మంచితనం - సంగనభట్ల చిన్న రామకిష్టయ్య

Manchitanam

ఒక యజమాని ఇంట్లో ఒక ఆవు ఉండేది . అతడు ఒకసారి పచ్చిగడ్డి కోసుకొని తెచ్చి ఆవుకు వేశాడు. ఆ గడ్డిమోపు ఆవుతో తనను తినమని చెప్పింది. కానీ ఆవు దాన్ని తినలేదు. ఆ గడ్డిమోపు ఎంతో సంతోషించి ఆవుతో స్నేహంగా ఉండసాగింది . ప్రతిరోజూ అవి రెండూ ఒకదానితో మరొకటి ముచ్చటించేవి. ఇలా ఉండగా ఒకరోజు ఆవు గడ్డిమోపుతో "ఓ గడ్డిమోపా! నేను రేపో, ఎల్లుండో ప్రసవించబోతున్నాను . నాకు పుట్టిన బిడ్డతో కూడా నీవు ఇలాగే స్నేహం కొనసాగించు . ఒకవేళ అనుకోకుండా నాకు ఏమన్నా ఆపద సంభవించి నేను లేకున్నా గానీ నీవు దానికి మంచి బుద్ధులు చెప్పు" అని అంది. అది విన్న గడ్డిమోపు "నీవు చాలా మంచి దానివి. అలాంటి మాటలు మాట్లాడకు "అని అవును కోప్పడింది. కొన్ని రోజులకు పచ్చగా ఉన్న ఆ గడ్డిమోపు ఎండిపోయింది. ఇంతలో ఆ ఇంటి యజమాని దూరంగా ఉన్న తన పెరట్లో గల గుడిసె రంధ్రాన్ని కప్పడానికి ఆ ఎండిన ఆ గడ్డిమోపు పనికి వస్తుందని తలచి దానిని తీసుకొని వెళ్ళాడు. ఆవు తాను ఒంటరిదానైనందుకు చాలా బాధపడింది. గడ్డిమోపు కూడా తాను ఇతరులకు ఆహారంగా పనికిరానందుకూ, మంచి మిత్రురాలైన ఆ ఆవును వీడి నందుకు ఎంతో బాధపడింది. ఆ తరువాత ఆ యజమాని ఆ గడ్డి మోపును తన పెరట్లో ఒక మూలన పెట్టాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కానీ ఒకరోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి అక్కడకు దగ్గర్లోనే ఉన్న ఒక వాగు ఆకస్మికంగా పొంగి ఆ గడ్డిమోపు అందులో కొట్టుకొని పోసాగింది. అప్పుడు అది ఆ వాగు ప్రవాహంతో " ఓ ప్రవాహమా! అయ్యో! నేను ఎవరికి ఉపయోగపడకుండా పోతున్నానే! మా యజమానికి , ఆవుకు రెంటికి నిరుపయోగమైనాను కదా!" అని చింతించింది . తర్వాత అది ఆ ప్రవాహంతో" ఓ ప్రవాహమా! నన్ను ఒడ్డుకు చేర్చవా! లేకుంటే నేను ఎక్కడకు కొట్టుకుపోతానో తెలియదు" అని అంది. అప్పుడు ఆ ప్రవాహం" ఓ గడ్డి మోపా! అది నా చేతిలో లేదు. ఈ ప్రవాహంలో నీకు చెట్టు ఒకటి అడ్డంగా ఉంటే తప్ప నిన్ను ఎవరూ కాపాడలేరు " అని అంది. అదృష్టవశాత్తు అది అన్నట్లే ఈ ప్రవాహానికి అడ్డుగా ఒక చెట్టు దాని కొమ్మలతో నిలిచి ఉంది . ఆ గడ్డిమోపు ఆ చెట్ల కొమ్మలలో చిక్కుబడిపోయింది. ఆ కొమ్మలు నేల పైకి విస్తరించి ఉన్నాయి. తర్వాత ఆ గడ్డిమోపు "అయ్యో! నా మిత్రురాలైన ఆవును ఎప్పుడు కలుసుకుంటానో?కనీసం ఇతరుల ఆహారానికైనా ఉపయోగ పడతానో! లేదో! అని అనుకుంటుండగా ఒక కోతి నేలపై విస్తరించిన ఆ చెట్టు కొమ్మలను ఎక్కి ఆ చెట్టుకు చిక్కుకున్న గడ్డిమోపును తీసుకొని వచ్చి భూమిపై పడవేసింది . "అమ్మయ్యా! ఈ భూమి పైన పడ్డాను. ఇక నా మిత్రురాలు వద్దకు పోతానో! లేదో ! ఇతర పశువులు ఏవైనా నన్ను తింటాయో !అలా ఉపయోగపడినా నయమే "అని అనుకుంటుండగా దాని యజమాని అక్కడికి వచ్చి ఈ గడ్డిమోపును మరొక గడ్డిమోపు అనుకొన్నాడు. తన ఇంట్లోని దూడకు పనికి వస్తుందని దాన్ని తన వెంబడి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అలా తన ఇంటికే చేరిన గడ్డిమోపుకు ఆవు చాలా రోజులుగా కనిపించడం లేదన్న దుర్వార్త తెలిసింది . అది తన మిత్రురాలు లేనందుకు చాలా దుఃఖించి దాని బిడ్డతో తనను తినమని చెప్పింది . అప్పుడు ఆ దూడ " ఓ గడ్డిమోపా! నీ గురించి మా అమ్మ చెప్పింది లే! నీవు చాలా మంచి దానివట. నీలాంటి మంచివారికి కష్టాలు వచ్చినా తిరిగి సుఖమే కలుగుతుందిలే! అందుకే నీవు ప్రమాదాల నుండి ప్రమోదంతో ఇక్కడకు నా చెంతకే వచ్చావు. నాకు జీవిత పాఠాలను నేర్పు . మా అమ్మతో నీవు స్నేహంగా ఉన్నట్లే నాతోని ఉండు. నేను మొన్ననే పుట్టాను. నాకు మిత్రులు ఎవరో , శత్రువులు ఎవరో తెలియదు . ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు . అందువల్ల నాకు మంచి బుద్ధులు చెప్పు " అని అంది. ఆ గడ్డిమోపు సరేనని ఆ దూడతో ఆవు వలెనే మంచి ముచ్చట్లు చెప్పుతూ స్నేహంగా ఉండ సాగింది. ఆ యజమాని కూడా తన పాక రంధ్రానికి కప్పడానికి ఆ గడ్డిమోపు చాలదని భావించాడు. అందువల్ల తన దూడకి అది పనికి వస్తుందని ఆ ప్రయత్నాన్ని విరమించాడు. ఆ గడ్డిమోపు ను తన ఇంట్లోనే ఉంచాడు. ఆ గడ్డిమోపు ఎంతో సంతోషించింది. కానీ ఎన్ని రోజులైనా ఆ దూడ కూడా దానిని ముట్టనే లేదు . పైగా దానితో సంతోషంగా ముచ్చట్లు చెప్పుతూ ఆ దూడ ఒంటరితనాన్ని వీడింది . ఆ గడ్డిమోపు వల్ల అది అనేక విషయాలు తెలుసుకొంది. కానీ ఇంతలో ఆకస్మికంగా చాలా రోజులుగా కనిపించని ఆ ఆవు ప్రత్యక్ష మయింది. దానిని చూసి దూడతో పాటు ఆ గడ్డిమోపు ఎంతో సంతోషించాయి. ఆ ఆవు తాను ఇన్ని రోజులు ఒకచోట బంధించబడినట్లు చెప్పింది. అదృష్ట వశాత్తు ఒక దయాశాలి వచ్చి తనను విడిపించినట్లు ఆ ఆవు చెప్పి ఆ గడ్డిమోపు ఇక్కడికి ఎలా చేరిందని ప్రశ్నించింది. అప్పుడు గడ్డిమోపు తాను కూడా అదృష్ట వశాత్తు మళ్లీ ఇక్కడికే వచ్చినట్లు జరిగిన సంగతిని చెప్పింది. అప్పుడు ఆ దూడ" నాకు మా అమ్మతో పాటు మంచి నేస్తమైన ఈ గడ్డి మోపు కూడా లభించడం నా అదృష్టం "అని అంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఉడుత ఇది చూసి "ఔను. మంచి వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. మీరు ఇద్దరూ వేరు వేరు. పైగా శత్రువులు. అయినప్పటికీ మీ పరోపకారబుద్దే మిమ్మల్ని ఆ ఆపదల నుండి తప్పించింది. మీరు అందరికీ ఆదర్శమూర్తులు. మార్గదర్శకులు. ఇతరుల మేలు తప్ప కీడు అంటే ఏమిటో ఎరుగనివారు. మృత్యువు కూడా మిమ్మల్ని సమీపించడానికి భయపడింది. అందుకే మంచితనంతో ఉంటే శత్రువులే మిత్రులు అవుతారు. ప్రకృతి కూడా మనకు సాయపడుతుందని ఈ రోజు మీరు ఈ లోకానికి తెలియజేశారు " అని అంది. దాని మాటలకు ఆవు , దూడతో పాటు గడ్డిమోపు కూడా సంతోషించి తమ స్నేహాన్ని అలాగే కొనసాగించాయి.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