ఓ సత్య కథ - తటవర్తి భద్రిరాజు

O satya katha
ఆకాశం మబ్బులతో ఉంది. కాసేపట్లో వర్షం వచ్చేలా ఉంది. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ పైన ఉన్న గడియారం లో సమయం సాయంత్ర 5గంటలు చూపిస్తూ ఉంది.
ఆ హాస్పిటల్ గోడకు చేర్చి వరుసగా ఎరుపు తెలుపు రంగులలో ఉన్న అంబులెన్సు లు ఆగి ఉన్నాయి. ఆ అంబులెన్సు ల పక్కనే ఉన్న గోడకు సి పీ ఏం పార్టీ ఎర్ర జండాలు కట్టి ఉన్నాయి. కొంచం దూరం లో ఉన్న ఆటో స్టాండ్ లో మూడు ఆటోలు ఆగి ఉన్నాయి. వాటి పక్కనే డ్రైవర్ లు పెషేంట్లు ఎవరైనా రాకపోతారా అని ఎదురు చూస్తూ నుంచున్నారు.
ఆ పక్కనే ఉన్న హాస్పిటల్ ఎంట్రన్స్ గేట్ కు రెండు పక్కలా పెద్ద పెద్ద చెట్లు గాలికి ఊగుతూ ఉన్నాయి. అక్కడక్కడా ఆ చెట్టు నుండి రాలిపోయిన ఆకులు కింద పడి ఉన్నాయి.
ఆ గేట్ పక్కనే కొబ్బరి బొండాలు పెట్టుకుని గుజ్జ చంద్రమ్మ కూర్చుంది. కరోనా ముందు కాలం లో చంద్రమ్మ భర్త భూమయ్య ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్మేవాడు. కరోనా తో తను చనిపోవడం తో ఇప్పుడు చంద్రమ్మె ఈ వ్యాపారం చేస్తూ ఉంది. అప్పుడప్పుడు కొన్ని పళ్ళు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటుంది.
కుర్మన్నపాలెం లో ఉండే అంకిరెడ్డి రవికుమార్ చంద్రమ్మ కొట్టు పక్కనే లస్సి, బాధం మిల్క్ అమ్మే కొట్టు పెట్టుకున్నాడు. దీనితో పాటు మంచినీళ్లు డబ్బాలు తెప్పించి హాస్పటిల్ లో ఉండే పెషేంట్ లకు అమ్ముతూ ఉంటాడు. ఇంతకుముందు ఇక్కడే చిన్నపిల్లలు బట్టలు దుకాణం నడిపే రొంపిల్లి పెద్ద అబ్బాయి దగ్గర ఈ స్థలాన్ని కొనుక్కుని ఈ లస్సి షాప్ పెట్టుకున్నాడు.
హాస్పిటల్ లోపల అంకాలజీ వార్డ్ లో (కేన్సర్ విభాగం ) పెద్ద గా పెషేంట్లు లేరు. అక్కడ నుండి ఎడమవైపు తిరిగితే ఉన్న రూమ్ బయట డాక్టర్.పి. సుజాత హరిహారణ్, ఎమ్ డి, అంకాలజీ విభాగం అని రాసి ఉన్న బోర్డు కనపడుతూ ఉంది. అక్కడే అవుట్ పెషేంట్లు కూర్చోడానికి కొన్ని కుర్చీలు వేసి ఉన్నాయి.
అప్పుడే డాక్టర్ కి తన టెస్ట్ రిపోర్ట్ లు చూపించి బయటకు వచ్చి ఆ కుర్చీలో కూర్చుంది బొమ్మరాజు సత్య. సత్య వయసు సుమారు గా 62 ఏళ్ళు.
సత్య వెనుకే వచ్చిన నర్సు సత్య చేతి లో కొన్ని పేపర్లు పెడుతూ ఈ మందులు తప్పకుండా వాడండి. ఏమీ కాదు అని చెప్తూ ఉంది. సత్య ఇక్కడ కొంతకాలం గా క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటూ ఉంది. ఇప్పటికే రెండు సార్లు "కీమో థెరఫీ " తీసుకుంది.
సత్య చేతులు ఆ పేపర్లు తీసుకుంటున్నా, చెవులు ఆ మాటలు విన్నా తన ఆలోచలు మాత్రం ఎక్కడో ఉన్నాయి. వేరే ఎవరైనా ఐతే మొదటిసారి క్యాన్సర్ పరీక్ష చేసినప్పుడు డాక్టర్ చెప్పిన మాటలకు కుమిలి కుమిలి ఏడ్చే వారు. కానీ డాక్టర్ "మీకు క్యాన్సర్ సెకండ్ స్టేజి లో ఉంది" అని చెప్పినా సత్య కళ్ళవెంట నీళ్లు రాలేదు.
తన జీవితం లో పడ్డ కష్టాలకి ఎన్నోసార్లు ఆ కళ్ళు ఏడ్చి ఏడ్చి అలిసిపోయాయి. ఎన్నోసార్లు ఆ కన్నీళ్ళే తనకు తోడుగా ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియని బాధలు లో తనకు ఆ కన్నీళ్ళే ఓదార్పు నిచ్చాయి. ఒంటరి గా జీవితం లో అడుగులు వేయాల్సి వచ్చినప్పుడు ఆ కన్నీళ్ళే ధైర్యాన్ని ఇచ్చాయి. కానీ ఇప్పుడు అవికూడా తనని వదిలి ఎక్కడికో పోయాయి.
******
సత్య తండ్రి కస్తూరి ముకుందరావు. విజయనగరం దగ్గర సంతపాలెం అనే గ్రామంలో కరణం గా పనిచేసేవారు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఇంట్లో ఇంకో ముగ్గురు పిల్లలు ఉన్నా సత్య అంటే తండ్రి ముకుందరావు కు అమితమైన ప్రేమ. సత్య చిన్నతనం నుండే కుందనపు బొమ్మలా ఉండేది. బంధువులు అంతా ముకుందం "నీ కూతురు దేవకన్య లా ఉందిరా" అంటే చాలా గర్వం గా ఉండేది ముకుందరావు గారికి .
ఊళ్ళో రామాలయం పూజారిగారి భార్య ఓ మాటల సందర్భం లో సత్య ని "నీకేంటే అందగత్తివి " అంటే, ఆ విషయం నాకు కూడా తెలుసు లే అత్తా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
దూరపు బంధువు ఐన పోస్టుమాస్టారు అక్కినపల్లి రామకృష్ణ గారు నాకే కనుక అబ్బాయిలు ఉంటే నిన్ను మా ఇంటి కోడలి ని చేసుకుందునే సత్య అంటే ఆమ్మో నీ కొడుకు కూడా నీలా నల్లగా ఉండేవాడేమో 'నేను ఎందుకు చేసుకుంటా ' మామయ్య అంటూ సమాధానం చెప్పింది సత్య.
సత్య అందం చూసిన ఊళ్ళో కుర్రోళ్ళు కరణం గారి అమ్మాయి అంటూ... తన అందం గురించి కథలు కథలు గా చెప్పుకునే వారు. ఊళ్ళో వాళ్ళు తన అందం గురించి పొగుడుతూ ఉంటే సత్య తనని తాను సినీ నటి సావిత్రి అందం, తన అందం ముందు ఎందుకు పనికిరాదు అని తన స్నేహాతులతో చెప్తూ ఉండేది.
కొత్తవలస లో జయసినిమా హాల్ లో అనురాగదేవత సినిమా చూసి శ్రీదేవి కన్నా తానే అందం గా ఉన్నాను అని మురిసిపోయింది.
ఓరోజు విశాఖపట్నం దగ్గర ఉండే మాకవరపు పాలెం అనే ఊరు నుండి కొడిమల భరద్వాజ్ అనే పంతులుగారు ఓ పెళ్లి సంబంధం తీసుకుని వచ్చి వివరాలు ముకుందరావు చెవిన వేశారు. కూతురు అంటే ఎంతో ప్రేమ ఉన్న ముకుందరావు గారు అది ఇంకా చిన్న పిల్ల దానికి అప్పుడే పెళ్లి ఏంటి? అంటూ ఆ సంబంధాన్ని తోసి పుచ్చారు.
మరికొన్నాళ్ళు కు మళ్ళీ కొడిమల భరద్వాజ్ గారు కాకినాడ లో స్కూల్ టీచర్ గా పనిచేసే కంచుగంటల వెంగళ రావు అనే అబ్బాయి సంబంధాన్ని తీసుకువచ్చారు. మళ్ళీ ముకుందరావు గారు చిన్న పిల్ల దానికి అప్పుడే..... అని అంటుంటే, ఆయన మాటలని మధ్యలోనే ఆపేస్తూ " పెళ్లి చేయకుండా నీ దగ్గరే ఉంచుకుంటావా, ఏమిటి? " అంటూ మందలించారు వయసులో పెద్ద అయిన భరద్వాజ్ గారు.
సరేలే సత్య కి చూపిద్దాం తనకి నచ్చితే ముందుకు వెళ్దాం అన్నారు ముకుందరావు గారు పెద్దాయన మాటను తీసేయలేక.
ఆ సంబందం గురించి తెలుసుకున్న సత్య అబ్బాయి పేరు నచ్చలేదు అని ఆ సంబంధం వద్దు అంది. ఆముదాల వలస దగ్గర గేదల వాని పేట అనే ఊరు నుండి మరో సంబంధం వస్తే అబ్బాయి నల్లగా ఉన్నాడని వివరాలు వినకుండానే తిరస్కరించింది.
ఆలా ఆలా వచ్చే సంబంధాలు అన్ని తన అందం ముందు సరిపోవని గట్టిగా అనుకున్న సత్య వచ్చే సంబంధాలు అన్ని నచ్చలేదు అని చెప్తూనే ఉంది. అన్నవరం దగ్గర బెండపూడి నుండి మరో సంబంధం వస్తే సత్య తన నిర్ణయం చెప్పే లోపే వరసకు బాబాయ్ అయిన కూనపల్లి వెంకట్రావు గారు "అబ్బే... మన అమ్మాయి పక్కన అబ్బాయి వెల వెల పోతున్నాడు. మరో సంబంధం చూద్దాం అంటూ " అడ్డుపుల్ల వేశారు.
వేసవి కాలం వెళ్లి మళ్ళీ వేసవి కాలం వచ్చింది. వర్షాకాలం వెళ్లి మరో వర్షాకాలం వచ్చింది. ఇలా కాలాలు అన్ని పరిగెడుతుంటే సత్య వయసు కూడా పెరుగుతూ ఉంది.
ఓ రోజు ఉదయాన్నే బయటకు వెళ్లిన ముకుందరావు గారు మళ్ళీ ఇంటికి రాలేదు. దారిలోనే గుండె నొప్పి వచ్చి కుప్పకూలి పోయి అక్కడికిక్కడే ప్రాణం వదిలారు.
సత్య కి తండ్రి పోయిన ఒక సంవత్సరం లోపే పెళ్లి చేస్తే మంచిది అని బంధువులంతా నిర్ణయం తీసుకున్నారు.
కోటపాడు దగ్గర రొంగలనాయుడు పాలెం అనే ఊళ్ళో కరణం గా చేసే మోహనరావు అనే అబ్బాయి సంబంధం చూసి సత్య అభిప్రాయం కోసం ఎదురుచూడకుండానే పెద్దలంతా పెళ్లి చేశారు.
రొంగలనాయుడుపాలెం లో మోహనరావు తో కొత్త జీవితం ప్రారంభించింది సత్య. మొదటిసారి తండ్రిలేని లోటు తనకి తెలిసింది. ఇంట్లో ఉండే అత్తగారు, మామగారు భర్త ఎవ్వరు తన అందం గురించి మాట్లాడేవారు కాదు. తండ్రి ఐతే కుదిరినప్పుడు అల్లా నా కూతురు అందగత్తె అంటూ మురిసిపోయేవాడు.
రోజులు గడుస్తున్నాయి కానీ అవి గతం లో అంత హాయి గా లేవు. చుట్టూ తనని పొగిడే చుట్టాలు లేరు. పుట్టియింట్లో ఉన్నన్ని సిరి సంపదలు లేవు.
1985 లో సడన్ గా రామారావు ప్రభుత్వం కరణాలు ఉద్యోగాలు ను రద్దు చేసే సరికి మోహనరావు ఉద్యోగం కూడా పోయింది.
తరువాత ఏ ఉద్యోగం చేద్దామని ఆలోచించిన మోహనరావు, ఎక్కడ చేసినా గతం లో దొరికిన గౌరవం దక్కదని వ్యాపారం చేద్దామని అనుకున్నాడు.
కోటపాడు నుండి కిరాణా సరుకులు తెచ్చి ఊళ్ళో అమ్మడం ప్రారభించాడు. ఊళ్ళో కరణం గారి కొట్టు అంటూ జనం బాగానే వచ్చే వారు. కొట్లో తెచ్చిన సరుకులు ఇంట్లో కి కూడా వాడేస్తుంటే, మోహనరావు ఎన్నిసార్లు లెక్కలు చూసుకున్నా లాభాలు మాత్రం కనపడడం లేదు. కానీ వెంటనే షాప్ తీసేస్తే పరువు పోతుంది అని, పడాల సూర్యకాంతం దగ్గర అప్పు తెచ్చి నడిపిస్తూనే ఉన్నాడు. రోజురోజుకి వ్యాపారం లో అనుభవం తో పాటు , సూర్యకాంతం దగ్గర తెచ్చిన అప్పుకి వడ్డీ కూడా పెరుగుతూ ఉంది. పిల్లలు పుడితే అదృష్టం కలిసి వస్తుంది అని ఎవరో చెప్తే అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఇద్దరు పిల్లలను కూడా కన్నారు.
పిల్లలతో అదృష్టం కనపడలేదు కానీ, ఖర్చులు పెరిగి అప్పులు మాత్రం ఇంకా ఎక్కువయ్యాయి. సత్య పుట్టింటి నుండి పసుపు కుంకాలు గా తెచ్చుకున్న పొలాలుతో పాటు, ఉన్న ఇంటిని కూడా అమ్మాల్సి వచ్చింది.
రోజులు గడుస్తున్నా ఆదాయం వచ్చే మార్గం లేకపోవడం తో మళ్ళీ మళ్ళీ కొత్త అప్పులు చేస్తూనే ఉన్నాడు మోహనరావు.
విజయనగరం లో ఉండే కాగడాల శేఖరబాబు అనే స్నేహితుడు "నాకు తెలిసిన ఓ రాజకీయ నాయకుడు దొడ్డిదారిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు "అని చెప్తే మోహనరావు మరో 5లక్షలు అప్పు చేసి శేఖర బాబు చేతిలో పెట్టాడు.
ఆలా ఆలా సంవత్సరం ఐన కూడా ఉద్యోగం రాకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేయమని శేఖరబాబు వెంటపడ్డాడు మోహనరావు. కంగారు పడకు కొంచం లేట్ అయిన కూడా నీ ఉద్యోగం పక్కా... అని చెప్పిన శేఖరబాబు, మోహనరావు కు ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు.
నువ్వుకాని మరో నలుగురికి ఉద్యోగాలు రావడానికి సహాయం చేశావంటే ప్రతీ మనిషి దగ్గర నీకు కొంత మొత్తం వచ్చేలా నేను మాట్లాడతా అని శేఖరబాబు ప్రలోబ పెట్టాడు.
అసలే ఆర్ధిక సమస్యలతో ఉన్న మోహనరావు తనకునున్న మంచి పేరు వాడి శేఖరబాబు చెప్పిన దానికంటే ఎక్కువ మంది నే చేర్పించాడు.
ఓ రోజు ఉదయమే డబ్బులు కట్టినా ఉద్యోగాలు రాని నిరోద్యోగులు మోహనరావు ఇంటి పై గొడవకు వస్తే ఎలాగో తప్పించుకున్న మోహనరావు ఎక్కడికో వెళ్ళిపోయాడు.
మోహనరావు కోసం ఎదురుచూసిన సత్య కి నిరాసే ఎదురయ్యింది.
మోహనరావు ను శ్రీకాకుళం దగ్గర అరసవిల్లి లో చూశామని ఎవరో అంటే అక్కడ వెతికింది. ఆముదాల వలస లో కనపడ్డాడు అంటే అక్కడికి వెళ్ళింది. అనకాపల్లి లో బంధువులకి చెప్పి వెతకమంది. ఎంత మంది వెతికినా మోహనరావు ఐతే కనపడలేదు.
విశాఖపట్నం బీచ్ లో ఎవరిదో శవం కొట్టుకు వచ్చింది అంటే అది మోహనరావు కాకూడదు అని సింహాచలం దేవుడు కు దండాలు పెట్టింది. కాని తాను వెళ్లేసరికి అక్కడ ఏ శవం లేదు. ఆలా ఆలా భర్త కోసం వెతికి వెతికి ఎక్కడో అక్కడ క్షేమం గా ఉంటాడు లే అని పిల్లలు ను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది.
******
పిల్లలే లోకం గా ఇద్దరు పిల్లలు ను పెంచింది. అష్టకష్టాలు పడి బంధువుల సహాయం తో ఆడపిల్ల పెళ్లి చేసింది. కొడుకు ను కూడా చదివించి, పెళ్లి చేసి తన బాధ్యతలు నేరవేర్చుకుంది.
జీవితం లో పడిన కష్టాలకు గుండె ఎప్పుడో రాయిగా మారింది. భర్త, పిల్లలుకోసం ఎన్నో కలలు కన్న ఆ కళ్ళు ఇప్పుడు ఏలాంటి వార్త విన్నా వర్షించడం లేదు. సత్య జీవితం లో పడిన కష్టాలు ముందు " కీమో థెరఫీ " కూడా చినబోయింది.
బయట వర్షం సత్య కి తోడు గా ఉన్నాను అని చెప్పడానికి అన్నట్టు గా ఆగకుండా పడుతూనే ఉంది.

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం