పోస్ట్ మ్యాన్ - Vinod Kumar.Mokka

Postman

ఈరోజు నేను రాసిన ఒక చిట్టి కథ. పోస్ట్ మ్యాన్... కావలి, ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి, మార్చురీ గది ముందు,చేతిలో తాళాలు గుత్తితో కాంపౌండర్ రఘు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు, ఇంతలో ఇంకొక కాంపౌండర్ రాజయ్య ఇతనికి వయసు సుమారుగా ఒక యాభై ఏళ్ళు ఉంటాయి.స్ట్రెచ్చర్ పైన ఒక శవాన్ని నెట్టుకుంటూ మార్చురీ గదివైపు వస్తాడు. రఘు : ఏంది బాబాయ్ ఈరోజు ఇది పదో శవం నువ్వు నెట్టుకుని రావడం, లోపల అంతసోటు లేదు, రాత్రి ముసునూరు దగ్గర హైవే పైన జరిగిన యాక్సిడెంట్ కేసులు ఉన్నాయి, అవి పెట్టడానికే చోటులేక నేలమీద ఉంచాం, ఒకటే కంపు. మళ్ళీ నువ్వు ఇంకొక శవాన్ని తీసుకుని వచ్చావ్ .అంటాడు విసుగ్గా రాజయ్య : నన్నేం చేయమంటావ్ చెప్పు, ఎక్కడెక్కడో చచ్చిన అనామకులందరికి ఇదే చివరి చోటాయ, అప్పటికీ నేను మన డాక్టర్ కి చెపుతున్నా రోజూ, మార్చురీలో సోటు లేదని, వింటేగా, నువ్వేమో నామీద విసుక్కుంటే ఉపయోగమేంటి చెప్పు, అంటాడు ఓపిగ్గా... రఘు: రోజూ మందు తాగందే ఈ శవాల కంపులో పనిచేయలేం, నాకొచ్చే జీతం డబ్బులు కాస్తా...దానికే సరిపోతుంది ఇంక నాకు మిగిలేదేందీ, అందుకే ఈసారి ఎండాకాలనికి ఈపని మానేసి, నేనుకూడా మన మల్లిగాడు లాగా ,పక్కనే జ్యూసు కొట్టు పెట్టుకుంటా బాబాయ్, ఎట్టలేదన్నా రోజుకి వాడికి పెట్టుబడిపోను ఐదు వేలుదాక మిగుల్తుంది అంట,ఈ కంపులో పని నాకొద్దు... రాజయ్య: సరేకాని ముందు తాళాలు తీయి దీన్ని లోపల ఏదొక మూల్లో పెట్టి, వెళ్లి టీ తాగాలి. రఘు: ఇందాక చెప్పింది నీకర్థంకాలా, లోపల అసలు కాలుపెట్టడానికే సోటు లేదంటే ఏదొక మూల అంటావ్. అని అంటూ జేబులో నుంచి బాదం బీడీ కట్ట తీసి, అందులో నుంచి ఒక బీడీ తీసుకుని అగ్గిపెట్టి కోసం జేబులో వెత్తుకుంటూ ఉంటాడు, అంతలో రాజయ్య : రేయ్...నాకొక బీడీ ఇవ్వు రఘు: ఏంది బాబాయ్ నువ్వు కింగ్స్ కదా తాగేదీ బీడీ అంటావేందీ సీపుగా... రాజయ్య: సచ్చినోడిపెళ్ళికి వచ్చిందే కట్నంగాని , ముందు బీడీ ఇవ్వు రఘు, అయిష్టంగానే కట్టలోనుంచి ఒక బీడీ తీసి ఇస్తూ, అగ్గిపెట్టి కోసం జేబులో వెత్తుకుంటూ ఉంటే...ఇంతలో రాజయ్య తన జేబులోంచి లైటర్ తీసి, బీడీ వెలిగించడానికి లైటర్ ని కొడుతూ ఉంటాడు, ఎన్నిసార్లు కొట్టినా అందులోంచి మంట రాదు, అంతలో రఘు: అందులో రసం లేదు బాబాయ్ నువ్వు ఎన్నిసార్లు కొట్టినా లైట్ రాదు. అంటాడు, దాంతో రాజయ్య లైటర్ తో బీడీ వెలిగించుకోవాలన్న తన ప్రయత్నాలు మానుకుని, ఇలా అంటాడు. రాజయ్య: రేయ్...రఘు ఈ సచ్చినోడి జేబులో ఏమైనా ఉంటుందేమో చూడు. అనగానే ఎదో వినకుడని వార్త విన్నట్టుగా ఉలిక్కిపడి రఘు: ఏంది బాబాయ్ నువ్వనేది...వాడి జేబులో కోటి రూపాయలు ఉండనీగాక నేనసలు సచ్చినోళ్ళ జేబుల్లో చేతులు పెట్టను, ఎందుకంటే... డూటీలో జేరిన కొత్తల్లో మన రైతుబజార్లో యాపారులకి రోజు వడ్డీకి డబ్బులు తిప్పే సుబ్బయ్య శెట్టి యాక్సిడెంట్లో పోతే శవాన్ని ఇక్కడకే తీసుకొచ్చారు, ఆయన చిన్న కొడుకు అమెరికాలో కదా ఉండేది, వాడొచ్చేదాకా శవాన్ని పోస్టుమార్టం చేయొద్దని వాడు పర్మిషన్ తీసుకున్నాడంట అందుకే ఆరోజు రాత్రంతా ఇక్కడే ఫ్రీజర్లో పెట్టారు, ఆరోజు నైట్ డూటీ నాకు పడింది. కొడుకులు అందరూ ఉజ్జోగస్టులు, వీడేమో వడ్డీలకు తిప్పుతాడు, శవాన్ని వాళ్ళకి అప్పజెప్పేటప్పుడు ఎంతోకొంత ఇస్తారని సంతోషంగా డూటీ జేస్తే, తెల్లారి అందరూ వచ్చి నా ఆశలపైన నీళ్లుజల్లి తీసుకుపోయారు, నేనొదల్తానా, ఇంకీళ్లు ఇచ్చేట్టులేరని నేనే వాళ్ళు చూడకుండా జేబులో ఎంతోకొంత ఉంటది కదాని, ఆశతో జేబులో చెయ్యి పెడితే ఒక్క నోటు తగిలింది, టక్కున తీసి జేబులో పెట్టుకున్నా, నాయల్ది వాల్లీకపోయిన ఎంతోకొంత దొరికిందనుకుని, రాత్రికి మజా చేద్దాం అనుకుని, వాళ్ళు వెళ్ళాక తీసి చూసుకుంటే అది ఎందుకూ పనికిరాని వెయ్యి రూపాయల నోటు, సర్లే సచ్చినోడిపెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుని పడేయడానికి మనసురాక, ఇదిగో ఇక్కడే పెట్టా...అని మార్చురీ గోడకున్న నెర్రిలో నుంచి తీసి చూపిస్తాడు. అంతే బాబాయ్...ఆపనికిరాని నోటు తీసుకున్నందుకు వాడు ఆరోజు రాత్రి నన్ను భయపెట్టినదానికి నాకు జరమొచ్చి రెండ్రోజులు మంచాన బడ్డాను, అది మొదలు బాబాయ్ నేను అలా చేతులు పెట్టడం మానేశాను. రాజయ్య: రేయ్...ఆ సోదంతా నాకూ తెలుసుగాని, ముందు బీడీ వెలిగించే మార్గం చూడు.. రఘు:ప్రస్తుతానికి బీడీ తాగడమైనా మానుకుంటా గాని నేనైతే జేబులో చెయ్యి పెట్టను... అని చెప్పేలోపే రాజయ్య , శవం జేబులో చెయ్యి పెట్టి అగ్గిపెట్టికోసం వెతుకుతుంటే , చొక్కా లోపల జేబులో ఎదో కాగితం ఉంటుంది, అది తీసి చూసిన రాజయ్య: రేయ్...రఘు ఇదేదో ఉత్తరంలా ఉంది చూడు అంటాడు... రఘు: అవును బాబాయ్, ఉత్తరమే...అని తీసుకుని చదవడం మొదలుపెడతాడు... దీనిమీద ఫ్రమ్ అడ్రస్ లేదు బాబాయ్... టు.. రఘుపతి వెంకటాద్రి, కొండబిట్రగుంట గ్రామం, బోగోలు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అరవై ఏళ్ల నా జీవితంలో, నలబై ఏళ్ళ పోస్ట్ మ్యాన్ గా నా ఉద్యోగ జీవితంలో, నేను రాసి , ఎవరికి పోస్ట్ చేయాలో తెలియక నా గదిలో ఒక మూలన విసిరేసి వందల ఉత్తరాల్లో ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఉత్తరం ఆఖరిది. కానీ దీనికో ప్రత్యేకత ఉంది, అదేంటో నువ్వు ఈ ఉత్తరం చదివేలోపు తెలుస్తుంది. ప్రతిరోజు నేను ఎన్నో ఉత్తరాలను వాటి వాటి గమ్యస్థానాలకు చేర్చి ఉంటాను. వాటిలో చదువుల కోసం ఇంటికి దూరంగా ఉన్న కొడుకు పంపిన ప్రేమ తాలూకు గుర్తులు. వాడి చదువుల తాలూకు మార్కులు ఉంటాయి. సంపాదన కోసం భార్యా బిడ్డలను వదిలి ఊరికి దూరంగా ఉన్న భర్త తాలూకు ప్రేమతో కూడిన ముద్దులు, అవసరాలకు పంపిన డబ్బులు. సైన్యంలో చేరిన కొడుకు నుంచి వచ్చే ఉత్తరం కోసం తల్లి, భర్త పంపే ప్రేమ కోసం భార్య ఇలా ఎందరో ఎదురుచూపులకు అర్థాలు నేను మోసుకొచ్చే ఉత్తరాల్లో ఉండేవి. ఇల్లు వదిలి సమాజం కోసం అడవికెళ్లిన కొడుకు నుంచి వచ్చే ఉత్తరం కోసం నాకు తెలిసి ఇరవై ఏళ్ళు ఒక తల్లి రోజూ నాకు ఎదురొచ్చి నా బిడ్డ నుంచి ఏదైనా కబురొచ్చిందా అని అడిగేది. చివరకు ఆకొడుకు అమరుడయ్యాడనే కబురు చెప్పాల్సిన ఒకరోజు వస్తుందని నేను ఊహించలేదు. కానీ ఆ వార్త చెప్పిన మరుక్షణమే ఆ తల్లి కూడా...అటువంటి బిడ్డలను కన్న తల్లిదండ్రులకు నా వందనాలు. ఇలా ఎన్నో శుభ, అశుభ వార్తలను , ఎన్నో భావాలతో నా ఉత్తరాల సంచి ఎప్పుడూ బరువుగానే ఉండేది.ఆ ఉత్తరాలు అందుకున్న వాళ్ళు, అవి చదువుతున్నంత సేపు వాళ్ళ కళ్ళల్లో కొన్నిసార్లు ఆనందం, విచారం, కొన్నిసార్లు విషాదాలు ఇలా రోజూ నేను కూడా వాటిని అనుభవించేవాడిని. ఎందరో క్షేమ సమాచారాలు అటు, ఇటు చేరవేసే నన్ను ఎప్పుడూ, ఎవ్వరూ, ఒక్కరంటే ఒక్కరు కూడా నువ్వు ఎలా ఉన్నావ్ అని ఇప్పటికీ అడగలేదంటే నేనంటే అర్థమౌతుంది మనిషంటేనే సాటి మనిషికి పడదని అసలెందుకు అంత అయిష్టత. మతాలుగా, కులాలుగా,భాషలుగా, యాసలుగా, ప్రాంతాలుగా విడివిడిగా బతుకుతున్న మనిషి. ఆఖరికి మనిషిగా, సాటి మనుషులతో కలిసున్నా విడుగానే బతుకుతున్నారు. ప్ర్రాణంతో ఉన్నప్పుడంటే ఇగోలకు పోయాడనుకోవచ్చు చివరికి ప్ర్రాణం పోయాక కూడా, ఒక మతం వాళ్ళు ఒకచోట, ఒక కులం వాళ్ళు ఇంకోచోట ఇలా విడదీసి , మేమెప్పటికీ ఒకటి కాదని నిరూపిస్తున్నారు.వాళ్ళ సంగతి పక్కనపెడితే నా సంగతేంటి, నాలాంటి వాళ్ళ సంగతేంటి... ఎవరికి పుట్టామో, ఎందుకు పుట్టామో తెలియక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ బతుకుతున్న వాళ్ళ సంగతేమిటి. మిగతావాళ్ళ లాగా మాకు ఒక కులం, మతం , ఊరు, పేరు, ఇంటిపేరు అంటూ ఏమి లేదు, పోయాక ఫలానా చోట విశ్రాంతి తీసుకోడానికి. అందుకే పుట్టినప్పటినుంచి ఇలా ఎన్నో ఇబ్బందులు పడి, ఒక చిరునామా అంటూ లేకుండా బతికి, చివరికి పోయాక చితిపేర్చడానికి కూడా మాకంటూ ఒక చిరునామా లేక ఇలా మీముందు అనాథ శవాలుగా పడి ఉన్నాం. పుట్టినప్పటినుంచి అందరి కోపానికి, చీదరింపులకు, నిర్లక్ష్యంగా చూసే చూపులకు తప్ప ఎవరి ప్రేమకు నోచుకోని మేము చివరికి ఇక్కడ ప్రేమను కోరుకోవడం మా తప్పే, ఎందుకంటే ఇక్కడ కూడా ఉండేది ఏర్పాటు వాదం అలవాటైన ఆ మనిషే కదా. అయినా మేము పుట్టినా, చచ్చినా ఎవరికీ ఫరక్ పడదు...ఇక్కడ కూడా ప్రేమ దొరకదని తెలిసినా, ప్రేమకై ఎదురుచూసే మా ఆశ చావదు. పోస్ట్ చేయని వేల ఉత్తరాల్లో ఇంకొకటి...బహుశా ఇదే ఆఖరి ఉత్తరం. ఇట్లు రఘుపతి వెంకటాద్రి, రిటైర్డ్ పోస్ట్ మ్యాన్, కొండబిట్రగుంట గ్రామం, బోగోలు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఉత్తరం పూర్తిగా చదివేలోపు రఘుకి, అందులో చెప్పినట్లు ఆ ఉత్తరం ప్రత్యేకత ఏమిటో అర్థమైంది, తానేంటో, ఇప్పటివరకు ఎలా బతికానో, ఇకమీదట ఎలా బతకాలో అర్థమైంది... ద్రవించిన రఘు హృదయం తాలూకు చెమ్మతో ఉత్తరం తడిసిపోయింది. అంతలో బాబాయ్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు ఇక్కడేదో అనాథశవం ఉందంట కదా ఇస్తే తీసుకెళ్ళి పడేస్తాం. అనే మాట విన్న, రఘు: ఎవరూ లేరు... అని కన్నీళ్లు తుడుచుకుంటూ రఘుపతి వెంకటాద్రి పైన కప్పిన గుడ్డ తీసి చూసి, స్ట్రేచర్ తీసుకుని అంబులెన్స్ లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు.

మరిన్ని కథలు

Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు
Alludigari alaka panpu
అల్లుడుగారి అలక పాన్పు
- మోహనరావు మంత్రిప్రగడ
Nruga maharaju
నృగ మహరాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Maa nava bandhalu
మా నవ బంధాలు
- బామా శ్రీ (బాలాజీ మామిడిశెట్టి)
Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి