ప్రేమ - Dr. మజ్జి భారతి

Prema

"కొత్తగా మన ఆఫీసులో చేరిన అమ్మాయి చాలా ఎఫిషియెంట్ అని విన్నాను. చాలా అందంగా ఉంది. నీకు సరైన జోడి. ఎవరూ ఆ అమ్మాయిని ట్రై చేయకముందే, నువ్వు ప్రపోజ్ చెయ్యాలి." రాజేష్ ని హెచ్చరించాడు వంశీ. రాజేష్ కు మంచి స్నేహితుడు వంశీ. అతనికి ఈ మధ్యనే పెళ్లయింది. "చూద్దాంలేరా!" అన్నాడే గాని, వంశీ ఇంతగా చెప్తుంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందోనన్న కుతూహలం మనసును ఆవరించింది రాజేష్ కు. మేనేజరు ఆఫీసులో అందరినీ పరిచయం చేస్తున్నాడు ఆ అమ్మాయికి. "రాజేష్! ఈమె కొత్తగా మన ఆఫీసులో చేరారు" మేనేజర్ మాట విని తలెత్తి చూసిన రాజేష్ షాక్ తిన్నాడు. ఎదురుగా 'సంజూ'..... సంజన. అప్రయత్నంగా ఎడమ చెంపను చేరింది చేయి. సంజన కళ్ళు కోపంగా చూస్తున్నాయి. అంటే సంజన ఇంకా ఆ విషయం మర్చిపోలేదన్నమాట. ఆ సంఘటన జరిగి ఏడేళ్లు గడిచిపోయాయి. నిన్న కాక మొన్నే జరిగినట్లు అనిపిస్తుంది. ఆ విషయం జరగకపోయుంటే..... బాధగా మూలిగింది మనసు. అందరితో నవ్వుతూ మాట్లాడే సంజన, రాజేష్ ని చూడగానే తెలియనట్లు ముఖం తిప్పుకుంటుంది. ఎదురుపడితే వాడిగా చూస్తుంది. ఆ చూపుల వేడి తట్టుకోలేక, సంజనకు ఎదురుపడకుండా ఉండడానికి, ప్రయత్నిస్తున్నాడు రాజేష్. ఆఫీసు విషయాలలో ఎదురుపడి మాట్లాడాల్సివస్తే సంజన కళ్ళలోకి చూడకుండా, ముఖం పక్కకు తిప్పుకొని, పని కానిచ్చేస్తున్నాడు. అందంగా, హుందాగా ఉండే సంజన కనుసన్నల్లో పడాలని అందరూ... ముఖ్యంగా బ్రహ్మచారులు ఆరాటపడుతుంటే, ఆమెకు ఆమడదూరంలో ఉండాలని రాజేష్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడో.... పొరపాటున ఎదురుపడితే ఎందుకు ముఖం తిప్పుకుంటున్నాడో.... ఎంత ఆలోచించినా అర్థంకావడం లేదు వంశీకి. అడిగితే "అబ్బే అదేం లేదు. నువ్వెక్కువ ఊహిస్తున్నావు" అని కొట్టిపడేసాడు రాజేష్. **** "ఒరేయ్! ఈ శనివారం ఏ పని పెట్టుకోకు. అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం మనం" అమ్మ మాటలు విన్న రాజేష్ మనసులో సంజన మెదిలింది. తల విదిల్చుకున్నాడు. "ఆ అమ్మాయి ఎక్కడ పని చేస్తుందంటే... " కాసేపు ఆగి, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి, "నీ ఆఫీసు మాత్రం కాదులే" ముక్తాయించింది అమ్మ. "అమ్మయ్య! పెళ్లి చూపుల్లో సంజనకు ఎదురు పడక్కరలేదు" అనుకున్నాడు. కాని మనసులో ఎక్కడో బాధ... ఇదమిద్దమని చెప్పలేకుండా. సంజన గుర్తుకొస్తుంటే గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్న బాధ... ఆమె చూపులు గుర్తుకొస్తుంటే మాత్రం "పోనీలే ఇదే మంచిదేమో!" అన్న భావం. మనసును ఎంత సరిపెట్టుకుందామనుకున్నా.... తెలియని బాధేదో గుండెల్ని పొడుస్తూనే ఉంది. "ఒరేయ్ మామూలుగా ఉండరా! లేకపోతే ఈ సంబంధం చూడడం నీకిష్టం లేదని వాళ్ళనుకోగలరు" రాజేష్ ముఖం చూసిన వాళ్ళమ్మ హెచ్చరిస్తూనే ఉంది. ముఖానికి నవ్వు పులుముకొని అందరితో పాటు అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. "అమ్మాయి అందంగా ఉంటుంది. మంచి ఉద్యోగం" మధ్యవర్తి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి రాజేష్ కి. "తను కోరుకున్న అమ్మాయి కానప్పుడు, ఎవరైనా ఒకటే! ఒకే చెప్పేస్తాను" మనసులోనే అనుకున్నాడు రాజేష్. తీరా అమ్మాయిని చూసేసరికి, మిన్ను విరిగి మీద పడ్డట్లైయింది. ఎదురుగా తీక్షణంగా చూస్తూ.... సంజన. అప్రయత్నంగా ఎడమ చెంపను తడుముకున్నాడు. అది చూసిన సంజన కళ్ళు నిప్పులే కక్కాయి. అందరితోనూ నవ్వుతూ, మర్యాదపూర్వకంగా, ఆత్మీయంగా మాట్లాడుతూ.... తనను చూడగానే నిప్పు కణికలు కురిపిస్తూ.... ఎంత తొందరగా అక్కడినుండి బయటకెళ్లి పోదామా అనిపించింది రాజేష్ కి. ఇంట్లో అందరికీ తెగ నచ్చేసింది సంజన. "ఏరా నువ్వేమంటావు?" మాట వరసకు అడిగింది అక్క. సంజనను చూశాక కాదని చెప్పలేడన్న ధైర్యంతో ఉంది ఆమె. "ఏమని చెప్పాలి?" మనసు డోలాయమానంలో పడింది. "నాకిష్టం లేదని చెప్పనా, లేక మీ ఇష్టం, అని చెప్పనా?" మనసు ఏ నిర్ణయం తీసుకోలేక పోతుంది. సంజన చూపులు గుర్తుకొస్తే.... "ఈ సంబంధం వద్దు" అని చెప్పెయ్యాలనిపిస్తుంది. ఆ మాట బయటకు రాకుండా మనసులో ఏదో ఆపుతోంది. కాని "సంజనను చేసుకుంటే తన జీవితం.... ? అలాగని సంజనని కాదని చెప్పగలడా? అవునూ! ఎంతసేపూ తనవైపు నుండే ఆలోచిస్తున్నాడు. కాని అసలు సంజనకు తనను చేసుకోవడం ఇష్టమో! కాదో! ఇష్టం ఉండి ఉండదు. అందుకే కదా! అప్పుడలా! ఇప్పుడిలా! ఒకవేళ... సంజన నచ్చిందని చెబితే... ఏమౌతుంది? ఇష్టం లేని పెళ్లి సంజన చేసుకుంటుందా? ఒకవేళ చేసుకుంటే... మా ఇద్దరి జీవితాలు ఎలా ఉంటాయి? ఎడమొహం పెడమొహంతో జీవితాంతం కలిసుంటామా?" నిట్టూర్చాడు. ఆలోచనలు ఎంతకీ తెగడం లేదు. **** "అమ్మాయి నచ్చిందా? ఎక్కడ జాబ్ చేస్తుంది?" అమ్మాయిని చూడడానికి రాజేష్ వెళ్లాడని తెలిసిన వంశీ ప్రశ్నలు. ఏమని చెప్తాడు వంశీకి? ఇప్పుడు కూడా సంజన ప్రవర్తన ఆఫీసులో ఏమీ మారలేదు. అలాగే వాడిగా వేడిగా చూస్తూ.... "ఏరా! మధ్యవర్తికి ఏమని చెప్పమంటావు? ఇప్పటికైనా మన నిర్ణయం చెప్పకపోతే మర్యాదగా ఉండదు. అవునూ! ఆ అమ్మాయి మీ ఆఫీసులోనే ఉద్యోగం చేస్తుందట కదా! ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయి వచ్చిందట కదా! మధ్యవర్తి చెప్పాడు. నీకా అమ్మాయి బాగానే తెలిసి ఉంటుంది కదా! ఏమన్నా మాట్లాడుకున్నారా? ఏమని చెప్పమంటావు?" అన్న అమ్మ ప్రశ్నకు "మీ అందరికీ ఇష్టమైతే, నాకిష్టమే" అన్న మాటలు అప్రయత్నం గా రాజేష్ నోటినుండి వచ్చాయి. "నేను ముందే చెప్పాను కదా! అమ్మాయి వాడికి నచ్చుతుందని " వెనకనుండి అక్క. "సంబంధం ఇష్టమేనన్న తన నిర్ణయం విన్నాక సంజన ఎలా స్పందిస్తుంది? ఆమెకు తనంటే ఇష్టం లేదని తెలిసి కూడా, ఓకే చెప్పినందుకు, ఆమె మనసు ఎంత రగిలిపోతుందో తనమీద? ఆ కోపం తనమీద ఎలా చూపిస్తుందోనన్న భయంతో మనసు బిక్కు బిక్కుమంటుంది. ఆమెకు ఎదురు పడాలంటే కాళ్లు చేతులు వణుకుతున్నాయి. ఎదురుపడితే చురచుర చూపులు తప్పించి... రాజేష్ అనుకున్నట్లు యింకేమీ జరగలేదు. అమ్మయ్య అనుకున్నాడు. కానీ ఈ ప్రచ్ఛన్నయుద్ధం ఎన్నాళ్లు తమిద్దరి మధ్య? సమాధానం తెలియని ప్రశ్న రాజేష్ మనసులో. తన భయాలను ఎవరితోనూ పంచుకోలేడు. అప్పటికీ వంశీ అడుగుతూనే ఉన్నాడు, ఎందుకలా ఉన్నావని? ఏమి చెప్పగలడు తాను. ఏమి జరగాలని ఉంటే అదే జరుగుతుంది. భయపడి చేసేదేముంది తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు రాజేష్. **** "ఇంకో పదిరోజులలో సంజనగారి పెళ్ళట. ఆ అదృష్టవంతుడెవరో " ఆఫీసంతా ఇదేమాట. తనకి తప్పించి అందరికీ శుభలేఖలు ఇచ్చింది సంజన. శుభలేఖ చూసిన ఎవరూ తననేమీ అడగలేదు. అదెలా సాధ్యం. కొంపదీసి... ఒక్కసారి గుండె క్రిందకు జారిపోయినట్లనిపించింది. పెళ్ళికొడుకు వేరే ఎవరోనా.... అంతే అయి ఉంటుంది. లేకపోతే ఈ సారికి అందరూ తనను చుట్టుముట్టెయ్యరూ, అభినందనలు చెబుతూ! పెళ్ళికొడుకు ఎవరో! ఎవరినడుగుతాడు? ఆఖరికి రమేష్ గదిలోని శుభలేఖను దొంగతనంగా తీసుకున్నాడు. కాని శుభలేఖ విప్పి చూడాలంటే.... మనసులో బాధ సుడులు తిరుగుతోంది. తనకు పట్టాల్సిన అదృష్టం ఎవరికో...ఆ అదృష్టాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు తనే. వణికే చేతులతో శుభలేఖను ఓపెన్ చేశాడు. చాలా సింపుల్ గా "నా జీవిత భాగస్వామితో, తొలిసారి ఏడడుగులు నడిచే తరుణంలో, మీ అందరి శుభాకాంక్షలు కోరుకుంటున్నాను నేను" అని, ముహూర్త సమయం, పెండ్లివేదిక ఎక్కడో.... అవే ఆ శుభలేఖలో ఉన్నాయి. చేజారిన అదృష్టం చేతికందినట్లయింది. రెండు చేతులతో ఆ శుభలేఖను అపురూపంగా పట్టుకొని, గుండెలకు హత్తుకున్నాడు. అలా ఎంతసేపు ఉన్నాడో! సెక్యూరిటీ గార్డ్ వచ్చి పిలిస్తే గాని, సమయం తెలియలేదు. ***** సంజన ఆఫీసుకు సెలవు పెట్టినంతవరకూ ఆగి అప్పుడు తన పెండ్లి శుభలేఖలు ఆఫీసులో పంచాడు రాజేష్. సహ ఉద్యోగులందరూ అభినందనలలో ముంచెత్తారు, సంజనను చేసుకునే అదృష్టవంతుడు రాజేష్ అయినందుకు. ఈ విషయం... పెండ్లి కుదిరిందని... అదికూడా సంజనతో అని.... ఇంతవరకూ తనకు కూడా చెప్పనందుకు దాదాపు కొట్టినంత పని చేశాడు వంశీ. ఆపై చాలా సంతోషించాడు. **** పెండ్లిలో ఫోటోలకు చక్కని ఫోజులిస్తూ, పెండ్లి తతంగాన్ని ఆస్వాదిస్తూ, అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉండే సంజన, రాజేష్ చూపులతో తన చూపులు కలపాల్సి వస్తే మాత్రం కోపంగానే చూసేది. ఎవరూ ఆ విషయం గమనించకుండానే పెళ్లి జరిగిపోయింది. తాళి కట్టేశాక ఊపిరి పీల్చుకున్నాడు రాజేష్. అమ్మయ్య! సంజన ఇక తనది. సంజన ఏం చేసినా, ఎలా ఉన్నా పర్వాలేదు. కాని తన ప్రక్కన ఉంటే చాలు, ఈ జీవితానికి. **** తొలి రాత్రి. ఎవరూ లేకుండా... తామిద్దరే.... ఏకాంతంగా.... ధైర్యంగా కళ్ళెత్తి చూసాడు సంజనను. అవే చూపులు కోపంగా.... అప్రయత్నంగా ఎడమ చేయి చెంపను తడిమింది. "చెయ్యి దించు. చెయ్యెత్తావంటే చంపేస్తాను" సంజన మాటలో కాఠిన్యం. ముఖంలో కోపం. అప్పటిలాగే. సంజన మాట విని బుద్ధిమంతుడిలా చేతులు కట్టుకొని నిల్చున్నాడు రాజేష్. చెయ్యెత్తింది సంజన. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఏడు సంవత్సరాల క్రిందట ఇలాగే... తన చెంప ఛెళ్ళుమనిపించింది. ఆరోజు తెల్ల కలువలా ఉండే సంజన ముఖం, ఎర్రకలువను తలపించింది. తానస్సలు ఊహించనిది. మహ అయితే తిడుతుందనుకున్నాడు. అంతేకాని అలా చెంప పగలగొట్టేస్తుందని అనుకోలేదప్పుడు. తాను చేసిన నేరం.... ప్రేమలేఖ ఇవ్వడం... " నువ్వెంతో ప్రత్యేకం అనుకున్నాను. కాని మగాళ్ళందరూ.... ఇంతే.... నువ్వూ అందరి మగాళ్ళలాగే...ఛీ.. " చీదరించుకుంది తనను. అప్పుడు తామిద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఆర్మీలో పనిచేసే నాన్న... ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉంటే, ఇంటర్మీడియట్ కోసం మేనమామ ఇంట్లో పెట్టారు తనను. చిన్నప్పటినుండి తాతగారి ఇంట్లో పెరిగిన సంజన... ఇంటర్మీడియట్ అక్కడే. ఎందుకో తెలియదుగాని, తామిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కలిసే చదువుకునేవారు. ఎప్పుడు చూసినా కలిసే ఉండేవారు. అటువంటిది తన క్లాస్మేట్ ఒకడు, పరీక్ష ఆఖరి రోజున సంజనకు ప్రేమలేఖ ఇవ్వబోతున్నాడని తెలిసి.... తన మనసేమిటో సంజనకు తెలియకపోతే... ఒకవేళ... వాడికి ఓకే చెప్పేస్తుందేమోనన్న భయంతో... తానిచ్చాడు ప్రేమలేఖ. అంతే! తన చెంప ఛెళ్ళుమంది. ఆ తర్వాత సంజన తనతో మాట్లాడలేదు. చూడను కూడా చూడలేదు. మరల ఆఫీసులోనే కలవడం.... ఇంకా సంజనకు అప్పటి కోపం మిగిలిపోయిందేమో! కొట్టనీ...సంజన కోపం తీరినవరకూ తనను ఆ చెంపా, ఈ చెంపా వాయించనీ... మనసులోనే నిశ్చయించుకున్నాడు. నిశ్చలంగా కళ్ళు మూసుకొని నిల్చున్నాడు. "కళ్ళు తెరువు" సంజన మాటలు పిడుగుల్లా. కళ్ళు తెరిచిన రాజేష్ కు ఎదురుగా అపర భద్రకాళిలా సంజన. "ఇది అప్పుడు నువ్వు చేసిన పనికి" అంటూ ఎడమ చెంప ఛెళ్ళుమనిపించింది. కదలకుండా అలానే నిల్చున్నాడు రాజేష్. "ఎందుకు కొట్టానో తెలుసా?" సంజన. "తెలుసు. ప్రేమలేఖ ఇచ్చినందుకు" "కాదు. ఇన్ని సంవత్సరాలూ మన స్నేహాన్ని దూరం చేసినందుకు" అంటూ "ఇది ఇప్పుడు నువ్వు చేసిన పనికి" అని ఇంకో చెంప ఛెళ్ళుమనిపించింది. చెంప మీద రాసుకుంటూ "ఇప్పుడు నేనేమీ చెయ్యలేదు కదా?" అన్నాడు రాజేష్ "అందుకే! ఏమీ చెయ్యనందుకే! ప్రేమలేఖ ఇచ్చి అప్పుడు మన స్నేహాన్ని దూరం చేశావు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినా, ఏమీ చెయ్యకుండా దూరంగా ఉన్నావు. అందుకే కొట్టాను" అని "ఇప్పుడు కళ్ళు మూసుకో" ఆజ్ఞాపించింది సంజన. ఇప్పుడేమి చెయ్యబోతుంది... రాజేష్ మనసులో కలవరం. కళ్ళు మూసుకున్నాడు. ముందు.... సంజన శ్వాస వెచ్చగా తగిలింది. ఆ తర్వాత.... సంజన లేత పెదవుల తడి.... చల్లగా.... తన చెంపపై. ఇది కలా! నిజమా! తన ఎదురుగా సంజన ఉందా! లేక నిలబడే తను కలలు కంటున్నాడా? నెమ్మదిగా కన్నులు విప్పి చూసాడు. ఎదురుగా సంజన.... తన స్నేహితురాలు... నవ్వుతూ.... "సంజనా! ఇది నిజమేనా!" చెంపను వేలితో చూపిస్తూ అడిగాడు. "నేను నీతో మాట్లాడకపోయినా, కోపంగా ఉన్నానని తెలిసినా, నాతో పెళ్లికి ఒప్పుకున్నందుకు" అంటూ ఇంకో చెంపను ముద్దాడింది సంజన. అడగకుండా వరాలిస్తున్న తన ప్రణయ దేవతను దగ్గరకు తీసుకోబోయాడు. "ఆగాగు" అడ్డు తగిలింది సంజన. " నీ కోపం పోయింది కదా! ఇంకా ఏమిటి సంజూ?" అడిగాడు రాజేష్. "ఇన్నాళ్లూ పోగొట్టుకున్న స్నేహం చిగురించనీ ముందు. ఆ తర్వాతే ప్రేమ" కండిషన్ పెట్టింది సంజన.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల