లుడూ!" అందామె తన భారీకాయాన్ని సోఫాలోకి చేరవేస్తూ. ఆ మాటలు లెంపకాయ కొట్టి సారీ చెప్పినట్లనిపించింది రామావతారానికి. గజం చిక్కడం కూడానా అనుకొని విడ్డురంగా గజలక్ష్మివైపు చూసాడు రామావతారం. అతని చూపులకి మరోలా అర్థం చేసుకున్న గజలక్ష్మి సిగ్గుపడి ఇంట్లోకి తుర్రుమంది. ఆమె వెనుకే రామావతారం అత్తగారు, మామగారుకూడా వెళ్ళారు.

ఓ గంటతర్వాత పర్వతాలు వచ్చి హాల్లో కూర్చొని టివిలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న రామావతారాన్ని చూసి, "పద అల్లుడూ!" అన్నాడు. 'ఎక్కడకు?' అని అడగకుండా మామగారి వెంట వంటింట్లోకి వెళ్ళాడు గజలక్ష్మిని మందలించి ఆమెకి అత్తగారిచేత వంటవండటంలో తగిన తర్ఫీదు ఇప్పిస్తాడని భావించి.

తీరా చూస్తే వంటిట్లో గజలక్ష్మీ, కాంతమ్మ ఇద్దరూ లేరు. "ఏరీ వీళ్ళు?" అని అడిగాడు.

"ఎవరు వాళ్ళు అల్లుడూ? ఎవరిపని వాళ్ళు చేసుకోవడంకన్న ఉత్తమమైనదేమీ లేదని నా అభిప్రాయం. పద ఆ వంకాయలు అందుకో! అలాగే బీరకాయలు కూడా! ఇంకో చెత్తో ఆ కత్తిపీట అందించు. నేను కూరలు తరుగుతాను. నువ్వు మూకుట్లో వెయ్యు! కుక్కర్లో బియ్యం పెట్టెయ్! నీకు తెలుసుకదా, మూడు పావులు చాలులే!" అన్నాడు పర్వతాలు కింద కూర్చుంటూ.

"అదేంటి మామయ్యగారు! మీరేదో సెటెల్‌మెంట్ అన్నారు కదా!" బిత్తరపోయి చూసిన రామావతారం అన్నాడు. మామగారి మాటలకి లేక్కలేని తిక్క రేగుతోంది రామావతారానికి.

"తప్పదు అల్లుడూ! ఇదే సెటెల్‌మెంట్! మన తలరాతే అంత! అయితే ఒకటి! నిన్నటి వరకూ పాపం నువ్వొక్కడివే చేతులు కాల్చుకుంటూ ఉండేవాడివి! ఇప్పుడు నేను వచ్చేసేగా! నీకు మరి చింతలేదు. ఒకరికొకరు సహాయం. ఇద్దరు కలిసే వంట చేద్దాం! నేనెలాగూ ఉద్యోగంలోంచి రిటైర్ అయ్యాను. ఇంక ఇక్కడే ఉండి నీకు సహాయపడదలిచాను. అన్నట్లు మిగతా పనులు మరిచాను. నేను అంట్లు తోముతాను, నువ్వేమో బట్టలు ఉతికి ఆరేయ్! నువ్వు ఇల్లూ, వాకిలీ శుభ్రంగా ఉడ్చు, నేనేమో తడిచెత్తా పొడిచెత్త వేరుచేసి పారబోస్తా! ఇంకా ఎమైనా పనులు ఉంటే చెప్పు ఇద్దరం కలిసి చేద్దాం!"అన్నాడు పర్వతాలు వంకాయలు తరిగి నీళ్ళలో వేస్తూ.

మామగారి సర్దుబాటుకి వళ్ళుమండిన రామావతారం, "మరి బజారుకి వెళ్ళి కూరగాయలు తేవడం? ఆ పనెవరూ చేస్తారు? " కసిగా అడిగాడు పళ్ళు పటపట నూరి మామగార్ని మింగేసేలా చూస్తూ.

"ఆ పని మాత్రం తల్లీకూతుళ్ళకి వదిలేద్దాం. అలాగే షాపింగ్ పని కూడా!" అన్నాడు పర్వతాలు పరమ శాంతంగా.

"ఏం ఆ పని మాత్రం వాళ్ళకి వదలడం దేనికి?" మామగారి మాటలకి తల దిమ్మెక్కిపోయింది రామావతారానికి.

"ఆ మాత్రం తెలియదా అల్లూడూ? మనమే కూరగాయలు తెస్తే చచ్చులూ, పుచ్చులూ, ముదరవీ తెచ్చామని మనల్ని నిలదీయరూ?" అన్నాడు పర్వతాలు.

మామగారి మాటలకు మతిపోయిన రామావతారం అప్రయత్నంగానే కుక్కరు అందుకున్నాడు. హాల్లో గజలక్ష్మీ, కాంతం టివిలో పండుగ స్పెషల్ కామెడీ ప్రోగ్రాం 'తిక్క కుదిరింది!’ చూస్తూ పకపక నవ్వుకుంటున్నారు. నిజంగానే రామావతారానికి తిక్క కుదిరింది మరి!

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి