అనుభూతి - జీడిగుంట నరసింహ మూర్తి

Anubhoothi

నేను ఆ కంపినీలో కొత్తగా చేరాను. వెళ్ళిన నెలరోజులకు నాకు కూడా క్వార్టర్ అలాట్ చేశారు. నేను పని చేస్తున్న ఆ కంపినీలో చాలా మంది బీహార్ నుండి , యూపీ నుండి ఒక ప్యాసింజర్ ట్రైన్లో దిగుమతి చెయ్యబడ్డారు. అందులో చాలా మంది పది కన్నా తక్కువ చదివిన వాళ్ళే. ఇక వాళ్ళ పుట్టిన రోజులు వాళ్ళకే తెలియవు. శ్రామికులు బాగా చవుకగా దొరుకుతారని కాబోలు అటువంటి ఫార్మాలిటీస్ గురించి వాళ్ళు ఆలోచించ దల్చుకోలేదు. ఎత్తు , పొడుగును బట్టి ఉజ్జాయింపుగా వాళ్ళకు హాజరు పట్టీ తయారుచేసి నెలనెలానో, వారం ఆఖరికో జీతాలు లెక్కకట్టి ఇస్తూండే వారు. పై లెవెల్ నుండి కింద లెవెల్ వరకు మాట్లాడే భాషల్లో తెలుగు దాదాపు వినపడేది కాదు. . మొత్తం కంపినీ మీద మహా ఉంటే ఒక అయిదారుగురు తెలుగు వాళ్ళు ఉన్నారనుకుంటా. .

ఇక క్యాజువల్ లేబర్ని వదిలేసి మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ స్తాయిని బట్టి దాదాపు అందరికీ నివసించడానికి క్వార్టర్లు ఉన్నాయి. కంపినీ దగ్గరే ఎక్కువమందికి క్వార్టర్లు ఇవ్వడం వల్ల వాళ్ళకు ఎప్పుడు ఏ సమయంలో నైనా పని చెయ్యడానికి ప్రతి వారు సిద్దంగా ఉండాలి. కొద్దిగా పెద్ద స్తాయి ఆఫీసర్లు క్వార్టర్లు వదిలిపెట్టి వెళ్లడానికి వీల్లేదు. ఏ సెలవు మీద వెళ్ళినా, టూర్ మీద వెళ్లినా తప్పని సరిగా సెక్యూరిటి కి లిఖిత పూర్వకంగా వ్రాసి వెళ్ళాలి. సెలవులో వెళ్ళిన వారి పని వేరే వారికి కేటాయించడం విషయంలో మేనేజ్మెంట్కు ఉపయోగంగా ఉంటే అటు క్వార్టర్లలో దొంగలు పడకుండా అందులో ఉద్యోగస్తులకు భరోసాగా ఉండేది. .

మా లైన్లో కుడివైపు , ఎడమవైపు కలిసి సుమారు నలభై క్వార్టర్లు ఉంటాయి. వాళ్ళల్లో నేనొక్కడినే తెలుగు వాడిని.

తెలుగు లిటరేచర్ లో ఎమ్మే డిగ్రీ ఉన్న మా ఆవిడ అక్కడ వాళ్ళతో మాట్లాడాలంటే నానా ఇబ్బందులు పడేది. చాలా రోజులు సైగలతోనే లాక్కుంటూ వచ్చింది. ఆ క్వార్టర్లో ఉన్న ఆడవాళ్ళకు తెలుగు ఒక్క ముక్క రాకపోక, కనీసం ఆంగ్లంలోనైనా చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడగలిగే పరిజ్ఞానం లేదు. నా పోస్ట్ పెద్దది అవ్వడం వల్ల చాలా మంది స్టాఫ్ నన్ను ప్రతి చిన్న విషయానికి ఫోనులోనో , వ్యక్తిగతంగానో పలకరించి తమ సందేహాలు తీర్చుకుంటూ కంపినీలో ఉత్పత్తి విషయంలో ముందుకు వెళ్ళే వాళ్ళు. ఒక్కోసారి నేను మార్కెట్ కు వెళ్లినప్పుడు వాళ్ళు మా ఇంటికి ఫోన్ చేసేటప్పుడు మా ఆవిడ చాలా సమస్యను ఎదుర్కునేది భాషాపరంగా.

ఒక రోజు మా ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ భార్య వేదవతి గారు నేను మార్కెట్ కెళ్ళిన సమయంలో మా ఇంటికి కారులో వచ్చారు. ఆవిడ వచ్చినట్టు తెలిసి పక్క పక్క క్వార్టర్లలో ఉన్న కొంతమంది ఆడవారు కూడా ఆవిడతో మాట్లాడాలని వచ్చారు. వాళ్ళందరికీ మా ఆవిడ సౌజన్య చిరునవ్వుతూ నమస్కారాలు చేస్తూ కాఫీలు ఇస్తూండగా నేను లోపలకి అడుగుబెట్టాను. వేదవతి గారు, ఆ పక్క క్వార్టర్లలో ఉన్న వాళ్ళు తనని ఏవేవో హిందీలో ప్రశ్నలు వేసి చంపుతున్నారు. . తనకు హిందీ ఎంతోకొంత అర్ధమవుతుంది కానీ హిందీలో తిరిగి సమాధానం చెప్పలేదు. మొత్తానికి అక్కడ పరిస్తితి కొంత ఇబ్బందిగా మారింది. సరిగ్గా అదే సమయానికి నేను రావడం వల్ల ప్రమాదం తప్పింది. . నేను చాలా కంపినీలలో పనిచేసి ఉండటం వల్ల ఎంతో కొంత హిందీ నేర్చుకోవడం వల్ల వేదవతి గారు ఏం మాట్లాడుతోందో అర్ధం చేసుకోగలిగాను.

"మీ మిసెస్ ను మన క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండమని చెపుతున్నాను. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. కొద్దిగా హిందీ మాట్లాడటం అలవాటు చేసుకుంటే క్లబ్ లో మహిళా కార్యక్రమాలు నిర్వహించడంలో పెద్ద కష్ట పడాల్సిన పని లేదు. రానూ రానూ అందరూ పరిచయం అయ్యాక భాషా సమస్య కూడా తొలగిపోతుంది. మీ ఇద్దరూ "ఊ " అంటే కొత్తగా క్లబ్ సభ్యులు ఎన్నిక చేసే టప్పుడు తన పేరు కూడా ఇంక్లూడ్ చేస్తాను. అదే విషయం మీ మిసెస్ తో చెప్పాను. తనకు అర్ధమైనట్టుగా లేదు. మీరిద్దరూ డిస్కస్ చేసుకుని ఏ విషయమో నాకు రేపు ఉదయం ఫోన్ చేసి చెప్పండి . మళ్ళీ కలుస్తాను " అంటూ కారు ఎక్కి వెళ్ళి పోయింది. అక్కడికొచ్చిన మిగిలిన మహిళలు కాఫీ చాలా బాగుందని మెచ్చుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.

అక్కడ వాతావరణంలో నేను గమనించినది ఏమిటంటే ముఖ్యంగా క్వార్టర్లలో ఉన్నవాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్లు ప్రాణం ఇచ్చుకునే వాళ్ళులా కనిపిస్తున్నారు. సాయంత్రం ఆఫీసు అయిపోయిన తర్వాత ప్రతి క్వార్టర్ ముందు బాగా సందడి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇళ్ళల్లో చేసిన రకరకాల పిండి వంటలు వచ్చిన వాళ్ళందరికీ ఆప్యాయంగా ప్లేట్లలో పెట్టి అందించే వారు .అయితే వాళ్ళ ఇళ్లకు వాళ్ళ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళే ఎక్కువ కలుస్తూ ఉంటారు. ఒక సారి మేమిద్దరమూ వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మా పక్క డిపార్ట్మెంట్ మేనేజర్ భూషణ్ చిరునవ్వుతో నన్ను పలకరించి మా ఇద్దరినీ లోపలకు ఆహ్వానించాడు.

"ఈ సార్ వస్తామని చెప్పండి. మీరంటే వాళ్ళ భాష ఏదో రకంగా మాట్లాడి మేనేజ్ చేసేస్తారు. నాకు ఆవిడతో మాట్లాడాలంటే మొహమాటమే కాకుండా ప్రతి దానికీ నవ్వుతూ ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి . ..." అంటూ చెయ్యిపట్టి ముందుకు లాక్కుని వెళ్లబోయింది మా ఆవిడ .

భూషణ్ భార్య గేట్ బయటకు వచ్చి "అందర్ ఆయియే బెహన్ జీ " అంటూ సిగ్గుపడుతూ కొంగు మీదకు వేసుకుని నన్ను కూడా ఆహ్వానించడంతో తప్పని సరిగా లోపలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే భూషణ్ ఆరుబయట నాలుగు కుర్చీలు వేసేశాడు . వాళ్ళ కొడుకు అనుకుంటా లోపలనుండి ప్లేట్లలో ఏవో ఎప్పుడూ చూడని పదార్ధాన్ని తీసుకొచ్చి టీపాయి మీద పెట్టాడు. అక్కడ ఆచారం ఏమిటంటే ఎవరు ఇంటికి వచ్చినా ఏదో ఒక టిఫిన్ పెట్టకుండా పంపరు.

భూషణ్ భార్య మాట్లాడే ప్రతి మాటకు మా ఆవిడ "జీ ...జీ " అంటూ సమాధానం ఇచ్చి తప్పించుకుంటోంది. తన మొహంలో విపరీతమైన ఇబ్బంది కనిపిస్తోంది. చూస్తూంటే ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది తన పరిస్తితి.

వెనక్కి వచ్చే టప్పుడు అన్నాను. "ఇన్నాళ్ళు ఎన్నో చోట్ల తప్పించుకున్నావు కానీ ఇక్కడ నిన్ను వీళ్ళు వదిలేటట్టు లేరు. ఇక్కడ వాళ్ళ భాష మాట్లాడగలిగితేనే విలువ ఇస్తారు. అందులో రేపటినుండి వీళ్ళ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉండబోతున్నావు. ఇక ఆ తెలుగు సీరియల్స్ మానేసి పూర్తిగా హిందీ సీరియల్స్ లోకి దిగిపో. మీ ఆడవాళ్ళకు మగ వాళ్ళ కన్నా ఏ భాష అయినా త్వరగా వస్తుందని అంటారు. ఇక్కడ ప్రతి వారం మార్కెట్ కు బస్ వేస్తారు. అందులో ఈ కంపినీలో పని చేస్తున్న వాళ్ళందరూ తమ కుటుంబాలతో సహా ఇక్కడ పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్ కు షాపింగ్ చెయ్యడానికి వెళ్తారు. నువ్వు కూడా వాళ్ళతో వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటినుండి ఆరునెలలో నీకు కూడా వాళ్ళ భాష వచ్చేస్తుందిలే. కంగారు పడకు " అని ధైర్యం చెప్పాను సౌజన్యకి.

" ఏం రావడమో ఏమిటో ? చాలా అవమానంగా అనిపిస్తోంది. పోనీ ఇంగ్లిష్ లో మాట్లాడదామంటే ఆ వేదవతి గారితో సహా ఒక్కరికీ ఒక్క ముక్క కూడా రాదు . అసలు ఈ కంపినీలో ఇంతమంది వేరే రాష్ట్రం వాళ్ళను ఎందుకు తీసుకున్నారంటారు? ఈ ఫ్యాక్టరీ ఉన్నది మన తెలుగు రాష్ట్రంలో కదా . ఒక్కరికీ తెలుగు రాదంటే మనం మాత్రం హిందీ నేర్చుకుని వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి ? అసలు ఆ విషయానికొస్తే నేను క్లబ్ ప్రెసిడెంట్ గా చెయ్యడం కూడా ఇష్టం లేదు . నా మాట వాళ్ళకు అర్ధం కాదు. వాళ్ళ మాట నాకు తెలియదు. . ఏదో మీరు ఈ కంపినీలో పెద్ద పోస్టులో ఉన్నారని మొహమాటానికి నన్ను ప్రెసిడెంట్గా ఉండమని అంటున్నారు కానీ లేకపోతే వేదవతి గారు అంత తేలిగ్గా నన్ను ఎందుకు కోరుకుంటారు ? ఇప్పటికీ వేదవతి గారు నాలుగైదు సార్లు ఫోన్ చేసి బలవంతం చేసేస్తోంది. . ఎంతకని చిరునవ్వుతో వాళ్ళను పలకరిస్తూ గెంటుకు రాగలను? ఒక పని చేయరాదు ? మా శ్రీమతికి ఒంట్లో బాగుండటం లేదు. ఈ పరిస్థితులలో తను క్లబ్ కార్యక్రమాల మీద శ్రద్ద చూపే అవకాశం లేదు " అని చెప్పి ఈ సమస్యనుండి నన్ను బయట పడేయ్యండి. " అంది సౌజన్య నన్ను బ్రతిమాలుతూ. .

రోజూ ఉదయం , సాయంత్రాలు ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తూ "టీపాల్ ..టీపాల్ .." అంటూ పిల్చుకుంటూ వెళ్ళడం మేమిద్దరమూ గ్రహించాం. టినోపాల్ లాగా ఈ టీపాల్ ఏమిటో మాకు చాలా కాలం వరకు అర్ధం కాలేదు. ఇలా లాభం లేదనుకుని ఒక రోజు ఆ సైకిల్ వాడిని ఆపి అడిగితే అసలు విషయం తెలిసింది. ఆ కాలనీలో దాదాపు అందరూ వేరే రాష్ట్రాలనుండి వచ్చిన వాళ్ళు అవ్వడం, వాళ్ళలో ఎవరికీ కాఫీ అలవాటు లేకపోవడం, ఇంటికి వచ్చిన ప్రతివారికీ టీ ఇవ్వాల్సి ఉండటం తో ప్రత్యేకంగా "టీ " కోసం అతి తక్కువ ధరలో ఆ సైకిల్ వాడు సప్లయ్ చేసే వాడని తెలిసింది. కాఫీలో అయితే చిక్కటి పాలు కావాలి అదే టీ కైతే ఎన్ని నీళ్ళు పోసినా వేడివేడిగా ఉంటే చాలు తాగేస్తారు అని అక్కడి వాళ్ళ అభిప్రాయంట. కొద్దిగా స్టైలిష్ గా ఉండాలని ఆ ప్రత్యేకమైన తక్కువ ధరగల నీళ్ళ పాలను "టీపాల్ " అని పిలుస్తూ ఆ కాలనీలో అందరికీ అలవాటు చేశాడు ఆ సైకిల్ పాల వాడు. విషయం తెలిసి మేమిద్దరమూ ఆశ్చర్యపోతూ హాయిగా నవ్వుకున్నాం.

