గోదారి గట్టున లంక గ్రామంలో నూకాలమ్మ అమ్మవారి గుడి పక్కన బంగాళా పెంకుటింట్లో ఎరుపు రంగు నేత చీర, గళ్ళ జాకెటు, చేతినిండా గాజులు, మెళ్ళో పసుపుతాడు, నలభై ఏళ్ళు పైబడ్డ నడిపూడి బల్లకట్టులాంటి నాజుకైన నడుము, కష్టించి పనిచేయడంతో మంచి శరీర సౌష్టంతో పాటు ఆరోగ్యంగా వుంటుంది. తన పని తాను చేసుకుంటూ భర్తకు చేదోడు వాదుడుగా వుంటుంది. పెరటి తోటలో వున్న కూరగాయలు కోసి వుంచితే పొద్దునే భర్త రంగయ్య సంతకు తీసుకువెళతాడని, తనకు కొంత సాయం చేసినట్టవుతుందని కూరగాయలు కోస్తూ వుంది పోలమ్మ.
పదవ తరగతి ఫెయిలయ్యి పుష్కర కాలమవుతున్న పక్కింటి మల్లి, పొంగుతున్న ఎద అందాలను వంగపండు రంగు నైటీలో బంధించుకుని, కులుకుతూ పోలమ్మను చూసి “ఏమిటే! ఓ పోలప్పా! ఏం చేత్తనావు?” అని అంది.
“పొద్దున్న మంగళారం సంత కదా! మీ బాయ అమ్ముకొత్తడని, బెండకాయలు కోత్తానా!” అంది పోలమ్మ.
“నువ్వు చాలా మంచిదానివే ఓ పోలప్ప! పాపం బావకు కష్టం లేకుండా సేత్తనావు”
“ఒకరికొకరు సాయం చేసుకుంటేనే కదా సంసారం బాగా సాగుతుంది.”
“అది సరే గాని ఓ పోలప్పా! రెండు రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు ఏదో ఆలోసిస్తునావు, ఏమైంది, బావ నువ్వు ఏమైనా పోట్లాడుకున్నారా!” అని అడిగింది మల్లి.
“ఏమి లేదే!” అని సాగదీస్తూ అంది పోలమ్మ.
“చెప్పకూడనదైతే చెప్పకే”
“సెప్పకూడనదేమీ కాదు గానీ!” అని నీళ్ళు నమలుతూ అంది పోలమ్మ
“మరేమిటంటా!” అని విషయం రాబట్టడానికి ప్రయత్నించింది మల్లి.
“రోజులు ఇలా మారిపోతున్నాయా!” ని తన మనసులోని బాధను దీర్ఘంగా అంది.
“ఇంతకూ నీ మనస్సులోని బాధ ఏమిటో కాస్త వివరంగా చెప్పు”
“మొన్న మీ బాయ నన్ను పంక్చన్ కి తీసుకెళ్లాడు”
“తీసుకెళ్తే”
“ఇదివరకు మనం పంక్చన్ కి వెళ్తే వచ్చేటప్పుడు బొట్టు పెట్టి, చేతిలో జాకెట్ ముక్క పెట్టి పంపించేవారు గదా!”
“అవును” అని వంతపాడింది.
“మరి ఈమధ్య కొంతమంది ప్లాస్టిక్ డబ్బాలు, ఇంకొంతమంది స్టీల్ డబ్బాలు లేదంటే, ఏవో గిప్టులు ఇత్తన్నారు కదా!”
“అవును! మరి ఏమైంది అంట!” అని ఆశ్చర్యంగా అంది మల్లి.
“మొన్న ఫంక్చనుకి వెళ్ళినప్పుడు, అక్కడ రకరకాల వంటలతో మంచి భోజనం పెట్టారు, మధ్యలో రికార్డింగ్ డాన్సులు చేశారు”
“అది రికార్డింగ్ డాన్స్ కాదు, మ్యూజికల్ నైట్ అని వాళ్ళు పాటలు పాడుతూ డాన్సులు చేస్తారు.”
“పోనీలేవే అమ్మోరు గుడి దగ్గర డాన్సులు చూడకూడదని పోలీసోల్లు ఆపేశారు, గాని పంక్చన్ ఆల్లో, ఆడ మగా తేడా లేకుండా సినిమా ఆల్లోలా డాన్సులు చేశార” అని అసహనంగా అంది పోలమ్మ.
“అవ్వన్నీ ఇపుడు మామూలే, గానీ ఇందాక బొట్టు పెట్టి ఏదో మొదలు పెట్టి ఆపేశావు. అదేమిటో చెప్పు” అని ఆతృతగా అడిగింది మల్లి.
మంచం మీద వున్న గిప్టున్న కవరు తీసి ఇస్తూ “ఏమిచ్చారో చూడు!”
ఒక్కసారిగా గిఫ్ట్ తీసి చూసేసరికి మల్లికి కూడా కళ్ళు తిరిగినట్టు అనిపించి “ఇదేంటి?” ని ఆశ్చర్యంతో విస్మయానికి గురైంది.
“విడ్డూరం కాకపోతే . . . . మరి ఏమిటంటా? వున్నళ్ళో ఏవేవో కొత్త కొత్తయి పెడతా వుంటారు, మనలాంటి కూటికి లేనోళ్ళు కూడా రేపటి నుంచి మొదలెడుతున్నారు” తన వేధనను వెళ్ళగక్కుతూ “అదేదో అంటనారమ్మా! నాకు తెలియడం లేదు” అంది పోలమ్మ.
“రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు.” అంటూ “అయినా గానీ ఓ పోలప్పా! వంద రూపాయలు జాకెట్ ముక్క ఇస్తే …” సాగదీస్తూ మల్లి “కుట్టుకూలీ మూడువందలు అవుతుంది.”
“నిజమే కదా! కుట్టు…. కూ…లి పెరిగిపోయింది”
“దాంతో కుట్టించుకోకుండా ఇంట్లో వుంచుకుని ఎవరైనా మన ఇంటికి వత్తే, బొట్టు పెట్టి మళ్ళీ అదే ఇచ్చేత్తున్నారు కొంతమంది”
“అవునవును”
“దేనికి మ్యాచింగ్ అవ్వట్లేదు కదా అని తీసి బయట పడేయలేము”
“పాడేయలేకే కదా! కాటన్ బట్ట అయితే సామాన్లు తుడుచుకోవడానికి, పొయ్యి మీద వేడి సామాన్లు దింపటానికి వాడుతున్నాం” అంది పోలమ్మ.
“ఇలా వాడుకోకుండా చేస్తున్నారని ఇప్పుడు పల్లెటూరు పట్టణాలు తేడా లేకుండా ఆడవారందరూ వాడుకుంటున్నారని కొత్త పద్ధతి కనిపెట్టారేమో” ని సందేహం వ్యక్తపరిచింది మల్లి.
“కొత్తో ఓ వింత పాతో రోత!”
“పోలప్ప నువ్వు వాడుకోకూడదా ఈ రిటర్న్ గిఫ్ట్” అని వెటకారంగా అంది మల్లి.
“చాల్లే సంబడం, ఈ వయస్సులో..” అని కోప్పడింది పోలమ్మ.
“మరి బావ ఏమంటున్నాడు?”
“నీ ఇట్టం, వాడుకుంటే వాడుకో అంటున్నాడ” ని కొంచెం సిగ్గు పడుతూ అంది.
“నువ్వు వేసుకో పోలప్ప!” ని మొహమాట పెట్టింది. దానితో పోలమ్మ
“పెద్ద మనిషయ్యి నప్పటి నుండి ఇప్పటి వరకు పైట లేకుండా మీ బాయ ఎదరే తిరగలేదు. ఇప్పుడు ఏసుకుని తిరుగుతుంటే సిగ్గుగా వుండదా!”
“సిగ్గుగా వుంటే పైట బదులు, ఓ తువాలు కప్పుకో, రాత్రి అయితే మామూలుగా మాలాగే తిరిగేయి” మని సలహా ఇస్తూనే “పగలు పైట వేస్తే పైటీ, నైట్ పైట తీసేస్తే నైటీ” ని మల్లి నవ్వుతూ అంది .
“అలాగైనా సిగ్గుగా వుండదా!”ని అయోమయంగా అంది.
“మొదట్లో కొంచెం సిగ్గుగా ఉంటాది. అలవాటు అయిపోతే అదే సుఖంగా ఉంటుంది” ని మల్లి అనేసరికి పోలమ్మ మనస్సులో మార్పు కలిగి
“అంతే నంటావా!” అని మొహమాట పడుతూ అంది.
“అంతేగా! సాయంత్రం బావ వచ్చేటప్పటికి తానం చేసేసి వేసుకున్నావు అనుకో! నిన్ను ఎవరో దొరసాని అనుకుని, మనసు పారేసుకుంటాడు” ని ఆటపట్టించింది.
“చాల్లే! చాల్లేవే! నీ సమత్కారాల”ని సిగ్గు మొగ్గలవుతూ పోలమ్మ అనేసరికి
“చమత్కారాలు కాదు సమంత గారాలు లేవు” అంటూ “అయినా నీకు ఎలా ఉందో ఓసారి వేసుకోమ” ని ప్రోత్సహించింది మల్లి.
“అలాగే” నని కవర్ లోపలికి తీసుకెళ్లి ఐదు నిమిషాల్లో లైట్ పింక్ కలర్ శాటిన్ సిల్క్, స్కిన్ ఫిట్ టూ పీస్ మాక్సీ నైటీలో దగదగా మెరుస్తు బయటికి వచ్చింది పోలమ్మ.
“చూడగానే నాకే చాలా ముద్దొస్తున్నావు. చాలా బాగుంది ఈ నైటీ. వాళ్ళు ఎవరో కానీ ఇచ్చిన గిఫ్ట్ వేస్ట్ కాకుండా ఉపయోగించుకునేది ఇచ్చారే” అని కిలకలా నవ్వేసింది మల్లి.
“ఏం చేద్దాం ఇచ్చారు కదా!” ని ఇద్దరు పగలబడి నవ్వుకుంటున్నారు.
ఇంతలో పోలమ్మ భర్త రంగయ్య సంతలో కూరలమ్మి అలసిపోయి ఇంటికి చేరుకున్నాడు. రంగయ్య వెనుక నుండి చూడగానే ఎవరో దొరసాని వచ్చింది. మనకెందుకులే అని పెరటి వైపునున్న నూతి దగ్గరికి వెళ్ళి, కాళ్ళు కడుక్కుని వచ్చేసరికి ఒక్కసారిగా
“ఏందయ్యో! ఎలా ఉన్నాను?” పోలమ్మ అనేటప్పటికీ కంగుతిన్న భర్త మొహం ఏదోలా అయిపోయి
“నువ్వేనా పో… పో.. లమ్మా!” ని తడబిడపోతూ “ఎప్పుడు నిన్ను ఇలా చూడలేద” ని మురిసిపోయాడు.
అది చూసినా మల్లి “బావ! మా అక్క చూడు! ఎంత అందంగా ఉందో! నువ్వు ఇలాంటివి మంచివి కొని తేవాలి” అనగానే
“ఎందుకే మల్లి! ఎవరో ఒకరి ఇంట్లో పంక్చను జరిగినప్పుడు, ఇకపైన అందరూ ఇలాంటివి ఇత్తూ ఉంటారు” అన్నాడు రంగయ్య. తనకు తన భార్య ఓ దేవకన్యలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకూ ఎపుడూ ఆమెను అలా చూడలేదు. మనసంతా ఏదోలా అయిపోయింది. సినిమాలలో యాక్టర్ ను చూసినట్టు తనివి తీరా చూసుకుంటూ మురిసిపోతున్న రంగయ్యను చూసి,
“బావా! పక్కన నేను వున్నాను. మా అక్కను మొత్తం నువ్వు మింగేయకు!” అని వేళాకోళం ఆడింది మల్లి.
తన మాటతో ఈ లోకంలోకి వచ్చిన రంగయ్య సిగ్గు పడుతుంటే, “పోలప్పా!నేవెళ్ళొత్తాను. మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు అడ్డం?” అంటూ అక్కడ నుండి జారుకుంది మల్లి.
వాడుకునే రిటన్ గిఫ్ట్ ఇచ్చిన రాజారావుగారిని మెచ్చుకోవాలి అనుకుంటూ తన భార్య అందాన్ని చూసి మురిసిపోయాడు. వారం రోజుల తర్వాత రాజారావు గారింటికి కూరగాయలు ఇవ్వడానికి రంగయ్య వెళ్ళాడు. చాలా సంవత్సరాలుగా వారింటిలో కూరగాయలు ఇవ్వడంతో వాళ్ళింట్లో మనిషిగా వుండే రంగయ్య, రాజారావు గారి భార్య రాణితో “మొన్న మీ ఇంట్లో పంక్చనుకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుందమ్మా! మా పోలమ్మ వేసుకుని చాలా సంబరపడిపోయింది” అన్నాడు.
“ఏమిటీ! మేము ఇచ్చిన సిల్వర్ గ్లో ఎలిగెంట్ గ్లాసుల సెట్ వేసుకుని మురిసి పోవడమేమిటి?” ఏమీ అర్థం కాకపోవడంతో రాణి సంధిగ్దంగా అడిగింది.
“అదేనమ్మా! మీరిచ్చిన రిటన్ గిఫ్ట్”
“గ్లాసులో వేసుకోవడమేమిటి?
“గ్లాసు కాదమ్మ మీరిచ్చిన నైటీ!” అనగానే
ఒక్కసారిగా రాణి మైండ్ బ్లాక్ అయ్యి “ఏమిటీ! నైటీయా!” అంది.
“అవునమ్మా నైటీయే!”ని సాగదీసాడు రంగయ్య.
“అయ్యో! రంగయ్య మేము ఇచ్చినవి సిల్వర్ కోటెడ్ గ్లాసులు సెట్. ఫంక్షన్ టైములో కొన్న కొత్త నైటీ ఏమైపోయిందో అని ఇల్లంతా వెదికాము. ఏమి అయ్యి పోయిందో బాధ పడ్డాము. పొరపాటున రెండు వందల రూపాయల గిఫ్ట్ బాక్సులలో రెండువేల నైటీ బాక్స్ కలిసిపోయి మీకు వచ్చిందా!” అని ఆశ్చర్యపోయింది.
“అమ్మాగారు! ఏమి చేయమంటారు? మా ఆవిడ వాడేసుకుంటుంది” అని బాధగా అన్నాడు.
“పోనీలే రంగయ్య ఎన్నో ఏళ్ళుగా మాలో ఒకడిగా వున్నవాడివి, మీ ఆవిడకు పెట్టుబడి చీర ఇద్దామనుకున్నాను, హడావిడిలో పోలమ్మ నాకు కనబడకుండా వెళ్ళిపోయింది. పోనీలే అనుకోకుండా మీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ వాడుకోమను” సంతోషంగా అంది రాణి.
రంగయ్య ఇంటికి వెళ్ళేటప్పటికి తనకన్న తక్కువ వళ్ళు వున్న రాణి గారి సైజు నైటీ, పోలమ్మ వేసుకోవడంతో తన వంటి షేపులన్నీ అజంతా శిల్పంలా కనబడుతుంది. శాటిన సిల్క్ బట్ట కావడంతో వంటి మీద బట్ట వున్న లేనట్టు శరీరం కనిపిస్తుంది. అలా నైటీలో మెరిసిపోతున్న పోలమ్మను చూసి, జరిగిన విషయం చెప్పడంతో రంగయ్య, పోలమ్మ రిటర్న్ గిఫ్ట్ గురించి మనసారా నవ్వుకున్నారు.