విత్తు ఒకటైతే చెట్టు వేరవుతుందా…. - రాపాక కామేశ్వర రావు

Vittu okataite chettu veravutundaa

"మదు సికిన్ కొట్టుకెల్దుమొస్తావా ?" పది రూపాయల నోటు చూపించి అడిగాడు అప్పలకొండ.

"ఏమిరా కొండా మీ నాన్న వెళ్తారు కదా" అన్నాడు మధు

"రాతిరి మన ఈదికి పోలీసు జమానులు బిగులు ఊదుకొని వచ్చారు నీవు సూడనేదా?"

"ఆ... అవునవును. మీ నాన్నని మళ్ళీ అరెస్టు చేసారా?"

“అవునురా”

“పద”

అప్పలకొండ మధు ఇద్దరు స్నేహితులు. ఒకే వీధిలో ఉంటారు. ఇద్దరు ఒకే ఈడు వాళ్ళు. మధు అయిదవ తరగతి చదువుతున్నాడు. ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అప్పలకొండ చదువుకోలేదు. మధు వాళ్ళ నాన్న పేరు రమణరావు. ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్.

అప్పల కొండ వాళ్ళ నాన్న పేరు "సాహు". పూర్తి పేరు ఎవరికి తెలియదు. అందరు "సారాకొట్టు సాహు" అనేవారు.

ఆ వీధి మొదటిలో ఉన్న ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అందులో నాటు సారా అమ్మేవాడు. ఆ ఊరికి దగ్గర్లోని ఒక పల్లెటూళ్ళో కొంత మంది సారా బట్టీలు నడిపేవారు. వారానికొక సారి వెళ్ళి వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చి రాత్రి పూట సారా అమ్మేవాడు. సాహు భార్య ఇంటిదగ్గర కబాబులు తయారు చేసేది. సారాకొట్టు ముందు ఒక బెంచి మీద పెట్టి అప్పలకొండ అమ్మేవాడు.

అప్పుడప్పుడు అప్పలకొండ "ఒరే మదు, అమ్మనడిగితే ఒక కవ్వా పుల్ల(కబాబ్) ఇచ్చిందిరా, మనిద్దరం తిందుమ రారా”అని మధుకి పంచి ఇచ్చేవాడు.

••••••••••

మధు అప్పలకొండతో స్నేహం చెయ్యడం రమణరావుకు సుతరాము ఇష్టము లేదు. చాల సార్లు "ఆ సారా కొట్టోడి కొడుకుతో నీకు స్నేహమేమిటిరా?" అని కొడుకుని మందలించేవాడు.

వాడితో స్నేహం చేస్తె తన కొడుకు పాడైపోతాడేమోనన్న భయం.

అప్పటికి నాటు సారా నిషేధం అమలులో ఉన్నందున ప్రొహిబిషన్ శాఖ వారు తరచుగా తనిఖీలకొచ్చే వారు. సాహు సారా అమ్ముతు పట్టుబడితె జైలుకు తీసుకెల్లి ఒక రోజు ఉంచి తరువాత విడిచిపెట్టేవారు. సాహు జైలుకెళ్ళిన రోజు ఆయన భార్య ఇంటి దగ్గర సారా అమ్మేది. ఇది ప్రొహిబిషన్ వాళ్ళకి తెలిసినా ఆమె జోలికి వెళ్ళేవారు కాదు.

"సాహు, ఈ వ్యాపారం మానేసి ఇంకేదైనా చేసుకోవచ్చు కదా" అని చాల సార్లు రమణరావు చెప్పినా

"అయ్యా మా తాతల దగ్గరినుండి సారా యాపారం సేస్తున్నాం. ఇప్పుడు ఇది మానేసి వేరే బిగినీసు ఏమి సెయ్యలేనయ్య" అనేవాడు.

"పోనీ పిల్లడినైనా దీన్నుండి తప్పించు, వాడికి చదువు చెప్పించు" అని కూడ చెప్పేవాడు.

చెప్పిన ప్రతి సారి "ఇది మా కులపోల్లకి జీవనోపాయం బాబు" అని తప్పించుకునేవాడు సాహు.

"ఇప్పుడు ఈడిని సదివించానంటె ఈ సారా యాపారం సెయ్యడు. ఉద్దేగం సేస్తానంటాడు. పెద్ద పెద్ద సదువులు సదివినోల్లకే ఉద్దేగాలు రావడము లేదు" అని వర్తమాన జీవిత సత్యం కూడ చెప్పేవాడు.

ఇలా చెప్పడంలో రమణరావు స్వార్థం ఉంది. అప్పలకొండతో స్నేహం చేస్తున్న తన కొడుకు దారి తప్పుతాడేమోనన్న భయం.

••••••••••

ఆ ఊరికి నాలుగు వైపుల నాలుగు సారాకొట్లు ఉండేవి. అన్ని కొట్ల కన్నా సాహు సారాకొట్లోనే జోరుగా వ్యాపారం సాగేది.

సాహు సారా వ్యాపారము చేసినా తాగుడుకు అలవాటు పడలేదు. చిన్నప్పుడు ఒక సారి తండ్రి లేని సమయములో కొట్లో ఉన్నప్పుడు ఒక గ్లాసు సారా తాగాడు. "ఒరేయ్ మనము సారా బేరగాళ్ళం. దానితోనే మన జీవితం. మనమే సారా తాగితే మరి అమ్మడానికేటి మిగలదు" అని తండ్రి మందలించాక మానేసాడు. అప్పటినుండి సారాని ఒక వ్యాపార వస్తువుగానే చూసేవాడు.

తరువాత కొన్నేళ్ళకు ప్రభుత్వం వారు కొత్త అబ్కారీ చట్టం తెచ్చారు. ప్రభుత్వ సారా దుఖాణాలు వెలిసాయి. ప్రభుత్వం వారి అనుమతితో సాహు ఒక దుఖాణం పెట్టుకున్నాడు. ఇప్పుడింక ప్రొహిబిషన్ వారి బెడద సాహుకు తప్పింది.

••••••••••

శాఖాపరంగా సారా బట్టీల పైన దాడులు చేసి సారాను పట్టుకునే విధి నిర్వహణలో దొరికిన సారాలో కొంత మిగుల్చుకుని ఆ సారా తాగడానికి అలవాటు పడ్డాడు ప్రొహిబిషన్ కానిస్టేబుల్ రమణరావు. క్రమ క్రమంగా దానికి బానిసయ్యాడు. వచ్చిన జీతము నాతము అంతా తాగడానికి అయిపోయేది. ప్రతి రోజు ఇంటికి తాగి వచ్చి భార్యని పిల్లల్ని కొట్టేవాడు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారికి ప్రేమ పంచక పోగా వారిని తిట్టడం కొట్టడం చేసేవాడు. పిల్లల మనస్సుల్లో అసూయ ద్వేషం మొలకెత్తాయి.

రమణరావు సంసార నౌక సాఫీగా సాగలేదు. భార్యకు ఆరోగ్యము చెడిపోయింది. పిల్లల్ని సరిగ్గా చదివించలేక పోయాడు. ఆ తరువాత తన ఆరోగ్యం కూడ క్షీణించింది. కొన్నాళ్ళకు రమణరావు మరియు అతని భార్య ఇద్దరు చనిపోయారు.

తల్లిదండ్రులిద్దరు పోవడముతో, పెద్దవారి భయము లేని కారణం గా మధు చదువు అటకెక్కింది. అప్పుడు చదువుతున్న ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. ఆ తరువాత రమణరావు బంధువు ఒకాయన మధుని ఒక అకౌంటెంట్ దగ్గర చేర్పించడం వలన అకౌంట్లు రాయడం నేర్చుకున్నాడు. చిన్న చిన్న దుఖాణాల్లో వాణిజ్య పన్నుల విభాగముకు సమర్పించవలసిన ఖాతా వివరములు తయారు చేసేవాడు. ఒక ప్రక్క తండ్రి చనిపోవడం రెండో ప్రక్క ఆదాయం అందివస్తుండటం తో మెల్ల మెల్లగా మధు కూడ తాగుడుకు అలవాటుపడ్డాడు.

••••••••••

అప్పలకొండ ఇప్పుడు కబాబులు అమ్మడములో ఆరితేరాడు. అన్ని సారా దుఖాణముల వద్ద తన కబాబుల అమ్మకం మొదలు పెట్టాడు. ఆ ఊరిలో "కబాబుల కొండడు" గా ప్రాచుర్యం పొందాడు.

కొన్నాళ్ళకు సాహు దివంగతుడవ్వడముతో తండ్రి వ్యాపారాన్ని కొనసాగించాడు కొండడు.

తరువాత కొద్ది రోజులకు ఆ ఊరిలో రెండు వైన్ షాప్ లైసెన్సులు పొందాడు కొండడు. ఊరిలో కొత్తగా వైన్ షాప్ లు రావడం తో వినియోగదారులు ఎగబడ్డారు. మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారము సాగింది.

"సిరి తా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్" అన్నట్టు, వ్యాపారం కలిసి రావడముతో అనతి కాలం లోనే అప్పలకొండ ధనవంతుడయ్యాడు. ఆ ఊరి హై స్కూల్ కు పదిలక్షల రూపాయల విరాళమిచ్చి నూతన భవనాలు కట్టించాడు. ఊరి మధ్యలో తన స్వంత స్థలములో ప్రజలందరికి ఉపయోగపడేలా ఒక కమ్యూనిటీ భవనం నిర్మించాడు.

"పిల్లలు బాగు పడడానికి గాని చెడిపోవడానికి గాని ఎక్కువ శాతం తలిదండ్రుల ప్రవర్తన, పెంపకం పైనే ఆధారపడి ఉంటుంది" అని అంటారు. ఇది మధు ప్రవర్తన చూసిన వారికి నిజమే అనిపిస్తుంది. సాహు తన కొడుకును చదివించ లేకపోయినా ప్రేమ ఆప్యాయతలు పంచాడు. నీతి నిజాయితీలు నేర్పించాడు.

కాలక్రమేణా కొండడు పైకి దూసుకు పోవడం చూసి అసూయతో లోలోన కుతకుతలాడిపోయేవాడు మధు.

"వీడ్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలి" అనుకున్నాడు మధు. అధికార రాజకీయ పార్టీ సభ్యుడిగా చేరాడు. కొండడి వ్యాపారాలపై ఆదాయపన్ను శాఖలో ఫిర్యాదు చేసాడు. ఆ ఫిర్యాదు మేరకు కొండడి ఇంటిపై వారు దాడి చేసారు గాని అవినీతి సొమ్ము వారికి దొరకలేదు.

శ్రద్ధ పట్టుదలలే పెట్టుబడులుగా, చేస్తున్న పని మీద ఏకాగ్రతతో ముందుకు సాగాడు కొండడు. నిజాయితీగా న్యాయ సమ్మతమైన లాభాలు ఆర్జించాడు.

••••••••••

ఇంతలో పంచాయతి ఎన్నికలొచ్చాయి "కబాబుల కొండడు" ఆ ఊరి సర్పంచ్ పోస్టుకు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసాడు. మధు అధికార పార్టీ తరపున కొండడిపై పోటీ చేసాడు.

ఆ ప్రాంత ఎం ఎల్ ఏ మరియు అధికార పార్టీ వారిచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఓటర్లకు పంచాడు మధు.

అయినా మనస్సు స్థిమితముగా లేదు. పోలింగ్ రోజొచ్చింది మధులో టెన్షన్ ఇంకా ఎక్కువయింది.

కొండడు నామినేషన్ రోజు ఎంత ప్రశాంతముగా ఉన్నాడో పోలింగ్ రోజు కూడ అంతే ప్రశాంతముగా ఉన్నాడు.

పోలింగ్ కూడ ప్రశాంతముగా ముగిసింది. ఓట్ల లెక్కింపు మొదలయింది. కొద్ది సేపట్లో రిజల్ట్ రాబోతుంది.

"రూలింగ్ పార్టీకి తిరుగులేదురా"

"ఎహే కొండడు మన స్కూల్ కి విరాళమిచ్చాడు. ఊరి వాళ్ళందరికి ఉపయోగపడేలా కమ్యూనిటీ భవనం కట్టించాడు. అందుకే కొండడే గెలుస్తాడు"

"డబ్బురా డబ్బు. ఎవరెన్ని చేసినా ఎలక్షన్ ముందురోజు పంచిన డబ్బే గెలిపిస్తుంది."

పలురకాలుగా ఓటర్లు తమ మనోగతాలను వెల్లడిస్తున్నారు.

ఇంతలో మైకులోంచి రిజల్ట్ అనౌన్స్ మెంట్.

"అప్పలకొండ ఉరఫ్ "కబాబుల కొండ" వెయ్యి ఓట్ల మెజారిటీతో మధుపై నెగ్గి పంచాయతి సర్పంచ్ గా ఎన్నికయ్యారు"

ఈ విషయాన్ని జీర్ణించుకోలేక మధు కోపముతో ఊగిపోతూ రోడ్డు పక్కన కొబ్బరి బొండాములమ్మేవాడి కత్తి తీసుకుని అప్పలకొండని వీపు భాగములో పొడిచాడు. వెంటనే అది గమనించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసారు.

అప్పలకొండని స్థానికుల సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

చిన్నప్పటినుండి తండ్రి వక్రమార్గములో పయనించడం చూసిన మధు మనసులో అసూయ ద్వేషం తో పాటు నీచమైన ఆలోచనలు కూడ మొగ్గ తొడిగాయి. "అవి మనిషిని పాతాళానికి నెట్టెస్తాయి" అన్నది నిరూపితమైంది.

చేసిన పని ఎలాంటిదైనా ఎవరికి హాని చెయ్యకుండా మొదటినుండి క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగి ధర్మముగా డబ్బు సంపాదించి ప్రజా సేవకు అంకితమవ్వాలనుకున్న అప్పలకొండ ఉరఫ్ "కబాబుల కొండడు" కు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు.

ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన అప్పలకొండ, “ సర్పంచ్ అయినా నన్ను కబాబుల కొండడు గానే గుర్తుపెట్టుకొండని" ప్రజలకు అభివాదం చేస్తు తెలిపాడు.

అక్కడే రావి చెట్టు కింద రచ్చబండ మీద కూర్చున్న ఒక పెద్దాయన ఈ ఉదంతాన్ని చూస్తూ “విత్తు ఒకటైతే చెట్టు వేరవుతుందా!” అన్న మాట మధు విషయంలో చాల సముచితమైనదన్నట్టు అక్కడ గుమిగూడిన వారందరు తలలూపారు.

-----///-----

మరిన్ని కథలు

Guruvu korika
గురువు కోరిక
- టి. వి. యెల్. గాయత్రి
Itlu nee tammudu
ఇట్లు, నీ తమ్ముడు!
- అంతర్వాహిని
Naalo sagam
నాలో సగం
- టి. వి. యెల్. గాయత్రి.
Pichhuka paga-Enugu chavu
పిచ్చుక పగ - ఏనుగు చావు
- హేమావతి బొబ్బు
Ati Garabam
అతి గారాబం (బాలల కథ)
- మద్దూరి నరసింహమూర్తి
Kotta kathalu kaavaali
కొత్త కథలు కావాలి
- తాత మోహనకృష్ణ
Sarigamalu
సరిగమలు
- కొడవంటి ఉషా కుమారి
Sandhyarani coffee kappu
సంధ్యారాణి కాఫీకప్పు
- అనంతపట్నాయకుని కిశోర్