
ఒక అడవిలో కానుగ చెట్టు పై పిచ్చుక జంట ఒకటి గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేది.
ఆడ పిచ్చుక అప్పటికి గుడ్లు పెట్టింది. ఒక రోజు ఒక మదమెక్కిన అడవి ఏనుగు పగటిపూట ఎండకు అలసి ఆ కానుగ చెట్టు క్రిందకు నీడకై వచ్చింది. అది ఆవేశంతో పిచ్చుక జంట నివసించే కొమ్మను విరిచేసింది. కొమ్మ విరగడంతో పిచ్చుక గుడ్లు అన్ని పగిలిపోయాయి.
ఆడ పిచ్చుక తన సంతానాన్ని కోల్పోయి వ్యధ చెంది దిక్కు తోచక ఏడవసాగింది. దాని ఏడుపు విని తన స్నేహితురాలైన వడ్రంగి పిట్ట దుఃఖముతో తనని సమీపించి..."ప్రియమైన మిత్రురాలా! ఏడవకు. పండితులు గడిచిపోయిన విషయం గురించి, నష్టం గురించి, మరణం పొందిన వారి గురించి శోకింపరు. మూర్ఖుడు దుఃఖం లో దుఃఖం పొందుతూ బాధను పెంచుకుంటాడు. ప్రేతాత్మ తనకు ఇష్టం లేకపోయినా బంధువులు విడిచిన కన్నీటిని తాగుతూ బాధను అనుభవిస్తుంది.
అందుకే బంధువులు ఏడవకుండా పరలోక క్రియలు చేసి ఆ ఆత్మను శాంత పరచాలి" అనింది. ఆడ పిచ్చుక దానితో "నీవు నాకు నిజమైన మిత్రుడివి అయితే నా సంతానాన్ని చంపిన ఆ మదగజాన్ని చంపే ఉపాయాన్ని వెతుకు" అనింది.
మనము ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని పరిహసించి అపకారం చేసిన వాళ్ళకు కీడు చేసిన వ్యక్తి మనకు బంధువు అవుతాడు" అనింది. అప్పుడు వడ్రంగి పిట్ట "ఆపదలో తోడు నిల్చున్న వాడే నిజమైన మిత్రుడు, భక్తితో సేవించేవాడు పుత్రుడు, విధేయత కలిగిన వాడే సేవకుడు, ఆనందాన్ని కలిగించేది భార్య. నాకు ఒక ఈగ స్నేహితురాలిగా ఉంది దాని తోడ్పాటుతో నా బుద్ధిని ఉపయోగించి నీకు సంతోషాన్ని కలిగిస్తాను అంది.
పిచ్చుక, వడ్రంగిపిట్ట కలిసి ఈగ వద్దకు వెళ్లి సహాయం అడగగానే అది సంతోషంగా మిత్ర మిత్రుల విషయంలో ఎటువంటి ఉపకారం అయినా చేస్తాను అంటూ నాకు ఒక కప్ప స్నేహితుడు కలడు. అతని సహాయం కూడా తీసుకుందాము అంటూ "మన మేలు కోరేవారు, శాస్త్రజ్ఞులు, సదాచారులు, ప్రతిభావంతులు, జ్ఞానులు అయిన వారు ఆలోచించే నీతి మార్గం విజయం అవుతుంది" అంది.
తర్వాత ఆ మూడు కలిసి కప్ప వద్దకు పోయి తమ ఆలోచన చెప్పి సహాయం అడిగారు. కప్ప వారిని చూసి "కోపం పొందిన మహా జనం ముందు ఆ ఏనుగు ఎంత" అంటూ ఈగ వైపు చూసి "ఓ ఈగ ...నీవు మిట్ట మధ్యాహ్నం ఆ ఏనుగు చెంత చేరి దాని చెవిలో మధురమైన శబ్దం చేయి. అది నీ గానం వింటూ కండ్లు మూసుకోగానే వడ్రంగి పిట్ట నీవు ఆ ఏనుగు కళ్ళను పెకిలించు. దాంతో అతడు గుడ్డివాడు అయ్యి దాహం కోసం అలమటిస్తాడు. నేను అంతలో నా బంధువులను తీసుకుని బురద గుంట వద్ద బెక బెక మని అరుస్తాను. దానిని చెరువుగా తలచి అతడు నీటి కోసం బురద గుంట వద్దకు వచ్చి ఆ బురదలో కూరుకుపోయి మరణిస్తాడు.
మనం కలిసి కట్టుగా పని చేస్తే పగ తీర్చుకోవచ్చు అంది. అవి అలాగే కలిసి కట్టుగా ప్రయత్నించి పిచ్చుక పగను తీర్చాయి. ఎండు గడ్డిని పేని త్రాడుగా చేసి ఏనుగును అయినా బంధించవచ్చు అలాగే బలహీనుల అనేకుల కలయిక గెలుపుకు దారి తీస్తుంది.