సప్తపురి దర్శనం - కందుల నాగేశ్వరరావు

సప్తపురి దర్శనం

సప్తపురి దర్శనం

పూర్వం మథురా నగరంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు. వేద శాస్త్ర పారంగతుడు. ధర్మ శాస్త్రాలు, పురాణాలు కూలంకషంగా పరిశీలించాడు. నాట్యం, మంత్రశాస్త్రం, తర్కశాస్త్రాలను అభ్యసించాడు. పలు బాషలు నేర్చాడు. తను అభ్యసించిన ధర్మాన్ని నిజ జీవితంలో ఆచరించాడు. ధర్మమార్గంలో ధనాన్ని సంపాదించి అత్యున్నతమైన జీవితాన్ని గడిపాడు. యవ్వనంలో పూర్తి ఆరోగ్యంతో భోగభాగ్యాలను అనుభవించాడు. పుత్ర సంతానాన్ని పొందాడు. తను సంపాదించిన ఆస్తులను సంతానానికి పంచిపెట్టాడు.

కాలం ముందుకు సాగింది. కాలానుగుణంగా శివశర్మ యవ్వనం అంతరించి, వార్ధక్యం సమీపించింది. మనవళ్ళు, మనవరాళ్ళతో సరదాగా కాలం గడిపాడు. కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజు ఒంటరిగా కూర్చొని ఆలోచించసాగాడు.

“పుట్టిన దగ్గర నుండి ఇంత వరకూ నా జీవితం విద్యను అభ్యసించడం, ధనాన్ని ఆర్జించడం, కుటుంబాన్ని పోషించడం, యవ్వనాన్ని అనుభవించడం మొదలైన నిత్యకృత్యాలతో గడిచిపోయింది. ధర్మశాస్త్రాలన్నీ నేర్చాను కాని ఎన్నడూ తీర్థయాత్రలుచేయలేదు. విశ్వనాథుణ్ణి కొలవలేదు. గోపాలకృష్ణుణ్ణి దర్శించలేదు. గణేశుని పూజించలేదు. జగన్మాతను కొలవలేదు. మునులకు మ్రొక్కలేదు. దానాలు చేయలేదు. చెరువులు త్రవ్వించలేదు. ఈ మేడలు, ఆస్తులు, పొలం, పంట, బంగారం, ధనం ఏవీ నా మరణం తరువాత నాతో రావు.”

“నా కంటికి పొరలు కమ్మకముందే, చెవుల వినికిడి తగ్గకముందే, దేహం వణకడం మొదలెట్టకముందే, దంతాలు ఊడి నోరు బోసిపోకముందే, నా స్వరపేటిక మూతపడకముందే, మెదడు మొద్దుబారి మతిమరుపు సోకకముందే, నా చేతులు కాళ్ళు ఇంకా నా స్వాధీనంలో ఉన్నప్పుడే, మృత్యుదేవత నీడ నామీద పడకముందే తీర్థయాత్రలు చేసి పుణ్యాన్ని సంపాదించాలి” అని భావించాడు.

మరునాడు తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరాడు. రెండు మూడు రోజులు ప్రయాణం చేసిన తరువాత అలసట తీర్చుకోవడానికి ఒక మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకొంటూ “దేశంలో ఎన్నో పుణ్య స్థలాలు, పుణ్యతీర్థాలు ఉన్నాయి. మిగిలిన నా జీవితంలో ఆ తీర్థాలు అన్నింటిని దర్శించి తరించే సమయం లేదు. ప్రాణం నీటిబుడగ లాంటిది. ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుసు? శాస్త్రాల్లో చెప్పినట్లు ముందు మోక్షసాధకాలైన సప్తపురులను సందర్శిస్తాను” అని తలలో తాను తర్కించి నిర్ణయించుకున్నాడు.

“అయోధ్య మథుర మాయా కాశీ కంచి

అవంతికాపురి ద్వారవతి చైవ సప్తైత మోక్షదాయికా॥”

అయోధ్య, మథుర, హరిద్వారం, కాశీ, కంచి, ఉజ్జయినీ, ద్వారక, అనే సప్తపురులు (ఏడు పుణ్య క్షేత్రాలు) మోక్షలక్ష్మీ మందిరాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇలా అనుకొని శివశర్మ మొదట అయోధ్య వెళ్లాడు. సరయూ నదిలో స్నానం చేసి శ్రీరామచంద్రుణ్ణి దర్శించాడు. అక్కడ నుండి ప్రయాగ వెళ్ళాడు. అది ప్రజాపతి క్షేత్రం. యాగాల కంటే ప్రసిద్ధమైనది కాబట్టి ఆ పట్టణానికి ‘ప్రయాగ’ అనే పేరు వచ్చింది. ప్రయాగలో త్రివేణీ సంగమస్థానంలో మునిగాడు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు వైకుంఠం నుండి లక్ష్మీసమేతంగా విష్ణుమూర్తి, కాశీ నుండి పరమశివుడు, బ్రహ్మదేవుడు, దేవేంద్రాది దేవతలు అక్కడకు వచ్చి మునకలు వేస్తారని ప్రతీతి.

శివశర్మ ప్రయాగ నుండి కాశీ చేరి మణికర్ణికా తీర్థంలో స్నానంచేసి విశ్వనాథుణ్ణి, అన్నపూర్ణను, విశాలాక్షిని, దర్శించాడు. కాశీ నుండి మరల ప్రయాగ వెళ్లాడు. ప్రయాగ నుండి కాశీ తిరిగి వచ్చాడు. ఇలా బ్రహ్మ క్షేత్రమైన ప్రయాగ, శివక్షేత్రమైన కాశీ మధ్య చాలా రోజులు తిరిగాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు తలలు వంచి మహాదేవునికి మ్రొక్కినప్పుడు వారి కిరీటాలలోనున్న మణుల కాంతులతో ఆ తీర్థం ప్రకాశిస్తూంది. అప్పుడు పరమేశ్వరుడు అక్కడ తనువు చాలించిన ప్రాణుల చెవిలో ‘ఓంకార మంత్రం’ ఉపదేశిస్తాడు. అందువలన ఆ తీర్థానికి ‘మణికర్ణికా తీర్థం’ అనే పేరు వచ్చింది.

శివశర్మ శాస్త్రాలన్నీ చదివిన పండితుడు కావడం వల్ల మిగిలిన తీర్థాల ప్రభావాలు తలంచి వారణాసిని విడిచి మిగిలిన క్షేత్రాలను కూడా దర్శించాలని మనసు పడ్డాడు. శాస్త్రాలు పురాణాలు మరీ తెలిసి ఉన్నందున మనస్సు నిలకడగా లేదు. అన్ని తీర్థాలలోను పవిత్రమైనదని తెలిసి కూడా మిగిలిన తీర్థాలు కూడా దర్శించాలనే కోరికతో మోక్షదాయకమైన కాశీ పట్టణాన్ని వదలిపెట్టాడు.

అలా బయలుదేరి కొన్నాళ్ళకు ఉజ్జయినీ పట్టణం చేరుకున్నాడు. పాతాళంలో హటకేశ్వరుడూ, భూలోకంలో మహాకాళేశ్వరుడూ, స్వర్గంలో తారకేశ్వరుడూ కోరిన వెంటనే అనుగ్రహించే లింగస్వరూపులుగా పేరు పొందారు. అటువంటి ఉజ్జయిని చేరుకొని కాళీమాతను, మహాకాళేశ్వరుణ్ణి అర్చించి కొన్నాళ్ళు అక్కడే గడిపాడు. ‘మహాకాలా. మహాకాలా, మహాకాలా’ అని మూడు సార్లు అక్కడ భక్తితో స్మరిస్తే చాలు, మోక్షలక్ష్మి వచ్చి వరిస్తుంది. ఇది తెలిసినా కూడా శివశర్మ అక్కడి నుండి కాంచీపురానికి పయనమయ్యాడు.

కాంచీపురం ఎంతో సుందరమైన నగరం. కొందరు ఆ నగరాన్ని ‘ కాంతి’ అని కూడా అంటారు. కాంచీపురం లో కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని తరువాత ఏకాంబరేశ్వరస్వామి వారిని దర్శించాడు. దానితో ఆ బ్రాహ్మణుడి పూర్వజన్మ పాపాలన్నీ నశించాయి. అక్కడి శివభక్తులతో ఒక వారం రోజులు గడిపాడు.

మరల ప్రయాణం ప్రారంభించి ప్రభాసక్షేత్రం మీదుగా ద్వారక చేరుకున్నాడు. అక్కడి భాగవతులు పన్నీటితో సుగంధాలు వెదజల్లే గోపీ చందనం, తిలకంగా ధరిస్తారు. ద్వారకానగరంలో మరణించినవారి శరీరపు ఎముకలలో పాంచజన్య సుదర్శనాలు ప్రకాశిస్తూ ఉంటాయని శ్రీకృష్ణ భక్తుల నమ్మకం. ప్రతీయుగంలో సముద్రం ద్వారకానగరాన్నిముంచివేసి అక్కడిరత్నాలను తనలో కలుపుకుంటుంది. అందువలననే సముద్రానికి రత్నగర్భుడు అనే పేరు వచ్చింది. అక్కడ మరణించిన ప్రాణులు వైకుంఠం జేరి విష్ణు సామీప్యం పొందుతారు. అటువంటి ద్వారకలో అయిదు రోజులు గడిపి మాయాపురికి బయలుదేరాడు.

మాయానగరాన్ని ‘హరిద్వారం’ అని కూడా పిలుస్తారు. దానిని ‘గంగా ద్వారం’, ‘మోక్షద్వారం’ అని కూడా అంటారు. పూర్వజన్మలో పాపం చేసినవారు ఆ నగరం వెళ్ళలేరని ప్రతీతి. శివశర్మ మాయానగరం చేరిన రోజున ఉపవాసం చేసాడు. మరునాడు తెల్లవారుజామునే గంగా స్నానం చేసి, పిండప్రదానాలు నిర్వర్తించాడు. తరువాత భక్తితో శివారాధన చేసాడు. మడిగా వంట చేసుకుని విస్తరి ముందు కూర్చొన్నాడు. అన్నం వడ్డన చేసుకోబోతుండగా ఒక్కసారిగా అతనికి విపరీతమైన తల నొప్పి వచ్చింది. జ్వరంతో శరీరం స్వాధీనం తప్పింది. పాపం ఆ వృద్ధుడికి వడ్డించుకున్న అన్నం తినే యోగం లేదు.

శివశర్మ మనస్సులో ఇలా అనుకోసాగాడు. “నా ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి. ఇక నుండి నా ఇల్లు, పొలాలు, పశువులు ఎవరు చూసుకుంటారు? నా కుమారులు తమలో తాము గొడవలు పడకుండా నా భార్యను ఆదరిస్తారా? నా వేదశాస్త్ర గ్రంథాలు ఎవరు కాపాడుతారు? ఇంత దూరాన దిక్కు లేని చావు చస్తున్నాను. అయినా ఈ సంసార చింత అనవసరం. కాశీ విశ్వనాథుణ్ణి స్మరిస్తాను. ద్వారకానాథుడైన పుండరీకాక్షుణ్ణి ధ్యానిస్తాను”.

అలా కన్నులు మూసుకొని, నోటితోనే గాలి పీలుస్తూ, ఉన్న చోటనే పడి, మరణ వేదన అనుభవిస్తూ, శివశర్మ ఆ మాయానగరం పొలిమేరలో గంగానది ఒడ్డున ప్రాణాలు వదిలి పెట్టాడు.

అప్పుడు నీలమేఘశ్యాములు, శుభాకారులు అయిన విష్ణుదూతలు గరుడకేతనంతో ప్రకాశిస్తున్న దివ్యరథం తీసుకొని అక్కడికివచ్చారు. వారు శివశర్మకు నమస్కరించి “మహాత్మా! మీరు చేసిన పుణ్యకార్యాల వలన మీకు వైకుంఠ ప్రాప్తి కలిగింది. ఈ దివ్యరథాన్ని అధిరోహించండి. మేము మిమ్ములను విష్ణులోకానికి తీసుకు వెళ్తాము. ఎన్నో లోకాలు దాటి పోతే గాని వైకుంఠం రాదు. మార్గమధ్యంలో వచ్చే లోకాల విశేషాలు చెపుతాము” అని విన్నవించారు.

శివశర్మ ఎంతో సంతోషించి ఆ రథం ఎక్కి కూర్చొన్నాడు. శివశర్మకు వారు ఇలా వివరాలు చెప్పారు. “యమలోకం, చంద్రంలోకం, స్వర్గలోకం, సూర్యలోకం, నక్షత్రలోకం, సప్తర్షి లోకం, ద్రువలోకం పైన బ్రహ్మ లోకం ఉంటుంది. భూలోకానికి ఎనిమిది కోట్ల యోజనాల ఎత్తులో ఉంటుంది ఆ బ్రహ్మలోకం, అక్కడి నుండి మరొక ఎనిమిది యోజనాల దూరంలో విష్ణులోకమైన వైకుంఠం కనిపిస్తుంది. విష్ణులోకం నుండి పదహారు కోట్ల యోజనాల దూరంలో శివలోకమైన కైలాసం ఉంది. దాని కంటే ఉత్తమమైన లోకం మరేదీ లేదు. ఆ పరమ పదంలో పార్వతీసమేతుడైన పరమశివుడు, గణపతి, కుమారస్వామి, నందీశ్వరుడు తదితర శివగణాలు సేవిస్తుండగా కొలువు తీరి ఉంటాడు.”

విష్ణుదూతలు శివశర్మను విష్ణులోకానికి తీసుకు వచ్చి “అయ్యా! మనం లక్ష్మీనారాయణలు నివసించే వైకుంఠం చేరాము. ఇక్కడ నీవు ఈ కల్పాంతం వరకు ఉంటావు. పుణ్యతీర్థ సమీపాన మృతి చెందడం వల్లనూ, ఇంతకు ముందు చేసిన పుణ్యాల వల్లనూ తిరిగి భూలోకంలో జన్మించి నందివర్ధన నగరానికి రాజు వవుతావు. చాలాకాలం ప్రజారంజకంగా పరిపాలన చేస్తావు. కుమారుడికి రాజ్యం అప్పగించి విశ్వేశ్వర కృపతో ముక్తిని పొందుతావు” అని చెప్పి నారాయణ సన్నిధిలో వదలిపెట్టారు. వారు చెప్పిన విధంగా శివశర్మఅక్కడ ఎంతో కాలం వైకుంఠ సుఖాలు అనుభవించి తిరిగి భూలోకంలో జన్మించాడు. విష్ణుదూతలు చెప్పినట్లు ఆచరించి మోక్షం పొందాడు.

అయోధ్య, మథుర, హరిద్వారం, కాశీ, కంచి, ఉజ్జయినీ, ద్వారక, అనే సప్తపురులు (ఏడు పుణ్య క్షేత్రాలు) దర్శనం వలన పుణ్యలోకాలు లభిస్తాయి. అయితే, అందులో కాశీప్రాప్తి వలన మాత్రమే శీఘ్ర ముక్తి లభిస్తుంది. ఈశ్వర కృప ఉంటే తప్ప ఎవ్వరికీ కాశీనగర ప్రవేశం కూడా దొరకదు.

ఈ శివశర్మ నిర్యాణం అనే ఉపాఖ్యానం చదివినా, విన్నా, వ్రాసినా మానవులకు ఆయురారోగ్యైశ్వర్యాలు సమకూరుతాయని అగస్త్యమహర్షి తన భార్య లోపాముద్రకు చెప్పాడు.

*శుభం*

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల