ఆడలేక మద్దెల ఓడు - కాశీవిశ్వనాధం పట్రాయుడు

Aadaleka maddela odu

అడవివరం ఉన్నత పాఠశాలలో వర్షిత్ ఆరవ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం బడి నుంచి ఇంటికి వస్తూనే పుస్తకాల సంచి ఒక మూలకి విసిరేసి తోటి స్నేహితులతో పొద్దుపోయే వరకు గోళీల ఆట ఆడి ఇంటికి వచ్చేవాడు. తల్లి, తండ్రి ఎంత చెప్పినా ఇంటిదగ్గర చదివేవాడు కాదు. కొద్దిరోజుల తర్వాత త్రైమాసిక పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల్లో వర్షిత్ కు సున్నా మార్కులు వచ్చాయి. అది తెలిసి తల్లి, తండ్రి వర్షిత్ ను మందలించారు. “మా ఉపాధ్యాయులు సరిగ్గా చదువు చెప్పడం లేదు. అందుకే నాకు మార్కులు రాలేదు.” అని బుకాయించాడు వర్షిత్. “ఇదే మరి ఆడలేక మద్దెల ఓడు అంటే నీ తప్పుని కప్పి పుచ్చుకోవడానికి ఉపాద్యాయులు సరిగ్గా చెప్పలేదు అంటావా? అలాంటప్పుడు మిగతా వాళ్ళకి మంచి మార్కులు ఎలా వచ్చాయి?” అని కోపంతో రెండు లెంపకాయలు వేశాడు తండ్రి. వర్షిత్ ఏడ్చుకుంటూ వీధిలోకి పరుగు తీశాడు. “ఏవండీ ఆడ లేక మద్దెల ఓడు అంటే ఏమిటండీ.” అని అడిగింది భార్య. “పూర్వం రోజుల్లో పెళ్లి చూపుల సమయంలో అమ్మాయికి ఆట పాట వచ్చునా అని మగ పెళ్లి వారు అడిగేవారు. అంటే సంగీతం, నాట్యంలో ప్రవేశం ఉందా అని అర్థం. ఒకవేళ నాట్యం లో ప్రవేశం ఉన్నట్లయితే నాట్యం చెయ్యమనేవారు. ఆ రోజుల్లో దేవదాసీలు ఆలయాల్లోనూ , కార్యాల పట్ల సంపన్నుల ఇండ్లలోనూ నాట్యం చేసి పారితోషికం (ఎక్కువగానే ) తీసుకొనే వారు. వాళ్ల నాట్యానికి పక్క వాయిద్యాలూ ఉండాలి. కొందరు శ్రద్ధగా శాస్త్రీయ నాట్యం నేర్చుకొని చక్కగా నాట్యం చేసి విద్వాంసుల మెప్పు పొందేవారు. మరి కొందరు నట్టువ గత్తెలు ‘విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి’ అన్నట్టు వారి దగ్గర విద్య తప్ప మిగిలిన హంగులన్నీ పుష్కలంగా ఉంటాయి. వాళ్ళు నాట్యం చక్కగా చేయలేక “ మేళగాడికి మద్దెల వాయించడం రాక పోతే నేనేమి చేసేది?. అతడి వల్లనే నా ప్రదర్శన భ్రష్టు బట్టింది. అని తమ తప్పు మద్దెల వాయించే వారి మీదికి నెట్టేవారు. “మన చేతకాని తనాన్ని లేదా తప్పును సమర్ధించుకోవడానికి లేదా కప్పిపుచ్చు కోవడానికి ఇతరులను బాధ్యులు గా చేసే వారినుద్దేశించి ‘ఆడ లేక మద్దెల ఓడు’ అనే సామెత పుట్టింది.” అని చెప్పాడు భర్త. అప్పుడు భార్యకి అసలు విషయం అర్థమయ్యింది. అప్పటి నుంచి తల్లి తండ్రి వర్షిత్ చదువుపట్ల శ్రద్ధ కనపర్చసాగారు.

మరిన్ని కథలు

Pillalu-Yajamani
పిల్లలు - యజమాని
- బివిడి ప్రసాద రావు
Spandana
స్పందన
- Doctor Bokka Srinivasa Rao
Amma sakshigaa
అమ్మ సాక్షిగా..
- బంటుపల్లి శ్రీదేవి
Nee nagumomu naa kanulara
నీ నగు మోము నా కనులారా....
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Bharya anukoolavathi shatru
భార్యా అనుకూలవతీ శత్రుః
- జి.ఆర్.భాస్కర బాబు
Mosam
మోసం
- వెంపరాల దుర్గా ప్రసాద్