
తొలిపలుకు : బాలల కథలు మూడు రకాలు – ఒకటి, బాలలు స్వంతంగా వ్రాసేది; రెండు, బాలలు
ఉత్సాహంగా కుతూహలంగా చదువుకొనే నీతి కూడుకున్న చిన్న చిన్న కథలు;
మూడు, బాలల బాగు కోసం పెద్దవారు (ముఖ్యంగా తల్లులు) చదవవలసిన
కథలు. ఈ కథ మూడో రకానికి చెందినది.
“నా బంగారు తల్లివి కదూ ఈ ఒక్క ముద్ద తినీ అమ్మా”
“నాకు ఆకలిగా లేదమ్మా”
“పొద్దున్ననగా తిన్న ఒక్క ఆరటి పండు తప్ప మరేమీ తినలేదు కదమ్మా”
“ఒకసారి హార్లిక్స్ మరొకసారి బోర్న్ విటా త్రాగేను కదమ్మా”
“ఎంత త్రాగినా రెండు మూడు సార్లు ఉచ్చ పోస్తే ఆ త్రాగినదంతా బయటకు పోయి పొట్ట ఖాళీ అయిపోతుంది. అందుకే, ఈ ఒక్క ముద్ద తినేయమ్మా”
అప్పుడే అక్కడకు వచ్చిన రంగారావుగారుని చూసిన పాప, లక్ష్మి –
“చూడు నాన్నా, నాకు ఆకలి లేదంటే వినకుండా ‘ఈ ముద్ద తినేయి’ అని అమ్మ బలవంతం చేస్తోంది”
“ఎందుకు ఆకలి లేదమ్మా”
“పొద్దున్న లేచి బ్రష్ చేసుకోగానే హార్లిక్స్ త్రాగేను, కొంతసేపు తరువాత అమ్మ అరటిపండు ఇచ్చింది తిన్నాను. మరి కొంతసేపు తరువాత బోర్న్ విటా ఇచ్చింది త్రాగేను. మరి నాకు ఆకలి ఎలా వేస్తుంది నువ్వే చెప్పు నాన్నా”
“రజనీ, చిన్న పిల్ల లక్ష్మికి ఉన్నపాటి జ్ఞానం కూడా నీకు లేదు. ఇప్పటికే రెండు సార్లు అదీ ఇదీ త్రాగడమే కాక మధ్యలో అరటిపండు కూడా తిని, ఇంట్లో కూర్చొని, ఓ ఆట పాటా లేకుండా ఉన్న పిల్లని ఇప్పుడు అన్నం తినమంటే పాపం పాపకి ఆకలి ఎక్కడనుంచి వస్తుంది”
“ఎదిగే వయసులో ఉన్న పిల్ల తినే దానికీ త్రాగే దానికీ ఇలా లెక్కలు వేయకూడదన్న జ్ఞానం లేని మీరు నాకు చెప్పడం వింతగా ఉంది. తండ్రిగా ‘తినాలమ్మా’ అని బోధపరచి చెప్పడం బదులూ, చంటిదాన్ని మీరు వెనకేసుకొని వస్తారేమిటి”
“అదికాదు రజనీ, లక్ష్మిని చూసిన మన ఫ్యామిలి డాక్టరుగారు ఏమన్నారో గుర్తు చేసుకో”
“నాకు ఏమీ గుర్తు లేదు, అయినా అనవసరమైన మాటలు నేను గుర్తు పెట్టుకోను”
“డాక్టరుగారు పిల్లని చూసి చెప్పినవి అనవసరమైన మాటలు ఎలా ఔతాయి. ‘అమ్మాయి తన వయసుకి ఉండవలసిన బరువు కంటే ఎక్కువగా ఉంది. కనుక, తినడానికి త్రాగడానికి సమయాసమయాలు చూసుకోకుండా ఎక్కువగా ఇస్తూంటే మాత్రం వెంటనే ఆ అలవాటు మానుకోండి. పిల్ల చేత రోజూ ఉదయం కొంతసేపు సాయంత్రం కొంతసేపు ఏమైనా ఆటలు ఆడిపించండి’ అని చెప్పేరు కదా”
“ఆయనకేం పోయింది ఏమైనా చెప్తారు, మంచిగా తినక త్రాగక పిల్ల ఎండిపోయి నీరసపడితే అప్పుడు ‘మందులు మాకులు’ పేరుతో దండీగా ఫీజు గుంజవచ్చని ఆ డాక్టరు అలా చెప్పి ఉంటారు”
“నీ అతి గారాబంతో వద్దంటున్నా పిల్ల నోట్లో ఏదో ఒకటి కుక్కడమే కాక, తన ఈడు పిల్లలతో ఆడనివ్వవు కూడా. అలాంటప్పుడు అమ్మాయికి ఎక్కువగా ఉన్న బరువు ఎలా తగ్గుతుంది”
“మరో ఏడాది పోతే బడికి వెళ్ళి వస్తుంది కదా, అప్పుడు అధికంగా ఉంది అంటున్న అమ్మాయి బరువు ‘హుష్ కాకీ’ అయిపోవడమే కాక పిల్ల పుల్లలాగా అయిపోతుందని ఇప్పటినుంచే నాకు బెంగగా ఉంది. పిల్లలకు తల్లితండ్రుల దృష్టి కూడా తగలకూడదు అంటారు. కాబట్టి మీరు అమ్మాయి బరువెక్కిపోతున్నదని అదే పనిగా అనకండి, మీ దృష్టి తగలడమే కాక తథాస్తు దేవతలుంటారు కూడా”
“ఆకలి లేని పిల్ల చేత బలవంతంగా అదీ ఇదీ తినిపిస్తే త్రాగిస్తే, అమ్మాయి కూడా నీలాగే పిప్పళ్ళ బస్తా లాగ తయారవుతుంది. అదే విధంగా దాన్ని ఎదగనిస్తే, రేప్పొద్దున్న ఎవరూ దాన్ని పెళ్లి చేసుకోరు”
“మీకా భయమేమీ అక్కరలేదు. చిన్నప్పుడు నన్ను కూడా అలానే అనేవారు, నాకు పెళ్లి అవలేదూ”
“అందరూ నాలాంటి అమాయకులుండరు” అంటూ ఆయన అక్కనుంచి లేచి టివి చూడడానికి వెళ్లిపోయేరు.
రంగారావుగారికీ రజనికీ వివాహమై పదేళ్ళు కావొస్తున్నా సంతాన భాగ్యం మరి కలగదేమో అని వాపోతున్న సమయాన రజని గర్భం ధరించింది అన్న శుభవార్త తెలియడంతో –
కానుపుకు సిద్ధమయే సమయం వరకూ భార్యను రంగారావుగారు కాలు తీసి కాలు వేస్తే కందిపోతుందేమో అన్నట్టు కంటికి రెప్పలా కాపాడుతూ, తానే బిడ్డను కనేందుకు సిద్ధమౌతున్నంతగా కంగారుపడసాగేరు. ఒక శుభదినాన వారికి పండంటి ఆడపిల్ల జన్మించింది. ఆమెకు ‘లక్ష్మి’ అని నామకరణం చేసేరు.
ఆకలేసినా బిడ్డ నోరు విప్పి అడగలేదు కదా అని రజని ఆరారా పాలు పట్టేది. తాను బలవర్ధకమైన తిండి తింటే తన పాలు తాగే పాపకు బలం కలుగుతుందన్న ఆలోచనతో, రజని కూడా ఎప్పటికంటే కొంచెం ఎక్కువగా తినడం త్రాగడం చేయనారంభించింది.
కొద్ది నెలలకు తల్లి పిల్ల ఇద్దరూ ఉండవలసిన దాని కంటే ఎక్కువ బరువెక్కేరు.
“నా తల్లివి కదూ, ఇంకొంచెం త్రాగమ్మా ఇంకొంచెం తినమ్మా అంటూ రజని లక్ష్మికి మామూలు కంటే ఎక్కువగా తినిపించడం త్రాగించడం చేయడంతో మూడేళ్లు దాటేసరికి లక్ష్మి ఉండవలసిన బరువు కంటే బాగానే ఎక్కువగా ఉండసాగింది.
“రజనీ, నువ్వు అమ్మాయికి ఎక్కువగా తినిపించి త్రాగించి తాను ఉండవలసిన బరువు కంటే బాగా ఎక్కువ ఉండేలా చేస్తున్నావు. నీ అతి గారాబం అమ్మాయికి మంచి బదులు చెడు చేస్తుందని భయం వేస్తోంది. లక్ష్మిని మన ఫామిలీ డాక్టరుగారికి ఒకసారి చూపించి ఆయన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది”
“పిల్లలు బొద్దుగా ఉంటే చూడ ముచ్చటగా ఉంటారు కానీ పీలగా ఉంటే చూడడానికి ఏం బాగుంటారు చెప్పండి”
“నువ్వు చెప్పింది కొంతవరకూ నిజమే రజనీ. కానీ, బొద్దుగా ఉంటూనే పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉండాలి కదా. అందుకే, అమ్మాయికి శరీరం అలిసేటట్టుగా చిన్న చిన్న ఆటలు పరుగులు మప్పితే ఎక్కువగా ఉన్న బరువు తగ్గి అందంగా ఆరోగ్యంగా తయారవుతుంది”
“పరుగులు పెట్టడానికి ఆటలు ఆడడానికి ఇంకా బోలెడంత వయసు ఉంది కదండీ. ఇప్పుడే ఏమి తొందర వచ్చింది. అంతవరకూ శుభ్రంగా తిని త్రాగి బలంగా తయారైతే అప్పుడు అన్ని ఆటలు ఆడగలదు”
“నీ మాటే నీది కానీ నా మాటలో ఉన్న నిజం గ్రహించడం లేదు నువ్వు. అమ్మాయిని నువ్వు ఇలా పెంచితే రేపు కదలలేక నడవలేక అవస్థపడిపోతుందని నా భయం”
చుట్టు పక్కల వారు కూడా లక్ష్మి అధిక బరువు, అందుకు కారణంగా తను లక్ష్మి ఎడల చేస్తున్న గారాబం గురించే, గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారని తెలిసిన రజని మనసు చాలా ఖేద పడింది.
కొన్నాళ్ళకు లక్ష్మిని బడిలో వేసేరు.
బడిలో జరిగే ఉపాధ్యాయుల తల్లితండ్రుల సమావేశాలలో రంగారావు రజని ని ఉద్దేశించి లక్ష్మి చదువు కంటే ఆమెకున్న అధిక బరువు, అందువలన ఆటలలో ఆమె పాల్గొనలేకపోవడం గురించే ఉపాధ్యాయులు ఎక్కువగా మాట్లాడి, వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోమని సలహా ఇచ్చేరు”
ఎవరు పడితే వారు లక్ష్మి అధిక బరువు గురించి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మాట్లాడుకుంటున్నారని తెలిసిన రజనికి కొంచెం కనువిప్పై భర్తతో –
“ఏమండీ మన లక్ష్మి విషయంలో మీరు ఎన్నిసార్లు నన్ను హెచ్చరించినా పట్టించుకోక తప్పు చేసేనని నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. లక్ష్మి ఆరోగ్యం మన చేతినుంచి దాటిపోకుండా మనం వెంటనే మన ఫ్యామిలి డాక్టరుని సంప్రదించి వారు చెప్పినట్టు చేద్దామండీ. అవసరమైతే బడి మానిపించి లక్ష్మి బరువు తగ్గి చలాకీగా తయారైన తరువాత దాని చదువు కొనసాగిద్దాం, ఏమంటారు”
“తప్పకుండా రజనీ, తాను ఇలా తయారవడానికి అమ్మే కారణం అన్న ఆలోచన లక్ష్మి చిన్నారి మనసులోకి చేరి గూడు కట్టుకోకముందే, నీకు లక్ష్మి ఆరోగ్యం గురించి తెలిసివచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. మనం ఈ వారమే లక్ష్మిని తీసుకొని డాక్టరుగారిని కలుద్దాం”
“ఈరోజు లక్ష్మిని బడికి పంపడం మాని ఇప్పుడే మనం డాక్టరు దగ్గరకు వెళ్ళి, ఆయన ఇంకా వేరే ఎవరినైనా ప్రత్యేకంగా సంప్రదించమంటే వెంటనే ఆయనను కూడా సంప్రదించిన తరువాతే ఇంటికి వద్దాం. నేను లక్ష్మికి బట్టలు మార్చి తీసుకొని వస్తాను, మీరు బండీ తీయండి”
లక్ష్మిని పరీక్షించిన డాక్టరుగారు పాప కొంచెం అధిక బరువుతో ఉన్నా ఎటువంటి ఇతర అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంది కాబట్టి, ‘ఆహారం పోషకం’ మీద ప్రత్యేక సలహాలు ఇచ్చే వైద్యుని సంప్రదించమని పంపించేరు.
లక్ష్మిని క్షుణ్ణంగా పరీక్షించిన ఆ డాక్టరుగారు రోజూవారీ ఎటువంటి ఆహారం ఇవ్వాలి, ఎంత పరిమాణంలో ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అన్న సలహాలతో పాటూ, ఆమె శరీరం శ్రమకు తట్టుకొనే వరకూ తేలికపాటి వ్యాయామం చేయవలసిన మెళకువలు కూడా చెప్పి, పది రోజులకొకసారి తన దగ్గరకు వచ్చి అమ్మాయిని చూపించమని చెప్పేరు.
అన్ని సలహాలు చెప్పినా లక్ష్మి తల్లితండ్రుల కళ్ళలో కనబడుతున్న భయం గ్రహించిన ఆయన –
“ఏమీ భయం లేదు, నేను చెప్పినట్టు చేస్తే రెండు నెలల్లో లక్ష్మి లత లాగా చక్కగా తయారౌతుంది” అని భరోసా ఇచ్చేరు.
అమ్మాయికి ఉన్న అధిక బరువు తగ్గేందుకు డాక్టరుగారు చెప్పిన సలహాలు తు చ తప్పకుండా పాటించిన రజని భర్తతో కలిసి అమ్మాయిని తీసుకొని ప్రతీ పది రోజులకూ డాక్టరుగారికి చూపించి ఆయన ఎప్పటికప్పుడు ఇచ్చే సలహాలు క్రమం తప్పకుండా పాటించసాగేరు.
లక్ష్మి చేస్తున్న శారీరక పరిశ్రమ పాటిస్తున్న ఆహార నియమాలు కలిసి, రెండు నెలలు తిరిగేసరికి డాక్టరుగారు చెప్పినట్టు అధిక బరువు పూర్తిగా పోయి సన్నంగా లతలా తయారైన లక్ష్మిని చూసిన తల్లితండ్రుల కళ్ళు ఆనందభాష్పాలుతో నిండిపోయేయి.
“నీకు ఈపాటికి తెలిసి వచ్చింది కాబట్టి నేను వేరుగా చెప్పనక్కరలేదు. అయినా, నా ఆతృతతో చెప్తున్నాను – ఇక మీదట కూడా డాక్టరుగారు చెప్పిన సలహాలు క్రమం తప్పకుండా పాటించి లక్ష్మి శారీరక బరువు సమపాళ్లలో ఉండేటట్టు చూసే బాధ్యత నీదే, గుర్తుంచుకో”
“తప్పకుండానండీ. నాకు తెలిసి రావడమే కాదు, పిల్లలను అతిగా గారాబం చేయకూడదు అని కూడా తెలిసి వచ్చింది. మన లక్ష్మితో పాటూ నేను కూడా డాక్టరుగారి సలహాలు తీసుకొని త్వరలో నా అధిక బరువును తగ్గించుకొని నేను కూడా మల్లెతీగలా తయారై తీరతాను”
“అదే నిజమైతే, ఇప్పటివరకూ తీరని నీ కోరిక తప్పకుండా తీరుస్తానని నేను నీకు మాటిస్తున్నాను”
“నా తీరని కొరికా, ఏమిటి చేప్మా అది”
“నీకు వడ్డాణం కావాలన్న కోరిక నాకు జ్ఞాపకం ఉన్నా, లావెక్కిన నీ నడుమును చూసి అది కొనడానికి ఇప్పటివరకూ నాకు ధైర్యం చాలలేదు. నువ్వు సన్నపడితే వెంటనే అది కొని నేనే నీ నడుముకి అలంకరించి నీకంటే ఎక్కువగా నేనే మురిసిపోతాను” అన్న రంగారావుగారి మాటలకు రజని సిగ్గుల మొగ్గైంది.
** శ్రీరామ**