
ఓ ఇరవై ఏళ్ళ క్రితం - నేను యలమంచిలి జడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్న రోజులు. శ్రీమతి గారి ఉద్యోగం, పిల్లల పై చదువుల నిమిత్తం విశాఖపట్నంలో నివాసం. రోజూ విశాఖపట్నం నుండి యలమంచిలి వెళ్లివచ్చేవాడిని. వెళ్లిరావడానికి అనువుగా ఉంటుందని రైల్వే స్టేషన్ దగ్గరలో అల్లిపురంలో ఓ చిన్న కొంపలో మకాం. రోజూ ఉదయం ఏడు గంటలకే సింహాద్రి బయలుదేరుతుంది. శ్రీమతి గారు ఉదయం నాలుగున్నరకే నిద్రలేచి స్నానం వగైరా ముగించుకుని వంట పూర్తి చేసి ఆరున్నర సరికి కేరియర్ అందించేవారు. ఓ పావుగంట పరుగులాంటి నడకతో రైలు స్టేషన్ చేరుకునే వాణ్ని. నాతోపాటు మిగతా ఉద్యోగస్తులు చాలామందికి ఆ సింహాద్రి ఓ ఆపన్న మిత్రుడు. అనకాపల్లి, యలమంచిలి, తుని ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసే కుర్ర, నడివయసు ఉద్యోగులు కొన్ని వందలమంది ఆ రైల్లో రోజూ ప్రయాణించే వారు. విశాఖపట్నం నుండి దువ్వాడకీ, అక్కడి నుండి అనకాపల్లికీ, అక్కడి నుండి యలమంచిలికీ, అక్కడినుండి తునికీ ఇరవయ్యేసి నిమిషాలు చొప్పున మొత్తం గంటన్నరసేపు ప్రయాణం.
రోజూ వెళ్ళి రావడం కాస్తంత కష్టమే అయినా ఆ ప్రయాణాల్లో కావలసినంత కాలక్షేపం ఉండేది. షటిల్ చేసేవారందరూ వారివారి ఉద్యోగాలతో సంబంధం లేకుండా రకరకాల గ్రూపులుగా ఉండేవారు. స్త్రీలందరూ ఒకే కంపార్ట్మెంట్లో ఎక్కేవారు. పురుషుల్లో పేకాట బేచ్ ఒకటి, సినిమా బేచ్ ఒకటి, కుర్రకారు బేచ్ ఒకటి, ఇలా. నాలాంటి పుస్తక ప్రియులంతా ఇంజన్ వెనక మొదటి కంపార్ట్మెంట్లో ఎక్కి పుస్తకాల గురించి, రచయితల గురించి, వారి రచనా విధానాల గురించి రకరకాల వ్యాఖ్యానాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు చేసుకునేవాళ్లం.
ఈ గ్రూపుల్లో కొన్ని నియమాలుండేవి. ఉదాహరణకు, ముందుగా వచ్చిన వారు, గ్రూపులోని మిగతా అందరికీ సీట్లు ఉంచాలి. ఎవరైనా ఏరోజైనా రాకపోతే ఆ విషయం ఎవరో ఒకరికి తెలియపరచి ‘శలవు’ ‘మంజూరు‘ చేయించుకోవాలి. లేదంటే మరుచటి రోజు ఐదు రూపాయలు ఫైన్ కట్టాలి. ఎవరికీ చెప్పకుండా గ్రూపు మార్చేస్తే పది రూపాయలు ఫైన్. గేట్ పక్కన కూర్చున్న వారు ట్రెయిన్ బయలుదేరే సమయానికి గేటు దగ్గర నిలబడి ఎవరైనా పరిగెత్తుకుంటూ ట్రైన్ అందుకునే ప్రయత్నం చేస్తుంటే చెయిన్ లాగి అమాయకంగా దూరం వెళ్లిపోవాలి. ఎవరైనా సీజన్ టికెట్ రెన్యూవల్ చేయించుకోవడం మర్చిపోతే చెకింగ్ టైంలో వేరేవాళ్లెవరైనా వాళ్ల టిక్కెట్టిచ్చి మేనేజ్ చెయ్యాలి.
ఇవి కాకుండా కొందరు అన్ని గ్రూపుల్నీ కలిసి అందరి భోగట్టాలూ మిగతా వారికి చేరవేసేవారు. రకరకాల డిపార్టుమెంట్లలో పని చేసేవారు ఉంటారు కాబట్టి ఎవరికైనా ఎక్కడ ఏ పని ఉన్నా సింహాద్రి సాక్షిగా చక్కబెట్టుకునే వెసులుబాటు ఉండేది. ప్రతినెలా జీతాలు రాగానే ఓ చీటీ వేసుకునేవారు కొందరు. పండగల సమయాల్లో బట్టలు ఎక్కడ మంచి రేంజ్ ఉన్నాయో, ఎక్కడ ధరలు బాగున్నాయో … … ఒకటేమిటి, అదో మూచ్యువల్ వెల్ఫేర్ కమ్యూనిటీ!!
గోపాలపట్నం కేబిన్ దాటేసరికి టీ వచ్చేది. రోజూ తిరిగే మొహాలు కాబట్టి టీ అమ్మే రాజు దగ్గర మాకు పావలా కన్సెషన్ ఉండేది. ఈ గంటన్నర ప్రయాణంలో బిచ్చమెత్తుకునే వారూ, రైలు బోగీ లోపల తుడుస్తూ శుభ్రపరచే వారు, సమోసాలు, వేయించిన వేరుశనగ పలుకులు, మసాలా బటాణీలు అమ్ముకునే వారు … ఎందరికో జీవనాధారం ఆ సింహాద్రి!!
వీరందరి సహవాసంతో మూడేళ్లు సునాయాసంగా గడిచింది. ఆ మూడేళ్లలో ఓరోజు జరిగిన సంఘటన నేనెప్పటికీ మరచిపోలేనిది. మా స్కూల్లో జరుగబోయే ఓ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు చేయడానికి ఓ శలవు రోజు వెళ్లాల్సి వచ్చింది. శలవు రోజు కావడంతో నేనొక్కడినే వెళ్తున్నాను. చేతిలో షేక్స్పియర్ డ్రామా ‘ద హేమ్లెట్’ తో కాలక్షేపం చేస్తూ చిన్నగా కునుకు తీశాను. అలికిడి కావడంతో ఉలిక్కిపడి లేచి చూశాను. రెండు కాళ్ళూ లేని బిచ్చగాడిని ఎవరో ప్రయాణీకుడు మందలిస్తున్నారు. సాధారణంగా ఆ బిచ్చగాడు యలమంచిలి సమీపంలో మా కంపార్ట్మెంట్ లోకి వస్తాడు. అతడే మాకు టైం కీపరు. అతడు ఎంట్రీ ఇస్తే యలమంచిలి లో దిగాల్సిన వాళ్లందరం గేటు దగ్గరికి చేరుకుంటాం. ఎప్పటిలానే అతడు కనిపించగానే గేటు దగ్గరికి వెళ్లడానికి నిలబడ్డాను. “ఇంకా యలమంచిలి రాలేద్సార్” అని అనేసి అతడు ముందుకు ఉపక్రమించాడు. కిటికీ లోనుండి చూస్తే ట్రైన్ ఇంకా అనకాపల్లి స్టేషన్ చేరుతోంది. సంబాళించుకొని మళ్ళీ సీట్లో కూర్చుని పుస్తకం తెరిచాను.
సాధారణంగా సాయంత్రం మళ్ళీ ఇదే సింహాద్రి లో తిరుగు ప్రయాణం. ఉదయం కరెక్ట్ టైం కే బయలుదేరినా సాయంత్రం మాత్రం ఒక్కోరోజు ఒక్కో టైం కి వచ్చేది. ఉదయం అంత సందడిగా ఉండే ఈ ట్రైన్ తిరుగు ప్రయాణంలో చిరు వ్యాపారులు కానీ యాచకులు కాని లేకుండా ప్రయాణం ఒకింత స్తబ్ధుగా ఉండేది. అందుకే తిరుగు ప్రయాణంలో దాన్ని ‘హింసాద్రి’ అని ముద్దుగా అనుకునే వాళ్ళం.
ఆరోజు పని ఎక్కువ ఉండటాన సాయంత్రం హింసాద్రికి అందుకోలేక పోయాను. మళ్లీ ఆరున్నరకు ఈస్ట్ కోస్ట్ లో వెళ్లడానికి ఓ అరగంట ముందే స్టేషన్ చేరుకున్నాను. స్టేషన్లో అలవాటైన కేంటీన్లో ఓ కప్పు కాఫీ తాగి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి ఓ చివరగా ఉన్న బెంచీమీద కూర్చుని చేతిలోని హేమ్లెట్ నవల తెరిచాను. “దో దేరీజ్ మేడ్నెస్, దేరీజ్ మెథడ్ ఇన్ ఇట్“ అన్న డైలాగ్ పొలోనియస్ పాత్రధారి చెప్పే సన్నివేశం అది. దీన్నే “దేరీజ్ మెథడ్ ఇన్ మేడ్నెస్” (పిచ్చితనంలో కూడా పద్ధతి ఉంది) అని తరచుగా వాడుతుంటారు తెలిసినవారు. చదువుతూ ఉండగా వెనకవైపునుండి ఎవరో దెబ్బలాడుకుంటున్న అలికిడైంది. ఏమిటో చూద్దామని ప్లాట్ఫారం గోడ మీదినుండి అవతలివైపు, శబ్దం వస్తున్న దిశగా చూశాను. చలికాలం కావటంతో అప్పుడే చీకటి పడింది. అవతలివైపు సీన్లో కొందరు వ్యక్తులు చలిమంట చుట్టూ చేరి చలికాచుకుంటూనే ఘర్షణ పడుతున్నారు. వారిలో ఒకామె ఓ ఎత్తైన రాయి మీద కూర్చుంది. మిగతా వారంతా కింద కూర్చుని ఉన్నారు. బహుశా ఆమె వారందరికీ నాయకురాలై ఉంటుందనుకుని, ఏదో వాళ్ళ గొడవ, నాకెందుకు, అని వెనక్కి తిరిగాను. “ఈడు ఎలమంచిలి కాడ రావాలక్కా. అనకాపల్లి కాడే ఒచ్చీసినాడు. ఎనక్కెలిపోమంతే నన్ను తోసీసినాడు” ఒక స్వరం కంప్లయింట్ ఇస్తోంది. ఆ స్వరం పరిచయమున్నట్టుగా అనిపించింది. కంప్లయింట్ లో చెప్పిన సన్నివేశమూ ఎక్కడో తారస పడ్డట్టే అనిపించి కుతూహలం పెరగడంతో మళ్ళీ అటుకేసి చూశాను. ఇప్పుడు కొంచెం ఆ వ్యక్తుల్ని గుర్తించగలుగుతున్నాను. మాట్లాడుతున్న వ్యక్తి రోజూ ట్రైన్లో పాటలు పాడుకుంటూ బిచ్చమెత్తుకుంటాడు. ఆ రాయి మీద కూర్చున్న నాయకురాలు ఓ పసికందును ఎత్తుకుని పాపకు పాలకోసం బిచ్చం అడుగుతుంది. మరో వృద్ధుడు ఓ యుక్త వయసు అమ్మాయితో కలసి ఆ అమ్మాయికి పెళ్లి చెయ్యడానికి ఆర్థిక సహాయం చేయమంటూ వస్తుంటాడు. ఒక వ్యక్తి ట్రైన్ లోని చెత్తను తుడుస్తూ వస్తాడు. ఓ ఇద్దరు వారి శక్తి మేరకు పాత తెలుగు పాటలు పాడుతూ వస్తారు. ఓ అంధుడు, ఓ చేతులు లేని వ్యక్తి, వారూ బిచ్చగాళ్లే! అందరికీ మధ్యలో రెండు కాళ్లూ లేని వ్యక్తి, బహుశా నిందితుడేమో!!
