తాతయ్య - మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

Taatayya

" ఒరేయ్ తమ్ముడు! తాతయ్య చనిపోయాడుట. మావయ్య ఫోన్ చేశాడు అంటూ సరోజ ఫోన్లోనే ఏడుస్తూ పెద్ద తమ్ముడు రవికుమార్ కి ఫోన్ చేసింది. రేపు సాయంకాలం లోపు కార్యక్రమాలన్నీ చేసేస్తారుట. "అదేమిటి ఇంత అర్ధ రాత్రి వేళ ఫోన్ చేశావు! ఒకసారి చాలా కంగారు పడ్డాను. పార్టీ నుంచి వచ్చేసరికి లేట్ అయింది .ఇప్పుడే పడుకున్నాను. అయినా రేపు నాకు ఆఫీసులో మీటింగ్లు ఉన్నాయి అంటూ సమాధానం ఇచ్చాడు చనిపోయిన పరంధామయ్య గారి కూతురు పెద్ద కొడుకు రవికుమార్. సరోజ ఇంక ఏమి మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. సరోజ రెండో తమ్ముడు కిరణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమెరికాలో వాళ్ళకి ఇప్పుడు రాత్రి అవుతుందా! లేదా పగలు అవుతుందా! అని ఆలోచించకుండా ఫోన్ చేసింది సరోజ. " చాలా దురదృష్టం. నీకు తెలుసుగా నాకు ఇప్పుడు వెంటనే రావడం కుదరదు. పిల్లలకు కూడా స్కూలు ఉంది. జూమ్ లో కనెక్ట్ చూస్తే నేను తాతయ్యని చూస్తా! అని తన ప్రేమని ప్రకటించాడు కిరణ్. అయినా అంత దూరం నుంచి ఎలా వస్తాడులే అని సరిపెట్టుకుంది సరోజ. మూడో తమ్ముడు రాజు హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుంటాడు. సరోజి చెప్పిన కబురు విని " నీకు తెలుసుగా గవర్నమెంట్ ఆఫీసులో అంత తొందరగా సెలవులు ఇవ్వరు. మినిస్ట్రీ గారి క్యాంప్ ఉంది. ఆ హడావుడిలో ఉన్నాము అని మెత్తగా చెప్పాడు రాజు. ఆఖరి తమ్ముడు శివ కూడా హైదరాబాదులోనే వ్యాపారం చేస్తూ బాగా ఆర్థికంగా బలపడి సంఘoల్లో పెద్దమనిషిగా పేరు తెచ్చుకున్నాడు. సరోజ మాట విని అక్క ఖర్చులకు భయపడకండి. కావాలంటే డబ్బు పంపిస్తాను. తాతయ్య ఫోటో పేపర్లో వేయిస్తాను! అంటూ తన ధోరణిలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇంక చేసేదేమీ లేక ఎవరికి ఏమీ చెప్పలేక భర్తతో కలిసి తాతయ్య ఊరు బయలుదేరింది సరోజ. తాతయ్య ఊరు దగ్గర పడేకొద్దీ తాతయ్యతో గడిపిన జ్ఞాపకాలు ఒకసారి గుర్తుకొచ్చాయి. చనిపోయిన పరంధామయ్య గారికి నలుగురు కూతుళ్లు , ఒక కొడుకు. పరంధామయ్య కోనసీమలో ఒక పల్లెటూర్లో టీచరుగా పనిచేస్తూ పెద్దలు ఇచ్చిన నాలుగు ఎకరాల భూమిని కౌలుకిచ్చి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీర్చుకొని తన సొంత ఊర్లోనే కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. పరంధామయ్య పెద్దకూతురుకి నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల . మిగిలిన పిల్లలు ఇద్దరేసి పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్నారు. పరంధామయ్యకి మొత్తం పన్నెండు మంది మనవలు. ఈ పిల్లలంటే పరంధామయ్యకి చాలా ఇష్టం. ప్రతిరోజు ఫోన్లో పిల్లలతో మాట్లాడితే గాని తోచేది కాదు పరంధామయ్యకి. ముసలి వయసులో అదే కాలక్షేపం. పిల్లలకు పండగలకు సెలవులు ఇస్తే పనిగట్టుకుని ఆ ఊరు వెళ్లి పిల్లల్ని తీసుకొచ్చేసేవాడు. పిల్లలకేముంది ఎవరు చేరదీస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలా అభిమానంగా చూసే తాతయ్య అంటే పిల్లలందరికీ ప్రేమే. పరంధామయ్య గారి కొడుకు సొంత ఊర్లోనే టీచరుగా పనిచేస్తూ తండ్రితో పాటు కలిసి ఉండేవాడు. ఆడపిల్లలందరూ పరంధామయ్య ఊరికి దగ్గర ఊర్లలోనే కాపురాలు చేసుకుంటూ ఉండేవారు పిల్లలకి సెలవులు వస్తున్నాయని తెలిసి ముందుగానే వంటవాడిని పిలిచి ఇంట్లో డబ్బాలతోటి తినుబండారాలు చేయించి పెడుతుండేవాడు. బజారు సరుకులు పెడితే పిల్లలకి తేడా చేస్తుందని భయం. ఉగాదికి సెలవులు ఉండవు తాతయ్య అన్నా సరే ! పరవాలేదు రా సాయంకాలానికి మిమ్మల్ని పంపించేస్తా ను. మన ఊర్లో అమ్మవారి తీర్థం. అమ్మమ్మ నైవేద్యాలు పెడుతుంది." బూరె ముక్కలు తినేసి అమ్మవారిని చూసి తీర్థంలో అన్ని కొనుక్కుని వెళ్ళిపోదురు గాని అంటూ బలవంత పెట్టి తీసుకొచ్చేసేవాడు. " ఒక్క రోజుకు ఎందుకు నాన్న! అని కూతుళ్లు చెప్పిన వినిపించుకోకుండా మీరు రావద్దు అమ్మా! పిల్లల్ని నేను తీసుకెళ్లి తీసుకొస్తాను అంటూ బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. అంత ప్రేమ పిల్లలు అంటే పాపం!. తొలిరోజు రాత్రికి పిల్లలంతా తాత ఇంటికి చేరడం మర్నాడు సాయంకాలం మళ్లీ ఎవరింటికి వాళ్లు వెళ్లిపోవడం ఇలా ఉండేది ఉగాదికి. అమ్మవారి తీర్థంలో ఆడపిల్లలకి అలంకరణ సామాగ్రి ,మగ పిల్లలకి ఆడుకునే రబ్బర్ బంతులు కళ్ళజోళ్ళు కొనిపెట్టి ఆనందపడిపోయేవాడు. ఊర్లో జరిగే రాముల వారి కళ్యాణానికి ప్రతి ఏటా భోజనాలు పెట్టేవాడు పరంధామయ్య. ఆ భోజనాల్లో పిల్లలు చేత గ్లాసులతో మంచినీళ్లు పోయించేవాడు. అందరికి పానకం ప్రసాదంగా పంపిణీ చేయించేవాడు. శివరాత్రి పండక్కి కోటిపల్లి గోదావరిలో స్నానం చేయించి ముక్తేశ్వరంలో తీర్థం చూపించి ఆ రాత్రంతా జాగరణ భజనలతోటి చేయించేవాడు. పిల్లలకు జాగరణ ఎందుకండీ ? అని అమ్మమ్మ అంటే! పిల్లలకి భక్తి మనమే నేర్పాలి. లేకపోతే వాళ్లకు ఎలా తెలుస్తుంది అంటూ చెప్పుకుంటూ వచ్చేవాడు. పండగ నాడు ఎవరైనా నాలుగు పిండి వంటలు గట్టిగా తిని ఒంట్లో బాగా లేకపోతే తన దగ్గరుండే హోమియోపతి మందు శ్రద్ధగా వేసి వాళ్లకి తగ్గేవరకు కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఇంక పెద్ద పరీక్షలు అయిపోయిన తర్వాత స్కూల్ కి సెలవులు ఇచ్చేసిన తర్వాత ఒక్కరోజు కూడా ఉండనిచ్చేవాడు కాదు. రేపు స్కూలుకు సెలవులు ఇస్తారనగా తొలిరోజు వచ్చి మర్నాడు సాయంకాలం పిల్లలందరినీ తన ఊరికి తీసుకొచ్చేసేవాడు. అసలే వేసవికాలం. మామిడికాయలు, తాటి ముంజలు, కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు అవి కాకుండా పూతరేకులు ఒకటేమిటి రోజు ఒక పండుగలా ఉండేది. రోజు సాయంకాలం పూట ఆడపిల్లల అందరికీ పనిగట్టుకుని సైకిలు నేర్పించేవాడు. ఆడపిల్లల్ని అలా ఊరి మీద తిప్పుతారు ఏమిటి? అనేది అమ్మమ్మ. ఆడపిల్లలు అన్ని నేర్చుకుని ఉండాలి. ఎప్పుడు ఏదో అవసరం వస్తుందో తెలియదు అనేవాడు. పరంధామయ్య మాటల్లో ఎంతో ముందుచూపు ఉండేది. కోనసీమ అంటేనే గోదావరి అందాలు. ఆ గోదావరిలో తాతయ్య ఈత కొడుతూ పిల్లలందరికీ ఈత కొట్టడం నేర్పించేవాడు. తాతయ్య ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉండేది. ఈ చివరి నుంచి ఆ చివర వరకు గచ్చువసార మీద భోజనాలు, మధ్యాహ్నం పూట ఐస్ ఫ్రూట్ కొనిపెట్టడం సాయంకాలం పొలం గట్టుమీద తాటి ముంజలు తినడం ఇవన్నీ మర్చిపోలేని అనుభవాలు. సెలవులయ్యి ఇంటికి వెళ్లే ముందు అందర్నీ పట్టుకుని ఏడ్చేవాడు చిన్న పిల్ల వాడిలాగా. శ్రావణమాసంలో తన కూతుర్లు అందరిని పిలిచి వరలక్ష్మీ వ్రతం చేయించి పేరంటం పెట్టించేవాడు. ఆడ మనవలను పిలిచి అందరికీ కాళ్లకు పసుపు రాయించి బొట్టు పెట్టించేవాడు. పిల్లలకు చిన్నతనం నుంచి మంచి పనులను అలవాటు చేయాలని పరంధామయ్య తాపత్రయం. పరంధామయ్య తన మనవలందరిలోకి చిన్నవాడికి కృష్ణాష్టమికి కృష్ణుడి వేషం వేసి మురిసిపోయేవాడు. పిల్లలకే అర్థమయ్యేలా భాగవతంలోని ప్రహ్లాదుడు చరిత్ర చెప్పడంలో పరంధామయ్యకి పరంధామయ్య సాటి. ముప్పై ఐదు ఏళ్ళ ఉపాధ్యాయ జీవితం పిల్లల మనస్తత్వాల గురించి చాలా అనుభవాలు నేర్పింది పరంధామయ్యకి. పిల్లలతో పాటు తోటలు దొడ్లు, చెట్లు తిరిగి పత్రి కోసుకొని వినాయక చవితి పూజ శాస్త్రోక్తంగా చేయించేవాడు పరంధామయ్య. ఒకపక్క పిల్లల మానసిక వికాసానికి తోడ్పడుతూ మరొకపక్క భక్తి పెంపొందించేలా అన్ని పూజలు భక్తిశ్రద్ధలతో చేయించేవాడు. వినాయక చవితి పందిళ్లలో పిల్లలకు మైకు ఇచ్చి పాటలు పాడించేవాడు. నాలుగు మాటలు చెప్పమనేవాడు. చిన్నప్పటి నుంచి వేదిక అంటే భయం తొలగించాలని ఆయన ఉద్దేశం. మనవలందరికీ దసరా పాటలు నేర్పించిసంబరపడిపోయేవాడు. జీవితమంతా పిల్లలతోనే గడపడం అంటే చాలా తృప్తి పరంధామయ్యకి. అలా ఏ పండగలను వదిలే వాడు కాదు. పిల్లలు చేస్తున్న అల్లరి చూసి సంబరపడిపోయేవాడు. కార్తీక మాసంలో గోదావరి స్నానాలు కార్తీక దీపాలు పిల్లలు చేత పెట్టించి పిల్లలు ఇంటికి దీపాలని మురిసిపోయాడు. పిల్లలు లేని ఇల్లు స్మశానంతోటి సమానం. దేవుడికి ప్రతిరూపాలు పిల్లలు వాళ్లతోటి ఆనందం. అందుకే మనం పెంచుకోవాలి అనుబంధం అంటూ అమ్మమ్మకు చెప్పుకుంటూ వచ్చేవాడు. ఇంక సంక్రాంతి సెలవులుకి చెప్పక్కర్లేదు . రోజు ఇంట్లో పండగ వాతావరణమే. వీధిలో ముగ్గులు గొబ్బెమ్మలు ఒకటేమిటి రోజు హడావుడి. వీధిలో ఆడపిల్లలు ముగ్గులు పెడుతుంటే కాపలా కూర్చునేవాడు. ఎవరికి ఉంటుంది అంత శ్రద్ధ. కేవలం పిల్లలు అంటే ఇష్టం మూలంగానే కదా!. పిల్లలు పక్క తడిపేసిన విసుక్కోకుండా రాత్రి తనే బట్టలు మార్చి పడుకోబెట్టడం ,తను అందరమధ్య పడుకోవడం పిల్లలందరికీ పురాణ కథలు కాశీ మజిలీ కథలు నీతి కథలు చెప్పడం పరంధామయ్యకి చాలా ఇష్టం కాలం ఎంత మారిపోయింది. చిన్నప్పుడు పరంధామయ్య వస్తున్నాడు అంటే పిల్లలంతా ఊరికి వెళ్ళిపోవచ్చు అని పరంధామయ్య చుట్టూ చేరేవారు. ఆ అనుబంధాలు ఆప్యాయతలు ప్రేమలు త్యాగాలు అన్నీ కాలగర్భంలో కలిసిపోయేయి. మనవులు పెద్ద చదువుల్లో చదివి ఎవరి కాపురాలు వాళ్లకు వచ్చి కొంతమంది భాగ్యనగరంలోను ,కొంతమంది విదేశాల్లోనూ స్థిరపడిపోయారు. ఇప్పుడు ఎవరు బ్రతుకు వాళ్ళది!. చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చిన చిన్నప్పుడు ప్రాణప్రదంగా పెంచిన తాతయ్యని పలకరించడానికి ఖాళీలేదు ఎవరికి. తాతయ్యకి ఏమి అవసరం ఏదో ఒక పండక్కి పిల్లల్ని పిలిస్తే సరిపోతుంది .కానీ ప్రతి పండక్కి వేసవి సెలవులకు శ్రద్ధగా పిలిచి తీసుకువచ్చి వాళ్ళ సంరక్షణ చూసి వాళ్లు సంతోషపడేలా చేసి మళ్లీ బెంగపెట్టుకుని దిగబెట్టి వచ్చేవాడు . ఎందుకు కేవలం అందరి మధ్య అనుబంధాలు పెంచడానికి. బంధుత్వాలు మర్చిపోకుండా ఉండడానికి. అయినా పరంధామయ్య ఎప్పుడూ బాధపడలేదు. ఎక్కడో పిల్లలు దూరంగా ఉన్నారు. బ్రతుకుతెరువు కోసం ఏదో పాట్లు పడుతున్నారు అనుకుంటూ ఉండేవాడు. కానీ పరంధామయ్య పెద్ద కూతురు అంటే సరోజి తల్లి , తండ్రి కూడా అకస్మాత్తుగా చనిపోవడంతో పరంధామయ్య మంచం పట్టాడు. ఎవరి కర్మలకు ఎవరు బాధ్యులు అని సరి పెట్టుకున్నాడు. కానీ సరోజ తల్లి, తండ్రి, పోయినప్పుడు సరోజ పిల్లలు తప్పితే మిగిలిన మనవలు కనీసం పలకరించడానికి కూడా రాకపోవడంతో నా పెంపకంలో ఏదో లోపం ఉంది అని అమ్మమ్మతో అనే వాడుట. ఇంతలో కారు ఊర్లోకి ప్రవేశించడంతో ఈ లోకంలోకి వచ్చింది సరోజ ఇంతలో పరంధామయ్య ఇంటి ముందు కారు ఆగింది. వాకిట్లో తాతయ్య శవం పక్కన అమ్మమ్మ ,మావయ్య అత్తయ్య పిల్లలు ఊరి వాళ్ళు, పొరుగు వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. కారు లోంచి దిగి సరోజ ఒక్కసారిగా అమ్మమ్మని పట్టుకుని గట్టిగా ఏడ్చింది. తాతయ్య మొహం వైపు చూసింది. కళ్ళు మూసుకుపోయి ఉన్నా మొహoల్లో ఎవరికీ కనబడని భావం సరోజికి కనబడింది. చిన్నప్పుడు ప్రాణప్రదంగా భావించే తాతయ్య మళ్లీ ఎవరికీ కనబడడు. ఎప్పుడూ తన మనవలకి అనురాగం ప్రేమ పంచే తాతయ్య మళ్లీ లేచి రాడు. ఉన్నన్నాళ్ళు తన పిల్లల కంటే ఎక్కువగా చూసిన తాతయ్యకి ఈరోజుల్లో మనవలు ఇచ్చే గౌరవం ఇదేనా అని అనిపించింది సరోజికి. సరోజ పినతల్లులు అప్పటికే ఏడుస్తూ తమ పిల్లలు ఎందుకు రాలేదో కారణాలు చెబుతున్నారు. అవన్నీ ఏమీ వినబుద్ధి కాలేదు సరోజకి. ఏమిటో బంధాలకు అర్థం మారి పోతోంది. నలుగురు మనవులు పాడేమోసి తాతయ్య అంతిమ యాత్రలో పాల్గొని ఉంటే ఎంతో అందంగా ఉండేది. ఇది నలుగురు కలవాల్సిన సందర్భం. ఇంకెందుకు ఈ బంధాలు అనుకుంటూ శవాన్ని పట్టుకుని "తాతయ్య నీ ప్రేమకు సరిపడే మనవలం కాదు మేము అంటూ ఏడుస్తూ ఉండిపోయింది సరోజ.

మరిన్ని కథలు

Malle malle raakoodani roju
మళ్ళీ మళ్ళీ రాకూడని రోజు
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Viramam
విరామం.
- Harish Babu
Prema viluva
ప్రేమ విలువ
- Lakshmi Priyanka
Odarpu
ఓదార్పు!
- - బోగా పురుషోత్తం
Guruvu korika
గురువు కోరిక
- టి. వి. యెల్. గాయత్రి
Itlu nee tammudu
ఇట్లు, నీ తమ్ముడు!
- అంతర్వాహిని
Naalo sagam
నాలో సగం
- టి. వి. యెల్. గాయత్రి.