 
                                        అగ్రహారం గ్రామంలో సీతారామయ్య గారి ఇంటి పెరటి కోరడిగట్టు
 అవతల పొలంలో పెద్ద మర్రిచెట్టు ఊడలు దిగి విశాలలంగా
 కొమ్మలతో విస్తరించి ఉంది.
 కోరడి గట్టు లోపలివైపున మునగచెట్టు, కరివేపాకు చెట్టు, జామ
 చెట్టు అరటి మొక్కలు ఇంకా ఎన్నో పూల మొక్కలు కూరపాదులు
 ఉన్నాయి. ఉదయమయేసరికి రకరకాల పక్షులు, అనేక జంతువుల
 సంచారం, అరుపులతో వాతావరణం సందడిగా కనబడుతుంది.
 సీతారామయ్య గారి మనుమలు, ఆడవారు ఎప్పుడూ దొడ్లో
 పళ్లో పువ్వులో కూరగాయలు కోసుకుంటు ఉంటారు.కాకులు,
 పిచుకలు, రామచిలుకలు , ఉడుతలు ఇలా ఏవో ఒకటి పగలంతా
 ఆహారం తింటూ తిరుగుతుంటాయి.
 కోరటి గట్టు అవతల ఉన్న భారీ మర్రిచెట్టు ఇదంతా చూస్తూ
 'ప్రకృతిలో భగవంతుడు నాకు ఇంత పెద్ద మాను, విశాలమైన
 కొమ్మలు, స్తంభాల్లాంటి ఊడలు ప్రసాదించాడు కాని ప్రాణులకు
 ఉపయోగపడే ఫలాలు పుష్పాలు ఇవ్వలేదు. రాత్రప్పుడు పక్షులు
 జంతువుల నివాసానికే తప్ప నా కలప కూడా ఎందుకు
 వినియోగానికి పనికిరాదు. ఇక్కడ మనిషి సంచారం కూడా ఉండదు'
 అని మనసులో బాధ పడుతుంటుంది.
 ఇటు కోరడి లోపల ఉన్న మొక్కలకు చెట్లకు పాదులకు నూతి
 నీరు కాలువల ద్వారా ప్రవహించి పచ్చగా కళకళలాడుతుంటాయి.
 అవి భారీగా విస్తరించిన మర్రిచెట్టును చూస్తు అవహేళనగా ఏనుగంత
 శరీరంలా భారీగా ఉంది కాని ఎవరికీ ఉపయోగపడదు.. మనల్ని
 చూస్తే పొద్దస్తమానం ఎవరో ఒకరు మనచుట్టూ తిరుగుతూనే ఉంటారు
 అనగానే మునగచెట్టు అందుకుని " ఔను అమ్మగారు సాంబారులోకి
 తాజా ములంకాడలు కోసుకు వెళతారంటే, నా కరివేపాకు కోసం
 కొమ్మ వంచి లేత రెబ్బలు తీసుకెల్తారని అనగానే కిందనున్న గుమ్మడిపాదు
 కలగచేసుకుని పులుసుముక్కల కోసం నన్ను వెతుకుతారంటె "
 అది విన్న అరటిమొక్క" భోజనానికి అయ్యగారు వచ్చి లేత ఆకులు
 కోసుకు వెళతారని" తన సోది చెప్పింది.
 నిండుగా దోరముగ్గిన పళ్ల కొమ్మలతో విస్తరించిన జామచెట్టుకు
 చిర్రెత్తి "ఆపండి ,మీ గొప్పలు. ఎండ ముదరగానె రామచిలుకల
 జంటలు, ఉడుతలు, అయ్యగారి మనుమలు నా చెట్టు చుట్టూ
 పళ్ల కోసం తిరుగుతుంటారని" నీలిగింది.
 ఒకరోజు మద్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంది. ఒక పండు
 మూతి కోతి ముగ్గిన పెద్ద జాంపండు తెచ్చుకుని చల్లగా ఉందని
 మర్రిచెట్టు మొదలు మీద కూర్చుని తింటోంది.
 మర్రిచెట్టు నుంచి చిన్నగా ఏడుపు వినబడింది. ఏమైందోనని
 వానరం" ఎందుకు రోదిస్తున్నావు మహా వృక్షమా?" అని అడిగింది.
 " ఏం చెప్పమంటావు వానరమా, దేవుడు నా పట్ల అన్యాయం
 చేసాడు. విశాలంగా శాఖోపశాఖలు బలమైన ఊడలు పెద్ద
 మొదలు విస్తరింపచేసాడు. ఎందుకూ పనికిరాను. నన్ను ఎవరూ
 ఆదరించరు. ఎందుకూ ఉపయోగపడని నలుసులంత ఫలాలు,
 మొద్దుబారిన ఆకులు కలప కూడా వినియోగానికి పనికిరాని
 జీవితం నాది. ఏకాకిలా ఎండకు వానకు తడుస్తుంటాను.
 పలకరించేవారు కరువయారు.
 ఆవైపు నున్న వేపచెట్టును చూడు. కొమ్మలను గొల్లలు కోసి మేకలకు మేతగా వేస్తుంటారు.పండిన పళ్లను కాకులు ఇతర
 పక్షులు తిని ఆకలి తీర్చుకుంటాయి.గ్రామ దేవతల పూజలప్పుడు
 పసుపు కుంకుమతో అలంకరించి పూజలు చేస్తారు . ముదిరిన
 చెట్టు కలపను మంచాలు, ఇంటి అలంకరణ వస్తువులుగాను
 పళ్లగింజల నూనెను ఔషధాలలో ఎరువులుగా ఉపయోగిస్తారు.
 ఈవైపు చూస్తే మామిడిచెట్టు పచ్చని ఆకులతో కళకళలాడుతోంది.
 సీజనులో పళ్లతో నిండుగా కనబడుతుంది. కాయల కోసం పిల్లలు,
 పండిన తర్వాత పెద్దలు పళ్ల కోసం ఎగబడతారు.శుభకార్యాలప్పుడు
 మామిడి తోరణాల కోసం ఆకులు తీసుకెళతారు. ముదిరిన చెట్టు
 కలపను అనేకరకాలుగా వినియోగిస్తారు. ఎందుకూ పనికి రాని
 నన్ను చూసి కోరడిగట్టు ఆవల ఉన్న పంతులు గారి ఆవరణలోని
 చెట్లు ఎగతాళిగా నవ్వుతుంటాయి " మనసులోని బాధను
 వెలిబుచ్చింది మర్రిచెట్టు.
 మర్రిచెట్టు మనోవేదన విన్న వానరం ఓదారుస్తు
 మహావృక్షమా ప్రకృతిలో మనుగడ కోసం భగవంతుడు
 పక్షులు జంతువులు వృక్షాలు వివిధ జీవులను అనేక
 విధాలుగా సృష్టించాడు. చిన్న కీటకం నుంచి పెద్ద జంతువులు
 వాటి ఆకారం ఆహార నివాసాలకు తగ్గట్టు ఏర్పడ్డాయి.
 పర్యావరణ పరిరక్షణ కోసం అన్ని జీవులు, వృక్షాలు ఎంతో
 అవుసరం. నువ్వు ఇతర వృక్షాలతో సరిపోల్చుకుని బాధ
 పడకు. ప్రకృతిలో అన్ని జీవులు ఒకేలా ఉంటే వాటి మనుగడ
 సాగదు. పరిస్థితులు పరిసరాల ననుసరించి ప్రాణులలో
 వైవిద్యం అవుసరం. కాబట్టి చిన్న గడ్డి పరక నుంచి నీలాంటి
 మహా వృక్షాలు వరకు ఉండాలి. అందరూ ప్రకృతిలో
 భాగస్వాములే. వారితో పోల్చుకుని నిన్ను నువ్వు కించ
 పరుచుకోకు. నీ పరిధిలో ప్రకృతికి సహకరిస్తున్నావు.
 ఎన్నో జీవులకు ఇవాసం కల్పిస్తున్నావు. పగలు ఎండ
 సమయంలో నీడ ఇస్తున్నావు. చల్లని గాలిని విసిరి
 భూమిని చల్లబరుస్తున్నావు. హుద్ హుద్ వంటి భయంకర
 తుఫానులు గాలివానలు వచ్చినప్పుడు తట్టుకు నిలబడ్డావు.
 ఎన్నో జీవరాసులను నీ ఛత్ర ఛాయలో కాపాడినావు.
 చిన్న చిన్న వృక్షాలు నేలకొరికిగినా మేరువు పర్వతంలా
 నిలబడి నీ విశ్వరూపాన్ని చూపించావు. కనుకు నువ్వు
 ఎవరికీ తీసిపోవు. నీ ఔన్నత్యం నీకుంది. దిగులు పడకు"
 దైర్యం చెప్పింది వానరం
 వానరం ఓదార్పు మాటలు విన్న మర్రిచెట్టు ఊరట చెంది
 వానరానికి ధన్యవాదాలు తెలుపుకుంది.
 సమాప్తం
 








