"ఒరేయ్ రవి... ఇంత డబ్బు ఎక్కడిది రా?" అని ఆశ్చర్యంగా అడిగాడు వినయ్. "చెల్లి పెళ్లి కోసం ఇంట్లో దాచి ఉంచినవి రా. పర్లేదు, ఈ రోజు మ్యాచ్‌పై బెట్టింగ్ వేస్తే నాలుగు రెట్లు లాభం వస్తుంది" అని ధీమాగా చెప్పాడు రవి. "రేయ్! కొంచెం ఆలోచించురా. నేను కూడా బెట్టింగ్ వేస్తాను, కానీ అది నా జీతం డబ్బులు. ఒకవేళ ఈ డబ్బులు పోతే ఇంట్లో ఏమని సమాధానం చెప్తావు?" అని ఆందోళనగా అడిగాడు వినయ్. "ఏం కాదులేరా! ప్రతిసారి లాగే ఈసారి కూడా గెలుస్తాం. గెలిచాక ఈ డబ్బులు ఇంట్లో పెట్టేసి, వచ్చిన లాభంతో జల్సాలు చేద్దాం" అని తేలిగ్గా సమాధానమిచ్చాడు రవి. ఇంతలో మహేష్ జోక్యం చేసుకుంటూ, "రేయ్ వినయ్! భయం దేనికి రా? ఎన్నిరోజుల నుంచో ఆడుతున్నాం గా! కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు వేస్తున్నాం, అంతే! ఒక్క దెబ్బతో జీవితం సెటిల్ అయిపోవాలి. అయినా నిన్ననే అనుకున్నాం కదా ముగ్గురం కలిసి డబ్బులు వేసి వచ్చిన లాభం పంచుకుందాం అని, ఇప్పుడు ఇలా అంటావేంటి?" అన్నాడు. "రేయ్! అవి చెల్లి పెళ్ళికి ఉంచిన డబ్బులు రా, అందుకే భయం. సరేలే, ఏదైతే అదయింది... ఎలానూ ఇంట్లో ఎవరూ లేరు కదా, తిండికి ఏమైనా ఆర్డర్ పెట్టుకొని తింటూ మన పని కానిద్దాం" అన్నాడు వినయ్. అందరూ సరేననుకొని భోజనం ఆర్డర్ చేశారు. ఎలా బెట్టింగ్ వేయాలి, ఎలాంటి వ్యూహంతో లాభాలు పొందాలి అని ముగ్గురూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మహేష్ వెళ్లి తలుపు తీశాడు, బయట డెలివరీ బాయ్ నిలబడి ఉన్నాడు. డెలివరీ బాయ్ వద్ద నుండి ఆహారం తీసుకుంటుండగా, రవి-వినయ్‌ల మాటలు డెలివరీ బాయ్ చెవిన పడ్డాయి. ఒక్కసారిగా ఆ డెలివరీ బాయ్, "సోదరా! ఒక్క నిమిషం... మీరు దయచేసి బెట్టింగ్ ఆడకండి" అని ఆపే ప్రయత్నం చేశాడు. రవి, వినయ్ కోపంతో లేచి, "ఏం మాట్లాడుతున్నావ్? నీ పని అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళు. అనవసరంగా మధ్యలో దూరి టైమ్ వేస్ట్ చేయకు. అర్ధరాత్రి మాకు చిరాకు తెప్పించకు" అని అరిచారు. "లేదు బ్రో! ఇదే నా చివరి డెలివరీ. ఇంతకీ మీరు బెట్టింగ్‌లో ఎంత పెడుతున్నారు?" అని శాంతంగా అడిగాడు డెలివరీ బాయ్. "నీకు లెక్కలు చెప్పాలా? 10 లక్షలు పెడుతున్నాం. నువ్వు సంవత్సరం పొడవునా కష్టపడినా అంత డబ్బు చూడవేమో" అని వెటకారంగా అన్నాడు వినయ్. ఆ డెలివరీ బాయ్ చిన్నగా నవ్వుతూ, "నేను 50 లక్షలు పెట్టాను బ్రో. ఆ ఒక్క తప్పు నా జీవితాన్ని తలకిందులు చేసింది" అన్నాడు. ఒక్కసారిగా వినయ్, రవి, మహేష్ నోరెళ్లబెట్టారు. "50 లక్షలా!!" అని ఆశ్చర్యపోయారు. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. "అంత డబ్బు ఎలా పెట్టావ్ బ్రో?" అని నిదానంగా అడిగాడు మహేష్. "నేను లోపలికి రావచ్చా?" అని సందేహంగా అడిగాడు డెలివరీ బాయ్. "రా బ్రో, కూర్చో. ఇంతకీ అసలు అంత డబ్బు ఎలా పెట్టావ్? తర్వాత ఏమైంది?" అని ఆత్రుతగా అడిగారు ముగ్గురూ. డెలివరీ బాయ్ తన గతాన్ని చెప్పడం ప్రారంభించాడు... "నా పేరు రోహిత్. మాది ఒక చిన్న పల్లెటూరు. మా నాన్న రోజుకూలీ, మా అమ్మ ఇళ్లలో పనిచేస్తుంది. నాకు ఒక చెల్లి ఉంది, తను చదువుకుంటోంది. మా నాన్నకు మేము బాగా చదివి మంచి స్థాయిలో ఉండాలని కోరిక. అందుకే నన్ను పట్టణంలోని ఒక మంచి కాలేజీలో చేర్పించారు. హాస్టల్ ఫీజు ఎక్కువ అని వేరేగా చిన్న గది అద్దెకు తీసుకుని ఉండేవాడిని. ఇంట్లో ఖర్చులు చూసుకుని చెల్లి చదువుకు కొంత ఉంచి మిగతాది నా ఖర్చులకు పంపేవారు. 'బాగా చదువుకోరా, అప్పుడే మన బతుకులు బాగుపడతాయి' అని నాన్న పదే పదే చెప్పేవారు. మొదట్లో అంతా బానే ఉండేది. కానీ కాలం గడిచే కొద్దీ నా ఖర్చులు పెరిగాయి. కాలేజీలో అందరూ ధనవంతుల పిల్లలను చూసి నాకూ అలా ఉండాలనిపించేది. నా సైకిల్, నా బట్టలు, నా సాధారణ ఫోన్... ఇలా ఏదీ నాకు నచ్చేది కాదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆ విషయం చెబితే తను అందరి ముందూ నన్ను అవమానించింది. అది భరించలేక చాలా రోజులు గదిలోనే ఉండిపోయాను. ఖాళీ సమయంలో చెడు సావాసాలు చేసి వ్యసనాలకు అలవాటు పడ్డాను. ఆ కొత్త స్నేహితుల్లో ఒకడిని చూసి 'ఏ పని చేయకుండా డబ్బులు ఎలా తెస్తున్నావ్?' అని అడిగితే, బెట్టింగ్ ఆడితే చాలా లాభాలు వస్తాయని చెప్పాడు. నేను కూడా ప్రయత్నించాలనుకున్నాను. మొదట్లో ఇంట్లో ఫీజు అని అబద్ధం చెప్పి బెట్టింగ్ వేసి గెలిచాను. అలా డబ్బులు పెంచుతూ చాలా సంపాదించి, క్షణాల్లో బైక్ కొన్నాను, బ్రాండెడ్ బట్టలు వేసుకున్నాను. స్నేహితులకు పార్టీలు ఇచ్చాను. నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. కాలేజీకి వెళ్లడం మానేసి రోజంతా తిరగడం, తాగడం, బెట్టింగ్‌లు ఆడటమే పనిగా పెట్టుకున్నాను. ఒకరోజు ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లో '10 లక్షలు పెడితే కోటి రూపాయలు లాభం' అని ఒక పెద్ద ఆఫర్ కనిపించింది. నా దృష్టి మొత్తం దానిపైనే పడింది. కానీ అంత డబ్బు నా దగ్గర లేదు. నా స్నేహితుడు 'రామ్మూర్తి' అనే వడ్డీ వ్యాపారి గురించి చెప్పాడు. అతను ఎంత అప్పు అయినా ఇస్తాడు కానీ క్రూరమైన రౌడీ అని, తిరిగి ఇవ్వకపోతే చంపేస్తాడని హెచ్చరించాడు. ఇప్పటివరకు ఓడిపోని నేను ఈసారి కూడా గెలుస్తాననే నమ్మకంతో అతని దగ్గరకు వెళ్లాను. మా చెల్లి పెళ్లి అని చెప్పి 50 లక్షలు అడిగాను. హామీ లేనిదే ఇవ్వనన్నాడు. దాంతో ఇంటికి వెళ్లి ఎవరికీ తెలియకుండా ఇంటి పత్రాలు పట్టుకొచ్చాను. ఒక్క దెబ్బతో జీవితం సెటిల్ అయిపోతుందని అనుకున్నాను... కానీ విధిరాత వేరేలా ఉంది. రామ్మూర్తి ఇచ్చిన్ 50 లక్షలు బెట్టింగ్‌లో పెట్టేశాను. తీరా చూస్తే ఆ డబ్బులన్నీ పోయాయి! నా గుండె ఆగిపోయినంత పనైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. స్నేహితులను అడిగితే 'మాకు సంబంధం లేదు, ఇక ఫోన్ చేయకు' అని ముఖం చాటేశారు. రామ్మూర్తికి తెలిస్తే చంపేస్తాడని భయపడి ఎవరికీ చెప్పకుండా మా ఊరికి పారిపోయాను." తర్వాత ఏమైంది అని టెన్షన్ గా అడిగారు రవి, వినయ్, మహేష్. రోహిత్ కొనసాగించాడు: "ఒకపక్క ఇంట్లోవాళ్ళు 'కాలేజీకి ఎప్పుడు వెళ్తావు? వచ్చి పది రోజులు అవుతోంది' అని అడుగుతున్నారు. ఇంకోపక్క నేను పారిపోయానని తెలుసుకొని రామ్మూర్తి తన మనుషులతో మా ఇంటికి వచ్చేశాడు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ రచ్చ చేశాడు. 'ఏం డబ్బులయ్యా, నేనే ఇచ్చేస్తాను' అని మా నాన్న రామ్మూర్తి కాళ్లపై పడ్డాడు. 'నీ కొడుకు చెల్లి పెళ్లి అని చెప్పి 50 లక్షలు తీసుకున్నాడు' అని రామ్మూర్తి అనగానే మా ఇంట్లోవాళ్ల గుండెలాగినంత పనైంది. 'అంత డబ్బు నేనెక్కడి నుండి తేవాలి సామీ' అని ఏడుస్తూ మా నాన్న బతిమిలాడాడు. రామ్మూర్తి నెల రోజులు గడువు ఇచ్చి, ఇంట్లోని సామాన్లన్నీ వీధిలో పారేయించి వెళ్ళిపోయాడు. 'అంత డబ్బు ఏం చేశావురా?' అని మా నాన్న అడిగితే 'బెట్టింగ్ ఆడి పోగొట్టాను' అని తలదించుకుని చెప్పాను. అప్పుడు మా నాన్న చూసిన చూపులు నేను జీవితంలో మర్చిపోలేను. కట్టుబట్టలతో వీధిలో నిలబడ్డాం. ఊరి జనం అంతా మమ్మల్నే వింతగా చూస్తున్నారు. వేరే దారి లేక మా చిన్నాన వాళ్ల ఇంటికి వెళ్లాం. మా అమ్మ, చెల్లి ఏడుస్తూనే ఉన్నారు. నన్ను ఊరి జనం చూసే చూపులు, ఇంట్లోవాళ్ల బాధ తట్టుకోలేకపోయాను. చనిపోదామని నిర్ణయించుకుని ఊరి చివర ఉన్న రైల్వే ట్రాక్ వైపు వెళ్లాను. ట్రైన్ రాగానే దూకేద్దాం అనుకున్నాను. కానీ మేము పారిపోతామేమోనని రామ్మూర్తి నాటిన మనుషులు నన్ను పట్టుకుని అతని ముందుకు తీసుకెళ్లారు. రామ్మూర్తి కోపంతో నన్ను కొడుతూ 'నా డబ్బులు ఇవ్వకుండా చస్తావా?' అని అరిచాడు. నేను ఏడుస్తూ, 'డబ్బులు తీసుకుంది నేను, బెట్టింగ్ ఆడింది నేను! మా ఇంట్లోవాళ్లను వదిలేయ్, నన్ను ఏమైనా చేసుకో' అని కాళ్లపై పడ్డాను. 'బెట్టింగ్ ఆడావా?' అని అడగ్గానే రామ్మూర్తి కోపం ఒక్కసారిగా మాయమైంది. నన్ను దగ్గరకు తీసుకుని, 'తమ్ముడూ... జూదం అంటేనే ఒక అంతం! అది బతుకులను బూడిద చేస్తుంది. చెల్లి పెళ్లి అన్నావు కాబట్టే ఇచ్చాను. బెట్టింగ్ అంటే నయా పైసా ఇచ్చేవాడిని కాను' అని గోడపై ఉన్న తన చనిపోయిన కొడుకు ఫోటోను చూపించాడు. 'వీడు నా ఒక్కగానొక్క కొడుకు. నాకు తెలియకుండా బెట్టింగ్ ఆడి డబ్బులన్నీ పోగొట్టుకుని, భయంతో ఉరి వేసుకుని చనిపోయాడు. నా దగ్గర ఆస్తి ఉంది, డబ్బు ఉంది... కానీ నా బిడ్డ లేడు. పోయిన డబ్బు మళ్లీ సంపాదించాను కానీ నా బిడ్డను తేలేకపోయాను' అని ఏడ్చేశాడు. రామ్మూర్తి నన్ను మా ఇంటికి తీసుకెళ్లి మా పత్రాలు మాకు ఇచ్చేశాడు. 'నాకు వడ్డీ వద్దు. అసలు డబ్బులో సగం ఇవండి, అదీ మీకు వీలైనప్పుడు ఇవ్వండి' అని చెప్పి వెళ్ళిపోయాడు. నా అదృష్టమో, మా అమ్మానాన్నల పుణ్యఫలమో నేను బతికిపోయాను. కానీ అందరికీ రామ్మూర్తి లాంటి వాళ్ళు దొరకరు. బెట్టింగ్ వల్ల నాశనమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి" అని రోహిత్ ముగించాడు. ఆ మాటలతో రవి, వినయ్, మహేష్‌లకు కళ్లు తెరుచుకున్నాయి. బెట్టింగ్ ఆడాలనే ఆలోచన వారిలో చచ్చిపోయింది. తమ తప్పు తెలుసుకుని, ఇంకెప్పుడూ బెట్టింగ్ జోలికి వెళ్లమని రోహిత్‌కు మాట ఇచ్చారు. "మరి అప్పు తీర్చడానికే ఈ డెలివరీ ఉద్యోగం చేస్తున్నావా?" అని అడిగాడు మహేష్. "లేదూ... పగలు చదువుకుంటూ రాత్రి పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాను. అది నా సొంత ఖర్చుల కోసమే. నాన్న, నేను కష్టపడి మొదటి నెల అప్పు ఇవ్వడానికి రామ్మూర్తి దగ్గరకు వెళ్తే... 'ముందు నువ్వు బాగా చదువుకుని మంచి స్థాయికి వెళ్లు, నీ చెల్లి పెళ్లి చెయ్యి. తర్వాత నా అప్పు తీర్చుదువు గాని' అని పంపించేశాడు. అందరికీ రామ్మూర్తిలో రాక్షసుడు కనిపిస్తాడేమో, కానీ నాకు మాత్రం కొడుకుని పోగొట్టుకుని నాలాంటి మరొకరి జీవితాన్ని కాపాడిన ఒక మంచి తండ్రి కనిపిస్తాడు" అని చెప్పి రోహిత్ సెలవు తీసుకున్నాడు. రోహిత్ వెళ్ళిన వైపే చూస్తూ, అతనికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆ ముగ్గురు మిత్రులు.

