రెండు ముఖాలు - భానుశ్రీ తిరుమల

Rendu mukhalu

ఓసారి హరి,సూరి వాళ్ల ఊరి పక్కనున్న టౌను కి పని మీద వెళ్లారు. అదే టౌన్ లో ఉన్న యమ్.యల్. ఏ ని కలిసిపోదామని అతని గెస్టహౌస్కు వెళ్లారు. ఆ యమ్. యల్. ఏ వాళ్ల ఊరి వాడే, పైగా ఒకే సామాజిక వర్గం. వాళ్ల అదృష్టం అన్నట్టు ఆ రోజు అతను టౌన్ గెస్టహౌస్ లోనే ఉన్నాడు. యమ్.యల్.ఏ వీళ్లద్దరినీ చూసిన వెంటనే " ఏంటిరోయి దొంగ నా ..కొ..., ఇలా వచ్చారు" అంటూ ఆప్యాయంగా పలకరించాడు. "ఏం లేదన్న టౌన్ లో పనుండి ఒచ్చినాం, మిమ్మల్ని ఓసారి కలిసి పోదామని ఇటొచ్చినాము" చెప్పాడు హరి . "అవునా,సరే లేరా! మంచి టైమ్కి వచ్చినారు. ఈ సాయంత్రం నా స్నేహితులకు పార్టీ ఇస్తున్నాను. దగ్గరుండి చూసుకోండి. ఈ రోజు రేతిరి ఇక్కడే ఉండి, రేపుదయం ఎళ్లండి" అనుమతి ఇచ్చేసాడు యమ్.యల్.ఏ వారు. వారిద్దరూ అన్న తమకిచ్చిన గౌరవానికి ఉబ్బితబ్బిబ్బైపోయారు. చీకటి పడింది. మద గజల్లా ఉన్న యమ్. యల్.ఏ గారి స్నేహితులు ఓ ఐదారుగురు తెల్లని ఖద్దరు బట్టలలో అప్పుడే లోనికి వచ్చారు. క్రింది ఫ్లోర్ లో అతని కోసం వేచి చూస్తున్నారు. ఆ రాత్రి జరగబోయే మందు,విందులకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. "ఈ రోజు మన పంట పండిందిరోయి.. ఇక్కడే మాటేద్దాం..ఇదేశీ సరుకు రుచి సూచేయెచ్చు ఏటంటావు" అన్న హరి వైపు మెచ్చుకోలుగా చూసాడు సూరిగాడు. పార్టీకి కావలిసిన ఏర్పాటలన్నీ అయినాయి. యమ్.యల్.ఏ గారు కిందికి రావడమే తరువాయి. "అదిగో అన్న వస్తున్నాడు "అన్నాడు ఓ సహాయకుడు. హరి,సూరిలటువైపు చూసారు. వారి కళ్లలో ఆశ్చర్యం. ఓ కొత్త మనిషిని చూస్తున్నట్టు అలా అవాక్కయి నిలుచున్నారు. లేత నీలి రంగు సిల్క్ లాల్చీ,లుంగీ,మెడల నిండా జెర్రి పోతుల సైజులో బంగారు చైనులు, బంగారం తో కట్టిన పెద్ద పెద్ద రుద్రాక్షల మాలలు. మండల చుట్టూ నాగు పాముల్లా చుట్టిన మండ చైన్లు, అవి చాలవన్నట్టు వాటి మధ్య నుండి ముచ్చటగా మెరుస్తున్న వజ్రాలు పొదిగిన రోలెక్స్ వాచీ, పది వేళ్లకూ ఊపిరాడనీయకుండా కప్పేస్తూ పెద్ద పెద్ద ఉంగరాలు, తలపైనా ఓ టోపీ కూడా ఉంది. ఆశ్చర్యం! అది కూడా బంగారు రంగులో మెరిసిపోతోంది, ఇంకా అర చేతిలో రెండు ఐ ఫోనులు. పాదాలకి రాజులను తలపించేలా అమరిన బంగారు రంగు బూట్లు. మండలకు చుట్టిన మళ్లె పూల దండలు , పక్కన అర్థ నగ్నంగా ఇద్దరు అమ్మాయిలతో దర్జాగా అన్న దిగుతుంటే, నడిచొస్తున్న కుబేరుడిలా, సంధించిన మన్మధ బాణంలా వెలిగి పోతున్నాడు. కిందికి వచ్చి ఓ కుర్చీలో ఠీవిగా కూచున్నాడు, ఆ కుర్చీ కూడా బంగారు తాపడ మేసి చేసినట్టుంది. నోరెళ్లబెట్టి నిలుచున్న హరి,సూరిలు తేరుకుని ఒకరు నొకరు గిళ్లుకొని నొప్పి తెలిసి,వారు చూసింది నిజమేనని రూఢీ చేసుకుని, అన్నకి,అన్న స్నేహితులకి మందు, ముక్కలనందించే పనిలో నిమగ్నమైపోయారు. తెల్లారింది, ఆశ్చర్యం!