ఉప్పు కణిక..!! - Lakshmi Priyanka

Vuppu kanika

పాలు కాచి ఉడికించాక చిటికెడు ఉప్పు వేస్తే ఏమవుతుంది? పాలు విరిగిపోతాయి…

శుద్ధమైన పాలు పాడైపోతాయి..!! ఒక కుటుంబం కూడా శుద్ధమైన పాలతో సమానం.. అలాంటి కుటుంబం బాగుండాలి అంటే ఉప్పు దాంట్లోకి చేరకూడదు..!! ఆ కుటుంబం అనే పాలు విరిగిపోకుండా ఉండాలి అంటే ఆ ఉప్పు కనుక దరి చేరకూడదు..!! అలాంటి ఒక కుటుంబం అలాంటి ఉప్పు కణిక గురించి తెలుసుకుందాం ..!!

ఇదీ వెంకటేష్ అనే కుర్రాడి కుటుంబ కథ..

శ్రీనివాస్, లలిత ఒక సాధారణ మధ్యతరగతి దంపతులు.అదుగో విజయవాడ పక్కన ఒక చిన్న పట్టణంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్, భార్య పిల్లల కోసం హైదరాబాద్లో ఉంటున్నాడు. లలిత ఒక స్కూల్ టీచర్. ఆమె జీవితం మొత్తం పిల్లల చుట్టూ తిరుగుతుంది. పిల్లల్లో పెద్దవాడు వెంకటేష్ – ఓ తల్లిదండ్రుల కలల నెరవేరు చేసే కుమారుడు. చక్కటి చదువు, సుశీలమైన నడవడి, మృదువైన స్వభావం.

అతని చెల్లెలు సాహితి – నవ్వులతో నిండిపోయిన పుస్తకం. ఆమె అశ్రువులు కూడా చిన్న పాటలలాగే ఉంటాయి. ఇంట్లో స్నేహం, ప్రేమ, ఆశయాలు అన్నీ వెంకటేష్ చుట్టూ తిరిగేవి.వెంకటేష్ చదువులో ప్రతిభావంతుడు. పదవ తరగతి స్కూల్ టాప్‌ చేశాడు . ఇంటర్మీడియట్‌లో జిల్లా ర్యాంకు సాధించాడు. తండ్రి కల – “మన బాబు IAS అయ్యి దేశానికి సేవ చేయాలి .” తల్లి కల – “అతడి పెళ్లి చూసేదాకా బ్రతకాలి.”

ఆ కుటుంబం పాలలా పరిశుభ్రంగా, సమతుల్యంగా ఉంది. కానీ…ఒక ఉప్పు కణిక వచ్చి చేరింది..!!ఇంజనీరింగ్ మొదలైన రెండో సంవత్సరం నుంచి వెంకటేష్ మెల్లగా మారిపోతున్నాడు.

ఫోన్ లో ప్రతి దానికి సెక్యూరిటీ పాస్వర్డ్లు పెట్టేశాడు. ఇంట్లో వాళ్ళతో మాటలు తగ్గిపోయాయి. చదువుపై ఆసక్తి తగ్గుతోంది. కొత్త ఫ్రెండ్స్, రాత్రిళ్ళు లేట్‌గా ఇంటికొచ్చే రోజులు. తల్లి ప్రశ్నిస్తే – “ప్రాజెక్ట్ ఉంది.” తండ్రి అడిగితే – “పేపర్ ప్రెజెంటేషన్ వర్క్ ఉంది.” చెల్లెలు సరదాగా మాట్లాడితే – “ప్లీజ్ డిస్ట్రబ్ చేయకు.”

ఇదంతా చిన్నగా కనిపించవచ్చు.కానీ… వాళ్ల కుటుంబం లో రాబోయే అలజడికి ఇదొక ఆరంభం దశ..!! ఆ పాలలో ఉప్పు లాగా ఒకడు వచ్చి చేరాడు. ఆ చిటికెడు ఉప్పు పేరు – “ధీరజ్”.

వెంకటేష్‌కు కాలేజీలో కలిసిన ఆ ధీరజ్, ఒక సైకో గ్యాంగ్ లీడర్. కంప్యూటర్ నెట్‌వర్కింగ్ పేరిట డార్క్ వెబ్ ప్రపంచం సృష్టించినవాడు. చిన్న చిన్న మోసాల్ని నేర్పి, ఎరగా ఒక మెరుగైన జీవితం చూపించి, మాయలోకి దించాడు. ఎవరూ గుర్తించరు… ఈ పనులు చేసినా ఎవరికీ దొరకము ” అంటూ వెంకటేష్‌ బుద్ధిని మెల్లగా వక్రీకరించాడు.

ఇంటిలో చెప్పకుండా ఆ చీకటి పని ద్వారా కొన్ని డబ్బులు సంపాదించాడు. మొదట ఒక స్మార్ట్ వాచ్. తర్వాత కొత్త ఫోన్. ఆఖరికి సెకండ్ హ్యాండ్ బైక్ కూడా.

తల్లి అడిగినప్పుడు – “స్టూడెంట్స్ కి ట్యూటరింగ్ చేస్తున్నా.” అని చెప్పాడు

చెల్లెలు అడిగినప్పుడు – “ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా.” అని బుకాయించాడు.

ఆ కుటుంబానికి వెంకటేష్ పై పెట్టుకున్న నమ్మకం

సడలసాగింది..!!

ఒక రోజు కళాశాల నుంచే ఫోన్. పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. “మీ అబ్బాయి ఇంకొద్దిగా లేట్ అయివుంటే సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ అయ్యేవాడు. స్నేహితుని ముసుగులో ఒకడు చేయకూడని పనులు చేయించాడు .” అని చెప్పారు

శ్రీనివాస్ తల మీద పిడుగు పడినట్లైంది. లలిత విలపించింది. చెల్లెలు సాహితికి ఏం అర్థం కాలేదు. “అన్న మాత్రం తప్పు చేయడు కదా?” అంటూ నిర్ఘాంతపోయింది.

వెంకటేష్ ఇంటికి తిరిగొచ్చాడు. కానీ…

ఆ ఇంట్లో మౌనం అతడికి స్వాగతం పలికింది.

తల్లి చెప్పింది – “ఇంకా నిన్ను నమ్మాలి అంటే నా వల్ల కాదురా.”

తండ్రి – “మా కలల్ని తుడిచేసావురా.”

చెల్లెలు మాత్రం ఓ పత్రిక తీసుకొచ్చి – “అన్నా, నా బర్త్‌డేకు IAS అడ్మిషన్ కార్డ్ గిఫ్ట్ కావాలి” అంది… కన్నీటిని దాస్తూ ఒక చిన్న చిరునవ్వుతో.

అయితే విరిగిపోయిన పాలలా అయిన ఆ కుటుంబ బంధాలు మళ్లీ చిగురించేనా?? మళ్లీ వెంకటేష్ సరైన దారిలోకి వచ్చేనా?? ఇదే ఆ తల్లిదండ్రుల ఆలోచన

ఆ రాత్రి వెంకటేష్ నిద్రపోలేదు.

తన చిన్ననాటి డైరీలన్నీ తిరగేశాడు. పుస్తకాల ముడులు తెరిచాడు. తన ఫోటోల మధ్యలో తల్లి చిరునవ్వులు, నాన్న ఆశ, చెల్లెలి ఆకాంక్షలు కనిపించాయి.

ఆ రాత్రే అతనిలో మార్పు మొదలైంది.

వెంకటేష్ తిరిగి పుస్తకాలను తీసుకున్నాడు. డిజిటల్ డీటాక్స్ మొదలెట్టాడు. ధీరజ్‌ లాంటి గ్యాంగ్‌లకు సమాచారమిచ్చి పోలీసుల సహకారం అందించాడు.

ఇంటి నుంచే UPSC ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. మూడేళ్లు గడిచిపోయాయి. ఇంట్లో మళ్లీ నవ్వులు, మాటలు, ఆశలు తిరిగొచ్చాయి.

ఆ రోజు UPSC రిజల్ట్స్ డే.

సాహితి చెవిలో వినిపించింది – “రెండవ ర్యాంక్… వెంకటేష్ శ్రీనివాస్.”

అమ్మ కళ్ళల్లో నీరు. నాన్న కి మాటలు రావడం లేదు.

సాహితి మాత్రం పరిగెత్తి, తన చిన్నప్పుడు ఇచ్చిన డైరీని తీసుకొచ్చి అతడి చేతిలో పెట్టింది –

“ఇది నీ మొదటి అడుగు అన్నా… ఇప్పుడు నన్ను నువ్వే గైడ్ చేయాలి…”

వెంకటేష్ తలవంచి నవ్వుతూ అన్నాడు:

“ఒక ఉప్పు కనుక పాల లాంటి మన కుటుంబ సంతోషాలను కొంత మేరకు మాత్రమే దూరం చేయగలిగింది.. కానీ ఆ విరిగిన పాలతో కూడా తీయనైన కలకండ చేయచ్చు .. నోటిని తీపి చేసుకోవచ్చు అని మనం నిరూపించాం” మన కుటుంబం నిరూపించింది” అని అన్నాడు..!!

ముగింపు

ప్రతీ ఇంట్లో వెంకటేష్‌లుంటారు.

ప్రతీ ఇంట్లో ఉప్పులాంటి ప్రలోభాలు, తప్పుడు దారులు ఉంటాయి.

కానీ ప్రేమ, విశ్వాసం, మార్పు అనే మంత్రాలు ఉంటే… ఆ విరిగిపోయిన పాలను కూడా మళ్లీ మధురంగా చేయవచ్చు.

మరిన్ని కథలు

Bhoomi gundramgane vundi
భూమి గుండ్రంగానే ఉంది
- కొడవంటి ఉషా కుమారి
Veera Sainikudu Raghavareddi
వీర సైనికుడు రాఘవ రెడ్డి
- హేమావతి బొబ్బు
Asooya tagadu
అసూయ తగదు..
- - బోగా పురుషోత్తం
Agnisikha
అగ్నిశిఖ
- హేమావతి బొబ్బు
Naanamma varasuralu
నానమ్మ వారసురాలు
- చెన్నూరి సుదర్శన్