మళ్ళీ మళ్ళీ రాకూడని రోజు - సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు

Malle malle raakoodani roju

“ఈ సారి మన మ్యారేజ్ డే, మెమొరబుల్ గా వుండాలిరా!” గోముగా అడుగుతూ అతని బలంగా చుంబించింది ఆమె. “వై నాట్? ఎంతో ఇన్నోవేటివ్ గా ప్లాన్ చేద్దాం డియర్.” అన్నాడు ముద్దులు పెట్టి, దగ్గరకు గట్టిగా లాక్కొంటూ. తాము నిలబడింది మెట్రోరైలనీ, సాటి ప్రయాణీకులకు తమ ప్రవర్తన ఇబ్బందికలుగుతుందేమోననే స్పృహ లేదనుకోవాలి వారికి. “ఇదేమి బజారు సరసాల్రా నాయనా! ఏదో గడ్డి మేపు ఎనక్కో, చెఱకుతోటలోనో ముచ్చట్లు మురిపాలు ఉండేవి. మరీ ఇంత బరి తెగింపులా! ఛీ…” తనలో తాను గొణుక్కుంటూ, కూర్చొన్న సీటు వదలి దూరంగా పోయి నిలబడ్డాడు ఓ పల్లెటూరు పెద్దాయన. “ఏడాది తిరగకుండా, విడాకుల కోసం కోర్టు బోనులో కసిగా కత్తులు దూసుకొంటూ నిలబడతారు ఈ రతీమన్మథులు.” చివరి మాటకు దీర్ఘాలు జోడిస్తూ, భార్య చెవిని కరకర నములుతూ జోస్యం చెప్పాడు ఒక ఆసామి. “మెట్రో, ప్రయాణానికి, మంచం, శృంగారానికి. ఈ సహజ న్యాయ సూత్రం పాటించనందుకు, వీళ్ళని కోర్ట్ కు లా…గీ నా సామిరంగా…” అని వీరావేశంతో ఊగిపోయాడు ఒక కోర్టు పక్షి. “తాగింది తక్కువ. తూలింది ఎక్కువ.” మందు సామెత గుర్తుకు వచ్చింది ఓ మందుబాబుకి. తన చరవాణిలో అద్భుతంగా చిత్రీకరించిన, ఆ శృంగార సన్నివేశాన్ని పదే పదే చూస్తూ శునకానంద రసఝరిలో కొట్టుకు పోతున్నాడు ఒక రసశేఖరుడు. ఐనా ఇవేమీ పట్టించుకొనే పరిస్థితుల్లో లేదు ఆ ప్రణయజంట. ఎలా జరుపుకోవాలో, ఎన్ని రకాలుగా ఫోటోలు తీసుకోవాలో, ఏ ఫోటోకి ఎన్ని లైక్స్ వస్తాయో…. ఎడతెరిపి లేకుండా చర్చలు, బుంగ మూతులు, నవ్వులు, ముద్దులు, చిందులు నడుస్తూనే ఉన్నాయి. మెట్రో రైలూ నడుస్తూనే ఉంది. 💐💐💐💐💐💐💐💐 “అరే..ఎవ..రో తలుపు కొడుతున్నట్లు ఉందిరా.” తాగిన మత్తులో మాటలు రావడం లేదామెకు. “డియర్, నన్ను చంపకు….” అన్నాడతడు. “లేదురా… నువ్వే… ప్లీజ్ “ అతి కష్టం మీద ఆమె చెప్పింది. ఆగకుండా కాలింగ్ బెల్ మ్రోగుతోంది. తలుపులు గట్టిగా బాదుతూనే ఉన్నారు. నెమ్మదిగా మత్తు సడలుతోంది వారికి. తబడుతున్న అడుగులతో కళ్ళు నలుపుకొంటూ లైట్స్ వేసుకొంటూ వెళ్లి, అసహనంగా తలుపు తీసి అడ్డంగా నిలబడింది. ఆమెకు, ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి సమయం పడుతుందని వచ్చిన వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఇంటిలోకి రివ్వున దూసుకొచ్చారు. టక టక లాడే బూట్ల ధ్వనితో విశాలమైన బాల్కనీలోకి పరిగెత్తారు. అక్కడ ఏపుగా పెరిగిన ఆ మొక్కల ఫోటోలు తీస్తున్నారు. అయోమయంలో హాల్లోని సోఫాలో కూలబడిందామె. బెడ్ రూంలో మంచం మీద అడ్డంగా పడుకున్న ఆతని వీపు మీద, పోలీస్ లాఠీతో రెండు దరువులు పడ్డాయి. “పోలీస్ స్టేషన్ కి నడవండి.” పోలీస్ ఆఫీసర్ గొంతు హుంకరించింది. “మ్…ఎందుకు సార్?” ఎంతో దీనంగా అడిగారు ఆ యువజంట. “ఆ ఏముంది! పచ్చి పచ్చిగా, పిచ్చి పిచ్చిగా బాల్కనీలో సెల్ఫీలు తీసుకుని, ఫేస్ బుక్ లోనూ, ఇన్ స్టాగ్రాం, స్నాప్ చాట్, ఎక్స డాట్ కామ్ లోనూ పోస్ట్ చేసారు కదా! కొన్ని ఫొటోలు మా పోలీస్ స్టేషన్ లో కూడా తీసుకొని, అవి కూడా పోస్ట్ చేసి… ” అంటున్నాడు పోలీస్ ఆఫీసర్. అతని మాటలు ఇంకా పూర్తి కాకుండానే “ఎందుకు సార్… అక్కడ …ఫోటోలు?” దాదాపు ఏడుస్తూ అడిగారు ఆ జంట. “అబ్బో! మీ ఫోటోలు, మాములుగా లేవు. అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. సూపర్.” అన్నాడు పోలీస్ ఆఫీసర్ వెటకారంగా. “అందుకని… అందుకనే…అరెస్టు చేస్తారా…?” వారి ఏడుపులోంచి ప్రశ్న తన్నుకొచ్చింది. “పోస్ట్ చేసే ముందు ఫోటోలు చూసుకొన్నారా? ఫోటోల్లో మీ సుందర శృంగార భంగిమల వెనుక, పచ్చని ఆకులతో ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలు చక్కగా కనపడుతున్నాయి. గమనించారా?” అన్నాడు పోలీస్ కానిస్టేబుల్, వారి కేసి వాడిగా చూస్తూ. భయంతో గుండె బరువెక్కింది అతనికి. “సార్ …క్షమించండి సార్. బంతి మొక్కలతో పాటు గంజాయి మొక్కల్ని…” ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా ఆతనికి గొంతు పెగలడం లేదు. “పెరటి సాగుగా గంజాయి. గుట్టుగా సాగిస్తున్న వ్యాపారం. తెలివితేటలు అమోఘం. కానీ మీ సెల్ఫీలు, కొంప ముంచుతాయని ఊహించలేదన్నమాట. ప్చ్ ...చిన్న లాజిక్ మరిచారు.” అని ఆగి తల గోక్కుంటూ నిలబడ్డాడు పోలీస్ ఆఫీసర్. “మీరు అనుకుంటున్నట్లు, అవి గంజాయి మొక్కలు కావు.” ఆమె ధైర్యంగా చెప్పింది. ఆఫీసర్ తీక్షణంగా ఆమె కేసి చూసాడు. “కావా? కాకమ్మ కథలు చెప్పకండి.” గట్టిగా అరిచాడు కానిస్టేబుల్. “కాదు సార్. అవి… ప్లాస్టిక్ మొక్కలు. ఫారిన్ నుంచి తెప్పించాం. నిజం." దృఢంగా చెప్పారు ఆలుమగలు. "వాట్! నిజంగానా? నిలువు గుడ్లు వేశాడు పోలీస్ ఆఫీసర్. “మరో సారి చెక్ చేసి వస్తా సార్.” అన్నాడు ఆశ చావని పోలీస్ కానిస్టేబుల్ ఆందోళనగా. ఏదో అనుకుంటే,ఇంకేదో ఐయిందే...అయినా ఇప్పుడనుకుని ఏమి లాభం?" అన్నాడు హెడ్ కానిస్టేబుల్ దిగాలుగా. “సార్, అవి ప్లాస్టిక్ మొక్కలే!.”అన్నాడు కానిస్టేబుల్ నీరసంగా, వాడి పోయిన ముఖంతో. పోలీస్ ఆఫీసర్ కి ఏమీ పాలుపోలేదు. అంతేకాదు అతని అహం దెబ్బతింది. గాండ్రిస్తూ హెడ్ కానిస్టేబుల్ కేసి ఉరుముతూ చూసాడు. హెడ్ కానిస్టేబుల్ కి బుర్రలో మెరుపు, కళ్ళలో కసి తళుక్కుమన్నాయి. వెంటనే తన మొబైల్ ఫోన్ చూపిస్తూ, “మెట్రో ట్రెయిన్లో మన్మథ లీలలు ఈ శీర్షిక ఎలా ఉంది సార్ ? తెగ వైరలవుతున్న ఈ వీడియో వీక్షించండి.” అన్నాడు నాటకీయంగా. “అబ్బో! మీ అమరప్రేమకి జోహార్లు. స్టేషన్లో మీకు సన్మానం చేయవలసిందే. దయచేయండి.” అన్నాడు పోలీస్ ఆఫీసర్, సిక్సర్ కొట్టి, ప్రపంచ కప్ ను ముద్దాడినంత ఆనందంతో. "మా తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్. ఇక అలా చేయం. పొరపాట్లు జరగడం సహజమే కదా సార్." అన్నారు అభ్యర్ధనగా. వంగి దండం పెట్టడానికి, ముందుకు వంగిన ఆ లాలనామణి కులుకు శృంగార భంగిమ ఆఫీసర్ మనసులో కవ్వింత రేపింది. అంతేకాదు రసపట్టులో తర్కం తగదని, చట్టానికి చోటే లేదన్న శాస్త్ర నియమం గుర్తుకు వచ్చింది. ' శరణం భవ’ అన్న వారికి అభయం ఇవ్వక తప్ప లేదు. “నీతి వాక్యం, కథ చివరిలో చెప్పటం కొత్త కాదులే. సరే జరిగిందేదో జరిగింది. పదండి పోదాం.” అన్నాడు పోలీస్ ఆఫీసర్ తల గోక్కుంటూ. 💐💐💐💐💐💐💐 పోలీసులు ఆలా వెళ్ళడం, ఇలా తలుపు వేసి, బీర్ బాటిల్ తీసుకుని మంచం మీదకి దూకిందామె. చీకటిలో చల్లగా జారుకున్న పోలీస్ జీపుని, బాల్కనీ లోంచి చూసి దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడతడు. “వెర్రి వెధవ. చేతిలో లాఠీ తప్ప, చిప్పలో చిప్పు లేదు. వాడికి” అన్నాడు మంచం మీదకు చేరి. “అందుకేగా ఆఫీసర్ అయ్యాడు. మొక్కలు బాల్కనీలో తప్పా ఇంక ఎక్కడా ఉండవని తల గోకుడి గాడి నమ్మకం.” అంది. “అంతేకాదు నీ కైపుకనుల చూపులకి,….” అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు. “ఐ లవ్ యు రా” అంటూ చటుక్కున వాటేసుకొంది గట్టిగా. ఇద్దరూ హాయిగా…. కాలింగ్ బెల్ మళ్ళీ మ్రోగింది. విసుగ్గా వెళ్ళి తలుపు తీసాడతడు. “సార్ కి కోపం వచ్చినట్లుందే. మాంఛి నిద్ర పాడుచేసాం. కానీ తప్పదు, అనుమానాలు నివృత్తి చేసుకోవడం మా ధర్మం” అన్నాడు పోలీస్ ఆఫీసర్ దురుసుగా లోపలకు వస్తూ. లైట్లు వేస్తూ, గదులన్ని మళ్ళీ పరిశీలనగా చూడసాగారు. తల గోక్కుంటూ పోలీస్ ఆఫీసర్, బెడ్ రూం లోకి నడిచాడు. అనుమానాస్పదంగా ఏది కనిపించడం లేదు. కానీ మనసు మాత్రం పీకుతోంది. ఇంకా ముందుకు సాగి లైబ్రరీ రూమ్ లోకి వెళ్ళాడు. పరచి ఉన్న ఎర్రతివాచి ఆతనికి స్వాగతం పలికింది. మంద్రంగా వస్తున్న రూం ఫ్రేషనర్ వాసన వింతగా ఉంది. ప్లాస్టిక్ ర్యాక్ లలో పుస్తకాలు అతని దృష్టిని ఆకర్షించాయి. వాటిని పరిశీలనగా చూస్తూ అడుగులేసాడు. “ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లా?” అడిగాడు సూటీగా కళ్ళ లోకి చూస్తూ.. “నేను సాప్ట్వేర్. నా భార్య ఎలక్ట్రికల్ ఇంజనీర్.” చెప్పాడు శాంతంగా. “బాగుంది. చాలా పుస్తకాలు ఉన్నాయే! పుస్తక పఠనం…?” అని అర్ధోక్తిగా చూసాడు ఆఫీసర్. “అఫ్ కోర్స్. పుస్తక పఠనం మా హాబీ.” ఆవులిస్తూ చెప్పిందామె. ‘ఎప్పుడు పోతారురా మీరన్నట్టు’ చూస్తూ. “నాకూ వెళ్ళి పోవాలనే ఉంది మేడమ్. కానీ…”అన్నాడు. అక్కడే గొడకి ఆనుకొని నిలబడి, చేతిలో ఉన్న పుస్తకంలో పేజీలు త్రిప్పుతూ. ‘ఆవలిస్తే ఆలోచనలు పసికట్టగలడా! పెద్ద కొరకంచు గాడే’ అనుకుంది మనసులో. ఆఫీసర్ అనుమానం బలపడింది. కానిస్టేబుల్స్ వంక విచిత్రంగా చూస్తూ, రెండు అడుగులు ముందుకు నడిచాడు. ఆ సైగ కోసమే ఎదురు చూస్తున్న కానిస్టేబుల్స్ ఎదురుగా ఉన్న గోడని ముందుకు జరపడానికి ప్రయత్నం చేశారు. “మీ వల్ల కాదు. పక్కకు జరగండి. మేడం! మీరు ట్రై చేయండి. మీరు చేయ గలరు. ప్లీజ్.” అన్నాడు ఆఫీసర్ నాటకీయంగా. ఆతని స్వరంలో ‘పోలీసుతనం’ స్పష్టంగా ధ్వనించింది.. ఇంకా నటిస్తే పోలీస్ లాఠీ నాట్యం చేయడం తథ్యమని అర్థమయ్యింది ఆమెకు. చరవాణి మీద వ్రేళ్ళుచిత్రంగా నాట్యం చేసాయి. చూస్తుండగానే వింత శబ్ధంతో ఆ ప్లాష్టిక్ గోడ నాలుగు ముక్కలై, సీలింగ్ కి అతుక్కు పోయింది. అవాక్కయ్యారు పోలీసులు. అతి నీలలోహిత కిరణాలు వెదజల్లుతున్న దీపాల కాంతిలో, శీతల గాలిలో ఏపుగా పెరిగిన మొక్కలు, దర్శన మిచ్చాయి. వాటి నుండి వస్తున్న చల్లగాలికి మైకం కమ్ముతోంది. “వావ్. మాయాబజార్ సెట్టింగ్ బాగా వేసారు. అభినందనలు. మొక్కలంటే మీకు ప్రాణం కదా! గంజాయి మొక్కల్ని కూడా జాగ్రత్తగా పెంచుతున్నారే!… లేక ఇవి కూడా ప్లాస్టిక్ మొక్కలేనా?” కుర్చీలో తాపీగా కూర్చుంటూ అడిగాడు. “గంజాయితోట నేపథ్యంలో అందమైన సెల్ఫీలు తీసుకుందామా?” అన్నాడు కానిస్టేబుల్. వదిలేసిన క్యాచ్ కి ఔటిచ్చిన అంపైర్ని చూసిన బ్యాట్స్ మాన్ లా కొరకొరా చూస్తున్నారు ఆఫీసర్ ని ఆ మొగుడుపెళ్ళాలు. పోలీస్ కానిస్టేబుల్స్ తమ పని తాము చేసుకు పోతున్నారు. తమ పాతఅస్త్రానికే మరింత పదును పెట్టి, సరికొత్త నయాగారం ఒలక పోస్తూ, పోలీస్ ఆఫీసర్ కాళ్ళ మీద పడి ఏడుస్తూ “ క్షమించండి సార్. బుద్ది గడ్డి తిని, అప్పులు తీర్చడం కోసం…” అన్నారు ఆ భార్యభర్తలు. “ఈ సారి నా బుద్ది గడ్డి తినదు. .” అన్నాడు కరాఖండిగా. ఐనా ఆమె కొంచెం చనువు తీసుకుని,”సార్! క్షమించండి. మీ నిజాయితీని గౌరవిస్తాను. ఇలా లోపలికి రండి. నా సమస్య వినండి. ఒక్కసారి… నా మాట ఆలకించండి…”ఎంతో వినయంగా కాళ్ళ మీద పడి అభ్యర్ధించసాగింది. ఆడవారి అభ్యర్థనను కాదనలేని బలహీనత ఆఫీసర్ ది. అందుకే ఆమెను అనుసరిస్తూ బెడ్ రూంలోకి వెళ్లాడు. 💐💐💐💐💐💐💐 బెడ్ రూమ్ తలుపేస్తున్న తన భార్యని క్రీగంట చూస్తూ నిలబడ్డాడు ఆ భర్త. ‘చేసింది ఒకే ఒక తప్పు. కానీ ఆ తప్పు, తనచేత ఎన్ని తప్పటడుగులు వేయిస్తోంది! అత్యాశ ఎన్ని ముళ్ళ దార్లు తిప్పుతోంది!...’ అతని అలోచనలకు భంగం కలిగిస్తూ, “ఒరే తోటరాముడూ! చిన్న సందేహం…”అర్ధాంతరంగా ఆపాడు ఒక కానిస్టేబుల్. కిసుక్కున నవ్వాడు హెడ్ కానిస్టేబుల్. చెదిరిన స్వప్నం తాలూకు చేదు ఆలోచనల నుండి వాస్తవానికి వచ్చి,”చెప్పండి.” అన్నాడు తడారి పోతున్న గొంతుతో. లాఫింగ్ బుద్దలా ముఖం పెట్టి “ఉన్న దానితో. సుఖంగా ఉండకుండా, మీకిదేం రోగంరా…” ఇంకా కానిస్టేబుల్ మాటలు పూర్తి కాలేదు. “రోగం కాదు. పోయే కాలం సార్.” అంటూ చెప్పసాగాడు ఆ భర్త. “నా భార్యకి నాకూ డబ్బు యావ. క్రికెట్ జ్ఞానం తోడై బెట్టింగ్ దారి పట్టాం. నేను రంజీ ట్రోఫీలో ఆడినవాడ్ని. ఆ అనుభవంతో మొదట్లో డబ్బులు బాగానే గెలిచాం. జల్సాల్లో మునిగాం. స్టార్ తిరగబడి లక్షల్ల అప్పుల్లో తేలాం. గెలిచేది ఏ జట్టయినా ఓడేది బెట్టింగ్ రాజాలే…” అతని మాటలు పూర్తి కాలేదు. అంతలో భళ్ళున తెరుచుకున్న బెడ్ రూమ్ తలుపు చప్పుడుకి అందరూ అటు వైపు చూసారు. తల గోక్కుంటూ వస్తున్న ఆఫీసర్ వెనుక ఒయ్యారంగా నడిచి వచ్చి సోఫాలో కూర్చుంది ఆ భార్యామణి. “ఫార్మాలిటీస్ పూర్తయితే, ఈ ఆదర్శ దంపతులను తీసుకొని బయలు దేరుదాం.”అన్నాడు ఆఫీసర్ గంభీరంగా. “ఏంటిరా… మేము వచ్చేది?. తమాషాగా ఉందా?” అంది ఆమె కోపంతో ఊగిపోతూ. ఒక్క క్షణం ఆమె వైపు చూసి “నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటించిన సినిమా గుర్తుందా ఇంజనీరు బాబూ?” శాంతంగా అడిగాడు ఆఫీసర్. “సార్! అర్ధంకాలేదు” అన్నాడు ఆ ఇంజనీర్ భర్త. “ఏదో అనుకున్నా. ఓహో సినిమా జ్ఞానం కూడా తక్కువేనా! చూడు స్వామీ! మీ ఆవిడ నీలాంబరయితే, నేను నిక్కచ్చిగా నరసింహాన్నే. కానిస్టేబుల్స్! వీళ్ళని జీప్ ఎక్కించండి.” అన్నాడు ఆఫీసర్ “ఏంటిరా ఎక్కేది? గదిలో రహస్య కెమెరా ఉంది. నీ లీలలన్నీ నా చరవాణిలోఎక్కాయి. తెలుసా? అవి మీ పోలీసు కమిషనర్ కి మెయిల్ చేస్తే, ఉద్యోగం ఊడిన పోలీస్ ఆఫీసర్ గా నీ ఫోటో న్యూస్ పేపర్లో ఎక్కుతుంది. గోకింది చాలు కానీ…” అంటూ నడవమని సైగ చేస్తూ వీధి తలుపు చూపింది. భార్య తెగింపుకు ఆ భర్త తెగ ముచ్చట పడ్డాడు. ఒక నిమిషం గడిచింది. అందరూ ఒకర్ని ఒకరు చూసుకొంటున్నారు. ఆఫీసర్ తన ప్రక్కన ఉన్న కానిస్టేబుల్ కి సైగ చేసాడు. అతను వీధి తలుపు చాటున దాచిన చిన్న పరికరం తెచ్చాడు. “మీ టక్కుటమార విద్యలు నాకు తెలుసు. తెలుసుగా ఇది కొత్తగా వచ్చిన జామర్. చూడటానికి చిన్నగా ఉన్నా చిచ్చర పిడుగు. భలే పని చేస్తుంది.” ఆని ఆగాడు. “సార్! మీరు గదిలోకి వెళుతుంటే రహస్యంగా జామర్ని ఆన్ చేసా.” అన్నాడు కానిస్టేబుల్ మెల్లగా “అయ్యో! అందుకేనా ఏమీ రికార్డు కాలేదు…” అంది ఆమె ముక్క తుడుచు కొంటూ. సోఫాలో కెప్టెన్సీ పోయిన ఆటగాడిలా ఏడుస్తూ కూర్చుంది. “మీరు కామెడీ క్యారెక్టర్ లా హావభావాలతో మమ్మల్ని బోల్తా కొట్టించారు. ఇది అన్యాయం సార్.” అన్నాడు ఆమె భర్త ఉక్రోషంగా. ఏముంది! మిమ్మల్ని వెర్రి వెంగళప్పలు చేసేందుకే ఇలా నటించాను.” అంటూ మనసులోని మాటను ఇలా బయటపెట్టాడు ఆఫీసర్.. “ఆ వీడియో, పోస్ట్ చేసిన ఫోటోలు, వీళ్ళ ప్రవర్తన గమనించిన తరువాత ఏదో తప్పు జరుగుతోందని గట్టిగా తోచింది. అందుకే మళ్లీ సోదా చేయాలనిపించింది. పాల రాయి ఫ్లోరింగ్. హాల్లోను, బెడ్ రూం లోను కార్పెట్. బెడ్ రూంలో మాత్రమే రూమ్ ఫ్రెష్నర్ వాడారు. ‘ప్లాంట్ గ్రోత్ ఇన్ కంట్రోల్డ్ క్లైమేట్ ‘ అనే పుస్తకంతో బాటు లైబ్రెరీలో మొక్కల పెంపకం మీద రకరకాల పుస్తకాలున్నాయి. ఇంజనీరింగ్ చేసిన వీళ్లకి మొక్కల పెంపకం మీద కొండంత ఆసక్తి ఎందుకు కలిగిందని అనుమానం వచ్చింది. దీక్షగా వింటే, అక్కడ మంద్రంగా ఏదో యంత్రం తిరుగుతున్న ధ్వని వినిపించింది. అనుమానం బలపడింది.” అని ఆగాడు. “గదిలో ఆ గోడ బాగా చల్లగా వుండి, వేళ్ళతో కొట్టినప్పుడు ఆ ధ్వని…” అని ఆగాడు హెడ్ కానిస్టేబుల్. “అవును. తేడా ఉంది. డొల్లని గ్రహించా.” అన్నాడు ఆఫీసర్. “మీ పరిశీలన, విశ్లేషణ అద్భుతం సార్.” అన్నారు కానిస్టేబుల్స్. “కానీ, సార్! మరి అంత సేపు…బెడ్ రూంలో…మీరిద్దరు” గొణిగాడు హెడ్ కానిస్టేబుల్. “గుడ్ పాయింట్. కానీ, అది నీ విచక్షణకే వదిలేస్తున్నా.” అన్నాడు ఆఫీసర్. “ఈ వనితా రత్నాన్ని అడిగేస్తే పోలా? చెప్పు గంజాయిసుందరి?”ఆని ఆమె వైపు చూశాడు హెడ్ కానిస్టేబుల్ పళ్ళు ఇకిలిస్తూ. “ముందు ఈ ఆదర్శదంపతులని జీపు ఎక్కించండి. ‘మళ్ళీ మళ్ళీ రాకూడని రోజు’ విశేషాలు మీడియాతో మనమూ పంచుకోవాలి.” అన్నాడు ఆఫీసర్ తల గోక్కుంటూ. అందరూ ఫక్కున నవ్వారు. ఆ ఇద్దరూ తప్పా. 💐💐💐💐💐💐💐

మరిన్ని కథలు

Viramam
విరామం.
- Harish Babu
Prema viluva
ప్రేమ విలువ
- Lakshmi Priyanka
Odarpu
ఓదార్పు!
- - బోగా పురుషోత్తం
Guruvu korika
గురువు కోరిక
- టి. వి. యెల్. గాయత్రి
Itlu nee tammudu
ఇట్లు, నీ తమ్ముడు!
- అంతర్వాహిని
Naalo sagam
నాలో సగం
- టి. వి. యెల్. గాయత్రి.
Pichhuka paga-Enugu chavu
పిచ్చుక పగ - ఏనుగు చావు
- హేమావతి బొబ్బు