స్నేహ ధర్మం - భానుశ్రీ తిరుమల

Snehadharmam

"మోహన్ ఈ రోజు నిన్నకొక సారి కలవాలి,ఆఫీసు కు వచ్చిన వెంటనే నా క్యాబిన్ కి రాగలవా! టిఫిన్ చేస్తూ మాట్లాడకుందాం, సరే ఉంటాను".. ఫోన్లో అటునుంచి రామారావు అభ్యర్థన లాంటి ఆర్డర్. రామారావు మోహన్ పని చేస్తున్న కంపెనీకి ఓనర్. రామారావు, మోహన్ కి ఓనర్ కాక ముందే మంచి స్నేహితుడు.. బాల్య స్నేహితుడు.. రామారావు,మోహన్ ఒక ఊరివారే.. ఇద్దరూ కలిసి చదువుకున్నారు..బంధుత్వం కూడా ఉంది. ఇద్దరి డిగ్రీ పూర్తి అయిన తరువాత.. రామారావు చిన్న,చిన్న ఉద్యోగాలు చేస్తూ చివరికి ఓ చిన్న వ్యాపారం ప్రారంభించి...అంచెలంచెలుగా ఎదిగాడు. మోహన్ మాత్రం గవర్నమెంట్ స్కూలు టీచర్ గా సొంత ఊళ్లోనే ఉండి పోయాడు. రామారావు వ్యాపారాలలో ఇంతింతై వటుడింతై అన్నట్టు వివిధ కంపెనీలు స్థాపించి ఆ రాష్ట్రంలోనే ఓ ప్రముఖ వ్యాపార వేత్తగా ఎదిగాడు.. తొలి రోజుల్లో విస్తరిస్తున్న వ్యాపారాలను చూసుకోవటానికి నమ్మకస్తులు,తెలిసిన వారైతే బాగుంటుందని మెహన్ ని ఉద్యోగం మానేసి తనతో వచ్చేయమని చాలాసార్లు అడిగి చూసాడు. కానీ మోహన్ ధైర్యం చేయలేక పోయాడు. ఎందుకంటే తను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం.. ఏదైనా తేడా వచ్చి మళ్లీ వెనక్కి రావలిసి వస్తే, మళ్లీ ఇటువంటి ఉద్యోగం దొరకదు కదా.. అని ఆలోచించి చాలా సార్లు మిత్రుని ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించే వాడు. మెత్తం మీద ఓ పదిహేను సంవత్సరాలు టీచరుగా ఉద్యోగం చేసాడు మోహన్. రామారావు మోహన్ కి వ్రాసే ఉత్తరాలలో చాలా సార్లు ఇదే విషయాన్ని ప్రస్తావించే వాడు,కానీ ఓ సారి స్వగ్రామం వచ్చినపుడు మోహన్ దగ్గర ఓ ప్రతిపాదన తీసుకొచ్చాడు. అదేమిటంటే ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి తనతో వచ్చి, సౌకర్యంగా ఉంటే తనతో ఉండటానికి,లేదనిపిస్తే తిరిగి వచ్చి తన ఉద్యోగం చేసుకోవచ్చని. ఆ ప్రతిపాదనను కాదనటానికి మోహన్ కి కారణం కనిపించలేదు. పైగా తన మిత్రుని పైన,తను సాధించిన విజయాలపైన మోహన్ కి నమ్మకం కుదిరింది. స్నేహితునితో పయనించడానికే నిర్ణయించుకుని నగరానికి చేరాడు. మోహన్ కి కీలకమైన బాధ్యతలను అప్పజెప్పాడు రామారావు. వ్యాపార విస్తరణ లో భాగంగా వివిధ నగరాలలో కంపెనీ కట్టే భవంతుల నిర్మాణ కార్యక్రమాలను సమీక్షించడం , నాణ్యతా ప్రమాణాలు తగ్గ కుండా చూడటం వంటి పనులు.. సంస్థలో రామారావుతో సరిసమానంగా మోహన్ ను గౌరవించేవారందరు. కాలం నదిలా సాగిపోతునే ఉంది. మోహన్ టీచర్ గా ఉంటే పొందే స్థాయి,పరపతి కన్నా ఎక్కువే పొందాడు. సంతృప్తి కరమైన జీవితమనే చెప్పాలి. తనతో పాటు సంస్థలోకి వచ్చిన రామారావు దగ్గర బంధువులు చాలా మంది ఆ సంస్థలో ఇమడలేకో ,మరే ఇతర కారణాల వలనో బయటకు వచ్చేసారు. మోహన్ మాత్రం తన ఉనికిని చాటుకుంటూ, తన గౌరవాన్ని నిలుపుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో కొనసాగుతున్నాడు. ఈరోజు రామారావు పిలుపు మేరకు అతనిని కలవడానికి ఆఫీసుకు వెళ్లాడు మోహన్. మోహన్ ని సాదరంగా ఆహ్యానించి టిఫెన్ పూర్తి చేసిన ఇద్దరు ఆఫీసులో కూర్చున్నాక.."ఏం లేదు మోహన్ నేను మన ఆఫీసుకు దగ్గరలో ఈ మధ్యనే కొన్న స్థలంలో ఇళ్లు కట్టుకుని షిప్ట్ అవుదామనుకుంటున్నాను, అక్కడ ఉన్న పాత ఇంటిని కూల్చి అన్ని ఆధునిక హంగులతో మన స్థాయికి తగ్గట్టుగా ఓ పెద్దిల్లు నీవు నాకు కట్టివ్వాలి. మంచి రోజు చూసి పని ప్రారంభిద్దాం, నా పుట్టిన రోజు నాటికి ఇల్లు రెడీ అయిపోతే బాగంటుందనుకుంటున్నాను,ఏం అంటావు మోహన్"... మోహన్ నవ్వుతూ "సరేనండి మీరు చెప్పాక తప్పుతుందా అలానే చేస్తాను‌, ఇక నేవెల్లొస్తానని"..., చెప్పి మోహన్ బయలుదేరాడు.. ఓ మంచిరోజు చూసి పని ప్రారంభించి అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా ఇంటిని అనుకున్నా సమయం కన్నా ముందే పూర్తి చేసిచ్చాడు మోహన్. రామారావు పుట్టిన రోజు ఇంకా వారం రోజులే ఉంది. కానీ గృహ ప్రవేశం గురించి ఇద్దరి మధ్య ఎటువంటి చర్చా రాలేదు. మోహన్ ఒకటి రెండు సార్లు అడిగి చూసాడు.. "ఇప్పటికి వాయిదా వేద్దాం. నా పుట్టినరోజు నాడు గృహప్రవేశం ఎప్పుడనేది చెబుతాను" .. అని మాట దాట వేసే వాడు రామారావు. రామారావు పుట్టినరోజు రానే వచ్చింది. నగరానికి చెందిన ఎందరో రాజకీయ, సినీ ప్రముఖులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు ఘనంగా జరిగింది. హడావిడి సద్దుమణిగాక రామరావు.. మోహన్ ని పిలిచి "మోహన్ ఇవిగో మన కొత్త ఇంటి తాళాలు,ఆ ఇంట్లో నీవే ఉండ బోతున్నావు. నీవు కాదనవని నమ్మకం. నిజానికి నీకు ఎటువంటి లోటు లేదు కానీ ఎందుకో నీవుంటున్న ఇల్లు చిన్నదనిపిస్తోంది, అందుకే నా సంతృప్తి కోసం నీకిది కానుకగా ఇస్తున్నాను !మిగతా ఫార్మాలీటీసన్నీ రెండు రోజుల్లో పూర్తి చేద్దాం".. మోహన్ కి ఏమనలో అర్థం కాలేదు. ఇది కలా,నిజమా అనిపిస్తుంది. "అదేంటండి,నాకెందుకు ఇంత పెద్ద ఇల్లు,నేనుంటున్న ఇల్లు సౌకర్యం గానే ఉందిగా! .. "మోహన్ ఒద్దు అనొద్దు,ఇన్నేల్లుగా నీవీ కంపెనికి చేసిన సేవలకు గుర్తింపుగా,నా ప్రియమైన స్నేహితునుకి నానుండి ఓ చిన్న బహుమతి అనుకో!" అంటూ మోహన్ ని కౌగలించుకొని భుజం తట్టాడు రామరావు. మోహన్ తన మిత్రుని ఔదార్యాన్ని చూసి గుండె బరువెక్కి, ఉద్వేగానికి గురి అయ్యాడు. " సరేనండి మీరు చెప్పాక తప్పుతుందా! అంటు నవ్వేసాడు. "అదిసరే!ఈ ఇళ్లు నా కోసమే కట్టిస్తున్నప్పుడు, ఆ విషయం ముందే చెప్పొచ్చుగా.." మోహన్ తన సంధేహాన్ని వ్యక్త పరిచాడు. "మోహన్, ఆ ఇళ్లు నాకోసం అని చెప్పాను కాబట్టి నీవు అంత బాగా కట్టించావు. అదే నీకోసం అని చెబితే నీవు ససేమిరా అనవూ!,పోనీ నా బలంవంతంపైన ఒప్పుకున్నా, నీకోసం అని తెలిసిన తరువాత, బహుశా ఇంత బాగా కట్టిస్తావనుకోను. దానికి చాలా కారణాలుంటాయి,అయిన నీకోసమే అని నేనంటే ఇల్లు ఇంత బాగా కట్టుకుంటావా మిత్రమా!.." అన్నాడు రామారావు చిరు ధరహాసంతో. మోహన్ కళ్లు ఆనందభాష్పాలను వర్షిస్తున్నాయి.కళ్లలో చిక్కటి నీటి పొరలు అలుముకున్నా, ఆ కళ్లకు తన ప్రియ మిత్రుడు చాలా విశాలంగా కనిపిస్తున్నాడు.

మరిన్ని కథలు

Daparikam
దాపరికం
- వరలక్ష్మి నున్న
Thotakoora naade..
తోటకూరనాడే...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nishani
నిశాని
- DR Bokka Srinivasa Rao
Vachhindi ashadha masam
వచ్చింది ఆషాఢమాసం
- తాత మోహనకృష్ణ
Kathalo daagina katha
కథలో దాగిన కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neeve naa mantri
నీవే నామంత్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు