నా జ్ఞాపకాలలో - నాన్న - మద్దూరి నరసింహమూర్తి

Naa gnapakaalalo naanna

నేను చదువుకున్నది ఒడిశా రాష్ట్రంలో ఉన్న బరంపురంలో.

ప్రతీ విద్యార్థి జీవితంలోనూ ఉన్నత పాఠశాల స్థాయిలో చివరి అంకంగా జరిగే బోర్డు పరీక్షలు వాటి ఫలితాలు మైలు రాయి లాంటివి.

అవి నేను పదకొండవ తరగతి బోర్డు పరీక్షల కోసం సన్నాహం అవుతున్న సమయం.

చిన్న ఇంట్లో నివాసం కాబట్టి, వేరుగా గదిలో కూర్చొని చదువుకొనే సదుపాయం అన్న ప్రశ్నయే లేదు.

రోజులో దినసరి కార్యక్రమాలు తప్పితే, మిగిలిన సమయంలో చాలా వరకూ పరీక్షలకు చదువుకొనే వాడిని. అందుకునే ఏమో, మరునాడు పరీక్ష ఉన్నా, ఏ రోజు కూడా రాత్రి పది తరువాత కూర్చొని లేక తెల్లవారగట్ల నాలుగింటికో ఐదింటికో లేచి చదివింది లేదు.

అలా చదువుకోమని నాన్నకానీ అమ్మ కానీ చెప్పింది లేదు.

అంతేకాదు, ‘ఎలా చదువుకుంటున్నావురా’ అని కానీ ‘పరీక్షలో బాగా వ్రాసి ఉత్తీర్ణుడివి అవుతానని నమ్మకం ఉందా’ అని కానీ ఏనాడూ వాళ్ళు అడిగింది లేదు.

నామీద వాళ్లకు అప్పుడున్న నమ్మకమో మరి ఏమిటో.

మొత్తాన పరీక్షల ప్రారంభం అయేయి.

ప్రతీరోజూ పరీక్షనుంచి వచ్చిన తరువాత 'బాగానే వ్రాసేవా' అంటూ 'రేపటికోసం బాగా చదువుకో' అన్న ఐదు పదాలే నా తల్లితండ్రుల నోటివెంట నాకు వినిపించేవి.

చివరాఖరి పరీక్ష కూడా వ్రాసేసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న నేను ఆ సాయంత్రమే స్నేహితులతో కలిసి తెలుగు సినిమా చూసి తలనించి మోపెడు భారం దింపుకున్నాను.

అవి ‘ఫిబ్రవరి’ నెలాఖరు రోజులు. పరీక్షల ఫలితాలు వచ్చేది ‘మే’ నెలలో మాత్రమే.

అప్పటి రోజుల్లో ఒడిశా రాష్ట్రంలో మెట్రిక్యూలేషన్ పరీక్షా ఫలితాలు కటక్ నుంచి వెలువడే పేరుపడ్డ ఒరియా దినపత్రికలో ఉత్తీర్ణులైనవారి పేర్లతో వచ్చేవి.

-2-

తెల్లవారి 4 గంటల సమయంలో మా ఊరి రైల్వే స్టేషన్కు వచ్చే మెయిల్ లో ఆ పత్రిక వచ్చేది.

పరీక్షా ఫలితాల రోజున రైల్వే స్టేషన్కు మెయిల్ వచ్చే సరికి చేరుకొని పత్రిక కొనుక్కోకపోతే, ఆరోజుకి ఆ పత్రిక దొరకడం గగనమే.

చూస్తుండగా ‘మే’ నెల కూడా వచ్చేసింది.

స్నేహితుల మధ్య మాకు 'ఎప్పుడు ఫలితాలు వస్తాయిరా' అన్న మాటలే ఎక్కువగా ఉండేవి.

ప్రతీ సంవత్సరం –

మరునాడు దినపత్రికలో మెట్రిక్యూలేషన్ పరీక్షా ఫలితాలు వస్తాయి అనగా ముందు రోజు మధ్యాహ్నం సరికి, క్రమశిక్షణకు మారుపేరుతో విద్యార్థులకు సింహస్వప్నం లాంటి ఒక ఉపాధ్యాయులవారి దగ్గరికి, మా బడికి సంబంధించినంతవరకూ, ఆ సమాచారం వచ్చేది.

ఒక రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మెట్రిక్యూలేషన్ పరీక్ష ఫలితాలు ఆ ఉపాధ్యాయులవారి దగ్గరకు వచ్చేయి అని తెలుసుకొన్న నా దొడ్డమ్మ అబ్బాయి ఆయన దగ్గరకు వెళ్లి, నా పరీక్ష ఫలితం తెలుసుకొని, మా ఇంటికి వచ్చి "పిన్నీ తమ్ముడు పాసయ్యేడు" అని చెప్పగానే –

అమ్మ వాడి నోట్లో నా నోట్లో ఇంత పంచదార పోసి, ఇంట్లో ఉన్న దేముడి దగ్గరకు నన్ను తీసుకొని వెళ్లి నమస్కారం చేయమని, తాను కూడా నమస్కారం చేసింది.

అప్పుడే ఇంట్లోకి వస్తున్న నాన్నకి చెబుదామని నేను అనుకుంటున్నంతలో, అన్నయ్య "పెద్దనాన్న, తమ్ముడు పాసయ్యేడు" అని చెప్పేడు. నాన్న నా తల మీద తన చేయి వేసి 'మంచిది' అన్నారంతే.

"నేను మళ్ళా సాయంత్రం వస్తాను మనిద్దరం సినిమాకు వెళదాము" అని నాతో చెప్పి అన్నయ్య వెళ్ళిపోయేడు.

నా పరీక్షా ఫలితాలు వచ్చే ఒరియా దినపత్రిక అన్నయ్యతో కలిసి ఎలాగైనా సంపాదించాలి అనుకుంటూ కలతనిద్రతో పడుకున్న నేను మరునాడు ఉదయం లేచేసరికి "మీ నాన్న నీ పరీక్షా ఫలితాలు వచ్చే ఒరియా పేపర్ కోసం రైల్వే స్టేషన్ కు వెళ్ళేరు" అని అమ్మ చెప్పింది.

అంటే, తెల్లవారి 4 గంటలకు వచ్చే మెయిల్ కోసం నాన్న మూడో గంటకే లేచి వెళ్ళేరన్నమాట.

నేను దంతధావనం కావించుకొన్న ఐదు నిమిషాలకే నాన్న ఆ దినపత్రికతో వచ్చేరు.

-3-

నా పరీక్షా ఫలితాలు ఉన్న దినపత్రిక ఎంతో కష్టపడి తెచ్చిన నాన్న "ఇగోరా పేపర్" అని నాకు ఇచ్చి స్నానం చేయడం కోసం వెళ్ళిపోయేరు.

ఆ పత్రికలో ఒరియాలో ప్రింట్ అయి ఉన్న నా పేరు క్రింద నల్లని ఇంకుతో నాన్న గీసిన గీత ప్రస్ఫుటంగా కనబడసాగింది.

మరొక అరగంటలో మా వీధిలో ఉన్న వారు చాలా మంది మా ఇంటికి వచ్చి నన్ను నాన్నను అభినందించసాగేరు.

ఆ సందడి తగ్గిన కొద్ది సేపటి తరువాత నాన్న అమ్మని పిలిచి "వీడికి దిష్టి తీయి" అని చెప్పి బయటకు వెళ్ళిపోయేరు.

అప్పుడు తెలిసింది - మా వీధిలో నాతో పాటూ పరీక్షకు వెళ్లిన ఆడ మగ విద్యార్థులు కలిసి పదమూడు మందిలో నేనొక్కడినే పాస్ అయేనని.

నాన్న నన్ను భౌతికంగా విడిచి వెళ్లి 35 సంవత్సరాలు గడిచిన ఈ రోజున –

నా దగ్గరే నా గురించి గొప్పగా మాట్లాడుతూ నన్ను మెచ్చుకుంటే, ఆ మాటలు ఆ మెప్పుకోలు నా భవిష్యత్తుకు ఎదుగుదలకు అవరోధం అవొచ్చు అన్న ముందు చూపుతో, నా మీద ఉన్న ప్రేమను అభిమానాన్ని తన గుండెలోనే పదిలంగా దాచుకున్న నాన్న –

--నా మదిలో నా జ్ఞాపకాలలో మెదలసాగేరు.

(ఇప్పుడు మీరు చదివినది 'అక్షర సత్యం' అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను - మూర్తి)

*****

మరిన్ని కథలు

Kurukshetra sangramam.6
కురుక్షేత్ర సంగ్రామం .6.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.5
కురుక్షేత్ర సంగ్రామం .5.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.4
కురుక్షేత్ర సంగ్రామం .4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Padavee viramana kanuka
పదవీవిరమణ కానుక
- బామాశ్రీ
Kokku pandi
కొక్కుపంది .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Varsham kosam
వర్షం కోసం
- తాత మోహనకృష్ణ
Konaseema kurradu
కోనసీమ కుర్రాడు
- సిహెచ్. వి. యస్. యస్. పుల్లంరాజు
Marchery lo muchhatlu
మార్చురీలో ముచ్చట్లు
- మద్దూరి నరసింహమూర్తి