అపార్ట్మెంట్ అగచాట్లు - మద్దూరి నరసింహమూర్తి

Apartment agachatlu

కాలింగ్ బెల్ కి బద్ధకంగా లేచిన శంకరం -- 'పొద్దున్నే ఎవరొచ్చారబ్బా' – అనుకుంటూ ఇంకా పూర్తిగా వీడని కళ్ళు నులుపుకుంటూ తలుపు తీసేరు.

" నమస్తే సర్ " అంటూ అపార్ట్మెంట్ సూపెర్వైజర్ రాము నిలబడున్నాడు.

" ఏంటోయి ఇంత పొద్దున్నే వచ్చావు"

"రాత్రి రెండు గంటలప్పుడు కరంటు పోయిందట, జనరేటర్ వేస్తే పనిచేయలేదట, ‘అరగంటలో కరంట్ వచ్చేసింది కాబట్టి సరిపోయింది సెక్రటరీ గారికి చెప్పు' అని మన సెక్యూరిటీ కృష్ణ నాకు చెప్పి డ్యూటీ దిగి అరగంట కిందట ఇంటికి వెళ్ళిపోయాడు సర్. అప్పుడే ఏడు గంటలవస్తోంది, మీకు చెప్పాలికదా అని వచ్చాను."

"సరే, నువ్వెళ్లు."

'ఈ సమస్యలు ఎప్పుడూ ఉండేవే. ముందు పళ్ళు తోముకొని, టీ పెట్టుకొని తాగాలి' అని ఫ్రెష్ అవడానికి వెళ్ళేరు ‘పద్మ అపార్ట్మెంట్ అసోసియేషన్’ సెక్రటరీ, శంకరంగారు.

విజయవాడ ‘పటమట’ లో ఉన్న ఈ ‘పద్మ అపార్ట్మెంట్’ 40 ఫ్లాట్స్ తో, ఒక లిఫ్ట్, ఒక జనరేటర్ సదుపాయాలతో ఉన్ననాలుగు అంతస్తుల భవంతి.

సుమారుగా 20 ఫ్లాట్స్ లో అద్దెకుండేవాళ్ళే. వాటి స్వంతదార్లు కొంతమంది విజయవాడలోనే ఉంటున్నా, ఇక్కడ అసోసియేషన్ మీటింగ్లకి ఎప్పుడూ రారు. కొంతమంది పై ఊళ్లలో ఉంటున్నారు, కాబట్టి వారెవరూ అసోసియేషన్ మీటింగ్లకి వచ్చే ప్రసక్తే లేదు.

మిగిలిన స్వంతదారులలో, సగం మంది ఏదో కారణం చెప్పి, అసోసియేషన్ మీటింగ్లకి రారు.

మీటింగ్లకి ఎప్పుడూ వచ్చేవారు --- ప్రెసిడెంట్ భుక్తగారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ గారు, సెక్రటరీ శంకరంగారు, జాయింట్ సెక్రటరీ శేషాద్రి గారు, ట్రెజరర్ నారాయణ గారు, జాయింట్ ట్రెజరర్ శ్రీను గారు, మరో నలుగురో అయిదుగురో ఫ్లాట్లలో ఉండే స్వంత ఇళ్లవారు. ఈ పది మందే ఏ నిర్ణయమైనా వీళ్ళే తీసుకోవాలి.

-2-

భుక్తగారు అక్కడ ఉండే వారందిరిలోకి వయసులో పెద్దవారు కావడంతో, ఆయనని ప్రెసిడెంట్ గా ఉంచేరు.

సెక్రటరీ శంకరంగారినొదిలిస్తే, అసోసియేషన్ లో ఉన్న మిగతా నలుగురూ ఉద్యోగస్తులు. కాబట్టి, వారు అసోసియేషన్ పనులకి వీలైనంత దూరంగా ఉంటారు.

శంకరంగారు - భార్య నాలుగేళ్ల కిందట స్వర్గస్తురాలై, పిల్లలు హైదరాబాద్ లో ఉండడంతో -- ఒంటరిగా ఉంటారు. దాంతో ఆయన సమయం గడవడానికి, అసోసియేషన్ పనులు ఎక్కువగా చూస్తూ ఉంటారు.

ఇవన్నీకలిపి, అక్కడ ఉండే వారందరికీ అసోసియేషన్ అంటే శంకరంగారు – శంకరంగారంటే అసోసియేషన్.

శంకరంగారిలో ప్రత్యేకతలు :

ఓర్పుకి మారుపేరు; దూషణ భూషణ తిరస్కారములన్నిటినీ, ఆశీస్సులగానే తీసుకుంటారు.

అంతేకానీ, దెబ్బలాట / వాగ్వివాదం పెట్టుకోరు. అందుకే, ఆయన సన్నిహితులు ఆయనని 'అజాతశత్రువు' అని అభిమానంతో పిలుస్తూంటారు;

బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు కాబట్టి, డబ్బు లావాదేవీల దగ్గర చాలా ఖచ్చితంగా ఉంటారు. అందరూ ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేరా లేదా, ఎవరెవరు ఎంత బాకీ, అందిన డబ్బులు, ఖర్చులు, బ్యాంకులో వేసిన డబ్బు, తీసిన డబ్బు -- లెక్కలన్నీ, ట్రెజరర్ నారాయణగారితో కలిసి రాత్రి 8 గంటలప్పుడు కూర్చొని రోజూ చూసుకుంటూ ఉంటారు.

ఏదేనా సమస్య గురించి ఎవరేనా మాట్లాడడానికి వస్తే, అసోసియేషన్ కి ఇవ్వవలసిన డబ్బు ఏమాత్రం బాకీ ఉన్నా-- అంతటి అజాతశత్రువు కూడా అలిగి, వాళ్ళు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చినవరకు వారేమి చెప్పినా వినరు, పట్టించుకోరు, అసలు వాళ్ళని మాట్లాడనివ్వరు. అందువల్ల, అపార్ట్మెంట్ లో ఉండేవారు సర్వసాధారణంగా బాకీలేవీ లేకుండా చూసుకుంటూ ఉంటారు.

శంకరంగారు తొందరగా తన కార్యక్రమాలు ముగించుకొని, జనరేటర్ సంగతి చూసుకుందికి కిందకివెళ్ళే ముందర –

అలవాటు ప్రకారం ఆ రోజు వచ్చిన 'ఈనాడు' దినపత్రిక తిరగేస్తూ, మధ్యలో విసిరేసి, పరుగులాంటి నడకతో కిందకి వెళ్ళేరు – కారణం –

– ‘పటమట ఏరియా మొత్తం ఆ రోజు ఉదయం 10 గంటల నించి సాయంత్రం 6 వరకు, మరమ్మత్తు పనుల కోసం, విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది’ - అని ఆ పేపర్ లో రాసుంది.

-3-

అసలే విజయవాడ, పైగా మే నెల. మూలిగే నక్క మీద తాటి పండు లాగ జనరేటర్ సమస్య. అప్పుడే 8 గంటలు అవస్తోంది కూడా.

"రామూ, పద. జనరేటర్ వేసి చూద్దాం"

రాము జనరేటర్ ఎన్నిసార్లు వేసి చూసినా, నడవడమే లేదు.

"డీజల్ ఉందో లేదో చూడు, రామూ”

"మీ దగ్గరకి వచ్చే ముందరే, నేను చూసినా సారూ. నిన్ననే భర్తీ చేయించేక అసలు ఖర్చే అవలేదట. నిండుగానే ఉంది."

"సరే, ఆ జనరేటర్ మెకానిక్ కి నేను ఫోన్ చేస్తాను. నువ్వు వెళ్లి మన ప్రెసిడెంట్ గారిని, ట్రెజరర్ గారిని వెంటనే ఇక్కడికి రమ్మను. నేనిక్కడ ఉన్నానని చెప్పు. "

జనరేటర్ మెకానిక్ కి నాలుగు సార్లు ఫోన్ చేస్తే, నాలుగోసారి వాడి పెళ్ళం ఫోన్ అందుకొని – "మా ఆయన కోసమైతే, ఇనుకోండి. నిన్న ఊరికి పోయాడు. రెండు రోజుల తరువాత వస్తాడు." - అని ఫోన్ కట్ చేసింది.

"ఏమిటి శంకరం గారూ" అంటూ భుక్తగారు, "నమస్కారం సర్" అంటూ నారాయణ గారు -- ఒక్కసారే వచ్చారు.

శంకరంగారు : “మన జనరేటర్ పని చేయడం లేదు. అందుకే మీ ఇద్దరినీ పిలిచేను. మెకానిక్ ఊళ్ళో లేడు. రెండు రోజుల తరువాత వస్తాడు. ఇప్పుడు ఎలాగా "

నారాయణగారు : "పోనీ వాడొచ్చే వరకూ ఆగుదామా"

ప్రెసిడెంట్ గారు : "అవును. ఆగుదాం"

శంకరంగారు : "ఐతే, మీరిద్దరూ ఈ రోజు పేపర్ చూసినట్టు లేదు."

నారాయణగారు : "ఏముందేమిటి పేపర్లో"

శంకరంగారు : "పటమట ఏరియా మొత్తం ఈ రోజు ఉదయం 10 గంటల నించి సాయంత్రం 6 గంటల వరకు పవర్ ఉండదు, అని రాసేరు."

నారాయణగారు : "అలా అయితే, జనరేటర్ కంపెనీకి ఫోన్ చేసి ఎవరినేనా పంపించమందాం"

-4-

శంకరంగారు : "జనరేటర్ కి సంబంధించి మన దగ్గర ఎటువంటి ఫైల్ లేదు. ఎప్పుడేనా జనరేటర్ పని చేయకపోతే, మెకానిక్ ని పిలుస్తే వాడు రావడం, బాగు చేసేయడంతో అయిపోతోంది. "

ప్రెసిడెంట్ గారు : "ఉండండి. ఈ జనరేటర్ మీద ఎవరిదేనా నెంబర్ ఉందేమో చూద్దాం. నారాయణగారు మీరు చూడండి "

నారాయణగారు (జనరేటర్ కి అన్ని పక్కల చూసి) :" ఇక్కడ ఓ రెండు నంబర్లున్నాయండోయ్, నేను నోట్ చేసుకుని వస్తున్నాను " అని ఆనందంతో కేక పెట్టేరు.

“ఇగో కంపెనీ పేరు, ఇది జనరేటర్ పేరు, ఇది మోడల్ నంబర్. ఈ రెండు టెలిఫోన్ నంబర్లు - ఒకటి ఆ కంపెనీ PRM ది, ఒకటి ఆ కంపెనీ సేల్స్ హెడ్ ది." అని – ‘చూసిరా ‘అంటే ‘కాల్చి వచ్చినట్టు’ అన్ని వివరాలతో వచ్చేరు.

శంకరంగారు : ప్రెసిడెంట్ గారూ, ఈ ఫోన్ల సంగతి మేము చూస్తున్నాము. ఎందుకేనా మంచిది, ఒక మెసేజ్ అందరికీ వెంటనే పంపించేయండి"

నారాయణగారు : "నేను ఈ ఫోన్ల సంగతి చూస్తానులెండి."

శంకరంగారు : "సరే, నేను వెళ్లి నీళ్ల బండి తెప్పించాలేమో కనుక్కొని వస్తున్నాను."

శంకరంగారు సెక్యూరిటీ గది దగ్గర ఉన్న రాముతో –

"రామూ, నీళ్ల పరిస్థితి ఎలా ఉంది. ఎన్ని నీళ్ల బళ్ళు వచ్చాయి, ట్యాంకీలలోకి నీళ్లు ఎక్కించేరా, నీళ్ల బళ్ళు ఇంకా ఎన్ని అవసరముంటుంది." --అని ప్రశ్నల వర్షం కురిపించారు.

రాము : "సంప్ లో ఉన్న నీళ్ళనీ ట్యాంకీలలోకి ఎక్కించేసేం. ఆ నీళ్లు 12 నించి 15 గంటలవరకు సరిపోతాయి. సంప్ నింపి ఉంచడానికి, మూడు నీళ్ల బళ్ళు తెప్పిస్తే సరి."

శంకరంగారు : "సరే. వెంటనే ఫోన్ చేసి తెప్పించు. నేను నారాయణగారితో మాట్లాడుతుంటాను. నువ్వక్కడికి రా" ---- అని, నారయణగారి దగ్గరకి బయలుదేరేరు.

నారాయణగారు: ఈ రెండు ఫోన్లూ ఆఫీస్ ఫోన్లు. ఇప్పుడు అక్కడ వాచ్ మాన్ ఒక్కడే ఉన్నాడు. వాళ్ళిద్దరిలో ఎవరూ కూడా 11 గంటల ముందర రానేరారట. తక్కిన వాళ్ళు ఎవరేనా 10 గంటలైతే వస్తారట.”

-5-

శంకరంగారు : "ఆ వాచ్ మాన్ ని కనుక్కోండి, ఏ మెకానిక్ ఫోన్ నెంబరేనా ఇవ్వగలడేమో."

5 నిమిషాల తరువాత ----

నారాయణగారు :"వాడి దగ్గర ఆ వివరాలేవీ లేవట. 10 గంటల తరువాత ఫోన్ చేయండి అంటున్నాడు."

రాము వచ్చి, "సారూ, ఈ రోజు 10 గంటల తరువాత కరంట్ ఉండదు కాబట్టి, అంతవరకూ వాళ్ళు ట్యాంకీలు నింపుకొని, ఆ తరువాతే, ఎవరికైనా నీళ్ల బండి పంపించేది; ఈ రోజు నీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ట్యాంక్ మాత్రమే ఇస్తాం; అది కూడా నూరు రూపాయలు ఎక్కువిస్తేనే అంటున్నారు."

శంకరంగారు : "ఏం చేస్తాం. అదును చూసి కొండెక్కి కూర్చుంటారు, ఈ వెధవలు. వాళ్ళకి ఫోన్ చేసి – ‘మనకి మూడు బళ్ళు పదకొండు దాటకుండా పంపిస్తే - ఎక్కువగా అడిగిన నూరు రూపాయలే కాదు, ఇంకో పదో ఇరవైయో కూడా కావలిస్తే ఇస్తాము అని చెప్పి’ -- పని జరిగేటట్టుగా చూడు. ఆ బండి నడిపే వాడికి కూడా, తడవకి ఓ పది రూపాయలిస్తామని ఆశ చూపు." ----అని రాముని పంపించేరు.

పది నిమిషాల తరువాత వచ్చిన రాము : సారూ, బండికి నూటా పాతిక ఎక్కువ, బండి డ్రైవర్ కి మూడు సార్లుకి కలిపి ఏభై ఇస్తామని ఒప్పించేను. 11 గంటలలోపే ముందు మనకే వస్తాయ్ మూడు నీళ్ల బళ్ళు. 11 దాటితే, బండికి నూరే ఎక్కువ ఇస్తామని, బండి డ్రైవర్ కి మూడు సార్లుకి కలిపి ముఫ్హై మాత్రమే ఇస్తామని చెప్పేను. 11 దాటకుండా తప్పకుండా మూడు బళ్ళు వస్తాయి అని మాటిచ్చేరు."

---అని ఆ మే నెల ఎండలో, చల్లని నీళ్ల కబురు చెప్పేడు.

ప్రెసిడెంట్ గారు :"ఇగో శంకరం గారూ, ఈ సందేశం చూడండి. ఇది సరిపోతుందా, లేక ఇంకా ఏమేనా తెలియచేయాలంటారా." అని తాను వ్రాసిన సందేశం చూపించేరు. ‘ఇందు మూలముగా అందరికి తెలియచేయునదేమనగా -- నిన్న రాత్రి నించి జనరేటర్ పని చేయడం లేదు. మెకానిక్ ఇంతవరకు దొరకలేదు. అతనికోసం ప్రయత్నం జరుగుతున్నది. ఎప్పుడు దొరుకుతాడో, జనరేటర్ ఎప్పటికి సరి అవుతుందో అన్న విషయం ఇప్పటికి మాత్రం తెలియదు. ట్యాంకీలలో నీళ్లు నింపడం అయింది.

-6-

క్రిందన సంప్ లో నీళ్లు నింపడానికి, నీళ్ల బళ్ళు తెప్పించే ప్రయత్నం జరుగుతూంది. ఈ రోజు వార్తా పత్రిక ప్రకారం - పటమట అంతటా, ఈ ఉదయం 10 నించి సాయంత్రం 6 గంటల వరకు కరంట్ ఉండదని సమాచారం. కాబట్టి అందరూ తగు జాగ్రత్తగా నీళ్లు వాడుకొనెదరు. మీ సహకారమే మా బలం. -- ప్రెసిడెంట్, పద్మ అపార్ట్మెంట్ అసోసియేషన్.’

శంకరంగారు :"చాలు సర్, ప్రస్తుతానికి. తరువాత అవసరమైతే, మరో సందేశం ఇద్దాం."

‘చెప్పిన మాటకి కట్టుబడేవాళ్ళం మేము’ అన్నట్లుగా గడియారంలో 10 గంటలు కొట్టగానే, విద్యుత్ శాఖ వారు విద్యుత్ ప్రసారం ఆపేసారు.

పది నిమిషాలలో అక్కడ ఫ్లాట్లలో ఉండే జనం వారి ప్రసారం ఆరంభించేరు--వాట్సాప్ లో :

"జనరేటర్ బాగైందా",

"ఇంకా జనరేటర్ ఎందుకు ఆన్ చేయలేదు"

"అసోసియేషన్ కి బాధ్యత ఉందా లేదా"

"ఇంత బాధ్యతారహితంగా ఎలా నడుపుతున్నారు",

“డబ్బులు టైంకి వసూలు చేయడం తెలుసు, పనులు సక్రమంగా చేయడం తెలీదా"

"లిఫ్ట్ నడవకపోతే, మోకాళ్ళ నొప్పులున్న మాకెలాగా",

"ఇంతటి అలసత్వానికి బాధ్యులెవరు"

………..వగైరా వగైరా.

ఓర్పుకి మారు పేరైన శంకరంగారు ఆ మెసేజీలకి జవాబివ్వడం వ్యర్థం అని ఊరుకున్నారు.

మరో అరగంటకి, నారాయణగారు జనరేటర్ కంపెనీ కి ఫోన్ చేస్తే, వాళ్ళు :

“అయ్యో, మెకానిక్ లేకపోవడేమిటండీ, మా దగ్గర నలుగురున్నారు. కానీ, ప్రస్తుతం ఇద్దరు సెలవులో ఉన్నారు. మీ దగ్గర AMC నెంబర్ ఉంటుంది, చెప్పండి. మీ కంప్లైంట్ నోట్ చేసి, మెకానిక్ ని పంపిస్తాము." అన్నారు.

నారాయణగారు: "శంకరంగారూ, మన దగ్గర AMC నెంబర్ ఉందా"

-7-

శంకరంగారు : "ఆయనే ఉంటే మంగలెందుకు, అన్నట్లుంది. కంపెనీ పేరే ఇప్పుడు చూసేము కదా. ఇంక మనదగ్గర AMC నెంబర్ ఎక్కడ ఉంటుందండి"

నారాయణగారు: "మరిప్పుడెలా ?"

శంకరంగారు : "వాళ్ళకి చెప్పండి, తరువాత AMC చేస్తాం, ఎంత డబ్బైనా ఫరవాలేదు, ముందు మెకానిక్ ని పంపమనండి."

ఐదు నిమిషాల తరువాత --

నారాయణగారు: “శంకరంగారూ, AMC లేకుండా మెకానిక్ ని పంపడం కుదరదట. ఇవాళ AMC చేస్తే, వాళ్ళు మెకానిక్ ని పంపేది నాలుగో రోజు నించి అట. AMC ఉన్నవాళ్ళెవరేనా కంప్లైన్ చేస్తే, అవసరముంటుంది కాబట్టి, ఇప్పుడున్న ఇద్దరి మెకానిక్లలో ఎవరినీ AMC లేని మనదగ్గరికి పంపలేరట." అని చావు కబురు చల్లగా చెప్పేరు.

శంకరంగారు : “అయితే, మరేదో మార్గం ఆలోచించాలి”

నారాయణగారు: “పోనీ బిల్డర్ ఆఫీస్ కి ఫోన్ చేసి, వాళ్ళు ఏమేనా సహాయం చేయగలరేమో కనుక్కుంటే”

శంకరంగారు: “అలాగే. నేను, మీరు కాదు, ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు.”

ఐదు నిమిషాల తరువాత --

ప్రెసిడెంట్ గారు : " ‘అబ్బే, మా దగ్గర అలాంటి పనివాళ్లెవరూ ఉండరు, సారీ’ అని బిల్డర్ ఆఫీస్ లో ఉన్న PRO, ఫోన్ కట్ చేసేసేరు"

ఫ్లాట్లలో ఉండే జనం, వారి ప్రసారం తిరిగి ఆరంభించేరు. రోజూ చచ్చేవాడిగురించి ఎవరు మాత్రం ఎంతఏడుస్తారు – అన్నట్లుగా, ముగ్గురికి ముగ్గురూ ఆ ప్రసారాలకు ప్రతిస్పందించడం మానేసారు.

రాము వచ్చి, "సారూ, మూడు నీళ్ల బళ్ళు వచ్చాయి. సంపులో ఆ నీళ్లన్నీ నింపడం అయిపొయింది. వాళ్ళకి

ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేస్తే సరి."

-8-

శంకరంగారు: "నారాయణగారూ, మీరు వెళ్లి రాము చెప్పినంతా వాళ్ళకి ఇచ్చేయండి. మళ్ళా ఓ గంట తరువాత మీతో మాట్లాడతాను నేను."

ప్రెసిడెంట్ గారూ, ఏ పాట్లు ఉన్నా సాపాటు తప్పదు కదా. నేను ఇంటికి వెళ్లి ఏదో ఇంత ఉడికించుకొని తిని, తరువాత ఏం చేయాలో ఆలోచిస్తాను. మీరు కూడా ఇంటికి వెళ్ళండి. ఏదేనా అవసరం పడితే పిలుస్తాను. వద్దురుగాని.

ప్రెసిడెంట్ గారు : ఈ చికాకులతో ఏం వండుకుంటారు, పదండి. ఈ పూట మా ఇంట్లో భోజనం చేద్దురుగాని.

శంకరంగారు: ఎందుకులెండి, నా తిప్పలేవో నేను పడతాను. నాకలవాటే.

ప్రెసిడెంట్ గారు : మీరు మొహమాట పడుతున్నారులా ఉంది.

శంకరంగారు: లేదు. మీ దగ్గర నాకు మొహమాటమేమిటి. సరే, మీరు పదండి. నేను రాముతో కొంచెం మాట్లాడి ఓ అరగంట తరువాత వస్తాను"

నలభై నిమిషాలు తరువాత వచ్చిన శంకరంగారితో – ప్రెసిడెంట్ గారు :"ఎక్కడికైనా వెళ్లేరా, ఇంత సేపు చేసేరు."

శంకరంగారు: "రాముతో మాట్లాడుతూ కూర్చున్నాను. మన ప్రస్తుత సమస్యకి ఒక గంటలో పరిష్కారం దొరికేటట్టే ఉంది."

ప్రెసిడెంట్ గారు :"ఎలా? రాముతో ఏమిటి మాట్లాడేరు? రండి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ముందు చేతులు కడుక్కోండి. ఇగో తువ్వాలు." చేతులు తుడుచుకుంటూ వచ్చిన శంకరంగారు, భుక్డ్తగారి శ్రీమతితో –

"నమస్కారమమ్మా. నేను వద్దు అంటున్నా వినకుండా, మీకు శ్రమ కల్పించేరు సార్."

"ఇందులో శ్రమేముంది కూర్చోండి. వడ్డిస్తాను." అన్నారు నవ్వుతూ భుక్డ్తగారి శ్రీమతి.

శంకరంగారు: "మనలాగే, రాము లాంటి వాళ్లకి కూడా ఓ సర్కిల్ ఓ గ్రూప్ ఉంటాయి కదా. అందుకే, ‘నీకు తెలిసిన వాళ్లతో మాట్లాడి ఒక మెకానిక్ మనకి త్వరగా దొరికే ఏర్పాటు చూడు, ఖర్చుకి వెనుకాడొద్దు, ఖర్చు విషయంలో నాతో నువ్వు సంప్రదించవలసిన పనేలేదు. నీ శ్రమకి కూడా తగిన ఫలితం ఏదో విధంగా ఏర్పాటు చేస్తాను’, అని రాముకి చెప్పేను."

ప్రెసిడెంట్ గారు :"రాము ఎవరితోనేనా మాట్లాడేడా"

-9-

శంకరంగారు: "నేనక్కడ ఉంటె, వాడు ఫ్రీగా మాట్లాడగలడో లేదో అని సందేహం వేసి, ‘పని జరుగుతే నాకు పిలు, వస్తాను’ అని చెప్పి, తిన్నగా ఇక్కడికే వచ్చేను"

ప్రెసిడెంట్ గారు : "మీ మాటలు వింటుంటే, రాము ఏదో ఏర్పాటు చేస్తాడని మీకు నమ్మకం ఉన్నట్లుంది.”

శంకరంగారు: "నిజమే. రాము మీద నాకు భరోసా ఎక్కువ. అంతెందుకు, ఈరోజు నీళ్ల బండి ఒకటి కంటే ఎక్కువ దొరికే పరిస్థితి లేకుండెను. నువ్వే ఎలాగేనా మూడు బళ్ళు వచ్చేటట్లు చూడు అని, డబ్బు విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చీసరికి, పది నిమిషాల్లో మూడు బళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేసేడు. ఒక గంటలోనే, అందరికంటే ముందుగా మనకే మూడు బళ్ళు వచ్చి నీళ్లు పోసి వెళ్లాయి. అదీ రాము అంటే."

వాళ్ళ భోజనం అయి వక్కపొడి వేసుకుంటూండగానే, రాము ఫోన్ చేసేడు. స్పీకర్ ఆన్ చేసి --

శంకరంగారు: "ఏం రామూ, ఫోన్ చేసేవంటే, ఏదో కుదిరినట్టేనా"

రాము ఫోన్లో : "మీరోసారి వస్తే, పని అయిపోతుంది. వస్తారా."

శంకరంగారు: "ఓ పని చెయ్యి. పది నిమిషాల తరువాత ప్రెసిడెంట్ గారి ఇంటికి రా”.

శంకరంగారు నారాయణగారికి ఫోన్ చేసి వెంటనే ప్రెసిడెంట్ గారి ఇంటికి రమ్మని చెప్పేరు.

ప్రెసిడెంట్ గారు : "మొత్తాన సాధించేరన్నమాట." అన్నారు చిరునవ్వుతో.

శంకరంగారు: "మనం రాముతో మాట్లాడిన తరువాత రిలాక్స్ అవుదాం. అంత వరకు టెన్షన్ అలా ఉండనీండి." అంటూ నవ్వేరు.

పది నిమిషాలలో రాము నారాయణగారు ఒకేసారి చేరుకున్నారు.

రాము : “ఒక మెకానిక్ ఉన్నాడు. పేరు రాజు. భోజనం చేస్తున్నాడట. మూడు గంటలైతే తప్పకుండా వస్తాను అని చెప్పేడు. వాడిల్లు ఇక్కడికి రెండు కిలోమీటర్ల లోపే అట. వాడు రావడానికి 500 రూపాయలు ఇవ్వాలట. పని చేసినతరువాత రిపేర్ కి ఎంతో చెప్తాడట. అంతేకాదు, మనకి ఇష్టమైతే, వాడికి మనకి మాటలు కుదిరితే, ఇక మీదట ఎప్పుడు అవసరపడితే అప్పుడు, ఫోన్ చేస్తే, వచ్చి రిపేర్ చేసి పెడతాడట. నేను మీతో మాట్లాడి చెప్తానన్నాను సారూ.”

శంకరంగారు: "తప్పకుండా వస్తాడా."

రాము : "మీరు సరే అంటే ఇప్పుడే ఫోన్ చేస్తాను."

-10-

శంకరంగారు: "ఏమంటారు ప్రెసిడెంట్ గారూ."

ప్రెసిడెంట్ గారు : "ప్రస్తుతానికి మనకి వేరే దారి ఏదీ, పిలిపించండి."

శంకరంగారు: "మీరేమంటారు నారాయణగారూ"

నారాయణగారు: "ప్రెసిడెంట్ గారన్నట్టు ఇప్పుడు మనకి వాడే గతి. పిలిపిద్దాం".

శంకరంగారు: "రామూ, ఫోన్ చేసి వెంటనే రమ్మను. ఇవాళ అతని పని చూసి తక్కిన విషయాలు రేపు మాట్లాడదామని చెప్పు."

రాము ఫోన్ చేసి రాజూతో మాట్లాడి, 'అతను మూడు గంటలకి తప్పకుండా వస్తాడు' అని చెప్పి, రాజూ వచ్చే లోపల తను కూడా భోజనం చేసి వస్తానని వెళ్ళేడు.

మూడు గంటలకి రాజు వస్తాడు కదా అని, ముగ్గురూ పిచ్చా పాటీ మాట్లాడుకుంటుంటే, సమయమే తెలీలేదు. ఒక్క సారిగా పైన ఫ్యాన్ లోంచి చల్లటి గాలి తగిలీ సరికి,--

-- 'అరె, రాజు ఎపుడు వచ్చేడు, ఎప్పుడు జెనరేటర్ సరి చేసేడు, తెలీనేలేదు.

మంచి పనిమంతుడులాగే ఉన్నాడు, పదండి ఏమిటయ్యిందో కనుక్కుందాం' -

--అని ముగ్గురూ గుండె నిండుగా ఊపిరి పీల్చుకొని, నవ్వుకుంటూ ఒక్కసారిగా లేచేరు.

**********

మరిన్ని కథలు

Maa inti gomaata
మాఇంటి గోమాత
- కందర్ప మూర్తి
Sarve jana sukhino bhavanthu
సర్వేజనా సుఖిఃనో భవంతు ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aapadbandhavulu
ఆపద్బాంధవులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Maa balakanda lo kishkindakanda
మా బాలకాండలో కిష్కింద కాండ
- వారణాసి సుధాకర్
Padutoo lestoo
పడుతూ లేస్తూ
- ఆమ్లజని
Tagani korika
తగని కోరిక .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Surprise shock
సర్ప్రైజ్ షాక్
- కందర్ప మూర్తి