ఉదయానే యమ్.యల్.ఏ గారు ఓ చిన్న డ్రాయర్తో ఆరు బయట గార్డెన్ లో బుద్దిమంతుడిలా వ్యాయామం చేసుకుంటున్నాడు. హరి, సూరిలు అతని అనుమతి తీసుకుని వెళ్దామని అక్కడికి వచ్చారు. "ఏరా!రాత్రి బాగా నిద్రపట్టిందా! బయలుదేరుతున్నారా, ఇదిగో ఈ డబ్బులు ఉంచండి" అంటూ చెరో వెయ్యి రూపాయలు చేతిలో పెట్టాడు. "సరే అన్న మేమిక బయలుదేరుతాం" అని వాళ్లు వెల్తుండగా.. "ఒరేయి! డబ్బులు సంపాదించి అనుభవించక పోతే ఏం లాభం రా?, అయితే రాజకీయాల్లో ఉన్నోడు ,ప్రజల సొమ్ము తిన్నోడు ఎంత సంపాదించినా, ప్రజల ముందు సింపులుగానే కనిపించాలి, లేక పోతే వాళ్లు మనలని చూసి కుళ్లుకుంటారు. మనలిని వాళ్లనుండి వేరుగా చూస్తారు. వాళ్ల ముందు మేము దరిద్రానికి ప్రతినిధులమన్నట్టు ఉండాలి. వాళ్ల ముందు ఎప్పుడూ గొప్పలకు పోకూడదు. అలాగని చెప్పి మన ముచ్చట్లు తీర్చుకోకుండా ఉండలేంగా. నేనూ మనిషినేగా ,ఇవన్నీ మామూలే.... అందుకని మీరు నిన్నిక్కడ చూసినవన్నీ ఆ గేటు దగ్గర మరిచిపోయి వెళ్లండి. బయటకు పోయి అక్కడ,ఇక్కడ ఏదైనా వాగారో, నా సంగతి తెలుసుకదా!" హెచ్చరికలాంటి వీడ్కోలు చెబుతూ "ఇంకో విషయం, ఈ రోజు ఉదయం పది గంటలకి మనూర్లో ఓ బహిరంగ సభ జరగబోతుంది, నేనూ వస్తాను. ఆ సభకి మీరూ రావాలిరా" అంటూ చెప్పి పంపేసాడు యమ్.యల్.ఏ. అయితే అన్నగా కొనియాడబడుతున్న ఆ యమ్.యల్.ఏ పేరు లక్ష్మీ పతి. పాపం! ఆ పేరెందుకు పెట్టారో తెలియదుగాని పుట్టుకతోనే కటిక దరిద్రుడు. బహుశా భవిష్యత్ లో సార్థక నామధేయుడని నిరూపించుకుంటాడనేమో! లక్ష్మీపతి తండ్రి సోమేసు ఓ పల్లెటూరులో ఓ భూస్వామి ఇంటిలో పెద పాలేరుగా పని చేసే వాడు. సంవత్సరానికి ఇన్ని ధాన్యం, ఇంత డబ్బని ఇచ్చేవాడు ఆ భూస్వామి,. అదే సోమేసుకు ఆదాయ మార్గం. అతనికి ఇద్దరు పిల్లలు. అందులో పెద్దోడే లక్ష్మీ పతి,తరువాత ఓ అమ్మాయి. లక్ష్మీపతి చిన్నప్పటినుండీ ఆవారాగా తిరిగే వాడు. చదువు,గిదువు నయి జాన్తా... అయితే లక్ష్మీ పతి యుక్త వయసులోకి వచ్చిన తరువాత సోమేసు.. మరీ మరీ వాన్ని బతిమాలి తన బుగత దగ్గరే పనిలో కుదిర్చాడు. కానీ మనోడు తరచూ పనికి డుమ్మాకొట్టే