(అతి) గారాబం - మద్దూరి నరసింహమూర్తి

Ati garabam

పెళ్ళిచూపులకి వెళ్లిన సుందరంకి బాపుబొమ్మలా ఉన్న కామాక్షిని చూడగానే తెగ నచ్చేసింది.

"ఒరే సుందరం, వీళ్ళింట్లో వ్యవహారం చూస్తే, వీళ్ళిల్లు మదురైలా ఉంది కానీ చిదంబరంలా లేదు. కాస్త ఆలోచించి వీరితో వియ్యమందాలి" అన్న తల్లితో --

"అవన్నీ నాకనవసరం. ఏదైనా నాకు ఈ పిల్లే కావాలి" అని పట్టుపట్టేడు సుందరం.

‘ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు’ అనుకున్న ఆవిడ సుందరం కామాక్షీలను దంపతులుగా ఆశీర్వదించేరు.

కామాక్షికి తొలి కానుపుకి తీసుకొని వెళదాం అని వచ్చిన అత్తగారితో సుందరం –

"మరీ ఐదో నెల రాగానే తీసుకొని వెళతాననడం గురించి మరోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో" అని అన్నాడు.

"అదేమిటి అల్లుడూ అలా మాట్లాడతావు. పిల్ల వేవిళ్ళతో ఇప్పటికే సగం చిక్కిపోయింది. కడుపుతో ఉండే పిల్లకి ఏమేనా తినాలనిపిస్తుంది. చేసి పెట్టడానికి ఈ వెధవ పల్లెటూరిలో ఉండేది మీరిద్దరు మాత్రమే. పోనీ, తానే చేసుకుని తిందామంటే ఒక పక్క వేవిళ్లు. ఇలా అయితే కడుపులో బిడ్డ ఎలా ఎదుగుతుంది, పురిటి సమయానికి అమ్మాయి బలంగా తయారు కాకపొతే కానుపు కష్టం అవుతుంది."

"అంటే, మా అమ్మా నాన్నతో ఒకసారి చెప్పి తీసుకొనివెళితే బాగుంటుందేమో అని"

"మా వియ్యాలవారు మనసు నాకు తెలీదూ. వెన్న పూస. మీ అమ్మగారితో నేను వచ్చి అతి గారాబంతో నాజూకుగా పెరిగిన మా పిల్ల వేవిళ్ళతో వేగిపోతుంటే తల్లిగా భరించలేక తీసుకొని వెళ్లెను' అని చెప్పు. ఆవిడ ఏమనుకోరు. నేను తరువాత తాపీగా వదినగారితో మాట్లాడతాను" అని అల్లుడు మారు మాట్లాడానికి లేకుండా, అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది ఆ అత్తగారు.

"నేను ఇప్పుడు వెళ్లనండీ, మా అమ్మతో ఏడో నెల వస్తే పంపిస్తానని చెప్పండి" అని కనీసం ఉత్తుత్తి ఏడుపు కూడా ఏడవని, తనకి మద్దతుగా ఏమాత్రం మాట్లాడని - కామాక్షి మీద గొంతు వరకూ కోపం వచ్చింది సుందరానికి. కానీ ఏం చేయలేక ఊరుకున్నాడు.

సీమంతం చేసేటప్పుడు వెళ్లి కామాక్షిని ఎగా దిగా చూసిన సుందరం “కామూ, సన్నగా బాపు బొమ్మలా ఉండేదానివి రెండు నెలల్లో ఏమిటిలా గుమ్మటంలా తయారయ్యావు" అన్నాడు.

-2-

"పెళ్లికి ముందర నన్ను ఏమీ తిననివ్వకుండా నోరు కట్టుకోమని చెపుతూండేది మా అమ్మ. ఎందుకే అంటే 'సన్నగా నాజూకుగా ఉంటేకానీ ఈ కాలం ఆడపిల్లకి పెళ్లి అవదు, ఆ మూడు ముళ్ళు పడి నువ్వు పురిటికి వచ్చినప్పుడు నీ ఇష్టం, ఏమి తిన్నా అడ్డు చెప్పను' అంటూ ఉండే మా అమ్మ -- ఇప్పుడు నేనేదేనా తినడానికి అడగడం ఆలస్యం చేసి పెడుతున్నది, చక్కగా నాకు కావలసినవన్నీ చేయించుకొని తింటున్నాను."

"తిండి మీద నీ ఆరాటం, మీ అమ్మ చేసే గారాబం రెండూ బాగున్నాయి. కానీ, అదే పనిగా ఎక్కువ ఎక్కువ తిన్నావంటే నీతో బాటూ కడుపులో బిడ్డ కూడా బరువు పెరిగిపోతే కానుపు కష్టం అవొచ్చు. ఈ సంగతి నువ్వే చూసుకోవాలి, మీ వాళ్ళతో నేను అంటే బాగుండదు."

"అలా మాట్లాడి నాకు, కడుపులో ఉన్న మన బిడ్డకి మీరే దిష్టి పెట్టేలాగున్నారు"

"దిష్టి లేదు, గిష్టి లేదు. నేను చెప్పింది కాస్త నింపాదిగా ఆలోచించు" అని జాగ్రత్త చెప్పి వెనక్కి వెళ్ళిపోయేడు.

ఆసుపత్రి వాళ్ళు ఇచ్చిన తేదీకి రెండు రోజుల ముందరే, కామాక్షి పురిటి వేళకి మామగారికి సహాయంగా ఉంటుందని వెళ్లిన సుందరం - అమ్మ గారాబంతో ఇంకా లావెక్కిన కామాక్షిని చూసి 'దీనికి సవ్యంగా పురుడు అవుతుందా' అని భయపడ్డాడు.

లేబర్ రూమ్ లోకి వెళుతున్న కామాక్షి "ఆపరేషన్ చేస్తారటండీ" అని భయపడసాగింది.

"నేను ముందుగా చెప్పేను తిండి తగ్గించమని. విన్నావు కాదు. ఇప్పుడు ఏడిస్తే లాభమేమిటి" అని విసుక్కున్నాడు.

సిజేరిన్ ఆపరేషన్ జరిగిన కామాక్షికి డాక్టర్ కూడా "బరువు పెరిగిపోతున్నావు జాగ్రత్తగా ఉండు" అని చెప్పింది.

పుడుతూనే సుమారు 5 కేజీలున్న పిల్లాడిని చూపించి, సుందరంతో "మీ పిల్లాడికి బాలభీముడు అన్న పేరు సరిపోతుంది" అని నవ్వుతూ చెప్పింది డాక్టర్.

ఏమీ అనలేక సుందరం వెధవ నవ్వు ఒకటి నవ్వేడు.

-3-

పిల్లాడికి మూడో నెల వచ్చిన తరువాత వచ్చిన అల్లుడితో "చంటి పిల్లాడితో చేసుకోవడం కష్టం అల్లుడూ, పిల్లాడికి ఏడో నెల వస్తే అమ్మాయిని మనవడిని నేను కూడా వచ్చి దిగబెట్టి, అమ్మాయి ఒక్కతే చేసుకోగలదని నమ్మకం వచ్చిన తరువాత వెనక్కి వచ్చేస్తాను." అని అత్తగారు చెప్పిన మాటకి -- ఎదురు చెప్పలేక తలూపిన సుందరం, తనలో తానే చిన్నగా గొణుక్కుంటూ వెనక్కి వచ్చేసేడు.

అవసరమైతే వారం రోజులైనా ఉండి, భార్యని పిల్లాడిని తనతో తీసుకొని వెళదామనుకొని వచ్చి, మూడు రోజులకే ఒంటరిగా వెనక్కి వెళ్లిపోతున్న సుందరంకి, అత్తవారింట్లో ఉన్న మూడు రోజుల్లో --

పిల్లడు ఏడవడం భయం, ఎందుకో ఏమిటో చూడకుండా కామాక్షి వాడికి పాలు పట్టేస్తోంది. అలాగ, తల్లి గారాబంతో మూడో నెల వచ్చేసరికే పిల్లాడు ఉండవలసిన దాని కంటే రెండింతలు బరువు పెరిగేడు; "చంటాడితో చేసి చేసి నీరసం వస్తోంది అమ్మా" అని కామాక్షి అనడం ఆలస్యం – పది నిమిషాల్లో పెద్ద ప్లేట్ నిండా తినడానికి అత్తగారు గారాబంతో కామాక్షికి ఏదో ఇవ్వడం, అంత కంటే తక్కువ సమయంలో కామాక్షి ఆ ప్లేట్ ని ఖాళీ చేయడం;

--గుర్తుకి వస్తోంది.

ఈ లెక్కన - హిడింబిలా తయారయే కామాక్షిని, త్వరలో పిల్ల భీముడిలా తయారయే అబ్బాయిని పోషించాలంటే – తన జీతం ఆస్తి రెండూ చాలక –

ఆ భారం ఎప్పటినుంచో అర్ధం చేసుకున్న మన దేశపు అత్యధిక ధనపతి దగ్గర --

చేయి చాచాలి అని గట్టిగా నిశ్చయించుకున్నాడు సుందరం.

*****

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి