దేవీ మహాత్యం (దుర్గా సప్తశతి) - కందుల నాగేశ్వరరావు

Devi mahatmyam

దేవీ మహాత్యం (దుర్గా సప్తశతి)

ఉపోద్గాతం:

మార్కండేయ పురాణంలో, ఏడు వందల శ్లోకాలతో కూడిన పదమూడు అధ్యాయాలలో “దుర్గా సప్తశతి” అనే పేరుతో “దేవీ మహాత్యం” (Glory of The Goddess) నిశ్చిప్తమై ఉంటుంది.

దేవీ మహాత్యంలోని మూడు గాథలు దేవీమాత యొక్క గొప్పతనాన్ని; ఈ జగత్తులో జరిగే ధర్మాధర్మ పోరాటంలో చెడుపై మంచియొక్క విజయాన్ని మనకు తెలియజేస్తాయి. దీనిలో ఉన్న మూడు గాథలు చండీమాత యొక్క తామస, రజో, సత్త్వ ప్రవృత్తులు అనే భిన్న తత్త్వాలతో కూడిన మూడు మూలరూపాలను వివరిస్తాయి. దేవి తామసగుణంతో మహాకాళిగా (దుర్గ), రజోగుణంతో మహాలక్ష్మిగా, సత్త్వగుణంతో మహాసరస్వతిగా ప్రకటితమవుతుంది.

మొదటి చరిత్రలో మహాకాళి స్వరూపంలో దేవి రాక్షసులైన మధుకైటబులను సంహరించడానికి తోడ్పడుతుంది. రెండవ చరిత్రలో దేవతలందరి నుండి శక్తిని గ్రహించి మహాలక్ష్మి రూపంలో అవతరించి మహిషాసురుణ్ణి వధిస్తుంది. మూడవ చరిత్రలో ఆమె మహాసరస్వతిగా అభివ్యక్తమై ఓర్పుతో, క్రమబద్ధమైన నేర్పుతో, వివిధ శక్తిరూపాల కూర్పుతో, శుంభనిశుంభులను వారి అనుచరులను వధిస్తుంది.

సురథ, సమాధి:

పూర్వం స్వారోచిష మన్వంతరంలో చైత్రవంశీయుడైన సురథ అనే ఒక క్షత్రియుడు సమస్త భూమండలాన్ని పరిపాలించేవాడు. సురథ తన భుజబలంతో రాజ్యాన్ని విస్తరించి ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు. ఆ రాజుకు ‘కోలా విధ్వంసులనే ఆదిమజాతి తెగవారు శత్రువులయ్యారు. ఎంతో గొప్ప సైన్యము ఉన్నా కొద్దిపాటి సైన్యముగల శత్రువుల చేతిలో ఓడిపోయాడు. ఆస్థానంలోని కొందరు దుష్టబుద్ధి గల మంత్రులు శత్రురాజులతో చేతులు కలపి ఆ రాజ్యాధికారాన్ని, ధనమును అపహరించారు. అవిశ్వాసపరులైన రాజ్య పౌరులు కూడా రాజుకు సహాయం చేయలేదు. అందువలన రాజు సమస్తం పోగొట్టుకొని అరణ్యానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆ అరణ్యంలో సుమేధస మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొంది కొంతకాలము ఉన్నాడు. మమకారమునకు లోనై తన పూర్వ వైభవమును తలచుకొంటూ ఇప్పుడు తన ప్రజలు, బృత్యులు ఎలా ఉన్నారా అని మధనపడ సాగాడు.

సమాధి ఒక వైశ్య వ్యాపారి. ధనికుల ఇంట జన్మించాడు. తన తెలివితేటలతో ఏకాగ్రతతో వాణిజ్యాన్ని నిర్వర్తించి అపారమైన ధనాన్ని సంపాదించాడు. కాని వయస్సు మళ్ళిన తర్వాత ఒకనాడు భార్య, కుమారులు, బంధువులు ధనవ్యామోహంతోను, పదవీ వ్యామోహంతోను ఆ వైశ్యుని సంపదను హరించి, ఇంటి నుండి తరిమివేశారు. అన్నీ కోల్పోయిన ఆ వైశ్యుడు దుఃఖంతో ఏకాకిగా అదే అడవిలో తిరుగుతూ ఆ ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. వైశ్యుడు కూడా తన బార్యా పిల్లలపై మోహాన్ని వదలలేక ‘వారు ఇప్పుడు ఎలాగున్నారో’ అని చింతిస్తూ ఉన్నాడు.

తమ తమ జీవితాల్లో మోసపోయిన దురదృష్టవంతులు ఇరువురూ ఒకనాడు ఆ ఆశ్రమప్రాంతంలో కలుసుకుంటారు. సురథుడు, సమాధి ఇద్దరూ జీవితంలో తాము అనుభవించిన కష్టాలు, తమ ఇళ్ళను వదలి అరణ్యంలోకి వచ్చిన కారణాలు ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇద్దరూ కూడా నమ్మినవారు ద్రోహం చేసినా, వారి మీద ఉన్న మమతానురాగాలు వదలలేక వారినే తలుచుకుంటూ ఉంటారు.

అటువంటి మోహానికి కారణం, ఆ మోహం నుండి బయటపడే మార్గం తెలపమని వారు మహర్షిని ప్రార్థిస్తారు. సురథుడు మహర్షితో “మహాత్మా! నా రాజ్యం పోయింది. పదవి పోయింది. కాని ఇప్పటికీ నా ప్రజల పైనా నా మంత్రి సామంతులపైనా మమకారం పోవడం లేదు. అన్నీ పోగుట్టుకున్నా, ‘నాది’ అనే ‘మమత’ నా కెందుకు నశించ లేదు? అలాగే ఈ వ్యాపారి సమాధి కూడా తను ప్రేమించిన భార్యా పిల్లల చేత, సేవకుల చేత విడువబడి కూడా, వారి మీద ఇంకా ‘మమకారం’ పోలేదు. మా ఇద్దరికీ మాకు అన్యాయం చేసిన వారి పైన కూడా ‘మోహం’ పోకుండా ఇంకా ‘నా వారు’ అనే ‘మమతా భావం’ ఎందుకు ఉంది?

ఇలా మేమిద్దరం మాకు అన్యాయం చేసిన మా వారిపై ఇంకా మమతానురాగాలు ఎందుకు వదులుకో లేకుండా ఉన్నాము. మహాత్మా! జ్ఞానము, ఆలోచనా శక్తి ఉన్న మేమిద్దరమూ మూఢులవలె మోహానికి ఎందుకు గురి అవుతున్నాము. దీనికి కారణం తెలుసుకోవాలని ఉంది. దయచేసి దీనికి నివారణ కూడా శలవీయండి” అని అడిగాడు.

రాజు చెప్పినదంతా సావధానంగా విన్న ఋషి ఆ ఇద్దరికీ ఇలా చెప్పాడు. “ఈ జగత్తులో పుట్టిన ప్రతీ జీవికి ‘నేను’ అనే భావం; పరిసరాల నుండి శబ్దాది విషయాలను గ్రహించి తమను తాము పరిరక్షించుకోవడం అనేవి పుట్టుకతో వచ్చిన సహజ గుణాలు. మానవులకు మాత్రమే కాక పశుపక్ష్యాదులకు కూడా ఈ జ్ఞానం ఉంటుంది. పశువులు పక్షులు మొదలైన జీవులు వాటి ఇంద్రియాలను ఉపయోగించి తమను, తమ సంతానాన్ని పరిసరాల నుండి రక్షించుకోవడానికి మనిషి కంటే ఎక్కువ నేర్పు కనపరుస్తాయి. అందువలన ‘నేను’, ‘నాది’ అనే భావం పుట్టుకతోనే సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులలో కలుగుతుంది”.

“మానవులు స్థితికారిణి అయిన ‘మహామాయ’ ప్రభావంతో మమత అనే సుడిగుండంలోకి, మోహం అనే బురద గుంటలోకి కూలద్రోయబడుతున్నారు. ఇటు వంటి భావాలకు మూల కారణం ‘అజ్ఞానం’ (అవిద్య). ఈ అజ్ఞానానికి కారణం సంసార స్థితికారిణి అయిన ‘మహామాయ’. ఈ మహామాయయే జగన్నాథుడైన శ్రీమహావిష్ణువు యొక్క యోగనిద్ర. మహామాయ వల్ల జగత్తంతా మోహానికి లోనవుతుంది. మహోన్నతమైన భ్రాంతిని (లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా) కల్పించి మోహంలో ముంచే శక్తియే ఈ మహామాయ.

జీవిని బంధాలతో కట్టి వేయడం (అజ్ఞానం), మరల ఆ జీవిని బంధాల నుండి విడదీయడం (జ్ఞానం) అనే రెండు కార్యాలు మహామాయ శక్తి వలననే జరుగుతూ ఉంటాయి. జగత్తంతా వ్యాపించిన ఈ యోగమాయ నిత్య అయినప్పటికీ దేవతల కార్యాలను నెరవేర్చడానికి కొన్ని సార్లు ఆవిర్భవిస్తుంది. ఆ అవతారగాథలను వినండి”.

ప్రథమ చరిత్ర (మహాకాళి)– మధుకైటభ వధ:

“కల్పాంతంలో వచ్చిన ప్రళయకాలంలో ప్రపంచమంతా ఒక పాల కడలిగా మారింది. అనంతుడైన శ్రీమహావిష్ణువు ఆదిశేషుని తల్పంగా చేసుకొని యోగమాయాదేవి ప్రభావంతో విశ్వాన్ని తన గర్భంలో దాచుకొని ఆ శేషతల్పంపై యోగనిద్రలో ఉన్నాడు. దేవి విశ్వంలోని శక్తి నంతటినీ గ్రహించి నల్లటి కాళరాత్రికి అధిదేవతయైన ‘మహాకాళి’ అనే తామస రూపంలో ఉంది.

ప్రళయాంతంలో సృష్టిని తిరిగి ప్రారంభించడానికి సమయం ఆసన్నమైనపుడు నారాయణుడి నాభి కమలం నుండి ఒక నాదం వెలువడింది. తరువాత ఒక పద్మం, ఆ పద్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. అదే సమయంలో శ్రీహరి చెవి గుల్మం నుండి మధు కైటబులు అనే ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు. వారు బ్రహ్మదేవుని చంపడానికి ప్రయత్నించారు. బ్రహ్మ ఎంత ప్రయత్నించినా శ్రీహరిని యోగనిద్ర నుంచి మేల్కొనక లేకపోయాడు.

విష్ణుమూర్తిని యోగనిద్ర నుండి మేల్కొనేటట్లు చేయమని శ్రీహరి కనులలో నివసించే ‘యోగమాయను’ ప్రార్థించాడు. “నీవే జగత్సరూపిణివి. సృష్టి స్థితి లయ కారిణివి. మహా విద్యవు, మహా మాయవు,మహా బుద్ధివి, మహా బ్రాంతివి, మహా దేవివి. ప్రళయరాత్రివి నీవే, ప్రకృతిని నీవే. అన్ని జీవుల యందలి శక్తివి నీవే. జగన్నాథుడైన విష్ణువుని మేల్కొనునట్లు చేసి మధుకైటబులను చంపుటకు ప్రబోధించు తల్లీ!” అని ప్రార్థించాడు.

బ్రహ్మదేవుని ప్రార్థనను స్వీకరించిన దేవి, శ్రీహరి యోగనిద్రను సమాప్తం చేసింది. యోగనిద్ర నుండి లేచిన నారాయణుడు బలవంతులు, కోపముతో ఎరుపెక్కిన కన్నులు కలవారు అయిన మధుకైటబులను చూసాడు. అయిదు వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో బాహుయుద్ధం చేసాడు.

మధమెక్కిన మధుకైటబులు శ్రీహరితో ‘నీ వీరత్వం, యుద్ధ నైపుణ్యం మాకు నచ్చాయి. ఏదైనా వరం కోరుకో, ఇస్తాము’ అన్నారు. ‘మీరు ఇవ్వాలనుకొంటే మీ చావును నాకు వరంగా ఇవ్వండి’ అన్నాడు నారాయణుడు. ఆ రాక్షసులు చుట్టూ ఉన్న నీటిని చూస్తూ ‘అలా అయితే నీటిలో తడవని చోట మమ్ము వధించు’ అన్నారు గర్వంతో. అప్పుడు విష్ణుమూర్తి తన శరీరాన్ని పెంచి వారిని తన తొడలపై చేర్చి చక్రాయుధంతో వధించాడు.

ఇట్లు మహామాయ బ్రహ్మదేవుడు చేసిన స్తుతికి సంతోషించి, విష్ణుమూర్తిని యోగనిద్ర నుండి మేలుకొలిపి, రాక్షస సంహారమునకు సహాయపడింది. ఈ విధంగా దేవి యొక్క మొదటి చరిత ‘మధుకైటభనాశిని’ ‘అనే పేరుతో తామస గుణానికి అధిదేవతగా పేరుగాంచిన ‘మహాకాళి’ కథ పూర్తయింది.

మధ్యమ చరిత్ర (మహా లక్ష్మి) - మహిసాసుర వధ:

పూర్వం ‘దేవదానవులకు ఒక వంద సంవత్సరముల పాటు యుద్ధము జరిగింది. దేవతలకు రాజు ఇంద్రుడు, రాక్షసులకు రాజు మహిసాసురుడు. ఆ యుద్ధములో విజయం సాధించిన మహిసాసురుడు ఇంద్ర పదవిని అధిష్టించాడు. ఓడిపోయిన దేవతలు బ్రహ్మదేవుని తోడ్కొని శివ కేశవుల వద్దకు వెళ్లారు. ‘మహిసాసురుడు ఇంద్రుని మరియు అష్ట దిక్పాలకుల అధికారులను హస్తగతం చేసుకొన్నాడు. మేము మానవుల వలె భూలోకంలో తల దాచుకున్నాము. ఆ రాక్షసుల బారి నుండి రక్షించమని శరణు మిమ్ములను వేడుతున్నాము.’ అని విన్నవించారు.

దేవతల పలుకులు విన్న శివ నారాయణులు కోపంతో కనుబొమలు ముడిచారు. తమ శక్తులను సమీకరించారు. అప్పుడు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముఖములలనుండి గొప్ప తేజము వెలువడింది. దేవతలందరి శరీరముల నుండి కూడా తేజము వెలువడింది. అన్ని తేజములు కలిసి ఒక పూర్ణ స్త్రీ రూపము ఏర్పడింది. అలా అందరి శక్తితో ఏర్పడిన ఆ ‘దేవిని’ చూసి దేవతలు సంతోషించారు.

శివుడు తన శూలము నుండి ఒక శూలమును, విష్ణువు తన చక్రము నుండి ఒక చక్రమును తీసి ఆమెకు ఇచ్చెను. ఇంద్రుడు, అష్ట దిక్పాలకులు, మిగిలిన దేవతలు కూడా వారి వారి దివ్యాయుధములను ఆ దేవికి ఇచ్చారు. సూర్యుడు ఆమె దేహమును కాంతికిరణములతో నింపెను. సముద్రుడు ముత్యాల సరమును, కంఠాభరణములు, భుజకీర్తులు, ఎప్పుడూ మాయని వస్త్రములను మొదలగునవి ఇచ్చెను.

అట్లు సన్మానింపబడిన దేవి గట్టిగా అట్టహాసము చేసెను. ఆ అట్టహాసము ఆకాశంలో ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వనికి జగత్తంతా కంపించింది. భూమి బీటలు వేసింది. కొండలు చలించాయి. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. ఆ దేవిని దేవతలు మునులు స్తుతించారు. ధనుష్టంకారముతో వేలకొలది బాహువులతో వ్యాపించి ఉన్న దేవి మహిషాసురుని ముందు ప్రత్యక్షమయ్యింది.

ఆ దేవికి రాక్షసులకు యుద్ధము జరిగింది. మహిషుని సేనలో చిక్షురుడు, చామరుడు, ఉదగ్రుడు, మహాహనువు, అసిలోముడు, బాష్కలుడు, ఉగ్రదర్శనుడు మొదలైన ఎంతో మంది రాక్షస యోధులు లక్షల రథములతో, ఏనుగులతో, అశ్వములతో కూడి దేవితో యుద్ధము చేసిరి. మహిసాసురుడు కోటి వేల రథములతో, ఏనుగులతో, అశ్వములతో కూడి దేవిని ఎదిరించెను.

దేవి వారు వేసిన శస్త్రాస్త్రములను తన శస్త్రాస్త్రములతో ఖండించింది. వేల సంఖ్యలో గణములు పుట్టి, దేవి యొక్క శక్తితో బలపడి అన్ని దిక్కుల్లో రాక్షస సంహారము గావించాయి. క్షణములో దేవి రాక్షస సైన్యమును నాశము చేసెను. దేవి యొక్క వాహన సింహము జూలు విదిలించి, గర్జించుతూ రాక్షసులను వెంబడించింది.

చిక్షురుడు దేవిపై శూలమును విసరగా దేవి తన శూలముతో దానిని ఖండించి, వానిని సంహరించెను. చిక్షురుడు చావగా చామరుడు దేవితో పోరాటమునకు వచ్చెను. దేవి వాహనమైన సింహము మహావేగముతో వానిపై బడి పంజాతో కొట్టి వాని శిరస్సును త్రుంచెను. దేవి చెట్లతో కొట్టి ఉదగ్రుని, పిడికత్తితో పొడిచి కరాళుని, గదతో కొట్టి ఉద్ధతుని, భిందిపాలముతో బాష్కలుని, బాణములతో అంధక తామ్రు దుర్ధన దుర్ముఖులను, త్రిశూలముతో ఉగ్రాస్య ఉగ్ర మహాహనువులను, కత్తితో నరికి బిడాలుని చంపెను. ఈ విధంగా మహిషాసురుని సైనిక బలము క్షీణించెను. సింహము వాయు వేగముతో రాక్షస సైన్యమును హరించెను.

అప్పుడు మహిసాసురుడు కోపావేశముతో దేవి పైకి యుద్ధమునకు వచ్చెను. దేవి వానిపై పాశము వేసి కట్టివేయగా, వాడు దున్నరూపము విడిచి సింహముగా మారిపోయెను. అంబిక కత్తి నెత్తి వాని శిరస్సు ఖండించు నంతలో వాడు ఖడ్గము దాల్చిన పురుషునిగా మారిపోయెను. బాణముతో కొట్టబోగా ఏనుగుగా మారిపోయెను. దేవి వెంటనే దాని తొండమును ఖండించెను. వాడు మరల మహిషముగా మారిపోయి గిట్టలతో కొండలను దేవిపై దొర్లించెను. చండి ఆ కొండలను తన బాణములతో పిండిగా చేసెను. అప్పుడు దేవి చెంగున వానిపై దుమికి, కాలి క్రింద పడవేసి, తొక్కి, శూలము గొంతులో గ్రుచ్చెను. మహిసుడు దేవి కాలి క్రింద నుండి వచ్చిన సగం శరీరంతో యుద్ధమునకు తయారయ్యాడు. దేవి తన ఖడ్గముతో వాని తల నరికి వధించెను.

అంతట రాక్షస సైన్యమంతా బయంతో హాహాకారం చేస్తూ అక్కడి కక్కడే ప్రాణాలు విడిచారు. దుష్టుడు, అతి బలవంతుడు అయిన మహిషాసురుని వధించిన దేవిపై పూల వర్షం కురిసింది. ఆనందంతో దేవతలు మహర్షులూ కలిసి దేవిని ఇలా స్తుతించారు. ‘సకల దేవతల యొక్క శక్తిసమూహముతో రూపొందిన ఏ దేవి ఆత్మ శక్తితో ఈ జగమంతా నిండి యున్నదో, ఏ దేవి సర్వ దేవతలకు మహర్షులకు పూజనీయమైనదో, ఆ అంబికను మేము భక్తితో నమస్కరించెదము. ఆమె శుభములను అందించు గాక. ఏ దేవి యొక్క ప్రభావము వర్ణించుట త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదో ఆ చండికకు నమస్కరించెదము. ఆమె మా భయమును, అశుభములను పోగొట్టి మమ్ము రక్షించు గాక. తల్లీ! మేము తలచి నప్పుడు వచ్చి మా ఆపదలను బాపుము.” దేవతలచే ఈ విధంగా పొగడబడిన దేవి ‘అటులనే’ అని చెప్పి ‘భద్రకాళి’ అంతర్ధానమయ్యెను.

ఈ విధంగా దేవి యొక్క మధ్యమచరిత్ర ‘మహిసాసుర మర్ధిని’ అనే పేరుతో రజోగుణానికి అధిదేవతగా పేరుగాంచిన మహాలక్ష్మి కథ పూర్తయింది.

ఉత్తర చరిత్ర (మహా సరస్వతి)- శుంభ నిశుంభ వధ:

హిరణ్యకశిపుని కొలువులో శుంభ, నిశుంభలనే ఇద్దరు దానవ సోదరులు ఉండేవారు. వారు చిన్నతనంలోనే కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ‘ఏమి కావాలో కోరుకోండి, మీ కోరికలు తీరేటట్లు అనుగ్రహిస్తాను’ అని చెప్పాడు. వారు ‘మాకు చావు లేకుండా వరం ఈయండి’ అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టిన వాడు చావక తప్పదు. అందు వలన మీ కోరిక సమంజసం కాదు. మరేమైనా కోరుకోండి అన్నాడు. శుంభ నిశుంభులు కొద్ది సేపు ఆలోచించి ‘ అయోనిజ, బ్రహ్మచారిణి అయిన కన్య చేతిలో తప్ప ఏ దేవ మానవుల చేతిలోనూ చావు లేకుండా వరం అనుగ్రహించండి’ అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు వారు కోరినట్లుగా వరాన్ని ప్రసాదించి నిష్క్రమించాడు.

బ్రహ్మ ఇచ్చిన వరం వలన కలిగిన గర్వంతో, మధించిన ఆ రాక్షసులు ఇంద్రుని త్రిలోకాధిపత్యమును, యజ్ఞభాగములను హరించారు. సూర్య, చంద్ర, కుబేర, యమ, వరుణ, వాయు, అగ్నుల మరియు మిగిలిన దేవతలను పదవీచ్యుతులను చేసి, వారి హక్కులను, యజ్ఞఫలాలను కూడా తమ హస్తగతం చేసుకున్నారు.

శుంభనిశుంభుల చేతిలో పరాజయం పొందిన దేవతలు హిమాలయాలకు వెళ్ళి విష్ణువును, సర్వ జీవుల్లో విష్ణుమాయగా నెలకొని ఉన్న మహామాయాదేవిని పలువిధాల ప్రార్థించారు. జ్ఞానరూపంతో (చిత్) సమస్త జగములయందు వ్యాపించి ఉండు ఆ దుర్గాదేవిని తమ కష్టములను తీర్చమని తలంచి నమస్కరించారు.

దేవతలు ఈ విధంగా ప్రార్థిస్తున్న సమయంలో పార్వతీదేవి గంగానదికి స్నానానికి వచ్చింది. అప్పుడు ఆ గౌరీదేవి శరీరకోశము నుండి ‘అంబిక’ అనే నామంతో ఒక సుందరమైన స్త్రీ మూర్తి వెలువడింది. వెంటనే పార్వతీదేవి నల్లగా మారిపోయింది. సుందర రూపంలో ఉన్న అంబికను లోకాలన్నీ ‘కౌశికి’ అనే పేరుతో కీర్తించాయి.

మనోహర రూపాన్ని ధరించి హిమాచలములో నివసిస్తూ ఉన్న కౌశికిని, శుంభనిశుంభుల సేవకులు చండముండులనే వారు చూసారు. ఆమె అందానికి వారు ముగ్దులయ్యారు.వెళ్ళి వారి స్వామితో ‘ఇంతటి అందమైన స్త్రీ ని ఇంతకు ముందెక్కడా మేము చూడలేదు. ఇంద్రుని ఐరావతాన్ని, పారిజాతాన్ని, సమస్త దేవతల సంపదలను సంపాదించిన నీవు తప్పక ఈ కన్యామణిని తెచ్చుకోవలెను’ అని చెప్పారు. చండముండులు చెప్పింది విన్న శుంభుడు సుగ్రీవుడనే మంత్రిని దేవి వద్దకు దూతగా పంపాడు.

సుగ్రీవుడు అంబిక వద్దకు వెళ్ళి ‘శుంభుడు ముల్లోకములను జయించిన వీరుడు. నేను శుంభుని మంత్రిని. దేవతలందరూ మా రాజుకు సేవకులు. మూడు లోకములలోని ఉత్తమమైన వస్తువులన్నీ మా స్వామి వశమై ఉన్నాయి. స్త్రీరత్నమైన నీవు కూడా మా స్వామిని చేరి సుఖించు’ అని చెప్పాడు.

అందుకు దేవి ‘నువ్వు చెప్పిందంతా నిజమే. శుంభ నిశుంభులు పరాక్రమవంతులు. దేవతలు ఎవ్వరూ వారికి సరి కారు. కాని నాకొక నియమ మున్నది. నాతో యుద్ధం చేసి నన్ను జయించిన వారినే వివాహమాడాలని ఎప్పుడో ప్రతిజ్ఞ చేసాను. నాతో యుద్ధం చేసి నన్ను ఓడించిన పరాక్రమవంతుడు నాకు భర్త అవుతాడు. వాడు నీవు వెళ్ళి ఈ విషయం వారికి చెప్పి వారిని నాతో యుద్ధం చేయమని చెప్పు’ అని వానిని వెనుకకు పంపెను.

దేవి చెప్పిన మాటలు వార్తాహరుని ద్వారా విన్న శుంభుడు కోపంతో రగిలిపోయాడు. దేవిని బలవంతంగా తీసుకు రమ్మని తన సేనాధిపతి దూమ్రలోచనుని పంపాడు. దూమ్రలోచనుడు తన సైన్యంతో హిమాలయ శిఖరం పైనున్న అంబిక వద్దకు వచ్చి ‘నీ జుత్తు పట్టి నిన్ను మా రాజు వద్దకు తీసుకు వెళ్తాను’ అని దగ్గరగా వచ్చాడు. అంబిక ఒక్క అరుపుతో వానిని భస్మం చేసింది. దేవి వాహన సింహం రాక్షస సైన్యాన్ని ధ్వంసం చేసింది.

దూమ్రకేతుని మరణ వార్త తెలిసిన శుంభుడు చండాముండలను సైన్యంతో వెళ్ళి దేవిని తీసుకు రమ్మని పంపాడు. వారు హిమాలయాల్లో సింహంపై కూర్చొని మందహాసం చేస్తున్న దేవిని చూసారు. కోపంతో ఆ దానవులవైపు చూసిన అంబిక కనుబొమల నుండి మెడలో కపాలమాల ధరించిన నల్లటి కాళికాదేవి ఉద్భవించింది. ఆమె తెరచి బయటకు పెట్టిన నాలుక భయంకరంగా ఉంది. రాక్షస సైన్యాన్ని చిందర వందర చేసింది. భయంకరంగా అరుస్తూ కత్తితో చండముండలను సంహరించింది. చండముండలను సంహరించి నందుకు దేవికి ‘చాముండి’ అనే పేరు వచ్చింది.

ఆగ్రహించిన శుంభ నిశుంభులు రాక్షస సైన్యాలన్నింటినీ సమీకరించి రక్తభీజుని నేతృత్వంలో దేవిపై యుద్ధానికి పంపారు. దానవ సైన్యాన్ని చూసిన చండిక తన ధనుష్టంకారంతో భూమ్యాకాశాల మధ్య ప్రదేశాన్ని నింపింది. ఆమె వాహన సింహం బిగ్గరగా అరిచింది. అంబిక తన చేతిలోని గంటతో పెద్ద శబ్దాన్ని సృష్టించింది. కాళికాదేవి తన నోటితో బిగ్గరగా అరచి వీటన్నిటినీ మించిన శబ్దం చేసింది. బ్రహ్మ విష్ణు శివ స్కంద ఇంద్రుల నుండి వారి రూపాలతో జనించిన వీరులు ఎంతో మంది చండికను సమీపించారు. వీరందరితో కలిసి శక్తి దానవులతో యుద్ధానికి బయలుదేరింది. సప్త మాతృకలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఐరింద్రి, చాముండి ఆయుధములు ధరించి వారి వారి వాహనాలపై యుద్ధభూమికి వచ్చారు.

దేవతల దాటికి దానవ సైన్యం వెలవెలపోయింది. భయంతో సైనికులు వెనుదిరిగి పారిపోసాగారు. అప్పుడు సేనాధిపతియైన రక్తభీజుడు ఆగ్రహంతో దేవి ముందుకు పోరాటానికి వచ్చాడు. రక్తభీజునికి ఉన్న వరం ప్రకారం అతని శరీరం నుండి నేలపై పడ్డ ప్రతీ రక్తపుబొట్టుకు వానితో సమానమైన బలంగల దానవుడు భూమి నుండి లేస్తాడు. ఐంద్రాణి, వైష్ణవి, కుమారి, మహేశ్వరి తమ గదలతో కొట్టిన దెబ్బలకి రక్తభీజుని శరీరం నుండి రక్తం కారడం మొదలెట్టింది. క్రింద పడ్డ రక్తపుబొట్ల నుండి ఎంతో మంది దానవులు ఉద్భవించి భయంకర పోరాటం చేయడం మొదలుపెట్టారు.

ఇది గ్రహించిన దేవి చండిక అట్టహాసం చేస్తూ కాళికాదేవితో ‘చాముండా, నీ నోరు తెరిచి దానవుని రక్తం ఒక్క చుక్క కూడా క్రింద పడకుండా త్రాగివెయ్యి’ అని చెప్పింది. దెబ్బతిన్న రక్తభీజుని శరీరం నుండి కారుతున్న రక్తాన్ని క్రింద పడకండా మొత్తం కాళీమాత త్రాగివేసింది. రక్తహీనుడైన రక్తభీజుడు అస్థిపంజరంలా తయారయ్యాడు. మాతృకల దాడికి తట్టుకోలేక రక్తభీజుడు నేల కూలాడు. సంతోషంతో దేవతలు నాట్యం చేశారు.

ఇది తెలిసిన శుంభ నిశుంభులు కోపంతో రగిలిపోయారు. దేవిపై యుద్ధానికి వచ్చారు. దేవిపై శరపరంపరలు గుప్పించారు. చంద్రిక ఆ బాణాలను అడ్డుకొని ధ్వంసం చేసి ఆ దానవులపై తిరుగుదాడి చేసింది. నికుంభుడు తన శూలము, డాలుతో ముందుకు వచ్చి వాహన సింహంపై దాడి చేసాడు. దేవి రకరకాల ఆయుధాలతో వానిని దండించి నేలను కరిపించింది. ఇది చూసిన శుంభుడు దేవిపై బాణాల వర్షం కురిపించాడు. చండిక తన బాణాలతో వాటిని ఖండించి కరవాలంతో వానిని గాయపరిచింది. దానితో వాడు సృహతప్పి క్రింద పడ్డాడు.

ఇంతలో నిశుంభుడు స్పృహలోకి వచ్చి మరల చండిక, కాళి మరియు సింహం ముగ్గురి పైన బాణాలు ప్రయోగించాడు. వెయ్యి చేతులను సృష్టించి వేయి రకాల ఆయుధాలతో దేవిపై దండెత్తాడు. చండిక తన కరవాలాన్ని వాని గుండెల్లో గుచ్చింది. ఆ గాయం నుండి ఒక బలవంతుడైన పురుషుడు వచ్చి దేవిని ఆగమని అరిచాడు. దేవి గట్టిగా అట్టహాసం చేస్తూ వాడి తల నరికింది. దానితో నిశుంభుని సంహారం పూర్తయింది. రాక్షసులు భయంతో పరుగులు తీసారు. కాళి మరియు సప్తమాతృకలు మిగిలిన దానవులను సంహరించారు.

తన ప్రియమైన తమ్ముడు నిశుంభుని ప్రాణంలేని దేహాన్ని చూసిన శంభుడు కోపంతో చెలరేగిపోయాడు. “ఓ దుర్గా, నువ్వు ఇతరుల శక్తిపై ఆధారపడి మాతో యుద్ధం చేస్తున్నావు. చేతనయితే నువ్వు నాతో ఒంటరిగా యుద్ధం చేసి నన్ను ఓడించు” అని అన్నాడు. దేవి వానితో “నేను ఒంటరిగానే యుద్ధం చేస్తున్నాను. వారంతా నా శక్తి స్వరూపాలే. నేను వారందరినీ ఇప్పుడే నాలో చేర్చుకుంటాను” అన్నది. అప్పుడు బ్రాహ్మిణి మొదలైన మాతృకలందరూ అంబికలో లీనమైపోయారు.

తరువాత వారిద్దరి మధ్య ప్రచండ యుద్ధం జరిగింది. దానవరాజు వేసిన అస్త్రశస్త్రాలను దేవి సునాయాసంగా నిర్వీర్యం చేసింది. శుంభుని విల్లును, శూలాన్ని ముక్కలు చేసింది. చేతితో వాడి గుండెలపై బాదింది. ఇద్దరూ చాలా సేపు ద్వంద్వయుద్ధం చేసారు. చివరకు దేవి వానిని పట్టి నేలకు విసిరి కొట్టింది. వాడు తిరిగి లేవబోగా శూలాన్ని వాని గుండెల్లో గుచ్చింది. శుంభుడు అచేతనంగా నేలకరిచాడు. ప్రకృతి శాంతించింది. దేవతలు హర్షంతో నృత్యగానాలు చేశారు. దేవి గొప్పతనాన్ని కీర్తించారు.

“జగత్తును రక్షించడానికి నేను అవసరమైనప్పుడు ఇలా ప్రకటితమౌతూ ఉంటాను. నన్ను స్తుతిస్తూ నా పూజలు జరిగే ఇంటిని నేను తప్పక రక్షిస్తాను. వారికి సౌభాగ్యము, సంతానము, జ్ఞానము ప్రసాదిస్తాను. మధుకైటభులను, మహిషాసురుని, శుంభనిశుంభులను వధించిన నా చరితలు పఠించిన వారి దగ్గరకు దుష్టశక్తులు రావు. వారు సుఖశాంతులతో జీవిస్తారు. ” అని చెప్పి దేవి చండిక అంతర్ధానమయ్యింది. ఈ విధంగా దేవి యొక్క ఉత్తర చరిత్ర ‘శుంభ నిశుంభ వధ' అనే పేరుతో సాత్త్వికగుణానికి అధిదేవతగా పేరుగాంచిన మహాసరస్వతి కథ పూర్తయింది.

మహర్షి ద్వారా దేవీమహాత్యం మూడు చరిత్రలు సావధానంగా విన్న సురథ సమాధులు అరణ్యంలోని నిర్జన ప్రదేశానికి వెళ్ళి దేవిని పూజిస్తూ, ఆమె గొప్పతనాన్ని కీర్తించారు. తరువాత దేవిని తలుస్తూ మూడు సంవత్సరాలు తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన జగన్మాత చండిక వారి ముందు ప్రత్యక్షమైనది. వారికి వరాలు ప్రసాదించింది.

వర ప్రభావంతో క్షత్రియుడైన సురథ పోయిన తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. పునర్జన్మలో ‘సావర్ణి’ అనే పేరుతో పుట్టి సావర్ణి మన్వంతరానికి అధిపతి అయ్యాడు. వైశ్యుడైన సమాధి తన కోరిక మేరకు దేవి నుండి జ్ఞానోపదేశం పొంది ఇహబంధాల నుండి, ‘నేను’ ‘నాది’ అనే మాయ నుండి విముక్తి సాధించి సచ్చిదానందరూపమైన మోక్షాన్ని పొందాడు.

***

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు