దేవుడు సూత్తాంటడు..! (క్రీమ్ కథ) - చెన్నూరి సుదర్శన్

Devudu soottaantadu

తెల్లారగట్ల ఫోను మొగుతాంది..

దిగ్గున లేసి కూకున్నడు నాగయ్య. కండ్లు నల్సుకుంట గోడ గనారం దిక్కు సూసిండు. ఐదు కావత్తాంది. ఇసుక్కుంట ఫోన్ తీసిండు. పెద్దబిడ్డ గౌరమ్మ అని కనబడంగనే.. గుండె ఝల్లు మన్నది. దెబ్బకు నిద్ర మబ్బు దెంక పోయింది.

సట్న మంచం మీదికెల్లి లేసి ఫోన్ మీట ఒత్తి.. “గౌరమ్మా” అని పిల్సిండు.

“నాయ్నా..!” అని కీక పెట్టేటాల్లకు గౌరమ్మ బొండిగె దగ్గర పడ్డది. మాట్లాడత్త లేదు.. ఏడ్తాంది.

“ఏందిరా బిడ్డా! ఏమైంది?” అని గాబర పడుకుంట అడుగుతాంటే నాగయ్య కండ్లల్ల నీల్లూరినై.

ఆవల గౌరమ్మ దుక్కమాపుకోలేక పోతాంది.

ఈవల నాగయ్య గుండెల్ల మోతలు మోగుతానై.

తోడెం సేపటికి గౌరమ్మ మాట తడబడుకుంట ఇనరాబట్టింది.

“నాయ్నా.. సరోజ లేపుతాంటే లేత్తలేదు. పెయ్యంత సల్లబడ్డది. నాకు బుగులైతాంది” అన్కుంట మల్ల ఏడ్పురాగం అందుకున్నది గౌరమ్మ.

“నేను వత్తాన బిడ్డా.. దైర్నం సెడకు” అని ఫోను బందు పెట్టి ఉర్కుంట పోయి సైకిలు తీసిండు నాగయ్య.

***

గౌరమ్మ, గంగయ్య ఆలుమొగలకు తొల్త పుట్టిన బిడ్డ సరోజ ఎడ్డిది. మీదికెల్లి కుడి చెయ్యి, ఎడం కాలు పురంగ సాగుబాటు కావు. రెండు గీరల బండి వాడుతది. మాట్లాడతాంటే ఖ్యాల్ తప్పినట్టుంటది. నోటి పొంటి సొంగ తీగల్లెక్క కారుతాంటై. ఎడం చెయ్యి మట్టతోటి తుడ్సుకుంట వక్కడ, వక్కడ నవ్వుతాంటది. మన మాటలైతే.. సరోజ బాగనే సమఝ్ సేసుకుంటుంది.

‘ధరణికి గిరి భారమా..! గిరికి తరువు భారమా..! తరువుకు కాయభారమా..! కనిపెంచే.. తల్లికి పిల్ల భారమా.!’, అనే పాత సీన్మల పాటలెక్క సరోజను తన గుండెల్ల పెట్టుకుని సూసుకుంటాంది గౌరమ్మ.

గౌరమ్మ మల్సూరు కాన్పుల కళావతి పుట్టింది. పుట్టింది మల్ల ఆడపిల్ల ఎట్లుంటదో ఏం పాడో! అని గంగయ్య నిద్ర పొతే ఒట్టు. దినాం కళావతి మొకం పరీచ్చగ సూసుకుంటనే ఉండేటోడు. దేవుని దయవల్ల కళావతి రామసక్కని బొమ్మ. ల్యాత పాదాల తోటి సిన్న, సిన్న తప్పటడుగులు ఏత్తాంటే కండ్లు నిలబెట్టి సంబ్రంగ సూసేటోదు గంగయ్య. మాటలు.. సిలుక పలుకులు. తెలివి తేటలు అమోగం. సరోజ తోని పడే యాతనంతా మర్సిపోయేది గౌరమ్మ.

అయ్యాల్ల నాత్రి కళావతి ఐదోటి పుట్టిన రోజు పండుగ ఇంట్లనే జరిగింది. సరోజను నవ్వియ్యాలని.. వచ్చిన పిల్లల తోని కలిసి కళావతి తీరొక్క డాన్స్ చేసింది. అంత చిన్న వయసుల తన అక్క కోసరం పడే పాకులాట కన్నార్పకుంట సూడబట్టిండు నాగయ్య. ‘తన పెండ్లాం తోని కలిసి సూసే బాగ్గానికి నోసుకోక పోతిని’ అని మన్సులకచ్చింది. కండ్లల్ల నీల్లూరినై.

నాగయ్య హాలత్ సూసి ఆ నాత్రికి తమ ఇంట్లనే ఉండిపొమ్మని.. గౌరమ్మ బతిలాడింది.

“మీ కాలనీ ఆవల్నే గదరా మన ఇల్లు.. !” అని నచ్చజెప్పిండు. ‘అవునులే.. రోజులసలే బాగ లేవు. ఇంటికి తాలం వేసించుడు సుత అంత మంచిది కాద’ ని మన్సుల అనుకున్నది గౌరమ్మ.

కళావతి “వెళ్ళొద్దు తాతయ్యా..” అని అలిగింది. ఆమెను బుజ్జగించిండు. ఇంకో గంట సేపుండి.. పదకొండింటికీ నాగయ్య తన ఇంటికి పోయిండు.

ఆనాత్రి నిద్ర సరింగ పట్టలేదు. తాప, తాపకు కళావతి డాన్సులు కండ్లల్ల మెదులుతానై. ఇంతల గౌరమ్మ ఫోను సేసేటాల్లకు సైకిలేసుకొని వచ్చిండు నాగయ్య.

హాల్ల సాప మీద పండబెట్టిన సరోజ శవాన్ని సూసి కండ్లు తేలేసి కూలబడ్డడు.

నాగయ్యను సూడంగనే గౌరమ్మ దుక్కం సుక్కల్ను తాకింది. తండ్రి గుండెల మీద వాలి శోకునం పెట్టింది.

అప్పటికే వాడమంది తోటి హాలంత నిండింది.

గంగయ్య సరోజ కాల్లు తన నొసలుకు అదుముకుంట ఏడ్వబట్టిండు.

“అక్కా! మనం ఆడుకుందాం.. దా..!” అన్కుంట సరోజ చెయ్యి పట్టి లేపబోతాంది కళావతి. లేత్తలేదని ఏడుత్తాంది.. ఆమె లేత చెంపల మీద కంట్లె నీల్లు కాల్వల్లెక్క కార్తానై.

ఆ సీను సూత్తాంటే కాలనీ జనం గుండెలు ఔసి పోతానై.

“సరోజ మద్దెనాత్రి లేసి ఏమైన గాబర సేసిందా?” అడిగిండు నాగయ్య.. గౌరమ్మను ఊకించుకుంట.

గౌరమ్మ నోట్లెకెల్లి మాటత్త లేదు.

“నాత్రి మీరు బైలెల్లినంక నేను సరోజ కమ్రలకు పోయి సూసిన. అది శాన మత్తుగ నిద్రపోతాంది. అలికిడి సెయ్యకుంట ఎన్కకచ్చిన. కళావతి తాను సయంగ సెల్ పోన్ల తీసిన పోటువలను గౌరమ్మకు సూయించుతాంది. నేనచ్చి నా కమ్రల పండుకున్న. ఎప్పటిలెక్కనే సరోజ దాపున్నే. గౌరమ్మ, కళావతి కలిసి ఇంకో మంచాల పండుకున్నరు. మద్దె నాత్రి తెలివి వచ్చినప్పుడల్లా సరోజను సూసుడు గౌరమ్మకు అలవాటు. గట్లనే తెల్లారగట్ల లేసి సరోజ ఒంటి మీద సెయ్యేసి సూసిందట. పెయ్యంత సల్లంగ తాకేటాల్లకు కీకేసి నన్ను పిల్చింది. నేను ఉర్కిపోయి సూసిన. అప్పటికే సరోజ ..” అని గంగయ్య సెప్తాంటే.. కుత్కె దగ్గర పడ్డది. ఏడ్వబట్టిండు.

***

సరోజ పీనుగను బొంద పెట్టిన రెండు దినాలకే గౌరయ్య ఇంటికి పోలీసులు వచ్చుడు.. కాలనీల గుస, గుసలు

మొదలైనై. ఎవలకు తోసినట్టు వాల్లు చిలువలు, పలువలుగా కతలల్లుకుంట వాట్సాప్‌ల చక్కర్లు కొట్టిత్తాండ్లు.

‘ఒకడు కాకిలెక్క నల్లరంగుల కక్కుకున్నడన్న వార్త, లోకుల సేతుల్ల తిరిగి, తిరిగి కాకినే కక్కుకున్నడని సెప్పే రోజులాయే’.