నాయకురాలు గట్టిగా అందరికీ దిశానిర్దేశం చేస్తోంది. “అందరూ గుర్తెట్టుకోండి. రైల్లో అందరూ ఒక లైన్లో యెల్లాల. మందు సెత్త తుడిసినోడెల్లాల. ఆడి తరవాత ఈల్లిద్దరూ పాటలు పాడుకోవాల. యెనకాల ముసిలోడు, ఆ పిల్లా యెల్లి పిల్లపెల్లికి అడుక్కోవాల. ఆల్ల తరవాత నేను సంటిదానికి పాలుకోసం యెల్తాను. నా తరవాత గుడ్డోడు. ఆడి తరవాత సేతుల్లేనోడు. ఆకర్న కాల్లు లేనోడు. అలాగెల్తే అందరికీ డబ్బులు పడతాయి. ముందు కాల్లు లేనోడెలిపోతే మిగిలినోల్లమీద ఎవలకి జాలి పుడతాది? ఏం పనిసేసుకోలేవా అనడుగుతారు. నువ్వూ బతకాల, నేనూ బతకాల. ఈ పద్దతి ఎవలైనా దాటితే బాగోదు మరి!”
నేను గుడ్లప్పగించి చూస్తుండగానే స్టేషన్లో గంట మోగింది. వాళ్లందరూ హడావుడిగా లేచిపోయారు. చెత్త తుడుచుకునే వ్యక్తి చేతిలోని సంచి జారిపోయి, అందులో దాచిన చెత్త కొంత బయట పడి పోయింది. కంగారుగా అతడు సంచిలో మిగిలిన చెత్తతోనే స్టేషన్లోకి పరుగు తీశాడు.
ట్రైన్ వచ్చి ఆగడంతో నేను దగ్గరిలోని త్రీ టయర్
కంపార్ట్మెంటులో ఎక్కాను. సీజన్ టిక్కట్టున్నవారు ఏసీలో తప్ప ఏ బోగీలోనైనా ఎక్కినా టీటీయీలు ఉదాసీనంగానే ఉండేవారు.
లక్కీగా నాకు సీటు దొరికింది. కూర్చోగానే “ఏం సార్ సెలవు రోజొచ్చారు? ఇంద, టీ తాగండి. వేడివేడిగా ఉందం”టూ మాకు రోజూ టీ ఇచ్చే రాజు టీ అందించి, నా జవాబు కోసం ఎదురు చూడకుండానే ముందుకు వెళ్లిపోయాడు. టీ తాగి కప్పు పడేయడానికి లేవబోతుండగా “పడియ్యండి సార్, తుడిసెత్తాను” అంటూ తుడిచే కుర్రాడు దర్శనమిచ్చాడు. “ఇప్పుడే కదరా బండెక్కావు, అప్పుడే అంత చెత్త ఎలా వచ్చింది?” అడుగుదామని అనిపించినా అడగలేదు. అతడు వెళ్లిపోయాడు. ఇంతలో ‘నీ దయ రాదా? రామ నీ దయ రాదా?” అని పాడుతూ గాయకుల జంట వచ్చారు. రోజూ చూసే సన్నివేశాలలో కొత్త కోణం ఆవిష్కృతమైంది. నేను మళ్ళీ పుస్తకం తెరిచాను. ముందు ఆగిన చోటే దేరీజ్ మెథడ్ ఇన్ మేడ్నెస్ అనుకుంటూ మళ్లీ మొదలెట్టాను.