బాంధవ్యాలు - సంధ్య కార్తీక్

Bandhavyaalu

మగతగా ఉన్న నాకు ,మీనాక్షి , డాక్టర్ గారితో సంభాషించడం వినపడసాగింది. గుండె నొప్పితో పడిపోయానని , హుటాహుటిన ఆస్పత్రిలో చేరిపించారని అర్థం అయ్యింది.

మంచమ్మీద అచేతనంగా ఉన్న నాకు ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టాయి........

ఇన్నాళ్ళు పరితపించింది

దీనికేనా అనిపించింది, అన్నయతో మాట మంతి లేకుండా , వాళ్ళ కుటుంబం తో సరిగ్గా కలవకుండా ఉన్న నాకు ఇలానే తనతో మాట్లాడకుండా వెళ్ళిపోతానేమో అన్న సందేహం రాక పోలేదు ???

ఇదేనా నేను కోరుకున్న జీవితం ????

దీనికేనా నేను ఇన్నాళ్లు పాకులాడింది ????

మనిషికి సగటున రోజుకు 6000 నుంచి నుంచి 60 వేల దాకా ఆలోచనలు

వస్తాయంట కానీ నాకు ఇప్పుడు వీటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆలోచనలు బుర్రలో మెదులుతున్నాయి.

మనిషి ఆలోచనలలో కొన్ని పునరావృతం అవుతాయి , ‌

ఎక్కువ శాతం నెగటివ్ ఆలోచనలే !!!!

కానీ ఇప్పుడు నా ఆలోచనలన్నీ పాత జ్ఞాపకాల చుట్టూ తిరుగుతున్నాయి.

మన జీవితంలో మనం చేసిన చాలా తప్పులు మన ఆఖరి రోజుల్లో తప్పకుండా జ్ఞాపకం వస్తాయి అని అనుభవపూర్వకంగా అర్థం కాసాగింది .

చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి.

ఉన్నంతలో మా కుటుంబం సంతృప్తిగా జీవించాము.

పెరిగి వేరుపడ్డాక ఎందుకు నాకు ఈ లక్షణం అలవడలేదు ??????

ఎన్నో ప్రాణాలు పొట్టన పెట్టుకొని దేశాలు ఆక్రమించిన హిట్లర్ చరిత్ర కూడా

"వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్లలేము" అని బోధించినా కూడా కడ దాక వస్తె కానీ ఇవేమీ వంట పట్టవు మనకి.

హిట్లర్ బతికున్న్న ళ్ళు కూడా ప్రశాంతంగా బతికినట్టు ఎక్కడా దాఖలాలు లేవు.

ఎందుకు ఇన్నాళ్లు నాకు ఈ పాకులాట .......

ఎందుకు ఈ తపన.......

నాతో నేను వేసుకున్న ప్రశ్నలు ఇవి

ఎన్నోమార్లు దాటవేసిన అంతర్మధనం చేసుకునే సమయం ఇదేనేమో ...........

జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఎప్పుడూ ఇన్ని ప్రశ్నలు నన్ను నేను వేసుకోలేదు

ఒకవేళ వేసుకొని ఉంటే నా జీవితం వేరేలా ఉండేదేమో

ఇప్పుడు ఇలా అచేతనంగా ఉండడం వల్లనేమో చాలా ప్రశ్నలు నన్ను చుట్టుకున్నాయి ????

నా ప్రవర్తన, మాటతీరు ఒక్కటి కూడా మా అన్నయ్య తో సరితూగే విధంగా లేదే????

నా మీద నాకే ఒక చులకన భావన మొదలయ్యింది ..

తృప్తిగా అన్నయ్యతో మాట్లాడింది లేదు, కనీసం వాళ్ళ పిల్లలని దగ్గర తీసింది లేదు......

నాకు ఏదో నాన్న తక్కువ చేశారు అనే భావన

పోనీ నాకేమన్నా తక్కువ ఉందా?? జరగకుండా పోయిందా ????అంటే అదీ లేదు మా పిల్లలు ఇద్దరు బాగా స్థిరపడ్డారు అయినా ఎందుకు

ఈ ఆస్తుల మీద మమకారం నాకే అర్థం కాలేదు ….......

ఎన్నోసార్లు అన్నయ్య ప్రేమగా మాట్లాడినా ఏదో ఒక విషయం మీద చాలాసార్లు మాటలతోదెప్పి పొడిచాను.

ఏనాడు కూడా తను తిరిగి ఒక మాట అనలేదు. అది అతని హుందాతనం అని ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే అనిపించ సాగింది.

మా నాన్నగారి మీద కూడా మధ్యలో కోపం వచ్చేది,అన్నయ్యని ఎక్కువగా ప్రేమించాడేమో నన్ను తక్కువ చేసి చూసాడు అనే భావన తో

డబ్బుతో ,జబ్బుతో ఉన్నప్పుడే మనుషుల ప్రవర్తనలో మార్పు బాగా గమనించగలము.

ఇక ఇన్ని ఆలోచనలకి మూలకారణం మా భూమి. పుడమి తల్లి అందర్నీ ఒకేలా చూస్తుంది, మనుషులే రకరకాలుగా ప్రవర్తిస్తారు.

మా నాన్నగారు ఆరు ఎకరాల పొలం సాగు చేసే రైతు. ఆ ఆరు ఎకరాలే తన ఆస్తి .పాడి పంట తోనే జీవితం గడిపారు , వెళ్లేప్పుడు భూముల సరి సమానంగా పంచినా నా మూడు ఎకరాలు వేరొకరి పేరు మీద కూడా ఉండడం ,అది మా నాన్నగారు పరమపదించిన తర్వాత వెలుగులోకి రావడం , దానికి నేను కోర్టుకి వెళ్లి పదేళ్లు పోరాడి చివరికి నాకు సగం భూమినే మిగిలింది.

ఈ పదేళ్లలో నేను ఆఫీసులో ఎంతో ఎత్తుకి ఎదిగినా అన్నయ్య నాకంటే చిన్న ఉద్యోగం చేస్తున్నా తను భూమిని హాయిగా ఆస్వాదిస్తున్నాడనే ఆలోచన నాకు నా జీవితంలో తెలియని

అసంతృప్తి గా నిలిచింది.

మనిషి తత్వం ఎలాగంటే , చిన్న అసంతృప్తి బీజం నాటుకుంటే మన జీవితం మొత్తం అదే అసంతృప్తి చుట్టూ తిరుగుతుంది. అది ఎలాగంటే అందంగా వేసిన ముగ్గులో లేదా గీసిన చిత్రంలో చిన్న పొరపాటు చేస్తే అదే వేధిస్తున్న విధంగా!!!!!

నేను పదోతరగతి దాకా మా ఊళ్లోనే చదువుకున్నా ,కాలేజి చదువుకి పట్నం వైపు మొగ్గు చూపాను. కాలేజీ చదువు పూర్తవగానే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం తో పట్నం లోనే స్థిరపడిపోయా.

మీనాక్షిని మా బంధువుల పెళ్ళిలో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నా.

మీనాక్షి పేరుకు తగ్గట్టుగానే చక్కటి రూపం, వాలు జడ చారడేసి కళ్ళతో అందర్నీ కలుపుగోలుగా మాట్లాడే తత్వం.

మీనాక్షి నాతో సరి సమానంగా చదువుకున్నా పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేసి వాళ్ళ అలనాపాలనలో మునిగిపోయింది.

ఎన్నోసార్లు ,"మళ్లీ ఉద్యోగం కి వెళ్ళు", మీనాక్షి అని నేను చెప్పినా నాకు ఇల్లు పిల్లలతో నే తృప్తిగా ఉందండి అని అనేది.

మా వదిన డిగ్రీ చదివినా చిన్న స్కూల్లో టీచరుగా పని చేసేది. అది తలుచుకుంటే నాకు ఎందుకో మీనాక్షి మీద కొంచెం కోపం వచ్చేది.

అసలు మనుషులకి తృప్తి అనేది ఉందా ??ఎంత ఉన్నా ఏదో లేని దాని కోసం చింతతో ఉన్న దాన్ని కూడా ఆనందించలేకపోతున్నాము ఏదో తెలియని వెలితి అది మనుషుల ఆప్యాయతలోనా, వస్తువుల్లోనా , బంధాలలోనా అర్థం కూడా చేసుకోలేకపోతున్నాము....... ఈ మధ్యకాలంలో బాగా గమనిస్తే పోటీ తత్వం పెరిగిపోయింది మనకి లేదు అన్న దాని కంటే ,వేరే వాళ్ళకి ఉంది అనే ఆలోచనతో ఎక్కువ బాధపడతూ ఉన్నాం ...

మనుషులు ఏదన్నా పని పూర్తి చేయకపోతే అది పదేపదే జ్ఞప్తికి రావడం సైకాలజీలోజైగార్నిక్ ఎఫెక్ట్ గా పరిగణిస్తారు .

నా విషయంలో అన్నయ్యతో నా సఖ్యత అనగా చాలా ఏళ్ళ తరబడి తనతో మనసు విప్పి మాట్లాడలేదనే విషయం పదే పదే బుర్రలో మెదలడం వల్లన ఇది అసంపూర్ణిత పనిగా నా మనసు పరిగణిస్తుంది అని అర్థమవసాగింది .

నా ఫోన్ మోగడంతో నా ఆలోచనలకు తెరపడింది.

నా భార్యామణి మా అబ్బాయితో మాట్లాడుతున్నట్లుంది అని అర్థమవుతుంది.

తనను చూస్తూ ఉండిపోయాను.

మీనాక్షికి కూడా వయసు మీద పడుతుంది, నన్ను ఆసుపత్రిలో చేర్పించడం ఇవన్నీ ఒక్కటే ఎలా చేసింది అని అనుకుంటూ ఉండగా

చిన్నాన్న! ఎలా ఉన్నారు ఇప్పుడు??? అని పలకరింపు,నా ఆలోచనలుండి ఉలిక్కిపడి లేచాను.

అది మా అన్న గారి అబ్బాయి మహేష్.

మరేం పర్లేదు చిన్నాన్నా రేపు బైపాస్

చేస్తారంట, మా ఫ్రెండు ఈ ఆస్పత్రిలోనే పనిచేస్తాడు , మిమ్మల్ని దగ్గర ఉండి చూసుకుంటారు, అని ధైర్యం చెప్పాడు.

పిన్ని! నేను ఇక ఉంటాను , సగం రోజు సెలవు పెట్టాను , ఇప్పుడింక

ఆఫీస్ కి వెళ్ళాలి .రేపు నేను ఆపరేషన్ టైం కి వచ్చేస్తా అని చెప్పేసి

చక చకా వెళ్ళిపోయాడు.

మా రెండో వాడు మురళి కూడా వస్తున్నట్టు ఫోన్ వచ్చింది .పెద్దవాడు విదేశాల్లో ఉండడం మూలన రావడం ఆలస్యమవుతుందని తెలిసింది.

నా హావభావాలు చూసి మీనాక్షి మాట్లాడ సాగింది .

ఏవండీ మీరు బావగారితో ఎలా ఉన్నా

మన పిల్లలు తనతో , నేను అక్కతో చాలా మంచి సంబంధం నిలబెట్టుకున్నాము.

మీకు గుర్తుందో లేదో ఒకసారి మీరు అర్జెంటు ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళినప్పుడు, మన రెండో వాడి కాలేజీ ప్రిన్సిపల్ నుంచి ఫోను వచ్చింది , వాడి పేరు కాలేజీ గొడవల్లో వినిపించిందని, వీడిని సస్పెండ్ చేయడానికి తల్లితండ్రిని కాలేజీ కి రమ్మని...........

నాకు ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో అక్క దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అక్కకి మొత్తం వివరాలు చెప్పగా అధైర్య పడవద్దని , వాళ్ళ అబ్బాయిని చూడ్డానికి పట్నం వచ్చానుని చెప్పి హుటాహుటిన ఇంటికి వచ్చారు, నాతో కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్ తో బావగారు మాట్లాడిన తీరు మనవాడి భవిష్యత్తును కాపాడింది.

తాను మనవాడి పూచి తీసుకుంటానని మరోసారి ఇలా జరగనివ్వనని ప్రిన్సిపల్ కి తను మాట ఇచ్చారు.

బావగారు మురళికి ఏ మంత్రం వేశాడో కానీ వాడు మళ్ళీ కాలేజీలో గొడవల జోలికి, మందు జోలికి అసలు వెళ్లకుండా చేశారు. ఎందుకమ్మా ఉద్యోగ రీత్యా తమ్ముడు చాలా వత్తిడితో ఉంటాడు, ఇలాంటి చిన్న విషయాలు చెప్పి వాడిని ఇబ్బంది పెట్టొద్దు అని అన్నారు.

మన పిల్లలిద్దరికీ బావగారంటే ఎంతో ప్రీతి, అభిమానం చెప్పాలంటే చనువు కూడా ఎక్కువే. వాళ్ల అబ్బాయితో కూడా మన పిల్లలు సొంత అన్నలా మెలుగుతుంటే నా మనసు ఎంతో సంతోషంతో నిండిపోయేది .

బావగారి కూతురితో సైతం సొంత అక్కలాగా మెలిగి పోతారు. నేను కూడా నాకు కూతురు లేదని ఎప్పుడూ దిగులు చెందలేదు.

నేను మీరు ఎక్కువగా వాళ్ళతో చనువుగా ఉంటే కోప్పడతారని వారించగా మనపిల్లలు నవ్వి ....

అమ్మా!! మాకు మా తోబుట్టువులని అనవసరపు విషయాలపై పోగొట్టు కోవాలని లేదు, ఏదో ఆ తరంలో పొరపాటు జరగింది, ఎన్ని తరాలకు దాన్ని సాగదీస్తారు ?మాకు పెదనాన్న పెద్దమ్మ అంటే చాలా గౌరవము,బాగా ఆలోచిస్తే పెదనాన్న తప్పు కూడా ఏమీ లేదు, ఇది చాలా చిన్న విషయం, ఆ భూమి మీద మా బ్రతుకు ఆధారపడలేదు, మా కాళ్ళ మీద మేము నిలబడేంత ఙ్ఞానాన్ని సంపాదించాం ........

నాన్న వారితో మాట్లాడకపోయినా, వాళ్లకి నాన్న అంటే చాలా అభిమానము. ఎప్పుడూ మన మంచి కోరే వాళ్ళని మనము వదులుకోవద్దు

అని నాతో అన్నారు.....

ఈ మాటలు నన్ను కూడా ఆలోచించేలా చేసి వాళ్ళ కుటుంబంతో సన్నిహితంగా మెలిగేలా చేశాయి.

ఇప్పుడు పిల్లలు మనలాగా పెద్దవాళ్ళు ఏమి చెబితే అది పూర్తిగా నమ్మి వారి అడుగుజాడల్లో నడవకుండా, వాళ్ళ విచక్షణ జ్ఞానంతో బతకడం నాకు చాలా నచ్చింది. మేనేజ్మెంట్ క్లాసులు లో నాకు మా ప్రొఫెసర్ విద్యార్థుల భవిత పై చెప్పిన కథ మన కుటుంబంతో ముడిపడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

ఆ కథలో .........

ఒకతను బాగా తాగుడుకు బానిసై పిల్లలను, ఇల్లును, భార్యను లెక్క చేయడు, ఎప్పుడూ ఆ మైకం లోనే తూలుతూ ఉంటాడు. అతనికి ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నను ఇలా చూస్తూనే పెరిగి పెద్దగవుతారు.పెద్ద అబ్బాయి వాళ్ళ నాన్న దారిలోనే నడిచి తప్ప తాగి జీవితాన్ని పాడుచేసుకుంటాడు. రెండోవాడు నాన్న దారి లో వెళ్లకుండా, తాగుడు ఒక వ్యసనం అని గ్రహించి ఆ మత్తులో పడకుండ,వేరే ఏ అవలక్షణం జోలికి వెళ్లకుండా పట్టుదలతో పైకి ఎదుగుతాడు.

మన పిల్లలు కూడా మనని చూసి పెరిగిన , బాంధవ్యలకి ఎక్కువ విలువ ఇచ్చారని అర్థమైంది.

పెద్దలు తమ ద్వేషాలు వారసత్వంగా తమ పిల్లలకు కూడా బదిలీ చేస్తూ ఉన్నా మన పిల్లలు ఈ విషయము లో పరిణితి చెందారని గర్వపడాలి.

ఇదేదో మిమ్మల్ని కించపరచాలని కాదు, ఏదో చిన్న విషయం లో అసంతృప్తి తో బావగారి కూతురు పెళ్ళికి మీ దగ్గర డబ్బులుండి కూడా సహాయం చేయలేదు, అప్పుడు తన మనసు ఎంత గాయపడి ఉంటుందో నేను ఊహించగలను. అయిన కూడా తన అభిమానము మీ మీద రవ్వంత కూడా తగ్గలేదు…......

కానీ ఆ లోటు మన పిల్లలు

భర్తీ చేస్తుంటే తృప్తిపడసాగాను.

మా ఇంట్లో నేను ఒక్కదాన్నే అవ్వటం మూలన ఏమో తోబుట్టువులు ఉండేవారిని చూస్తే నాకు అసూయగా అనిపించేది .ఆ అవకాశం నాకు ఇక్కడ ఉన్నా కూడా మీ ప్రవర్తన వల్ల వాళ్ళతో నేను సరిగ్గా

మసలలేకబోయాను.

ఎందరో చిన్న చిన్న గొడవలతో తోబుట్టువులను దూరం చేసుకుంటున్నారు. వారు కాలం చేశాక గుండెలు బాదుకొని కుమిలి కుమిలి ఏడిస్తే ఏమి లాభం వారితో ఉన్నప్పుడు మాటామంతీ లేకుండా..

మనిషి బంధుత్వాలు తెంచుకోడానికి ఎంతో సేపు పట్టదు, ఓ పదునైన చాకు లాంటి మాటలు పట్టెడు చాలు .

నిలబెట్టుకోవాలంటే మృదవైన , సున్నితమైన మాటలు అవసరం . ఆప్యాయతతో ఒక చిరునవ్వు జిగురు లాగా పని చేస్తుంది !!!! అన్న మాట

మీరు కూడా ఆలోచించండి, ఉన్నంతకాలం ఆప్యాయత, అనురాగాలతో మెలుగుతారో ఇలా మీలో మీరు మధనపడుతూ ఉంటారో??

అని తను మాట్లాడటం ముగించేసరికి మా అన్నయ్య వదిన నన్ను పరమార్శించందానికి వచ్చారు.

నీకు ఏమి కాదురా ! ధైర్యంగా ఉండు , అని మా అన్నయ్య మాట్లాడుతుంటే ఇంత అభిమానాన్ని దూరం చేసుకున్నాన అని నా కళ్ళు తెలియకుండానే చెమర్చాయి.

చిన్నప్పటి ఎన్నో మధుర జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.

అన్నయ్య!

నన్ను క్షమించు , అని నా నోట వెంట ఒక్కసారిగా మాటలు పలికాయి , కానీ అవి పశ్చాత్తాపంతో రగులుతున్న నా మనసు లోంచి అప్రయత్నంగానే వెలువడ్డాయి.

నీకు నాకు మధ్య ఇవన్నీ ఎందుకురా ???ఈ సమయంలో

నీవు బాగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు అని అన్నయ్య వారిస్తుంటే

లేదు అన్నయ్య ! అది నా గుండె బరువు దించుతుందని బదులిచ్చాను.

తను ఎప్పటిలానే ఒక చిరుమందహాసం తో నా తల నిమిరాడు.

నాకు ఇప్పుడు ఏదో కొండంత ధైర్యం, మరియు ఒక తెలియని సంతృప్తి,

మా పిల్లలు నాలాగా ఆలోచించనందుకు చాలా సంతోషిస్తూ రాబోయే రోజుల్లో నేను కూడా ఎలా ఉండాలో బోధపడింది.

ఎన్నాళ్లు జీవించామన్నది ముఖ్యం కాదు,నా అనే వాళ్ళు లేక ఆఖరి క్షణం లో ఎందరో అలమటించడం చూస్తున్నాం ................

ఉన్నన్నాళ్ళు చిన్న విషయాలకి తోబుట్టువులని దూరం చేసుకోకుండా

కలిసిమెలిసి ఆనందంతో జీవించాలని

ఆశిద్దాం.

మరిన్ని కథలు

Nireekshana
నిరీక్షణ
- డా:సి.హెచ్.ప్రతాప్
ADDAM LO NENU
అద్దంలో నేను
- సంధ్య కార్తీక్
Betting bhootam
బెట్టింగ్ భూతం
- సూర్య. మండా (MS)
Nannamma manavadu
నాన్నమ్మ-మనవడు
- సంధ్య కార్తీక్
Devudu varamiste
దేవుడు వరమిస్తే !
- సంధ్య కార్తీక్