బ్రహ్మార్పణం- ( ఆధ్యాత్మిక కథ ) - వెంకటరమణ శర్మ పోడూరి

Brahmarpanam

కరోనా తగ్గిన తరవాత శ్రీకాంత్ కాలేజీ కి వెళ్లి వస్తున్నాడు. ఒక రోజు, త్వరలో జరగ బోయే పరీక్షలకి కలిసి చదవడానికి రవితో బాటు, అతని క్లాస్మేట్ జాన్ కూడా వచ్చాడు. వాళ్ళు చదువు లో ఉండగానే లంచ్ టైం అయితే, శ్రీకాంత్ తల్లి, వాళ్ళ ముగ్గురినీ కూడా వచ్చి లంచ్ చేయమన్నారు. మిత్రులు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చేటప్పటికి అప్పటికే తాత గారు వచ్చి కూర్చున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా వచ్చిన తరవాత శ్రీకాంత్ తల్లి అందరికి వడ్డన చేసింది. భోజనం ప్రారంభించే ముందు జాన్ వాళ్ళ క్రిస్టియన్ పద్ధతి లో ప్రార్థన చేశాడు. ఆరోజు మంచి భోజనమ్ ఇచ్చినందుకు, మిగతా ఆనంద పరిచే వన్నీ ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నట్టు ఉంది ఆ ప్రార్థన. ఆ ప్రార్థన, అతను ప్రార్థన చేయడం రవి వింతగా చూశాడు. వాళ్ళ ఇంట్లో వంట అయిన తరవాతఅన్ని పదార్ధాలని దేవుడికి నైవేద్యం పెట్టిన తరవాతే అందరికీ పెడతారు. ఇలా భోజనం ముందు వేరే ప్రార్థన ఉండదు. జాన్ ప్రార్థన చేసినతరవాత, శ్రీకాంత్ తాత కృష్ణయ్య గారు, జాన్ ని అభినందించారు. అది చాలా మంచి అలవాటు బాబు. ఎక్కడికి వెళ్లినా గుర్తుపెట్టుకుని భోజనం ముందు నువ్వు ప్రార్థన చేయడం చాలాబాగుంది అన్నారు. అలా అన్న తరవాత, శ్రీకాంత్ కేసి చూసి నువ్వు రోజూ చెప్పే ప్రార్థన చెప్పు అన్నారు. శ్రీకాంత్ చేతులు జోడించి " బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా " అని చదివాడు. కృష్ణయ్య గారు మనసులోనే చదువు కున్నారు. శ్రీకాంత్ చదవడం పూర్తి అయిన తరవాత " దాని అర్థం ఏమిటి అంకుల్ ? అని అడిగాడు.జాన్ " క్లుప్తం గా చెప్పాలంటే ఎదురుగా ఉన్న పదార్ధాలు, తినేవాడు, తినేప్రక్రియ, అన్నీ పరమాత్మ తప్ప వేరు కాదు అని. ఇంకా సందేహాలు ఉంటె భోజనం తరవాత వివరిస్తాను. ముందు భోజనం చేయండి " అన్నారు కృష్ణయ్య గారు. ******* భోజనాలు అయిన తర్వాత నలుగురు హాలు లో కూర్చోగానే రవి అడిగాడు " తాత గారు శ్రీకాంత్ చదివిన శ్లోకం అర్థం చెప్పండి " అన్నాడు కుతూహలంగా ఈ శ్లోకం యజ్ఞ కార్యం లో జరిగే కర్మ ని దృష్టి లోపెట్టుకుని చెప్పినా, అది జీవితం లో చేసే ప్రతి కర్మ కి అన్వయించుకోవాలి ముందు శ్లోకం లో ఏమి చెప్పారో చూద్దాం. యజ్ఞం అంటే ఏమిటి? హవిస్సు అనే పదార్థం అగ్నిలో సమ్పర్పించడం ద్వారా యజ్ఞ దేవత కి చెందేలా ఆహుతి చేయడం యజ్ఞం లో చేసే కర్మ. శ్లోకం లో ఏమి చెబుతున్నారు అంటే, యజ్ఞం చేసేవాడు బ్రహ్మ, ఆహుతి చేసే పదార్థం బ్రహ్మ, అగ్ని బ్రహ్మ మొత్తం అంతా బ్రహ్మం తప్ప వేరు కాదు అని. అంటే మొత్తం అంతా పరమాత్మ తప్ప ఇంకేమీ లేదు అని భావం. " బ్రహ్మం అంటే దేముడు అని అర్థమా ? , చేసే వ్యక్తి , పదార్ధాలు , అగ్ని ఇవన్నీ దేముడు ఎలా అవుతాయి ?" అడిగాడు జాన్ " వేదాల ప్రకారం దేముడు అంటే వ్యక్తి కాదు. మీ హోలీ స్పిరిట్ లాగ అనంత మయిన శక్తి ఉన్న దేముడి ని వేదాలు పరమాత్మ అని అంటాయి " చెప్పారు కృష్ణయ్య గారు. "అంటే భోజనం చేసే వ్యక్తి, భోజనం, మొత్తం అంతా పరమాత్మ ఎలావుతాయి ? బ్రహ్మం అంటే అసలు అర్థం ఏమిటి ? " అడిగాడు రవి " ఆత్మ అన్నా , పరమాత్మ అన్నా , బ్రహ్మం అన్నా ఒకటే. అనంతం గా చాలా పెద్దది కాబట్టి బ్రహ్మం అన్నారు. ఇక పైన ఆత్మ అన్న పదం ఒకటే వాడదాం. ఒకటి తెలుసుకో. ఆత్మ వ్యక్తి కాదు కాబట్టి నీ లాగ, నా లాగా ఒక పదార్ధం అయిన శరీరం తో ఉండదు. పదార్ధం అయితే ఆకారం ఉండి పరిమితం అయిపోతాడు " " ఇప్పుడే కదా , తినేవాడు, తినేది అంతా బ్రహ్మం అన్నారు కదా ? మరి పదార్ధం ఆత్మ కాదు అంటారేమిటి ?" అడిగాడు రవి " చాలా మంచి ప్రశ్న. నువ్వు ఒక్క క్షణం ఆగితే పదార్ధం కూడా పరమాత్మ యే అన్న విషయం నిరూపిస్తాను. నీకు తెలిసి న విషయం నుంచి అదివరకు తెలియని విషయానికి తీసుకువెళ్ళడానికి ఒక క్రమం అవసరం. అందుచేత పూర్తి గా వినాలి. " ఆత్మ పదార్ధం కాకపోతే మరి ఏమిటి ? " అడిగాడు శ్రీకాంత్ " నువ్వు ఎవరు అంటే ఏమని జవాబు చెబుతావు " అడిగారు తాత గారు " నేను శ్రీకాంత్ ని " అంటాను . "శ్రీ కాంత్ అన్నది ' శరీరానికి ' పెట్టిన పెరు. నువ్వు ' 'నేను' 'నేను ' అనుకుంటున్న భావం శరీరం కాదు. మీరు ముగ్గురు 'నేను' నేను' అనుకుని ఆ ఎరుక ని గుర్తు పట్టి చెప్పండి. ముగ్గురూ కళ్ళు మూసుకుని ఒక నిమిషం ఉన్నారు. " నేను ' ని గుర్తు పట్టారా? "గుర్తు పట్టామండి" అన్నారు ముగ్గురు " ఆ నేను అనే ఎరుక ఫీల్ అయ్యారు కదా. అదే ఆత్మ అంటే. నాలో ఉన్న ఆత్మ, మీ ముగ్గురి లో ఉన్న ఆత్మ, అంటే ' నేను' అనే ఎరుక ఒక్కటే. ఏమాత్రం తేడా లేదు. తేడా ఏమన్నా ఉంటే శరీరాలు తేడా కానీ అందు లో తేడా లేదు " అన్నారు కృష్ణయ్య గారు. " కొంచం వివరించాలండి " అన్నాడు రవి నీ ' నేను ' అనే ఎరుక ఏమిటి? నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తోంది. అంతేనా ఇంకేమైనా ఉందా? ముగ్గురు మళ్ళి పరిశీలించుకుని చెప్పండి. అందులో ఇంకేమయినా ఉందేమో " అన్నారు " ఉండటం, ఉన్నట్టు తెలియడం " అంతే అన్నారు ముగ్గురు. " ఇప్పుడు ఒకటి చెబుతా వినండి. పేర్లు, శరీరాలు తీసేస్తే అందరిలో ను ఉన్న ఎరుక ఒకటే. అదేమయినా పదార్థామా? చెప్ప గలరా? " "అది పదార్థం కాదండి" అన్నారు ముగ్గురు. " ఆ ఉండటం, ఉన్నట్టు తెలియడం (ఎరుక) పదార్ధం కాదు కాబట్టి దానికీ ఆకారం లేదు. అవునా? " అడిగారు. " అవునండి ఆకారం లేదండి " " ఆకారం లేనిది ఆకాశం లా వ్యాపిస్తుంది " అవునా? "అవునండి" అన్నారు ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు. నువ్వు ఉన్నావు. నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తోంది ( ఉండటం తెలియడం= ఆత్మ ). ఎదురుగా కంచం ఉంది ( ఉండి,ఉన్నట్టు తెలుస్తోంది = ఆత్మ ), అందులో భోజనం ఉంది ( ఉండి ఉన్నట్టు తెలుస్తోంది ). ఇలా నువ్వు ఎక్కడ ఏది చూసినా అది ఉండి, ఉన్నట్టు నీకు తెలుస్తోంది. అందుకనే ఆత్మ సర్వాన్తర్యామి. "కాని అక్కడ కంచం అవి అన్ని వేరే కనిపిస్తున్నాయి కదా?" అడిగాడు రవి. " నువ్వు అలవాటు గా నీ ఎరుక శరీరం లోనే ఉంది అనుకుని దానిని వేరే చూస్తున్నట్టు అనుకుంటున్నావు. నీ ఎరుక, ఆకాశం లాగ వాటన్నిటినీ వ్యాపించి తన లో కలిపేసుకుంది. అందుకే నీకు అవి ఉన్నట్టు తెలుస్తున్నాయి. నీ ఎరుక వాటిని వ్యాపించక పొతే అవన్నీ ఉన్నట్టు నీకు ఎలా తెలుస్తోంది. నీ ఎరుకే అక్కడ ఆకారాలు గా కన పడుతోంది. నీ కలలో జరిగేది అదే. ఆలోచించు. " వివరించారు తాత గారు. "అంటే ఎక్కడ ఏది చూసినా ఉండటం తెలియడమే కాబట్టి, అంతా పరమాత్మ యే అని ఆ మంత్రం అర్థం అన్న మాట." ఆనాడు రవి "మరి భోజనం దగ్గర మాత్రమే ఎందుకు చదువు తారు " అడిగాడు జాన్. "మిగతా వేమీ చేసినా చేయక పోయినా ప్రతి రోజు భోజనం చేస్తాము కాబట్టి, ఆలా చేసినప్పుడల్లా గుర్తు చేసుకుంటే, భావం అంతర్గత మయి మిగతా సమయాలలో గుర్తుకు వస్తుంది. ఆ విషయం బాగా ఆలోచించండి " అని లేచారు తాత గారు. సమాప్తం.

మరిన్ని కథలు

Maa inti gomaata
మాఇంటి గోమాత
- కందర్ప మూర్తి
Sarve jana sukhino bhavanthu
సర్వేజనా సుఖిఃనో భవంతు ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aapadbandhavulu
ఆపద్బాంధవులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Maa balakanda lo kishkindakanda
మా బాలకాండలో కిష్కింద కాండ
- వారణాసి సుధాకర్
Padutoo lestoo
పడుతూ లేస్తూ
- ఆమ్లజని
Tagani korika
తగని కోరిక .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Surprise shock
సర్ప్రైజ్ షాక్
- కందర్ప మూర్తి