జీవన తరంగాలు ( తరంగం -2) - వెంకటరమణ శర్మ పోడూరి

Jeevana Tarangalu.2

ఆరోజు ఏస్ ఎస్ ఎల్ సి రిజల్ట్స్ వచ్చాయి . పాస్ అయింది అని తెలిసింది. నాన్న గారితో చెబుదా మని మేడ మీదికి వెళ్లాను. పెద్ద మంచం మీద పడుకుని ఉన్నారు. నేను పిలవ గానే కళ్ళు తెరిచి ఏమిటి అన్నట్టు చూశారు. పాస్ అయ్యాను అన్నాను. ఒక్క మాటు నిట్టూర్చి వెనక్కి వాలి పడుకున్నారు. అందులో చాలా అర్థాలు ఉన్నాయి. అప్పటి పరిస్థితులలో ఆ పరీక్ష పాసవడం ఎందుకు ముఖ్య మంటే, అది పాసయితే గవర్నమెంట్ లో నైనా ఎక్కడయినా ఎదో చిన్న ఉద్యోగం వస్తుందన్న ధైర్యం ఉండేది, ఎక్కువ మంది పిల్లలున్న తల్లి తండ్రులకి. అప్పటికే మా పెద్ద నాన్న కొడుకు, మా మ్మావయ్య అది పాసవ్వలేక దండ యాత్రలు చేస్తున్న నేపధ్యం లో మనం పాసవడం ప్రాముఖ్యం సంతరించుకుంది. అయితే ఆ ఆనందం కొద్ది రోజులే. అసలు కష్టాలు అప్పుడే ప్రారంభం అవుతాయని అప్పట్లో తెలియదు. అప్పటి దాకా తెలుగు మీడియం అయితే , పియుసి నుంచి ఇంగ్లీష్ మీడియం. ఎం. పి.( మాథ్స్ , ఫిజిక్స్) తో బాటు మూడోది అకౌంట్స్, లాజిక్ లాంటిది ఎదో ఒకటి ఎంచుకోవాలి. అందరి తో పాటు అకౌంట్స్ తీసుకోవడం జరిగింది. కారణం విధి నిర్ణయం తప్ప పెద్ద ప్రణాళిక ఏమీ లేదు. ఇంకా నిక్కర్ల స్థాయే. కాలేజీ లో అడుగు పెట్టడం ఒక పెద్ద మలుపు. కాలేజీ ఎలక్షన్స్ లో నుంచున్న అభ్యర్థులు, ఓటు మాకు వేయండి, అని అండి తగిలించి గౌరవించడం, స్కూల్ లో అలవాటు లేని అనుభవం. కాలేజీ లో చేరడం జీవితం లో ముఖ్య మయిన మలుపు. కొత్త వాతావరణం అలవాటు పడి చదువు లోకి నెట్టడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. మొదటిది ఇంగ్లీష్ మీడియం. పుస్తకాలు, లెక్చర్లు కూడా ఇంగ్లీష్ లో ఉండడం తో, ఏమి జరుగుతోందో తెలిసేటప్పటికి ఏడాది లో సగం అయిపొయింది. అంతకు ముందు వాళ్లకి ఇంటర్ మీడియట్ రెండు ఏళ్ళు కాబట్టి అడ్జస్ట్ అవడానికి వీలయెదేమో. దానికి తోడు కాలేజీ తెరిచి నప్పటి నుంచి, అవధాని గారనే తీసేసిన లెక్చరర్ ని మళ్ళి వేసుకోవాలని స్ట్రైక్. ఆయనగురించి ఏమీ తెలియక పోయినా, ఆయన కోసం నిరాహార దీక్ష చేసిన వాడి వెనక స్లోగన్లు చేయడం మొదలయిన వాటితో రోజులు గడిచి పోయాయి. ఊళ్ళో ప్రాక్టీస్ పెద్దగా లేని లాయర్లకి కాలేజీ రాజకీయాలతో సంబంధం ఏమిటో అప్పట్లో తెలిసేది కాదు. నియోగి, వైదీకి కొట్లాటలు అని బయట చెప్పుకోవడం తప్ప, ఇంట్లో అలాంటి విషయాలు నాన్న గారు మాట్లాడక పోవడం వల్ల వివరాలు తెలిసేవి కావు. మొత్తానికి పియూసీ ఫెయిల్ అవడం, నాన్న గారు చాలా