ఎంతచెట్టుకు అంత గాలి !. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Enta chettuku anta gaali

ముగ్గురు పండితులు గుర్రలపై ప్రయాణంచేస్తూ అవంతి రాజ్య పొలిమేరలలోని అడవిలో ప్రవేసించారు. తమ వెంట తెచ్చుకున్న మంచినీరు అయిపోవడంతో ఆపరిసరాలలో నీటిజాడకై గాలించసాగారు.

వారికి కొంతదూరంలో ఇరువురు పసువులకాపరులను చూసి "యువకులరా మేము బాటసారులం చాలాదాహంగాఉంది ఇక్కడ ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయా ?" అన్నాడు పండితులలో ఒకరు.

"స్వామి ఇక్కడ దరిదాపుల్లో ఎక్కడా నీరు లభించదు. తమకు అభ్యంతరం లేకుంటే నా వద్ద మంచినీరు ఉంది తాగవచ్చు" అన్నాడు ఒక పసువుల కాపరి.

"నీవుఇచ్చిన నీరు తాగలేము. మేము గొప్ప పండితులం. మావంటి వారితో పాండిత్యంలో పోటీకి మీ దేశం లోనే లేరు" అన్నాడు గర్వంగా మూడోపండితుడు.

"ఎట్లా మీరు విద్యావంతులు, గోప్పవారా? సరే మీఅంత చదువులేని పసువులకారి తమ ముగ్గురికి మూడు ప్రశ్నలు వేస్తాను వాటికి సమాధానం చెపితే తమ గొప్పతనాన్ని అంగీకరిస్తాం" అన్నాడు ఒక పసువుల కాపరి.

"వెర్రివాడా మా కాలి గండపేరండాలు, చేతికి ఉన్న కంకణాలు చూస్తే తెలియడంలేదా? మేము ఎంతటివారలమో" అన్నాడు మెదటి పండితుడు.

"కొండవంటి మాతో పొట్టేలు వంటి మీరు ఢీకొంటే ఏమౌతుందో మీకుతెలియదా?" అన్నాడు రెండో పండితుడు.

"వీరి ముచ్చట మనమెందుకు కాదనాలి, అడగవయ్య నీమూడు ప్రశ్నలు" అన్నాడు మూడవ పండితుడు.

"స్వామి పండినా భోజనంలో తింటూ కాయ అంటాము ఏమిటది?" అన్నాడు మెదట పండితునితో. "స్వామి కాయగా ఉన్నా ఫలంగానే పిలుస్తాం ఏమిటది?" అన్నాడు రెండో పండితునితో. "కాయ నుండి పుట్టిన పువ్వు ఏది?" అన్నాడు మూడవ పండితునితో పసువులకాపరి.

"పిచ్చివాడ కాయే కదా పక్వానికి వచ్చి పండుతుంది. మరి పండు కాయఎలా అవుతుంది" కోపంగా అన్నాడు మోదటి పండితుడు.

మిగిలిన ఇరువురు పండితులు మౌనం వహించారు.

"ప్రశ్నకు ప్రశ్న సమాధానంకాదు. సమాధానం నేనే చెపుతాను నిమ్మపండు, పండుగా ఉండి భోజన సమయంలో మనకు అది ఊరగాయగా మారుతుంది, రెండో ప్రశ్నకు సమాధానం సీతాఫలం. అది పండకుండా ఉన్నప్పటికి దాన్ని మనం ఫలం అనేపిలుస్తాం. మూడవ ప్రశ్నకు సమాథానం టెంకాయలోని పువ్వు. టెంకాయగా పుట్టే దాని లోపల పువ్వు ఏర్పడుతుంది. ఈ చిన్న విషయాలకు పాండిత్యం అవసరం లేదు. విద్య వలన వివేకం, వినయం పెరగాలి, కాని తమకు అహంకారం పెరిగింది. పండ్ల భారంతో చెట్టు ఎంత వినయంగా తలవంచి నిలబడుతుందో కదా!. ఎంత చెట్టుకు అంత గాలి అన్నారు పెద్దలు. తమరు విద్యావంతులే తమరినీ నేను ఎంత గౌరవించి తమ దాహర్తినీ తీర్చడానికి మంచినీళ్ళివ్వబోయాను, కాని తమరు మమ్మల్ని చులకనగా మాట్లాడారు. ఈ సంస్కారం తమరు ఏగురువు వద్దనేర్చారు? మీ అంత చదువులు చదవకుండానే మా గురువులు విద్యాతో వినయ, విధేయత, అణుకువ, సంస్కారం వంటి పలు ఉత్తమ లక్షణాలు నేర్పారు. పెద్దలు విద్యావతులు విద్యతో అహంకారం పెరగటం శోచనీయం. మనిషి గర్వమే అతని పతనానికి తొలిమెట్టు అని తెలుసుకొండి." అని చేతులు జోడించాడు పసువులకాపరి .

"నిజమే విద్వత్ ఎవరి సొంతముకాదు, వినయ, విధేయతలు, సాటి వారి ఎడల గౌరవంగా మసలుకోవడం కనీస ధర్మం. ఆ విషయం ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం, నాయనా ఆ మంచినీళ్ళు అందివ్వు" అన్నాడు పండింతుడు.

మరిన్ని కథలు

Viramam
విరామం.
- Harish Babu
Prema viluva
ప్రేమ విలువ
- Lakshmi Priyanka
Odarpu
ఓదార్పు!
- - బోగా పురుషోత్తం
Guruvu korika
గురువు కోరిక
- టి. వి. యెల్. గాయత్రి
Itlu nee tammudu
ఇట్లు, నీ తమ్ముడు!
- అంతర్వాహిని
Naalo sagam
నాలో సగం
- టి. వి. యెల్. గాయత్రి.
Pichhuka paga-Enugu chavu
పిచ్చుక పగ - ఏనుగు చావు
- హేమావతి బొబ్బు