పరోపకారం - కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu

పరోపకారం

పెద్దమ్మ పెరట్లో పిచ్చి మొక్కలు, తుప్పలు బాగా పెరిగిపోవడంతో పూల మొక్కలు, కూరగాయ మొక్కలు కనిపించకుండా పోయాయి. ఒకరోజు కూలి వాళ్ళని పిలిచి పిచ్చి మొక్కలన్నీ కొట్టించి శుభ్రం చేయించింది పెద్దమ్మ. రెండురోజుల తర్వాత పెరట్లోకి వెళ్ళిన పెద్దమ్మకి గరుడవర్ధనం మొక్క కనపడలేదు. మొదలు ఎక్కడ ఉందా అని వెతక సాగింది. అదేసమయంలో బిల బిల మంటూ పిల్లలంతా వచ్చి పెద్దమ్మ చుట్టూ చేరారు. "పెద్దమ్మా పెద్దమ్మా ఈరోజు ఏం జరిగిందో తెలుసా"అన్నాడు రుద్ర. "ఏం జరిగిందో చెప్తేనే కదా తెలుస్తుంది" అంది పెద్దమ్మ. "మా బడిలో ఒక అబ్బాయికి జబ్బు చేసింది. వాడు చాలా పేద వాడు. చాలా డబ్బులు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారుట. మా బడిలో ఉన్న పిల్లలు, ఉపాధ్యాయులు అందరం తలో ఇంత వేసుకుని వాడికి డబ్బులు ఇచ్చాము ఇదిగో ఈ శీను గాడు మాత్రం పైసా ఇవ్వలేదు. పీనాసి వాడి దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. అయినా ఇవ్వలేదు." అని ఫిర్యాదు చేశాడు రుద్ర. "ఏరా! శీను నిజమేనా వాడు చెప్పినది" అని ఆరా తీసింది పెద్దమ్మ. "కావాలంటే వీళ్ళని అడుగు" అని మిగతా పిల్లవైపు చూపించాడు రుద్ర. "నా పుట్టిన రోజుకోసం డబ్బులు దాచుకోమని మా నాన్న చెప్పాడు అందుకే ఇవ్వలేదు" అన్నాడు శీను. “హమ్మయ్య కనిపించింది” అంటూ గరుడ వర్ధనం మొక్క మొదలు పిల్లలకు చూపించింది పెద్దమ్మ. రెండు రోజుల క్రితం కూలి వాళ్ళు పొరపాటుగా ఈ మొక్కని నరికేశారు. అయినా ఈ మోడు చిగురించింది. "చూశారా పిల్లలు మొదలు నరికినా, నీళ్ళు పొయ్యక పోయినా, మనకి పువ్వులు ఇవ్వాలని మళ్లీ చిగురించింది. ఇదీ పరోపకారం అంటే దానికంటూ ఎటువంటి స్వార్థము లేదు. దానిని చూసి మనం నేర్చుకోవాలి. సహాయపడే గుణం అలవర్చుకోవాలి. మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత దానం చేస్తూ ఉండాలి. ఆపదలో ఉన్నవారికి సహాయపడాలి." అని చెప్పింది పెద్దమ్మ. "సరే పెద్దమ్మా" అంటూ పిల్లలంతా వారిళ్లకు పరుగు తీశారు. శీనుగాడు జరిగినదంతా అమ్మ నాన్నకి చెప్పి పుట్టిన రోజుకి ఉంచుకున్న డబ్బులు ఉపాధ్యాయుల ద్వారా అనారోగ్యం తో ఉన్న అబ్బాయికి మర్నాడు అందజేశాడు. అందరూ శీనుని మెచ్చుకున్నారు. రుద్ర రోజూ నీళ్ళు పోయడం తో మోడు చిగురించి మొక్కైంది. పూలు పూసింది. పెద్దమ్మ మదిలో సంతోషాన్ని నింపింది.

మరిన్ని కథలు

Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Pillalu-Yajamani
పిల్లలు - యజమాని
- బివిడి ప్రసాద రావు
Spandana
స్పందన
- Doctor Bokka Srinivasa Rao
Amma sakshigaa
అమ్మ సాక్షిగా..
- బంటుపల్లి శ్రీదేవి