ఎక్కువగా నిట్టూర్చడం జరిగింది. ఆలా ఫెయిల్ అవడం, మీడియం సమస్యనా లేక నా తెలివితేటలు సమస్యనా అన్న ప్రశ్న ఆయనకి వస్తే, అంత వరకు మనమేమీ పెద్ద ప్రతిభ కనపరచలేదు కాబట్టి, అయన నా తెలివితేటలు గురించే ఆందోళన చెంది ఉండవచ్చు. మనం నమ్మక పోయినా, నక్షత్రాలు పైన సంచరిస్త్తూనే ఉంటాయి కదా. ఏ పరిస్థితి కయినా వాటి గమనమే ముఖ్యమని నా జీవితం లో మార్పులే ఆ ఆతరవాత స్పష్ట పరిచాయి . అయితే ఇంగ్లీష్ మీడియం సమస్య నాకే కాదు. నాతో స్కూల్ లో చదివిన చాలా మంది మిత్రులకి అదే సమస్య. ఎవరో కొద్ది మంది క్లవర్లు తప్ప నాకు చాలా మంది తోడు ఉన్నారు. మళ్ళీ , మార్చి సెప్టెంబర్ ల సహాయం తో బట్టీ రాజ్యం లోనే పియూసీ గట్టెక్కి, డిగ్రీ లో చేరడం జరిగి పోయాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ పాస్ అవడానికి కూడా బట్టీ పట్టడమే శరణ్యం. ఇంగ్లీష్ లో స్వంతం గా రాయడం ప్రశ్న లేనే లేదు. స్కూల్ లో ఇంగ్లీష్ ల్లో స్వంతం గా రాయమని చెప్పడం గానీ, రాయించడం గానీ జరగే లేదు. అటువంటి నేపథ్యంలో బి.కామ్ లో చేరడం జరిగి పోయింది. అదేమిటో పియుసి తప్పిన బ్యాచ్ అంతా, రేఖపల్లి నటరాజ్, కొల్లూరి సూర్యనారాయణ, పచ్చిగోళ్ళ నాగరాజు, ఇలా చాలా మందిమి బి.కాం లో చేరాం. దానికి ముందు పెద్ద ఆలోచన కూడా చేసినట్టు గుర్తు లేదు. విధి అనుకోవడం తప్ప అందులో నాన్న గారి ప్రమేయం కూడా లేదు. బి.కాం లో మేము పదహారు మందిమి. ఇంగ్లీష్, ఎకనామిక్స్ క్లాసులకి బి. ఏ వాళ్ళతో కలిపేవారు. ఇంగ్లీష్ ఎక్కువ పేపర్లు ఉండేవి, షేక్స్పియర్ డ్రామాలు, పారడైజ్ లాస్ట్ పోయెట్రీ, ఇంకా నాన్ డీటెయిల్స్ అన్ని కలిపి ఇంగ్లీష్ ఎక్కువగా వినడం జరిగి, మొదటి సంవత్సరం ఆఖరున, తెలియకుండానే బట్టి పట్టకుండా స్వంతం గా రాయడం జరిగింది. అదీ డ్రామా, ప్రొజ్ వంటి ఇంగ్లీష్ సబ్జెక్టు లు. ఇంగ్లీషు లెక్చరర్ శ్యామల రావు గారి సింపుల్ ఇంగ్లీష్ నాకు బాగా ఉపయోగ పడింది. ఒక చిన్న సంతోష కరమయిన సంఘటన ఆయనతో ముడి పడినది, మొదటి సంవత్సరం ఆఖరున జరిగింది. బి ఏ వాళ్ళ తో కలిపి డబ్బయ్ మందివి ఇంగ్లీష్ పేపర్లు ఆయనే దిద్దారు. మాకు అవి ఇవ్వక ముందే, ఆయన ఎందుకో నాన్నగారి స్కూల్ కు వెళ్లి ఆయనని కలిశారు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చి నాన్నగారు, చాలా మామూలుగా, శ్యామలరావు గారు మీకు ఏ సబ్జక్ట్ చెప్పారు అని అడిగి, ఆ సబ్జక్ట్ ఎలా రాశావు అని అడిగారు. మనం స్వంతంగా ప్రారంభించింది ఆయన పేపర్ తోనే కాబట్టి "బాగానే రాశాను అనుకుంటాను ". అన్నాను. ఏమిటా విషయం అనుకుంటూ. " డబ్బయి మందిలో నీకు ఫస్ట్ మార్క్ వచ్చింది " అని శ్యామల రావు గారు చెప్పారని , నాతో నాన్నగారు చాలా మామూలు గా చెప్పారు. ఆయన పైకి ఏమీ అనకపోయినా, లో లోపల ఆయన సంతోషించారని నాకు తెలుసు. పియుసి పోవడం, ఇంగ్లీష్ మీడియం ప్రభావమయినా, అప్పట్లో నా చదువు ఏమవుతుందా అని ఆందోళన పడటం నాకు తెలుసు. ఈ సంఘటన అయన కి కాస్త ఊరట కలిగించి ఉంటుందని నాకు అనిపించింది. మొదటి సంవత్సరం తో ఇంగ్లీష్ లో స్వంతం గా రాయలేక పోవడం అనే అడ్డు తీరడం తో, కొత్త ఉత్సాహం తో చదువు సాగుతుంది అనుకున్నా. ఆర్ట్స్ వాళ్ళకి, కామర్సు వాళ్ళకి జనరల్ ఎడ్యుకేషన్ పేరిట ఒక పేవర్ ఉండేది అందులో బోటనీ, జూఆలజి, ఫిజిక్స్, కేమిస్ట్రీ కూడా ఉండేవి, గొల్లకోట వెంకట రత్నం గారి కేమిస్ట్రీ లెక్చర్లు , పంగనామాల గోపాలరావు గారి బోటనీ లెక్చర్లు అద్భుతం. వెంకట రత్నం గారికి, ఎవడయినా డౌట్స్ అడిగితే కోపం వస్తుంది అనేవారు. ఎందుకంటే ఆయన చెబితే డౌట్ రాకూడదు. క్లాసులో వింటూ, రాసుకున్న పాయింట్స్ బట్టి పరిక్షలు రాసేయడమే. మెయిన్ కామర్స్ సిలబస్ లో. ఎకనామిక్స్ , ఇండియన్ ఎకానమీ అని రెండు పేపర్లు . ఎకనామిక్స్ పేరి శాస్త్రి గారు చెప్పేవారు. ఆయన క్లాసు అందరు ఇష్టపడేవారు. గంట ఎలా గడిచేదో తెలిసేది కాదు. పరీక్షలకోసం ఎకనామిక్స్ కావలిస్తే పుస్తకాలు చదువుకోవాలిసిందే. మరి గంటా ఏమిచెప్పేవారంటే పేరు ఎకనామిక్స్ అయినా అద్భుతమయిన లోకాభిరామాయణం . అద్వైతం మీద ఆసక్తి ఉన్నవాళ్లు, గరికిపాటి నరసింహారావు గారి అష్టావక్ర గీత మీద ఉపన్యాసం వింటే ఎలాగో అలాగే. ఈ మధ్యన అయనవి అష్టావక్ర గీత మీద కొన్ని ఉపన్యాసాలు కనపడితే వినడం జరిగింది. అష్టావక్ర గీత శుద్ధ అద్వైతమయం. అయన ఉపన్యాసాలలో పేరిశాస్త్రి గారి లెక్చర్ లో ఎకనామిక్స్ ఎంత ఉండేదో అద్వైతం అంత ఉంది. అంతా లోకాభిరామాయణమే. ఇంక ఇండియన్ ఎకానమీ లక్ష్మణ రావు గారు చెప్పేవారు . వస్తూనే కుర్చీ లో కాకుండా, కుర్చీ ముందు ఉండే బల్ల మీద కూర్చునేవారు. చేతిలో పుస్తకం ఉండేది కాదు. ఏ టాపిక్ చెప్పినా దాని పూర్వాపరాలన్నీ స్టాటిస్టిక్స్ తో సహా అద్భుతం గా ఆవిష్కరించేవారు. లెక్చర్ విని పాయింట్స్ నోట్ చేసుకుంటే, డైరెక్ట్ గా పరీక్ష రాసేయడమే . వేరే ప్రిపరేషన్ అక్కర లేదు. అప్పటి లెక్చరర్స్ అనుభవం తో, ఒక వేళ లెక్చరర్ ఉద్యోగం చేస్తే, ఎలా చెప్పాలో, ఎలా చెప్ప కూడదో రెండింటికీ బీజం అప్పుడే పడింది నాకు. థియరీ సబ్జక్టులు మాష్టర్లు చెప్పక పోయినా చదువుకుని మానేజ్ చేయవచ్చు. కానీ అకౌంట్స్ తో అది కుదరదు. అక్కడే పెద్ద సమస్య ఎదురైయింది. రెండు థియరీ సబ్జక్ట్స్ తో పాటు అకౌంట్స్ కూడా ఎస్. ఎస్ గారు తీసుకునేవారు. ఆయన అంత సీరియస్ మనిషి ని ఎక్కడా చూడలేదు . మూడు సంవత్సరాల్లో ఆయన మాతో తో మాట్లాడిన సందర్భాలు ఒకటో రెండో. అదీ ఇంగ్లీష్ లోనే. క్లాసుకు రావడం, పాఠం మొదలు పెట్టడం. ఆయన పాఠం ప్రారంభించగానే బుర్ర ఎక్కడికో పోయేది మళ్ళీ బెల్లు కొట్టిన తర్వాతే తిరిగి రావడం. ఆయన పాఠం గురించి, ఇంగ్లీష్ మాట్లాడటం గురించి ఈ మధ్యనే జరిగిన ఒక పాత విద్యార్థుల మీటింగు లో ఒకడు చెప్పాడు. . ఎస్ ఎస్ గారి కొడుకు రామచంద్రరావు కూడా వీళ్ళతో చదివే వాడుట. మూడు సంవత్సరాలు అయిన తరువాత స్టూడెంట్స్ ఫంక్షన్ లో ఆయన వీళ్ళ తో మాట్లాడుతూ " మీరంతా నాకు మా రామచంద్ర రావు లాంటి వాళ్ళేరా " అని తెలుగు లో అన్నారట. ఆయన ఆలా తెలుగులో మాట్లాడటం వీళ్లకు చాలా ఆశ్చర్యం కలిగింది ట. ఆ మర్నాడు వీరభద్ర రావు గారని ఇంకో లెక్చరర్ తో ఈ విషయం ఆశ్చర్యం గా చెబితే ఆయన " ఒరేయి అదికూడా ఇంగ్లీష్ లో చెబితే, పాఠం అనుకుని మీరు వినరని తెలుగు లో మాట్లాడి ఉంటారు " అన్నారుట. అకౌంట్స్ పాఠాలు, ఎస్ ఎస్ గారు చెప్పేవి కోల్లూరి సూర్యనారాయణ ఒక్కడే ఫాలో అయేవాడు. ఎలా ప్రారంభం అయిందో గుర్తు లేదు, క్లాసులో కొంతమందిమి కలిసి, ఊరికి ఇంకోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగ ఉండే కొల్లూరి ఇంటికి సైకిళ్ళ మీద వెళ్లే వాళ్ళం. నేను, రేఖపల్లి, రాచకొండ, గొర్తి అందరం కలిసి వెళ్లే వాళ్ళం. మాకందరికి అతనే అకౌంట్స్ చెప్పేవాడు. అతని ఇంటికి దగ్గర లోనే ఉండే వాసంశెట్టి రామకృష్ణ కూడా వచ్చేవాడు. ఉన్న పదహారు మందిలో ను, ఒకళ్ళను ఒకళ్ళు ఎలా పిలుచుకునే వాళ్ళమో ఇప్పుడు తలుచుకుంటే. విచిత్రం గా అనిపిస్తుంది . వాసంశెట్టి రామకృష్ణ, మాలో ఎవరినైయినా అండీ అనే శంభోదించేవాడు. మేము కూడా అతన్ని అలాగే పిలిచేవాళ్ళము. మిగతా వాళ్లలో, రాచకొండ, నూకల, రేఖపల్లి, కాశీభట్ల, ఏరా ఎరా అనుకుంటే, కొల్లూరి తో మటుకు ఆలా ఉండేది కాదు. సూర్యనారాయణ అని పూర్తి గా పిలిచే వాళ్ళము. యూనివర్సిటీ కి వెళ్లిన తరువాత 'గురు' 'గురు' అనుకునేవాళ్ళం ( ఇప్పటి, 'బ్రో', 'మామ' లాగ ) కొల్లూరి అకౌంట్స్ చాలా బాగా చేసినా, మిగతా సబ్జక్ట్స్ లో మామూలు గానే ఉండేవాడు. మిగతా సబ్జక్ట్స్ నేను, కాశీభట్ల పోటీ పడుతూ ఉండేవాళ్ళం. అదేమిటో, చదువు కుంటూ పోవడమే కానీ, ఫస్ట్ క్లాస్ కు ప్రయత్నించాలనే ఆలోచన ఎవరికీ వచ్చి నట్టు లేదు. దానికి ఒక కారణం లేకపోలేదు. ఎప్పుడో మా మా బ్యాచ్ కి అయిదారు బాచ్ ల కి ముందు తురగా కృష్ణ మోహన్ కి ఫస్టు క్లాసు వచ్చింది. అతను ఆంధ్ర యూనివర్సిటీ లో ఎంబియే చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫస్ట్ క్లాసు రావడం అంత అరుదు గా ఉండేది. కృష్ణ మోహన్ కి వచ్చినప్పుడు , ఆ విషయం ఊరంతా అప్పుడు గొప్పగా చెప్పుకున్నారు. మామూలుగా బాగా చదివే వాళ్లకి సెకండ్ క్లాస్, హై సెకండ్ క్లాస్ వచ్చేది. ఫస్ట్ క్లాసు అంత అరుదు కాబట్టి, మా బుర్ర లో ప్రవేశించ లేదు. అంటే ఒక ప్లాన్ వేసుకుని చదవడం జరగ లేదు. థియరీ పేపర్లు రాసే టప్పుడు, నాకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. కాగితం లో సగం దాటిన తరవాత లైన్లు యేటవాలు గా అయి చివరికి వచ్చేటప్పటికి చిన్నవి అయి పోయేవి. ఒకమాటు పేపర్లు దిద్ది తిరిగి ఇస్తూ ఇండియన్ ఎకానమీ లెక్చరర్ క్ష్మణరావు గారు. " ఏమిటి ఈ రాయడం. నువ్వు పెద్ద ఆఫీసరు అనుకుంటున్నావా? " అన్నారు పేపర్ ఇస్తూ . మళ్ళీ కాస్త సముదాయిస్తూ " పాపం మార్కులు బాగానే వచ్చాయి " అన్నారు మిగతా వాళ్లతో . అప్పటి నుంచి, ఆ అలవాటు కొంచం మెరుగు అయినా, పూర్తి గా మానుకోక పోవడం పెద్ద పరీక్షలు లో కొంప ముంచింది. ఫైనల్ ఇయర్ లో గ్రూప్ కు అయిదు చొప్పున రెండు గ్రూపులలో మొత్తం పది పేపర్లు. కొల్లూరి తో చదువులో ఎప్పుడూ పోటీ భావం ఉండేది కాదు. కానీ కాశీభట్లకి నాకు నడిచేది. ఎందుకంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, స్లిప్ టెస్టులు వంటివి పెట్టినప్పుడు క్లాస్ లో మిగతా వాళ్ళు అందరు బ్లాంక్ పేపర్ ఇచ్చి వెళ్లి పోయేవారు. అదో పెద్ద ఫ్యాషన్ అప్పుడు. నేను కాశీభట్ల మాత్రం రాసేవాళ్ళం. అందు చేతే పోటీ. వాడికి ఒక మాటు ఫస్ట్ వస్తే, నాకు ఒకమాటు వచ్చేది. ముఖ్యం గా హిందీ పేపర్ లో. వాడు కొంచం స్వంతం గా రాసే శక్తి ఉన్న వాడు. హిందీ లో మనం మొత్తం అత్తా బట్టీ యే. అసలు విషయం జనరల్ ఎస్సే దగ్గర తేలిపోయేది. పేపర్ లో జనరల్ ఎస్సే కి ఎక్కువ మార్కులు ఉండేవి. కొన్ని స్టాండర్డ్ టాపిక్స్ ఉండేవి, వార్తా పత్రికలు, గ్రంధాలయాలు - ఇలా. ఆ లిస్ట్ లో ఉన్నవి బట్టీ కొట్టి పరిక్ష కి వెళ్ళేవాణ్ణి. వాటిలో ఏదయినా తగిలితే మనదే ఫస్ట్ మార్క్. లేకపోతే వాడిదే. తన పక్కన కూర్చోమనేవాడు ఎప్పుడూ. ఒక రోజు " ఏరా చాలా సీరియస్ గా చదివేస్తున్నావుట పబ్లిక్ లో ఫస్ట్ కొట్టేద్దామనా? " అన్నాడు నేను సీరియస్ గా చదువుతున్నానని నీకెవరు చెప్పారు రా " అన్నాను " మా నాన్నగారు చెప్పారు రా " అన్నాడు " మీ నాన్నగారా? " అన్నాను మా నాన్న గారు చెప్పారు రా అని వాడు అనగానే నేను ఆశ్చర్య పోయి," ఆయనకి ఎలా తెలిసింది రా" అన్నాను. జరిగింది ఏమిటంటే, ఫైనల్ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని నేను కాన్సంట్రేట్ చేయడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. అగ్రహారం లో మా మేడ మీద వీధి వైపు ఒక వసారా ఉంది. ఒక లైట్ అక్కడికి లాక్కుని ఎవరు డిస్టర్బ్ చేయకుండా రాత్రి అక్కడ చదువు కునే వాణ్ని. కాశీభట్ల నాన్నగారు ఒక రోజు సైకిల్ మీద వెడుతూ చదువు కుంటున్న నన్ను చూసి ఇంటికి వెళ్లి వాడితో అన్నారుట " పోడూరాడు లైట్ ఏర్పాటు చేసుకుని చదివేస్తున్నాడు రా నిను దాటేస్తాడేమో" అన్నారుట. వాడిని మోటివేట్ చేయడం అని నాకు అర్థం అయింది. కాశీభట్ల వాళ్ళు ఇందుపల్లి లో ఉంటారు. అది అమలాపురానికి మూడు కిలోమీటర్లు దూరం లో ఉంది. కాలేజీ లో లెక్చరర్ గా చేరినతరువాత అక్కడ బిళ్ళకుర్రు దేవకీ నందన స్వామి పూజ జరిగితే అక్కడికి వెళ్లి, కాశీభట్ల ఇంటికి కూడా వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు పచ్చ గా దబ్బ పండులా ఉండేవారు. అన్ని విషయాలు అడిగి, పుస్తకాలు చదువు తావా అని అడిగారు. అప్పటికే నేను కొన్ని ఇంగ్లీష్ నవలలు చదివినవి చెప్పాను. " కౌంట్ అఫ్ మాంటి క్రిస్టో " చదివావా అన్నారు. లేదండి అని చెబితే చదువు బాగుంటుంది అని చెప్పారు. ఆయన చెప్పిన తరవాతే అది లైబ్రరీ లో తీసుకుని చదివాను. తెలుగు లో ఖైదీ సినిమాకి అదే ఆధారం అనుకుంటా. పరీక్షలు అయి రిజల్ట్స్ వచ్చాయి. కొల్లూరి కి ఫస్ట్ క్లాస్ రావడం అందరికి పెద్ద ఆశ్చర్యం. అకౌంట్స్ బాగా వచ్చినా, మిగతా పేపర్లలో మాతో పోటీ లో ఉండేవాడు కాదు. గతం లో తురగా కృష్ణ మోహన్ కి ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు ఊరంతా చెప్పుకున్నట్టే, కొల్లూరి కి వచ్చినప్పుడు కూడా అది పెద్ద న్యూస్. మేము కూడా అందరికి గర్వం గా చెప్పేవాళ్ళము. నాకు, కాశీభట్ల, రేఖ పల్లి లకు హై సెకండ్ క్లాస్. అంటే 55 శాంతం దాటి దాదాపు అరవై కి దగ్గరగా వస్తే ఆలా అనేవారు. ఉద్యోగాలు ప్రకటనల లో ఫస్ట్ లేదా హై సెకండ్ క్లాస్ అడిగేవారు అప్పట్లో. గ్రూప్, B అయిదు పేపర్లలో నాకు కొల్లూరికి సమం గా వచ్చి, ఆ గ్రూప్ కి కాలేజీ ఫస్ట్ అని కాలేజీ వాళ్ళు ప్రైజు ఇచ్చారు. గ్రూప్ A లో కొల్లూరి కి నాకంటే ఎక్కువ వచ్చి అతనికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. గ్రూప్ A అంతా థియరీ పేపర్లు. కొల్లూరి కి A గ్రూప్ లో ఫస్ట్ రావడం అందరికి ఆశ్చర్యమే. నా వైఫల్యానికి, అతని విజయానికి కి కారణం తరవాత తెలిసింది. చదువు లో ఉన్నత శిఖరాలు అది రోహించాలంటే సబ్జక్ట్ అవగాహన ఒకటే సరిపోదు. దానిని ప్రెసెంట్ చేయడం లో కూడా మెలకువ తెలియాలి. ఎలా ప్రెసెంట్ చేయాలన్న దానికి సరి అయిన ఆలోచన వచ్చి ప్రణాళిక వేసుకోవాలి. ఆ విషయం లో కొల్లూరి కి విధి తోడు పడింది. " నువ్వు ఎమన్నా పెద్ద ఆఫీసరువా ఆలా రాస్తున్నావు " అని మాష్టారు హేచ్చరించినా, చెప్పుకో దగ్గ మార్పు ఆ విషయం లో నాలో జరగ లేదు. తరవాత అడిగినప్పుడు కొల్లూరి చెప్పాడు.తాను రాసినప్పుడు, మంచి సైడ్ హెడ్డింగులు పెట్టి, వాటిని రంగు పెన్ను తో అండర్లైన్ చేయడం, ముఖ్య మయిన పాయింట్స్ ని హైలైట్ చేయడం ఇలా ప్రెసెంటేషన్ టెక్నిక్ వాడానని చెప్పాడు . ఆ ఆలోచన అతనికి రావడం, మనకి రాకపోవడమే, ఫలితాలు లో తేడాకి కారణం అని వేరే చెప్పక్కర లేదు. ఆ తర్వాత అతను, నేను కూడా యూనివర్సిటీ లో ఎంబియే లో చేరడం జరిగింది. కానీ తరువాత నేను రేఖపల్లి తో పాటు ఎం.కామ్ లోకి మారడం జరిగింది. ఎం. కామ్ అయితే టీచింగ్ లో అవకాశాలుంటాయన్న విషయం సబ్కాం క్షస్ గా పనిచేయడమే కారణం అనుకుంటా. కొల్లూరి ఎంబిఏ తరవాత ఫుడ్ కార్పొరేషన్ లో చేరి ఎక్సక్యూటివ్ డైరెక్టర్ స్థాయి కి ఎదిగి రిటైర్ అయ్యాడు. మిగతా వాళ్ళముకూడా విధి నిర్ణయించిన మార్గాల లో తృప్తి గానే పయనించాము. ఈ తరంగాన్ని వాసంశెట్టి రామకృష్ణ గురించి చెప్పకుండా ముగించ దలుచు కోలేదు. అందరం వివిధ దారుల్లో వెళ్లినట్టు, అతను కూడా డిగ్రీ అవగానే బొంబాయి వెళ్లి ఎదో షిప్పింగ్ కంపెనీ లో చేరాడు. కొల్లూరి కి మాకంటే అతను దగ్గర. అందుచేత రామకృష్ణ విషయాలు కొల్లూరి చెబుతూ ఉండేవాడు. నేను మైత్రి వనం లో ఐడీసీ లో పని చేసేటప్పుడు అనుకుంటా, రామకృష్ణ షిప్పింగ్ కంపెనీ లో రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్ వచ్చేసి బంధువులతో ఎదో ఫైనాన్స్ కంపనీ పెట్టుకున్నాడని కొల్లూరి చెప్పాడు . కొల్లూరి చెప్పిన కొన్నాళ్లకి ఒక రోజు మా ఆఫీసు కి వచ్చాడు రామ కృష్ణ. డిగ్రీ క్లాస్ మిత్రుడిని చాలా కాలం తరవాత కలవడం చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత అమీర్ పేట వచ్చినప్పుడు కలుస్తూ ఉండేవాడు. ఆలా ఒక మాటు వచ్చినప్పుడు " మా కంపెనీ లో మంచి వడ్డీ ఇస్తున్నాము. మీరు కావలిస్తే కొంత డిపాజిట్ గా పెట్టు కోవచ్చు అని చెప్పాడు. ఆరోజు ఎదో ఎరియర్స్ వస్తే ఆ డబ్బుని డిపాజిట్ గా అతని కంపెనీలో ఒక ఏడాది పెట్టమని ఇచ్చాను. సంవత్సరం అవగానే వడ్డీ తో సహా ఆఫీసు కు తెచ్చి ఇచ్చాడు. దానికి ఇంకొంచెం చేర్చి అతని కంపెనీలోనే ఉంచ మన్నాను. ఆ తరవాత నేను ఉద్యోగం మారి హైదరాబాద్ విడిచిపెట్టడం జరిగి నాలుగేళ్ళ దాకా రాలేదు. మా అమ్మాయి పెళ్లి చేయడానికి హైదరాబాద్ వచ్చాను. పెళ్లి లో ఒక ఖర్చుకి, రామకృష్ణ దగ్గర పెట్టినది సరపోతుంది అని లెక్క పెట్టుకున్నాను. హైదరాబాద్ వచ్చిన మరునాడే కొల్లూరి నాకు ఫోన్ చేసి, ఆవీ ఇవీ చెప్పి, ఆ మధ్యన రామకృష్ణ చని పోయాడని చెప్పాడు. నేను డిపాజిట్ పెట్టిన సంగతి కొల్లూరి కి తెలియదు.. మిత్రుడు చనిపోయాడనే బాధ తో పాటు,ఆందోళన కూడా కలిగింది . నేను కంగారుగా విషయం కొల్లూరి కి చెప్పాను . రామకృష్ణ కూతురు ఫోన్ నంబర్ ఇచ్చి ఆమెని కాంటాక్ట్ చేయమన్నాడు. ఎ కాగితం లేకపోతే ఎవరు నమ్ముతారు? అని ఆందోళన పడ్డాను. సూర్య నారాయణ ( కొల్లూరి ) ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేస్తే రామకృష్ణ కూతురు ఫోన్ తీసుకుంది. నా పేరు చెప్పి విషయం చెప్పాను . మా చిన్నాన్నగారిని కాంటాక్ట్ చేయండి అంకుల్ అని అయన ఫోన్ నంబర్ ఇచ్చింది. ఆయనని కాంటాక్ట్ చేస్తే, అయన కూకట్ పల్లి లో ఒక షాప్ పేరు చెప్పి అక్కడికి వెళ్లి నా పేరు చెప్ప మన్నాడు. నేను అక్కడికి వెళ్లి నా పేరు చెప్పాను. కౌంటర్ లో ఉన్నాయన లోపలికి వెళ్లి వచ్చి ఒక పాకెట్ ఇచ్చి " విప్పి ఒక మాటు చూసుకోండి " అన్నాడు. విప్పి చూస్తే, నేను అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తమే ఉంది. " అనారోగ్యం మొదలవగానే, పేరు పేరు నా ఎవరికీ ఇవ్వాలో చెప్పి, వాళ్ళు రాగానే ఇచ్చేయమని ఏర్పాటు చేశారండి రామకృష్ణ గారు " అని ఆయన చెప్పినప్పుడు, నాకు కళ్ళల్లో న్నీళ్లు తిరిగాయి. అప్పుడే కాదు ఇప్పుడు రాస్తున్నప్పుడు కూడా అంతే సశేషం

మరిన్ని కథలు

Kurukshetra sangramam.6
కురుక్షేత్ర సంగ్రామం .6.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.5
కురుక్షేత్ర సంగ్రామం .5.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.4
కురుక్షేత్ర సంగ్రామం .4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Padavee viramana kanuka
పదవీవిరమణ కానుక
- బామాశ్రీ
Kokku pandi
కొక్కుపంది .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Varsham kosam
వర్షం కోసం
- తాత మోహనకృష్ణ
Konaseema kurradu
కోనసీమ కుర్రాడు
- సిహెచ్. వి. యస్. యస్. పుల్లంరాజు
Marchery lo muchhatlu
మార్చురీలో ముచ్చట్లు
- మద్దూరి నరసింహమూర్తి