వాడు. దానికి బుగత ఓ రోజు కోపంతో తిట్లతో రెచ్చిపోయాడు. సోమేసు అయితే మాటలు పడేవాడు కానీ, లక్ష్మీ పతి అలా కాదుగా, మనోడికీ పిచ్చ కోపమొచ్చి, బుగతని నోటి కొచ్చిన తిట్టులు తిట్టి బయటకొచ్చేసాడు. పాపం సోమేసు, బుగత కాళ్లా వేళ్ల పడి క్షమాపణలడిగి, మళ్లీ లక్ష్మీపతిని పనిలో చేర్చాడు. బుగతకి ఇష్టంలేకపోయినా, సోమేసు మీద ఉన్న అభిమానంతో మళ్లీ వాన్ని పనిలో చేర్చుకోడానికి ఒప్పుకున్నాడు, అయితే అప్పటి నుండి కుదురుగా పనిచేసుకుంటూ ఉండేవాడు లక్ష్మీ పతి. పాపం! సోమేసు తన పనిలో భాగంగా ఓ రోజు పెద్ద చెట్టెక్కి దురదృష్టవశాత్తు కాలుజారి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. పాపం, సోమేసు బిడ్డ లక్ష్మీ పతి,అనాధై పోయాడు. అయితే అప్పటి నుండి లక్ష్మీపతిని బుగత బాగానే చూసుకునేవాడు. ఆ ఊళ్లోనే కాక ఆ చుట్టు పక్కల కూడా లక్ష్మీ పతికి సంభందించిన సామాజిక వర్గమే ఎక్కువగా ఉన్నారు. అయితే లక్ష్మీపతికి రాజకీయాలంటే కొంత ఆశక్తి ఉన్నప్పటికీ చేతిలో డబ్బులు లేక పోవట వలన అలా కాలం గడుపుతున్న క్రమంలో , రాజకీయాలలో రిజర్వేషన్ల పుణ్యమా అని ,ఈ సారి లక్ష్మీపతికి చెందిన సమాజిక వర్గానికి గ్రామ సర్పంచి సీటు వచ్చింది. ఆ గ్రామ రాజకీయాలలో కీలక పాత్ర వహించే అతని బుగత ,అదే అదనుగా తాను వెనుకుండి లక్ష్మీ పతిని గ్రామ సర్పంచిగా నిలబెట్టాడు. ఆ ఎన్నికలలో లక్ష్మీపతి సర్పంచిగా ఘనంగా ఎన్నుకోబడ్డాడు. ఏ ముహూర్తాన సర్పంచ్ అయ్యడో, ఇక అక్కడి నుండి వెనుక్కు చూసుకోలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్టు, మండలాలు దాటి నియోజక వర్గ స్తాయికి ఎదిగి నాలుగు సార్లు అధికార పార్టీ యమ్. యల్. ఏ గా గెలిచి కూచున్నాడు లక్ష్మీపతి. ఓసారి మంత్రి గా కూడా చేసాడు. అయితే ఏవేవో కలిసొచ్చి కోట్లు ,ప్లాట్లు పనిగట్టుకుని సంపాదించేసాడు. అయితే , లక్షీపతి చాలా నిరాడంబరంగా కనిపించే వాడు. ఆర్భాటంగా ఆభరణాలు కానీ , విలువైన వస్తువులు వాడే వాడు కాదు. ఆ నిరాడంబరత గురించే ప్రజలు ఎప్పుడూ చర్చించుకుంటూ ఉంటారు. ఆ ప్రజలలో భాగమే ఈ హరి,సూరిలు. వారిద్దరూ లక్ష్మీపతి ఊరి వారే,అతని సామాజిక వర్గానికి చెందిన వారు కూడా. అయితే ఊరిలో వాళ్లిద్దరికీ మాంచి దొంగలనే ఇమేజి ఉంది. దానికి తగినట్టే వాళ్లూ ఇంటా బయట ఏదో ఓ ఇంటిలో కన్నాలేస్తు బతికేస్తుంటారు. పాపం! అదే వారి బ్రతుకు తెరువు మరి. అలాంటి హరి,సూరిలు, ఓ సారి టౌన్ లో ఉన్న లక్ష్మీ పతి గెస్ట్ హౌస్ కి వెళ్లారనుకున్నాం కదా , అక్కడ ఆ రోజు రాత్రి జరిగిన తంతంతా మనకు తెలిసిందే. అయితే అప్పుడు అన్న ఇచ్చిన హెచ్చరికని దృష్టిలో పెట్టుకొని హరి సూరిలు ఊరిలోకి వచ్చి నోరు మూసుకుని ఎవరి పనివారు చేసుకుంటున్నారు. లక్ష్మీపతి చెప్పినట్టే ఆ రోజు ఆ ఊరిలో బహిరంగా సభ ఏర్పాటయింది. లక్ష్మీ పతి వేదిక మీదకక్కి విచిత్రమైన హాహ భావాలతో ముందుగా రాసిచ్చిన ప్రసంగాన్ని తన ఫందాలో చదువుకుపోతున్నాడు .జనంలో మాత్రం అతని ఎప్పుడూ అతని నిరాడంబరతగురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒరే.. అన్నేటిరా! అన్ని డబ్బులున్నా అంత సింపులుగా ఉంటాడు. ఓ మంచి ఓచీ పెట్టుకోడు, ఏలికి ఒక్క బంగారు రింగు కూడా పెట్టుకోడు. పోనీ ఆ మెడకి జెర్రపోతు లాంటి చైనేసుంటాడో లేదో సూద్దామంటే బుద్దిమంతుడికి తాతనన్నట్టు, లాల్చీ పై బొత్తం వరకూ బొత్తాలు పెట్టీసుకుంటాడు. రోజూ ఒకే రంగు లాల్చీ, అదే రంగు పాంటు. చెప్పులు కూడా అంత సోకుగా ఏమీ ఉండవు. అసలు ఏ మూలనా గోరోజనం కనిపీనీడు. మనూరోడు కాబట్టి రోడ్డమ్మట వెళ్తుంటే అంత డబ్బున్నోడు ఇలా రోడు మీద నడసెల్లిపోతున్నాడేటి అనుకుంతాం గాని, అదే మనన్న మరో దేశానికో ,రాష్ట్రానికి పోయి రోడ్డు మీద అలా నడుసి పోతుంటే, అక్కడి జనం, పాపం! ఎవరో పేదోడు నడుసుకెళ్తున్నాడు అనుకుంతారు గానీ , అన్నకి ఎంత ఆస్తి,డబ్బు దస్కముందో ఆలకేటి తెలుస్తాది. "నీవెన్నైనా సెప్పురా .. చింప్లిచిటీలో అన్న తరువాతే ఎవరైన..హ" అంటూ భజనలాంటి తన వాక్ప్రహాన్ని ఆపాడు ఇంకో భక్తుడు. "అవును రేయి ! మాబాగా సెప్పావు" అంటూ అన్న యొక్క చింప్లిచిటీకి వంద మార్కులేసేసాడు మరొక్కడు. పక్కనే నిలుచొని వారి చర్చను వింటున్న హరి,సూరిలు ఒకరి నొకరు పిచ్చోళ్లా చూసుకుంటూ, పంటి బిగువున నవ్వాపు కొంటూ లక్ష్మీ పతి ప్రసంగాన్ని శ్రధ్ధగా వింటున్నట్టు నటిస్తూ, అసంధర్భమైనా, కరతాళ ధ్వనులతో అందరిని ఉత్సాహపరుస్తున్నారు, పాపం! హరి,సూరిలు.. చూడకూడనివి చూసినందకు ప్రాయశ్చిత్తమన్నట్టు.

మరిన్ని కథలు

Gatam gataha
గతం గతః (బాలల కధ)
- కొత్తపల్లి ఉదయబాబు
Talli bhasha
తల్లి భాష
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Daparikam
దాపరికం
- వరలక్ష్మి నున్న
Thotakoora naade..
తోటకూరనాడే...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nishani
నిశాని
- DR Bokka Srinivasa Rao
Vachhindi ashadha masam
వచ్చింది ఆషాఢమాసం
- తాత మోహనకృష్ణ