అమీన్ సాబ్ దుర్గయ్యను సూసి డక్కు తిన్నడు గంగయ్య. దుర్గయ్య ఎన్కాల్నే ఒక పోలీసు భీమయ్య బుర్ర మీసాలు మెలేత్తాండు. ఇద్దర్ని ఇంట్లకు రమ్మన్నడు.. కూసొండని సోప సూయించిండు గంగయ్య.

దుర్గయ్య కూకుండుకుంట.. గంగయ్యను సుత కూకోమన్నట్టు చేత్తోటి సైగ సేసిండు. కాని గంగయ్యకు దైర్నం సాల్లేదు.

దుర్గయ్య ఎన్కాల నిలబడ్డ భీమయ్య హాలంత కలియసూత్తాండు.

“గంగయ్యా.. మీ బిడ్డ సరోజ ఎట్ల సచ్చింది?. ఆమెది మామూలు సావు కాదని మాకు తెల్సింది” అని అడుగుతాంటే అతని సేతులున్న లాఠీ నిజం సెప్పమన్నట్టు ఊగుతాంది.

గంగయ్య బిత్తరపోయిండు. తోడెం సేపటికి సుజురాయించుకొని ..

“సర్.. మీకెవ్వలో తప్పుడు మతలబిచ్చిండ్లు. సరోజను సంపాల్సిన ఔసురం ఎవలకుంటుంది.. ఎందుకుంటుంది” అన్కుంట ఇనయంగ సేతులు కట్టుకున్నడు గంగయ్య.

ఎవలో వచ్చి ఏందో అడుగుతాండ్లని గౌరమ్మ పిల్లి లెక్క హాల్లకచ్చింది. అమీన్ సాబ్ ను సూసి బీర్పోయింది. గౌరమ్మ ఎన్కాల్నే వచ్చిన నాగయ్య సుత నోరు తెర్సిండు.

“నా పెండ్లాం గౌరమ్మ. ఆయన నా బావ నాగయ్య” అన్కుంట.. సూపుడేలుతోని వాల్లను సూయించిండు గంగయ్య.

ఇంతల “అమ్మా నా ఫోను కనబడ్త లేదే” అన్కుంట ఉర్కుంటచ్చింది కళావతి. హాల్ల పోలీసోల్లను సూసి బిత్తిరి పొయింది.

“ఇది కళావతి నా సిన్న బిడ్డ” అన్నడు. దగ్గరికి రమ్మన్నట్టు ఇషారా సేత్తే రాలేదు.

కళావతిని సూసుకుంట దుర్గయ్య సుత దగ్గరికి రమ్మన్నట్లు పిల్సిండు. కళావతి భయపడుకుంట గౌరమ్మ ఎన్కాలకు పోయి చీర కుచ్చిల్లల్ల దాక్కున్నది.

“నీ ఫోను మొన్న నేనే తీస్కపోయినరా.. ఎక్కడ్నో పడిపోయింది” ఇంకోటి కొందాం అన్నట్టు సముదాయించింది.

“గౌరమ్మా.. నేను మీ ఇంటి సంగతులన్నీ తెల్సుకొనే వచ్చిన. మీరు మీ పెద్ద బిడ్డ సరోజను కంటికి రెప్పోలె కాపాడుకుంటాండ్లు. కళావతి పుట్టినంక సుత సరోజకు సకల సౌలత్ ల తోటి అర్సుకుంటాండ్లు” అని చెప్పుకుంట పోతాంటే.. అంతా తెల్లబోయి వినబట్టిండ్లు.

“నాతాన నమ్మదగ్గ గవాయి ఉన్నది. అయినా నా అనుమానాన్ని మీకు సెప్పి తేల్చుకుందామని వచ్చిన” ఏమంటరు? అన్నట్టు అందరి వంకా తేరిపారగ సూసిండు దుర్గయ్య.

“అందుకే అంటరు. అనుమానం ముందు పుట్టి పోలీసు తరువాత పుట్టిండట. సరోజను సంపాల్సిన అగత్యం ఎవరికుంటది సర్. ఆమెను సంపితే ఏమత్తది? ఎవరికీ ఫాయిదా? సరోజ పేరు మీద ఆస్తి పాస్తులు సుత లేవాయే..!” పెద్దమనిషి లెక్క అన్నడు నాగయ్య. లాజిక్‌ పాయింట్ తీత్తానవా..? అన్నట్టు మొకం పెట్టి నాగయ్యను ఒక సురుకు సూపు సూసిండు దుర్గయ్య. తల్కాయె దించుకున్నడు నాగయ్య.

“నిజమే గాని సరోజను ఎవరో సంపిండ్లు. అది సరోజ శవ పరీచ్చ చేత్తేగాని బైట పడది. మీరు ఒప్పుకున్నా.. ఒప్పుకోక పోయినా నా డూటీ నేను సేసుకుంట పోత. ముందుగాల ఒక మాట మీ చెవులేసీ పోదామని వచ్చిన” అన్కుంట లేసి నిలపడ్డాడు దుర్గయ్య.

“సర్.. కూకోండి. నేను సెప్పేది పసాంతంగ ఇనండి” అని బతిలాడిండు గంగయ్య.

ఏందో సెప్పుమన్నట్టు లాఠీ ఊపిండు దుర్గయ్య.

“సరోజను ఎవలూ సంప లేదు సార్. ఇది నిజం నా బిడ్డ మీద ఒట్టు. మల్ల పీనుగను బైటకు తీసుడెందుకు? కోసుడెందుకు?” అంటాంటే గౌరమ్మ, నాగయ్య ‘ఔ’ అన్నట్టు తలలూపిండ్లు. భీమయ్య ఇద్దరినీ కిందికెళ్ళి మీద్దాక కండ్లు నెత్తికెక్కిచ్చుకొని సూడబట్టిండు.

“అయ్యాల్ల కొత్తోలెవలూ రాలేదు సార్. అంతా మాకు తెలిసిన దోస్తులే. మా ఇంట్ల పనోల్లు సుత ఎవలూ లేరు. వంటలు బైటికెల్లి తెప్పిచ్చినం. సరోజ తబియత్ అంతంత మాత్రమే. ఆయువు తీరింది. దేవుడు తీస్కపోయిండు. నా మన్సంతా కలి, కలైతాంది” అన్కుంట గుడ్లనిండ నీల్లు తీసుకున్నడు గంగయ్య. నాగయ్య గంగయ్య దగ్గరికచ్చి ఊకోమన్నట్టు భుజాన్ని తడుమ సాగిండు.

“కానూన్ ఒప్పుకోదు గంగయ్యా. ఒకమల్క శికాయతచ్చి కేసు బుకైతే ఫైసలా చేసి తీరాలె. ఇద్దరు బండెక్కుండ్లి”

అన్కుంట భీమయ్య దిక్కు సూసిండు దుర్గయ్య జీపుల ఎక్కియ్యమన్నట్టు.

శికాయత్ ఎవరు సేసిండ్లని అడుగుదామని నోట్లె దాక వచ్చింది కాని అడిగే దైర్నం రాక గంగయ్య, నాగయ్యలు పోలీసు జీపుల ఎక్కిండ్లు.

***

మర్నాడు ఎనిమిదింటికే ఠాణాకచ్చి కూకున్నడు అమీన్ సాబ్ దుర్గయ్య. ఎన్కాల్నే పోలీసు భీమయ్యచ్చి సరోజ శవ పరీచ్చ నతీజ ఫైలు పెట్టిండు. దుర్గయ్య అనుమానం నిజమయ్యింది. దొరికిన ఆధారాలకు నతీజ అద్దం పడ్తాంది.

“భీమయ్యా.. మన ఫోర్ నాట్ త్రీని తీస్కోని పోయి అర్జంటుగా నాగయ్యను పట్టుకొనిరా” అని హుకుం జారీ సేసిండు దుర్గయ్య.

భీమయ్య ఎట్ల ఉరికిండో.. అట్లనే వాపసచ్చిండు.. గోడకు ఈడ్సి కొట్టిన లబ్బరు చెండులెక్క.

“సర్.. నాగయ్య పొద్దుగాల సైకిలు మీద పోతాంటే.. లారి టక్కరిచ్చిందట. యసోద దవాకాన్లకు ఏస్కపోయిం డ్లని తెల్సింది” అన్కుంట నెత్తి గూక్కోబట్టిండు.. ఇప్పుడేంసేద్దామన్నట్టు.

“అయితే మనమే దావఖానకు పోదాం.. జీపు తీయుమను” అని బల్ల మీదున్న టోపీ పెట్టుకొని, లాఠీ పట్టుకొని సీట్ల కెల్లి లేసిండు దుర్గయ్య.

యసోద దావఖానకు పోయేటాల్లకు నాగయ్య మంచం సుట్టు గంగయ్య, గౌరమ్మలు తల్కాయలు పట్టుకొని కూకున్నరు. కళావతి తాతకు ఏమైంది అన్నట్టు గౌరమ్మ గదుమ పట్టుకొని, బిక్కమొకం పెట్టి సూత్తాంది. పోలీసోల్లను సూడంగనే లేసి నిలబడ్డడు గంగయ్య.

నాగయ్య తల్కాయకు, కాల్లకు పట్టీలు కట్టి ఉన్నై. రకుతం ఎక్కిత్తాండ్లు.

దుర్గయ్య అక్కడి హాలత్ సూసి ఇంకా తాత్సారం చెయ్యొద్దని కీసల కెల్లి సెల్లుఫోను తీసిండు.

“అమ్మా.. నా ఫోను” అని లాసిగ కీక పెట్టి సంకలు ఎగిరేయ బట్టింది కళావతి.

గౌరమ్మ, గంగయ్యలు కొయ్యబారి పోయిండ్లు. నాగయ్య మెల్లంగ, మెల్లంగ కండ్లు తెర్సిండు. దుర్గయ్య తన పోలీసు బుద్ధికి పదును పెట్టిండు. ఫోను అనే మాట విని నాగయ్యకు జరంత హోష్ లకు వచ్చిండని సమఝ్ సేసుకున్నాడు. నాగయ్య సూడాలని సేతిల ఫోను ఊపబట్టిండు దుర్గయ్య.

“తాతయ్యా.. నా ఫోను దొరికింది” అని కళావతి మల్లోమల్క సిన్నంగ నాగయ్య సెవుల్ల సెప్పింది.

నాగయ్య కనుకొనుకుల నుండి సన్నంగ నీల్లు కారబట్టినై. గౌరమ్మ తన కొస కొంగు తోని నాగయ్య కండ్లు తుడుత్తాంటే.. నీల్లు ఆగుత లేవు.

“ఏందే నాయ్నా.. ఏమైంది?” జీరబోయిన బొండిగె తోని అడుగబట్టింది గౌరమ్మ.

నాగయ్య పెదాలు కడులుతానై.. నోరు తెర్సుకుంటాంది. ఏదో సెప్ప బోతాండు. భీమయ్యకు ఇషారా సేసిండు దుర్గయ్య. భీమయ్య తల్కాయె ఊపిండు.. నాగయ్య సెప్పేది రాద్దామని కలం కాయితం తీసుకున్నాడు..

నాగయ్యకు సరోజ సావు శికాయత్ ఎవరు సేసిండ్లో.. తెల్సి పోయింది. దుర్గయ్య సేతిలోని సెల్లు ఫోనే కండ్లల్ల కదలాడుకుంట కంట్లె నీల్లు తెప్పిత్తాంది. అయ్యాల్ల తను సరోజ కోసరం పాలు కలుపుతాంటే కళావతి సేతిల ఫోను కనబడ్డది.

“నాగయ్యా.. ఏమన్నా సెప్పాలనుకుంటే సెప్పు. మన్సులున్న యాతన సెప్పుకుంటే గుండెల్ల బరువు తోడెం దించుకున్నట్టైతది. సెల్లు ఫోను సూత్తాంటే నీకు ఏడుపు ఎందుకత్తాందో నాకు తెల్సు” అన్నడు దుర్గయ్య.

గౌరమ్మ, గంగయ్యలు నోరు తెర్సిండ్లు.. ఏందో కూనం బట్టక.

“నా బిడ్డ సుకం కోసరమే పాపపు పని సేసిన” అని కొన్ని మంచినీల్లు తాపమన్నట్టు గౌరమ్మకు సైగ సేసిండు. గౌరమ్మ రెందు చెంచెలు తాగిచ్చింది. నాగయ్య మల్ల సెప్పసాగిండు.

“నా పెద్ద బిడ్డకు వచ్చింది అమెరికా సంబంధమని ముర్సిపోయి పెండ్లి సేసిన. యాడాది లోపల్నే ఆగమైంది. శవం సుత దొరుక లేదు అంత పెద్ద దేసంల. దాని మానాదిల నా ఇంటిది పిచ్చిదై కాలం సేసింది. సిన్న బిడ్డ గౌరమ్మ బతుకు గట్ల కావద్దని కట్నాలిచ్చే తాహతు లేక మేన బామ్మర్ది గంగయ్యకిచ్చిన.. సరోజ పుట్టిందని సంబుర పడ్డం. కాని ఏం ఫాయిద? మేనరికం బెడిసి కొట్టింది. సరోజ అవిటిది. గౌరమ్మ అరిగోస పడ్తాంది.. పైసలు చింతపిక్కల్లెక్క కర్సైతానై. నిత్తె నాత్రుల్లు ఏడ్సెటోన్ని. ఇంతల కళావతి పుట్టింది. శాన తెలివి కల్లది. పిల్లలు పుట్టకుంట ఆప్లీషన్ సేసుకున్నడు గంగయ్య. ఇంక సరోజను సంపేత్తే.. కొద్ది దినాలు ఏడుత్తరేమో! గాని సాస్వతంగా పీడ విరుగుడైతదని ఎవ్వలకూ అనుమానం రాకుంట ఇక్మత్ పన్నిన. పాలల్ల నిద్ర మాత్రలు మోతాదుకు మించి కలిపి సరోజకు తాగిచ్చిన. పిల్లి పాలు తాక్కుంట నన్నెవలూ సూత్తలేరని అనుకుంటదట. కాని పైన ఆ దేవుడు సూత్తాంటడని తెల్సుకున్న. నాకు తగిన శాస్తి సేసిండు” అని ఆయాస పడుకుంట కండ్లు మూసుకున్నడు నాగయ్య.

గంగయ్య, గౌరమ్మలు అప్సోసైండ్లు. అంత కల లెక్క కానత్తాంది.

“సర్.. మా బావ సెప్పింది అంత నిజమేనా?” అని ఆత్రంగా అడిగిండు గంగయ్య.

“అయ్యాల కాటికాపరికి సెల్ ఫోను దొరికింది. అది తీస్కచ్చి నాకిచ్చిండు. నేను దాన్ని మెకానిక్ తోని తెర్పిచ్చి అందులున్న పోటువలు సూత్తాంటే నాగయ్య పాలల్ల మాత్రలు కలుపుతాన వీడియో కనబడ్డది. కాటికాపరిని పిల్సి ఫిర్యాదు రాయించుకొని మీ ఇంటికి వచ్చిన. ఎవల మీద అనుమానం లేదని మీరన్నారు. శవ పరీచ్చల రిపోర్టు నిద్రమాత్రలు ఎక్కువయ్యాయని వచ్చింది. ఇప్పుడు నిజం బైట పడ్డది” అని నాగయ్యను సూసుకుంట దుర్గయ్య మల్ల సెప్పసాగిండు.

“సూడు నాగయ్యా.. నీ ఆలోసన తప్పు. పపంచంల ఎందరో గిసోంటి అభాగ్గులున్నరు. కొందర్కి రెండు సేతులు లేకున్నా.. రెండు కాల్లు లేకున్నా.. కాల్లూ, సేతులు లేకున్నా బతుకుతలేరా? గుడ్డోల్లైనా.. ఎడ్డోల్లైనా బిడ్డల్ను సంపుకుంటాండ్లా? అంతెందుకు నా కొడుకే సూడరాదు.. పుట్టినంక మూడేండ్లకు రెండు కాల్లకు, నడుంకు పోలియో సోకింది. నేను కట్టపడి దినాం యాయామాలు సేయించి మల్ల యాడాదికే నడిపిచ్చిన. పెద్ద సదువులు సదిసిచ్చిన. ఇప్పుడు పెద్ద నౌకరి సేత్తాండు. నీ బిడ్డ సుకం నీకెంత ముక్కెమో!.. గౌరమ్మకు తన బిడ్డ సుకం అంత ముక్కెం కాదా!” అని హితబోధ సేసిండు దుర్గయ్య,

నాగయ్య మొక్కుదామని ఎత్తబోయిన సేతులు వాలిపోయి సల్లబడ్డై. మూస్కపోయిన కండ్లు మల్ల తెర్సుకోలేదు. *

మరిన్ని కథలు

Mister Vinayak
మిస్టర్ వినాయక్
- యిరువంటి శ్రీనివాస్
Window seat
విండో సీటు
- ఎం వి రమణారావ్
Swayam vupadhi
స్వయం ఉపాధి
- మద్దూరి నరసింహమూర్తి
Neelambari
నీలాంబరి
- రాము కోలా దెందుకూరు.
Indradyumnudu
ఇంద్రద్యుమ్నుడు
- కందుల నాగేశ్వరరావు
Vyapari telivi
వ్యాపారి తెలివి
- ౼డా.బెల్లంకొండ & ౼డా.దార్ల
Sundaramidi palle
సుందరామిడి పల్లె
- సి.లక్ష్మి కుమారి
Snehadharmam
స్నేహ ధర్మం
- భానుశ్రీ తిరుమల