నేను నా దారిన ఆఫీసులో బిజీగా ఉండటం, తను ఏదో విధంగా క్లబ్బులోనూ, ఇంటిలోనూ వచ్చిన వారిని మైన్టైన్ చేసేస్తూ ఉండటంతో అనుకోకుండా రెండు సంవత్సరాలు అలవోకగా గడిచిపోయాయి.

ఆ రోజు క్లబ్బు వార్షికోత్సవం ఉండటంతో నన్ను క్లబ్ ముఖ్య అతిధిగా పిలవడంతో సరాసరి ఆఫీసునుండే వెళ్ళాను. సౌజన్య అందమైన చీరలో ,మెడనిండా నగలతో మెరిసిపోతూ స్టేజ్ మీదా అటూ ఇటూ తిరిగేస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను.

" ఇప్పుడు మన క్లబ్ వైస్ ప్రెసిండెంట్ శ్రీమతి సౌజన్య విశాల్ గారు తమ అనుభవాలు పంచుకుంటారు " అని మైకులో వినపడటంతో అందరి చూపులు అటువైపు మళ్ళాయి. అనవసరంగా నా భార్యను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారేమో అని అనిపించింది.

ఆ క్షణాలు రానే వచ్చాయి. సౌజన్య మైక్ అందుకుంది. చక్కటి హిందీలో మాట్లాడుతూంటే నా బుర్ర తిరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు భాషా సమస్యతో అందరినీ తప్పించుకుని తిరిగే తను ఈ భాషను ఇంత చక్కగా ఎప్పుడు నేర్చుకుంది ? ఎలా నేర్చుకుంది ? నిజానికి తను కొత్తగా నేర్చుకుని మాట్లాడుతున్నట్టు లేదు. తన మాటలలో ఎంతో స్పష్టత కనిపిస్తోంది.

స్టేజ్ మీద చప్పట్లు మారుమోగాయి. సౌజన్య తన అనుభవాలు, అనుభూతులు బాగా వివరించినట్టు అక్కడ అందరూ అనుకుంటూ ఉంటే నాకు ఇదంతా వింత అనుభవంగా అనిపించింది.

ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేమిద్దరమూ కారులో ఇంటికి వెళ్తున్నాం. నేను గర్వంగా తన కళ్ళల్లోకి చూశాను.

" అవునండీ. ఇప్పుడు నాకు ఎటువంటి భాషా సమస్య లేదు. ఈ రెండేళ్ళల్లో నేను అందరితో కలిసిపోయాను. మీరు ఆఫీసులో ఉన్నప్పుడు మన పక్క క్వార్టర్లలో ఉన్న మహిళలు వస్తున్నారు వెళ్తున్నారు. నేనూ వాళ్ళతో తరచుగా కాలుస్తున్నాను. ఇక్కడ వాళ్ళు చాలా మంచి వాళ్లండీ. నాకు ఎంతో విలువనిస్తారు. తమ సొంత సోదరిలాగా చూస్తున్నారు. మీరు ఎప్పటిలాగా వేరే కంపినీలకు తరచుగా మారకండి. నాకు ఇక్కడ చాలా బాగుంది. నాకు ఇక్కడ స్కూల్లో కూడా ఉద్యోగం ఇస్తానంటున్నారు ......" అంటూ ఆనందంగా చెప్పుకుపోతోంది సౌజన్య,

"అవును స్త్రీ తలుచుకుంటే ఈ రోజుల్లో సాధించలేనిది ఏముంది ? " అని మనసులో అనుకున్న మాటలు పైకి రానే వచ్చాయి. తను తనువంతా పులకరించిపోతూ "అంతా మీ ప్రోత్సాహమే ఇది. భయపడి అందరికీ దూరంగా మసులుకుని ఉంటే ఈ రోజు ఈ గౌరవానికి నోచుకునే దానిని కాదు. ఈ అనుభూతి నా జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతుంది " అంటోంది సౌజన్య విజయగర్వంగా. *******

సమాప్తం

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు